(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)
అమ్మణ్ని జిజ్ఞాస..
[dropcap]ఓ[/dropcap] సాయంత్రం వేళ దాగుడు మూతల ఆట ఆడుతూ, దాక్కోవడంలో భాగంగా యశోదత్తా వాళ్ల ఇంట్లోకెళ్లి వాళ్ల ఉగ్రాణం కొట్టిడి.. అదే స్టోర్ రూమ్ లో దాక్కున్నాను.
“అబ్బా! చాలా దప్పికయి తుందత్తా! కొంచెం నీళ్లియ్యవా?” అన్నాను దాక్కున్న దగ్గరినించే.
అత్త నీళ్లిచ్చింది. పరిగెత్తి ఆడుకుని వున్నానేమో.. చెంబుడు నీళ్లు తాగినాను. తియ్యగా వున్నాయి నీళ్లు. వాళ్లు ఏటి దగ్గర చెలిమె నించి తోడుకొని తెచ్చుకుంటారు. మా ఇంట్లో నీళ్లు బోరింగుపంపు నీళ్లు. చవ్వలుగా, కొంచెం ఉప్పులుగా కూడా వుంటాయి.
“ఓయమ్మో.. ఎంత దప్పిగ్గొన్నావే అమ్మణ్నీ..” అన్నది అత్త.
“అత్తా! మీ ఇంట్లో నీళ్లు ఎంత తియ్యగా వున్నాయత్తా! మీరేమో ఓపిగ్గా యేటికి పోయి తెచ్చు కుంటారు. మా అమ్మ యేటినీళ్లు ఎందుకు తీసుకురాదో…? యేమో?” నిస్పృహగా అన్నాను.
“మీ ఇంట్లో వుండే జనాలకు బోరింగునీళ్లు కొట్టుకోవడమే ఎక్కువ! ఇంక యేటినీళ్లు ఎక్కడినించి తెస్తుందే మీ అమ్మ?” అన్నది యశోదత్త అమ్మను సమర్థిస్తూ.
“అత్తా! నాకు చెలిమెలో నీళ్లెట్లా తోడుతారో చూడాలని వుందత్తా.. నన్ను నీతోపాటు ఏటికి పిలుచు కోని పోతావా?” ఆశగా అడిగాను.
“నువ్వు చిన్నపిల్లవే అమ్మణ్నీ.. అంతంత దూరాలు నడవలేవు. కొంచెం పెద్దదానివయినాక పిల్చుకోని పోతాలే! అయినా మీ అమ్మ ఒప్పుకోదులే! మీ అమ్మకు కూతుళ్లంటే అపురూపం కదా? మీ తాతకు మీరంటే మరీ అబ్బరం.. అంత దూరం పంపరులే!” అన్నది అత్త.
ఇంతలో భాగ్య పరిగెత్తుకుంటూ వచ్చి, నన్ను కనుక్కోని, “అమ్మణ్ని అవుట్.. అవుట్..” అని అరిచింది. నేను ఆటలాడుకోవడంలో పడిపోయాను.
మరుసటిరోజు మా చాకలమ్మ ఓబులమ్మ బట్టలుతకడానికి వొచ్చింది.
“మీరు యేటి దగ్గర బట్టలెట్లా వుతుకుతారు? ఎట్లా ఆరేస్తారు ఓబులమ్మా?” అని వివరాలు అడిగాను.
“ఏముంది అమ్మణ్నమ్మా! బానలో చవుడు యేసి, నీల్లు పోసి కాగబెట్టి, దాంట్లో తెల్లబట్టలన్నీ పెట్టి, ఒక ఉడుకు ఉడికినాక బయటకు తీసి, బాగా బండకేసి కొట్టి ఏట్లో జాడిస్తాం. నీలిమందు నీకు తెలుసు గదా, అదీ, వైలెట్ అని ఇంకో మందు వుంటుంది. బాన నీళ్లల్లో ఆ రెండు మందు పొళ్లూ యేసి, తెల్లబట్టలను ముంచితే తెల్లగా ఒస్తాయి బట్టలు.. అప్పుడు యేటి ఒడ్డున ఇసక మీదా, కంపచెట్ల మీదా యేసి ఆరబెడతాం” ఇట్లా సవివరంగా చెప్పింది ఓబులమ్మ.
“నన్ను నీతోపాటు యేటికి పిల్చుకోనిపోతావా? నాకు మీరు బట్టలెట్లా వుతుకుతారో చూడాలని వుంది” అన్నాను ఆశగా.
“నీకెందుకమ్మణ్నీ ఆ కష్టాలు! యేరంటే పక్కనుందను కుంటాన్నావా యేమన్నా? సిన్నపిల్లవు. అంతదూరం నడసలేవు. ఆ ఎండకూ, ఆ యేడిగాలికీ నీకేం కర్మ తల్లీ! అయినా ఇట్టాంటి మాటలు మాట్లాడితే అమ్మ కొడ్తాది సూడి. నేను నిన్ను తీస్కపోతే నా కాళ్లిరగ్గొడతాది. అయినా నీకివన్నీ ఎందుకమ్మా.. పో ఇంట్లోకి పో..” అని నా ఆశలను తుంచేసింది ఓబులమ్మ.
అమ్మ దగ్గరికి పోయి అడుగు దామనుకున్నా.. కానీ, అమ్మ ఎవరిమీదో యేమో తెలీదు గానీ, చాలా కోపంగా వుంది. ధుమధుమ లాడుతూ వుంది.
నాకేమో ఏటికి పోయి చెలమలో నీళ్లు తోడుకునేది, చాకలోళ్లు బట్టలు ఉతికేది చూడాలన్న కోరిక వామనుడి వలె పెరిగిపోతూ వుంది.
స్నేహితులను తోడువొస్తారేమో అడుగితే.. ఒక్కరూ రామన్నారు.. అందరూ పిరికిపందలే! యేమైనాసరే.. నేనొక్కదాన్నే యేటికి పోవాలని మనసులో నిశ్చయం చేసుకున్నాను.
దారిలో స్మశానం వుంటుంది. ఒక పక్కన సమాధులు వుంటాయి. మరో పక్క శవాల్ని కాల్చే చోట్లుంటాయి.
‘మరి భయమేస్తే ఎట్లా?’ ప్రశ్న వొచ్చింది.
‘అక్కడ మాత్రం కళ్లుమూసుకోని పరిగెత్తితే సరిపోతుందిలే..’ అని జవాబు చెప్పేసుకున్నా.
‘ఒకవేళ శవాలు కనబడితే..’ మరో ప్రశ్న వేసింది మనసు.
‘వాటినెట్లా కాలుస్తారో.. ఎట్లా మట్టిలో పూడుస్తారో.. అది కూడా చూసొస్తా..’ అని ధైర్యం చెప్పుకున్నా.
‘దయ్యాల సంగతేంటి?’ ఇంకో ప్రశ్న.
‘దయ్యాలు పొద్దునపూట రావులే..’ జవాబు చెప్పుకున్నా.
అంతర్గతంగా అన్ని విషయాలూ తెలుసుకోవాలన్న జిజ్ఞాస నాలో ఆ తెగింపును తెచ్చిపెట్టింది.
అవి సంక్రాంతి సెలవులు కాబట్టి బడి లేదు. ఆ రోజు అమ్మ పొద్దున్నే పదింటి కల్లా అన్నాలు పెట్టేసింది.
అక్కలూ, అన్నలూ అందరూ నవలలూ, న్యూసుపేపర్లూ, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక లాంటి మ్యాగజైన్లు పట్టుకోని, గదులలో, అరుగుల మీదా బిజీగా వున్నారు.
కొందరు చుట్టుపక్కల పిల్లలతో బారాకట్ట(గవ్వలాట), పరమపద సోపానపటాలు ముందుపెట్టుకుని ఆడుతున్నారు. అమ్మ, పెద్దమ్మ వంటింట్లో వున్నారు.
ఎవ్వరూ చూడకుండా నా హవాయి చెప్పులు చేతిలో పట్టుకొని, బయటికెళ్లాను.
ఏటి వైపు కొన్సేపు పరిగెత్తుతూ, కొన్సేపు నడుస్తూ పోతూవున్నాను. పుష్యమాసమైనా ఎండ బాగానే మాడ్చేస్తూ వుంది.
మధ్యలో ఎదురైంది అక్కమ్మత్త. బిందెనీళ్లు చంకలో పెట్టుకోని, ఉతికిన బట్టలు భుజానేసుకుని, యేటినించి ఇంటికొస్తూ వుంది.
నన్ను చూసి ఆగింది.
“ఎక్కడికి పోతున్నావే అమ్మణ్నీ? ఈ ఎండలో? ఈ పక్కనేం పనుంది నీకు? పద.. ఇంటికి పద! దింపేసొస్తా ఇంట్లో” అని కసిరింది.
“నేను యేటికి పోతున్నా నత్తా.. దప్పికేస్తుంటే నీళ్లు తాగుదామనీ..” నేను చాలా సత్యప్రమాణంగా చెబుతున్నట్టు మొహం పెట్టినాను.
“మీ ఇంట్లో బోరింగుపంపు వుంది కదే?” ఆవిడ క్రాసు ప్రశ్న.
“బోరింగు పాడయిపోయిందత్తా!” అని అబద్ధమాడేశాను.
ఆవిడ ఇంకేదో మాట్లాడబోతుంటే ఆవిడకు అందకుండా పరుగుతీశాను యేటి వైపు.
ఆమె పోయి మా అమ్మకు చెబుతుందని తెలుసు.
తొరగా చూసి వొచ్చేయాలని పరుగుతీసి యేటి దగ్గరికి చేరుకున్నాను.
మధ్యలో స్మశానం ఎప్పుడు వచ్చిందో గుర్తులేదు.
ఆ రోజు యేటి దగ్గరికి చాకలి వాళ్లెవరూ రాలేదట. ఒకరిద్దరు వొచ్చినా, మామూలుగా బట్టలు వుతుకుతున్నారు. బాన, మంట, ఉడకబెట్టడం వంటివేవీ లేవు.
దగ్గర్లోనే చెలమలు కనబడ్డాయి. మా పక్క వీథిలోని సత్యవతక్క, వరలక్ష్మక్క, ఇంకా కొందరు తెలిసినవాళ్లు కనబడ్డారు. వాళ్లు నన్ను అక్కడ చూసి ఆశ్చర్యపడ్డారు.
వాళ్లకూ బోరింగు పాడయిందనీ, నీళ్లు తాగాలని వొచ్చినాననీ చెప్పినాను. అయినా వాళ్లు నమ్మినట్లనిపించలేదు.
అయినా చెలమ ఎట్లా తీయాల్నో, నీళ్లు ఎట్లా పక్కకు చల్లేసి, లోతు చేసి, మంచినీళ్లు ఊరినట్లు ఎట్లా తెలుసుకోవాల్నో, బిందెను ఒక వైపు పొందికగా కూర్చోబెట్టి, మరోవైపు ఒనారుగా మనం ఎట్లా కూర్చోవాలో అన్నీ చూపించినారు అక్కావాళ్లు. వాళ్ల సహకారంతో నేను గ్లాసుతో చిన్నబిందెడు నీళ్లు తోడిచ్చినాను వాళ్లకు. నా మనసు సంతోషంతో తుళ్లిపడుతోంది.
ఇంతలో సత్యవతి “అమ్మణ్నీ! మీ కిష్టయ్య వస్తున్నాడే..!” అన్నది.
కిష్టయ్య మా వంటాయన. అమ్మ పంపించి వుంటుంది. చేతిలో జొన్నదంటు పట్టుకున్నాడు.
ఆయన్ను చూసేసరికి నేను జయ్యి మని చెలమలోనించి బయటికి దూకేసి, పైకొచ్చి నిలుచుకున్నాను.
“భయం భక్తీ లేదా? చిన్నపిల్లవే! ఇంతదూరం ఒక్కదానివీ వొస్తావా? ఎండభయం కూడా లేదా? దారిలో స్మశానం వుందనే భయం కూడా లేదా? పా.. నీ కత అమ్మ చెప్తుందిలే.. పా.. ఇంటికి..” అని యేదో అంటూనే వున్నాడు.
నేను తప్పించుకోని పరిగెత్తబోతే పట్టుకోని, జొన్నదంటుతో రెండు తగల్నిచ్చినాడు. నాకు అవమాన మయిపోయింది అక్కావాళ్ల ముందు. ఒక్క పరుగు లంకించుకున్నాను ఇంటివైపు పెద్దగా యేడుస్తూ.
దారిపొడుగునా యేవోవో మాటలంటూ.. దొరికితే.. ఓ దెబ్బ వేస్తూ ఇంటికి తీసుకొచ్చినాడు. నన్ను చిన్న అరుగు మీద పడేసినాడు.
అమ్మ కూడా యేవేవో మాటలు అంటూ, వుండీ వుండీ దెబ్బలు వేస్తోంది. దెబ్బ తగిలిందానికంటే అవమానం బాధ ఎక్కువైంది. అక్కా వాళ్లూ, అన్నా వాళ్లూ తలో మాట అంటున్నారు.
దెబ్బ తగిలీ తగలకముందే ఆఘాయిత్యంగా యేడుస్తున్నాను. బేరుబేరుమని అరుస్తున్నాను. ఆ యేడుపును తట్టుకోలేక వెనక్కి తగ్గుతారని నా పూర్వానుభవాలు నేర్పినాయి నాకు మరి!
మేడమీది నించి తాత ఈ గొడవ నంతా చూసినారు బర్డ్స్ వ్యూలో. క్షణంలో ఆకళింపు చేసుకుని వుంటారు సీన్ అంతా.. పెద్ద క్రిమినల్ వకీలు కదా!
అయితే ఇదంతా చిన్న కోడలి జ్యూరిస్‌డిక్షన్ లోది అనుకున్నారేమో.. లోపలికి పోయి మామూలుగా కక్షిదారులతో మంతనాలు మొదలెట్టారు.
నాయన నిరాసక్తంగా, భావాలేమీ లేకుండా నా వైపు చూస్తున్నారు దూరంగా నిలుచుకొని.
బహుశః ఆయన తన ఇంట్లో తానే అతిథిగా వుండటం ఎలాగో అప్పటికే ప్రాక్టీసు చేస్తున్నారేమో! (తర్వాత రోజుల్లో తన ఆథ్యాత్మిక సాధనంతా అదేనని చెప్పేవారు. పదకొండు మంది పిల్లలను కన్న తండ్రి తన ఇంట్లో తాను అతిథిగా సాధన చెయ్యడం ఎంత చిత్రం కదా! అమ్మలాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి భార్యగా వుంటే అది సాధ్యమేనని మా నాయన నిరూపించినారు లెండి!) లేదా ఆయన దివ్యజ్ఞానసమాజంలో నేర్చుకున్న వేదాంతాన్ని.. అదే.. తామరాకు మీద నీటిబొట్టులా వుండటాన్ని నిత్యజీవితంలో అమలు చేస్తున్నారేమో! నాకైతే నచ్చలేదు మా నాయన ధోరణి. నా మంచిచెడ్డలు పట్టించుకోవడం లేదేమోనని అనుమానం వొచ్చింది.
అమ్మ ఒక పక్క సాధిస్తూనే నాకు చిన్నస్నానం చేయించి, బట్టలు మార్చి, పైపైన తలదువ్వి, కాసిని నిమ్మకాయ నీళ్లు తాగించి, పెద్దమ్మ పక్కన పడుకోబెట్టి వెళ్లిపోయింది.
పెద్దమ్మ నన్ను దగ్గరికి తీసుకుంటూ, తల మీద నిమురుతూ “ఇటువంటి అసాధ్యప్పనులు ఎందుకు చేస్తావే అమ్మణ్నీ? హాయిగా అన్నం తిన్నావు. పుస్తకం పట్టుకోని కూర్చోకుండా.. ఎండలో యేమన్నా తిరుగుడా ఇది?” అని మెత్తమెత్తగా మందలిస్తూ అన్నది.
“నేను.. చెలిమెలో.. నీళ్లు.. ఎట్లా తోడుకుంటారో ..చూడాలని..అనుకున్నాను…పెద్దమ్మా….ఇంక కొంచెం సేపు వుంటే.. నేనే.. వొచ్చేసే దాన్ని.. నన్ను.. కిష్టయ్య.. కొట్టినాడు.. పరిగెత్తించినాడు.. అమ్మ కూడా.. నన్ను కొట్టింది..” వెక్కుతూ చెప్పినాను.
“చిన్నపిల్లవు. అట్లా ఒంటరిగా పోకూడదు కదమ్మా! పిల్లలను ఎత్తుకోనిపోయేవాళ్లు వుంటారే అమ్మా.. జాగర్తగా వుండాల.. మరి నీవు తప్పు చేస్తే కొట్టకుండా వుంటారా? నువ్వు యేటి దగ్గరికి పోవాలంటే అమ్మతో చెబితే ఎవరితోనైనా పంపేది కదా?” పెద్దమ్మ అనునయంగా చెబుతోంది. నేను అంతంత దూరం పరిగెత్తుకుంటూ వొచ్చిన అలసటతో..
వెక్కిళ్లు పెడుతూనే మగతనిద్రలోకి జారుకున్నాను.
ఏటినుంచి వొచ్చేటప్పుడు చెప్పులు ఎక్కడో పడిపోయినట్టున్నాయి. కాళ్లమంటలు ఇప్పుడు తెలుస్తున్నాయి.. నిద్రలో.
పెద్దమ్మ నా కాళ్లు పిసుకుతూ వుంది.
నా అరికాళ్ల వైపు చూసి కంగారుపడి, “శాంతమ్మా! ఇట్లా చూడవే అమ్మా.. పిల్ల కాళ్లు బొబ్బలెక్కిపోయినాయి. ఆ బ్రహ్మచారి గాణ్ని పంపించినావు నువ్వు! పిల్ల చెప్పులేసుకుందా.. లేదా అని కూడా చూసుకున్నట్టు లేడు త్రాష్టుడు..” అని కిష్టయ్యపై తనకు వుండే అక్కసును ఈ రకంగా వెళ్లగక్కింది పెద్దమ్మ.. తల మీద ముసుగు సవరించుకుంటూ.
అమ్మ వెన్నపూస తెచ్చి నా పాదాలకు పూసింది. చల్లని నీళ్లలో తడిపిన గుడ్డను నా పాదాల చుట్టూ కప్పి, నా కాళ్లను తన ఒళ్లో పెట్టుకొని, ఉఫ్.. ఉఫ్.. అంటూ ఊపుతూ, “అయ్యో.. అయ్యో.. ఎంత మంటపుడుతున్నాయో.. యేమో! చెప్తే వినదు మొండిపిల్ల.. అందుకే కొట్టాల్సి వొస్తుంది!” అంటూ వుంది అమ్మ.
“నాకు నువ్వొద్దు అమ్మా! పెద్దమ్మే కావాల!” అన్నాను కాళ్లు దగ్గరకు లాక్కుంటూ, ఆగని వెక్కిళ్లతో.
అది అమ్మ అహం మీద నేను తీసిన పెద్ద దెబ్బ అని నాకు తెలుసు. సమయానికి తగినట్టు పెద్దవాళ్ల మీద కూడా దెబ్బతీయాలి మరి! నాకింత అవమానం చేయలేదా ఆమె?
అవకాశం దొరికింది కదా అని క్లాసు పీకింది పెద్దమ్మ.. తోడికోడలికి.
“నీకు కోపమొస్తే ఒళ్లు తెలియదు శాంతమ్మా.. పిల్లను అంతంత దెబ్బలు కొడ్తారా ఎవరన్నా? అదెంత? దాని ప్రాణమెంత? యేడేళ్లపిల్ల! సహనం వుండాల కొంచెం.. ఎట్లా వెక్కిళ్లు పెడుతున్నదో చూడు. తప్పు చేసిందనుకో.. ఊరబ్బలూ, నారబ్బలూ చేసుకుంటారా అమ్మా ఇట్లా? మెల్లగా చెప్పుకోవాల. ఆ పాపిష్టి వాడు ఎట్లా పరిగెత్తిచ్చి నాడో యేమో.. చూడు ఫారం కంప ముళ్లు గీరుకుపోయినాయి.. కాళ్ల మీదా.. చేతుల మీదా..” అని అమ్మను మందలించింది పెద్దమ్మ.
మా ఇంట్లో సర్వం సహా చక్రవర్తిని అయిన మా అమ్మను కూడా మందలించేవాళ్లున్నారంటే ఆనందమైంది నాకు.
తాత అంటే అమ్మ భయపడుతుంది కానీ, ఇంటిని నడిపే ఆమె శక్తిసామర్థ్యాలకు, ఆమె తెలివితేటలకు తాత కూడా లొంగిపోయారనిపిస్తుంది నాకు. అమ్మ మౌనం వహించింది.
నాకు జ్వరం తగిలింది. అందరూ భయపడిపోయినారు. మల్లికార్జునరావు డాక్టరును పిలిపించారు. ఆయన సూదిమందు ఇచ్చి, ఇంకా యేవో మందులిచ్చినాడు.
“ఎండలో ఒంటరిగా అట్లా పోవచ్చా? ఎవరైనా ఎత్తుకోనిపోతే యేమవుతుంది? ఇంకెప్పుడూ పోవద్దు అట్లా” అని ఉచిత సలహా ఒకటి ఇచ్చిపోయాడు.
‘సడేలే!’ అనుకున్నాను మనసులో. ‘దొరికిపోయినానని అందరూ సలహా ఇచ్చేవాళ్లే! ఓ గంటసేపు అయితే ఎవరికీ తెలీకుండా నేనే ఒచ్చేసేదాన్ని అక్కావాళ్లతో ‘ అనుకున్నాను.
ఒకటి రెండు రోజుల్లో కాళ్లు మామూలుగా అయిపోయినాయి. నిజానికి అవమాన బాధ నన్ను బాగానే వేధిస్తున్నా, నా మనసులో మాత్రం యేదో తెలియని ఆనందం పొంగిపొంగి వస్తోంది. ‘నేను చెలమను చూసినాను. చెలమలో నీళ్లు తోడాను.. ఈ జన్మకు నాకు ఆ తృప్తి చాలు..’ అనుకున్నాను.
తర్వాత ఒకసారి బస్సులో యేదో ఊరికి పోయేటప్పుడు ఒక యేటి ఒడ్డు మీద బస్సు ఆగిపోయింది.. రిపేరు చేయించాల్సి వచ్చింది. అందరం బస్సులోనుంచి దిగినాము. ఏట్లో ఆడుకున్నాము.
అప్పుడు ఆ యేట్లో చాకలివాళ్లు బట్టలు ఉడకబెట్టడం, బట్టలను పిండి కంపచెట్ల మీద ఆరేయడం చూసి అన్నీ ఎదురుగా తెలుసుకున్నాను. నా మనసు నిమ్మళించింది.. మరో సాహసం చెయ్యకుండా నా కోరిక తీరింది.
ఈ ప్రహసనంలో పెద్దమ్మ కిష్టయ్యను మాత్రం ఏటుమాటా పోటుమాటా అంటూనే వుంది. “పసిపిల్లను కొడతావా? ఎండలో పరిగెత్తిస్తావా? పేనుకు పెత్తనం ఇస్తే తెల్లవార్లూ కొరికిందంట! అట్లా వుంది నీ శాదానం!” అని యేదో ఒకటి అంటూనే వుంది. కుంగిపోయాడు కిష్టయ్య. పశ్చాత్తాపంతో బాధపడు తున్నాడు.
కిష్టయ్యను నేను కూడా క్షమించలేదు. ఆయన కనిపించినప్పుడల్లా శాపనార్థాలు పెడుతున్నట్టు గొణుక్కుంటూ, వేళ్లు విరుచుకుంటూ, వెక్కిరిస్తూనే వున్నాను.
మూడోరోజు ఆయన అన్నం ఒడ్డించడానికి వొస్తే.. “నువ్వు అన్నం పెడితే నేను తినను ఫో!” అని భీష్మించుకున్నాను.
అంతే.. ఆయన ధన్ మంటూ నేల మీద కూలబడ్డాడు. వలవలా యేడ్చాడు.
“నన్ను అంతమాట అనొద్దే అమ్మణ్నీ! తప్పయి పోయింది. ఇంకెప్పుడూ చేయను. నిన్నెప్పుడూ కొట్టను” అని బతిమిలాడుకున్నాడు.
ఆ ఏడుపుతో నా మనసు కరిగింది. కోపం శాంతించింది. అయితే ఆ అవకాశాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్నాను.
“అయితే నువ్వు రోజూ ఇత్తడి రోలులో తమలపాకులు, వక్కలూ, సున్నం దంచుకుంటావు కదా! నేనడిగితే నాకు ఎప్పుడూ కొంచెమే తాంబూలం పెఢ్తావు.. అది నాకు ముక్కులోకి కూడా చాలదు. అందుకే ఇప్పణ్నించీ ఇంత తాంబూలం ముద్ద పెట్టాల” అని షరతు విధించినాను.. బొటనవేలు, చూపుడువేలు మధ్య తాంబూలం ముద్ద పరిమాణాన్ని చూపుతూ. అది ఒక పెద్ద గోలీకాయంత పరిమాణంలో వుంది.
“అంతే కదా? తమలపాకుల శేషమ్మను రోజూ ఇంకో నాలుగు ఆకులు ఎక్కువ ఇయ్యమంటాలే! నీకు తాంబూలం ఎంత కావాలంటే అంత ఇస్తాలే అమ్మణ్నీ!” ఆనందంగా ఒప్పుకున్నాడు కిష్టయ్య, నేను అంత చిన్న శిక్ష విధించినందుకు తెరిపినపడుతూ.
‘ఇనుము వేడిగా వున్నప్పుడే రెండు దెబ్బలు వేసి మనదారికి తెచ్చుకోవాల..’ అన్న సిద్ధాంతం అమ్మణ్నికి ఆ వయసుకే తెలుసు!
అందుకే తనకు ఇష్టమైన తాంబూలం షరతు పెట్టి, అమ్మణ్ని కిష్టయ్యను క్షమించేసింది.