అమ్మణ్ని కథలు!-6

1
2

(సోమరాజు సుశీలగారి ‘ఇల్లేరమ్మ కథలు’ ప్రేరణతో నంద్యాల సుధామణి గారు అందిస్తున్న కథలివి)

చందమామకు అన్నం ఎవరు పెడతారు?!

[dropcap]ఆ[/dropcap] రోజు పున్నమ అని పెద్దమ్మ ఎవరితోనో చెబుతుంటే విన్నాము నేనూ, జయా.

“అమ్మా! ఈ రోజు రాత్రి వెన్నెల భోజనాలు చేస్తాం! మాకు మిద్దె మీద వెన్నెల్లో అన్నం కలిపి చేతుల్లో పెడతావా?” అన్నది జయ అమ్మతో.

అమ్మ “సరేలే” అన్నది. అమ్మకు, పెద్దమ్మకు పిల్లలకు అన్నాలు పెట్టడమంటే ఎత్తినచేయి (ఎప్పుడూ సిద్ధమే)!

పిల్లలకు ఎంత కడుపునిండా పెట్టితే అంత బాగా పెంచినట్టు అనుకుంటారు ఇద్దరూ.

అమ్మ మంచి మూడ్ లో వున్నట్టు గమనించి, “అమ్మా.. మాతోపాటు సావిత్రినీ, సుబ్బలక్ష్మినీ, రమనూ, భాగ్యనూ రమ్మని చెప్పేదా? వాళ్లు కూడా వెన్నెల భోజనం చేస్తారమ్మా.. వాళ్లు కూడా వొస్తే బలే బాగుంటుందమ్మా.. అందరం కలిసి తినొచ్చు” అన్నాను నేను. అమ్మ యేమంటుందోనన్న భయంతోనే.

ఏ కళనుందో “సరే.. రమ్మను. వాళ్లూ పసిపిల్లలే కదా.. మీతో పాటు ఆడుకుంటూ తింటారులే!” అన్నది అమ్మ.

నేను, జయ సంతోషం పట్టలేక పోయినాము. అందరిళ్లకూ వెళ్లి వాళ్ల పెద్దవాళ్లను ఒప్పించినాము. పగలంతా సాయంత్రం కోసం ఎదురుచూడ్డమే అయిపోయింది. ఎండాకాలం సాయంత్రమయ్యే సరికి వేడిగానే వున్నా, కొద్ది కొద్దిగా చల్లబడుతోంది.

అందరం మా మిద్దె పైకి చేరాము. ఆటలాడుకున్నాము.

మేము పరిగెత్తి ఆడుకుంటుంటే మా తాతకు కోపం ఒచ్చింది. పెద్దవాళ్లంటేనే అంత కదా? ఊరికేనే కోపం వొస్తుంది వాళ్లకు పిల్లల మీద. మళ్లీ యేదైనా పనికావాలంటే మాత్రం పిల్లలే కావాల వీళ్లకు! అప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా మాట్లాడుతారు! బుజ్జగిస్తారు.

“పూర్వం ఆడపిల్లలను గజగమనలూ, హంసగమనలూ అనేవాళ్లు. ఇప్పుడు ఆడపిల్లలు గాడిదగమనలైనారు” అన్నారు తాత విసుక్కుంటూ, పక్కన ఎవరితోనో మాట్లాడుతూ.

నా స్నేహితురాళ్ల ముందర తాత అట్లా మాట్లాడ్డం నాకు అస్సలు నచ్చలేదు. కానీ, తాతను యేమీ అనలేం కదా! పెద్దవాడైపోయె!

“ఈ పెద్దవాళ్లు పిల్లలు ఆడుకుంటే చూడలేరు.. పిల్లలు కాకపోతే పెద్దవాళ్లు పరుగులు తీస్తారా? ఆయనను పరిగెత్తమంటే పరిగెత్తుతాడా ఇప్పుడు?” అని మనసులోనే మెటికలు విరుచుకున్నాను.

మాట్లాడకుండా పెద్దబయలులోకి వొచ్చినాము, తాత గదికి కొంచెం దూరంగా.

మా బర్రెగొడ్లను కాచే దస్తగిరి అనే పిల్లవాడు వొచ్చి, బకెట్లతో నీళ్లు తెచ్చి, పెద్దబయల్లో నిండుగా నీళ్లు చల్లిపోయినాడు, రాత్రి నేల చల్లబడి చల్లగా పడుకోడానికి వీలుగా. మేమూ అతనికి సహాయం చేసినాము.

పగలల్లా ఎండకు వేడెక్కిపోయిన సిమెంటు గచ్చు ఆవిర్లు కక్కుతూ చల్లబడుతోంది.

ఇక అందరం మా వంటింటి పొగగొట్టం పక్కన కూర్చొని, కథలు చెప్పుకుంటున్నాము.

వంటింట్లో తెర్లుతున్న బెండకాయ పులుసు (సాంబారు) ఘుమఘుమలు లేని ఆకలిని మాకు తెచ్చిపెట్టాయి.

“అబ్బా.. మీ ఇంట్లో పులుసు భలే వుంటుందే అమ్మణ్నీ! మీ కిష్టయ్య భలే బాగా వంటచేస్తాడు” అన్నది సుబ్బలక్ష్మి.

“రాత్రిపూట కిష్టయ్య వంట చెయ్యడు.. సాయంత్రమే బయటి కెళ్లిపోతాడు. ఆ శివాలయం దగ్గరా, ఆంజనేయస్వామి గుడి దగ్గరా కూర్చుని స్నేహితులతో మాట్లాడుతుంటాడు.

అమ్మే చేస్తుంది రాత్రి వంట. మా అమ్మ యేమి చేసినా ఎంతో రుచిగా వుంటుంది తెలుసా?” అన్నది జయ.

అప్పుడప్పుడే చీకటి పడుతోంది. నిండు చందమామ ఉదయిస్తున్నాడు. అందరం అలవాటు ప్రకారం మా దుస్తుల్లో నించి నూలు దారాన్ని లాగి, “చంద్రుడికో నూలుపోగు.. తీసుకో చందమామా! తీసుకో.. తీసుకో..” అని విసిరాము.

“నిండు చంద్రుడికి కాదే నూలుపోగు ఇచ్చేది. అమావాస్య పోయాక కొత్త చంద్రుడు వొస్తాడు కదా.. ఆయనకూ నూలుపోగు ఇచ్చేది” సవరించింది పెద్దమ్మ.

“పోనీలెండి అత్తా.. ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేసినాము. మా పనైపోయింది. ఆయన అప్పటికి దాచిపెట్టుకుంటాడు లెండి!” సర్దింది సుబ్బలక్ష్మి, కొంచెం విసుగుతో.

నవ్వి వూరుకుంది పెద్దమ్మ.

“అవునూ.. చంద్రుడు మనమిచ్చే నూలుపోగులన్నీ యేం చేసుకుంటాడే?” రమ ప్రశ్న.

“చంద్రుని లోపల కూర్చుని రాట్నం ఒడుకుతూ వుంటుందే.. ఆ అవ్వకిస్తాడేమోనే! ఆమె ఈ దారాలన్నీ ఒడికి చంద్రుడికి బట్టలు కుడుతుందేమో!” జయ సమర్థించింది.

“చంద్రుడు మా అమ్మ చేసే భక్ష్యం లాగా వున్నాడే అమ్మణ్నీ.. పచ్చగా, కొంచెం ఎర్రగా..” అన్నది భాగ్య చప్పట్లు కొడుతూ.

అవునంటే అవునన్నాము అందరమూ. చందమామను చూస్తే భక్ష్యం (బొబ్బట్టు) గుర్తొచ్చి నోరూరింది.

“ఇంక కాసేపు పోతే మన అయ్యరు హోటల్ ఇడ్లీలాగా తెల్లగా వుంటాడే.. చంద్రుడూ..” అన్నది సావిత్రి.

“బాగుంది.. బాగుంది.. చంద్రుడు ఇడ్లీ అయితే చట్నీ ఎక్కడే?” అడిగింది భాగ్య.

“పక్కన మొబ్బులు వస్తుంటాయి కదా.. అవే చట్నీ అనుకో” పకపకా నవ్వింది రమ.

“నాకైతే తిరుపతి లడ్డు లాగా కనిపిస్తున్నాడు” అన్నాను నేను.

“చాలు.. కవిత్వాలు.. ఇంక కథలు చెప్పుకోండి” అన్నది పెద్దమ్మ అక్కడే అరుగు మీద కూర్చుని జపం చేసుకుంటూ. మేము ఆమె మాటలను పట్టించుకోలేదు.

“అనవసరంగా పిల్లల విషయాల్లో ఎందుకు కల్పించుకుంటారో ఈ పెద్దవాళ్లు. అన్నీ వాళ్లకే తెలుసనుకుంటారు. మనకూ చాలా తెలుసు కదా!” పెద్దమ్మకు వినబడకుండా విసుక్కున్నాను నేను.

“అవునూ.. మనమైతే చంద్రుడిని చూస్తూ అన్నాలు తింటాం కదా? మరి చంద్రుడికి అన్నం ఎవరు పెడతారబ్బా? పాపం.. ఒక్కడే వుంటాడు కదా?” అన్నది రమ.

“ఒక్కడే ఎందుకుంటాడు? చంద్రుని లోపల కూచుని ఒక అవ్వ రాట్నం ఒడుకుతూ వుంటుంది కదా.. ఆమే అన్నం వొండిపెడుతుందేమో!” అన్నది సుబ్బలక్ష్మి.

“మరి కొన్నాళ్లు అస్సలు అన్నం తినని వాడిలాగా చిక్కిపోతా డెందుకు? అమావాస్య నాడు అసలు కనబడనే కనబడడు కదా? అప్పుడెవ్వరూ అన్నం పెట్టరా చంద్రుడికి?” ప్రశ్న వొచ్చింది నాకు.

“అప్పుడు అవ్వ సూర్యుడి దగ్గరికి పోతుందేమోనే అమ్మణ్నీ! అందుకే చంద్రుడికి అన్నం పెట్టేవాళ్లెవరూ ఉండరేమో.. అందుకే చిక్కిపోతాడు పాపం!” భాగ్య సానుభూతి చూపించింది.

“మరి ఈ నక్షత్రాలు పక్కనే వుంటాయి కదబ్బా.. చంద్రుని అవ్వ లేనప్పుడు, చంద్రునికి కాస్త అన్నం పెట్టొచ్చు కదా? మా అమ్మ ఎప్పుడైనా ఊరికిపోతే, నేను అమ్మణ్ని వాళ్లింట్లో అన్నం తింటాను కదా?” సుబ్బలక్ష్మి సందేహం.

“ఈ చుక్కలు పిసినారివేమోనే అమ్మణ్నీ! అందుకే అస్సలు పాపం చంద్రునికి అన్నం పెట్టవు” ఈసడించింది జయ.

“ఏయ్.. చుక్కలూ! పాపం చందమామకు కాస్త అన్నం పెట్టొచ్చు కదా.. మీ పక్కనే వుంటాడు కదా.. చందమామతో ఆడుకుంటారు గానీ, కొంచెం అన్నం పెట్టరా?” అన్నది రమ.

“వాటికేమీ వినపడినట్టు లేదే? మనమే పెడదాంలే రోజూ కాస్త.. ఏం చేస్తాం పాపం!” అన్నది జయ.

“చంద్రుడి దగ్గరికి మనమెట్లా పోతామే?” రమ సందేహం.

“నేను వడ్ల వీరయ్య దగ్గరికిపోయి పే..ద్ద నిచ్చెన చేసిమ్మంటా.. వీరయ్య మా నాయనకు బాగా తెలుసు! నేనడిగితే తప్పక చేసియిస్తాడు. ఆ నిచ్చెనెక్కి పెట్టేసొద్దాం.. చంద్రుడికి అన్నం..” అన్నది సావిత్రి.

“చందమామ దగ్గరికి పోయే నిచ్చెన నీకెవరు చేసిస్తారమ్మా? సరే.. వీరయ్య చేసిచ్చినాడే అనుకుందాం.. దానిపైకెక్కి మనం కిందపడ్తే.. నడ్డి విరుగుతుంది తెలుసా?” అన్నది రమ.

‘నిజమేకదా..’ అనుకున్నాం!

“ఇవన్నీ కాదు కానీ, మనం రోజూ రాత్రి పైకొచ్చి.. పూలల్లో అన్నం మెతుకులు పెట్టి, ఆకాశం పైకి విసిరేద్దాం.. చంద్రుడు అందుకొని తింటాడులే!” అన్నది సావిత్రి.

“ఇదేదో బాగుందిలే.. నిచ్చెనలూ, పాడూ అవసరం లేదు. మనం కిందపడం కూడా!” అన్నాను నేను.

అన్నదే తడవుగా గోడమీదికి పాకిన జాజితీగ లాగి కొన్ని పూలు కోసుకొచ్చింది జయ.

అక్కావాళ్లు అన్నం, పులుసు గిన్నెలూ, అన్నం కలపడానికి పెద్ద వెండికంచం, నీళ్లూ అన్నీ తెచ్చి పెడుతున్నారు.

నేనూ, జయా పోయి చెరొక ఒక జాజి ఆకులో కొన్ని అన్నం మెతుకులు తీసుకొచ్చి, ఒక్కొక్క మెతుకునూ ఒక్కో జాజిపువ్వులో పెట్టి, అందరికీ ఇచ్చినాము.

అందరూ ఒక్కసారిగా పైకి శక్తికొద్దీ పూలను విసిరి,

“అన్నం తిను చందమామా! రోజూ నీకు పెడతాంలే! ఆ నక్షత్రాల్లాగా పిసినార్లం కాములే మేము! తిను.. తిను.. తిను.. అన్నం తిను.. తిను.. తినూ..” అంటూ కేకలు పెట్టాము.

“చంద్రుడికి అన్నం పెట్టడమేమో గానీ, ఎక్కడైనా విసురుకోనిపోయి కిందపడగలరే అమ్మా.. మీ ఆటలు చల్లగుండ!” అంటూ అన్నం కలిపిపెట్టడానికి వొచ్చింది పెద్దమ్మ నవ్వుతూ.

గుండ్రటి వెండి కంచాన్ని చూసి సావిత్రి.. “మనం చంద్రుణ్ని గురించి యేమేమో చెప్పినాము గానీ, చంద్రుడు అచ్చం వెండికంచం లాగా వున్నాడు కదే అమ్మణ్నీ?” అని ఉత్సాహంతో అరిచింది.

“ఇంక కవిత్వాలు చాల్లేగానీ, చేతులు పట్టండి” ఆదేశించింది పెద్దమ్మ పకపకా నవ్వుతూ. అందరం చేతులు కడుక్కోని వచ్చినాము.

పెద్దమ్మ చుట్టూ అర్ధచంద్రాకారంలో కూర్చున్నాము. కొత్త ఆవకాయ అన్నం ముద్దలు తిన్నాము మొదటి వరుసలో. ఆ తరువాత బెండకాయ పులుసన్నం, చారన్నం, చివరగా గడ్డపెరుగన్నం తినేసరికి అందరి బొజ్జలూ నిండిపోయినాయి.

“ఇవేవీ కాదే! అసలు చంద్రుడు పెరుగన్నం ముద్ద మాదిరి వున్నాడే!” అంటూ చేతిలోని ముద్దను మరింత గుండ్రంగా చేస్తూ రమ.

“..కాదే పిల్లలూ.. పెద్దమ్మ పొద్దున వెన్న తీసి ముద్దలు చేసి, గిన్నెలో పెడుతుందే.. అట్లాంటి వెన్నముద్ద మాదిరి వున్నాడు చందమామ!” అన్నది మేము ఖాళీ చేసిన గిన్నెలు తీసుకు పోవడానికి వచ్చిన మా రెండో అక్క.

అందరం నవ్వాము. అందరిళ్లలో నుంచీ వీళ్లను తీసుకొనిపోవడానికి ఎవరి అన్నలూ, అక్కలూ, తమ్ముళ్లూ వచ్చినారు. వాళ్లకూ తలో నాలుగు ముద్దల పెరుగన్నం పెట్టింది పెద్దమ్మ.

అందరూ తృప్తిగా తిని ఇళ్లకెళ్లారు.

అక్కడ కొంచెం శుభ్రం చేసుకున్నాం.. నేనూ..జయా..

ఇంతలో జీతగాడు పడిగలప్ప వొచ్చి ఆరుబయట పరుపులు పరిచి, దుప్పట్లు, దిండ్లు అమర్చి వెళ్లాడు.

అలా వెన్నెలలో తడుస్తూ, వెన్నెల దుప్పటిని కప్పుకొని, చుక్కలతో కబుర్లు చెబుతూ.. పెద్దమ్మ చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకున్నాం నేనూ.. జయా..

మా అన్నలూ, అక్కలూ అన్నాలు తిని, ఎప్పుడు మా పక్కన పడుకున్నారో తెలీనేలేదు!

“వరించి వచ్చిన మానవవీరుడు ఏమైనాడని విచారమా? ఔన చెలీ.. ఔన సఖీ! అయితే వినవే మామాట!”

మా ఊళ్లోని టూరింగ్ టాకీసులో ‘జగదేకవీరుని కథ’ రెండవ ఆట మొదలైనట్టుంది. పాట, ఆపైన సంభాషణలూ స్పష్టంగా, చెవిలో పెట్టినట్టు వినిపిస్తున్నాయి.

దాంతో మెలకువ వచ్చింది నాకు. ఒక్కసారి లేచి కూర్చుని, చుట్టూ అందరినీ చూసినాను. మా మిద్దెపైనా, చుట్టుపక్కల మిద్దెల మీదా అందరూ వెన్నెలలో నానుతూ, పొద్దున ఎండవేడిని మరచి నిద్రపోతూ వున్నారు.

మళ్లీ రేపు పొద్దున ఎండను ఎదుర్కోవడానికి శరీరాలను వెన్నెలలో ఊరబెట్టి సిద్ధం చేసుకుంటున్నారు.

చకోరాల్లా అందరి దేహాలూ వెన్నెలను ఆబగా తాగేస్తున్నట్లనిపించింది.

అందరి దేహాలలోకీ వెన్నెల బొట్టుబొట్టుగా ఇంకుతూ వుంది. ఎండవేడికి అలసిసొలసిన ఆ శరీరాలపై వెన్నెల మలాము పూస్తున్నాడు చంద్రుడు.

మళ్లీ చంద్రుణ్ని చూస్తూ నిదురమ్మ ఒడిలోకి జారుకుంటున్నాను నేను. జయ లేచి కూచుని,

“త్వరగా నిద్రపోవే అమ్మణ్నీ! మళ్లీ పొద్దున లేచి ఆడుకోవాల కదా!” అన్నది జయ సగం నిద్రలో.

హాయిగా నిద్రపోయాను. చందమామ తెల్లని పట్టుబట్టలు కట్టుకొని కిందికి దిగివొచ్చినట్టూ, ఆయన తలపై కిరీటంతో, ముత్యాల దండలతో ఎంతో అందంగా వున్నట్టూ, మాతోపాటు పెరుగన్నం తిన్నట్టూ, మాతో ఆడుకున్నట్టూ, తర్వాత మాకు టాటా చెప్పి పైకి వెళ్లిపోయినట్టూ.. రాత్రంతా చందమామ కలలే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here