Site icon Sanchika

అమ్మవారు అంటే మన అమ్మే

[దసరా పండుగ సందర్భంగా డా. శ్రీమతి కొఠారి వాణీచలపతిరావు రచించిన ‘అమ్మవారు అంటే మన అమ్మే’ అనే వ్యాసం అందిస్తున్నాము.]

[dropcap]భ[/dropcap]క్తి అంటే అదేదో అందరికీ అందని బ్రహ్మపదార్థం ఏమీ కాదు. భక్తి అంటే ప్రేమ. దేవుడు లేక దేవత మీద భక్తునికుండే ఆత్మీయతతో కూడిన ఒక మనసు బంధం. ఆ బంధం అమ్మ, నాన్న, అక్క, అన్న, గురువు, స్నేహితుడు ఇలా ఏ బంధుత్వంతో స్నేహశీలతతో కూడుకున్న బంధమైనా కావచ్చు. మనం ఎలా భావిస్తే అలా భావించడంలోనే వుంది అంతా. ఒక్కొక్కళ్ళ ముఖంలోకి, కళ్ళల్లోకి, హావభావాలలో చూసినప్పుడు ఒక్కోలా అనిపిస్తారు. కొంతమందిని చూస్తే అమ్మలా అనిపిస్తుంది.. లేక నాన్నలా అనిపిస్తుంది.. ఏ స్నేహితుడినో చూసినట్టు అనిపిస్తుంది.

అలా చూస్తూ ఎంతో సేపు వాళ్ళ దగ్గరే ఉండిపోవాలని అనిపిస్తుంది. అదే ఉపవాసం చేయటం అంటే.. ఉపాసన అన్నా అదే. ఆరాధన, దగ్గర కూర్చోవడం. ఆ ఆరాధన సగుణోపాసన కావొచ్చు – నిర్గుణోపాసన కావచ్చు. ప్రేమ యొక్క పరాకాష్ఠ దశయైన పూజ్యభావమే ఆరాధన అని నాకు అనిపిస్తుంది. దేవతోపాసన అంతే. మనకు ఇష్టమైన అమ్మను పీట వేసి కూర్చోబెట్టి షోడశాపచారాలతో సేవ చేస్తూ ఆమె దగ్గర ఎక్కువ సమయం గడపగలిగితే దానిని మించిన ఆరాధన ఏముంటుంది? తల్లి పిల్లల నుంచి ఏం కోరుకుంటుంది.. నాకు బంగారు, వెండి నగలు చేయించి, పట్టువస్త్రాలు పెట్టండి అని కోరుకోదు – ‘నా కళ్ళెదురుగా కాసేపు కూర్చోండి నాయనా – కళ్ళారా చూసుకుంటాను’ అంటుంది. ఇప్పుడు నిత్య వ్యావహారిక జీవితంలో తల్లికి కరువైంది కూడా అదే కదా, పిల్లలు తన చెంతవుండటం.

దగ్గర ఉంటున్నావంటేనే అర్థం ఆమె పట్ల శ్రద్ధ వహిస్తున్నావు అని.. ఆమె అవసరాలు అయిన అన్నపానాదులు వేళకు ఇస్తూ ఆమె సేవ చేస్తున్నావు అని.. దాన్ని మించిన భక్తి, పూజ మరేముంటాయి? అందుకే ‘భక్తి అంటే ప్రేమ’ అని అనేది. పోతనామాత్యులు కూడా మహాభాగవతంలో నవవిధ భక్తుల పేరిట ఈ సిద్ధాంతాన్నే ప్రతిపాదించారు కదా!? దేవీ ఆరాధనను కూడా భక్తులు అలాగే చేస్తారు.

అమ్మలగన్నయమ్మ అయిన పెద్దమ్మ దుర్గమ్మ పేరిట ప్రతీ ఏడాది అశ్వయుజమాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నుండి ఈ శరన్నవరాత్రులు ప్రారంభం అవుతాయి. ఒక్కోరోజు ఒక్కో రూపంలో అమ్మ దర్శనమిస్తుంది. అమ్మకు ఇన్ని రూపాలేంటి, అమ్మ ఒకటే కదా – అంటే నిజమే అమ్మ ఒక్కతే. కానీ పేర్లు వేరు. ఎవరికిష్టమైన పేరుతో వారు పిల్చుకుంటారు. ఎలా పిలిచినా పలుకు తుంది అమ్మ. అమ్మ రూపం ఒకటే – కానీ సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి అమ్మ ముఖంలోని హావభావాలు, శరీర భంగమలు మారుతుంటాయి. జగజ్జనని – జగత్తుకంతటికీ తల్లి అయిన అమ్మవారు. ఆ రాజరాజేశ్వరి తన బిడ్డల్ని దుష్టుల నుంచీ, క్రూరులైన రాక్షసుల నుంచీ నిరంతరం కాపాడుతూ ఉండాలంటే దుష్టశిక్షణ సమయంలో శత్రువు భయపడిపోయేలా ఉగ్రరూపాన్ని ధరించక తప్పదు. ‘అన్నా, నాన్నా’ అని బ్రతిమిలాడుతూ, బుజ్జగిస్తూ చెబితే శత్రువు మాట విని దారికి వస్తాడా, రాడు. వాడికి ఆయుధంతోనే బుద్ధి చెప్పాలి. పసిపిల్లాడయిన తన కొడుకు మీదకి ఏ బూచో, ఏ దొంగో, ఏ మృగమో దాడి చేయబోతే అమ్మ ఎంత శాంతమూర్తి అయినా ఏం చేస్తుంది – దుడ్డుకర్ర తీసుకొని వెంటబడదూ. అప్పుడు ఆమె ముఖంలోని హావభావాలు, శరీర భంగిమలూ ఎలా ఉంటాయి? రౌద్రంగా ఉండవూ – తన ఒక్క పిల్లవాడిని రక్షించుకోవటానికి వచ్చిన అమ్మే ఆ సమయంలో అంత రౌద్రరూపం దాలిస్తే ముల్లోకాలను రక్షించాల్సిన అమ్మ ఎంత రౌద్రంగా మారాలి?

అవే దుర్గ, కాళి, చండి రూపాలు.

ఇక దసరా నవరాత్రులలో ఆ ఆదిపరాశక్తియైన అమ్మ తొమ్మిది రూపాలను ధరిస్తుంది.. శక్తి అంటే అమ్మవారు. అమ్మవారు అంటే శక్తి. శక్తి లేకుండా దేవుడు విడిగా వుండడు. శివుని యొక్క శక్తి రూపమే దుర్గ. ఆమె తొమ్మిది రూపాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1) బాలాత్రిపుర సుందరీదేవి:

దసరా నవరాత్రులలో మొదటిరోజు దుర్గ ధరించే అవతారం బాలా త్రిపుర సుందరీ దేవి. ఏ మనిషికయినా, బాల్యం ప్రారంభ దశ గనుక ఆ దశనుంచే శ్రీలలితాదేవి కూతురిగా బాలా త్రిపుర సుందరీదేవి అమిత శక్తిమంతురాలిగా దర్శనమిస్తుంది. బాల అంటే బలస్వరూపిణి, లీలా మానసస్వరూపిణి, విద్యాధిదేవత. ‘నమామి విద్యాలాభాయ బాలాత్రిపురసుందరీ’ అని ప్రార్థిస్తే, విద్యను ప్రసాదించే దేవత. ఈమె ఉపాస్యదేవత, అందులోనూ బాల గనుక అందరికీ అందుబాటులో ఉండే దేవత. బాల అంటే అర్థం అదే. ఈ దేవత 9 ఏళ్ళ బాలిక. బాలిక అన్న పదానికి మరో పేరు కుమారి. కనుక ఈ రోజు కన్యపిల్లలను బాలాత్రిపురసుందరిగా భావించి పూజిస్తారు. అమ్మవారి ప్రాణ, హృదయశక్తి ఈమె. శ్రీ బాల ఉదయించే సూర్యుని అరుణ కాంతి రూపాన్ని కలిగి వుంటుంది. ఎప్పుడూ మందహాసం మోము మీద విరాజిల్లుతూ వుంటుంది. 4 చేతులలో పై రెండు చేతులలో పుస్తకం, జపమాల క్రింది రెండు చేతులలో అభయ, వరద ముద్రలు ధరించి వుంటుంది. కల్లారం అనే కమలంలో ఆసీనురాలై వుంటుంది. శ్రీచక్రం లోంచి పుట్టిన, హంసలు లాగే రథాన్ని ఎక్కి అర్ధచంద్రాకారపు త్రిశులాన్ని ఒక చేతిలో పట్టకొని వుంటుంది. భాండాసురుడు అనే రాక్షసుని 30 మంది కొడుకులను దానితోనే వధించింది. అంత చిన్నవయసులో మిక్కిలి బలంలో ఒకే బాణంతో అంతమంది రాక్షసులను చంపి ‘బాల’ కాదు ‘బల’ అని నిరూపించుకొని తల్లి లలితను, శ్యామ వారాహి దేవతలనూ ఆశ్చర్యపరిచింది. ఈమె నిత్యకళ్యాణశీల గనుక ఈమెను దసరా ఉత్సవాలలో తొలి రోజు పూజిస్తే జ్ఞానం, బలం సిద్ధించి భయం దూరమవుతుంది అని అంటారు.

2. శ్రీ గాయత్రీ మాత:

దసరా నవరాత్రులలో రెండవ రోజు అవతారమైన శ్రీ గాయత్రీమాత పరాశక్తి స్వరూపం. జగన్మాత, వేదమాత, వీరమాత. ఈమెకు సంధ్యాదేవి అని మరో పేరు వుంది. ప్రాతః కాలంలో గాయత్రిగా, మధ్యాహ్నం సావిత్రిగా, సాయంత్రం సరస్వతిగా మూడు పేర్లతో, మూడు రూపాలలో ప్రకాశిస్తూ వుంటుంది ఈ మాత. ఐదు ముఖాలతో పది చేతులతో ఆశ్రితులకు అనంతమైన బుద్ధిని ప్రసాదిస్తూ వుంటుంది. ‘గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ’. గయ, త్రాయతి అన్నవి ఇందులోని రెండు పదాలు. గయలు అంటే ప్రాణాలు, త్రాయతే అంటే రక్షించడం. ‘ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి’ అని అర్థం. వ్యక్తిగత రూపమేమో గాయత్రీమాత. అన్ని శక్తులకు ఈమే ఆధారం, ప్రతి దేవిలో గాయత్రీమాత ప్రాణశక్తి దాగి వుంటుంది. అన్ని శక్తులకూ ఈమె ఆధారం. ‘న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్’ అన్నారు. అంటే తల్లిని మించిన దైవం లేదు; గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అని అర్థం. ఈ మాతను పూజిస్తే మంచి జ్ఞానం, ఆయుష్షు లభిస్తాయి.

3. శ్రీ అన్నపూర్ణాదేవి:

దసరా నవరాత్రులలో అమ్మవారు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారు. అన్నపూర్ణ అనగా ‘అన్నం పూర్ణంగా కల దేవి’ లేక ‘పరమాత్మతో కూడి వున్న దేవి’ అని రెండు అర్థాలు వున్నాయి. నిజమైన అన్నం అనగా జ్ఞానం. జ్ఞానమనే అన్నాన్ని ప్రసాదించే తల్లి కావుననే ‘జ్ఞాన ప్రసూనాంబ’ అని కూడా ఈమె వ్యవహరించబడుతుంది. అన్ని రకాల సుఖాలనూ అందించే ఈ తల్లిని ‘వాసవి’ అని కూడా పిలుస్తారు. ‘అద్యతే అత్తిచ భూతాని’ అన్నది అన్నానికి వ్యుత్పత్తి. ‘అన్నం ‘బ్రహ్మేతి వ్యజానాత్‌’. అన్నమే పరమాత్మ అన్నది వేదోక్తి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అంటే పరమాత్మను ఇచ్చే తల్లి.

ఒక చేతిలో బంగారు అన్నం గిన్నె, మరో చేతిలో బంగారు గరిటె పట్టుకొని వుంటుంది. ముల్లోకాలకే కాదు శివునికి సైతం భిక్ష పెట్టి ఆదిభిక్షువుని చేసిన తల్లి అన్నపూర్ణమ్మ తల్లి.

ఒకసారి మోసంతో శివుని వేషంలో ఒక అసురుడు వచ్చి భిక్షమడగగా ఆగ్రహించి ఆ రాక్షసుడిని కిందపడేసి కాలి కింద తొక్కిపట్టింది. దుర్జనుల దుర్మార్గాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనే అన్నాన్ని పెట్టింది ఆ విధంగా. కొన్ని ప్రాంతాలలో దసరా ఉత్సవాల మూడోరోజు అన్నపూర్ణాదేవిని కూరగాయలతో అలంకరించి పూజిస్తారు.

4. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి:

శ్రీ లలితా త్రిపురసుందరి తల్లిదేవత. మహాదేవి యొక్క అత్యున్నత రూపాలలో ఒకటి. త్రిపుర అంటే మూడులోకాలలో అందమైనది, మూడులోకాలనూ పాలించేది అని అర్థం. సర్వోన్నత శక్తిత్వం. మహావిద్యలలో అగ్రగామి. త్రిపుర ఉపనిషత్తు ఆమెను అంతిమశక్తి అని పేర్కొన్నది. ‘శ్రీమాత్రేనమః’ అన్నది ఈ అమ్మ మంత్రం. శ్రీచక్రం – ఈమె చిహ్నం. కోమలత్వం కలిగిన స్త్రీమూర్తి. విద్యాస్వరూపిణి, కామాక్షి, కామేశ్వరి, లలిత, లలితాంబిక, రాజరాజేశ్వరి, షోడశి, శ్రీమాత ఈమె ఇతర నామాలు. మహావిద్యలలో అగ్రగామి. లలితా సహస్రనామాలు ప్రసిద్ధం. సౌందర్యలహరిలో ఈమె విస్తృతంగా ప్రశంసించబడింది.

శ్రీ చక్రం మిద పాదం మోపి, చెరుకు విల్లు చేతిలో పట్టుకొని చతుర్భుజ అయి సింహాసనం మీద లేక సింహవాహనం మీద ప్రకాశిస్తూ వుంటుంది/ ఆదిపరాశక్తిగా పేర్కొన బడే ఈ తల్లి.

5. శ్రీమహాగౌరి దేవి:

‘అష్టవర్షాత్ భవేత్ గౌరి’ అంటే 8 సంవత్సరాల వయసు కలది గౌరి అని అర్థం. గౌర వర్ణంలో ఉంటుంది. అంటే ఎరుపు రంగు. శివుడి కాళిని ‘నువ్వు నల్లగా వున్నావు’ అని ఎగతాళి చేసినప్పుడు అవమానంతో, కోపంతో గౌరిగా మారిందన్నది ఒక పురాణ కథ. పార్వతిగా శివుని కోసం తపస్పు చేస్తున్నప్పుడు ఎండకు చర్మం నలుపెక్కగా శివుడు గంగాజలంతో అభిషేకిస్తే శ్వేతవర్ణంతో శోభించింది అన్నది మరో కథ. గౌరవర్ణంలో ఉండటం వల్లనే ఈ దేవతకు గౌరి అన్నీ పేరు వచ్చింది. స్త్రీలు వ్రతాలు, నోములు చేసుకున్నప్పుడు పసుపు గౌరమ్మను చేసి పూజించటం ఆచారం. ఈ దేవి కాళిగా ఉన్నప్పుడు శంభుడు, నిశంభుడు అనే రాక్షసులను సంహరించి. ఆ తర్వాత గౌరిగా మారిందని అంటారు. తెల్లటి వస్త్రాలను ధరించి, తెల్లటి ఎద్దునెక్కి వుంటుంది.

‘శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః ।

మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా॥’

అని ఈ అమ్మను ధ్యానిస్తారు. ఈ గౌరి – శ్రీ మహా గౌరి, మంగళగౌరి, శ్రీ గౌరి పేర్లతో పూజలందుకుంటూ వుంటుంది. ఆడపిల్లలు పెళ్ళి సమయంలో ముందుగా ఈ గౌరిదేవి పూజ చేసి గానీ పెళ్ళి మంటపంలోకి అడుగుపెట్టరు. కొత్తగా పెళ్ళయిన స్త్రీలు చేసుకునే వ్రతం మంగళగౌరి వ్రతం.

6. శ్రీమహాలక్ష్మీదేవి:

హిందూమతంలోని ప్రధాన దేవత అయిన శ్రీమహాలక్షిదేవి అవతారాన్ని అశ్వయుజ షష్టి తిథిన దేవీనవరాత్రులలోని ఆరవ రోజున దుర్గామాతకు ధరింపచేస్తారు. ఈ రూపం అత్యంత వైభవోపేతమయినది. శ్రీ, సిరి, లక్ష్మి, లచ్చిమి ఇలా అనేక పేర్లున్నాయి లక్ష్మీదేవికి. సంపద లొసగే తల్లి అయినా సంపద అంటే కేవలం డబ్బు ఒక్కటే కాదని చెపుతూ అష్టలక్ష్ముల రూపంలో దర్శనమిస్తుంది అమ్మ. ఆదిలక్ష్మి, దాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి అన్నవి అవి. వాటిలో ఏది లేకపోయినా మన జీవితం పరిపూర్ణం కాదు. లోటు బాధిస్తూనే ఉంటుంది. మనకు ఏం కావాలో తెలిసిన మన అమ్మ అడగకుండానే మనకు అన్నీ సమకూర్చిపెట్టినట్టు శ్రీమహాలక్ష్మి కూడా అంతే సమకూరుస్తుంది. ఈ తల్లి పద్మాసనంలో కూర్చుని చేతులలో కమలాలు, మరో రెండు చేతులలో అభయ, వరద హస్తముద్రలూ ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపంలో దర్శనమిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మిగా, శ్రావణ మంగళవారం రోజు మంగళగౌరిగా ఈమెను స్త్రీలు కొలుస్తారు. ‘యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా.’ అంటే అన్ని జీవులలోనూ ఉండేది ఈ లక్ష్మీస్వరూపం అని అర్థం. ఈమె హాలుడు అనే రాక్షసుడ్ని చంపి శిష్టరక్షణ కావించింది. ఈ మహాలక్ష్మిని దసరా ఉత్సవాలలో పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు సిద్ధిస్తాయి.

7. శ్రీ సరస్వతీదేవి:

ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజు శరన్నవరాత్రులలో భక్తులు దుర్గామాతను శ్రీ సరస్వతిదేవి అవతారంలో దర్శించి తన్మయులవుతారు. చైతన్యస్వరూపిణిగా జ్ఞానం, విద్య, అభ్యాసం, కళలు, సంస్కృతి ఆదిగా గలవాటికి దేవతగా పురాణాలు చెబుతున్నాయి. సరస్వతీ నది ఈమె వ్యక్తిగత రూపం. అయితే సరస్వతి ఇప్పుడు అంతర్వాహిని. వాగ్దేవి, శారద, సావిత్రి, బ్రహ్మి, భారతి, వాణి ఈ దేవత ఇతర నామాలు. వీణ, పుస్తకాలు, జపమాల, తెల్ల కమలం ఈ తల్లి చిహ్నాలు. ఈమెకు ఇష్టమైన రంగు తెలుపు. వాహనం హంస లేక నెమలి. తెల్లని వస్త్రాలు ధరించి, ప్రకాశవంతమైన తెల్లని రంగులో స్వచ్ఛతకు మారుపేరుగా సరస్వతీదేవిని అలంకరిస్తారు. హంసవాహినిగా నాలుగు చేతులలో జపమాల, పుస్తకం, నీటికుండ, వీణ ధరించి అమ్మ దర్శనమిస్తుంది. పిల్లలకు అన్నం పెట్టే అమ్మ అన్నపూర్ణమ్మ అయితే చదువును ప్రసాదించే అమ్మ ఈ సరస్వతమ్మ. అమ్మను అందుకే మనం తొలి గురువు అంటాం కదా. అందుకే పిల్లలకు బాసర సరస్వతీ దేవి ఆలయంలో అక్షరాభ్యాసాలు జరుగుతూ వుంటాయి. శక్తి మతంలో ఈ తల్లి దేవత బ్రాహ్మణిగా అవతారం దాల్చుతుంది. ఈమె శంభు, నిశంభులు అనే రాక్షసులని చంపి దుష్టశిక్షణ కావించి తన బిడ్డలను కాపాడుకుంది. శరన్నవరాత్రులలో సరస్వతీదేవి దర్శనమిచ్చే ఈ రోజు మూలా నక్షత్రానికి చాలా ప్రాధాన్యం ఉంది.

8. శ్రీమహాదుర్గా దేవి:

ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజు శ్రీమహాదుర్గగా అమ్మవారు దర్శనమిస్తుంది. దానినే దుర్గాష్టమి అంటారు. ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించింది. పంచప్రకృతి మహా స్వరూపాలలో మొదటి రూపం దుర్గారూపం. ఈమెను అర్చిస్తే శత్రుపీడ వుండదు. సర్వత్రా విజయం ప్రాప్తిస్తుంది. దుర్గాదేవి త్రినయని. మూడు కళ్ళతో ఈ ముల్లోకాలను కాపాడుతుంది.

దుర్గాదేవి లోహుడు అనే రాక్షసుడిని చంపింది గనుక పూర్వం ఈ రోజు లోహాలతో తయారయిన కత్తులను పూజించడం వల్ల ఆయుధపూజ అన్నారు. ఇప్పుడు అవి లేవు గనుక వాహనపూజ చేస్తున్నారు. మన దుర్గతులన్నింటినీ పోగొట్టే చల్లని తల్లి దుర్గామాత.

9. శ్రీ మహిషాసుర మర్దిని దేవి:

దేవీ నవరాత్రులలో తొమ్మిదవ రోజు అయిన నవమి రోజు అమ్మవారు శ్రీమహిషాసుర మర్దినిగా దర్శనమిస్తుంది. అన్ని అవతారాల్లోకే ఇది అమ్మవారి ఉగ్రరూపం. మహిషాసురుని సంహరించిన ఈ రోజును మహర్నవమి అంటారు. సింహాసనారూఢ అయి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశాలలో మహాశక్తి స్వరూపంగా అమ్మ ఈ రోజు అవతారం దాల్చుతుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. మహిషాసురమర్దిని మనందరికీ భయాలు పోగొట్టి చల్లగా కాపాడే అమ్మ .

శ్లో॥

‘మహిషమస్తక నృత్త వినోదిని

స్ఫుటరణన్మణి నూపుర మేఖలా

జననరక్షణ మోక్ష విధాయిని

జయతి శుంభ నిశుంభ నిషూదిని’

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మహిషాసురుని చంపటం అనేది. అందుకే ‘అయిగిరినందిని – నందితమేదిని’ అని స్తుతిస్తారు.

10. రాజరాజేశ్వరీదేవి:

శరన్నవరాత్రులలో అమ్మవారి చివరి అలంకారం శ్రీరాజరాజేశ్వరీదేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్యదేవత అయిన అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి అధిష్ఠానదేవత ఈ అమ్మ. లలితా సహస్రనామ పారాయణంలో, కుంకుమార్చనలతో స్త్రీలు ఈ దేవతను కొలుస్తారు. అమ్మవారు చిద్రూపిణిగా, పరదేవతగా ఈ రోజు పూజలందుకుంటుంది. చేతిలో చెరుకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాత, శక్తి స్వరూపిణి ఈ అమ్మ.

అమ్మవారి నవరాత్రులు, దసరా అయిన పదవరోజూ, ప్రతిరోజూ పండగే. హిందువులు అపరిమిత భక్తి శ్రద్ధలతో వాహనపూజ, శమీపూజ, పాలపిట్ట దర్శనం వంటి వేడుకలు, ఉత్సవాలు ఆచార వ్యవహారాలతో కొత్త బట్టలు ధరించి, పిండి వంటలు వండుకుని కుటుంబసభ్యులు, చుట్టపక్కాలు ఇరుగుపొరుగులో కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పదిరోజులూ ఇంటింటా పండుగ వాతావరణమే. కొన్ని ప్రాంతాలలో బొమ్మలకొలువు పేరుస్తారు. అమ్మకు ఎన్నో రూపాలు. ఎన్నో పేర్లు – ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది, ఏ రూపంలో కొలిచినా కరుణిస్తుంది. ఈ దసరా నవరాత్రుల అమ్మవారి అలంకరణలో, అవతారాలలో, వేడుకలలో ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి కొద్ది తేడాలు ఉంటాయి. బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అలంకరణలు ఒక రకంగా ఉంటాయి. ఇక బెంగాలీలు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ దుర్గామాతను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ఉత్తర భారతంలో శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండదేవత, స్కందమాత, కాత్యాయని దేవి, కాళరాత్రి, మహాగౌరి పూజ, సిద్ధిధాత్రి పూజ, దుర్గామాత పూజ జరిపిస్తారు. పూజా విధానం వేరువేరు అయినా అందరూ కొలిచేది ఆ జగన్మాతనే. జగత్తుకంతటికీ తల్లి అయిన అమ్మలగన్న ఆయమ్మనే. ఆ అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలు మన మీద వుంటే మనని ఏ దుష్టశక్తులూ ఏమీ చేయలేవు. ఏ రాక్షసపీడా మన మీద వుండదు. దసరా నవరాత్రుల ఆంతర్యం, అంతరార్థం ఇవియే. శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించిన రోజు కూడా ఇదే అని అంటారు గనుక ఉత్తర భారతంలో రామాదహనం అనే వేడుకను అంగరంగవైభవంగా జరిపి దశ్ హరా – పదితలల రావణుడు చచ్చాడు అంటూ దసరా పండుగ జరుపుకుంటారు. ఇలా దసరా పండుగకు ఎంతో ప్రాముఖ్యత వుంది మన హిందువుల పండుగలలో.

శ్రీమాత్రే నమః

Exit mobile version