[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి గారు రచించిన 13 కథల సంపుటి ‘అమ్మే కావాలి’. ఇది అమ్మ కథల సమాహారం. ఈ పుస్తకంలోని కథలన్నీ అమ్మ గురించే. ఈ కథల్లో పాత కాలపు ఆలోచనా ధోరణులున్న అమ్మలు, కొత్త తరపు జీవన విధానాన్ని ఒడిసిపట్టుకునే ఈ తరం అమ్మలు ఉన్నారు. చాలా కథల్లో కొత్త అమ్మలకీ, పాత అమ్మలకీ మధ్య సంఘర్షణ ఎదురైనప్పుడు తమ అనుభవాలతో, సమర్థతతో పాత అమ్మలే నెగ్గి, కొత్త అమ్మల (కూతుళ్ళ) చేత ‘అమ్మే కావాలి’ అనిపించుకుంటారు. ఈ కథలు మధ్య తరగతి కుటుంబ విలువలనీ, అమ్మ గొప్పతనాన్ని చాటడానికి ప్రయత్నిస్తాయి.
***
అర్చక కుటుంబాలలోని పూజారి కొడుకుపై ప్రెసిడెంట్ కొడుకు దాష్టీకం చేస్తే, అవమానం తట్టుకోలేక అతను ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఈ అవమానాన్ని కళ్ళారా చూసిన అతని భార్య మరో ఊరిలోని వేదపాఠశాలలో చదువుకుంటున్న తన కొడుకుని అక్కడ్నించి తెచ్చేసి తమ ఊర్లోనే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించాలనుకుంటుంది. కాని అప్పుడు అక్కడ ఆమెకి ఎదురైన ఓ అనుభవం ఆమె తన నిర్ణయం మార్చుకునేలా చేస్తుంది. ‘రేపటి కోసం’ కథ ఆసక్తిగా చదివిస్తుంది.
ప్రసవానంతరం హార్మోన అసమతౌల్యం వల్లా, బాల్యంలో ఎదురైన ఒక చేదు సంఘటన మనసులో బలంగా ముద్ర వేయడం వల్లా తన పసిబిడ్డని ఎవరికీ ఇవ్వదు వినీత. పిల్లని ఎవరైనా ఎత్తుకుపోతారేమోననే భయం ఆమెని మానసికంగా బాగా భయపెడుతుంది. ఆమెని ఈ భయం నుండి దూరం చేయడానికి ఆమె తల్లిదండ్రులు, అత్తమామలు, భర్తా ఏం చేశారో ‘ప్రేమా పిచ్చీ ఒకటే…’ కథ చెబుతుంది.
‘అమ్మతనంలోని కమ్మతనం’ తమ కూతురికి తన వియ్యపురాలి సాయంతో తెలియజేసేందుకు ఓ తల్లి పథకం వేయగా, ఆ అత్తగారి ఉపాయం విజయవంతమైన వైనం ‘అమ్మ అన్నదీ ఒక కమ్మని మాట’ కథలో చదవవచ్చు.
“మీకు ఎన్ని విషయాలు తెలిసున్నా, మీ అంతట మీరు ఎంత డబ్బయినా ఖర్చు పెట్టుకోగలిగినా, పక్కన అమ్ముంటే ఆ నిశ్చింత వేరు” అని ఓ పెద్దావిడ చెప్పిన మాటలు సుమ మనసు మారుస్తాయి. వెంటనే తల్లికి ఎందుకు ఫోన్ చేసిందో తెలుసుకోవాలంటే ‘అమ్మలగన్న అమ్మ’ కథ చదవాలి.
మారిపోయిన అమ్మ గురించిన కథ ఈ సంపుటికే కలికితురాయి వంటిది. ‘మీ అమ్మ మారిపోయిందమ్మా’ కథ బహుమతి పొందిన కథ. ఈ కథ ప్రచురితమవగానే – ఒక మంచి కథని తమవారితో పంచుకోవాలనే ఆతృతతో ఎంతోమంది రచయిత్రి పేరు లేకుండానే ఈ కథని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ఇలా జరగడం ఈ కథకి పట్టాభిషేకమేనని రచయిత్రి భావించారు. అమ్మ ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ కథ చెబుతుంది.
ఓ తాగుబోతు తనకి కలిగించిన నష్టానికి, అతనికి శిక్ష పడేలా చేసి, అతని గుడిసెని తానే కొనుగోలు చేస్తుందో ధనికురాలు. యజమానురాలు చేసిన ఆ పని వెనుక ఆమె ఉద్దేశాన్ని తెలుసుకున్న ఆమె మేనేజర్ ‘అమ్మా! నమస్కారం’ అనుకుంటాడు. ఎందుకో ఈ కథ చదవండి.
‘స్వతంత్రంగా బతకమని కూతురుకి చెప్పడమే తన తప్పా’ అని అనుకుంటుంది యశోద ‘మనసు చూడతరమా’ కథలో. కానీ కూతురు ఉదయ పూర్తిగా తను చూపిన మార్గంలో నడవడం లేదని, అందర్నీ వెక్కిరించే స్థాయికి చేరిందని తల్లి గ్రహిస్తుంది. డబ్బుని చూసుకుని ఉదయలో కలిగిన అహంకారాన్ని తల్లిదండ్రులిద్దరూ కలిసి దూరం చేసే ప్రయత్నం చేస్తారీ కథలో.
ప్రతీ చిన్న విషయాన్నీ సున్నితంగా ఆలోచించే తల్లి ఓ విషాద సంఘటన ద్వారా ఆకస్మిక అనారోగ్యానికి గురైతే ఆమెకి సేవలు చేసే బాధ్యత కూతురు సరళ తీసుకుంటుంది. భర్త సహాకారంతో తల్లిని తన ఇంట్లో ఉంచుకుని చూసుకుంటుంది. మంచి మనిషే అయినా, అతి ప్రాక్టికల్‌గా ఆలోచించే అత్తగారి ప్రవర్తనతో ఇబ్బంది కలిగి అమ్మను చూసుకోడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తుంది సరళ ‘అమ్మే కావాలి’ కథలో.
కుటుంబంలోని పెద్దలతో అవసరాలు డిస్పోజబుల్ కప్పుల వంటివని భావించే రఘుకి – అవసరం తీరిపోయాక అత్తగారు తమ ఇంట ఉండడం కంటగింపుగా ఉంటుంది. ఆవిడ్ని ఊరికి పంపించేయమని భార్యకి గట్టిగా చెప్పేస్తాడు. అల్లుడి మాటలు విన్న శారదమ్మ బాధపడుతుంది. డిస్పోజబుల్ కప్పులతో కలిగే అనారోగ్యం గురించి చెబుతూ, నిపుణులు పింగాణీ కప్పులనే వాడమంటున్నారని కూతురికి రాస్తుంది. యూజ్ అండ్ త్రో మనస్తత్వాన్ని వదిలి పెద్దలను ఎలా ఉపయోగించుకోవాలో సూచిస్తుంది ‘అమ్మలూ ఒక మాట చెప్పనా’ కథలో.
తమ స్కూల్లో చదివే ఓ విద్యార్థి తప్పు చేసినందుకు అతడికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందిగా ఓ కౌన్సిలర్‌ని పిలిపిస్తే, కౌన్సిలింగ్ అవసరం పిల్లాడి కన్నా అతని తండ్రికి ఎక్కవ ఉందని కౌన్సిలర్ శివరాం తేలుస్తాడు ‘మొలక’ కథలో.
బంధువుల ఇంట్లో తాము చూసిన ఓ సంఘటనని విశ్లేషిస్తూ, దానిని హేళన చేయబోయిన కూతురిని వారించి, ఆ సంఘటనలో పూజారి గారి ప్రవర్తన లోని సమంజసత్వాన్ని వివరించి, ఆయన చర్యకి సరైన అర్థం చెప్పి కూతురిలో దురభిప్రాయాన్ని తొలగిస్తుంది తల్లి ‘మనసు ప్రదానం’ కథలో.
***
అమ్మే కావాలి (కథా సంపుటి)
రచయిత్రి: జి.యస్.లక్ష్మి
పేజీలు: 132, వెల: ₹130/-
ప్రతులకు:
రచయిత్రి, 2-2-23/7/1, బాగ్ అంబర్‌పేట, హైదరాబాదు, 500013 ఫోన్: 9908648068,
ప్రముఖ పుస్తక కేంద్రాలు.