అన్యాయం అయిపోయిన అమ్మోరు తల్లి

1
2

[dropcap]ఇ[/dropcap]ప్పుడే అమ్మోరు తల్లి సినిమా చూశాను. ఏం తీయాలనుకొన్నారో ఏం చెప్పాలనుకున్నారో!  

దొంగ బాబాలు,  మోసాలు మనం వింటూనే ఉన్నాం. అన్ని మతాల్లోనూ ఇలాంటి  మోసగాళ్లు, మ్యాజిక్‌లు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా. 

‘భగవంతునికి భక్తునికి మధ్య బ్రోకర్లు ఉండనవసరం లేదు’ అన్నది నిజమే. కానీ దాని కోసం ఒక ‘ముక్కుపుడక అమ్మవారు’ అనేటువంటి ఈ పాత్రను సృష్టించి, చాలా గ్లామరస్‌గా చూపిస్తూ, అమ్మవారు ‘జానేదో’ అనే పాటకి ప్రత్యక్షమవడం ఏమిటో, ఆమె చిటికెలు వేయటం ఏమిటో, అవసరం లేకపోయినా ఇంగ్లీషు (అమ్మవారికి అన్ని భాషలు వచ్చు – అది వేరే విషయం) మాట్లాడటం ఏమిటో, అందం కోసమో గ్లామర్ కోసమో, వెరైటీ కోసమో ‘వంకరగా’ నవ్వటం ఏమిటో…. !??

ఏదో చెప్పాలి అనుకొని ఏదో తీసేసి కొంతమంది మనోభావాల్ని దెబ్బతీసే అధికారం నిర్మాత దర్శకులకు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారు ఎక్కడపడితే అక్కడ ఏదో ఒక గెటప్‌లో, ఏదేదో మాట్లాడటం ఎంత హాస్యాస్పదంగా ఉన్నదో – అంతకంటే ‘నిరాకార నిరంజన సత్య స్వరూపమైన దైవాన్ని’ నమ్మే వారి మనసును బాధ పెట్టడం చేశారు దర్శక నిర్మాతలు, ఓవర్ యాక్షన్ చేసిన హీరో బాలాజీ. వెంకటేశ్వర స్వామిని పూజించే కుటుంబాన్ని చూసి అమ్మోరు తల్లికి కోపం రావటం ఏంటో అర్థం కావడం లేదు. పూర్తిగా ‘ఒక మతాన్నే’ టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది క్లియర్‌గా. ఎంత ధైర్యం! 

ఈ సినిమాని షూటింగ్ లోనే ఆపక పోవటం, సెన్సార్ వారికి అభ్యంతరం లేకపోవటం, విడుదల చేయటానికి అనుమతి లభించడం, ప్రేక్షకులు చూసి మౌనంగా ఉండటం చాలా విచిత్రంగా ఉంది. దీని వెనుక నిజంగానే ఏ బలమైన శక్తులు పని చేశాయో తెలియడం లేదు.

దొంగ బాబాల మీద చాలా సినిమాలు వచ్చాయి. దేవుడు ప్రత్యక్షం కావటం కూడా చాలా సినిమాల్లో చూశాం. దేవుళ్ళు మనిషితో హాస్యంగా, చతురంగా మాట్లాడటం కూడా గతం నుంచి ఎన్నో సినిమాలలో చూశాం. కానీ  దేవుణ్ణి ఇంతగా అపహాస్యం చేయడం, హాస్యాస్పదంగా చూపించడం అనేది ‘అమ్మోరు తల్లి’ సినిమాలో మాత్రమే చూస్తాం.  ప్రేక్షకులు  దీపావళి పండగ సందడిలో ఉండిపోయి, OTT లో చూడలేదేమో, అభ్యంతర పెట్టలేదేమో కానీ  ఈ కథని, మాటలని, దృశ్యీకరణని, దర్శకత్వాన్ని ఖచ్చితంగా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన సినిమా ఇది.

ఏది ఏమైనా-  దేవుడిని విమర్శించాలంటే ఒక్క హిందూ దేవుళ్ళే దొరుకుతారేమో తెలియటం లేదు. Trailer లో చూపించినట్లు – వేరే మతాన్ని విమర్శించిన దృశ్యాలని మాత్రం ‘చాలా జాగ్రత్తగా’ కట్ చేశారు. 

ఎప్పటిలాగానే ఆత్మ ఘోష తప్ప ఏమీ మిగలదు. ఎవరూ పట్టించుకోరు. కానీ సినిమా మాత్రం చాలా చాలా అభ్యంతరకరం. కథ, తన పాత్ర, చిత్రీకరణ అంతా తెలుసుకొనే నయనతార ఒప్పుకున్నదా  అన్నది అనుమానంగా ఉంది. చూసినవారు ‘ఇలాంటి’ సినిమా తీయడం సబబు అవుతుందా   కాదా అన్నది ఆలోచించి స్పందించాల్సిందిగా కోరుతూ….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here