తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు -3: అంపశయ్య నవీన్ తొలినాటి కథలు

    3
    3

    [box type=’note’ fontsize=’16’] రెక్కాడితే కాని డొక్కాడని బీదజనుల బ్రతుకులు, వెట్టిచాకిరితో అణగారిపోయే బడుగుజీవులు, మధ్య తరగతి మనస్తత్వాలను వివరించిన నవీన్ తన కథలలో చిత్రించారని “అంపశయ్య నవీన్ తొలినాటి కథలు” వ్యాసంలో వివరిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]

    [dropcap]తొ[/dropcap]లి తెలుగు చైతన్యస్రవంతి నవల “అంపశయ్య”తో నవీన్, తెలుగు నవలా సాహిత్యంలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. ఆ నవల సాధించిన విజయంతో, నవల పేరే ఇంటి పేరుగా మారి “అంపశయ్య నవీన్“గా స్థిరపడిన అతని అసలు పేరు డొంగరి మల్లయ్య. నవీన్ అనే కలం పేరు పెట్టుకున్న డి. మల్లయ్య వరంగల జిల్లా పాలపర్తి మండలం వావిలాల గ్రామానికి చెందినవారు. ఆయన 1941 డిసెంబర్ 24న ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. నల్గొండ జిల్లాలో ప్రాథమిక విద్యాభ్యాసం, వరంగల్ జిల్లాలో ఉన్నత పాఠశాల విద్య నుండి డిగ్రీ వరకూ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎం.ఎ ఎకనామిక్స్ పూర్తి చేసి 1964లో నల్గొండ కాలేజీలో లెక్చరర్‌గా చేరారు. ముప్ఫై ఒక సంవత్సరాలు వివిధ డిగ్రీ కళాశాలల్లో పని చేసి చివరకు 1996లో వరంగల్ పింగళి మహిళా కళాశాల ప్రిన్సిపల్‌గా రిటైర్ అయ్యారు.

    నవలాకారుడిగా ప్రసిద్ధి చెందిన నవీన్ ‘అంపశయ్య’, ‘ముళ్ళపొదలు’, ‘అంతస్స్రవంతి’ అనే మూడు నవలలని ఒకదానికొకటి కొనసాగింపుగా చైతన్యస్రవంతి శిల్పంలో రాశారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు జరిగిన ప్రభుత్వ దురాగతాలను చిత్రిస్తూ ‘చీకటి రోజులు’ నవల రాశారు. యాభై సంవత్సరాల తెలంగాణ సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక చరిత్రను చిత్రిస్తూ ‘కాలరేఖలు’, ‘చెదిరిన స్వప్నాలు’, ‘బాంధవ్యాలు’ అనే నవల్ని రచించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ అనే ఆర్థిక విధానాల కారణంగా ఉత్పన్నమైన పరిణామాలను చిత్రీకరిస్తూ ‘ఏ వెల్గులకీ ప్రస్థానం’ అనే నవలను రాశారు. వస్తురీత్యా, శిల్పరీత్యా విభిన్నమైన ఇతివృత్తాలతో మొత్తం 31 నవలలు రాశారు. ఇవి కాకుండా ఐదు కథా సంపుటాలు, మూడు సాహిత్య విమర్శా గ్రంథాలు, ఒక స్వవిమర్శా గ్రంథం, కాలమ్, వ్యాసాలతో కూడిన సంపుటి కూడా వెలువరించారు.

    నవీన్ 1958 నుండే – అంటే విద్యార్థి దశ నుండే కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. వీరు తొలిదశలో (1965-71) రాసిన కథలన్నింటిని కలిపి విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారు 1975లోనే “లైఫ్ ఇన్ ఎ కాలేజ్” పేరిట కథాసంకలనాన్ని ప్రచురించారు. ఇందులోని కథల్లో నవీన్ విద్యార్థి జీవితంలోని స్వేచ్ఛను, విశృంఖలత్వాన్ని, ప్రణయోద్వేగాలను అద్భుతంగా చిత్రీకరించారు. రెక్కాడితే కాని డొక్కాడని బీదజనుల బ్రతుకులు, వెట్టిచాకిరితో అణగారిపోయే బడుగుజీవులు, మధ్య తరగతి మనస్తత్వాలను వివరించిన కథలున్నాయి. గ్రామాల్లో నక్సలైట్ల ప్రభావం, అది తెచ్చిన మార్పులతో పాటు అమాయకుల బలిదానాన్ని చిత్రించిన కథలు కూడా ఉన్నాయి.

    రాజకీయాలు చేస్తూ, చదువు చెప్పడం మానేసి ట్యూషన్లు చెబుతూ, తన దగ్గర చదివే విద్యార్థులు ఉత్తీర్ణులవడానికి చేయాల్సిన అడ్డమైన పనులన్నింటిని చేసే రామచంద్రయ్య లాంటి ట్యూషన్ మేస్టార్లు ఉపాధ్యాయ వృత్తికే కళంకం. మంచిగా చదువుకునే తన భవిష్యత్త్తును తీసుకొని పోయి వారి చేతిలో పెట్టిన తండ్రి మీద కోపంతో, ఇంట్లో వుండలేక, డబ్బు దొంగిలించి స్వేచ్ఛ కోసం పారిపోయిన కొడుకు “ట్యూషన్ మాస్టర్“లో కనిపిస్తాడు. స్కూల్ జీవితం నుంచి ఒక్కసారిగా కాలేజ్ లోకి అడుగుపెట్టగానే బోలెడంత స్వేచ్ఛ. ఎలాంటి ఆంక్షలు – నిర్బంధాలు వుండవు. కో-ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఆ ఆనందం, హంగామా వేరు. అల్లరి, వేళాకోళాలు, ఏడిపించడాలు ముఖ్యమై చదువుకోవడం వెనకబడుతుంది. అమ్మాయిల్ని ఆకర్షించాలనీ, ఆకర్షింపబడాలనీ చేసే ప్రయత్నంలో జరిపే ఆధిపత్య పోరాటాలు అటు స్టాఫ్‌కు, ఇటు స్టూడెంట్స్‌కు ఇబ్బందులు తెచ్చిపెడతాయి. రౌడీలా తయారై రౌడీయిజంతో అందర్నీ హడలగొట్టి హీరోలా వెలిగిపోవాలనుకున్న సురేందర్, తన తొందరపాటు చర్యలతో ఏకాకిగా మిగిలి కాలేజ్ నుండి వెళ్ళగొట్టబడతాడు. యాభై ఏళ్ళ క్రితం రాసిన ‘లైఫ్ ఇన్ ఎ కాలేజ్‘ కథలోని పరిస్థితులతో పోల్చి చూస్తే, ఇప్పటి పరిస్థితులు ఇంకా దిగజారిపోయాయనే చెప్పాలి.

    యవ్వన ప్రాయంలో యువకులలో పొడచూపే చిలిపి ఊహలు, ప్రణయోద్వేగాలు, వారిని కలల లోకంలో విహరింపజేస్తాయి. వాటిని నిజం చేసుకోడానికి ప్రయత్నించి భంగపడడం, వాస్తవ పరిస్థితులు వారిని నేల మీదకి తీసుకురావడంతో వారు బోలెడు నిరుత్సాహపడడాన్ని ‘టెక్నికల‘లో అద్భుతంగా చూపారు. ఒక సాయంకాలం వేళ ఓ కాలేజీ స్టూడెంట్, సిటీలో రోడ్డు వెంట వెళుతున్నప్పుడు మనస్సులో అవిచ్ఛిన్నంగా వచ్చే భావధారను ‘అథోలోకం‘ కథలో చూడవచ్చు. బుద్ధి వారిస్తుంటే మనస్సు వాంఛించే ఘర్షణలో, మనస్సే జయించి డామినేట్ చేస్తే మనిషి ‘అథోలోకం‘లో పడిపోతాడని ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథలో వస్తువు కన్నా చైతన్యస్రవంతి పద్ధతికే ప్రాధాన్యత నివ్వబడింది. చైత్యనస్రవంతి కథలకు ఇది ఒక నమూనాలా రచయితగా ఉపయోగించుకున్నారు.

    తీరిన కోరిక‘ కథలో అందమైన కలలతో, ఆధిపత్య భావంతో ఊహా ప్రపంచంలో బతికే భర్త. ప్రాక్టికల్‌గా ఆలోచించే భార్య. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని చక్కదిద్దుకునే క్రమంలో భార్యను అపార్థం చేసుకున్న భర్త నిజం తెలిసి తలవంచుకోక తప్పదు. ఆధిక్యతా భావంతో ప్రవర్తించే భర్త ఈ కథలో కనిపిస్తే, ఆత్మన్యూనతతో బాధపడే భర్త ‘రెండో పెళ్ళి‘లో కనిపిస్తాడు. ఇందులో ఒకప్పుడు తన పంచన బ్రతికిన శంకర్రావు, తన దయా దాక్షిణ్యాల మీద చదువుకున్న శంకర్రావు, ఒక ధనవంతుల కుమార్తెను ప్రేమించి పెళ్ళి చేసుకుని – తన ఆఫీసులోనే తనకు బాస్‌గా వస్తాడు. వాడు, భార్య పుట్టిన రోజు ఫంక్షన్‍కు పిలిస్తే వెళ్ళగా, అక్కడ గుమిగూడిన ధనిక వర్గాల వాళ్ళు ఎవరూ ఇతడ్ని పట్టించుకోరు, సరికదా అవమానం పాలవుతాడు. దీనికంతా కారణం అతడికి అదృష్టం భార్య రూపంలో వచ్చింది. తనేమో ఆశలు, ఆశయాలు పేరిట డబ్బున్నవాళ్ళను కాదని ఏరి కోరి పేదింటి అమ్మాయిని చేసుకున్నాడు. దారిలో వస్తుండగా ఒక పెండ్లి ఊరేగింపు అడ్దమవుతుంది. భార్య చనిపోగా పెద్ద కట్నంతో మళ్ళీ పెళ్ళి చేసుకుని వస్తున్నాడని తెలుస్తుంది. దాంతో శ్రీనివాసరావు తన భార్య కూడా చనిపోతే, ఈసారి ఆశయాలను పక్కనబెట్టి భారీ కట్నం ఇచ్చే అమ్మాయిని ‘రెండో పెళ్ళి‘ చేసుకోవాలనుకుంటాడు. దాంతో అతడి భార్య సుశీల మీద విసుగు, కోపం మొదలవుతాయి. తాను తల్లిని కాబోతున్నానని సుశీల చెబుతుంది. ఆమె చనిపోవాలని సరియైన వైద్య సహాయం కూడా చేయించడు. భర్తలోని మార్పును గమనించిన సుశీల తాను అతనికి సరియైన జంటను కాదనీ, అతడ్ని మళ్ళీ పెళ్ళి చేసుకోమని చెబుతుంది. చివరకు ఆమె ప్రసవ సమయంలో ఆస్పత్రిలో సీరియస్‌గా వుంటే, అది చూసి రియలైజ్ అయిన శ్రీనివాసరావు భోరున ఏడ్చి ఆమెకు క్షమాపణ చెప్పుకుంటాడు. కాన్పు జరిగి తల్లీ, బిడ్డా క్షేమంగా వున్నారని తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు.

    ఆత్యన్యూనతతో పాటు గిల్టీ ఫీలింగ్ కూడా తోడయితే అది ‘హత్య‘ కథలా రూపుదాలుస్తుంది. ఇందులో రెవెన్యూ ఆఫీసులో గుమాస్తాగా పనిచేసే గురవయ్య, స్వభావరీత్యా మందకోడితనంతో వుంటాడు. ఎంతో మంది ఆఫీసర్లు ఆయనను మార్చాలని ప్రయత్నించి విఫలమవుతారు. కృష్ణమూర్తి అనే ఆఫీసర్ మాత్రం అనేకసార్లు మందలించి, చివరకు సస్పెండ్ చేస్తాడు. దాంతో కోపగించిన గురవయ్య ఆఫీసర్‌ను చంపేయాలనుకుని గుడ్డలతో బొమ్మను చేసి గుండు సూదులు గుచ్చి గోతిలో పూడ్చేసి చంపాననుకొని ఆనందంగా గాలి పీల్చుకుంటాడు. మరునాడు ఆఫీసరు అనుకోకుండా గుండెపోటుతో మరణిస్తే తను చేసిన చేతబడివల్లే చనిపోయాడనుకుని తానే చంపేసినట్లు అందరికీ చెబుతాడు. ఎవరూ నమ్మకపోయేసరికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి ఆఫీసర్‌ను తానే చంపేసినట్లు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు నమ్మక పిచ్చివాడనుకుని వెళ్ళగొడతారు. ఆఫీసర్ చావుకు తానే కారణమన్న అపరాధ భావనతో మానసికంగా నలిగిపోయి, ఆత్యహత్య చేసుకుంటాడు.

    ఉన్నవాళ్ళు తమను తాము ప్రదర్శించుకోడానికి క్లబ్బులకు వస్తారు. మధ్యతరగతి వాళ్ళు – వాళ్ళ దృష్టిలో పడడానికి, వాళ్ళను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. కొందరికి పేకాట కాలక్షేపం కాగా, మరికొందరిని ఆ వ్యసనం ఎలా దివాళా తీయిస్తుందో ‘క్లబ్‘ కథలో చూడవచ్చు. అలాగే ప్రభుత్వోద్యోగుల బండారాన్ని కూడా ఈ కథ బయటపెడుతుంది.

    డబ్బు, అధికార మదం నిండిన దొరలు ఊళ్ళకు ఊళ్ళు తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా, వారు నోరెత్తకుండా క్రూరంగా, నిరంకుశత్వంగా ప్రవర్తించేవారు. వారు చేసే అన్యాయాలను భరించడమే తప్ప, తిరిగి ప్రశ్నించే ధైర్యం ప్రజలకు లేకుండా పోయింది. వంతులు, వెట్టిచాకిరితో వాళ్ళ జీవితాలు అణగారిపోయేవి. దొరల కన్నుపడ్డ ఏ ఆడది తప్పించుకోలేకపోయేది. దొరలే కాదు, దొరసానులు జరిపే లైంగిక హింసను ఎత్తిచూపిన కథ ‘నిప్పురవ్వలు‘. ఇంత తిండి పడేసి రోజంతా నానాచాకిరితో హింసించబదే పిచ్చిగాడు ఆ గడీలో పనిచేసే వెట్టిగాడు. తీరని కోరికలతో రగిలిపోయే దొర కూతురుకు పిచ్చిగాడు ఆటబొమ్మలా పనికివస్తాడు. అనుకోకుండా వీరిద్దర్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న రెడ్డి, తన కూతురు వ్యభిచరించింది ఎందుకు పనికిరాని పిచ్చిగాడితోనా అని ఆక్రోశించడమే ఈ కథకు కొసమెరుపు.

    బలి‘ కథలో చిన్నరైతుగా కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని భూములు సంపాదించుకున్న వీరయ్య ముక్కుసూటిగా పోయే మనిషి. ఎవర్నీ లెక్కచేయక పోవడంతో పటేల్, పట్వారీలు – చందా ఇవ్వనందుకు సుధాకర్, సోమయ్య మీద పగబడతారు. వీరయ్య బావి దగ్గర కరెంట్ షాక్ తగిలి ఇద్దరు పిల్లలు చనిపోతే, నక్సలైట్లు వచ్చి సభ పెట్టి యాభై వేలు నష్టపరిహారం ఆ కుటుంబీకులకు ఇవ్వమంటే సోమయ్య ఒప్పుకోడు. అంతలో పోలీసులు రాగా అంతా పారిపోతారు.  సోమయ్యనే పోలీసులను పిలిపించాడనీ పుకారు. ఒక అర్ధరాత్రి నక్సలైట్లు వచ్చి సోమయ్యని చంపి పోతారు. చచ్చిన తర్వాత అసలు నిజాలు తెలిసి ఊరంతా అతని మీద సానుభూతి చూపుతుంది. ‘దాడి‘ కథలో అన్నెం పున్నెం ఎరుగని బాలుడ్ని చంపేసి, తీవ్రవాదులపై జరిగిన దాడిలో ఒక తీవ్రవాది మరణించాడని పోలీసులు ప్రకటిస్తారు. అటు నక్సలైట్లు, ఇటు పోలీసుల బారిన పడి అమాయకులు కూడా చనిపోతున్నారనీ ఈ రెండు కథలు తెలియజేస్తాయి.

    ఉన్నత, మధ్యతరగతి వర్గాలే కాకుండా అట్టడుగు వర్గాల జీవితాలను కూడా నవీన్ తన కథల్లో చిత్రించగలిగారు. తన అనుభవ పరిధిలోకి వచ్చిన సమస్త విషయాలను, చూసిన ఘటనలను, సన్నివేశాలుగా, పరిచితులైన పాత్రలుగా, కల్పన చాలా తక్కువగా సామాజిక స్పృహతో నవీన్ రచనలు సాగుతుంటాయి. సంక్లిష్టమైన సమాజాన్ని, ఆ సమాజంలో ఎవరికీ అర్థం కాని మనుషుల మనస్తత్వాలను వివరంగా విశ్లేషించడం ఈ కథల్లో కనిపిస్తుంది. నవీన్ కథలన్నీ మనోవిశ్లేషణాత్మకాలే. పాత్రల మనోవిశ్లేషణకు చైతన్యస్రవంతి బాగా నప్పుతుందని గ్రహించిన నవీన్ ‘అథోలోకం’ కథను చైతన్యస్రవంతి ధోరణిలో తీర్చిదిద్దారు.

    వస్తురీత్యా, శిల్పరీత్యా వైవిధ్యాన్ని సంతరించుకున్న నవీన్ కథలు మంచి పఠనీయతా గుణాన్ని కలిగి ఉండడం విశేషం.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here