[box type=’note’ fontsize=’16’] ఎవరెంతగా ఇబ్బంది పెట్టినా ధర్మాసుపత్రులంటే సామాన్యులకు ఎందుకు ఇష్టపడతారో బాల కృష్ణ పట్నాయక్ “అమృతవర్షిణి” కవితలో వివరిస్తున్నారు. [/box]
[dropcap]ఎం[/dropcap]దుకో తెలీదు
నువ్వంటే నాకు చాలా ఇష్టం
ఎంతో మంది ఆనందానికి
అరణ్య రోదనలకు
ప్రత్యక్ష సాక్ష్యం నువ్వు
జననమైనా మరణమైనా
మాకేం సంబంధం
మా మామూలు చెల్లించనిదే
జీవి కదలడానికి వీల్లేదనే
వార్డు బాయ్‌లకు
ఎదురు చెప్పని నిర్లక్ష్యం చూస్తే
కోపమొస్తుంది
అయినా ఎందుకో నువ్వంటే ఇష్టమే
కరెన్సీ కట్టలు కనిపించనిదే
కత్తి పట్టని వైద్యులు ఓ వైపు
కాళ్లా వేళ్ళా పడి బ్రతిమాలాడే
బడుగు జీవులు మరో వైపు
శవాన్ని శీతల గదిలో ఉంచి
బేరాలు చేసే ప్రబుద్ధులు
శిశువులను అమ్మే దొంగ ముఠాలు
అవయవ దానం పేరిట
కోమా వ్యాధిగ్రస్తులను
కోసి పారేసే నరహంతకులు
చాలా మంది
నీ ముంగిటలోనే ఉన్నారు.
ఊపిరి ఆగిన దేహాలకు
రబ్బరు గొట్టాలతో
కృత్రిమ శ్వాసలందించి
అమాయకులను
మోసం చేస్తూ డబ్బులు
గుంజుకున్న ప్రభుద్ధులను
మోస్తున్నది నువ్వే
ఇన్నింటికి ప్రత్యక్ష సాక్షిగా
మౌనంగానే ఉంటావు
అయినా నువ్వుంటే నాకు ఇష్టమే.
ప్రమాదంలో మరణించిన దేహాలకు
ధనం చెల్లించనిదే
శవపంచనామా చేయని
కర్కశ వైద్యుల రాక్షసత్వం
కనిపించేది నీ గర్భంలోనే
ఇంత మంది స్వార్ధ పరులను
నీ గర్భంలో దాచుకున్న
ఓ వైద్యాలయమూ
వందల కొలది ప్రాణాలు హరించినా
కొంత మంది నవజాత శిశువులకు
ప్రాణం పోస్తున్న
అమృత వర్షిణివి నువ్వు
అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం
నీవు లేకుంటే
జన జీవన మనుగడ కష్టం.