అమృతం కురిసిన రాత్రి

0
2

[box type=’note’ fontsize=’16’] ఎంవిఆర్ ఫౌండేషన్ 2019 ఉగాది సందర్భంగా నిర్వహించిన డా. పాలకోడేటి అప్పారావు స్మారక కథానికల పోటీలో ‘ప్రచురణార్హమైన కథల’ని న్యాయనిర్ణేతలు ఎంపిక జేసిన కథ. రచన యస్.వి.కృష్ణ జయంతి. [/box]

[dropcap]ఉ[/dropcap]లిక్కిపడి కళ్ళు తెరిచింది శాంతి,

కిటికీలోంచి పిల్లతెమ్మెర వచ్చి శుభోదయంగా ఆమె వొంటిని తాకింది. వాల్ క్లాక్ వైపు చూసింది కంగారుగా… ఏడున్నర!

అప్పటికే ఇంటాబయటా బిందెల చప్పుళ్ళూ, గిన్నెలూ, నీళ్ల చప్పుళ్ళూ విన్పిస్తున్నాయి. ‘రాత్రంతా నాన్నా, అక్కా నిద్రపోయి వుండరనుకుంటా…’ అనుకుంది.

వెంటనే తనను తాను తిట్టుకుంటూ లేచి దుప్పట్లు మడతేసి, తనకెంతో ఇష్టమైన తన మడతమంచాన్ని మడిచి గోడకి వారగా నిలబెట్టింది.

‘ఇక రేపట్నుంచి ఈ వంటరిమంచంపై తనొక్కర్తీ ముడుక్కొని, ముడుచుకొని కమ్మని కలలు కంటూ పడుకొనే ఛాన్సు క్లోజ్ కాబోలు!” అనుకొని నవ్వుకుంది.

అంతలో… తండ్రి లోపలికి రావడం గమనించింది.

“లేచావా తల్లీ? ఇంకా లేవలేదేమోనని నేనే లేపుదామని వచ్చాను. మీ అమ్మ ఉంటే ఎంత బాగుండేది!” చప్పున కళ్ళు తుడుచుకున్నాడు.

గుండె మెలిపెట్టినట్లయ్యింది శాంతికి- “అక్కేం చేస్తోంది? నిన్నెందుకు పంపింది?” అక్క మీది కోపాన్ని వెళ్లగక్కింది.

“పాపం… తననేమీ అనకమ్మా! మీ అమ్మ తరువాత ఈ ఇంటికి పెద్దది తనే కదా! వేరే పనుల్లో మునిగిపోయివుందిలే! ఇంకా నేనేమైనా సాయం చెయ్యబోతూంటే వొద్దని అవతలికి పంపిస్తోంది!” అన్నాడు.

“సరే… సరే! నేనూ అదే చేస్తాను. నువ్వెళ్లి పడక్కుర్చీలో పేపరో, భగవద్గీతో చదువుకుంటూ ఉండు!” అని చెప్పి హడావుడిగా గదిలోంచి బయటకి వచ్చి పెరట్లోకి వెళ్లింది.

అక్కడ పడేసివున్న అంట్లగిన్నెల్ని తోముతూ కనిపించింది అక్క కామేశ్వరి.

“అరె…. ఏమిటక్కా నువ్ చేస్తోందీ? నాకు చెప్పకూడదా ఆ పని? మీ ఇంట్లోనే చేయవు కదా ఇలాంటి పనులు? నీ అదృష్టం బాగుండి పెద్ద ఆఫీసరైన బావగారు, రత్నాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఏ బాదరబందీ లేని సంసారం, మంచి ఉన్నత స్థితి, ఇద్దరు పనిమనుషులు… అమ్మ బతికున్నప్పుడు నిన్ను తలచుకుంటూనే ఎన్నిసార్లు దిష్టి తీసేదో?! అలాంటి నువ్వు నా పెళ్ళి కోసం వచ్చి ఈ అంట్ల పనులూ, మురికిపనులూ చేస్తున్నావా?” అంది గుండె చివుక్కుమంటూండగా,

తేలిగ్గా నవ్వేసింది. కామేశ్వరి- “ఏమే శాంతా… నీకు గుర్తుందా – చిన్నప్పుడు ఇద్దరం రోజూ పోట్లాడుకునేవాళ్ళం… గిన్నెలు నేను తోమనంటే నేను తోమనని! ఆలోగా అమ్మే ఇలాంటి పనులన్నీ చేసుకునేది. ‘కనీసం పెద్దయి, పెళ్ళిళ్ళు చేసుకొని అత్తారిళ్లకి వెళ్లిన తర్వాతైనా అచ్చట్లూ, ముచ్చట్లకీ ఒకరికొకరు సాయం చేసుకోండే పనిదొంగల్లారా’ అని తిట్టేది. అమ్మ ఉన్నంతకాలం తన మాటల విలువ తెలియలేదు. అందుకే!” అంది వేరే ధ్యాసలోకి మళ్లిస్తూ.

శాంతి హృదయం ద్రవించిపోయింది- “ఎలా మర్చిపోతానక్కా? అమ్మ తిట్టినా అవి మనకి దీవెనలే కదా! అయినా… ఇంటికి అతిథిగా వచ్చిన నువ్వు ఇలాంటి పనులు చేయడం…”

శాంతి మాటలు పూర్తికాకుండానే మధ్యలో అడ్డుకొని – “తంతాను జాగ్రత్త… నన్ను అతిథి అన్నావంటే! స్వయానా నేను నీకు అక్కనే – నేను కాక ఇంకెవరు చేస్తారు నీ పనులూ, నీ ఇంటి పనులూ?!” అంది చనువుగా కసురుకుంటూ.

అక్క కోపంలోని ఆప్యాయతకి మురిసిపోయింది శాంతి – “పోనీ…. ఈలోపు కాఫీ చేసి తీసుకురానా నీకోసం?” అంది అక్కతో ప్రేమగా.

“ఊఁ…. ఆ పనిచేయి! మన చుట్టాలింకా దార్లోనే ఉన్నారంట! వాళ్ళిచ్చేసరికి కాఫీలూ, టిఫిన్లూ రెడీ చేసి ఉంచుదాం!” అంది.

గబగబా టూత్ బ్రష్ నోట్లో పెట్టుకొని కిచెన్లోకి పరిగెత్తింది శాంతి.

గిన్నెల పని కానిచ్చి, ఎవరికోసమో వెతుకుతూ ఇల్లంతా తిరగసాగింది కామేశ్వరి. “అమ్మమ్మా… అమ్మమ్మా… ఒసేఁ అమ్మమ్మా!” అరుస్తోంది.

ఎక్కడో ఇంటి బయట ఓ ప్రక్కనే వున్న పెద్దవేపచెట్టు కింద మూడంకెలా ముడుచుక్కూర్చున్న అమ్మమ్మ రాజ్యం “ఊఁ… ఏమిటమ్మా?” అంటూ ఇటు తిరిగింది.

“నువ్విక్కడ తీరిగ్గా కూర్చుంటే ఎలాగే? శాంతికి నువ్వే నలుగు పెట్టి స్నానం చేయించాలి… ఆ కట్టెలపొయ్యి వెలిగించి నీళ్లు కాగబెట్టు!” అంది.

అది విని లేని ఓపిక తెచ్చుకుంటూ లేచి నిలబడింది రాజ్యం – “ఆ… అట్టాగే తల్లీ… అగ్గిపెట్టె పంపియ్యి పిల్లగాడి చేత!” అంది.

“సరే… లేట్ చేయకు – త్వరగా కానియ్యి!” ఆదరాబాదరాగా మరో పని చేయడానికి వెళ్లింది కామేశ్వరి.

ఆ తర్వాత అమ్మ బ్రతికున్న రోజుల్లో తనతో సన్నిహితంగా మెలిగిన పక్కింటి తులసమ్మగారు కూడా వచ్చి శాంతికి పూలజడ, పట్టుచీర, గోరింటాకు, నగలు, వడ్డాణమూ అన్నీ అలంకరించి ముస్తాబుచేసింది. ఈలోగా తండ్రి చెల్లెలు లక్ష్మత్తయ్య, వీరభద్రం మావయ్యా వచ్చారు. అవాళ్ళిద్దరూ ఇప్పుడు రావడం నాలుగోసారి! అమ్మ బ్రతికున్నప్పుడు ఇద్దరూ రెండు మూడుసార్లు వచ్చారు. వచ్చినప్పుడల్లా అమ్మతో ఎంతో కలుపుగోలుగా మెలిగేవారు. మావయ్య మొదట్లో ఎవరిదో లారీలో క్లీనర్‌గా పనిచేసి, మెలమెల్లగా తన తెలివితేటలతో, వ్యాపార చమక్కులతో ఏకంగా సొంతలారీనే కొనుక్కుని లక్షాధికారి అయ్యాడు. వారికి ఇద్దరు కూతుళ్ళూ, ఒక కొడుకు! ‘వాళ్ళ కొడుకుకి మన శాంతినిచ్చి చేద్దామండీ!” అంటూ అమ్మ- నాన్నచేత అడిగించింది కూడా.

కానీ, లక్ష్మి మహా తెలివైనది. అప్పటికే పదిలక్షలిస్తామని వచ్చిన సంబంధాన్ని కుదుర్చుకుని, వాళ్ళకి మాటిచ్చి ఎవరికీ చెప్పకుండా దాచి, మొసలికన్నీరు కారుస్తూ చెప్పింది –

“మేమూ అదే అనుకున్నాం అన్నయ్యా! కానీ, ఈయనకి జాతకాల పిచ్చి! మావాడిదీ, మీ శాంతిదీ జాతకాలు చూపిస్తే కలవవని చెప్పారు. పైగా అరిష్టమట! అందుకే ఊరుకున్నాం! ఏంచేస్తాం… శాంతిని కోడలిగా అదృష్టం మాకు లేకపోయింది… ఏమీ అనుకోకండేం?!” అంది.

‘నిజమే కాబోలు’ అనుకొని ఊరుకున్నారిద్దరూ..

కానీ వాళ్ళెలాంటి వారో కామేశ్వరికీ, శాంతికీ తెలుసు. లక్ష్మత్తయ్య అన్న మాటలు నాన్న వచ్చి చెబుతూంటే- తనవైపు జాలిగా చూస్తున్న అక్కని అప్పట్లో కసిరింది శాంతి –

“సర్లేఁ… ఆ హీరోగారి కోసం తపించిపోయేవారూ, ఆయనగారు దక్కకపోతే ప్రాణత్యాగాలు చేసేవారెవరూ ఇక్కడ లేరులే! జరిగేవన్నీ మన మంచికే అనుకోవాలి. నా జీవితంలో నేను నమ్మే ఏకైక సూత్రం ఇదే!” అంటూ.

“అదీ నిజమేలే!” తనూ అంగీకరిస్తున్నట్లుగా తలూపుతూ నవ్వేసింది కామేశ్వరి.

***

“… మంచి సంబంధమేనని అనిపిస్తోంది… మంచివాళ్ళలాగే ఉన్నారు. వాళ్ళ మాటతీరు, గౌరవించడం, మర్యాదలూ… మున్ముందు ఎలాంటి ఒడిదొడుకులూ కలగకుండా జాగ్రత్త పడుతూ ఆచితూచి మాట్లాడటం… నువ్వూ నాలాగే అదృష్టవంతురాలివౌతావు!”

కామేశ్వరి అంటున్న మాటలు వింటున్న శాంతికి మళ్లీ అమ్మ గుర్తొచ్చింది. తన పెళ్ళి చూడకుండా అన్న పెళ్ళీ, అక్క పెళ్ళి జరిపించేసి, ‘ఇక నా పనైపోయింది… సెలవు తీసుకుంటున్నాను’ అన్నట్లుగా తాపీగా వెళ్లిపోయింది.

“శాంతక్కా… శాంతక్కా! పెళ్ళికొడుకు చాలా బాగున్నాడు!” పక్కింటి తులసమ్మగారి పదేళ్ల మనవరాలు పరిగెత్తుకుంటూ వచ్చి గబగబా చెప్పింది. సిగ్గుతో తల కొద్దిగా వంచుకుంది శాంతి.

కామేశ్వరి పెళ్ళికూతురి ముస్తాబులో ఉన్న చెల్లెలికి దిష్టి తీసింది.

“పెళ్ళికొడుకు బాగున్నాడు సరే… బుద్ధి బాగుంటుందో, లేదో?! ” గొణిగినట్లుగా అంది శాంతి అనుమానం వ్యక్తంచేస్తూ.

“ష్… ఊర్కో! అపశకునంలా ఏమిటా మాటలు?” వారించింది కామేశ్వరి. “ఏం… నీకనిపించలేదా పెళ్ళిచూపుల్లో?” దబాయింపుగా అడిగింది శాంతి.

“అనుకోవడం, ఊహించుకోవడం లాంటి వాటి దగ్గరికి పోలేదులేమ్మా నేనూ, మీ బావగారూ! ఏదో…. పెళ్ళిచూపుల్లోనే ఒకర్నొకరం చూసుకున్నాం, మాట్లాడుకున్నాం… అంతే! అప్పట్నుంచీ ఇప్పటి దాకా ఆయనగారి ఫిర్యాదు ఒక్కటే- ‘నీకా పేరు పెట్టిందెవరూ? ఇంకే పేరూ దొరకలేదా మీవాళ్ళకి?” అంటూ!” అంది కామేశ్వరి – తన పేరుపై తనే అయిష్టతని వ్యక్తం చేస్తూ.

ఫక్కున నవ్వింది శాంతి. కామేశ్వరి కళ్ళు ఎటో చూస్తున్నాయి. శాంతి అది గమనించింది“ఏమిటక్కా… అలా అయిపోయావ్?” అనడిగింది సీరియస్‌గా.

“వాడు రాలేదు చూశావా?” అంది- ఏదో గుర్తుచేస్తున్నట్లుగా, అర్థమైంది శాంతికి – “ఎవరూ? శీనన్నయ్యా?” అని అడిగింది.

“అన్న కాదు… అమ్మను చంపిన కిరాతకుడు?” ఆవేశంగా అంది.

“ఛ… ఈ టైములో ఏమిటా మాటలు? ఊర్కో అక్కా!” వారిస్తూ అంది శాంతి.

“బ్రతికున్నంత కాలం ఊర్కోకుండా ఉండగలిగే స్థితిని కల్పించాడే వాడు!” ఇంకా కోపంతో రగిలిపోతోందామె.

“అది వాడి తప్పు కాదు. ఆ మహాతల్లి… వాడి భార్యామణి భాగ్యలక్ష్మి తప్పు! పాపాత్మురాలు… మన అమ్మ ప్రాణాల్ని బలిగొన్నది!” తనూ కోపాన్ని ఆపుకోలేకపోయింది శాంతి.

అంతలో… హాల్లో నుంచి తులసమ్మగారి కేకలు వినిపించాయి- “కామేశ్వరీ… ఇలా రా! పంతులుగారు ఏదో కావాలంటున్నారు… అర్జంటుగా కొనుక్కురావాలట!” అంటూ,

“ఆఁ… వస్తున్నా” అంటూ బదులిచ్చి, ఇటువైపు తిరిగి- “శాంతీ… ఆ మొహాన్ని కాస్త ఫ్రెష్ గా ఉంచుకో” అని చెప్పి, బయటకి పరుగుతీసింది కామేశ్వరి.

***

పెళ్ళి పూర్తయి, అందరూ విశ్రాంతి తీసుకునే సరికి అర్ధరాత్రి రెండుగంటలైంది. అందరూ నిద్రకు ఉపక్రమించారు.

అక్క కూడా విపరీతంగా అలసిపోయి పిల్లల ప్రక్కన నడుంవాల్చి, అలాగే ఆదమరచి నిద్రలోకి జారుకుంది. బావగారు, నాన్నగారు మరోగదిలో కునుకు తీస్తున్నారు.

ఆ ఇల్లు, ప్రపంచం, ప్రకృతి అంతా నిశ్శబ్దంగా అయ్యింది. మేల్కొనివున్నది… కొత్త పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురే!

వెంకట్-శాంతి…

పెళ్ళిబట్టలు మార్చుకుని, మామూలు బట్టలు ధరించి, హాల్లో సోఫామీద ప్రక్కప్రక్కనే కూర్చున్నారిద్దరూ, ఎదురు గదిలోంచి నిద్రపోతున్న నాన్న కనిపిస్తుంటే… ఆయన్నే కన్నార్పకుండా దిగులు నిండిన తడికళ్ళతో చూస్తోంది శాంతి..

ఆమెవంకే చూస్తున్న వెంకట్ అడిగాడు- “శాంతీ! ఏమిటలా ఉన్నావ్?”

“ఏమీ లేదు…” అస్పష్టంగా అంది శాంతి.

“ఊహు… ఏదో ఉంది. ఏమిటి? నాకు చెప్పు!” అన్నాడు మృదువుగా.

“ఆడపిల్లని కదా… ఈ టైమ్‌లో అమ్మానాన్నల్ని వదిలిరావటం అనే ఆలోచనే భరించడం కష్టంగా ఉంది. మా అమ్మ గుర్తొస్తోంది… మసకబారిన బంధంలా… మాయమైన బంధనంలా… ఒంటరితనానికి సరైన అర్థం అమ్మ లేకపోవడమేనని చాలా గాఢంగా, వాస్తవంగా అన్పిస్తోంది. నిజంగా ఆ దేవుడెంత కఠినాత్ముడు?! జన్మనిచ్చి, మనస్సునిచ్చి, మమతనిచ్చి… అన్నీ ఇచ్చి… వాటిని పంచుకునే బంధాన్ని చాలా దూరం చేసి, అలా దూరమైనదాన్ని తలచుకుంటూ మనస్సు ఎంతగా ఆక్రోశిస్తుందో, హృదయం ఎంతగా వేదనతో కృశించిపోతుందో… చూస్తూ ఎంతగా ఆనందిస్తున్నాడో…” వెక్కిళ్ళ మధ్య తడబడుతూ చెప్పింది.

రెండుచేతుల్తో ఆమె భుజాల్ని పట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు వెంకట్ – “ఊరుకో శాంతీ… నీ భావాలు అర్థం చేసుకోగలను. నాకు సాధ్యమైనంతవరకు నీకెలాంటి దిగులు లేకుండా చూసుకుంటాను. సరేగానీ- మీ అమ్మగారు… అదే మా అత్తగారు పోయారని విన్నాను. ఎలా?” అన్నాడు.

ప్రతిమనిషికీ జీవితంలో గతం గుర్తుకురాక మానదేమో… కనీసం ఎప్పుడైనా… ఒక్కసారైనా! బంధాలూ- అనుబంధాలూ, మనుషుల మధ్య మమతల పొదరిళ్ళలాంటి ఆత్మీయతాలోగిళ్ళు మనసున్న మనుషుల్నీ, మమత నిండిన మనసుల్నీ ఎప్పటికీ వదలకుండా అంటిపెట్టుకొనే ఉంటాయి.

శాంతి హృదయం గతం తాలూకు జ్ఞాపకాల తలుపుల్ని తట్టి లోపలికి వెళ్లింది.

***

విశ్వనాథరావు, సత్యవతిల పెద్దకొడుకు శ్రీనివాసరావు!

వారిది రైతు కుటుంబమే… వంశపారంపర్యంగా నేలతల్లి పైనే ఆధారపడుతూ పొలం పనులు చేసుకునే సంప్రదాయం వాళ్ళది.

తండ్రి తదనంతరం ఆయన మిగిల్చివెళ్లిన ఆరెకరాల భూమిని పొలం కింద మార్చి, వచ్చే ఆదాయంతోనే కొడుకు శ్రీనివాసుని చదివించి పెద్ద ఉద్యోగం వచ్చేలా శాయశక్తులా కృషిచేశాడు విశ్వనాథరావు. ఆపై కొడుకు పెళ్ళికి, ఇంటి అవసరాలకి ఉన్న పొలాన్ని మొత్తం అమ్మేశాడు.

శ్రీనివాసరావు మాత్రం కుటుంబం గురించి తనకేం పట్టనట్టు పెళ్ళయిన వెంటనే ఉద్యోగం పేరిట భార్యను తీసుకొని బెంగుళూరుకి వెళ్లిపోయి అక్కడే స్థిరపడ్డాడు.

విశ్వనాథం దంపతులకి ఉండడానికి ఇల్లు కూడా లేకుండాపోయింది.

కొడుకు ఉన్నత స్థితి కోసమే తరతరాలుగా వారసత్వంగా వస్తున్న ఇంటిని సైతం అమ్మేశాడు. శ్రీనివాసరావుకి తన తల్లిదండ్రుల సాధకబాధకాల్ని పట్టించుకోకుండా చేసింది అతని భార్య భాగ్యలక్ష్మి, అతడిని అదుపాజ్ఞలలో పెట్టుకొని అతడు తల్లిదండ్రుల ఊసే ఎత్తకుండా కట్టడి చేసింది భర్తని.

ఇక చేసేదిలేక విశ్వనాథం దంపతులు కూలినాలి చేసి ఇద్దరాడపిల్లల్ని పోషించుకోసాగారు.

ఒక రోజు హఠాత్తుగా ఊడిపడ్డాడు శ్రీనివాసరావు. వాళ్ళు ఉంటున్న ఊళ్లోనే ఓ రెండొందల గజాల స్థలం కొని, అందులో ఇల్లు కట్టమని చెప్పి వెళ్లిపోయాడు.

ఇంకేముందీ? ‘ఇలాగైనా ఓ సొంతగూడు దొరుకుతుంది కదా…’ అని ఆశపడి, ఆ దంపతు లిద్దరే కూలివాళ్ళని పిలవకుండా రాళ్ళూరప్పలూ, ఇసుక, ఇటుకలు మోయడం దగ్గర్నుంచి సిమెంటు, ప్లాస్టరింగ్ దాకా దాదాపు అన్ని పనులూ తామే చేశారు.

సత్యవతమ్మకి ఆ సమయంలో ఓసారి గుండెపోటు కూడా వచ్చింది. ఇల్లంతా పూర్తయి, గృహప్రవేశం దగ్గరికొచ్చాక అసలు విషయం బయటపడింది. ఆ ఇంటిని అప్పటికే వేరేవాళ్ళెవరికో అద్దెకిచ్చినట్లుగా చెప్పి, అద్దెకొచ్చినవాళ్ళని ఆ కొత్తింట్లో దింపి వెళ్లిపోయారు కొడుకూ, కోడలు.

అంతే… ఆ తల్లి గుండె అక్కడితో ఆగిపోయింది!

“ఇప్పుడు నాన్న… ఒంటరివాడు! ఇంతకాలం నేను తన దగ్గరుండి వేళకింత తినిపించి, సమయానికి గుర్తుచేసి మందులు ఇచ్చేదాన్ని. ఇక రేపట్నుంచి… నాన్నని… ఎవరు చూసుకుం..” దుఃఖంతో గొంతు పూడుకుపోయేసరికి- మాట వెలికిరాక లోలోపలే వెక్కిళ్ళు పడసాగింది శాంతి.

అప్పటికే అత్తమామల కథవిన్న వెంకట్ కి మనసు ద్రవించింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా ఆమె భుజం చుట్టూ చేయివేసి దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు –

“నీ మనసుని ఇక్కడే వదిలేసి, నిన్ను మాత్రమే నాతో తీసుకెళ్లలేను శాంతీ! మావయ్యను కూడా మనతో పాటే వచ్చేయమను. ఈ వయసులో తనకో మంచినేస్తం దొరికాడని మా నాన్నగారు కూడా ఆనందిస్తారు. సరేనా… ఇప్పుడు నీకు సంతోషమేనా?”

ఆ మాటలు వింటూనే- తలెత్తి అతడి కళ్ళలోకి నమ్మలేనట్లుగా చూస్తూ “నిజంగానా?” అంది. ‘నిజమే…’ నన్నట్లుగా ఓసారి కనురెప్పలు బలంగా మూసి తెరిచి, చిరునవ్వుతో చూశాడు.

అంతే… కళ్ళలోంచి ఆనందబాష్పాలు జలజలా రాలుతూండగా… ఆనందాన్ని అదుపు చేసుకోలేక అమాంతం అతడి మెడచుట్టూ చేతులు బిగించి గట్టిగా అల్లుకుపోయింది శాంతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here