Site icon Sanchika

అమృతమ్మ

[dropcap]గ[/dropcap]ప్పటి ‘అమృతమ్మ’ – పెండ్లిగాక మునుపటి కన్నె అమృతమ్మ – సిలకు లంగ, జాకిట్లల్ల – కెంపుసెంపల మొగిలిరేకు – సిగ్గుతోడ ఎర్రబడ్డ బుగ్గలదే అందము – లేత మందారపు పువ్వుల వారం….

గా తరువాత ఎదిగిన అమృతమ్మ. పెండ్లైన అమృతమ్మ… పెళ్ళిచేసుకుని, యిల్లు చూసుకుని హాయిగ కాలం గడపాలోయ్, అన్నట్టుగ మా సాగింది సంసారం…. గప్పటి అమృతమ్మ – హిమగిరి సొగసులు… అడుగడుగున ఆడే లే నడము సొంపులు… సడిసేయక వూరించే వయ్యారపు వంపులు. ఘుమఘుమ పూవులు సిగలోన, సొగసులు మోమును ముడుసుకుని…. ముఖముపైన ముసురుకున్న ముంగురులే అందము… వంగి బావిలో చేదుతు వుంటే వంపులు సొంపులు చూడాలి… తొడల మెరుపు, మోవి తోరంపు కుచములు, ఓరకొప్పుగలుగుయువిద….

గా తరువాత పిల్లగండ్ల తల్లి… ఒగ బిడ్డె, ఒగ కొడుకు.. ఎవనికెట్టులగునొ ఎవ్వడెరుంగును? జరిగేది తెలియదు… కాలం మాటేసింది… అమృతమ్మ బతుకుల కాటేసింది… క్షణములోని బ్రతుకు సంసార విభ్రాంతి… పిల్లగండ్లు సిన్నగున్నప్పుడే అమృతమ్మ మొగడు సచ్చిపొయ్యిండు – కాలంగాని కాలంలనే కాలం జేసిండు… యిరువైలల్లనే వున్న అమృతమ్మని అరవైలల్ల పడేసిండు… సిగపూవు వాడకనే చెలిబ్రతుకు మాడెనయా… వలపువిందు చవిచూడక ముందే కలచి వేసితివి బ్రతుకుకథ…. కూలినప్పుడరయ కుసులెల్ల విరుగును అన్నసువంటి మంచమైంది అమృతమ్మ బతుకు… కల్లోల పవనాలు, గరళాల జడివానలు… పెనుకున్న చీకట్లు తెలవారునా?… పగలైనా రేయైనా ఎడారిలో ఒకటేగా…

మొగడు పొయ్యిన అమృతమ్మ, మొగడులేని అమృతమ్మ – మొగడు యిడ్సిపొయ్యిన పిల్లగండ్లు తను. నిప్పులు మింగి… మొగడులేని అత్తగారింట్ల… ఘటము పోవు వెనుక గగనంబు పోవునా? మొగడు పొయ్యిండు గని, పిల్లగండ్లు, తను – బతికి వున్నరు గద! బతుకాలెగద… బ్రతుకంత బాధగా… సాగేను జీవిత నావ…

అత్త-మాములు, ఎందరున్నాగూడ, తనకునైనవాడు తానొక్కడేయగున్ అన్నట్టుగానే గా బతుకులు… తను, పిల్లగండ్లు, బతుకులు – బతుకాలె… మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖముచెందు అన్నడు తత్త్వం జెప్పినోడు… గని, తన బతుకు మట్టుకు మొగడులేని కాలపుదే… యింకింత రవుసుల బతుకే… సుతుల కాలంలనన్న సుకపడ్తదో లేదోగని, గదీనికి ముందు, గా సుతులని పెంచి పెద్దజెయ్యాలెగద…

పేదవాని బాధ పెనుభూతమైయుండు… అమృతమ్మ సూదరోళ్ళ కులంల పుట్టింది గాదు. సూదరోళ్ళ కులంలనన్న పుట్టివుంటె, పిల్లగండ్లు సిన్నోళ్ళు, తను లేతవైసుది గావట్టి తనకు తగ్గ యింకో మొగన్ని జేసుకోని వుండేటిదేమో – గని, తను సూదరోళ్ళకన్న ఎక్కోకులంది గావట్టి, గీ కులాల మొగడు వోతె – పిల్లగండ్లు పుట్టనిదానికి గూడ, ‘పెద్దమనిషి’ గాని దానికి గూడ మళ్ళీ పెండ్లి వుండది. సచ్చేదనుక ముండమోసేవుండాలె… గసుంటప్పుడు తను పిల్లగండ్ల తల్లి…. యింకోపెండ్లి, బతుకు ఏడవుంటయి?…

బతుకాలె – పిల్లగండ్లకోసం – పిల్లగండ్లతోటి. బతుకుటానికి బువ్వ గావాలె… బువ్వ రావాల్నంటే పనులుజెయ్యాలె… తను ఏం పనిజేసి బతుకుతది? ఏం పనులస్తయి? కైకిలి జెయ్యచ్చిన పుట్టుక కాదాయె… గని, బతుకాలె… బతుకుటానికి బువ్వ రావాలె… బువ్వ రావాల్నంటె ఏదన్నా పనిజెయ్యాలె… ఏం పని సెయ్యకాల్తది తను?… గతిని బట్టి మనుజు మతియునొప్పు… కాలకర్మగతుల కనిపెట్టవలెనయా… బలిమిలేని వేళ పంతముల్ జెల్లవు… తనకు రానిపనులు ఎట్ల సేతనైతయి? సేతనైన పనులె సెయ్యజాల్తది గని… సాగిపారకున్న సమకూరదొక్కటి…. వెరవక మును వెనుక జూచి వెదకుము… ఆకటికి తొలంగు ఆచార విధులెల్ల… గీ గీ పనులేజెయ్యాలె… గీ పనులు జెయ్యద్దు అని మా అంటరు, గని, గాళ్ళు సెయ్యిమన్న పనులు తనకు సేతగావు గదమరి. గసుంటప్పుడు ఎట్ల బతుకుతది? చెప్పవచ్చు పనులు చేయుటే కష్టంబు… సెప్పెటారెళ్ళ నాలుకలకు బొక్కలున్నయా? ఏదన్నా జెప్పుతరు… నిండవున్నోళ్ళు ఏదన్న మాట్లాడతరు… నీళ్ళళ్ళ మునుక్కుంట తపిస్తున్నాని గోస ఒడ్డుమీద గూకోని సూత్తున్నొనికి తెలుస్తదా? ఎండల మాడుతున్నోని గోస నీడల గూకున్నోనికి ఎరుకైతదా? పెట్టిపోయలేని బీరముల్ వ్యర్థముల్… ఆళ్ళు మా సెప్పవస్తుంటరు గన్ని తన తిప్పల్లని ఆరుస్తరా, తీరుస్తరా? కాని పనులు జేయ ఘనులాస పడుదురా అని, మా అంటరు. గని, గా కాని పనులు అన్నసుంటివాటినే సర్కార్లు జేస్తలెవ్వా? సర్కార్లు జేస్తెనేమో గా పని మంచిదైతది గంతే సేతనైన తను గా పని సాటుకో, నేటుకో జేస్తె తప్పైతదా? ‘కానూను’ కండ్లకు గది తప్పైతే అయ్యింది గదీంతోటి తనకేంటిది? తను సెయ్యజాలిన పని గదే, గదాన్నే జేస్తది – తప్పేగానియ్యి… అన్ని వున్నోళ్ళు జెయ్యంగ లేనిది, గా పనిని ఏంలేని తను, బతుకుటానికి జేస్తె తప్పా? తప్పుదారులబోక ఒప్పుగా మెలగుడీ అన్నమాటలు నిండినోళ్ళ మాటలన్నగావాలె, ఏం తెలువనోళ్ళ మాటలన్నీ గావాలె. ఏది తప్పు? గా తప్పుల తడుకలతోటి తన బతుక్కేం సమందం? తన పిల్లగండ్లు బతుకాలె – గందుకు తను గూడ బతుకాలె. గా బతుకుటానికి తనకు సేతనైన పనిని జేసుకోవాలె. తనకు సేతనైన పనిగిదే, గదన్నే జేస్తది… అన్ని వున్నోళ్ళు ఎంతమందో జేస్తున్నరు, గట్లనే ఏం లేని తను గూడ… వాదు చేయువారు వర్ణింపజాలరు…

అమృతమ్మ తన పిల్లగండ్లని బతికిచ్చుకునుటానికి, తను బతుకుటానికి, తను సెయ్యజాలిన, సేతనైన తొవ్వనందుకున్నది. గది, నల్లగల్లుని సాటుకు అమ్ముడు… ఇప్పసారని దొంగతనంగ అమ్ముకుంటనే బతుకు ఎల్లదీయవట్టింది… సాగేను జీవితనావ….

అమృతమ్మ పిల్లగండ్లు పెద్దగైండ్రు, పెండ్లిళ్ళు జేసింది. పిల్లగండ్లకు పిల్లగండ్లుగూడ పుట్టిండ్రు… గని గాళ్ళ బతుకులు గాళ్ళకే జాలయి…. అమృతమ్మకు తన బతుకు తనదే – సుతుల కాలంల గూడ…

గప్పటి అమృతమ్మ పెయ్యి రంగు – నిమ్మపండు నిగనిగలదైతే, గిప్పటి అమృతమ్మ రంగు మాడిన బీరపువ్వు రంగుకు తేలింది… గప్పటి అమృతమ్మ మొగిలిరేకులు సొగసులదైతే, గిప్పటి అమృతమ్మ చింత మొదలు వారం… గప్పటికి గిప్పటికి అమృతమ్మ రంగు, రుచి, వాసనలల్ల అన్నీ పరకులే. గని, కాలంమారినా, వయసు ముదిరినా – అమృతమ్మ గిప్పుడుగూడ సుంగారంగనే వున్నది. రంగు, రుచి, వాసనలల్ల ఎంత మారినా గూడ… గప్పుడు పచ్చిది, గిప్పుడు ఎండిది  గని, గదే కజ్జూరపు పండు రుసుల సుంగారం….

అమృతమ్మ గిప్పుడు – మనిషి – ఆడిది, సార దాగి వున్న వాసన… తాగివున్న మనిషి – మాట తీరుల… మరిది వరుస పిల్లగాన్ని సెయ్యి వట్టి దగ్గెరికి గుంజుకోని పక్కకు కూకోవెట్టుకున్నది. కండ్లు రిమ్మెక్కివున్నాయి. నోట్లె పాను, ఎరుపు…

ఆడిది – తను తాగి వున్నదన్న బెదురుగిట్ట ఏం లెవ్వు మనిసిల… రుచిరముగను జూడ అచలమై దోచురా అన్నట్టుగ… అవును మరి, అందరాడోళ్ళు మొగనాలులు… తనేమో (గిం)లల్లనే మొగడు పొయ్యినసువంటి – గిప్పుడు నడివైసు ఆడిది… మొగని తోడు లేని తన బతుకుల తోడు యిగ ఏది? గీ సారనే…. తన బతుకే ఏరాయె… దారే ఏరాయె… మొగడు పొయ్యిన ఆడిది, మొగోనివారం బతుకవట్టింది. అదుర వద్దు, బెదుర వద్దు – బతుకే హద్దు… అందరాడోళ్ళ బతుకులు పుట్టలోన తేనె పుట్టినయట్లును, గట్టుమీద మణియు పుట్టినట్టు అన్నసుంటియి…. గాళ్ళ బతుకులు అరిటిమొదళ్ళు అసుంటాయి అయితే, తన బతుకు తుమ్మమొదలు… అందరాడోళ్ళు మొగని సాటు ఆడోళ్ళైతే తను మొగోని వాసనలేని ఆడిది…. గా జాగల గీ సారవాసన, మొగోనిమత్తుకు బదలుగ గీ సార రిమ్మ… మొగని తోడుకు బదలుగ గీ తాగుడె తన బతుకుల తోడు…

తన ఆడి బతుకు గింతే, (20)ల నుంచి (60) ల దనుక, బతికినంత కాలంల, బతుకంతల….

అయ్య, అవ్వ పాపం తనకు సావు వుండద్దని అమృతపు పేరుని ఏరిఏరి పెట్టిండ్రు… తనకు సావు లేకుంట పొయ్యింది గాని, తన మొగనికి మట్టుకు బతుకు లేకుంట పొయ్యింది… ఆడిదాని బతుకుల అమృతం ఆసుంటి ఐదోతనం తనకు లేకుంట పొయ్యింది. తను, పిల్లగండ్లు సావకుంట బతికిచ్చింది గా అమృతం అయ్యింది గీ సారనే… తను యింక గూడ బతుకుతున్నది గీ సార అమృతం మూలంగనే…

Exit mobile version