[శ్రీ గొర్రెపాటి శ్రీను రచించిన ‘అమృతమూర్తులు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]న[/dropcap]వమాసాలు మోసి జన్మనిచ్చి
ఆప్యాయతకు నిలువెత్తు రూపమై
ప్రేమ స్వరూపమై
ఇలలో దేవతలా కాపాడుతుంది అమ్మ!
తన ఊపిరి ఉన్నంతవరకు
బిడ్డల అభ్యున్నతే ధ్యేయంగా
కృషి చేసే మహోన్నతుడు నాన్న!
ప్రేమానురాగాలకు అర్థం అమ్మానాన్నలు!
నీకే చిరు కష్టం ఎదురైనా తల్లడిల్లుతూ..
నువ్వు కోలుకోవాలని
తిరిగి శక్తివంతుడవై
సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని
ఉన్నతంగా ఎదగాలని
సదా తపించే నీ హితకారులు అమ్మానాన్నలు!
నీ చేయి పట్టుకొని నడిపించిన
వారి హృదయాలు వృద్దాప్యంలో కష్ట పెట్టకు!
తమ ఆకలిదప్పికలు సైతం మర్చిపోయి..
నీ అవసరాలు తీర్చిన వారి మంచితనాన్ని గుర్తుంచుకుని
పెద్దవాళ్ళు పట్ల వినయవిధేయతలతో మసలుకో!
దైవాన్ని దర్శించడమంటే
ప్రత్యక్షంగా తల్లిదండ్రులకు సేవ చేయడమే అని తెలుసుకో!