రంగుల హేల 43: అనారోగ్యాలూ – అతి జాగ్రత్తలూ

11
2

[box type=’note’ fontsize=’16’] “జీవితమంటే శరీరాన్ని వెంటాడే అనారోగ్య రక్కసులతో మనం అనుదినం చేసే యుద్ధమే అనుకుంటే మన పోరాట పటిమ పెరుగుతుంది” అని అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల’ కాలమ్‌లో. [/box]

[dropcap]యు[/dropcap]గధర్మాలని కొన్నుంటాయి. అవి ఆ యుగానికి సరిపోయేవి. ఆ ధర్మాలు తెచ్చి ఇప్పుడు పాటించరాదు. ఒకప్పుడు రాజులు ఒకరినొకరు పలకరించుకునేప్పుడు “మీ రాజ్యం సుభిక్షంగా ఉందా? ప్రజలంతా ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారా? మీ రాజవంశమున ఎల్లరూ సౌఖ్యమే కదా?” అనడిగేవారు. అది మర్యాద, పద్ధతి.

కలియుగంలో, ప్రస్తుత కాలంలో మర్యాదలు మారాయి. ఏవో ప్రసార మాధ్యమాల్లో పురాణకథలు వింటూ మనమూ అలా ఆదర్శంగా ఉందామని అత్యాశపడి ప్రవర్తించారంటే అయిపోయామన్నమాటే. ఈ రోజుల్లో ఎవరినన్నా పలకరించాలంటే బహు మెలుకువగా మాట్లాడాలి. గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పెద్దవాళ్ళు కనబడగానే వంగి కాళ్ళకి నమస్కారం చేసేసి, ఆ పైన వాళ్ళ చేతులు పట్టుకుని “మీ ఒంట్లో ఎలా ఉంటోందీ” అని మొహంలో మొహంపెట్టి అడగకూడదు. అడిగారా, ఆ రాత్రి మీకు మీరే చిన్న డాక్టర్‌గా మరి తలనొప్పి బిళ్ళ, ఒళ్ళునెప్పుల బిళ్ళ, మెడ నొప్పుల బిళ్ళ వేసుకుని తలకి గుడ్డ కట్టుకుని పడుకోవలసి వస్తుంది. అయినా నిద్రపడుతుందని నేను గ్యారంటీ ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళు చెప్పిన అనారోగ్య జబ్బుల ఆడియో సీడీ ఆగకుండా మళ్ళీ, మళ్ళీ మీ తలలో తిరుగుతూ ఉంటుంది.

ఈ రోజుల్లో ప్రజలకి నలభై ఏళ్లవయసు నుండి తొంభై వరకూ అందరికీ ఆరోగ్య సమస్యలే. చిత్ర విచిత్ర లైఫ్ స్టైల్ జబ్బులే. కంప్యూటర్ ముందు ఉద్యోగాలు చేసేవాళ్ళకి వీపు నొప్పులూ, ఇంట్లో గరిటె పట్టి వంటలు చేసే అమ్మలకి కిచెన్ వర్క్‌తో జబ్బల, నడుముల నొప్పులూ, ఎక్కువ టీవీ ముందు సోఫాలో కూర్చుని కష్టపడేవాళ్ళకి పొట్ట పెరిగి ఆయాసం, రోడ్లమ్మట బైక్‌పై తిరిగే మెడికల్ రిప్రజంటేటివ్ లాంటి ఉద్యోగస్తులకు తిరుగుడు వల్ల స్పాండిలైటిస్ వస్తున్నాయి.

తమ సాఫ్ట్‌వేర్ కూతుళ్ళ శ్రమ వేలకువేల జీతంగా మారుతున్నవేళ, వాళ్ళు ఎవరికోసమూ కష్టపడి తమ ఎముకలను అరగ్గొట్టుకోకూడదని మదర్ ఇండియాల తీర్మానం! అత్తింటి వాళ్ళని ఆమడ దూరం పెట్టెయ్యమని ఆ తల్లుల జ్ఞాన బోధ. ఎటునుంచి ఎటొచ్చినా కిచెన్‌లో దూరి వళ్ళు నలిగేలా వంటలు చెయ్యొద్దని, ఒకసారి వచ్చిన చుట్టాలు మళ్ళీ రాకుండా ముందస్తు జాగ్రత్తగా అనేక సూచనలూ, సలహాలూ ఉంటున్నాయి. అందుకు 24 గంటల వాట్సాప్‌లు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. అందుకే నేటికాలం కోడళ్ళు బంధువులు రాగానే భోజనాలు, బిర్యానీలు ఆర్డర్ పెట్టడానికి అనువుగా ఫోన్ నెంబర్లు మొబైల్‌లో పెట్టుకుంటున్నారు. చుట్టపు చూపుగా వచ్చిన తల్లులు కూతుళ్ళ సంపాదనా వైభవం చూసి మురిసిపోతూ తామే వండి పెట్టి వడ్డిస్తున్నారు. కూర్చోబెట్టి కాఫీ, టీ లందించి ముద్దులుపెట్టి “నువ్వీ భోగంలోనే కలకాలం ఉండమ్మా! శరీరాన్ని ఎంతమాత్రమూ అలవనివ్వొద్దు” అని దీవిస్తున్నారు.

ఒక్కొక్క మనిషి ఆరోగ్య స్థితి ఒక్కో పెద్ద ఉద్గ్రంథం. చదవడం చదవకపోవడం మన ఇష్టం. ఒక్కొక్కరి సుస్తీ వివరాలు వింటుంటే ఆనందం, అనుమానం ఒకేసారి ముప్పిరిగొంటాయి. ఆనందం ఎందుకంటే వాళ్ళు చెప్పే బాధ మనకింకా రానందుకు. అనుమానం ఎందుకంటే భవిష్యత్తులో మనకి కూడా అలాంటి బాధ వస్తుందేమో అన్న భయం. తెల్లారిలేస్తే దిన, వార, మాస పత్రికల నిండా జబ్బుల విశేషాలే. మీ ఎముకలు జాగ్రత్త. గుండె జబ్బులు రాకుండా చూసుకోండి. కిడ్నీ లను ప్రేమగా చూసుకోండి. అందుకోసం ఈ కింద చెప్పిన అడ్డమైన గడ్డీ తినండి అని పెద్ద చిట్టా ఉంటుంది. ఒకసారి చదివితే అర్థం కావవి. గుర్తు కూడా ఉండవు. అందుకని ఆ కాగితం ముక్కలన్నీ చింపి అలమరాలో దాస్తుంటాం. అవి చదివే అవసరం మనకి రాదు. ఎందుకంటే నెలాగితే అవే చిట్కాలు పేరు మార్చుకుని మళ్ళీ దర్శనమిస్తాయి.

ఇక మధ్యాహ్నం భుక్తాయాసంతో గులాబ్జామ్ తింటూ, ఒక గొప్ప హత్యల పథకాలతో, ఊరు చివర చిక్కని పొదల మధ్య చేసే కిడ్నాప్‌ల సీరియల్ చూసి ఒక చిన్న కునుకు లాగించి మళ్ళీ టీవీ పెడితే జబ్బులూ, నివారణలతో డాక్టర్ సలహాలూ యాడ్‌లతో కలిసి గ్రూపుగా వచ్చేస్తాయి. ఆ చెప్పేవాళ్ళు నిజంగా డాక్టర్లేనా అని అనుమానం వస్తుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటినుండీ మనకి తెలిసిన విషయాలనే చెప్పి మళ్ళీ కొంచెం పోపు వేస్తారు. వాటిని మించి ఒక్క ముక్క ఎక్కువ చెప్పలేరు. చెప్పే డాక్టర్ పిల్ల మాత్రం సినిమా హీరోయిన్లా అందంగా ఉంటుంది. ఏమైనా మనకి డాక్టర్ లంటే మహాగౌరవం. అది భయంతో కూడిన భక్తితో నేసిన కలనేత. గౌరవం ఎందుకంటే ఎంతకష్టపడి చదివారో అనీ, భయం ఎందుకంటే మన జబ్బుపట్టుకోవడానికి ఏ రాయి విసిరి ఏం గాయం చేస్తారో అనీ, భక్తి ఎందుకంటే ఏ దేవుడికో మొక్కిన మొక్కు ఫలించి మనం రోగం తగ్గిస్తారనీ.

ఆ రోజుల్లో డాక్టర్‌లు చెయ్యి పట్టి నాడి చూసి రోగం చెప్పేసేవారని పెద్దవాళ్ళంటుంటారు. ఈ రోజుల్లో వైద్యులు చెయ్యి కాదు కదా, అసలు మన మొహమే చూడరు మహా పాపం అన్నట్టు. “రిపోర్ట్ లేవీ?” అని మాత్రం అడుగుతారు.

మల్టీ స్పెషలిటీ హాస్పిటల్‌లో రిసెప్షన్‌లో ఫీజు కట్టించుకున్నాక ఓ రంగుల ఫోల్డర్ ఇచ్చి అందులో మన బీపీ, బరువు చెక్ చేసి ఆనక వయసడిగి రాయించి మనల్ని ఓ చిన్న డాక్టర్ దగ్గరకి తోస్తారు. ఆ కుర్రాడు మన అనారోగ్య సమస్యలన్నీ తలెత్తకుండా వింటూ ఆ బుక్‌లో రాసేస్తాడు. అవి చూసిన వెంటనే వృత్తికి జీవితాన్ని అంకితం చేసిన స్పెషలిస్టు గారు వీలైనన్ని టెస్టులు (ఎమ్మారై , సీ.టీ.స్కానింగ్, ఎక్స్‌రే, సంపూర్ణ రక్తపరీక్ష ఇత్యాది) తన బంధుమిత్ర పరీక్షా కేంద్రాల లెటర్ హెడ్‌పై రాసిస్తాడు. అవన్నీ చేయించుకొచ్చాక, ఓ పూట తిరుపతి వెంకన్న దర్శనం కోసం కన్నా ఎక్కువ ఆత్రపడి ఎదురుచూడాలి. మన అదృష్టం పండాక మనకి పిలుపొస్తుంది. ఆ హాస్పిటల్ సహ-సొంతదారుడైన పెద్ద డాక్టర్ సాబ్ నిర్లిప్తంగా మనల్ని ఓ నిర్జీవమైన ఫైలుని చూసినట్టు చూసి రిపోర్ట్ చూస్తాడు. ఇంతలో మనం అనారోగ్య హరికథ మొదలు పెట్టగానే ‘ఆగండి,మీ రిపోర్ట్ నాతో మాట్లాడింది, నా కర్ధమైంద’న్నట్టు సైగచేసి గబా గబా ఏదో మన ఫైల్ లో గిలికి పక్కనున్న అసిస్టెంట్ మొహాన కొట్టి అప్పటికే మనపక్కన సర్దుకుని కూర్చుంటున్న మరో పేషెంట్ వైపు దృష్టి సారిస్తాడు. ఆ అసిస్టెంట్ గారు బిక్కమొహం వేసుకున్న మనల్ని బైటికి తెచ్చి, దయతో ఏ మందు ఎలా వాడాలో చెప్పి వెళ్లి రమ్మంటాడు. అసలా ఫారిన్‌లో చదివొచ్చిన ఆ గొప్ప డాక్టర్ నేను చెప్పింది విన్నాడా? నా జబ్బు ఆయనకి అర్థం అయిందా? అన్నవి బ్రహ్మ పదార్థ సంబంధ అనుమానాలు.  ఇంటికి వెళ్లేప్పుడు మీరు ఆస్తికులైతే ఏదైనా గుడికి వెళ్లి మొక్కుకుని వెళ్లడం మంచిది. ‘ఓ మంచి దేవుడా నా రోగం ఆ డాక్టర్ గారికి అర్ధమైనదై ఉండి ఆ మందులు ఆ అనారోగ్య నివారణ కోసమై ఉండేట్లు అనుగ్రహించు’ అని కోరి ప్రార్థంచడం వల్ల ఉపయోగం ఉండచ్చు.

ఆ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మందుల షాపులో కొంటే ఆ డాక్టర్ బామ్మరిది కెళ్ళిపోతుందని అతితెలివికి పోయి బైట ప్రయత్నిస్తే ఆ మందులు ప్రపంచంలో మరెక్కడా దొరకవు. అలాంటి పిచ్చి పనులు చెయ్యకండి. పరమాత్మను తలచుకుని కోపాన్ని దిగమింగుకుని మనసును నిమ్మళించుకోండి. మందులు అక్కడే కొనుక్కుని శ్రమ తగ్గించుకోండి.

ఇటీవల మా కజిన్స్, పిల్లలు అమెరికాలో బాగా సద్దుకుని సెటిల్ ఐపోయాక, ఓసారి అక్కడి ప్రదేశాలన్నీ చూసొచ్చేసి పనీపాటా లేక కొత్తకొత్త ఆరోగ్య చిట్కాలపై ఆసక్తీ, అనురక్తీ చూపిస్తూ చిత్ర విచిత్ర వేషాలేస్తున్నారని మా ఫామిలీ గ్రూప్‌లో వార్త వచ్చింది. నాక్కూడా బోర్ గానే ఉంది కదా అని ఓ కజిన్ పద్మని గిల్లాను. అది వెంటనే “రేపాదివారం రావే మా ఇంటికి” అంది. రోజు మొత్తం బాగా ఎంజాయ్ చేద్దామని ఇంట్లో అన్నీ చక్కబెట్టి కాబ్ ఎక్కి ఒంటరిగా బయలుదేరాను. బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్లి, నేను తెచ్చిన స్వీట్లూ,హాట్‌లూ కిచెన్‌లో పెట్టి టీవీ ముందు కూర్చున్నా. పూజ ముగించి వచ్చిన పద్మ “అయిదంటే అయిదు నిమిషాల్లో నీకు బ్రేక్ ఫాస్ట్ పెట్టేస్తా” అంటూ కిచెన్ లోకి వెళ్లి ఎంతకీ రాదు. ఎక్కడా దోశా, పూరీ, వడా లాంటి వాసనలేమీ రావడంలేదు. ఓ పావుగంట వాట్స్ యాప్ చెరువులో ఈదాకా, “రావే” అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి పిల్చి ఒక గాజు బౌల్‌లో అదేదో ద్రవ ఘన మధ్య పదార్ధం పెట్టింది పద్మ తను కూడా తింటూ.

“ఏమిటే ఇది?” అన్నా ఓ స్పూన్ నోట్లో పెట్టుకుని. అది గొంతునుంచి లోపలి పోనని మారాం చేస్తోంది. అదెంత ఆరోగ్యానికి మంచిదో చెప్పడం మొదలు పెట్టి, లేచి మరో బౌల్ భర్త గదిలో పెట్టి వచ్చింది. ఏడుస్తూ మరో స్పూను తిన్నా.

పల్లీలు రాత్రి నానబెట్టి అందులో చాలా రకాల పళ్ళ ముక్కలు వేసి ఆ పై ఖర్జూరం వేసి మిక్సీలో రుబ్బిందట. తేనె కూడా కాస్త పోసిందిట. “ఈ వయసులో మనం ఇలాంటివే తినాలే” అంది నన్ను బుజ్జగిస్తూ. నాకు ఎక్కడో వళ్ళు మండి “నేనొక రెండువందలేళ్ళు బతకాలని అనుకోవట్లేదులే. కాస్త కాఫీ కలిపి రెండు బిస్కట్లియ్యి” అన్నాను విరక్తిగా. దాంతో ఆమె భయపడి గబగబా చేసిచ్చింది. మరో గంట కబుర్లు చెప్పి, ఈ లెక్కన ఈమె పెట్టబోయే లంచ్ ఊహించి వణుకు పుట్టి సెలవు తీసుకున్నా. వెనక్కి చూడకుండా పారిపోయి, చక్కగా షాపింగ్ చేసుకుని ఓ కామత్ హోటల్‌లో దూరి మాంచి రవ్వదోశ తిని హమ్ చేసుకుంటూ ఇంటికెళ్లిపోయా. ఇలాంటి వాళ్ళ బారినపడకుండా మీరు కూడా జాగ్రత్తగా మసలుకోండి.

ఇహ యూత్ విషయానికొస్తే, వాళ్ళ మనసుల్లో అన్నం వల్లే ‘ఒబేసిటీ’ అనబడే వళ్ళొస్తోందని గట్టిగా అభిప్రాయం ఏర్పడింది. వాళ్లు తినే పిజ్జాలూ, బర్గర్లూ, చాకోలెట్లూ, ఐస్ క్రీమ్‌లూ వాళ్ళ ఇష్ట సఖులు కాబట్టి వాటిల్నేమీ దూరం పెట్టకుండా, అమాయకురాలైన అన్నం మీద నిందలు వేసి ఇంట్లోంచి వెళ్లగొట్టారు. నేటి యువజంటల ఇళ్లలో బియ్యం ఉండడంలేదు. మనలాంటివాళ్ళం వెళితే రెండు చపాతీలు వత్తి, క్యారెట్, క్యాబేజీ తురిమి కాస్త ఉప్పూ, పెప్పర్ చల్లి వడ్డిస్తున్నారు. మన బిక్క మొహం చూసి ఐస్ క్రీమ్ కప్పుల్లో ఇచ్చి ఓదారుస్తున్నారు. ఇంకా గుక్కపెడితే బట్టర్ మిల్క్ ప్యాకెట్లు చూపిస్తున్నారు. వాళ్ళు మాత్రం మంచూరియాలూ, ఫ్రైడ్ రైస్‌లూ, దమ్ బిరియానీలూ, చికెన్ టిక్కాలూ, అపోలో ఫిష్‌లూ, రొయ్యల వేపుళ్లూ ఆర్డర్ చేసుకుని కేక్‌లు కట్ చేసుకుని తిని ఎనర్జీ డ్రింక్‌లు తాగుతున్నారు.

బూరెలూ, బొబ్బట్లూ, పులిహోరలూ, పకోడీలూ అంటే యాక్ అంటున్నారు. మీరూ తినకండి మంచిది కాదు అంటూ ప్రెజెంటేషన్‌లు వేసి చూడండి ఏముందందులో బెల్లమూ, నూనె తప్ప అంటున్నారు. కావాలంటే సమోసాలూ, కచోరీలూ తెప్పిస్తాం అంటూ ఓ పది ఆర్డర్ చేసి పెడుతున్నారు. మనవలేమో వాళ్ళు తినే పిజ్జాలూ, బర్గర్లూ రుచి చూడమని వెంటపడుతుంటారు. వాళ్ళు పెట్టేది తినలేక, తమకు నచ్చింది చేసుకోలేక ఇరకాటంలో పెద్దవాళ్ళుంటున్నారు.

ఇక మన సంతానం “మీ ఆరోగ్య రహస్యాలూ, చిట్కాలూ మీరే దాచుకోండి. మీ షుగర్, బీపీలు కంట్రోల్‌లో ఉంచుకోండి. టెన్షన్‌లు పెట్టుకోకండి. జీవనం కష్టతరం చేసుకోకండి. మీ కిచెన్, వాష్రూమ్ అన్నిటికీ ఆన్లైన్ క్లీనర్లు వస్తారు మేం పంపుతాం. అమెజాన్, నెట్ ఫ్లిక్స్ లలో కొత్త మూవీలూ, యు ట్యూబ్‌లో పాత సినిమాలూ చూసుకోండి. ప్రవచనాలు ఎలాగూ ఉన్నాయి” అని ఫోన్లు పెట్టేస్తున్నారు. వాళ్ళ సొంత విషయాలపై ఆరాలు తీసి, సలహాలివ్వబోతే “మీకెందుకవన్నీ? మా ప్రేయారిటీస్ వేరు, మీవి వేరు. తరం మారింది. కూల్ కూల్” అని ముగిస్తున్నారు.

ఇక మన అనారోగ్య సమస్యలేమో ఒకో రోజు ఒకో రకంగా మనకి బోర్ కొట్టకుండా రక రకాలుగా ఉంటాయి. ఇంకోళ్ళకి చెప్పడం మనకే విసుగు. మనింట్లో మనతో ఉండేవాళ్ళకి కూడా చెప్పకుండా నడిపిద్దామని చూస్తుంటాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, వాకింగ్‌లూ, ప్రాణాయామాలూ, యోగాలూ చేసుకుంటూ ఉన్నా మన శరీరాలు అల్లరి పిల్లలల్లే చెప్పిన మాట వింటున్నట్టే విని అంతలోనే అదుపు తప్పుతుంటాయి. మళ్ళీ మళ్ళీ గుడికి వెళ్లినట్టుగా మన ఫ్యామిలీ డాక్టర్లను దర్శించి వారి సూచనలూ,సలహాలూ ఓపిగ్గా విని దణ్ణం పెట్టి రావాల్సిందే మనం.

ఆదివారం దినపత్రికలోని ప్రత్యేక ఎడిషన్‌లో “నడుము నొప్పిగా ఉంటోందా?” అంటూ కలర్ ఫోటోతో అరపేజీ ఉంటుంది. వారాంతపు స్పెషల్ వంటలు తిని మధ్యాహ్నం మగవాళ్ళు అలిసిపోయి నిద్రిస్తుంటారు. ఆ వంటలన్నీ చేసిన గృహిణులు నడుం నొప్పితోనే ఆ ఆర్టికల్ ఆమూలాగ్రం చదువుతారు. అందులో వివిధ రకాల నడుమునొప్పుల లిస్టు, కారణాల లిస్టు ఉంటుంది. అనేకానేక అనవసర వివరాలుంటాయి. నివారణ గురించి వీలుకాని జాగ్రత్తలుంటాయి అంతే. కళ్ళూ, చేతులూ నొప్పి పుట్టేట్టు చదివిన వాళ్ళకి పేపర్ విసిరి అవతల పడెయ్యాలనిపిస్తుంది.

మీ బంధువుల్లో ఎవరైనా ఎనభై పైబడిన వాళ్ళుంటే వాళ్ళకి ఫోన్ చేసి “ఆరోగ్యం ఎలా ఉంది పెద్దమ్మా?” అనడిగి ఓ పావుగంట మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఆ ఆరోగ్య ఫిర్యాదులు అంత అడ్డం పొడుగుంటాయి.  ధ్యానం మీద మనసు నిలపలేకపోతే ఆవిడ చెప్పిన అనారోగ్య విశేషాలన్నీ మీ ఒంట్లో ప్రవేశించి మీ భవిష్యత్తు మీకే కనబడుతుంది. జీవితేచ్ఛ నశిస్తుంది. అంచేత మీరు నా మాట విని ధ్యానం చెయ్యడం రాకపోతే మీకు నచ్చిన ఓ రెండు కాలేజీ రోజుల పాటలు వినండి. ఉత్సాహంగా నూ ఉంటుంది పెద్దావిడని స్వేచ్ఛగా చెప్పుకోనిచ్చినట్టూ ఉంటుంది. విన్ విన్ అంటారు దీన్ని.

మనకి నిత్యం ఉండే కంప్లైంట్ లెలాగూ చెలికత్తెల్లా మన వెంటే ఉంటాయి. టీవీ చూస్తుంటే నడుం నొప్పి,  పోనీ అని ఐ పాడ్‌లో ఏదైనా చూస్తే మెడనొప్పి, వంటిల్లు షోగ్గా ఉండాలని పెట్టించుకున్న వుడెన్ కబోర్డుల వల్ల భుజాల నొప్పులు ఉంటాయి. మనం ఆరోగ్యం గురించి స్వీయానుభవంతోనూ విన్న, కన్న, చదివిన విజ్ఞానం తోనూ బోలెడు కేర్ తీసుకుంటాం. అయితే ఆ జాగ్రత్తలన్నీ తీసుకున్నా, తీసుకోకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు. మా ఫ్రెండ్ తండ్రి ఒకాయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుని ఏనాడూ వాకింగ్ చేసి ఎరగడు. ఆహార నియమాలేమీ పాటించడు. టీవీ ముందు బైఠాయించి బజ్జీలూ, సమోసాలూ,ఐస్ క్రీములూ తింటూ హాయిగా ఉన్నాడు. ఆయన బ్రదర్ రోజూ వాకింగ్ చేస్తూ, ఏడాది కొకసారి బాడీ చెకప్పులు చేయించుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలకి నమూనాగా ఉండేవాడు. అటువంటాయన ఠప్పున పోయాడు. దీన్ని బట్టి మనకు తెలిసిన రహస్యం ఏంటంటే, మనం తీసుకుంటున్న జాగ్రత్తలు కూడా భ్రమే. జబ్బులు సత్యప్రమాణంగా నిజమనుకోండి. మనం తీసుకునే జాగరూకతలకి జబ్బులేమన్నా భయపడి దూరం జరుగుతున్నాయా? కనీసం రెస్పాండ్ అవుతున్నాయా, లేదా అసలు లెక్కచేయట్లేదా అన్నది దేవుడికే తెలియాలి.

ఈ రోజుల్లో మనందరికీ కవచ కుండలాల్లా బీపీ షుగరులు వంటినంటుకుని ఉంటున్నాయి. అవి శరీరారోగ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. వాటికి నిత్యనైవేద్య బిళ్ళలు మింగాలి. అన్నిప్రత్యేక జబ్బులకూ మూల కారణంలా థైరాయిడ్ అనబడే పాశుపతాస్త్రం లాంటి మరో వ్యతిరేక శక్తి కొత్తగా చేరింది.  మనుషులు దీన్ని కూడా ప్రతిరోజూ ఒక టాబ్లెట్‌తో అణిచిపెట్టాలి. ఇంకా ఆకు రౌడీల్లాంటి చిన్నా చితకా శారీరక సమస్యలకి మన దగ్గర టాబ్లెట్‌ల కిట్ లుంటాయి. వాటిని వాడుతూ నిరంతరం యుద్ధం చేస్తూ అప్పుడప్పుడూ అలాంటి శత్రువుల చేతచిక్కి నపుడు పెద్ద డాక్టరుగారికి చెప్పి గట్టి మందులతో లొంగదీస్తూ ఉండాలి. ఇప్పుడు జీవితమంటే శరీరాన్ని వెంటాడే అనారోగ్య రక్కసులతో మనం అనుదినం చేసే యుద్ధమే అనుకుంటే మన పోరాట పటిమ పెరుగుతుంది. ఉత్సాహం కూడా వస్తుంది ఏమంటారు? లోకాస్సమస్తా ఆరోగ్యభద్రాభవంతు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here