“అనగనగా ఒక నేరం”

2
2

[dropcap]ఈ[/dropcap] మధ్య తెలుగులో ఇండిపెండెంట్ సినిమాలు వస్తున్నాయి. కొంతమంది లఘు చిత్రాలు తీస్తున్నారు. ఇది మాత్రం ఒక గంట నిడివి గల చిత్రం. (కుదించి లఘు చిత్రం చేయలేదు, సాగదీసి పూర్తి స్థాయి చిత్రం తీయలేదు. ఇలాగే బాగుంది.) వాళ్ళకు సినిమా వ్యాకరణం పట్టుబడటానికి ఓ మెట్టు. మనం కూడా కాసేపు మన జజ్‌మెంట్ ని వాయదా వేసి కుర్రకారు చేసిన పని చూడాలి అనిపిస్తుంది. ఇదివరకు నేనిట్లా లేను. కానీ ఆలోచించగా తెర మీద వచ్చే పెద్ద చిత్రాలలో మనకు నచ్చనివి చాలా వున్నా సర్దుకుపోవట్లేదూ. అలాంటప్పుడు ఒక నూతన కళాకారుల ప్రథమ ప్రయత్నాన్ని చూసి ఎంకరేజ్ చెయ్యొచ్చు. వారే తర్వాత తర్వాత కూడా మంచి సినిమాలు అందించక పోతే అది వేరు.
సరే ఈ సినిమా ఒక క్రైం థ్రిల్లర్ జాన్ర్ కి చెందినది. ఓ కుర్రోడు రవి (అనీష్) సెకండ్ షో చూసి ఒక స్కూల్ దగ్గరికొస్తాడు. దాని తాళం చేతులు అతని దగ్గర వుంటాయి. అతని పని ప్రతి రాత్రీ ఆ స్కూల్ లో పడుకోవడం. అయితే ఆ రోజు జరుగుతున్నవి అన్నీ అయోమయంగా, భయం కొలిపేవిగా వింతగా ఉంటాయి. ఏవో చప్పుళ్ళు వినిపించడం, తన mobile పెట్టిన చోట వుండక పోవడం వగైరా. దీనికి సమాంతరంగా ఓ వీధిలో పైనుంచి పడిపోయిన లేదా తోయబడిన ఓ అమ్మాయి శవం రక్తసిక్తంగా వుంటుంది. ఆ నేర స్థలం లో రవి పగిలిన బీరు బాటిల్ తో అటుగా వెళ్తున్న మనిషికి కనబడతాడు. ఆయన ఈ నేరాన్ని అందరికీ చెబుతానంటూ పరుగు లంకిస్తాడు. నేను చెప్పేది వినండి, అదేం కాదు అంటూ రవి వెంటపడతాడు. ఆయన్ని అందుకోలేక పోతాడు. మరోవైపు పోలీసులు అతన్ని వెతుకుతూ వుంటారు. రవి తన దగ్గర వున్నదేదో ఓ టీస్టాల్ సొరుగులో పెట్టి పారిపోతాడు. వెంటపడుతున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకుంటారు. లోన డ్రగ్స్ వుంటాయి.
తప్పించుకు తిరుగుతున్న రవి ఎప్పుడూ చెమటలు పట్టి, భయాన్ని ప్రకటించే కళ్ళతో కనిపిస్తాడు. ఓ పగలు అతను పార్థసారథి అనే లాయర్ (రాం గోపాల్) ఇంటి తలుపు తడతాడు. అయిష్టంగా లోనికి రానిచ్చిన లాయర్ కి తన వైపునుంచి చెబుతున్న రవి కథనం చిత్రీకరించబడినది.
ఆ లాయర్ కి ఫ్లాష్‌బాక్ లో తను ఓ సెజ్ భూమిని అక్రమంగా కబ్జా చేయడం, జనం ప్రొటెస్టులు చేసి అతన్ని పోలీసులకు అప్పగించడం లాంటివి జరిగి వుంటాయి. ఆ సమయంలో తన కాలర్ పట్టుకుని ఈడ్చిన రవి లాయర్ మనసులోంచి పోలేదు. ప్రస్తుతం ఆ కథ ఇంత వరకే.
ఒక క్రైం చిత్రం లో దర్శకుడు ముఖ్యమైన ఎలిమెంట్లు ఒక బల్ల మీద పెట్టి చూసుకోమంటాడు. కథనం లీనియర్ గా వుంటే ఒకలాగా. వేర్వేరు పాయల్లో వుంటే మరో లాగా ప్రభావం చూపిస్తుంది. నేరస్తుడు, నేరం, నేరం వెనుక ఇంటెంట్, పాజిబల్ లేదా అనుమానం కలిగించగల పాత్రలు అన్నీ, అందరూ ఆ పరచిన బల్ల మీద వుండాలి. చాలా కొన్ని చిత్రాల్లో నేరస్థుడు వీటి బయటినుంచి వస్తాడు తెర మీదకు, చివరిలో. దాన్ని దర్శకుడు జస్టిఫై సమర్థవంతంగా చేయగలిగితే పర్లేదు.
సస్పెన్స్ చిత్రాల్లో ఒకో సీన్ ప్రేక్షకుడు ఆసక్తిగా ఇన్వాల్వ్ అయ్యి చూడాలంటే ఊహించని ట్విస్ట్లు పెట్టడం, నేపథ్య సంగీతం, లైటింగ్ (చీకటిలో ఎక్కువ ప్రభావవంతంగా వుంటుంది), కెమెరా పనితనం ఇవన్నీ కలిస్తేనే ఆ సీన్ పండుతుంది.
ఇప్పటికే కథ ఎక్కువ చెప్పానేమో. ఈ సారి నేను స్పాయిలర్ల జోలికి పోను. ఇంత వరకు చదివి ఆసక్తి కలిగితే చిత్రాన్ని cinemapreneur సైట్ లో చూడండి. టికెట్ 29 రూపాయలు.


ఒక టీచర్ వెంకటరమణ మాష్టారు (కృష్ణాజి) ఆత్మహత్య చేసుకుంటాడు. అందరికీ ఆదర్శమైన వాడు, అందరిలో స్పూర్థి నింపినవాడు ఎందుకలా చేయాల్సి వచ్చింది. మాధవి అనే ఓ కొత్తగా వచ్చిన టీచర్ ఆత్మహత్యే చేసుకుందో, మర్డరే అయ్యిందో; స్కూల్ బిల్డింగ్ పైనుంచి కిందపడటం వల్ల. ఎవరు ఎందుకు చేసుంటారలా? పోలీసులకు చిక్కిన డ్రగ్స్ కథ ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు మనసులో రేగుతాయి చిత్రం చూస్తూ ఉంటే.
మన ప్రస్తుత కాలపు సమాజం లో జరుగుతున్న( ఆడపిల్ల పుడితే చంపెయ్యడం, డ్రగ్స్ వ్యాప్తి, భూముల దురాక్రమణ మాఫియా లాంటివి) కొన్నిటిని సినిమాలో స్థానం ఇచ్చాడు. కేవలం హూ డన్ ఇట్ కాకుండా కాస్త లోతుగానే కథ అల్లాడు.
ఒక ప్రథమ ప్రయత్నం. బాగుంది. రచయితా, దర్శకుడు శ్రీనివాస్ సత్యా పని బాగుంది. అనిష్, బాలు, క్రిష్నాజి, ల నటన బాగుంది. రేలంగి వెంకటేష్ కెమెరా పనితనం, రోహిత్ సంగీతం, ముఖ్యంగా జీవన్ భంగే సౌండ్ దిజైన్, జస్విన్ ఎడితింగ్ అన్నీ బాగున్నాయి. కొత్త ఉత్సాహం తో వచ్చిన ఈ యువత ఇంకా మంచి సినిమాలు తీయాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here