[dropcap]ని[/dropcap]జం చెప్తున్నా! ఆమె పేరు నాకు తెలియదు. ఒట్టు. తెలుసుకోవాలని నేను అనుకోనూలేదు. ఆమె పేరేమిటైతే ఏంటి? ఆమెను ప్రేమించాను. అంతే!
వయసు ముప్పైకీ, నలభైకీ మధ్య ఉంటుంది. అదెలా తెలిసిందని అడగొద్దు. చాలా మంది ఎదుటివాళ్ల వయసును ఇట్టే అంచనా వేసేస్తారు. అది నిజమైనా, అబద్ధమైనా సరే, అలా వేయడం మాత్రం మానరు. అదొక పిచ్చి అలవాటు. ఆమె అందంగా ఉండేది. నాకు మాత్రమే అలా కనిపించేదో, అందరికీ అలాగే అనిపించేదో తెలియదు. ‘టికెట్.. టికెట్’ అంటూ అందర్నీ పలకరించేది. ఖాకీ రంగు బట్టల్లో కళగా ఉండేది.
మొదటిసారి తనను చూసిన వెంటనే నేను చేసిన పని తన కాళ్ల వంక చూడటం. మెట్టెలుంటే పెళ్లయినట్లు. లేకపోతే లైన్ క్లియర్ అయినట్టు. కానీ నా ఆశను నిరాశ చేస్తూ నల్లరంగు బూట్లు ఆమె కాళ్లను, వాటికుండే వేళ్లను కప్పేశాయి. మెడలో తాళిబొట్టు చూద్దామన్నా నో ఛాన్స్! సరే ఏదైతే అదైందని ప్రేమించడం మొదలు పెట్టాను. ఆ సిటీబస్సు నా కలల సౌధం. ఆ బస్సు నా పాలిట ఇంద్రభవనం. రోజూ ఆ బస్సు కోసం ఎదురుచూసేవాణ్ని. తనుందా, లేదా అని చూసుకుని ఎక్కేవాణ్ని. నాతో ఏమైనా మాట్లాడుతుందేమోనన్న ఆశతో ఇరవై రూపాయల టికెట్ కోసం వంద, ఒక్కోసారి ఐదొందల నోటు ఇచ్చేవాణ్ని.
“చిల్లర లేదా? ఎక్కణ్నుంచి తేవాలి? ఇరవై ఉంటే ఇవ్వు”
ఇంతకన్నా ఒక్క మాట కూడా తనెప్పుడూ ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ మాటల్ని ఎలా పొడిగించాలో తెలియక తికమకపడేవాణ్ని. అడిగేందుకు నాకు ధైర్యం లేదు సరే, తనే కొంచెం అర్థం చేసుకుని కనీసం పేరయినా చెప్పొచ్చు కదా? ఈ ఆడోళ్లున్నారే..!
“ఎవర్నువ్వు? ఎందుకు రోజూ ఇదే బస్సు ఎక్కుతున్నావ్? ఏంటి నీ సంగతి?” అని ఎప్పుడైనా అడుగుతుందేమోనని ఆశపడుతూనే ఉన్నాను. భంగపడుతూనే ఉన్నాను. రెండు నెలలపాటు నా ప్రేమ బ్రేకులు లేకుండా సాగిపోయింది. ఆ తర్వాత తను రాలేదు. ఆ బస్సు మాత్రం వస్తూనే ఉంది. ఎక్కాలనిపించలేదు. తనొస్తే తప్ప అడుగు కూడా ముందుకు వేయాలనిపించలేదు. ఏడుపు. ఏడుపొచ్చింది. కోపం. కంటిమందు తిరుగుతున్న సిటీ బస్సుల మీద కోపం. తనెక్కడుందో తెలియని పరిస్థితి మీద కోపం. తనెవరో తెలుసుకోలేని నా పిరికితనం మీద కోపం.
ఆ తర్వాత ఎప్పుడూ తను కనిపించలేదు. ఎక్కడుందో, ఏమైందో తెలియదు. ఇదంతా ఎప్పటి మాట? పదేళ్ల కిందట సంగతి. ‘నీ లవ్ స్టోరీ గురించి చెప్పు’ అని ఎవరైనా అడిగితే నాకున్న ఏకైక ప్రేమకథ ఇదే! ఏకైక జ్ఞాపకం తనే! పేరు తెలియని మనిషి. నోరు విప్పని ప్రేమ.
పెళ్లి చూపుల్లో ఐదు నిమిషాలు ఒకర్నొకరు చూసుకున్న అబ్బాయి, అమ్మాయి భార్యాభర్తలై జీవితాంతం ప్రేమించుకుంటారు. పిల్లల్ని కంటారు. అదంతా ప్రేమే అయినప్పుడు నా రెండు నెలల ప్రయాణం మాత్రం ప్రేమ కాదా? ఎందుక్కాదూ? ఎప్పుడైనా, ఎక్కడైనా తను కనిపిస్తే నా ప్రేమ గురించి చెప్పేస్తా. ఈసారి భయపడను. భయపడితే జ్ఞాపకాలే మిగులుతాయి. దాన్ని దాటితేనే ఒప్పుకోలో, వీడుకోలో దక్కుతాయి.