‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-1 – లాగా చునరీ మే దాగ్

3
1

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] ఎపిసోడ్‍లో విశ్లేషిస్తున్న పాట ‘లాగా చునరీ మే దాగ్’ – దిల్ హీ తో హై (1963) అనే సినిమా లోనిది. సంగీతం రోషన్. గానం మన్నా డే. రాగం భైరవి.

సినిమా పాటల్లో అత్యుత్తమ సాహిత్యం సాహిర్ గీతాలలో కనిపిస్తుంది. సినిమాలో ఎలాంటి సన్నివేశానికి పాట రాసినా, అది గంభీరమైన భావగీతంగానే రాయడం సాహిర్ శైలి. అతి మామూలు సన్నివేశంలో గొప్ప తాత్వికతను, కొన్ని సందర్భాలలో తాను నమ్మిన సోషలిజాన్ని చొప్పించి అది మామూలు పాటే అనే మాయలో ముంచేస్తాడు సాహిర్. మనం అదో సరదా గీతం అనుకునే లోపే మెదడు కొన్ని సంకేతాలను పంపించి మరోసారి పాట వినమని చెబుతుంది. మన వయసు, జీవితానునుభవం పెరుగుతున్నకొద్దీ, మనం ఎప్పుడూ వినే అదే సాహిర్ గీతం గొప్ప తాత్వికతను, అర్థాన్ని ఎన్నో కోణాల్లో ఆవిష్కరిస్తూ పోతుంది. అది సాహిర్ శైలి. తాను నమ్మిన జ్ఞానాన్ని మామూలు పదాల్లో కట్టి మన ముందుంచుతాడు. విన్న ప్రతి సారీ కొత్త అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. సాహిర్ గీతాలను అర్థం చేసుకోవడానికీ మనకో స్థాయి ఉండాలి. శ్రోతలు తన స్థాయికి ఎదిగగలిగేలా ప్రేరేపించగలిగిన సినీ కవి సాహిర్. అందుకే సాహిర్ అంటే నాకు చాలా చాలా గౌరవం. ఇదో సినిమా పాటలే అని తోసి పడేసే పాటేదీ సాహిర్ రాయలేదు. ఆయన రాసిన ప్రతి వాక్యంలో ఓ గంభీరత్వం, ధీరత్వం ఉండి తీరుతుంది. దాన్ని అర్థం చేసుకోగల స్థాయికి శ్రోతలు రావలసిందే.

‘లాగా చునరీ మే దాగ్’ అనే పాటను ఎన్ని సార్లో విని ఉంటాం. చినప్పటి నుండి పాటలు వింటున్నా వాటిలో అర్థాలు వెతుక్కోవడం బహుశా నా పదహారవ లేదా పదిహేడేళ్ల వయసులో మొదలయి ఉంటుంది. అప్పుడు ఈ పాట వింటుంటే ఓ తప్పు జరిగిపోయింది అని ఓ అమ్మాయి బాధను  బయటపెట్టుకుంటుంది అని అనిపించేది. నిజానికి పాట అర్థం అదే. హిందీలో ‘చునరీ మే దాగ్ లగ్నా’ అంటే స్త్రీ మర్యాదకు భంగం కలగడం. చునరీ అంటే దుపట్టా, చున్నీ అన్న అర్ధాలున్నాయి. కొంగు అని కూడా అనుకోవచ్చు. ఇది స్త్రీలు మాత్రమే వాడే వస్త్రం. కొంగుకు మరక అంటింది అంటే, ఆమె వ్యక్తిత్వానికి మచ్చ కలిగింది, మర్యాదకు భంగం కలిగింది అన్న అర్ధంలో వాడతారు.   అంటే సమాజం ఆమోదించని పనిని ఓ స్త్రీ తప్పని పరిస్థితులలో చేసి నా శీలం పోయింది అని చెప్పుకోవడం ఈ వాక్యం అర్థం అన్నమాట. నైతికంగా స్త్రీ పరంగా తప్పు జరిగితే “చునరీ మే దాగ్ లగా” అని అనడం ఆనవాయితి. స్త్రీ తన శరీరాన్ని ముఖ్యంగా రొమ్ములను కప్పుకోవడానికి చునరీ అంటే కొంగును ఉపయోగిస్తుంది. అందుకే చునరీ స్త్రీత్వానికి, మాతృత్వానికి కూడా ప్రతీక. దానికి మరక అంటిందని అర్థం. ఆ వాక్యం ప్రకారం ఆమె తప్పు చేసిందని, సమాజం ఆమోదించని దారిలో నడిచిందని అర్థం వస్తుంది.  ఇదే భావం తెప్పిస్తూ పాటను మొదలెడతాడు సాహిర్. ఇక్కడ పాట సన్నివేశంలో ఓ నాట్యగత్తె నాట్యం చేస్తూ ఉంటే, గాయకుడు పాడుతుంటాడు. అంటే వినేవారికి కూడా ఇది ఓ శీలం చెడిన స్త్రీ చెప్పుకునే గాథగా అనిపిస్తుంది. ఆమె పట్ల ఓ తేలిక భావం కలుగుతుంది.

కాని ఈ పాట పాడుతుంది పురుషుడు, పురుషుడి గొంతులో స్త్రీ వ్యథ ఎందుకు ప్రథమ పురుషలో వినిపిస్తుందన్న అనుమానం మనకు రాదు. చునరీ అంటే స్త్రీ ధరించే చీర చెంగు కాబట్టి ఇది తప్పకుండా ఓ స్త్రీ వేదన అనే నమ్మకం కలుగుతుంది. మరి అది పురుషుడు ఎందుకు పాడుతున్నాడు అన్న ఆలోచన మాత్రం రాదు. ఓ నీతి తప్పిన స్త్రీ కథ వినాలనే ఉత్సుకత మరే ఆలోచనకు చోటివ్వదు.

లాగా చునరీ మే దాగ్, చుపాఊ కైసే, లాగా చునరీ మే దాగ్

చునరీ మే ఛుపావూ కైసే, ఘర్ జాఊ కైసే, లాగా చునరీ మే దాగ్

(నా చీర చెంగుకు మరక అంటింది, ఇక ఇంటికి ఎలా వెళ్ళను)

స్త్రీ చీరపై పడే మరకలను పరీక్షగా గమనించే సందర్భాలు ఆమె జీవితంలో అనేకం ఉంటాయి. నెలసరి సమయాలలో, పురుషుడితో సంగమం జరిగినప్పుడు, లేదా ప్రసవం అప్పుడు. ఆమె చీరపై వివిధ సందర్భాలలో పడే ఆ మరకలతో ఆమె నైతిక స్థాయిని నిర్ణయించే సమాజంలో స్త్రీ జీవిస్తుంది. అందుకే ‘చునరీ మే దాగ్’ అన్న మాటను స్త్రీ నైతికతను నిర్ధారించే క్రమంలో ఓ నానుడిగా వాడుతూ ఉంటారు. ఇది తెలిసిన వారికి ఆ పై వాక్యాలలో ఓ నీతి తప్పిన స్త్రీ మాత్రమే కనబడి కొంచెం కుతూహలం కలిగి తీరుతుంది. ఇదే భావంలో శ్రోతలు ఉండగా

హో గయీ మైలీ మొరీ చునరియా, కొరే బదన్ సీ కోరి చునరియా (2)

ఆ జాకే బాబుల్ సె నజరె మిలాఊ కైసె, ఘర్ జాఊ కైసె లాగా చునరీ మే దాగ్

అనిపిస్తాడు సాహిర్.

(నా చీర చెంగుకు మరక అంటింది. తెల్లటి శరీరం లాంటి తెల్లటి చీర. చీర కొంగు అంటే నా శరీరంతో సమానం. అలాంటి తెల్లటి చీర చెంగుకు మరక అంటింది. ఇలా పుట్టింటివాళ్ళకు నా ముఖం ఎలా చూపించను?  ఇంటికి ఎలా వెళ్లను నా చీర చెంగుకు మరక అంటింది)

ఇక్కడ చీర చెంగు అంటే నా శరీరమే అని వివరిస్తూ, మాసింది తన శరీరమే అని ఇక తన ఇంటికి వెళ్ళి తండ్రిని ఎలా చూడగలను అని బాధపడుతుంది ఓ హృదయం. దాంతో ఆమె చెప్పరాని తప్పు చేసింది పాపం అని జాలి పడతారు శ్రోతలు.

ఇక్కడే సాహిర్ ఏదో చెప్పాలనుకుంటున్నాడన్న అనుమానం వస్తుంది. ఇది మామూలు స్త్రీ శరీరమూ, శీలానికి సంబంధించినది కాదు, ఇంకా, గాఢమూ, లోతైనదేదో సాహిర్ చెప్పబోతున్నాడన్న ఆలోచన వస్తుంది.

అంతటితో ఆగితే అతడు సాహిర్ కాడు..

భూల్ గయీ సబ్ బచన్ బిదా కే, ఖో గయీ మై ససురాల్ మే ఆకె

జాకె బాబుల్ సె నజరె మిలాఊ కైసే ఘర్ జాఊ కైసే లాగా చునరీ మే దాగ్

(అప్పగింతల్లో  పుట్టింటివారికి చేసిన వాగ్దానాలన్నీ మరచిపోయాను, అత్తవారింట్లో నన్ను నేను మరచిపోయాను. ఖోజానా అంటే కోల్పోవటం. తప్పిపోవటం. అత్తవారింట్లో కోల్పోవటం అంటే, తనని తాను కోల్పోవటం. తప్పిపోవటం అంటే, అంతవరకూ ఉన్న తన అస్తిత్వాన్ని కోల్పోవటం. పుట్టింటికి ఇచ్చిన వాగ్దానాన్ని మరచి అత్తగారింట్లో మైమరచిపోయాను. అంటే, అత్తగారిల్లు ఎంతగా నచ్చిందంటే, పుట్టింటిని మరచిపోయేంతగా!   ఇక తండ్రికి మొహం ఎలా చూపను? ఇంటికి ఎలా వెళ్ళను, నా చీర చెంగుకు మరక అంటింది)

ఈ చరణంతో పాట అర్ధమయ్యే తీరు మారిపోతుంది.  ముందేమో కొంగుకు  మరకంటింది ఇంటికి ఎలా వెళ్ళాలన్నాడు.  ఇప్పుడేమో, పుట్టింటికి ఇచ్చిన వాగ్దానం మరచిపోయాను. పుట్టింటికి మొహం చూపించలేను, ఇంటికి ఎలా వెళ్ళాలి, కొంగుకు మరక అంటింది అంటున్నాడు. దాంతో, మనము అనుకుంటున్న కొంగు కొంగు కాదేమో, మరక మరక కాదేమో, ఇదంతా స్త్రీకీ, స్త్రీ శీలానికి, స్త్రీ పడే బాధలకూ సంబంధించింది కాదేమో అనిపిస్తుంది.

సాధారణంగా సాహిర్ స్త్రీ అబల అంటే ఒప్పుకోడు. అలాంటి  భావనలు పాటల్లో ప్రదర్శించడు. తండ్రి గజదొంగ. ఎప్పుడు పోలీసులు కాల్చి చంపుతారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో సంతానానికి జన్మనిచ్చిన తల్లి , నీకు భవిష్యత్తులేదు, నువ్వూ పోలీసుల కాల్పులలో చస్తావని కొడుకుకు జోలపాట పాడుతూ తండ్రికి బుద్ధి చెప్తుంది సాహిర్ పాట పాడుతూ తల్లి. మరో సినిమాలో తన కొడుకు కష్టాలు పడాలని, వాడి శరీరం ఉక్కులా తయారు కావాలని, తనని మోసం చేసిన ప్రియుడిపై (ఆ అబ్బాయికి తండ్రి) ఆ పిల్లవాడు ఎదిగి ప్రతీకారం తీర్చుకోవాలనీ మరో తల్లి సాహిర్ పాట పాడుతుంది. కష్ట సుఖాల్లో నీకు తోడుంటాను, నీ సుఖమే కాదు, నీ కష్టమూ నాకు ఇయ్యి అంటుందొక ప్రేయసి ప్రియుడితో. నీ రక్షణ బాధ్యత కొన్ని రోజులకోసం నాకు అప్పగించు, నిన్నీ ప్రపంచం ఎలా సతాయిస్తుందో చూస్తాను అని చాలెంజ్ చేస్తుందొక ప్రేయసి తన ప్రియుడితో. కాబట్టి తన శీలంపోయింది కాబట్టి ముఖం చూపించలేనన్నమాట సాహిర్ పాటపాడే ఏ మహిళా అనదు. ఇక ఇప్పుడు సాహిర్ మరో పొర విప్పుతాడు.

కోరి చునరియా ఆత్మా మోరీ మైల్ హై మాయా జాల్ (2)

వొ దునియా మోరే బాబుల్ కా ఘర్ యె దునియా ససురాల్

హా.. జాకె బాబుల్ సె నజరే మిలాఊ కైసే, ఘర్ జాఊ కైసే

లాగా చునరీ మే దాగ్

(నా ఆత్మే నా చీర చెంగు, మరక అంటే ఈ ప్రపంచం అనే  మాయా జాలం. ఆ పైనున్న  ప్రపంచం నా పుట్టిల్లు, ఈ ప్రపంచం నేను మెట్టినిల్లు. ఇక పైకి వెళ్ళి నా పుట్టినింట్లో  ముఖం ఎలా చూపేది, ఇంటికి ఎలా వెళ్ళేది.. నా చీర చెంగుకు మరక అంటింది.)

ఈ చరణం పూర్తిగా అర్థం అయినప్పుడు ఎవరో చెళ్ళున చెంప పగలగొట్టారనిపిస్తుంది. ఇలాంటి షాక్ సాహిర్ మాత్రమే తన సినీ గీతాలలో ఇస్తాడు. అప్పటి దాకా ఓ దారి తప్పిన స్త్రీ గాథ వింటున్నాం అనుకుంటున్న మనందరికీ ఆధ్యాత్మికత వైపుకు దృష్టి మళ్ళించే ప్రయత్నం ఈ వాక్యాలలో జరుగుతుంది. నీతి, దారి తప్పడం, సిగ్గు పడడం లాంటి మాటలకొస్తే మనం శరీరాన్నే గుర్తు చేసుకుంటాం. శారీరిక తప్పిదాల దగ్గరే ఆగిపోతాం. కాని మన ఆత్మ సంగతేంటి? శరీరం ఆత్మతో పోలిస్తే అత్యల్పమయినదే కదా. చీర చెంగు అంటే శరీరాన్ని కప్పిఉంచే వస్త్రం కాదిక్కడ. అది ఆత్మ స్వరూపం. ప్రాపంచిక జీవితాన్ని చుట్టి ఉండే మానవ అంశ. ఇప్పటి దాకా పుట్టిల్లు  అని రచయిత సంబోధిస్తున్నది  మనందరం ఏ లోకంనుంచి ఈ లోకానికి వస్తున్నామో ఆ లోకాన్ని.  ఉర్దూలో ఆ లోకాన్ని ‘ముల్క్-ఎ-ఆదం’ అంటారు.  అందరం అక్కడి నుండి వచ్చిన వాళ్ళమే. మళ్ళీ అక్కడకే చేరతాం. అదే మనందరి పుట్టిల్లు. అక్కడి నుండి ఈ ప్రపంచానికి అంటే మన మెట్టినింటికి పంపేటప్పుడు మన సృష్టికర్త  మననుండి ఏదో కోరాడు. ఆశించాడు. కాని మనం ఏం చేస్తున్నాం, ఇక్కడికి వచ్చి ఈ ప్రపంచం సృష్టించిన మాయలో, ఇంద్రియాలు కల్పించిన మాయాజాలంలో పడి కొట్టుకుపోయి చేయరాని తప్పులు చేస్తూ గడిపేసాం. ఇక మళ్ళి పుట్టింటీకి వెళ్ళి  ముఖం చూపగలమా? మన చీర చెంగుకు ఎన్ని మరకలు అంటాయో కదా.. పెళ్ళాం, పిల్లలు, సంసారం, మొగుడు, ఉద్యోగం, పోటీ, డబ్బు సంపాదన.. ఒకటా? రెండా?

ఇప్పుడు ఆ దారి తప్పిన స్త్రీలో మన ముఖాలే కనపడతాయి. అది రచయిత ఆశించే ప్రతిక్రియ. మనం ఆడ, మగ అని తేడాలు గుర్తిస్తాం కానీ, ఆత్మ స్థాయిలో ఎలాంటి తేడాలూ లేవు. ఆడ, మగా అంతా  ఒకటే. ఆ అనంత  ఆత్మ స్వరూపమే. ఆ అనంత చైతన్య స్వరూపంలో భాగమే!  ఆ చైతన్యం నుంచి వేరుపడి ఈ లోకంలో అడుగుపెట్టినప్పుడు ఉన్న స్వచ్ఛత, నెమ్మదిగా ఈ లోకపు మాయాజాలంలో పడి కోల్పోతాము. మన చైతన్య స్వరూపాన్ని మరచిపోతాము. ఆ మరపే మన ఆత్మ అనేకొంగుకు అంటిన మరక. ఈ మరకతో మనము ఆ శుద్ధ చైతన్యంలో ఎలా కలుస్తాము?

పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును..
ఆ పురిటి కందు మనసులో దైవముండును..
వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే..
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే..

ఈ విషయాన్ని ఎంతో సుందరంగా,  తాత్వికంగా, కవితాత్మకంగా, ఆలోచనలు రేకెత్తిస్తూ చెప్పి మెప్పించటం సాహిర్ ప్రత్యేకత.

ఎవరిదో నీతినీ, ఎవరివో శారీరిక సంబంధాలని ఉత్సుకతో చర్చించే మనం మన ఆత్మకు అంటిన మరకలను పట్టించుకోం. మరొకరి నైతికతను నిలదీసే మనం, మనలోని అశుద్ధాన్ని గుర్తించం. శరీరపు మైల కాదు ఆత్మకు అంటిన మైల గురించి మనిషి ఆలోచించాలి కదా. ఈ ఆలోచన కలగడమే మనిషిలో మార్పుకు నాంది, ఎదుగుదలకు గుర్తు. నా ఆత్మపై ఎన్నో మరకలున్నాయి అని ఒప్పుకోవడమే మనిషిగా మన అసలు ప్రయాణం మొదలవడానికి చిహ్నం. అందుకే ఈ పాట మగవాని గొంతుకలో ఉంటుంది. ఇది స్త్రీ గొంతులో వింటే అసలు భావం చప్పున మనకు చేరదు. స్త్రీ పరిధిలోనే ఆ ‘మరక’ ఉండిపోతుంది. ఇది లింగ పరంగా చూడవలసిన తప్పు కాదు. సర్వ మానవాళి చేసున్న తప్పు. ఆ మరకను గుర్తుంచి మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడం అవసరం అనే భావన ఈ ఆఖరి చరణంలో ఉంది.

ఈ గీతాన్ని మన్నా డే అద్భుతంగా గానం చేసారు. సాహిత్యంతో పాటు శాస్త్రీయ సంగీతానికి ప్రాధాన్యత ఇస్తూ భైరవి రాగంలో ఇక్కడ ఆఖరున స్వరాలాపన చేస్తాడు మన్నా డే. ఆ ఆలాపన మధ్య రెండు గొప్ప వాక్యాలున్నాయి.

సప్త సురన తీన్ గ్రామ్ బన్సీ  బాజీ,

థరత్ పాగ్ పడత్ నయీ పరణ్

(సప్త స్వరాలు షడ్జమం, మధ్యమం, పంచమం అనే మూడు మధుర స్వరాలు మేళవించిన వేణువు నాదం  మ్రోగుతోంది.  ఆ నాదం కలిగించే సంతోషంతో ఎలా నృత్యం ఎలా చేయాలంటే, భూమిపై పాదం నిలవని వినూత్న రీతికి ప్రాణం పోస్తూన్నట్టు నృత్యం చేయాలి.) ఈ చరణం తరువాత పాట టెంపో, వేగం పెరుగుతుంది. ఆ వేగానికి తగ్గట్టు నృత్యం చేయలేక నాయిక ఓటమి ఒప్పుకుంటుంది.

ఇక్కడ మొదటి వాక్యం సంత్ హరిదాస్ గీతంలోనుండి తీసుకున్నది. సంత్ హరిదాస్ తాన్‌సేన్ గురువు. సంగీతాన్ని మించి భగవంతుడిని కొలిచే మరో ఉత్తమ మార్గం లేదని చెబుతూ భారతీయ సంగీత గొప్పతనాన్ని సూచించే గీతంలోని పల్లవికి సంబంధించిన మొదటి వాక్యం అది. తనలోని లోపాలను, తప్పిదాలను ఒప్పుకుని ప్రాపంచిక విషయాలనుండి దూరం జరిగి ఆధ్యాత్మికంగా ఎదిగే క్రమంలో నాట్యాన్ని, గానాన్ని భగవంతుని సేవకు మార్గాలుగా చేసుకుంటూ ఆయన పాదాల ముందు మోకరిల్లి, ఇక నాకు జ్ఞానాన్ని కలిగించు, మళ్ళీ ఈ మాయాజాలంలో పడిపోయి తప్పు చేయకుండా నీ వద్దకు చేరడానికి నిన్ను కలిసేటప్పుడు నిటారుగా నీ ముందు నిలబడగల శీలాన్ని నేను పొందే విధంగా నన్ను అనుగ్రహించు అంటూ ఓ భక్తుడు దేవుడి పాదాల ముండు మోకరిల్లుతున్నాడు. సంగీత నాట్యకళను తన భక్తి మార్గాలుగా నిర్ణయించుకుంటున్నాడు.

పాట సంగీత స్వరాలాపనతో ముగుస్తుంది. ఎక్కడో మొదలయి ఇది ముగింపుకొచ్చేటప్పటికి ఈ పాట సంపూర్ణంగా అర్థం అయిన తరువాత మనలో ఒక నిర్వేదం నిండిపోతుంది. మన్నాడే గానం మనల్ని మరో లోకానికి తీసుకుని వెళుతుంది.

సాహిర్ ఒక ముస్లిం కవి. హిందూ భక్తి తత్వాన్ని ఇంతగా ఆపాదించుకుని శుద్ధ హిందీ భాషలో అతను ఈ గీతం రాసిన విధానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఈ గీతానికి ప్రేరణ కబీర్ దాస్ రచన. ఆ మూల రచన ఇలా సాగుతుంది.

చునరీ మె పరి గయో దాగ్ పియా

పాంచ్ తత్వ కీ బనీ చునరియా, సోరహ్ సై బంద్ లాగే జియా

యహ్ చునరీ మొరె మైకె తె ఆయీ, ససురే మె మనువా ఖొయ్ దియా

మలి-మలి ధొయీ దాగ్ న ఛూటే, జ్ఞాన్ కొ సాబున్ లాయ్ పియా

కహై కబీర్ దాగ్ తబ్ ఛూటీహై జబ్ సాహెబ్ అపనాయ్ లియా

(నా చీర చెంగుపై మరక పడింది. ఐదు తత్వాలతో తయారయింది ఈ కొంగు. పదహారు వేల మాయలలో ఇది చిక్కుకుంది. నా పుట్టింటి నుండి వచ్చిన ఈ చీర చెంగు అత్తింట్లో వెలిసి పోయింది. ఎంతో నలిపి దీన్ని ఉతుకుతాను. కాని ఈ మరక వదలట్లేదు. జ్ఞానమనే సబ్బును నాకు ఇవ్వు. అప్పుడు గాని ఈ మరక వదలదు. నా గురువు నన్ను సంపూర్ణంగా స్వీకరించినప్పుడు ఇక ఏ మరకా నా చీరను పాడు చేయదు)

కబీర్ దాస్ పెరిగింది నేతగాళ్ళ ఇంట. చేతి వృత్తుల నేపద్యంలో ఆయన ఎంతో తత్వ భోధన చేసాడు. ఆయన రాసిన భక్తి గీతం ఇది. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనిషి స్వచ్ఛంగా వస్తాడు. కాని ప్రాపంచిక మాయలో పడి తప్పులు చేస్తాడు. నేను ఎన్ని సార్లు కడుక్కునా ఆ మరకలు వదలట్లేదు. అందుకు జ్ఞానం కావాలి. అది నాకు సంపూర్ణంగా ఇచ్చి నన్ను నీ శిష్యునిగా స్వీకరించు. అప్పటికి గాని ఈ మరకలు నన్ను వదలవు అంటాడు కబీర్. కబీర్ నిర్గుణవాది. జ్ఞానమే భవవంతున్ని పొందే మార్గం అని నమ్మినవాడు. అలాగే గురువు గొప్పతనం ఒప్పుకున్నవాడు. అందుకే గురువు అనుగ్రహంతో జ్ఞానాన్ని పొంది తన జీవితంలోని మరకలను వదిలీంచుకోవడమే భక్తి మార్గం అని భోధిస్తున్నాడు.

సాహిర్ కబీర్ భావాన్ని పట్టుకుని దాన్ని ఇంకొంత సరళీకరించి, మనిషి తన ఆత్మలోకి తొంగి చూసుకోవాలని ఈ చక్కని గీతంలో పొందుపరిచి మనకు అందించారు. ‘చునరీ మే దాగ్’ అనే నానుడిని ఉపయోగిస్తూ ప్రతి మనిషి తనను తాను ప్రక్షాళన చేసుకోవాలని చెప్తాడు. ఇంతటి తాత్వికత ఆనాటి ఓ సినీ గీతంలో చొప్పించబడింది అని తెలుసుకుంటే సినీ గీతాలను తేలికగా చూడగలమా? సాహిర్ రాసిన ఏ పాటనయినా విశ్లేషిస్తే మనసు నిండిపోతుంది. జ్ఞాన చక్షువులు తెరుచుకుంటాయి. ఇప్పుడు మరో సారి వినండి ‘లాగా చునరీ మే దాగ్’, ఓహో సాహిర్ అనుకుంటూ..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here