Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-10 – తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘హమ్‍రాజ్’ (Hamraaz 1967) చిత్రం కోసం మహేంద్ర కపూర్ పాడిన పాట. సంగీతం రవి.

~

ప్రేమ అనే అందమైన పదాన్ని అనునిత్యం వాడేవాళ్లే కాని ఆ అందంలోని సొగసుని అంతే రమణీయంగా ప్రకటించగలిగేవాళ్ళు బహు తక్కువ. అనుభూతిపై అనునిత్యం ప్రదర్శన ఆధిపత్యం చలాయిస్తుంటే అసలు ప్రేమ గురించి చెప్పుకోవడమే తప్ప అనుభవించే అవకాశమే లేని జీవన శైలిలో మానవ సంబంధాలు, అనుభూతులు గాడి తప్పుతున్నాయి. అందుకే ప్రేమ గురించి వింటున్న కొద్దీ ఆ అనుభూతి పలచన అయిపోతూ ఉంది. ఇలాంటి నిరాశలో ఉగిసలాడే ప్రేమతత్వం ఉన్నవారికి గొప్ప సాంత్వన ఇచ్చే ఈ సాహిర్ గీతం గురించి ఎంత చర్చించుకున్నా తక్కువే..

ఒక పురుషుడు స్త్రీ ప్రేమ కోరుతున్నాడు. కాని ప్రేమలో అతనికి కావలసింది ఆమె సాంగత్యం, ఎందుకంటే ఆమె సన్నిధిలో అతనిలోని భావుకుడి మేలుకుంటున్నాడు. తనలోని మంచిని సానబెట్టుకునే శక్తి, ప్రేరణ ఆమె అని అతని నమ్మకం, అందుకే ఆమెను కోరుకుంటూ ఎమంటున్నాడో చూడండి

తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో

మై యుహీ మస్త్ నగ్మె లుటాతా రహూ

ఈ పల్లవిని ఎన్ని సార్లు విన్నా అసలు సాహిర్ మాటల కూర్పు అందులోని మాయాజాలానికి ఏ రకంగా బదులివ్వాలో అర్థం కాదు. నువ్వు నాకు తోడుగా నిలుస్తానని మాట ఇస్తే, నేను ఇలాగే ఎన్నో గీతాలను ఆలాపిస్తాను అంటున్నాడు అతను. హిందిలో నగ్మే లుటానా, అన్నది ఒక  idiom. అంటే, పాటలు పాడటం, ఆనందాన్ని వ్యక్తం చేయటం, పాటలను వెదజల్లటం, విస్తరింపచేయటం అన్న అర్ధాలువస్తాయి. అయితే, సాహిర్ వాడిన సందర్భాన్ని గమనిస్తే, ఆమె తోడు వుంటే, అందువల్ల అతనికి కలిగే ఆనందం, ప్రేరణలవల్ల, అతడు గీతాలను సృజిస్తూ పోతూంటానంటున్నాడు.   ఆమె తోడు అతనికి కావాలి. ఇది ఎలాంటి తోడు అన్న అర్థాలు అక్కడ అనవసరం. ఈ తోడు అన్న మాట పరిణామం చాలా పెద్దది. దాన్ని కేవలం వివాహంతో సరిపుచ్చలేం. వివాహ బంధంలో తోడు ఎంత వరకు అన్నది తరువాత సంగతి. ఇక్కడ అతనికి తోడు కావాలి. తనను నిత్యం ప్రేరణకు గురి చెయగల ఓ అద్భుతమైన తోడు, తనలోని కళాకారుడిని, కవిని బ్రతికించగల తోడు. అది ఒక్కటి ఉంటే అతనిలాంటి ఎన్నో గీతాలను ఆమెకు అర్పిస్తూ ఉంటాడట.

తుమ్ ముఝే దేఖ్ కర్ ముస్కురాతి రహో

మై తుంహె దేఖ్ కర్ గీత్ గాతా రహూ

నువ్వు నన్ను చూసి ఇలా చిరునవ్వులు చిందిస్తూ ఉంటే చాలు నేను నిన్ను చూస్తూ పాటలు పాడుతూనే ఉంటాను.

ఇంత అందమైన సున్నితమైన వ్యక్తీకరణ ఇది. పోలుస్తున్నానని కాదు కాని ఇప్పుడు గొప్ప ప్రేమ గీతాలుగా చలామణీ అవుతున్న పాటల్లో ఇంత లోతు, ఇంత గాఢత, ముఖ్యంగా ఇంత నెమ్మది నిజంగా ఉన్నాయా? తిరిగే రాయికి నాచు ఉండదు. అది ఎక్కడా ఏ గుర్తులూ లేకుండా, ఏ స్థలంతో అనుబంధం లేకుండా మిగిలిపోతుంది. ప్రస్తుత ప్రేమలు అలా తిరిగే గుండ్రాళ్ళే కాని స్థిరంగా నిలిచి ఉండే శిఖరాలు కావు కదా.

‘కనులముందు నీవుంటే కవిత పొంగి పారదా?’  అంటాడు చెల్లెలి కాపురం సినిమాలో తెలుగు కవి. ‘తుమ్ ముఝే దేఖ్ కర్ ముస్కురాతీ రహో, మై తుమ్హే దేఖ్ కర్ గీత్ గాతా రహూ’ అన్నాడు సాహిర్.

‘మేరె నగ్మోంమె జో బస్తీ హై, వో తస్వీర్ హో తుమ్’ అంటాడు సాహిర్, బర్సాత్ కీ రాత్ సినిమా టైటిల్ పాటలో. అతని గీతాలలో ప్రకటితమయ్యే ఆలోచనల రూపం ఆమె అన్నమాట. అంటే, తాను ఎలాంటి అమ్మాయిని ఊహిస్తూ, ఆ రూపాన్ని తన గేయాలలో ప్రతిబింబిస్తున్నాడో, ఆ ఊహలు ఆకృతి దాల్చి వచ్చినట్టుందామె అంటున్నాడు.  అలాంటి ఊహలలోని అమ్మాయి  నవ్వుతూ తన ఎదురుగా వుంటే , ఊహతోనే ఇన్ని గీతాలు రాస్తున్నవాడు ఆమె ఎదురుగావుంటే ఇంకెన్ని అందమయిన గీతాలు సృజిస్తాడో ఊహించవచ్చు.’ తుమ్ ముఝే దేఖ్ కర్, ముస్కురాతీ రహో, మై తుమ్హే దేఖ్ కర్ గీత్ గాతా రహూ’ అన్న సున్నితమైన, సుందరమైన సృజనాత్మకమయిన ఆత్మీయ భావనను ఎంత వివరించినా సంతృప్తి కలగదు. పాట పాడుకుంటూ, భావాన్ని అనుభవిస్తూ అతి సుందరమూ, సున్నితమయిన భావాలలోకంలో విహరిస్తూండటాన్ని మించిన ఆనందం ఈ ప్రపంచంలో మరొకటిలేదు. అందుకే అంటారు, సృజనాత్మక కళాకారుల కళాసృష్టి వల్లనే ఈ దుర్భర జీవితాన్ని ఆనందంగా భరించగలుగుతున్నాము అని.

కిత్నె జల్వె ఫిజావో మె బిఖరె మగర్

మైనె అబ్ తక్ కిసీ కో పుకారా నహీ

సాహిర్ పాటల్లో ఉండే అభిమానం, ఆ అహం నాకు ఎంతో ఇష్టం. అసలు అహాన్ని చాలా ప్రతికూలమైన భావంగా చూస్తారు తప్ప దానిలోని ఆ రాజసం, ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ గుర్తించి గౌరవించరు. ఎందుకంటే అహం ఉన్న మనుష్యుల పైన మనకు కోపం. అహానికి, అహంకారానికి తేడా తెలియక అవి రెండు కలిపేసి అహంలోని ఆ ఆత్మగౌరవాన్ని మనం విస్మరిస్తాం. పై వాక్యాలలో ఆ ప్రేమికుడు అంటున్నాడు “ఎన్ని హొయలున్న అందాల వాతావరణం నా చుట్టూ విస్తరించి ఉన్నా నేను ఇప్పటి దాకా ఎవరినీ దరికి చేరనివ్వలేదు”. ఎంత గొప్ప ఆత్మాభిమానం ఉన్న వ్యక్తీకరణం, దీన్ని మామూలు పదాలలో నా చుట్టు ఎందరు అందగత్తెలున్నా నేను ఎవ్వరినీ నా దగ్గరకు రానీయలేదు, అంటే, నాకు వారెవ్వరూ  నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. భావం అదే కాని ఆ అందమైన పదాల అల్లిక ఆ భావాన్ని ఏ స్థాయికి తీసుకెళుతుందో చూడండి. ఇక్కడ సాహిర్ గొప్పతనం ఏంటంటే అందమైన అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు, మనిషి కేవలం మనుషులకే లొంగుతారా. కాదు ఎన్నో అందమైన హొయలు, లయలు ఉన్న వాతావరణం ఉన్నా దేనికీ లొంగక దేన్నీ కోరక అతను ఇప్పుడు ఆమెను కోరుకుంటున్నాడు. ఆ వాతావరణం కేవలం ఇతర స్త్రీలకు సంబంధించినదే కాదు అన్ని రకాల ఆకర్షణలున్న ప్రాపంచిక సుఖాలకు సంబంధించినవి. అంటే ఆమెను అతను కేవలం మరికొందరు స్త్రీలతో మాత్రమే పోల్చట్లేదు. జీవితంలో మనిషిని ఆకర్షించే సమస్త సుఖాలతో పోలుస్తున్నాడు. ఆ ప్రియురాలికి అతను ఎలాంటి స్థానం ఇస్తున్నాడో.. ఆ వాక్యాలలో ఎంత లోతు ఉందో కదా..

తుంకో  దేఖా తొ నజరె యె కెహనే లగి

హం కో  చెహరే సె హట్నా గవారా నహి

“నిన్ను చూసాక నా కళ్ళు అంటున్నాయి, నీ వదనం  నుండి చూపు తిప్పుకోవడం మాకు ఇష్టంలేదు  అని”

అంటే అన్ని అందమైన దృశ్యాల మధ్య ఉన్నా అతన్ని ఏవీ కదిలించలేకపోయాయి, అతను దేన్ని తన వద్దకు పిలవలేదు. ఆ కోరిక అతనికి కలగలేదు. కాని ఆమెను చూసాక అతని కళ్ళు అటు నుండి మరలలేకపోతున్నాయి. స్త్రీ ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో ఎన్ని అందాలున్నా స్పందించని అతని మనసు ఆమెని చూడగానే స్పందించింది. ఆమెని వదలనంటోంది. ఆమెని చూసిన తరువాత అమె ముందు ప్రకృతి అందం దిగదుడుపే!!!

తుమ్ అగర్ మెరి నజరోం  కె ఆగె రహో

మై హర్ ఎక్ షై సె నజరె చురాతా రహు

నువ్వు నా కనుల ముందే ఉండగలిగితే నేను ప్రపంచంలోని అన్ని విషయాల నుండి నా కళ్ళను మరల్చుకుంటాను.

ఆమె అతని కళ్ల ముందు ఉంటే అతను ప్రపంచంలోని ఏ విషయన్ని ఇక పట్టించుకోడట. అన్నిటి నుండి తనను తాను దూరం చేసుకుని ఆమె సాన్నిధ్యంలో లీనమవుతాడట. ఇంతకన్న ఇంకొకరిని కోరుకోవడంలోని గాఢత, ప్రేమను వ్యక్తీకరించుకోవడంలోని ఆ తపనను అందంగా చెప్పగలమా?

‘తుమ్ మెరే పాస్ హోతే తో గోయా జబ్  కోయి దూస్రా నహీ హోతా’ ఇది , ఘాలిబ్, జౌఖ్ వంటి కవులకు సమకాలీకుడయిన మోమిన్ ఖాన్ మోమిన్ కవిత పంక్తులు. ఈ భావాన్ని మరింత సానబట్టి, సందర్బోచితంగా సునితంగా వ్యక్త పరచాడు సాహిర్. నువ్వు నా దగ్గరవుంటె, ఇంకెవరి అవసరంలేదని మోమిన్ అంటే, నా కనులఎదురుగా నువ్వుంటే, నా దృష్టి నీపైనే అంటున్నాడు సాహిర్.

మైనె ఖ్వాబొ మె బర్సొ తరాషా జిసె

తుమ్ వహీ సంగ్-ఎ-మర్మర్ కి తస్వీర్ హొ

నేను నా కలలో కొన్నేళ్ళుగా చెక్కుకుంటున్న పాలరాతి శిల్ప చిత్రానివి నీవు.

ప్రతి వ్యక్తి తన జీవిత భాగస్వామి లేదా, తన ప్రేమను అందుకునే వ్యక్తి స్థానంలో ఓ మూర్తిని ఊహించుకుంటారు. దాన్ని సాహిర్ ప్రస్తావిస్తూ అతను కొన్నేళ్ళుగా కల్లో చెక్కుకుంటున్న పాలరాతి శిల్పం పోలిన చిత్రం ఆమె అని ఆమె కోసం ఎన్నేళ్లుగా తనలోని ప్రేమికుడు ఎదురు చూస్తున్నాడో చెప్పుకుంటున్నాడు. చెక్కుకుంటున్న మామూలు రాతి శిల్పం కాదు, ఆమె పాలరాతి శిల్పం అట. ఈ పోలికతో ఆమె సొగసును ఆయన ఎంతగా ఇనుమడింపజేస్తున్నాడో గమనించండి.

‘నౌ జవానీకి హసీన్ ఖ్వాబ్ కి తాబీర్ హో తుమ్’ అంటాడు సాహిర్ నాయికను వర్ణిస్తూ ‘బర్సాత్ కి రాత్ సినిమా పాటలో.  ‘నవయవ్వనపు అందమయిన కల స్వరూపానివి నువ్వు ‘ అంటున్నాడు నాయికను.  ఇక్కడ , తన కలల్లో కొన్నేళ్ళుగా చెక్కుకుంటున్న పాలరాతి శిల్పం నువ్వు అంటున్నాడు. అక్కడ హసీన్ ఖ్వాబ్. ఇక్కడ ‘ఖ్వాబోంమె బర్సో తరాషా జిసె, వహీ సంగె మర్ మర్ కి తస్వీర్’ అంటున్నాడు. భావం ఒకటే. అదే భావాన్ని సందర్భోచితంగా, రెండు వేర్వేరు రీతులలో అత్యంత సొగసుగా వ్యక్తం చేశాడు సాహిర్.

తుమ్ నా సమ్ఝొ తుంహారా ముఖద్దర్ హు మై’

మై సమఝ్తా హు తుమ్ మెరి తక్దీర్  హో

నేను నీ అదృష్టం అని నువ్వు భావించకూడదు.  నేను నువ్వే నా అదృష్టం  అనుకుంటాను.

ఆమె అతని ప్రేమను అంగీకరించట్లేదు. ఆమెకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంతగా ప్రేమించే వ్యక్తి తన అదృష్టంగా ఆమె అంగీకరించలేకపోతుంది. ఇక్కడ అదృష్టం అన్న పదాన్ని సాహిర్ కావాలని వాడాడు, ప్రేమను అంగీకరించలేకపోతున్న స్త్రీకి  తన జీవితంలోకి రావాలకుంటున్న వ్యక్తి పట్ల ఎన్నో అనుమానాలున్నాయి. అందుకే ఆమె అతన్ని అదృష్టంగా భావించి స్వీకరించలేకపోతుంది. సినిమాలో దీనికి కారణాలున్నాయి. ఆమె ఒక యువకుడిని ప్రేమించింది. అతను యుధ్ధానికి వెళ్ళి తిరిగిరాలేదు. అతడిని మరచిపోలేకపోతోంది. మరొకరిని స్వీకరించలేకపోతోంది.  కానీ, ఈ కవి మూసివున్న ఆమె హృదయపు తలుపులను తడుతున్నాడు. ఆమె అతడిని కాదనలేకపోతోంది. ఔననలేకపోతోంది. అందుకే ‘ తుమ్ న సంఝో తుమ్హారా ముఖద్ద్దర్ హు మై’ అన్నాడు.   కాని అతనికి ఆమె పట్ల ఏ అనుమానాలు లేవు. అంటే ఈ స్థితిలో ఆమె కన్నా అతనిలో ఈ ప్రేమ పట్ల స్పష్టత ఉంది, తన మనసులోని భావాల పట్ల ఓ అవగాహన ఉంది. అందుకే నీవు నన్ను అదృష్టంగా భావించక అనుమానంతో దూరం నెడుతున్న నేను మాత్రమే నువ్వే నా భవిష్యత్తు అని, నా గమ్యం అని అనుకుంటున్నాను అంటున్నాడు.

తుమ్ అగర్ ముఝ్కొ అప్నా సమజ్నె లగొ

మై బహారోం  కి మెహఫిల్ సజాతా రహూ

నువ్వు నన్ను నీవానిగా ఒప్పుకోగలిగితే,   జీవితాన్ని నిత్యం వసంత ఋతువు సంబరాలలోలా  అలంకరిస్తాను…అంటే, జీవితాన్ని ఆనందమయం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు.

అనుమానాలన్నిటినీ దూరం చేసుకుని ఆమె అతన్ని తనవానిగా స్వీకరించగలిగితే ఆమె జీవితం అంతా వసంతోత్సవాలే అట. ఎంత అందమైన భావ వ్యక్తీకరణ. బహార్ అంటే, వసంతం. మెహ్ఫిల్ అంటే, సభ. ఉర్దూలో బహార్ అన్న పదాన్ని మరో పదంతో కలిపి ఆనందాన్ని, సంబరాలను, నిత్య కళ్యాణం పచ్చతోరణం వంటి భావాన్ని స్ఫురింపచేయటం ఒక ఆనవాయితీ. బహారోంకి మంజిల్ అంటారు. అంటె, వసంతమే గమ్యం కాదు. అత్యంత ఆనంద సాధన అన్నమాట. అలాగే, బహారోంకి మల్లికా అంటారు. వసంతంలో పూలు పూస్తాయి. పూచిన పూలన్నిటిలోకీ అందంలో రాణీవంటి పూవు అని పొగడ్త అది. బహారోం ఫూల్ బర్సావో అంటాడు నాయకుడు. వసంతాన్ని పూలు కురిపించమంటున్నాడు. వసంతంలో పూలు విరగబూస్తాయి. గొప్పవారు వచ్చినప్పుడు దరిలో పూలు వారిపై చల్లుతారు. అలా పూలను తనప్రేయసిపై వర్షించమని వసంతాన్నే ఆజ్ఞాపిస్తున్నాడు. అందుకే వసంత ఋతువులో సంబరాలు జరుగుతాయి. ఆ సంబరాలకోసం అలంకరణలు అద్భుతంగా, అందంగా చేస్తారు. జీవితాని అంత అందంగా మలుస్తాను అంటున్నాడు నాయకుడు. బహారోంకి మహఫిల్ ఒక  allegory (రూపకాలంకారం).

హమ్‌రాజ్ సినిమాలోని ఈ పాట ఇష్టపడని వారుండరు. అతి గొప్ప ప్రేమ గీతాల సరసన నేను దీన్ని ఎప్పుడు ఉంచుతాను. రవి సంగీతం, మహేంద్ర కపూర్ గానం ఈ పాటలో సాహిర్ పలికించిన భావాలు ఎలాంటి స్థితిలోనయినా మనసుకు ఆనందాన్ని ఇస్తాయి. ఇలాంటి ఓ నేస్తం కోసం ఎదురు చూస్తూ మనసులోని ప్రేమ తడి ఇంకిపోకుండా మనలను మనం ఎప్పటికీ కాపాడుకోగల శక్తిని ఇచ్చే అద్భుత  గీతం ఇది. ఈ సినిమాకు ఆయన రాసిన పాటలన్నీ అమృత గుళికలే. కాని ఈ గీతం నాకు చాలా చాలా ఇష్టం. ఇందులో సాహిర్ వాడిన ప్రతి పదం ఏవో  లోకాలలోకు తీసుకు వెళుతుంది. అది కాల్పనిక లోకం అయినా సరే అదో అందమైన లోకం, అలాంటి లోకంలోకి సంచరించే ధైర్యం లేని వాళ్లకు కూడా ఆహ్వానం పలికే ప్రేమ లోకం మనదైన లోకం. సాహిర్ గీతాలు అలాంటి అధ్బుత లోకాలని సృష్టించగలవు, వాస్తవ ప్రపంచంలో బాకులుగా దిగబడనూ గలవు. ఈ రెంటిని అంత నైపుణ్యంతో చెక్కగల అద్భుత భావ శైలి ఈ కవిది. అందుకే సాహిర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కాని కాస్త కినుక కూడా.. ఈ పాట నా గాన గంధర్వుడు రఫీ పాడలేదే అన్నబాధ. కాని కారణాలు ఏమైనా మహేంద్ర కపూర్ ఈ పాటకు గొప్ప న్యాయమే చేసాడు. ముఖ్యంగా

“కిత్నె జల్వె ఫిజావో మె బిఖరె మగర్

మైనె అబ్ తక్ కిసీ కొ పుకారా నహీ”

అనే ఈ వాక్యాల దగ్గర ఆయన గొంతులో పలికించే ఆ కోరికతో కూడిన నిస్సహాయత్వం సాహిర్ పదాల మాయాజాలమా, రవి సంగీత లాలిత్యమా, లేదా మహేంద్ర కపూర్ ఇంద్రజాలమా అర్థం కాక అద్భుత అలౌకిక భావంలో కొట్టుకుపోయిన రోజులెన్నో.. హిందీ సినీ గీతాలలో నాకు బాగా నచ్చిన వాక్యాలు ఇవి.

తుమ్ అగర్ సాథ్ దేనే కా వాదా కరో

మై యుహీ మస్త్ నగ్మె లుటాతా రహూ..

నిజంగా ఎంత చక్కటి పాట..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version