‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-12 – జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

1
2

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘బహు బేటీ’ (Bahu Beti 1965) చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన పాట. సంగీతం రవి.

~

హృదయానికి అయిన గాయాలు మనిషిలో నిర్లిప్తతను నింపి, జీవితం పట్ల ఉదాసీనతను పెంచుతాయి. అప్పుడు ఏ ఆనందాన్ని, ఆహ్వానించలేని స్థితికి మనుషులు చేరుకుంటారు. జీవితం పట్ల నిరాశ, చుట్టూ ఉన్న పరిసరాల పట్ల నిర్వేదం జీవితేచ్ఛను చంపి ఆ మనిషిని బ్రతికున్న శవంగా మారుస్తాయి. బతుకులో అన్ని కోరికలను చంపుకుని రోజులు వెళ్లబుచ్చుతున్న మనుషులు మన చుట్టూ చాలా మంది కనిపిస్తారు. జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా జరగవు. ఎన్నో నిరాశల మధ్య మనిషి బ్రతకవలసి వస్తుంది. అయినా జీవితంపై పట్టు జారకుండా, మనసులోని ఉత్సాహాన్ని చంపుకోకుండా, ఆశ కోల్పోకుండా మనిషి జీవించగలగాలి. అది ఎలా సాధ్యమో చెప్పే గొప్ప పాట ఇది. ఎన్నో నిరాశాభరిత సమయాలలో నాలో ఉత్సాహాన్ని నింపిన వాక్యాలు ఇవి.

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై (2)

మరో తో ఐసె కి జైసె తుమ్హారా కుచ్ భి నహి

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

జియొ తో ఐసె జియొ

జీవించడం అంటే అంతా నాదే అన్నట్లుగా జీవించ గలగాలి, ఎలా చనిపోవాలంటే ఇక నాదేమీ ఇక్కడ లేదు అన్నట్లుగా నిష్క్రమించగలగాలి.

ఆలోచిస్తే ఎంత గొప్ప వాక్యాలు ఇవి. అసలు ఈ రెండు వాక్యాలలో ఎంత శక్తి ఉందో చాలా సందర్భాలలో వీటి నుండి స్ఫూర్తిని పొందిన నాకు అనుభవం. మనకు చాలా ఇష్టం అయిన వాటి నుండి మనలను దూరం చేయాలని ప్రపంచం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎన్నో సందర్భాలలో మనం ఒంటరివాళ్లం అవుతాం. అందుకే మన జీవన పరిధి పెరగాలి. అంతా నాదే అన్నంత గాఢతతో మనం జీవించగలగాలి. కోల్పోయినవి ఎన్నీ ఉన్నా జీవించడానికి మరో దారి ఆ విస్తారమైన పరిధిలోనే దొరుకుతుంది. ఒక పక్క నిరాశలో కూరుకుపోయి ఉన్నా మనకు మరో చోట ఆశ కనిపించాలి. దానికి మన ప్రపంచం విస్తరించాలి. మన దుఃఖం కూడా ఆ విస్తారమైన ప్రపంచం ముందు మనకే చిన్నదిగా కనిపించేంతగా మనిషి ఎదగాలి. ఇక మరణింఛేటప్పుడు ఏది నాది కాదు అన్నంత ధైర్యంగా నిష్క్రమించగలగాలి. దేనిపై వ్యామోహం లేకుండా మరణాన్ని కూడా ఓ విజయంగా అందుకోగలగాలి.

యె ఏక్ రాజ్ కి దునియా న జిస్కొ జాన్ సకీ

యహీ వొ రాజ్ హై జొ జిందగి కా హాసిల్ హై

తుంహి కహో తుమ్హె ఏ బాత్ కైసె సంఝావూన్

కి జిందగీ కి ఘుటన్ జిందగి కి కాతిల్ హై(౨)

హర్ ఇక్ నిగాహ్ కొ కుద్రత్ కా యె ఇషారా హై

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

జియొ తో యైసె జియొ

“ఈ రహస్యం ప్రపంచానికి తెలియనిది. ఇదే జీవిత సారం కూడా. జీవితంలోని నిరాశా నిస్పృహలు ఉపిరందనీయకుండా జీవితేచ్ఛను చంపేస్తాయి అని నీకు ఎలా అర్థం అయేలా చెప్పగలనో నువ్వే చెప్పు. చూడగలిగే ప్రతి చూపుకు ప్రకృతి సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. అందుకే జీవించు. అంతా నాదే అన్నంత గాఢంగా జీవితాన్ని కౌగలించుకో.”

ఇక్కడ నిరాశలో కూరుకుపోయిన నాయికకు జీవించడం అంటే ఏంటో చెబుతున్నాడు అతను. చాలా మంది నిరాశలో కూరుకుపోయి ఇక జీవితంలో మరో కోణాన్ని చూడలేని స్థితికి వచ్చేస్తారు. ఎవరి మనసుకు అయిన గాయానికి వారే మందు వేసుకోగలగాలి. కళ్లు తెరిచి ప్రకృతిని చూడగలిగెతే అది ఇచ్చే సందేశాన్ని అర్థం చేసుకోగలిగితే, ప్రాణం ఉన్నంతవరకు పోరాడడమే జీవన సారం అని అర్థం అవుతుంది. కాని దేన్ని చూడడానికి ఇష్టపడని వారికి ఎలా ఈ సంగతి విడమరచి చెప్పగలం? కవి ఈ బాధ్యత తీసుకున్నారు. జీవితం ఎక్కడా ఆగకూడదని, అన్నిటిని మనవిగా చేసుకుని జీవించగలగాలని, అది సాధ్యం చేసుకోగలిగితే ఎన్ని నిరాశలలోనయినా ఆశ కనిపిస్తూ ఉంటుందని, ఏ ఓటమికి లొంగని ఇలాంటివారే జీవితాన్ని లొంగదీసుకుని ఎదుగుతారని చెప్పే ఈ వాక్యాలు ఎప్పుడు విన్నా ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తాయి.

జహా మే ఆకె జహా సె ఖించ ఖించె న రహో

వొ జిందగీ హీ నహీ జిస్మె ఆస్ బుఝ్ జాయె

కొయీ భీ ప్యాస్ దబాయె సె దబ్ నహీ సక్తీ

కిసీ సె చైన్ మిలెగా కి ప్యాస్ బుఝ్ జాయె (౨)

యె కహ్ కె ముడ్తా హుయా జిందగీ కా ధారా హై

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

జియొ తో యైసె జియొ

“ఈ ప్రపంచంలోకి వచ్చాక ప్రపంచం నుండి దూర దూరంగా ఉండకూడదు. అశ అడుగంటాక అది జీవితం కాదు. నీలోని ఎటువంటి దాహం అయినా అణిచివేసుకుంటే అణిగిపోదు. ఎవరో ఒకరి దగ్గర మనసు నెమ్మదిస్తే తప్ప ఆ దాహం తీరదు. నీ జీవితంలోని నిరాశలే నీ జీవితపు మలుపులుగా మారగలవు. అందుకే జీవించు అంతా నాదే అన్న గాఢతతో జీవితాన్ని ఎదుర్కో”.

ఎంత గొప్పగా చెప్పాడో సాహిర్. మన ప్రమేయం లేకుండానే ఈ ప్రపంచంలోకి వస్తాం. వచ్చాక దాన్ని తప్పుకుని తిరగడం, దాక్కుని బ్రతకడం పిరికితనం. జీవితంలో ఎన్నో ఓటములు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి. కాని ఏ అనుభవమూ కూడా మనలోని జీవితేచ్ఛను, మనసులోని ఆశను చంపకూడదు. ఆశ చనిపోయిన మనుషులు తమ మనసులోని స్పందనలను కోరికలను బలవంతంగా అణిచేసుకుంటారు. కాని అవి అణిగిపోవు. మనసులో అవి సుళ్ళు తిరుగుతూ అంతులేని వేదనకు గురి చేస్తాయి. అందుకే మన మనసుకు నెమ్మది మనమే వెతుక్కుని ఆ కోరికలను తీర్చుకునే దారిని నిర్మించుకోగలగాలి. ఇదే జీవించడం అంటే. మన ప్రయత్నంలో మనం విజయం సాధిస్తామా లేదా అన్నది తరువాత. జీవితం అంటే ప్రయత్నమే అన్నది అర్థం చేసుకోగలగాలి. అందుకే ఆశను మదిలో నింపుకుని మన జీవన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉండాలి. మన జీవితంలోని నిరాశలను మన జీవితపు మలుపులుగా మార్చుకోగలగాలి. అదే జీవితాన్నిజీవించే పద్ధతి.

యె ఆస్మాన్ ఎ జమీ యె ఫిజా యె నజారె

యె ఆస్మాన్ ఎ జమీ యె ఫిజా యె నజారె

తరస్ రహె హై తుమ్హారీ మెరి నజర్ కె లియె

నజర్ చురా కె హర్ ఎక్ షై కొ యూ న ఠుకరావొ

కొయి షరీక్-ఎ-సఫర్ డూండ్ లో సఫర్ కె లియె(౨)

బహుత్ కరీబ్ సె మైనె తుమ్హె పుకారా హై (౨)

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

మరో తో యెసె కి జైసె తుమ్హారా కుచ్ భీ నహీ

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

జియొ తో ఐసె జియొ

“ఈ ఆకాశం, ఈ నేల, ఈ వాతావరణం ఈ సుందర దృశ్యాలు, ఇవి నీ చూపుల కోసం నా దృష్టి కోసం తహతహలాడుతున్నాయి. వీటి నుండి దృష్టి మరల్చుకుని అన్ని అందమైన అనుభవాలను కాదనుకోకు. నీ జీవన ప్రయాణంలో నీతో నడవగలిగే బాటసారులను వెతుక్కో. నేను నీకు చాలా దగ్గరగా వచ్చి పిలుస్తున్నాను. జీవితాన్ని కౌగలించుకో, ఇదంతా నాదే అన్న దృష్టిని ఏర్పరుచుకుని జీవితాన్ని స్వీకరించు.”

ఈ వాక్యాలలో ఒక ప్రేమికుడు తన ప్రేమను బైటపెడుతూనే ఆమెను తనను స్వీకరించమని మాత్రం బలవంతపెట్టట్లేదు. నీ జీవన ప్రయాణంలో నీతో నడవగలిగే వ్యక్తులను నీవు ఎన్నుకో. నేను నీకు దగ్గరగా వచ్చి నిన్ను పిలుస్తున్నాను. కాని ఎవరినీ స్వీకరించలేని స్థితిలో నువ్వున్నావు. ముందు జీవితం పట్ల నీ దృష్టిని మార్చుకో. ఆశను చంపుకుని జీవితాన్ని అంధకారంలోని నెట్టకు. నీ ముందు ఎంతో జీవితం ఉంది. ఎంతో భవిష్యత్తు ఉంది. దాన్ని నువ్వు నిర్ణయించుకో. జీవించే దారి ఎన్నుకో.

నీకు తోడుగా నిలవాలనే నా కోరిక కూడా. కాని నువ్వు ఎవరితో ప్రయాణించాలో ఎన్నుకోవడం నీ నిర్ణయం” అంటున్నాడు కవి.

అందుకే “కొయి షరీక్-ఎ-సఫర్ డూండ్ లో సఫర్ కె లియె” అంటూ నీ జీవిన ప్రయాణంలో తోడు వెతుక్కో అని చెపుతూ ఆ తరువాతే నేను కూడా నీకు అతి దగరగా వచ్చి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాను అని చెబుతున్నాడు. సాహిర్ ప్రేమలో ప్రదర్శించే ఈ స్వేచ్చ నాకు చాలా ఇష్టం. నిరాశలో కూరుకుపోయిన ఆమెను – నేనున్నాను, నా పై ఆధారపడు అని చెప్పట్లేదు. ఆమెను స్వతంత్రురాలిగా గౌరవిస్తూ, ఆమెలో ధైర్యాన్ని నింపుతూ నీ జీవితాన్ని నువ్వు ఎన్నుకో, నీవు జీవితం పై పట్టు సంపాదించుకోవాలన్నది నా కోరిక, ఆ తరువాత నీకు తోడుగా ఉండగల అర్హత నాలో ఉందో లేదో అన్న నిర్ణయం నీది అని స్పష్టంగా చెబుతున్నాడు. అసహాయురాలైన ఆమెను అతను తన ప్రేమతో బంధించట్లేదు. ఆమెను అన్ని బంధనాల నండి విముక్తిరాలిని చేయడం అతని ప్రేమ లక్ష్యం.

ఎంత ఉన్నతమైన ఆలోచన, ఆమె పట్ల ఎంత గౌరవం, ప్రేమ పట్ల ఎంత స్పష్టత? ఈ లక్షణమే సాహిర్‌ను ఓ గొప్ప మిత్రుడిగా నాలాంటి వారికి దగ్గర చేయగలిగింది. వ్యక్తిగా ఎదగడం జీవితంలో ముఖ్యం, ప్రేమ లక్షణం మనిషిని ఎదగడానికి సహాయపడడం, బంధించడం కాదు. దీన్ని సాహిర్ ఎక్కడా అతిక్రమించి ప్రేమ గీతాలు రాయలేదు. అందుకే నాకు సాహిర్ కవిగా రారాజు. ఆయన పాటలలో ఓ ధైర్యం ఉంటుంది. ఓ గాంభీర్యం ఉంటుంది. గాఢత ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ పట్ల ఓ స్పష్టత ఉంటుంది. జీవితంలో చీకటి ముసిరిన వేళ సాహిర్ గీతాలు ఇచ్చే ఊరట కారణం అతను నాకు సాహిత్యం ఇచ్చిన మిత్రుడు.

జీవితంలో చీకట్లు ముసిరిన ప్రతి సారి నాకు తోడుగా నిలిచిన సాహిర్ గీతాలలో ఈ పాటకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా షరీక్-ఎ-సఫర్ అన్న పదం నాకు ఎంతో ఇష్టమైనది. ఇది ప్రేమికుడిని, జీవిత భాగస్వామిని మాత్రమే ఉద్దేశించిన పదం కాదు. మన జీవన ప్రయాణంలో మనతో పాటు ప్రయాణం చేసేవారితో బాంధవ్యం ఏర్పడవలసిన అవసరం లేదని గుర్తిస్తే, ఎంత మంది మన ప్రయాణంలో మనకు తోడుగా నిలువగలరో అర్థం అవుతుంది. ఒకొక్కరిది ఒకో పరిధి కాని ఈ ప్రపంచం అంతా నాదే అన్నట్లుగా జీవించే వారికి వారి ప్రయాణంలో వచ్చి పోయే మిత్రులకు కొదవ ఉండదు. వారి పరిధిని గౌరవిస్తూ వారిని స్వీకరించడమే జీవితం. అలా జీవించగలిగితే మరణించేటప్పుడు అన్నిటినీ అందరినీ వదలడంలోనూ విషాదం ఉండదు. తామరాకు మీద నీటి బొట్టులా ఉండగలగడమే జీవితం. అలా ఉంటూనే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి. క్షణికమైన స్నేహాలను, ప్రేమలనూ ఆనందించగలగాలి. అప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలం, మరణాన్ని ఆహ్వానించనూగలం.

జియొ తో ఐసె జియొ జైసె సబ్ తుమ్హారా హై

మరో తో యెసె కి జైసె తుమ్హారా కుచ్ భీ నహీ

ఈ వాక్యాలు నాలో ఎంతో మార్పును తీసుకొచ్చాయి. జీవితం పట్ల నా దృష్టికోణాన్ని మార్చగలిగాయి. జీవితంలో నిరాశా నిస్పృహలే నా జీవితపు మలుపులుగా మార్చుకోగలిగే శక్తిని ఇచ్చాయి. అంతా నాదే అన్నట్లుగా ఎన్నో కోల్పోయిన తరువాత కూడా జీవించగలుగుతున్నాను. మరణం ఎప్పుడు వచ్చినా ఏదీ నాది కాదన్నట్లుగా దాని అందుకోవడానికి సిద్దంగానూ ఉన్నాను. సాహిర్ రాసిన ఈ గీతం నా ఆత్మలో భాగం అయిపోయింది. ఈ పాట నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసి, నా వ్యక్తిత్వంలో భాగం అయింది.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here