‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-14 – జాయె తొ జాయె కహా

1
1

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘టాక్సీ డ్రైవర్’ (Taxi Driver, 1954) చిత్రం లోని ‘జాయె తొ జాయె కహా’. ఫిమేల్ వెర్షన్ – లతా మంగేష్కర్, మేల్ వెర్షన్ – తలత్ మహమూద్ పాడారు. సంగీతం ఎస్. డి. బర్మన్.

~

జీవితంలో ప్రతి మనిషికీ ఎన్నో కోరికలు ఉంటాయి. భవిష్యత్తు పట్ల ఎంతో నమ్మకంతో జీవితాన్ని ఊహ తెలిసిన తరువాత మొదలెడతాం. కాని చాలా మటుకు నిరాశ నిస్పృహలే చుట్టుముడతాయి. ఎన్నో సందర్భాలలో ఒంటరితనం అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. ఎవరు మనల్ని అర్థం చేసుకుంటారు అన్న ఆలోచన మనలను అంతర్ముఖులుగా మార్చేస్తుంది. క్రమంగా మనలోని ఆలోచనలను బైటకి చెప్పుకునే అలవాటు తగ్గిపోతుంది. మన చుట్టు ముసురుకున్న ఏకాంతాన్ని వదిలి బైటకు రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ప్రపంచంపై నమ్మకం పోవడం. ఇది ఒక రకంగా మనిషికి కష్టకాలం. కాని ఆ స్థితిలో మనుషులలోని ఈ నిరాశ వారికి గొప్ప వివేకాన్ని కూడా కలిగిస్తుంది. జ్ఞానము, దంతమూ వచ్చేటప్పుడు ఎంతో నొప్పిని తీసుకొస్తాయి కదా. జీవితంలో మనలో చేరే జ్ఞానం వెనుక తప్పకుండా అందుకో ఎంతో విషాదం ఉంటుంది.

సాహిర్ పాటలలోని విషాదంలో ఆ జ్ఞానం అనుభవానికొస్తుంది. ఆయన విషాద గీతాలన్నీ ఏదో ఓ కోణంలో ఆయన స్వీయానుభవాలే అనిపిస్తాయి. ఆ విషాదంలోని గాఢత మనసుకు దుఃఖాన్ని కలిగిస్తూనే అమితమైన వివేకాన్నీ అందిస్తుంది. మనిషిని అన్ని రకాల మోహాల నుండి విముక్తి చేయగల విషాదం సాహిర్ తన గీతాల ద్వారా అందిస్తారు. జీవితానుభవాలతో రాటుదేలి ఒంటరితనాన్ని కోరుకుంటున్న ఓ వ్యక్తి పాడుకునే పాట ‘జాయె తొ జాయె కహా’.

జాయె తొ జాయె కహా, జాయె తొ జాయె కహా

సంఝేగా కౌన్ యహా దర్ద్ భరే దిల్ కి జుబాన్

జాయె తొ జాయె కహా..

(వెళ్లాలన్నా ఎక్కడకు వెళ్లగలను? బాధతో  నిండిన ఈ మనసు పలికే మాటలను అర్థం చేసుకోవడాని ఎవరున్నారని? ఎక్కడకు వెళ్లగలను?)

మన కోసం ఎవరూ లేరని తెలుసుకోవడమే అతి పెద్ద విషాదం. ఏమీ అర్థం కానప్పుడు మనిషి చాలా ఉత్సాహంగా ఉంటాడు. కాని ప్రపంచం అర్థం అవుతున్న కొద్దీ తన స్నేహ పరిధిని కుదించుకుంటూ పోతాడు. ఇది ఏదో ఓ వయసులో మనిషులంతా చేసేదే. కొందరు అతి చిన్న వయసులో ఈ స్థితికి వస్తే కొందరికి ఇది కాస్త ఆలస్యం అవుతుంది అంతే. సాహిర్ సమాజాన్ని లోతుగా అద్యయనం చేసే గుణం ఉన్న వ్యక్తి. అందుకే ఆయన వ్యక్తీకరణలో పదును ఉంది. అది ఈ వాక్యాలలో గమనించండి. ఎక్కడికి వెళ్లాలి? నా కెవరున్నారు అని వాపోవడం మామూలు మనుషుల పని. సాహిర్ అంత సాధారణ మనస్కుడు కాదు. అందుకే నాకెవరున్నారు అంటూ తనను తాను దురదృష్టవంతుడిగా ప్రకటించుకుని జాలితో రోదించట్లేదు. “గాయపడిన నా మనసు మాటను వినేవాళ్ళేవరున్నారు” అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆ గుణం సమాజంలో లేనందువలనే తాను ఒంటరిగా ఉన్నాడు తప్ప అది అతని నిర్ణయమూ కాదు, చేతకానితనమూ కాదు. ఒక మనిషి బాధను వినే స్థితికి ఎదగని సమాజం లోపం తాను ఒంటరి అవడం. ఎంతటి గొప్ప వ్యక్తీకరణం చూడండి. అదే ఒంటరితనం, అదే దుఃఖం. ఇలాంటి స్థితిలో కొందరు నాకిదేం దురదృష్టం నాకెవరూ లేరే? అంటూ వాపోతారు. సాహిర్ ఆ కోవకి చెందడు. అతను ఎక్కడికెళ్లాలి నేను? అసలు మనసులోని బాధను వినేవాడేవడున్నాడక్కడ అంటున్నాడు. తోటి మనిషి దుఃఖాన్ని అర్థం చేసుకోలేని సమాజాన్ని చూపిస్తూ తన ఒంటరితనానికి కారణం ఎవరు అన్నది అంత దుఃఖం లోనూ అంతే స్పష్టతతో చెప్పడం ఈ పాటలోని విశేషం.

మాయూసియోం  కా మజ్మా హై జీ మే

క్యా రహ్ గయా హై ఇస్ జిందగీ మే

మాయూసియోం  కా.. (మాయూసియోం  కా)

రూహ్  మె గమ్ దిల్ మె ధువా..

జాయె తొ జాయె కహా.. సంఝేగా కౌన్ యహా

దర్ద్ భరే దిల్ కి జుబాన్ జాయె తొ జాయె కహా..

(మనసులో పేరుకుపోయిన నిరాశలు ఉన్నాయి. అంతకు మించి జీవితంలో ఇంకేమున్నాయని? ఆత్మలో దుఃఖం, మనసులో పొగ, వీటితో ఎక్కడికని వెళ్ళను?)

అతని మనసులో ఎన్నో నిరాశలు పోగయి ఉన్నాయి. అవి తప్ప జీవితంలో మరేమీ అతనికి దక్కలేదు. దుఃఖం అతని లోతుల్లోకి వెళ్ళి ఆత్మనే ఆవహించింది. కాలిపోయిన గుండె నుండి పొగలా జీవితంలోని ఓటమి చాయలు బైటకు తన్నుకొస్తున్నాయి. ఆ స్థితిలో ఆతను ఎక్కడకని వెళ్లగలడు? ఇక్కడ సాహిర్ వాడిన పద ప్రయోగాలు చూడండి. “మాయూసియోం  కా మజ్మా” అంటున్నాడు. అంటే ఇంగ్లీషులో a crowd of disappointments. ఎన్నో నిరాశలు ఒకటి తరువాత మరొకటి అతని మనసులో కూరుకుపోయి ఉన్నాయి. అది ఒకనాటి దుఃఖం కాదు. జీవితంలో అతని అనుభవాలన్నిటి సమాహారం. ఆ వాక్యం పాటలో వచ్చినప్పుడల్లా ఎన్ని సార్లు ఆ పాట విన్నా అక్కడ మనసు పట్టేస్తుంది. “మాయూసియోం  కా మజ్మా”.. ఎన్ని ఎన్ని నిరాశల కలబోత అది. ఎన్నో దుఃఖపు అనుభవాల భారం ఆ పదప్రయోగంలో తీసుకురాగలడం కవి గొప్పతనం. ఈ నిరాశ ముసిరిన జీవితంలో ఇక ఏం ఉందని, అంటూ “రూహ్ మె గమ్ దిల్ మె ధువా” అంటున్నాడు సాహిర్. చిన్న చిన్న పదాలు, కాని అర్థం సాగరం అంత. దుఃఖంతో నిండిన ఆత్మ, పొగతో నిండిన మనసు ఇవి తప్ప అతని దగ్గర మరేమీ లేవు. దుఃఖం మనసును బుద్దిని కూడా దాటి అతని ఆత్మని కమ్మేసింది. ఇక కాలిపోయిన ఆశల ఆఖరి చిహ్నాలతో నిండిన మనసుతో అతను ఎవరి వద్దకని, ఎక్కడకని బైలుదేరతాడు. ఇంతటి దుఃఖానికి చేరిన జీవితానికి మళ్ళీ తీరం ఉంటుందా?

 ఉన్కా భి గం హై  అప్నా భి గమ్ హై

అబ్ దిల్ కె బచ్నెకి ఉమ్మీద్ కమ్ హై

 ఉన్కా భి గం హై    అప్నా భి గం హై

అబ్ దిల్ కె బచ్నె కి ఉమ్మీద్ కం హై

ఎక్ కష్తీ     సౌ తూఫాన్

జాయె తొ జాయె కహా, సంఝేగా కౌన్ యహా

దర్ద్ భరే దిల్ కీ జుబాన్ జాయె తొ జాయె కహా

ఇక కవిలో ఈ దుఃఖం అతని ఒక్కని జీవిత సారమా.. కాదు. (నా దుఃఖం కొంత, వారి దుఃఖం కొంత, ఇక మనసు బ్రతికి ఉండే ఆశ తక్కువే. అవును నా దుఃఖం వారి దుఃఖం కలిసి నాలో ఉన్నాయి. ఒకటే నావ చుట్టూ వేల తుఫాన్లు, ఈ స్థితిలో వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళగలను నేను)

అతని మనసులో ఉన్న దుఃఖం కేవలం అతనికి సంబంధించినదే కాదు, అతను ప్రేమించినవారికి సంబంధించినది కూడా. ఉర్దూలో ప్రేమికురాలిని బహువచనంలో సంభోధించడం జరుగుతుంది. కాని మరో విధంగా చూస్తే అక్కడ ఆ సంభోధన ప్రేమికురాలి కోసమే కానవసరం లేదు. సాహిర్ రాసే విధానంలో ఎలా అన్వయించుకుంటే అలాంటి అర్థం వస్తుంది. సినిమా కథ పరంగా చూస్తే ఇక్కడ అతను అనుభవిస్తుంది తన దుఃఖం, ‘ఆమె’ దుఃఖం (అంటే ప్రియురాలి) దుఃఖం కూడా. దానికి సాహిర్, “ ఉన్కా భీ గం హై  అప్నా భీ గం హై” అని రాసారు. ఇక్కడ ఉన్కా అంటే ఆమె కావచ్చు లేదా అతని జీవితాన్ని ప్రభావితం చేసిన ఇంకెందరో కూడా కావచ్చు. అప్పుడు అది ఫక్తు విషాద ప్రేమ గీతంలా అనిపించదు. ఒంటరి సాయంత్రం ఏ సముద్రపు ఒడ్డుకో వెళ్ళి ఈపాట వింటుంటే అక్కడ ఆ ‘ఉన్కా’ అన్న పదం వచ్చినపుడు ఎందరి దుఃఖాలనో కలిసి మోస్తున్న భారమైన మనసు ఎన్నో గడిచిన సంఘటనల తాలూకు గాయాలను రేపుతుంది. అది అనుభవించినప్పుడు ఇది కేవలం ప్రేమికుల విరహ గీతం కానే కాదు అనిపిస్తుంది.

నిజానికి ఈ పాట ఓ టాండం గీతం. అంటే ఒకే ట్యూన్‌తో రెండు సందర్భాలలో ఇద్దరు గాయకులు పాడే గీతం ఇది. ఇప్పటిదాకా మనం చర్చించుకున్నది మగగొంతులో వచ్చే గీతం. దీన్ని తలత్ మెహమూద్ పాడారు. తలత్ హిట్ పాటలలో ఎప్పటికీ నిలచి ఉండే గీతం ఇది. అందులో ఎంతో గాంభీర్యాన్ని తాత్వికతను జోడించారు సాహిర్. అందుకే ఈ రెండు గీతాలలో కూడా ఈ పాటే అందరి మెదళ్ళలోనూ చొచ్చుకుపోయింది. దీన్నే సందర్భానుసారంగా విషాద ప్రేమ గీతంగా ప్రియురాలి గొంతులో ఇదే సినిమాలో మరోసారి వినిపిస్తారు. దీన్ని లతా మంగేష్కర్ గానం చేశారు.  మొదటిగీతంలో ఉన్కా భీ అప్నా భీ అన్న పదాలలో ప్రేమికురాలి సూచన ఉన్నా దాన్ని సామాజికం చేస్తే ఓ మనిషి సమాజంలో ఎదురు దెబ్బలు తిని అనుభవించే విషాదంగా పూర్తి పాట ధ్వనిస్తుంది.

ఇక్కడ ఈ విషాద ప్రేమ గీతంలో వాక్యాలు చూడండి..

ఓ జానె వాలె, దామన్ ఛుడా కే,

ముష్కిల్ హై జీనా తుఝ్కొ భులా కె

ఓ జానె వాలె, ఓ జానె వాలె, దామన్ ఛుడా కే,

ముష్కిల్ హై జీనా తుఝ్కొ భులా కె

ఇస్ సె తొ హై, మౌత్ ఆసాన్, జాయె తొ జాయె కహా

(నన్ను  వదిలి వెళ్ళిపోతున్న వాడా.. నిన్ను మరచి జీవించడం కష్టమోయి, ఓ వెళ్లిపోతున్న మిత్రమా.. దీని కన్నా మరణం సులువు కదా.. నేను వెళ్లాలన్నా ఇక ఎక్కడికెళ్ళగలను)

దామన్ అన్న ఉర్దూ పదానికి అర్థం అంచు అని. కాని ఇక్కడ ఆమె తన చేయి వదిలి వెళ్లిపోతున్న ప్రియుడిని చూసి ఈ పాట పాడుతుంది. ఆ పై తెలుగు పదప్రయోగంలో అసలు గీతంలోని ఆ లోతు రాకపోయినా ఆ వాక్యాల అర్థం ఆమె అతన్ని నువ్వు లేకుండా నేను జీవించడం కష్టం అని చెప్పడం. అంటే ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత దుఃఖం. కాని ఇక్కడ కూడా చూడండి. ఆమె నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పట్లేదు. సాహిర్ అలాంటి అసందర్భపు ప్రేమ ప్రేలాపనలు ఎక్కడా పొరపాటున కూడా చేయడు. అది అతని నైజం కాదు. నీవు లేకుండా జీవించడం కష్టం అనే ఆమె అంటుంది తప్ప కుదరదు అనట్లేదు. వాస్తవంగా చూస్తే ఇలాంటి సందర్భాలలో అందరూ ఎంత దుఃఖపడిగానీ ఎలాగోలా బ్రతుకుతారు. నీవు లేక నేను లేను, ఉండలేను అని ప్రేమికుల చేత చెప్పించడం సాహిర్ లక్షణం కాదు. నీవు లేకుండా జీవించడం కష్టం, దుర్భరం, ఆనందదాయకం కాదు అని మాత్రమే అంటాడు. ప్రేమ జీవితంలో ఓ భాగం లేదా అతి ముఖ్య భాగం అవ్వాలి తప్ప పూర్తి జీవితం కారాదన్న ఆలోచనను సాహిర్ ఏ సందర్భంలోనూ అతిక్రమించలేదు. ఈ పాటలో పూర్తిగా వ్యక్తిగతమైన ఆ స్త్రీ ప్రేమ సందర్భంలో కూడా అతను తన పంథాను మారుచోలేదు. అతనిలోని ఆ నిజాయితీ అంటే నాకు మరీ మరీ ఇష్టం.

సీనె మె షోలే, సాంసోం  మె ఆహె,

ఇస్ జిందగీ సె కైసె నిబాహె

సీనె మె షోలొ, సాంసోం  మె ఆహె,

ఇస్ జిందగీ సె కైసె నిబాహె

హర్ జజ్బాత్ హై వీరాన్, జాయె తొ జాయె కహా..

(గుండెలో మంటలు, శ్వాసలో నిట్టూర్పులు, ఇలాంటి జీవితంతో ఎలా సాగాలి? ప్రతి అనుభూతి ఇక ఎడారే, నేను వెళ్లాలన్నా ఎక్కడకు వెళ్ళగలను)

అతను వదిలి వెళ్ళిపోతుంటే ఆమె అంటుంది. ఈ గాయంతో, గుండేల్లో మంటలతో నిట్టూర్పుల శ్వాసలతో జీవితాన్ని ఎలా సాగించాలి? ఎడారయిపోయిన అనుభూతులతో నేను ఎక్కడకని వెళ్లను. ఆమెకు అతను తప్ప ఆనందాన్నిఇచ్చేదేదీ లేదు. కాని అతను ఆమెను వదిలి వెళ్లిపోతున్నాడు. ఆమె నిస్సహాయురాలయిపోతుంది. ఇక నా జీవితంలో ఆనందం ఉండదు అని ఆమె అతనికి చెప్పుకుంటుంది. ఇక్కడ కూడా సాహిర్ శైలికి గమనించాలి. “హర్ జజబాత్ హై వీరాన్” అంటున్నాడు. ఆమె తన జీవితం ఎడారి అయిపోయింది అని చెప్పట్లేదు, తన అనుభూతులు ఎడారులయ్యాయి అంటుంది. అతని లేని ఆమె జీవితంలో వెన్నలలు కురవచ్చు. కాని అవి అనుభవించే స్థితిలో అమె లేదు. ఆమె అనుభూతులు ఎడారుల్లా మారాయి. ఆమె ఏ వెన్నలనూ అనుభవించలేదు. రాసే పదాలలో ఎక్కడా ఒక చిన్న అస్పష్టత, అతివాదం సాహిర్ కలంలో కనపడదు.

1975లో గుల్జార్ ‘ఆంధీ’ సినిమా కోసం “తేరే బినా జిందగీ సె కోయీ షికవా తో నహీ, తేరే బినా జిందగీ భీ లేకిన్ జిందగీ తో నహీ” అని రాసారు. ఈ పాట అద్భుతమైన పాటే, కాని ఈ భావం మాత్రం సాహిర్ ప్రత్యేకత. ఎందుకంటే సాహిర్ ప్రతి విషాద ప్రేమ గీతాన్ని ఇదే పంథాలో రాసారు. ఎక్కడా ఈ పంథా దాటి ఆయన సినిమా పాత్రల పరంగా ప్రేమ పట్ల తన ఆలోచనలను మార్చి రాయలేదు. ఎలాంటి సందర్భం వచ్చినా, ప్రపంచంతో ఎంత వైరం కలిగిన సందర్భాలకు కవిత్వం జోడించాలన్నా “జలాదో ఇసే ఫూంక్ డాలో యె దునియా” అని అన్నాడే తప్ప “ముఝ్కో జలాదో” అంటూ ఎక్కడా తనను తాను నిందించుకోలేదు. విషాదం గురించి ఎప్పుడు చెప్పాల్సి వచ్చినా, ఈ ప్రపంచంలో మన ప్రేమే కాదు ఎన్నో విషాదాలు ఉన్నాయి అంటూ వ్యక్తిగత ప్రేమలో సామాజిక సూత్రాన్ని ప్రస్తావిస్తారు. ఇప్పుడు మనం చర్చించుకుంటున్న పాటలో “అప్నా భీ గమ్ హై ఉన్కా భీ గమ్ హై’ గమనించండి, దీదీ సినిమాలో “మైనె తుమ్సె నహీ సబ్ సె ముహబ్బత్ కీ హై” అని, ‘ఇజ్జత్’ సినిమాలో ‘హజారో గమ్ హై ఇస్ దునియా మె అప్నె భి పరాయే భీ” అని రాసినా అది సాహిర్ ఒక్కరికే చెల్లింది. అది ఆయన నమ్మిన సిద్దాంతం. దాన్ని ‘జాయె తొ జాయె కహా’ నుండి ప్రతి పాటలోనూ ప్రతి సందర్భంలోనూ చెప్తూనే వెళ్లారు. ప్రేమకు ఆధునికత జోడించే ప్రస్తుత తరం కన్నా ఎన్నో రెట్లు దూరదృష్టిలో భావుకత నిండిన వాస్తవిక ప్రపంచంలోని బంధాలను తన కలంతో చిత్రించిన కవి సాహిర్ లుధియాన్వి. అందుకే ఈ వాక్యాలలో నాకు వ్యక్తిగత ప్రేమకు మించిన ప్రేమ తత్వం వినిపిస్తుంది.. మరి మీకు..

 ఉన్కా భి గం హై అప్నా భి గం హై

అబ్ దిల్ కె బచ్నె కి ఉమ్మీద్ కం హై

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here