Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-15 – దిల్ మె కిసీ కె ప్యార్ కా

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఏక్ మహల్ హో సపనో కా’ (Ek Mahal Ho Sapno Ka, 1975) చిత్రం లోని ‘దిల్ మె కిసీ కె ప్యార్ కా’. లతా మంగేష్కర్, కిషోర్ కుమార్ పాడారు. సంగీతం రవి.

~

ప్రపంచాన్ని పరిశీలిస్తూ, అందులోని కుళ్ళు కుతంత్రాలను, దోపిడిని, అన్యాయాలను గమనిస్తూ, ప్రశ్నిస్తూ మనిషిలోని దుర్మార్గాన్నినిర్భయంగా ప్రకటించిన కవి సాహిర్. కాని ఇంత దుర్మార్గాన్ని చూసి రాటుదేలిన అతనిలో కూడా ఓ భావుకుడు, ప్రకృతి ప్రేమికుడు, ప్రేమను గౌరవించే మనిషి మరో వైపు ఉన్నాడన్నది నిజం. ఒక కవి రాసేదంతా అతని మనసు నుండే రానవసరం లేదు. అతని భావాలే అతని కలం నుండి బైటికి వస్తాయన్నది నిజం కాదు. చాలాసార్లు కవులు మాటల మాయాజాలంతో, అందమైన పద బంధాలతో గారడి చేస్తూ ఉంటారు. వారి స్వభావం దానికి భిన్నంగా ఉంటుంది అన్న విషయాన్ని చాలామంది తమ అనుభవంతో అంగీకరిస్తారు. అది నిజం కూడా. అయినా సాహిర్ గీతాలను వింటుంటే వాటిలోని గాఢతను అనుభవిస్తుంటే జీవితాంతం ఏ బంధానికి కట్టుపడకుండా ఒంటరిగా మిగిలిపోయిన సాహిర్‌లో ఓ ప్రేమించే హృదయం కూడా ఉండి ఉంటుందని, బంధానికి కట్టుబడకుండా ఉండడం వెనుక ఏవో గాయాలు ఉండి ఉండవచ్చనిపిస్తుంది.

ఇతర కవుల ప్రేమ గీతాలకు సాహిర్ ప్రేమ గీతాలకు చాలా తేడా ఉంటుంది. ఈయన ప్రేమలో లొంగుబాటు ఉండదు. అవతలి వారి నుండి వచ్చే స్పందన ఈయన ప్రేమకు అవసరం లేదు. ప్రేమను చాలా ఉన్నతమైన భావనగా, శరీరం దాటుకుని ఆత్మలను కలిపే బంధంగా ఆయన ప్రస్తావిస్తారు. మళ్ళీ అక్కడ ప్లేటోనిక్ ప్రేమ దగ్గరే ఆగకుండా దానికి ఆధ్యాత్మికతను జోడిస్తారు. ఇచ్చి పుచ్చుకోవడాలను దాటి అనుభూతి, అనుభవం దిశగా సాగే ఆయన ప్రేమ వ్యక్తీకరణలో వాంఛను మించిన కోరిక, మన్నన పరస్పర గౌరవం కనిపిస్తాయి. అందుకే ఆయన రాసిన భావగీతాలు, ప్రేమ గీతాలలో తాత్వికత పాలు ఎక్కువగా ఉండి అవి చాలా గాఢంగా లోతుగా ఉండి వాటిలో ఉదాత్తత కనిపిస్తుంది. చాలా వరకు శారీరిక వర్ణన కన్నా అనుభూతి ప్రధానంగా ఉంటాయి ఆయన ప్రేమ గీతాలు. అందువలన అవి స్త్రీ, పురుషులిద్దరికీ సమానంగా వర్తిస్తాయి. అంటే ఆ పాట పాడింది స్త్రీ, లేదా పురుషుడయినా ఆ గీతాలకు లింగ భేదం ఉండదు. ఎవరయినా ఆ సాహిత్యాన్ని పాడుకోవచ్చు, ఆస్వాదించవచ్చు వాటిని ఓన్ చేసుకోవచ్చు.

మనసుకు లింగ భేదం లేదు కదా. సాహిర్ గీతాలకు అంతే. అవి మనసు ప్రధాన కవితలు తప్ప వ్యక్తి ప్రధానమైన గీతాలు కావు. అందుకే సాహిర్ కవిత్వంలో స్త్రీ పురుషుల చర్చ ఉండదు. ఆ కవిత్వాన్ని స్త్రీ పురుషులిద్దరూ సమాన స్థాయిలో ఆస్వాదించడం చూస్తే శరీరాలను దాటి ఆత్మల అనుభూతులని పదాలలో కూర్చగల సాహిర్ రచాలా శైలి అబ్బురపరుస్తుంది. ఉదాహరణకి ఈ గీతం చూడండి. ఇది కవి అయిన ఓ హీరో ఓ కవితా గోష్ఠిలో తన మాటగా వినిపిస్తాడు. ఆ సందర్భంలో అది సగం పాటగా మాత్రమే వస్తుంది. ఇదే పాట అతన్ని ప్రేమించిన ఓ అమ్మాయి తన మనసు గీతంగా అతనికే మళ్ళీ పూర్తిగా వినిపిస్తుంది. కిషోర్ కుమార్ ఓ సందర్భంలో హీరోకి గానం చేస్తే మరో సందర్భంలో లతా మంగేష్కర్ స్వరం స్త్రీ గొంతుగా వినిపిస్తుంది. పూర్తి పాట లత స్వరంలో వస్తుంది. సాహిర్ ప్రేమగీతాలన్నీ లింగభేదాలకు దూరంగా కేవలం అనుభూతి ప్రధానంగా ఉండడానికి కారణం ఆయన గీతాలన్నీ గంభీరమైన కవితలు అవడమే.

ఈ పాటను కొందరు విషాద గీతం అంటారు, మరి కొందరు మధురమైన ప్రేమ గీతం అంటారు. మన మనసు ఈ పాటను వినేటప్పుడు ఏ స్థితిలో ఉందో ఈ పాట అలాంటి ప్రకంపనలనే మనలో కలిగిస్తుంది, విషాదంతో వింటే విషాదగీతంగాను, ప్రశాంతంగా ఆనందంగా ఉన్న సమయంలో వింటే ఓ గొప్ప ప్రేమ గీతంగా మనసును వింత అనుభూతితో నింపుతుంది. ప్రేమలో ఆనందం ఉంది విషాదమూ ఉంది. ఆ రెంటి కలయికను ఒకే గీతంలో చూపించడం అందరి కవులకూ సాధ్యం కాదు. సాహిర్ గీతాలలో గొప్పతనం ఏంటంటే ఒకే పాటలో భిన్నమైన అనుభూతులను ఆయన ఒకే స్థాయిలో అందించగలడు. ప్యాసా సినిమాలో ‘సర్ జో తెరా చకరాయే’ అనే పాట ఒక పక్కన హాస్య గీతం అదే స్థాయిలో గొప్ప సామ్యవాదం గీతం కూడా ఈ రెండు భావాలు అదే స్థాయిలో వినిపిస్తూ ఉంటాయి. అంటే ఒక పక్కన ఆనందం మరో పక్కన సమాజంలోని వర్గభేధాల పట్ల అసహనం. అలాగే ‘తెరీ దునియా మే జీనే సే’ అన్న మరో పాటలో దుఖం, నిరాశ, ఆశ ప్రేమ అన్నీ సమపాళల్లో వినిపిస్తాయి. ‘తద్బీర్ సె బిగడీ హుయీ’ అన్న పాటలో తాత్వికత, ధైర్యం, సవాలు, మళ్ళీ ఓ సున్నితమైన ప్రేమ అధికారం కూడా కనిపిస్తాయి. అందుకే ఆయన పాటలు బండలుగా మారిన మనుషులను సైతం తాకుతాయి. ఆ పాటలలోని అన్ని భావాలలో ఏదో ఒకటి తాకకుండా మనల్ని మనం దూరంగా ఉంచుకోలేం. అది సాహిర్ మాయ. సాహిర్ అంటేనే మాంత్రికుడు అని అర్థం కదా, నిజంగా సాహిర్ గేయ మాంత్రికుడు.

ఈ పాటకు అందం రవి కూర్చిన సంగీతం. సాహిర్ రాసిన చాలా పాటలకు రవి బాణీలను అందించారు. సాహిర్ పదబంధాలను రవి గొప్పగా అర్థం చేసుకున్నారు. అందుకే ఈ గీతాన్ని విషాదం ఆనందం రెండు ఒకే స్థాయిలో ఒకే సమయంలో ద్వనించే విధంగా బాణీ కట్టగలిగారు. హిందీ సినీ గీతాలలో ఆనందం, విషాదం ఒకే సారి ఒకే రీతిలో ఒకే తీరుగా ద్వనించే గీతాలు నాకు కనిపించినవి ‘కాగజ్ కే ఫూల్’ సినిమాలో ‘వక్త్ నే కియా’ అనే కైఫీ ఆజ్మీ గీతం, రెండవది ‘ఏక్ మహల్ హో సప్నో కా’ లో ‘దిల్ మే కిసీ కె ప్యార్ కా’ అనే ఈ పాట. ఒకే గీతంలో విభిన్న భావాల వ్యక్తీకరణ సాహిర్ సహజ శైలి. దాన్ని ఇతర కవులు కొన్ని సందర్భాలలో మాత్రమే అదే స్థాయిలో చూపగలిగారు. తరువాతి కాలంలో గుల్జార్ ఆ శైలిలో కొన్ని పాటలను రచించినా సాహిర్‌ది వీరందరికన్నా పై స్థాయి అని నాకనిపిస్తూ ఉంటుంది.

దిల్ మే కిసీ కె ప్యార్ కా జల్తా హుఆ దియా

దునియా కి ఆంధియో సె భలా యె బుఝేగా క్యా

(మనసులో ఒకరి కోసం వెలుగుతున్న ప్రేమ దీపం ప్రపంచ తుఫానులకు మాత్రం ఆరిపోతుందా..)

ఈ పాటలోని పల్లవి పూర్తిగా ఒక ప్రశ్న. ప్రేమ దీపాన్ని ఆర్పేయాలని ప్రపంచం ఎంతో ప్రయత్నిస్తుంది. ప్రపంచం వ్యక్తులను దూరం చేయగలదు కాని వారి మనసులోని ఆ ప్రేమను నాశనం చేయలేదు. ప్రేమకున్న శక్తి పట్ల ఇక్కడ ఆనందం ఉంది. అలాగే ఈ ప్రశ్నలో ఓ విషాదమూ ఉంది, మనుషులను దురం చేసే సమాజ శక్తి పట్ల కూడా అంగీకారం ఉంది. అంటే భవిష్యత్తులో ఏమైనా జరగవచ్చు,లేదా ఇప్పటికీ జరిగి ఉండనూవచ్చు కాని మనసులోని ప్రేమ దీపం మాత్రం ఏ తుఫానులకూ ఆరిపోదు అనడంలో తుఫానులలో చిక్కుకున్న జీవితపు విషాదమూ, ప్రేమను బ్రతికి ఉంచుకోగల ధైర్యమూ, ప్రేమతో నిండిన హృదయపు ఆనందమూ ఆ రెండు వాక్యాలలో కలిగలసి ఉండడం కనిపిస్తుంది. ఇది విషాద గీతమా. ఆనంద గీతమా అన్నది ఎలా విడదీసి చెప్పగలం? ఎలా చూస్తే ఆ సందర్భంలో అలా ద్వనించే అద్భుత గీతం ఇది.

సాంసో కీ ఆంచ్ పాకె  భడక్తా రహేగా యె

సీనే మె దిల్ కే సాథ్ ధడక్తా రహేగా యే

ధడక్తా రహేగా యే

(ఊపిరి జ్వాలలు అందుకుని ఇది మండుతూనే ఉంటుంది, ఈ ఛాతిలో గుండె చప్పుడుగా అది కొట్టుకుంటూనే ఉంటుంది)

ఊపిరి ఉన్నంతవరకు ఆ ప్రేమ ఓ జ్వాలగా మండుతూనే ఉంటుందట. ఆ శరీరంలో గుండె చప్పుడుగా అది కొట్టుకుంటూనే ఉంటుందట. అంటే ప్రేమకు కలయికతో పని లేదు. ఒక వ్యక్తిపై ప్రేమ కలిగితే ఆ అనుభూతి దీపంలా శాశ్వతంగా గుండేలో నిక్షిప్తమయిపోతుంది. దాన్ని ఆర్పే శక్తి ప్రపంచంలో ఏ తూఫానుకు లేదు.

వో నక్ష్ క్యా హువా జో మిటాయే సె మిట్ గయా

వో దర్ద్ క్యా హువా జో దబాయే సె దబ్ గయా

దిల్ మే కిసీ కె ప్యార్ కా జల్తా హువా దియా

దునియా కి ఆంధియో సె భలా యే బుఝేగా క్యా

(చెరిపేస్తే చెరిగిపేయే ఆ పటం ఎలాంటిది ? అణిచివేస్తే అణిగిపోయే ఆ నొప్పి ఎలాంటిది? మనసులో ఒకరి కోసం వెలుగుతున్న ప్రేమ దీపం ప్రపంచ తుఫానులకు మాత్రం ఆరిపోతుందా)

ఒక వ్యక్తి రేఖా చిత్రం మనసులో చిత్రించుకున్నతరువాత దాన్ని చెరిపేస్తే చెరిగిపోతుందా? ఒక వేళ అలా జరిగితే అది ప్రేమ ఎలా అవుతుంది? అలాగే ప్రేమ ఎంత బాధిస్తున్నా, ఆ బాధను బలవంతంగా అణిచేస్తే అణిగిపోతుందా? అలా జరిగితే అది ప్రేమే కాదు. అంటే ప్రేమ దేనికీ లొంగదు, చెదరదు అని చెప్పడం ఇక్కడ కవి ఉద్దేశం. అయితే ఆ ప్రేమ ఆనందాన్ని ఇస్తే ఈ వాక్యాలు ఓ సవాలుగా విపిస్తాయి. కాని అదే ప్రేమలో విషాదమే మిగిలితే ఇది అత్యంత కఠినమైన స్థితి, చెరిగిపోని జ్ఞాపకాలతో ఒంటరిగా మనిషి ప్రయాణించవలసిన భయంకరమైన స్థితి అది. కవి ఏ స్థితిని సూచిస్తున్నాడో ఇక్కడ స్పష్టం అవదు. ప్రేమలోని ఆనందాన్ని, విషాదాన్ని ఒకేసారి వ్యక్తీకరించడం ద్వారా కవి తటస్థంగా నిలబడి, మనలను పరిక్షకు పెడుతున్నాడనిపిస్తుంది. అలా చెదిరిపోని, మాసిపోని, అణిగిపోని గుర్తులు, మనిషికి ఆనందం ఇస్తాయా విషాదాన్ని అందిస్తాయా అన్నది వేరే సంగతి. ప్రేమ లోతు తెలిసిన వారికి అందులో ఆనందమే కాదు విషాదమూ కనిపిస్తుంది. ప్రేమ ఓ బాధ్యత అని కూడా అనిపిస్తుంది. జీవితాంతం మనిషి మోయవలసిన బంధం అని కూడా అర్థం వస్తుంది.

యే జిందగీ భీ క్యా హై అమానత్ ఉన్హీ కీ హై

యె షాయరీ భీ క్యా హై ఇనాయత్ ఉన్హీ కీ హై

ఇనాయత్ ఉన్హీ కీ హై

(ఈ జీవితం వారి ధరావత్తే కదా, ఈ కవిత్వం వారి కృపే కదా)

(ఉర్దూలో ప్రేమికులు ఒకరినొకరు బహువచనంలో సంభోధించుకునే సంస్కారం ఉంది. అందువలన ఇక్కడ లింగ భేధం ఉండదు).

తన జీవితాన్ని, భవిష్యత్తుని ప్రేమికుడికి దారాదత్తం చేసానని ఆమె చెబుతుంది. తనలోనించి వచ్చె కవిత్వం కూడా అతను తనకిచ్చిన బహుమతే అన్నది ఆమె ఉద్దేశం. అతనే లేకపోతే ఆమెకు ప్రేమ తెలిసేది కాదు. ప్రేమ అనుభవించకుండా ఆమెలోనించి ఆ కవిత్వమూ వచ్చేది కాదు. ఇక్కడ కవి రాసిన ఈ రెండు వాక్యాలను గమనించండి. జీవితమూ, కవిత్వమూ ఇవి రెండూ ప్రేమకే అధీనం అని చెప్పడం అతని ఉద్దేశం. అంటే జీవితం ఎంత ముఖ్యమో కవికి తన కవిత్వమూ అంతే ముఖ్యం, కవిత్వానికి జీవితానికి ఆయన సమాన ప్రాధాన్యతను ఇవ్వడం గమనించండి. తన జీవితంపై, కవిత్వంపై, అతని ప్రభావం తప్పకుండా ఉండి తీరుతుందని అది నిర్మూలించడం ఎవరి తరమూ కాదని ఆమె చెబుతుంది. అసలు ఈ పాట ఇక్కడకు వచ్చేసరికి శ్రోతలు ఒక రకమైన పారవశ్యంలోకి వెళ్ళిపోతారు. మన జీవితంలోని ప్రతి ఘట్టం, మన మనసులోని ప్రతి అనుభూతి మన గత అనుభవాల ఆధారంగానే మనల్ని ప్రభావితం చేస్తాయి. కవి ఈ తత్వాన్ని ఈ రెండు వాక్యాలలో పొందు పరిచారు. ఇక ఆ తరువాత వచ్చే వాక్యాలు ఇవి..

అబ్ వో కరం కరే కె సితం ఉన్ కా ఫైసలా

హమ్నె తొ దిల్ మె ప్యార్ కా షోలా జలా దియా

దిల్ మే కిసీ కె ప్యార్ కా జల్తా హువా దియా

దునియా కి ఆంధియో సె భలా యే బుఝేగా క్యా

(ఇక వారు నాకు మేలు చేసినా కీడు చేసినా అది వారి నిర్ణయం. నేను మాత్రం నా మనసులో ఈ ప్రేమాగ్నిని వెలిగించుకున్నాను. మనసులో ఒకరి కోసం వెలుగుతున్న ప్రేమ దీపం ప్రపంచ తుఫానులకు ఆరిపోతుందా)

ఇది సాహిర్ శైలి. ఆమె ఆ ప్రేమలో ఎంతగా మునిగి తేలుతుందంటే, అతను తనకు మేలే చేస్తాడో, కీడే చేస్తాడొ అతని నిర్ణయం అని తాను మాత్రం అతనిపై ప్రేమతో తన మనసులో ఓ అగ్నిని వెలిగించుకున్నానని, అది ప్రపంచ తుఫానులకు కూడా ఆరిపోదని చాలా స్పష్టంగా చెబుతుంది. సాహిర్ కవిత్వంలో ప్రేమికులు నువ్వు లేకపోతే నేను ఉండను, నువ్వు నాకు కావాలి, నువ్వే నా బలం, బలహీనత లాంటి మాటలు చెప్పరు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇక మిగతాది నీ నిర్ణయం అంటూ అవతలి వారి నిర్ణయంతో తమ ప్రేమకు సంబంధం లేదని తమలో వెలుగుతున్న ప్రేమ దీపం మరొకరి నిర్ణయాలకు అధీనం కాదని బలంగా చాటి చెప్తారు. సాహిర్ రాసిన ప్రేమ గీతాలన్నీ వెతికి చూసినా ఇదే ఆత్మగౌరవం ప్రతి గీతంలోనూ కనిపిస్తుంది. సాహిర్ ప్రేమికులు ప్రేమలో అమోఘమైన బలాన్ని ప్రదర్శిస్తారు తప్ప బలహీన మనస్కులుగా మారరు. ఈ ఆనంద/విషాద గీతంలో అదే కనిపిస్తుంది. ఈ పాటలో చివర్న వచ్చే ఆ రెండు వాక్యాలు నాకు అత్యంత ఇష్టం అయిన కవిత్వపు పంక్తులు.. అందులో విషాదం ఉందా ఆనందం ఉందా తెలియదు కాని కళ్లకు చెమ్మ అంటని ఆనందమూ విషాదమూ పేలవమయినవే కదా. ఈ వాక్యాలు విన్న ఎన్నో సందర్భాలలో కళ్లలో ఓ నీటి చెమ్మ ఊరి ఓ గొప్ప అనుభూతిని మనసు అనుభవించిన మాట మాత్రం వాస్తవం.

అబ్ వో కరం కరే కి సితం ఉన్ కా ఫైసలా

హమ్నె తొ దిల్ మె ప్యార్ కా షోలా జలా దియా..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version