Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-16 – మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘చిత్రలేఖ’ (Chitralekha, 1964) చిత్రం లోని ‘మన్ రే తూ కాహే నా ధీర్ ధరే’. గానం రఫీ. సంగీతం రోషన్.

~

సాహిర్ నా అభిమాన కవి అవడం వెనుక కారణం, నా జీవితంలో అతి కష్టమైన సమయాలలో ఆయన రాసిన పాటలు నాలో శక్తిని నింపడం. కొన్ని జీవిత వాస్తవాలను నేను ఒప్పుకుని ముందుకు నడవడానికి సాహిర్ గీతాలు నాకిచ్చిన స్ఫూర్తి నేను ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని కఠిన వాస్తవాలను ఒప్పుకోవడానికి నా మనసు సిద్ధంగా ఉండేది కాదు. అందమైన అబద్ధాలను నమ్మినంతగా కఠినమైన వాస్తవాలను మనం ఒప్పుకోలేం. కాని సాహిర్ ప్రతి గీతంలో ఈ కఠినమైన వాస్తవాలనే చాలా సహజంగా వ్యక్తీకరించేవాడు. ఎంత సహజంగా అంటే ఆ గీతాలను వింటున్నవారు, వాటి లోతును అర్థం చేసుకునే శ్రోతలు ఆ కఠిన వాస్తవాలను ఒప్పుకుని తీరతారు. నాలాంటి అనుభవ శూన్యులకు, జీవితం కొట్టిన దెబ్బలకు దిగాలుపడిన బలహీనులకు సాహిర్ గీతాలు ఔషధంగా  పని చేస్తాయి. ముఖ్యంగా జీవితపు గాయాలు మనలో మిగిలించే కోపాన్ని, అసహాయతను వదిలించుకుని జీవితంలో గట్టిపడడానికి అవి సహాయపడతాయి. ఆ గాయాల నొప్పిని వదిలించుకుని అందులోనించి అనుభవాన్ని మాత్రమే మిగుల్చుకుని ముందుకు నడవడానికి ఆయన రాసిన గేయాలు గొప్పగా పని చేస్తాయి. ఇది నా స్వానుభవం. అందుకే సాహిర్‌ని నా జీవితంలో ఓ గురువు స్థానంలోనే నెనెప్పుడూ ఉంచి ఆరాధిస్తాను. అలా నా కష్టసమయంలో నాకు తోడుగా నిలిచిన ఓ గీతం ‘చిత్రలేఖ’ సినిమాలోది. ఈ పాటలోని లోతు మనసులని కుదిపేస్తుంది. ప్రపంచంతోనూ, అనుబంధాలతోనూ ఓ రకమైన నిర్లిప్తతను ఆపాదించుకోవడానికి ఇది సహాపడుతుంది. జీవితంలోని పరిపక్వత మనం ఏర్పరుచుకున్న బంధాల నడుమ ఇటువంటి నిర్లిప్త ధోరిణిని అవలంబించుకోవడంలోనే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడం కష్టం, కఠినం కాని విస్మరించలేని వాస్తవం.

మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

వో నిర్మోహి మోహ్ నా జానే జిన్కా మోహ్ కరే

మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

(ఓ మనసా ఎందుకు నెమ్మదించవు నీవు. ఎవరిని నువ్వు మోహిస్తున్నావో వారు నిర్మోహులు, మోహం ఎరుగని వారు, అందుకే కాస్త నెమ్మదించు మరి)

మనం మన చుట్టు ఉన్నవారిని ప్రేమిస్తాం. వారి నుండి ఎంతో కోరుకుంటాం. కాని చాలా సందర్భాలలో వాళ్ళు మన ప్రేమను పట్టించుకోరు. ఎంతగా వారి సాంగత్యాన్ని కోరుకుంటామో అంతగా మన ఉనికి వారు గమనించకుండా ఉండిపోతారు. మనకు విలువ ఇవ్వకుండా అవమానిస్తారు, గేలి చేస్తారు. అయినా వారిని ప్రేమిస్తూ మనలను మనం బలహీనపరుచుకుంటూ, వారి నుండి ప్రేమను అర్థిస్తూ ఉండిపోవడమేనా ప్రేమ అంటే? అది మనలను అంత బలహీనులుగా మారుస్తూ ఉంటే, మన వ్యక్తిత్వాలను క్రుశింపజేస్తూ ఉంటే మనం ఆలోచించవద్దా, మన మనసుకు సర్ది చెప్పుకోవద్దా. అది మనకు మనమే చేసుకోవాలి. అందుకే కవి ఇక్కడ తన మనసుతో తాను సంభాషిస్తూ అంటున్నాడు. ఓ మనసా కాస్త నెమ్మదించు. నీ ప్రేమ వారికి అవసరం లేదు.

ఇక్కడ కవి అవతల వారిని కఠినాత్ములంటూ తూలనాడట్లేదు. అలా చేస్తే అది మనకే కష్టం కలిగిస్తుంది. వారిపై లేదా మనపై మనకే కోపాన్ని కలిగిస్తుంది. అందుకని ఆయన మన ప్రేమను పట్టించుకోనివారి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో చూడండి. వారు నిర్మోహులు, మోహం తెలియని వారు అట. నిర్మోహులు అంటే అన్నీ త్యజించినవారు, సన్యాసులు అని కూడా అర్థం వస్తుంది. అంటే అన్ని భవబంధాలను దాటినవారు అని అర్థం. కాని ఇక్కడ సాహిర్ ఆ వాక్యానికి ఎంత గంభీరతను జోడించారంటే మన ప్రేమను పట్టించుకోని వారు మన కన్నా ఉన్నతులు అని అనుకుంటే కలిగే భావంలో ఓ వ్యంగ్యం, ఓ తర్కం కనిపిస్తుంది. మనం ప్రేమించిన వారు హీనులనుకుంటే అది మనకే అవమానం, మనల్ని మనం గాయపరుచుకోవడమే. వాళ్లు మన కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నవారని అనుకోవడం మనల్ని మనం గౌరవించుకోవడమే. అవతలి వారి తిరస్కారాన్ని స్వీకరించడంలో అవమానపడడం కాక మనల్ని మనం నిలబెట్టుకోవడం ఇది. మరో వైపు అందులో గొప్ప వ్యంగ్యమూ ఉందీ. ఆ వ్యంగ్యంలో తక్కువతనం కాదు ఓ స్థాయి గొప్పతనమూ కనిపిస్తుంది.

ఇస్ జీవన్ కే చడ్తీ ఢల్తీ ధూప్ కో కిస్ నే బాంధా

రంగ్ పె కిస్నె పెహరే డాలే, రూప్ కో కిస్నే బాంధా

కాహే యె జతన్ కరే

మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

(ఈ జీవితంలో పెరుగుతూ తరుగుతూ ఉండే ఎండను ఎవరైనా బంధించగలిగారా? రంగులకు కాపలా కాయగలిగారా, రూపాన్ని బంధించగలిగారా, మరి నువ్వెందుకు ఆ ప్రయత్నాన్ని చేస్తున్నావు మనసా కాస్త నెమ్మదించు)

జీవితంపై ఎవరి నియంత్రణా ఉండదు. ప్రతి రోజు వచ్చి పోయే సూర్యరశ్మి ఎదుగుదల, తరుగుదలను మనం నియంత్రించగలమా. అది తన ఇష్టం వచ్చినట్లు దానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఎదుగుతూ తరుగుతూ ఎవరి అధీనంలో లేకుండా పని చేస్తుకుంటూ వెళుతుంది. ఆ ఎదుగుదలను ఆనందిస్తాం, తరుగుదలనూ ఒప్పుకుంటాం. మరో దారి లేదు. అలాగే ఈ ప్రపంచంలోని ఎన్నో రంగులకు మనం కాపలా కాయగలమా. రుతువుల అధారంగా ఆ రంగులు మారుతూ ఉంటాయి. మనం వాటిని అలాగే స్వీకరిస్తాం. అది తప్ప మరో దారి లేదు కదా. రూపాన్ని బంధించుకోలేం. వయసు చేసే మాయకు తలవంచక తప్పదు. అంటే ఏదీ మన చేతిలో లేదు. ఉన్నప్పుడు ఆనందించడం, లేనప్పుడు ఆ లోటును కూడా స్వీకరించగలగడమే మనవ జీవితంలోని అర్థం పరమార్థం. మరి మన చుట్టు ఉన్న బంధాలు మనం ఆశించిన స్థాయిలో లేవని దుఃఖపడడం మూర్ఖత్వం కాదా. ప్రకృతి లోని అన్ని అశాశ్వతమైన విషయాలవలే వాటినెందుకు చూడలేకపోతున్నాం?

ఈ వాక్యాలను ఎన్ని సార్లు విన్నా అవి కఠినంగా అనిపించవు. అంత కఠినమైన వాస్తవాన్ని అంత సున్నితగానూ ఎలా చెప్పగలిగాడు సాహిర్ అన్నది అర్థం కాదు. వాక్యంలో ఎక్కడా కష్టమైన పదాలు ఉండవు. పామరుడికైనా సులువుగా అర్థం అయే జీవిత సారం ఇది. ఈ పాట ఓ గజల్ ప్రాసలోనే రాసాడు సాహిర్, కాని ఉర్దూ పదాలకు బదులు శుధ్ధ హిందీ పదాలను వాడాడు. ఈ శైలి గొప్ప కవులను సైతం ఈ రోజుకీ అబ్బుర పరుస్తుంది.

ఉత్నా హీ ఉపకార్ సమఝ్ కోయీ జిత్నా సాథ్ నిభా దే

జనం మరణ్ కా మేల్ హై సప్నా, యే సప్నా బిస్రా దే

కోయీ నా సంగ్ మరే..

(ఎవరెంతవరకు తోడు రాగలరో అదే వారు చేసిన ఉపకారంగా అంగీకరించు, జనన మరణాల సంగమం ఓ కల ఈ కలలను వదిలించుకో. ఎవరూ నీతో కలిసి మరణించరు)

ఈ వాక్యాలు ఓ శ్రోతగా నన్ను ఎంతగా కదిలించాయో చెప్పలేను. ముఖ్యంగా ఆ ఆఖరి వాక్యం ఎవరూ నీతో పాటు మరణించరు అన్నది మనసును సూటిగా తాకుతుంది. ఒంటరిగా మనసుకు తగిన గాయాలను మాన్పుకునే నా ప్రయత్నంలో ఈ వాక్యం ఎన్నో సార్లు నన్ను ఆదుకుంది. కలల ప్రపంచం నుండి వాస్తవానికి నన్ను ఎన్నో సార్లు లాక్కువచ్చింది. ఈ వాక్యాన్ని సాహిర్ రాయడం ఒక ఎత్తయితే దాన్ని రఫీ గానం చేసిన విధానం అత్యద్భుతం. ఎలాంటి మూడ్‌లో ఈ పాటను విన్నా ఇక్కడ రఫీ ఆ వాక్యాన్ని పలికించిన తీరుతో ఓ నిశబ్దంలోకి వెళ్ళిపోతాను. ఆ స్థితిలో ఓ నిర్వేదం ఉంటుంది. దాన్ని మాటల్లో వ్యక్తీకరించే శక్తి నాకు లేదు.

ఎవరెంతవరకు తోడు వచ్చినా అది స్వీకరించి అదే వాళ్ళు మనకు చేసిన ఉపకారంగా భావించి అంతకు మించి ఏమీ ఆశించని స్థితికి మనం చేరుకోవాలి. జననం మరణాలది ఒక చక్రం. అవి కలవ్వు. కలవాలనుకోవడం భ్రమ. ఆ కలను ముందు వదిలించుకోవాలి. ఎందుకంటే ఎవరూ మనతో కలిసి మరణించరు. ఒక్కరమే వస్తామూ, ఒక్కరమే వెళ్లిపోతాము. ఇది ఒక్కటే నిజం. నడుమ వచ్చి ఏర్పడే బంధాలు ఎంత గాఢమయినవి అయినా అవి అశాశ్వతాలే. శాశ్వతమైనది మనకు మనం, మన ఒంటరితనం మాత్రమే. ఇది అర్థం అయితే ఇతరుల నుంచి ఆశించే గుణం తగ్గుతుంది. ముఖ్యంగా ఇతరులపై ఆశ, కోరికలు పెంచుకోవడం మూర్ఖత్వం అని అర్థం అవుతుంది. ఏ శాస్త్రం కూడా ఇంతకన్నా అర్ధవంతంగా జీవిత సత్యాన్ని భోధించలేదేమో..

మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

వో నిర్మోహి మోహ్ నా జానే జిన్కా మోహ్ కరే

మన్ రే తూ కాహే నా ధీర్ ధరే

(ఓ మనసా ఎందుకు నెమ్మదించవు నీవు. ఎవరిని నువ్వు మోహిస్తున్నావో వారు నిర్మోహులు, మోహం ఎరుగని వారు, కాస్త నెమ్మదించు మరి)

ఇంత లోతైన నిజాన్ని ఎరుకపరిచాక మనసు నెమ్మదించక మానుతుందా. ఏదీ మన చేతిలో లేదు, ఉండదు, దేనిపై మన నియంత్రణ ఉండదు. ఉంటుందనుకోవడం మన అమాయకత్వం, అపరిపక్వత. జీవితంలో ఏదీ మనది కాదు. మనతో వచ్చేది పోయేది మన మనసే అందుకే దాన్నిమాత్రమే మనం నియంత్రించుకోగలం. అదొక్కటి మన చేతిలో ఉంచుకుని అశాశ్వతమైన బంధాలను, జీవితాలను, అనుభవాలను వీక్షించగలిగే పరిపక్వతను సాధించుకోగలగడమే జీవితాన్ని అర్థం చేసుకోవడం. మనల్ని మనం నిజానికి దగ్గర చేసుకోవడం ఒక్కటే మనం సాధించగలిగే విజయం.

కోయీ నా సంగ్ మరే.. ఇదొక్కటే వాస్తవం.

ఈ పాట వినడం ప్రతి సారి నాకు ఓ గొప్ప అనుభవం. రఫీ గానం, రోషన్ సంగీతం, సాహిర్ సాహిత్యం ఈ మూడింటి కలయిక ఈ గీతం. భాషా పరంగా కూడా ఇది ఆ రోజుల్లో జరిగిన గొప్ప ప్రయోగం అని చాలా మంది అంటారు. సాహిర్ బ్రతికినన్ని రోజులు ఎవరికీ లొంగక, అందక ఒంటరితనాన్ని స్వీకరించి, అనుభవించి, ఆస్వాదించి ఆలాగే మరణించాడు. ఆయన గీతాలన్నిటిని వెతికి వినే నాలాంటి వారికి ఆయనొక పెద్ద మర్రి వృక్షంలా అనిపిస్తారు. ఆనంద విషాదాలలోనూ ఒకే రకమైన ఠీవీని ప్రదర్శించడం సాహిర్ కే చెల్లింది. ఈ ఒక్క పాట చాలు ఆయన సినీ గీతాలలో హిమాలయాలంత ఎత్తున ఎప్పటికీ నిలిచి ఉంటారని చెప్పడానికి.

ఈ పాట సినిమాలో సందర్బ్భానికి కూడా తగ్గట్టుగా సరిపోతుంది. బీజగుప్తుడు చిత్రలేఖ అనే నర్తకి ప్రేమలో పడతాడు. అతని వివాహం నిశ్చయమైనా , ఆ విషయాన్ని విస్మరించి మరీ చిత్రలేఖను మోహిస్తాడు. చిత్రలేఖ మోహం నుంచి బీజగుప్తుడిని రక్షించాలని అతడి గురువు, సన్న్యాసి  కుమార గిరి కంకణం కట్టుకుంటాడు. కుమారగిరి ప్రభావంతో చిత్రలేఖ శారీరిక వాంచలపై విముఖురాలవుతుంది. కానీ, బీజగుప్తుడు ఆమెను మరచిపోలేకపోతాడు. ‘వో నిర్మోహీ, మోహ న జానే, జిన్ కా    మోహ్ కరే’ అన్న భావన వెనుక ప్రేరణ సినిమా కథ. సినిమా సందర్భంలో చక్కగా వొదిగింది. మిగతా అంతా సినిమా పరిథిలో వొదుగుతూన్నట్టనిపిస్తూ, సినిమా పరిథి దాటి సార్వజనీన భావనలతో ప్రతి వ్యక్తికీ వర్తిస్తుంది. ప్రతి వ్యక్తినీ స్పందింపచేస్తుంది. నిజానిజాలు వివరిస్తూ జీవితం పట్ల అవగాహన పెంచుతుంది.  కోయి న సంగ్ మరే, జనమ్ మరణ్ కా మేల్ యే సప్నా, యే సప్నా బిస్రాదే , ధూప్ కొ కిస్నే బాంధా, రంగ్ పె కిస్నే పహెరే డాలే, రూప్ కొ కిస్నే బాంధా, కాహె యె జతన్ కరే వంటి భావాలన్నీ సార్వజనీన భావాలు. అందుకే, సినిమా పాట అయినా, విన్న ప్రతివారిపై ప్రభావం చూపగల శక్తివంతమయిన గీతంలా ఎదిగిందీ పాట.

హిందీ సినిమాలలో ఉత్తమ గీతాలను ఎన్నుకునే ఓ ప్రయత్నం 2010 లో ఔట్‌లుక్ పత్రిక చేసింది. దానికి 30 మందిని న్యాయ నిర్ణేతలుగా నిర్ణయించింది. అందులో కవులు, గాయకులు, సంగీత దర్శకులు ఉన్నారు. గుల్జార్, జావేద్ అఖ్తర్, మన్నా డే లాంటి హేమాహేమీలందరూ హిందీలో వచ్చిన అన్ని పాటలను పరిశీలించి, సాహిర్ రాసిన ‘మన్ రే’ అనే ఈ పాటను హిందీలో శతాబ్ది ఉత్తమ గీతంగా ఎంచారంటే ఈ పాట ఎంత మంది పండితులను సైతం కదిలించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌పై కొందరు అభ్యంతరాలు వ్యక్తపరిచినా మొదటి స్థానంలో ‘మన్ రే’ పాటను మాత్రం అందరూ ఏకగ్రీవంగా అంగీకరించారు. అది సాహిర్ గొప్పతనం. ఈ పాటని సినీ జగత్తులో ఓ గొప్ప వజ్రంగా గుల్జార్, జావేద్ అఖ్తర్ ఇద్దరూ ఎన్నో సందర్భాలలో ప్రస్తావించారు.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version