Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-17 – దూర్ రహ్ కర్ నా కరో బాత్

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘అమానత్’ (Amaanat, 1977) చిత్రం లోని ‘దూర్ రహ్ కర్ నా కరో బాత్’. గానం రఫీ. సంగీతం రవి.

~

హిందీ సినిమాలలోని శృంగార భరిత సన్నివేశాల చిత్రీకరణకు సంబంధించి ఎన్నో గొప్ప పాటలున్నాయి. దొరికిన ఏకాంతం, కలిసి వచ్చిన ప్రకృతి వీటి మధ్య ఒకరిపై మరొకరికున్న ఇష్టంతో ఓ జంట, వీరి మధ్య ఓ శృంగార గీతం. ఇది సన్నివేశం. ఈ సందర్భాన్ని రక్తి కట్టించే పాటలు ఎన్నో మన మధ్య ఉన్నాయి. అయితే సాహిర్ అలాంటి సన్నివేశానికి రాయవల్సి వస్తే ఆ గీతాన్ని ఎలా రచించి ఉంటారు? ఆయన తన గీతాలలో చూపే ప్రేమలోనూ, ప్రేమికులు వ్యక్తీకరించే భావావేశాలలోనూ ఓ గాఢత ఉంటుందని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎంతటి స్థాయి ప్రేమ అయినా పడక మీదకు చేరే సందర్భాన్ని మాటలలో వ్యక్తీకరించేటప్పుడు సాహిర్ ఎలా ఆ సన్నివేశానికి న్యాయం చేసి ఉంటారు? ఆ సందర్భంలో సాహిర్ ఆ భావావేశాన్ని తన గీతాలలో తన శైలిలో ఏ విధంగా వ్యక్తీకరించి ఉంటారో తెలుసుకోవాలని అనిపించడం సాధారణం కదా. అలాంటి సందర్భానికి కూడా సాహిర్ పాటలు రాసారు. ఆ పాటను ఇప్పుడు చర్చించుకుందాం.

సాహిర్ శైలిలో ఓ స్పష్టత ఉంటుంది. ఆయన కలం తన పాత్రల మనసును సూటిగా వ్యక్తీకరిస్తుంది. అంటే మనసులోని భావాన్ని, కోరికను ఎటువంటి నిరోధం లేకూండా వీరి స్త్రీ పాత్రలు కూడా వ్యక్తీకరిస్తాయి. మరి ఇక్కడ సన్నివేశ పరంగా ఓ పురుషుడు తనలోని కోరికను ప్రియురాలి దగ్గర వ్యక్తీకరించాలంటే సాహిర్ కలం అతనితో దాన్ని ఎలా పలికించింది. సాహిర్ శైలిని ఇతర ప్రేమ గీతాలలో గమనించాక అసలు అలాంటి పాట సాహిర్ రాసి ఉండడని నాకు అనిపించేది. ‘అమానత్’ సినిమాలోని ఈ పాట వినే దాకా శారీరిక కోరికను వ్యక్తీకరించే గీతాలకు సాహిర్ సూటితనం పనికి రాదని. అందుకని అలాంటి పాటలు అతను రాసి ఉండడనే అనుకునేదాన్ని. కాని తన శైలిలో ఆ సూటితనం తగ్గకుండా క్లిష్టమైన పదాలను వాడకుండా, చంద్రుని పైనో ప్రియురాలి అందంపైనో నెపం నెట్టకుండా తనలోని కోరికను ముక్కు సూటిగా వ్యక్తీకరిస్తూ, మరి ఎక్కడా అది ఆ పాత్ర బలహీనతగానో, అవసరంగానో అనిపించనీయకుండా రాయగలడం సాహిర్‌కే చెల్లింది. వివాహం కాని ఇద్దరు ప్రేమికుల మధ్య ఆకర్షణను ఎంతో సహజంగా, సూటిగా తన శైలిలో సాహిర్ వ్యక్తీకరించిన విధానం నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే.

ఇదే భావాన్ని అటు తిప్పి ఇటు తిప్పి అందమైన పదజాలంలో బంధించి, స్త్రీని మెప్పించి మురిపించే పద్ధతిలో చాలా మంది అద్భుతమైన గీతాలను రాసారు. ఆ సందర్భంలో చాల మంది కవులు స్తీ సౌందర్యారాధననే నేపథ్యంగా తీసుకుని ఆ సౌందర్యం మత్తులో తాము మునిగిపోతున్నాం అనే అర్థం వచ్చేలా పాటలు రాసారు. అక్కడ సందర్భం ఓ జంట శారీరికంగా కలవడం. కాని పాట మొత్తం కూడా ఓ పురుషుడు స్త్రీ సౌందర్యాన్ని వర్ణించడంగా ఉంటుంది. (చౌదవీ కా చాంద్ హో, మైనే పూచా చాంద్  సే). ఈ పాటలు అద్భుతాలే. (నా వరకు నాకు చౌదవీ కా చాంద్ పాట ఓ అద్భుతమే) కాని సందర్భానుసారంగా ఆలోచిస్తే ఇక్కడ స్త్రీ కన్నా, అతనిలోని కోరిక కన్నా ఆమె సౌందర్యమే ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఆ సౌందర్యం  అతన్ని బలహీనుడిని చేసి ఆమెను కోరుకునేటట్టు  ప్రేరేపిస్తుంది. ఇటువంటి శృంగారపు మైమరపు సాధారణంగా వివాహం రాత్రి, లేదా ఏదో సందర్భంలో భార్యాభర్తల నడుమ వచ్చేటట్లుగా చిత్రీకరించేవారు.

అదే సన్నివేశం, వివాహం కాని ఇద్దరు ప్రేమికుల మధ్య ఏదో సందర్భంలో చిత్రీకరించవలసి వస్తే అది చూపీ చూపనట్లు చిత్రీకరించేవారు. కాని 1969లో వచ్చిన ‘ఆరాధన’ చిత్రంలో ఇలాంటి సందర్భంలో ఓ పూర్తి రొమాంటిక్ గీతం (రూప్ తేరా మస్తానా) పెట్టడంతో హిందీ సినిమాలలో ఇటువంటి గీతాలకు ప్రాధ్యాన్యత పెరిగింది. వివాహం కాకుండా ఒకటయే జంటల ప్రస్తావన ఆరాధన ముందు కూడా ఎన్నో సినిమాలలో వచ్చింది. ధూల్ కా ఫూల్ (1959), ఏక్ ఫూల్ దో మాలి (1969) సినిమాల కథలో ఇలాంటి శృంగార భరిత సన్నివేశలు అవసరంగా మారినప్పుడు కూడా అక్కడ పాట రూపంలోనో లేదా వివరణాత్మక చిత్రీకరణ గానో దర్శకులు ఆ సన్నివేశాలను చూపలేదు. కాని, భీగీరాత్(1965) సినిమాలో నాయికా నాయకులు వర్షంలో చిక్కుకున్నప్పుడు , గుహలో తల దాచుకుంటారు. తడిసిన దుస్తులతో  నాయిక చిలిపిగా ‘ దిల్ జో న కహె సకా’ అంటూ పాడుతుంది. అంతకు ముందు ‘కశ్మీర్ కీ కలి’ సినిమాలో వర్షంలో చిక్కుకున్న శమ్మీ కపూర్, శర్మిలాలు ఓ ముసలమ్మ గుడిసెలో తల దాచుకుంటారు. ‘ఇషారో ఇషారోం మె దిల్ లేనె వాలే’ అనే సుందరమైన గీతాలు పాడతారు. ఈ పాటలు సూపర్ హిట్ అయి ఆరాధన సినిమాలో  ‘రూప్ తెరా మస్తానా’  పాటకు దారి తీసింది. ‘రూప్ తేరా మస్తానా’ తరువాత అలాంటి పాటల అవసరం వచ్చింది. అయితే ‘రూప్ తెరా మస్తానా పాటతో అలాంటి సందర్భాలలోని లైంగికత స్పష్టంగా ప్రదర్శించటం ఆనవాయితీ అయింది.

కాని ‘అమానత్’ సినిమాలో ఈ పాట ‘ఆరాధన’ సినిమా స్థాయిలోనే ఉంది. పైన వర్షం, చుట్టూ ఏకాంతం, తడిసిన బట్టల్లో మంట చుట్టు సెగ కాసుకుంటూ హీరో హీరోయిన్లు. ఆ ఏకాంతాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకునే హీరో. దీనికి సాహిర్ రాసిన గీతం ఇది..

దూర్ రహ్ కర్ నా కరో బాత్, కరీబ్ ఆ జావో (2)

యాద్ రహ్ జాయెగి యే రాత్, కరీబ్ ఆ జావో

(దూరంగా ఉండి మాట్లాడకు, దగ్గరకు రా, ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది నా దగ్గరికి రా)

దూరంగా నిలిచి బిడియంగా చూస్తున్న ప్రియురాలిని అతను దూరంగా ఉండవద్దని దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. ఆ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆమె తన దగ్గరకు వస్తే అంటూ ఆమెను ఆహ్వానిస్తున్నాడు.

ఏక్ ముద్దత్ సె తమన్నా థీ తుమ్హె ఛూనే కీ, (2)

ఆజ్ బస్ మె నహీ జజ్బాత్ కరీబ్ ఆ జావో (2)

దూర్ రహ్కర్ నా కరో బాత్ కరీబ్ ఆ జావో

(చాలా కాలం నుండి నిన్ను స్పృశించాలన్న  కోరిక నాలో ఉంది. ఇవాళ నా భావోద్వేగాలను నేను నియంత్రించుకోలేకపోతున్నాను, నా దగ్గరకు రా)

ఇది సాహిర్ శైలి, ఇక్కడ ప్రకృతి చాటున అతను దాక్కొవట్లేదు, ఆమె సౌందర్యాన్ని ఓ సాకుగా చూపెట్టట్లేదు. తనలో ఆమెను తాకాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందట. ఇన్నాళ్ళు నియంత్రించుకున్నాడట కాని ఇప్పుడు కుదరట్లేదట. ఇక్కడ సాహిర్ ఆ ప్రియుడిలోని కోరికను ఎంత సహజంగా సూటిగా వ్యక్తీకరిస్తున్నడో చూడండి.

ఆమెతో కలిసి తిరుగుతున్న  ఇన్ని రోజులలోను అతనిలో అంతర్లీనంగా ఆమెను తాకాలనే  కోరిక ఉందట. ప్రియురాలిని ముట్టుకోవడానికి అతను ఇన్నాళ్లు వేచి ఉన్నాడు. ఇప్పుడు దాన్ని బైట పెడుతున్నాడు. అన్నీ ఫాస్ట్ ట్రాక్‌లో నడిచిపోయే ఈ తరంలో ఆమెను తాకటం  కోసం అతను ఎన్నో రోజుల నుంచో ఆరాటపడిపోవడం వింతగా అనిపించవచ్చు. కాని ఆ ఎదురు చూపులోని ఆనందం,  ఆ ఎదురు చూడడంలోని ఓపికలో ప్రియురాలిపై గౌరవం ఉంటుంది. గర్భగుడి బైట వేచి దేవుడ్ని దర్శనం చేస్తుకుని భక్తుడుకి ఓ సారి ఆ విగ్రహం దాకా వెళ్లగలిగినప్పుడు అతనిలో కలిగే ఆ భావం, అందులోని ఉత్సాహం అనుభవించినపుడు కానీ ఆ దూరానికున్న గౌరవం అర్థం కాదు. సులువుగా లభించే వస్తువు ఎంత గొప్పదయినా దానికి విలువ ఇవ్వం. అరుదుగా దొరికే పుష్పంపై ఉన్న పూజ్య భావం గడ్డి పూలపై ఉండదు. అలా అని గడ్డిపూవు అందంగా ఉండదని, అది పూవు కాదని కాదు కదా. కాని దేన్నయినా పొందడంలో పడ్డ శ్రమ, దూరం ఆ వస్తువు నాణ్యతను పెంచుతాయి. అది మనుషులకూ వర్తిస్తుంది. ఇక్కడ ఏనాడు ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వని ఆ స్త్రీ పట్ల అతనిలో ఉండే కుతూహాలం, ఆమె శరీరాన్ని అతను  కోరుతూ కూడా ఆమెను మన్నిస్తూ అర్థిస్తున్న అతని విధానంలో ఉన్న పరస్పర గౌరవాన్ని అర్థం చేసుకుంటే తప్ప, బంధాలలో  దూరం ఎంత అవసరమో అర్థం కాదు.

అయితే ఇలాంటి శృంగార సన్నివేశాలలో కూడా ఇంతటి నిజాయితీని అది అతని బలహీనతలా కనిపించనీయకుండా అతని ద్వారా సూటిగా వ్యక్తీకరించగలగడం ఒక్క సాహిర్‌కే సాధ్యమేమో. ఈ పాట ఎన్ని సార్లు విన్నా, ఈ రెండు వాక్యాల దగ్గర సాహిర్ శైలికి ఆనందపడుతూ నవ్వుకోవడం నా వరకు నాకు ఓ అందమైన అనుభూతి.

సర్ద్ ఝోంకో సె భడకతే హై బదన్ మే షోలే (2)

జాన్ లే లేగి యె బర్సాత్ కరీబ్ ఆ జావో (2)

దూర్ రహ్కర్ నా కరో బాత్ కరీబ్ ఆ జావో

(ఈ చలి గాలులుతో శరీరంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ వాన ప్రాణం తోడేస్తుంది. నా దగ్గరకు రా)

శృంగారంలో శరీర కోరికను మాత్రమే ప్రస్తావించే సందర్భంలో నిజాయితీగా అంతే నిక్కచ్చిగా సాహిర్ తన మనసులోని కోరికను వ్యక్తీకరించడం, చెప్పడం పైగా అది అశ్లీలంగా అనిపించకపోవడం వెనుక కారణం ఏంటన్నది అర్థం కాదు. ఈ సందర్భంలో ఇంకెవరు ఏం రాసినా అది అశ్లీలంగానే అనిపిస్తుంది. అది కేవలం నాకు సాహిర్‌పై ఉన్న భక్తి మాత్రమే అంటే నేను అంగీకరించను. ఆయన విషయాన్ని ప్రస్తావించే తీరులోనే ఓ పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎటువంటి పాటకైనా ఓ గాంభీర్యాన్ని తీసుకొస్తుంది తప్ప లేకి భావాన్ని అంటగట్టదు.

ఆల్బర్ట్ కాము గురించి మనకు తెలుసు కదా. అతని రచనలలోని అబ్సర్డిజం ఎంతగా ఆకట్టుకుంటుందో అతని శిష్యులమని చెప్పుకునే వారి వాదనలో అది కేవలం వితండవాదంగానే అనిపించే సందర్భాలు సాహితీకారులు అనుభవించే ఉంటారు. సాహిర్ గీతాలలోని శృంగారంలో ఎంత సూటిగా శరీరపు వేడిని ప్రస్తావించినా దానిలో ఒక గాంభీర్యత ఉంటుంది. ఆ నిజాయితీలో ఓ సంపూర్ణత ఉంటుంది. అది అందరికీ అబ్బదు. ఎలాంటి భావాన్నయినా నిజాయితీగా చెప్పినప్పుడు ఆ భావానికొక పవిత్రత అబ్బుతుంది.  అందుకే ఇదే భావంతో, అనువాదంతో, సందర్భంతో, ఇలాంటి గీతాలు ఎన్ని వచ్చినా ఈ పాటకున్న నిండుదనం వాటికి ఉండదు. ఎక్కడో ఏదో తక్కువయి, ఆ కోరిక ఓ బలహీనతగా అనిపిస్తుంది. సాహిర్ గీతాలను గమనిస్తూ ఉంటే అతను శృంగార సన్నివేశాలలో కూడా “భూల్ కోయీ హం సే నా హో జాయే” అంటూ తాను చేసేది ఓ తప్పని అనిపించే విధంగా తన ప్రేమను ప్రస్తావించుకోడు. (ఆనంద్ భక్షీ గారు క్షమించాలి). ఇక్కడ వివాహం కాని ఈ జంట ఆ సమయంలో దాన్ని తప్పుగా భావించట్లేదు. అతను ప్రకృతి నన్ను ప్రేరేపిస్తుంది, నీ అందం నాకు మత్తెక్కిస్తుంది అని కూడా చెప్పట్లేదు. అది తనలోని కోరిక అని ఎప్పటి నుంచో తనలో ఉందని నిజాయితీగా ఒప్పుకుంటున్నాడు ఆల్బర్ట్ కామూ లాగే. కాకపోతే ఈ ఒప్పుకోవడం సాహిర్ కాకుండా మరొకరయితే ఆ గీతం ఇలా ఉంటుందా అన్నదే చర్చించుకునే విషయం.

ఇస్ కదర్ హమ్ సె ఝిఝకనే కి జరూరత్ క్యా హై

జిందగీ భర్ కా హై అబ్ సాథ్ కరీబ్ ఆ జావో

(ఇలా నా దగ్గర నువ్వు సంకోచించాలసిన అవసరం ఏముంది? జీవితాంతం ఉండే తోడు ఇది, నా దగ్గరకు రా)

ఇక్కడ ఆమె సంకోచాన్ని ప్రస్తావిస్తూనే ఓ స్త్రీ కోరికునే ‘జీవితాంతం ఉండే తోడు’ అనే మంత్రంతో ఆమెను తన దగ్గరకు రప్పించుకోవాలనుకునే ప్రయత్నం చేస్తున్నాడు అతను. ఎక్కడా ఈ పాటలో ప్రేమ అనే పదాన్ని సాహిర్ ఉపయోగించట్లేదు. ఆ క్షణంలో అతనిలోని కోరికకు ప్రేమ ముసుగు వేసి అతను ఆమెను ఇబ్బంది పెట్టట్లేదు. అంటే ప్రేమ, సౌందర్యం, ప్రకృతి.. వీటి వల్ల నేను నిస్సహాయుడిగా మారి నిన్ను కోరుకుంటున్నాను అనే అర్థాన్ని సాహిర్ ఇవ్వట్లేదు. నాలో ఈ కోరిక ఎప్పటినుంచో ఉంది. నేడు నియంత్రించుకోలేకపోతున్నాను. నిన్ను కోరుకుంటున్నాను. నా దగ్గర నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇది జీవితాంతం ఉండే తోడు కాబట్టి భయం వీడు నన్ను చేరు అంటున్నాడు అతను. అంతే కాదు, ఇలాంటి భావననే తాజ్ మహల్ సినిమాలో ‘శర్మ్ గైరోంసె హువా కర్తె హై అప్నోంసె నహీ’ (పరాయివారిముందు సిగ్గుపడతారు కానీ, తనవారిముందు ఎవరూ సిగ్గుపడరు) అనిపిస్తాడు. అదే భావనను నా సమీపానికి  రావడానికి ఇంతగా సంకోచిస్తావెందుకు? అనిపిస్తున్నాడు.  ఇలాంటి సందర్భంలో వచ్చే ఏ గీతం అయినా ఆమె సౌందర్యం, పకృతి వర్ణన, వారి మధ్య ఉన్న ప్రేమను ప్రస్తావించకుండా, కోరికను ఏ ముసుగు లేకుండా కోరికలాగే వ్యక్తీకరిస్తూ మళ్ళీ దాన్ని అంతే హృద్యంగా పలికించగా నేను వినలేదు. ఈ పాట అందం సాహిర్‌దే కాదు రఫీది కూడా. ‘ఆజ్ బస్ మే నహి జజ్బాత్’, ‘జాన్ లే లేగి బర్సాత్’ అన్న వాక్యాలను ఆయన పలికిన తీరు చూడండి. అక్కడ గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకున్నట్లు అనిస్తుంది.. ‘దూర్’ అన్న పదం దగ్గర దూరాన్ని సూచిస్తూ సాగదీసి, ‘కరీబ్’ ను,  దగ్గరి తనాన్ని సూచిస్తూ పలకటం ఒక్క రఫీకే సాధ్యం.

ఆజ్ బస్ మే నహీ జజ్బాత్  కరీబ్ ఆ జావో..

జాన్ లే లేగి యె బర్సాత్ కరీబ్ ఆ జావో..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version