[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘సాధన’ (Sadhna, 1958) చిత్రం లోని ‘ఔరత్ నే జనమ్ దియా మర్దోం కో’. గానం లతా మంగేష్కర్. సంగీతం దత్తా నాయక్.
~ం
ఒక సినీ గేయ రచయితకు ఎన్నో విషయాలపై పాటలు రాయవలసి వస్తుంది. కొన్ని తన మనసుకు నప్పే భావాలు కావచ్చు కొన్ని తాను నమ్మని విషయాల కావచ్చు. సందర్భానుసారం సన్నివేశం ఆధారంగా సినీ గేయ రచయితలు రాయవలసి వస్తుంది. కాని సాహిర్ పాటలను గమనిస్తే ఆయన ఏ సన్నివేశాన్ని అయినా తన వైపుకు లాక్కుని తాను నమ్ముతున్నదే రాసిన సందర్భాలు అనేకం. ఆశ్చర్యంగా ఆ పాటలే ప్రజలకు చేరువయ్యాయి. సాహిర్ చాలా మందితో విభేదించాడు. బతికుండగా అతన్ని ఇష్టపడిన వాళ్ళు చాలా తక్కువ. అయినా ఆయన ఎవరినీ లెక్కచేయలేదు. గేయ రచయితను ఎవరూ పట్టించుకోని సందర్భంలో ఆయన పోరాడి గేయ రచయిత పేరు సినీ పోస్టర్ల మీద ఉండాలని గొడవ చేసి మరీ సాధించుకున్నారు సాహిర్ వాదన కారణంగానే వివిధభారతిలో సినీ పాటల రచయిత పేరు వినిపించే సాంప్రదాయం మొదలయింది.
సినీ గాయకులతోనే పాట ప్రజలకు చేరువవుతుంది అనే గాయకుల వాదానికి ఒప్పుకోక రచయిత లేకపోతే గాయకులే లేరని, తన పాట ఎవరు పాడినా అది హిట్ అవుతుందని సవాలు విసిరి మరీ దాన్ని నిరూపించాడు సాహిర్. లతా మంగేష్కర్ తోనే పాటకు అందం అన్నవారిని కాదని, ఆమెను పక్కన పెట్టి ఇతర గాయనీమణులతో పాడించి తన పాటలను హిట్ చేసుకోగలిగారు. అలాగే సంగీత దర్శకుడు లేకపోతే రచయిత లేడన్న వారితో సవాలు చేసి బీ గ్రేడ్ సంగీత దర్శకులుగా చలామణి అవుతున్న వారితో తన పాటలకు బాణీలు కట్టించుకుని వాటిని కూడా హిట్ చేసుకున్నారు.
ఆయన ఎవరినీ లెక్కచేసేవారు కాదని ఆయన్ని ద్వేషించిన వారు ఎక్కువ మంది. సినీ ప్రపంచంలోని తాత్కాలిక స్నేహాలను ఆయన ఎప్పుడూ గౌరవించలేదు, వాటి కోసం వెంపర్లాడలేదు. వారితో కలిసి ఉంటూనే వారిని విమర్శించేవారు. ఆయన చేసిన ఏ సవాలులోనూ ఆయన్ని ఎవరూ ఓడించలేకపోయారు. తన సత్తా నిరూపించుకుంటూనే సినీ ప్రపంచంలో పని చేసారు. ఇంత మితి మీరిన ఆత్మవిశ్వాసం ఉన్న వారిని ఇతరులు భరించలేరు. కాని ఆ ఆత్మవిశ్వాసాన్ని తన వ్యక్తిత్వంలో భాగం చేసుకున్న సాహిర్ అందించిన ఆణిముత్యాలను వింటుంటే ఆయనలోని గొప్పతనం తెలిసి ఆయనపై ఇప్పుడు గౌరవం ఇంకా పెరుగుతుంది. ఇంత మొండి రచయిత సినీ ప్రపంచాన్ని ఏలారని వింటే సినీ వాతావరణం గురించి తెలిసిన వారెవరికయినా ఆశ్చర్యం అనిపిస్తుంది. దానికి ఎంతో పట్టుదల, తనపై తనకు అపారమైన నమ్మకం ఉంటే తప్ప సాధ్యం కాదు. సాహిర్‌కి అందుకే ఎవరూ దగ్గర కాలేకపోయారు. ఒక్క బీ. ఆర్ చోప్రా తప్ప ఆయన ఎప్పటికీ తన సినిమాలకు కావాలనుకున్నవారు ఎవరూ లేరు.
సాహిర్‌ను ఇష్టపడడానికి ఓ పెద్ద కారణం స్త్రీల పై ఆయన తన పాటల్లో ప్రకటించుకున్న గౌరవం. దోపిడీకి గురయ్యే అన్ని వర్గాల పక్షాణ ఆయన నిలిచి పాటలు రాసారు. పూర్తి కమర్షియల్ చిత్రాలలో ఆయన తన కొచ్చిన అవకాశాలను అణగారిన వర్గాల పక్షాణ నిలబడి వారి గొంతుగా మారుతూ చివరి దాకా వినిపిస్తూనే ఉన్నారు. అది ఇతర గేయ రచయితలకు సైతం అబ్బని విద్య. సన్నివేశం ఏదయినా సాహిర్ గొంతుకలో పీడిత వర్గాల ఘోష వినిపించేది. ముఖ్యంగా సమాజంలో స్త్రీల దుస్థితిపై ఆయన కలం సంధించిన ప్రశ్నలు స్త్రీవాదులందరి పోరాటంలో బాసటగా నిలిచేవి. అలాంటిది సమాజ సంస్కారం నేపద్యంలో ఒక సినిమా వస్తే దానికి పాటలు రాసే అవకాశం వస్తే సాహిర్ కలం ఎంత పదునెక్కుతుందో బీ. ఆర్ చోప్రా తీసిన ‘సాధన’ సినిమా పాటలను గమనిస్తే తెలుస్తుంది. వేశ్యా వృత్తి నిర్మూలన, వేశ్యల పురనావాసం నేపథ్యంలో తీసిన ఈ సినిమాకు సాహిర్ రాసిన ఓ పాట ఇది..
ఔరత్ నే జనమ్ దియా మర్దోం కో మర్దోం నె ఉసే బాజార్ దియా
జబ్ జీ చాహా మసలా కుచలా , జబ్ జీ చాహా ధుత్కార్ దియా
ఔరత్ నే జనమ్ దియా మర్దోనం కో
(స్త్రీ మగవాళ్లకు జన్మనిచ్చింది, మగవాళ్లు ఆమెను బజారులో వస్తువును చేశారు. వారికిష్టమొచ్చినట్లు ఆమెను నలిపి తొక్కేసారు, ఇష్టమొచ్చినప్పుడు ఛీత్కరించారు. )
స్త్రీ మగవాడి చేతిలో బానిస. అతని ఇష్టానికి ఆమె జీవితం నలిగిపోతుంది. ఇక్కడ వేశ్యావాటికలోని ఒక స్తీ మగవాళ్ళూ తమపై చేస్తున్న దాష్టికాలను ఒకొక్కటిగా బయటపెడుతుంది. తమకు జన్మనిచ్చిన స్త్రీ జాతినే మార్కెట్లో ఓ వస్తువుగా మార్చిన పురుషుల అహంకారాన్ని ఆమె ఎత్తి చూపుతుంది.
తుల్తీ హై కహీ దీనారో మే బికతీ హై కహీ బాజారో మే
నంగీ నచవాయీ జాతీ హై అయ్యాషోం కె దర్బారో మె
యె వొ బే ఇజ్జత్ చీజ్ హై జొ బట్ జాతీ హై ఇజ్జత్ దారో మె
(ఓ చోట దీనార్లలో ఆమెను తూకం వేస్తే మరో చోట్ల అంగడి సరుకుగా ఆమె అమ్ముడవుతుంది. విలాస శృంగార దర్బారుల్లో నగ్నంగా ఆమెను నర్తింపజేస్తారు. మానవతుల మధ్య పంపాకాలకు గురయ్యే అమానవతి ఆమె)
స్త్రీలపై సమాజంలో జరిగే దోపిడిని సాహిర్ ఎంత సూటిగా చెప్పారో చూడండి. ఇందులో బాధ ఉంది, కోపం ఉంది, ఆక్రోశం ఉంది వీటన్నిటితో పాటు వ్యంగ్యం కూడా ఉంది. ఓ చోట నిలువెత్తు ధనం ఇచ్చి ఆమెను తూకం వేస్తారు. అక్కడా ఆమె సరుకే. మరో చోట అంగడిలో ఆమెను అమ్మేస్తారు. ఇక్కడా ఆమె దోపిడినే ఎదుర్కుంటుంది. కొందరు విలాసవంతమైన వారు తమ గొప్ప దర్బారులలో ఆమెను నగ్నంగా నర్తింపజేస్తారు. దిన్ని కళాపోషన లేదా శృంగార భరిత జీవితం అని కూడా అంటారు. కాని దీని మాటున ఆమె ఆ దర్భారులో నిరంతర దోపిడికి గురవుతూనే ఉంటుంది. మర్యాదస్థులు తమలో వంతులు వేసుకుని పంచుకునే మర్యాద లేని వస్తువు ఆమె.
ఈ వాక్యం ఎప్పుడు వింటున్నా నాకు ఒక నాటి తవాయిఫ్ కోటాలు, రాజ దర్బారులు కనిపించవు. అవి ఇప్పుడు రూపం మార్చుకున్నాయి. ఈ వాక్యం దగ్గర నాకు విశాలమైన స్కీన్ మీద నాట్యం చేసే సినీ తారలు కనిపిస్తారు. ఈ మాట చాలా మందికి చేదుగా అనిపిస్తుంది. కాని వలువలు విప్పి నర్తించే సినీ తారలు ఎంతగా తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారో అర్థం అయి నాకు బాధ కలుగుతుంది. వీరిని అనుకరించే స్త్రీలను చూసినప్పుడు, దాన్ని స్వేచ్ఛ అనే వారిని వితండవాదాన్ని విన్నప్పుడు అసహ్యం వేస్తుంది. కళా పోషణ పేరుతో కేవలం ఓ సరుకుగా మిగిలిపోతున్నవారి అమాయకత్వాన్ని, అలాంటి విష సంస్కృతిని కళ పేరుతో పోషిస్తున్న ఆధునిక సమాజం చేసే వితండవాదాన్ని సాహిర్ రాసిన ఈ ఒక్క వాక్యం ప్రశ్నించదా?
ఇప్పుడు బాహాటంగా వీధులలోకి కురచ బట్టల్లో వచ్చి నా ఒళ్ళు, నా అందం, నా స్వేచ్ఛ అంటూ వితండవాదం చేస్తున్న ఆధునిక స్త్రీలు, వారిని సమర్థించే కళాకారులకు అర్థం కానిది వారి మెదళ్ళు ఎలా దోపిడికి గురవుతున్నాయన్నది. ఆ రోజుల్లో స్త్రీలను బలవంతంగా అంగడి సరుకుగా మారుస్తుంటే, తమపై జరుగున్న అకృత్యాలు, దోపిడి పట్ల అవగాహనతో, వాటిపై ఆ స్తీలు జీవించినంతకాలం పోరాడారు. కాని ఇప్పుడు తామే ఇష్టపూర్వకంగా అంగడి సరుకుగా మారుతూ దాన్ని స్వేచ్ఛ అంటూ పురుషాధిపత్యపు భావజాలాన్ని తమపై జరుగుతున్న మానసిక దోపిడిని స్వేచ్ఛ పేరున ఆమోదిస్తున్న స్త్రీ సమాజం ఎప్పుడు తెలివి తెచ్చుకుంటుందో, ఈ దోపిడిని ఎప్పుడు ఖండిస్తుందో మరి.
భార్యను పాతివ్రత్యం పేరుతో బంధించిన వ్యవ్యస్థ, నల్ల జాతులను, దళితులను, సేవ, కర్తవ్యం, ఖర్మ సిద్ధాంతం, పూర్వ జన్మ రుణం లాంటి పేర్లతో ఇష్టపూర్వకంగా తమకు ఊడిగం చేయడానికి ఉపయోగించుకున్న దోపిడీ వ్యవ్యస్థే ఆధునికత పేరుతో స్తీ తానే వలువలు విప్పి తమ మధ్య ఇష్టపూర్వకంగా తిరుగడానికి స్వేచ్ఛ అనే మాయతో ఆమెను హిప్నటైజ్ చేస్తుందని, తమకు తామే సరుకుగా మారి దోపిడికి ఊతం అవుతున్నామని అర్థం చేసుకోగల స్త్రీల సంఖ్య సమజంలో ఎప్పటికి పెరుగుతుందో ఈ నగ్న నృత్యాల వెనుక ఉన్న పితృస్వామ్య అహంకారం పై నిజమైన పోరు ఎప్పుడు మొదలవుతుందో మరి..
మర్దోం కె లియె హర్ జుల్మ్ రవా ఔరత్ కె లియె రొనా భీ ఖతా
మర్దోం కే లియె హర్ ఐష్ కా హక్ ఔరత్ కె లియె జీనా భీ సజా
మర్దోం కె లియె లాఖోం సేజే, ఔరత్ కె లియె బస్ ఎక్ చితా
ఔరత్ నే జనం దియా మర్దోన్ కో మర్దోన్ నె ఉసె బాజార్ దియా
(పురుషుడు ఎన్ని తప్పులు చేసినా క్షమించే సమాజంలో స్త్రీ ఏడవడం కూడా తప్పే. ప్రతి విలాసవంతమైన కోరిక పురుషుడి హక్కయితే, స్త్రీకి జీవించడమే శిక్ష. మగవారికి ఎన్నో పానుపులు స్త్రీలకు మిగిలింది చితి మాత్రమే.)
ఈ సమాజంలో ఎన్ని తప్పులు చేసినా పురుషుడి గౌరవానికి భంగం రాదు. అతను ఎన్ని సార్లయినా జీవియాన్ని పునఃప్రారంభించుకోవచ్చు. కాని నిత్యం దోపిడికి గురవుతూ జీవించే స్త్రీకి స్వేచ్ఛగా ఏడ్చే అదృష్టం కూడా లేదు. ఆమె కన్నీళ్లను కనపడకుండా పురుషుడి ఆనందానికి భంగం రాకుండా గడపాలి. పురుషుడిని ఆనందంగా ఉంచడానికి ఆమె తన కన్నీళ్ళు కనపడకుండా జాగ్రత్త పడాలి. అతన్ని ఎప్పుడు రంజింపజేస్తూ ఉండాలి. అతనికి సేవలు చేయాలి. ఎప్పుడూ ఎదురు చెప్పకూడదు. ప్రశ్నించకూడదు. అది మంచి స్త్రీల లక్షణం కాదు. పురుషుడు ఆనందంగా ఉండడానికి ఈ సమాజంలో ఎన్నో దారులు ఉన్నాయి. అతను ఇష్టపడని ఎన్నో విషయాల నుండి తప్పించుకునే వెసలుబాటు ఉంది. కాని స్త్రీ తన కష్టాలను వదిలించుకోవడానికి మరణం ఒకటే విశ్రాంతి. కేవలం చితి మంటలు, చివర్లో ఆమె పడుకునే పాడే మాత్రమే ఆమెకు లభించే విముక్తి.
జిన్ సీనోం నె ఇన్ కొ దూధ్ దియా ఉన్ సీనోం కా వ్యాపార్ కియా
జిస్ కోఖ్ నె ఇన్ కా జిస్మ్ ఢలా ఉస్ కొఖ్ కా కారోబార్ కియా
జిస్ తన్ సె ఉగె కోంపల్ బన్ కర్ ఉస్ తన్ కొ జలీల్-ఓ-ఖ్వార్ కియా
(ఏ గుండెలయితే వీరికి పాలను కుడిపాయో వాటితోనే వ్యాపారం చేసారు, ఏ గర్భాలలో వీళ్ళ శరీరాలు తయారయ్యాయో ఆ గర్భాలతో వర్తకం జరిపారు. ఏ శరీరాలపై చిగురిస్తూ పెరిగారో ఆ శరీరాలనే అవమానానికి అగౌరవానికి గురి చేసారు.)
స్త్రీలు తల్లులుగా మారి తమ బిడ్డల ఎదుగుదలకు తమ గర్భాలను, శరీరాలను కృశింపజేసుకుంటూ వారికి జీవితాన్ని ఇస్తే మగవారిగా మారిన ఆ బిడ్డలే ఆ స్త్రీల శరీరాలతో, పాలు తాగిన గుండెలతో వ్యాపారం చేస్తున్నారు. ఆ శరీరాలనే నిత్యం అవమానాలకు, అగౌరవానికి, అవహేళనకు గురి చేస్తూ అది తమ ప్రయోజకత్వం అని విర్రవీగుతున్నారు.
ఈ వాక్యం దగ్గర నాకు ఖలీద్ హొసైని రాసిన ‘ఏ థౌసండ్ స్ప్లెండిడ్ సన్స్’ పుస్తకం లోంచి ఓ వాక్యం గుర్తుకు వస్తుంది. “మగవాడి హృదయం చాలా సంకుచితం. అది తల్లి గర్భం లాంటిది కాదు దానికి రక్తస్రావం కాదు. బిడ్డ కోసం అది సాగదు.” చాలా విషయాలలో తలి బిడ్డ కోసం తనను తాను పెంచుకుంటుంది తగ్గించుకుంటుంది. బిడ్డ కోసం ఎన్నో విధాలుగా తనను కష్టపెట్టుకుంటుంది. ఆ శరీరాలపై మనసులపై ఆ బిడ్డలు మగవారిగా చేసే దాడి, ఆ శరీరాలను అంగడి సరుకులుగా మార్చే విధానం తలచుకుంటే స్త్రీ జీవితంలోని విషాదం అర్థం అవదూ.
సంసార్ కీ హర్ ఎక్ బే షర్మీ గుర్బత్ కీ గోద్ మే పల్తీ హై
చకలో హీ మే ఆకర్ రుకతీ హై ఫాకో సే జో రాహ్ నికల్తీ హై
మర్దోం కీ హవస్ హై జొ అక్సర్ ఔరత్ కె పాప్ మె ఢల్తీ హై
ఔరత్ నే జనం దియా మర్దోన్ కో మర్దోన్ నె ఉసె బాజార్ దియా
(ప్రపంచంలో సిగ్గు విడిచే నైజం పేదరికపు ఒడిలో పెరుగుతుంది. ఆకలి మంటల దారి వేశ్యావాటికలలోకే చేరుతుంది. మగవాళ్ళలోని కామం ఎప్పుడూ కూడా స్త్రీ పాపంగా ముగుస్తుంది. ఆడది మగవాడికి జన్మనిస్తే అతను ఆమెను అంగడి సరుకుగా మార్చాడు)
ఈ వాక్యాలలో సూటితనాన్ని తట్టుకోవడం చాలా కష్టం. ప్రపంచంలో సిగ్గు లేనితనం, నీతిని, విలువలను వదిలేసే పరిస్తితులన్నీ కూడా పేదరికపు ఒడిలో పెరుగుతాయి. పేదరికం మనిషిలోని మంచిని చంపేస్తుంది. మనుషులు సిగ్గుని నీతిని వదిలి పక్కదారి పట్టే అవసరాన్ని కల్పిస్తుంది. ఇది ఎంత గొప్ప వాక్యమో. ఎంతటి దుర్మార్గం వెనుక కూడా పేదరికపు గుర్తులు ఉంటాయి. ఓ స్త్రీ సిగ్గు విడిచి అంగడిలోకి వచ్చి చేరిందంటే దాని వెనుక ఉన్నది ఆమె పేదరికమే. అంటే ఆమె తప్పుకు కారణం వ్యవస్థలోని లోటుపాట్లు. కనీస అవసరాలకు నోచుకోని స్థితిలో మానవ జీవితం ఉండడమే ఈ ప్రపంచంలోని ఎన్నో పాపాలకు కారణం. ఆకలి కడుపులన్నీ చివరకు వేశ్యావాటికలవైపే అడుగులు వేస్తాయి. వేశ్యలను వేశ్యావాటికలను విమర్శించేవారు అర్థం చేసుకోవలసిన సత్యం ఇది. చివరకు మగవాడి కామమే స్త్రీ పాపంగా మారి కనిపిస్తుంది. కాని మనం కనిపిస్తున్న వేశ్యలను, వేశ్యావాటికలను, విమర్శిస్తాం తప్ప, అందులోకి కామ తృప్తి కోసం వెళ్ళే పురుషులను తమ అవసరాలకు పేద స్త్రీల అసహాయతను ఆసరా చేసుకుని నిర్మించుకున్న వ్యవ్యస్థను మనం ప్రశ్నించం.
అంటే సమస్యకు వెనుక ఉన్న అసలైన కారణం మనకు ఆవసరం లేదు. అసహాయులైన స్త్రీల నైతికతను ప్రశ్నిస్తూ మనం నీతిమంతులుగా మనల్ని ప్రచారం చేసుకుంటున్నాం తప్ప ఆ స్త్రీల వెనుక ఉన్న దోపిడీ వ్యవ్యస్థ పట్ల మనకు ఆలోచన లేదు. ఆలోచిస్తే ఆ వ్యవ్యస్థలో భాగమయిన మనమూ ఆ స్త్రీల స్థితికి కారణంగా కనిపిస్తాం. ఎంత గొప్ప దీర్ఘమైన చర్చకు అవకాశం ఇస్తారు సాహిర్ ఈ పై వాక్యాలతో. ఒక మూడు వాక్యాలలో పాప పుణ్యాలపై పెద్ద చర్చ లేవదీస్తూ, అసలు ఆ పాపం వెనుక ఉన్న కారణాన్ని చూడరెందుకని ప్రశ్నిస్తారు. ఇందులో ఓ వ్యంగ్యం కూడా ఉంది. అన్నీ బాగున్న కుటుంబాల మధ్య పుట్టిన మన నీతి, గొప్పతనం మన ఆర్థిక స్థితిలో ఉంది తప్ప మనం ఆ పేదరికపు అనుభవాల మధ్య పెరిగితే ఇదే నీతి సూత్రాలను జపించగలమా? నీతి అన్నది ఆర్థిక భద్రతలోంచి పుడుతుంది అనే పచ్చి నిజాన్ని అందించిన గీతం ఇది.
అలాగే ఇది వింటున్న ప్రతిసారి ఆధునిక జీవితానికి ఆశపడి అలవాటు పడి తృప్తి మరచి కొందరు స్త్రీలు నీతికి పర్యాయాలను మార్చుకుంటూ జీవిస్తున్న విధానం కూడా మరో పక్కన కనిపించి బాధపెడుతుంది. పేదరికంతో పాటు స్వార్థం, అత్యాశ, డబ్బుపై మమకారాలు కూడా స్త్రీల నైతికి పతనానికి దారితీసే వ్యవస్థలోకి సమాజం ప్రవేశించింది. కాని వీటి వెనుక కూడా ఉన్నది మార్కెటీకరణే. ఈ మార్కెట్లో అమ్ముడవుతున్న ప్రధాన వస్తువు అప్పటికీ ఇప్పటికీ స్త్రీయే. కాని ఆ రోజుల్లో స్త్రీ ఈ దోపిడిని అసహాయ స్థితిలో కూడా ప్రతిఘటించింది. ఇప్పుడు స్త్రీ దాన్ని ఆమోదించింది. దోపిడిని స్త్రీలు చూసే విధానంలో, స్వీకరించే విధానంలో మార్పు ఉంది కాని దోపిడి తీవ్రత మాత్రం తగ్గలేదు.
ఔరత్ సంసార్ కీ కిస్మత్ హై ఫిర్ భీ తక్దీర్ కీ హేటీ హై
అవతార్ పయంబర్ జన్నతీ హై ఫిర్ భీ షైతాన్ కీ బెటీ హై
యె వొ బద్ కిస్మత్ మా హై జొ బెటోం కీ సెజ్ పె లేటీ హై
ఔరత్ నే జనం దియా మర్దోన్ కో మర్దోన్ నె ఉసె బాజార్ దియా
(ఈ ప్రపంచానికి స్త్రీ యే విధి. కాని ఆమె అ విధి చేతిలోనే కీలుబొమ్మ. అవతార పురుషులకు స్వర్గ ద్వారాలు తెలుస్తుంది అయినా ఆమె దెయ్యపు కూతురిగానే చూడబడుతుంది. కొడుకుల మంచంపైనే పడుకున్న అభాగ్యురాలైన తల్లి ఈమె.)
స్త్రీ తోనే ప్రపంచం నడుస్తుంది. బలి ఇచ్చే జంతువు కూడా ఆడది కాకూడదన్ననియమం ఉంది. ప్రపంచపు విధికి ప్రతినిధి అయిన ఆ స్త్రీ తన విధి చేతిలోనే కీలుబొమ్మ. ఆమె జీవితం ఆమె చేతిలో లేదు. ఎప్పుడు ఉండదు. అవతార పురుషులకూ స్వర్గద్వారాలు తెరువగల ఆ స్త్రీ మాత్రం జీవితాంతం దెయ్యపు కూతురుగా చుట్టు ఉన్నవారి కోపాన్ని, అసహ్యాన్ని భరిస్తూ జీవించాలి. కొడుకుల మంచంపైనే పడుకుని వారి శరీరపు ఆకలిని తీర్చవలసిన స్థితిలో జీవిస్తున్న ఈమె ఎంత అభాగ్యురాలో.
ఈ ఆఖరి వాక్యం వింటే మనసు ద్రవిస్తుంది. సాహిర్ పాటలలో ఎక్కువగా వినడానికి నేను ఇష్టపడని గీతం ఇది. అలాగే ఎంతో ఇష్టపడే పాట కూడా ఇది. ‘ప్యాసా’ సినిమాలో వచ్చే ‘చక్లె’ కవితలో కూడా సాహిర్ వేశ్యా వాటికలోని స్త్రీలను చూపిస్తూ..
“యె బీవీ భీ హై ఔర్ బెహన్ భీ హై మా భీ” అంటాడు,
వేశ్యావాటికలకు వెళ్ళే వారిలో కొడుకులూ తండ్రులూ అందరూ ఉంటారు. ఆమె ఒకే సమయంలో ఒకరికి తల్లి, ఒకరికి భార్య ఒకరికి చెల్లెలుగా కూడ మారుతుంది. వావి వరుసలు మరిచి కామం కోసం ఓ స్త్రీని ఉపయోగించుకునే పురుష జాతి తెలిసి కూడా ఒకే స్త్రీని కుటుంబం మొత్తం పంచుకున్న దాఖలాలు దోపిడి సమాజంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దోపిడి వ్యవ్యస్థను నిర్మించుకున్న సమాజం దేనికి గర్వపడుతుంది? ఈ కుళ్ళు కుతంత్రాల అవినీతి ప్రపంచంలో మనిషి ఏ విధంగా తనను తాను గొప్పవాడనుకుంటున్నాడు అనే ప్రశ్న సాహిర్ అవకాశం దొరికినప్పుడంతా వాడిగా సంధిస్తూనే ఉన్నాడు.
స్త్రీ శరీరాలపై జరిగే దోపిడిని ఇంత వ్యథతో ఆవిష్కరించిన గేయ రచయిత మనకు కనిపించరు. ఈ పాటలో ప్రతి వాక్యం ఒకో తూటాలా ఉంటుంది. మనసు ద్రవింపజేస్తుంది. స్త్రీల అత్మ ఘోషను వారిపై జరిగే దోపిడిని తూర్పారబట్టి స్త్రీ గొంతుకగా నిలిచిన సాహిర్ అంటే ఏ స్త్రీకి గౌరవం ఉండదు? సన్నివేశపరంగా ఇది వేశ్యావాటికలోని ఓ స్త్రీ పాడే పాట. కాని ఇది కేవలం అక్కడే ఆగదు. సమాజం మొత్తంలో స్త్రీ పై జరిగే శారీరిక మానసిక దోపిడిని ఈ పాట ప్రశ్నిస్తుంది. దానికి ఉదాహరణగా పల్లవి చాలు
ఔరత్ నే జనం దియా మర్దోన్ కో మర్దోన్ నె ఉసె బాజార్ దియా
జబ్ జీ చాహా మసలా కుచలా జబ్ జీ చాహా ధుత్కార్ దియా..
ఇంతకు మించి చెప్పడానికి ఏం ఉందని?
Images Source: Internet
(మళ్ళీ కలుద్దాం)