Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-20 – కిస్కా రస్తా దేఖే

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘జోషీలా’ (Joshila, 1973) చిత్రం లోని ‘కిస్కా రస్తా దేఖే’. గానం కిషోర్ కుమార్. సంగీతం ఎస్. డి. బర్మన్.

~

మనుషులు జీవించినంత కాలం ఓ మాయా ప్రపంచంలో బతుకుతారు. అందరూ మనవాళ్ళే అని అంతా నాదేనని ఆశపడతారు. జీవితంలో కనిపించే ఉత్సాహం అంతా కూడా ఒక రకమైన మాయే. నిజానికి ఎవరూ ఎవరి కోసమూ ఎదురు చూడరు, ఎవరి కోసమో జీవించరు. మన చుట్టూ ఉన్న ప్రేమలన్నీ ఎక్స్‌పైరీ డేట్లున్నవే. కాని మనం దాన్ని నమ్మం. ఈ రోజుపై నమ్మకం ఉండదు కాని కొన్ని తరాల గురించి ఆలోచిస్తాం, తపన పడతాం. మన కోరికలన్నీ గాలి బుడగలని నిజానికి ఎవరూ ఎవరికీ సొంతం కాదని తెలిసిన తరువాత కూడా దాన్ని ఒప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. నిజాలకు దూరంగా, కలల ప్రపంచంలో విహరించగలిగినంత వరకు మనిషికి జీవితం వింత వింత రంగులలో ఆహ్లాదకరంగా ఉంటుంది. సత్యానికి, మానవ స్వభావానికి దగ్గర అవుతున్న కొద్దీ ప్రపంచంలో ప్రతి బంధమూ తాత్కాలికమే అని తెలుస్తుంది.

సాహిర్ ఈ సత్యాన్ని చాలా చిన్న వయసులోనె అకళింపు చేసుకున్నారు. ఆయన ప్రతి పాటలోనూ ఈ నిజం తొంగి చూస్తూ ఉంటుంది. జీవితంలో అతి మాధుర్యమైన ప్రేమనే ఆయన అశాశ్వతమైన భావోద్వేగంగా చూసేవారు. దాని కన్నా మించినవి జీవితంలో ఉన్నాయని చెప్పేవారు. ప్రపంచంలోని మాయా మోహాలను వేలెత్తి చూపుతూ అందులో పడి కొట్టుకుంటూ అది శాశ్వతం అని భావించేవారికి చురకలు అంటించేవారు.

జీవితంలో ఆలోచించే మనిషి ఎప్పుడూ ఒంటరే. ఇవాళ మనతో ఉన్న వారు ఎప్పటికీ మనతో ఉండరు. మార్పు, మరణం ఇవి రెండు మాత్రమే అక్షర సత్యాలు. మిగతావన్నీ మాయలే, క్షణికమైన భావావేశాలే. వాటిని ఆస్వాదించాలి, అర్థం చేసుకోవాలి. అవి మనల్ని వదిలి వెళ్ళే అనుభవాలుగానే వాటిని స్వీకరించాలి అంటారు సాహిర్. దీన్ని ఎన్నో గీతాలలో ఆయన ఎన్నో రకాలుగా వ్యక్తీకరించారు. జీవితంలో అందరూ దూరమైన ఓ ఒంటరి హృదయానికి ఈ ఒంటరితనమే ఆఖరి సత్యమని చెపుతూ ‘జోషీలా’ సినిమా కోసం ఆయన రాసిన ఓ  గీతం ఇప్పుడు విశ్లేషించుకుందాం.

కిస్కా రస్తా దేఖే,  ఐ దిల్ ఐ సౌదాయీ

మీలోం హై ఖామోషీ, బర్సో హై తన్హాయీ

భూలీ దునియా కభీ కీ, తుఝే భీ , ముఝే భీ

ఫిర్ క్యో ఆంఖ్ భర్ ఆయీ?

ఓ.. కిస్కా రస్తా దేఖే ఐ దిల్ ఐ సౌదాయీ

(ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఓ మనసా? ఓ వెర్రివాడా మైళ్ళ పొడుగునా నిశ్శబ్దం, ఏళ్ళ తరబడీ ఒంటరితనం. ఈ ప్రపంచం నిన్నూ నన్ను ఎప్పుడో మర్చిపోయింది, నీ కళ్లు  మరి నిండుకున్నాయెందుకు? ఎవరి కోసం దారి కాస్తున్నావు నీవు)

ఇవాళ మనతో ఉన్నవారు అదే గాఢమైన స్నేహంతో ఎల్లప్పుడు ఉండరు. మనం లేకుండా బ్రతకలేం అనే వారు కూడా కొన్ని రోజులకు మనలను వదిలివెళ్లిపోతారు. అన్నీ బంధాలు కూడా కాలం గడిచే కొద్దీ పేలవంగా మారతాయి. అలాంటి సందర్భంలో ఓ ఒంటరి వ్యక్తి తన మనసుతో చేసే సంభాషణగా వచ్చే గీతం ఇది.

తనను అందరూ మర్చిపోయారని, తానిప్పుడు ఎవరికీ అక్కరకు లేని వ్యక్తినని అతనికి తెలుసు. కాని మనసు ఇంకా ఎవరి కోసమో ఎదురు చూస్తూనే ఉంది. చచ్చేదాకా మనిషికుండే మాయ ఇది. ఎవరో మన కోసం వస్తారని, మన జీవితానికి ఓ చుక్కాని దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తూనే ఉంటాం. ‘మైళ్ళ పొడుగునా నిశబ్దం, ఏళ్ల తరబడీ ఒంటరితనం’ అంటే ఇప్పుడు అతను అనుభవిస్తున నిరాశ అతని జీవితంలో మొదటి అనుభవం కాదు. జీవితాంతం అతన్ని వెంటాడినవి చేదు అనుభవాలే. కాని ప్రతిసారి వాటి మాటున ఓ దింపుడుకళ్ళెం ఆశ రెపరెపలాడుతూ ఉంటుంది. ఏదో  మార్పు జరుగుతుందని మనకోసం ఓ గుండె స్పందిస్తుందని ఎదురు చూస్తూనే ఉంటాం. అతని మనసూ అదే స్థితిలో ఉంది. కాని ఆ స్థితిలో నుండి బైటపడకపోతే మిగిలేది దుఃఖమే అని కూడా అతనికి తెలుసు. అందుకే తన మనసుకు తానే ఇలా సర్దిచెప్పుకుంటున్నాడు.

కోయీ భీ సాయా నహీ రాహోం మే

కోయీ భీ ఆయెగా నా బాహోం మె

తెరె లియె మేరె లియె కోయీ నహీ రోనే వాలా. ఓ..

(దారిలో ఏ నీడా లేదు, ఈ బాహువుల్లోకి ఎవరూ రాబోరు.  నీ కోసం నా కోసం ఏడ్చేవారెవరూ లేరు)

మనిషికి నీడ మాత్రమే తోడు అంటుంటారు. కాని కొన్ని సార్లు ఆ నీడ తోడు కూడా మనిషికి దొరకదు. అంత భయంకరమైన ఒంటరితనంలోకి జీవితం నెట్టేస్తుంది. దీన్నే ‘ప్యాసా’ సినిమాలో ‘హమ్ కో అప్నా సాయా తక్ అక్సర్ బేజార్ మిలా’  అని కూడా సాహిర్ చెప్పిన సందర్భం ఉంది.  నీడ కూడా తోడుగా రాని ఒంటరితనం ఎంత భయంకరమో అనుభవిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలుసు.  ఆలోచిస్తే మనిషి వెళ్ళే ఎన్ని చోట్లకు నీడ తోడుగా వస్తుందని?

ప్రేమ కోసం అర్రులు చాచుతూ, ఎవరో మనవారవుతారని జీవితాంతం బాహువులు తెరిచి ఉంచుకుంటాం. కాని అది వృథా ప్రయాస  మాత్రమే. ఎవరూ ఆ బాహువుల్లోకి రాబోరు. అది అంతులేని నిరీక్షణ మనతోనే ముగిసిపోతుంది. జీవితాంతం ఒంటరితనమే తోడవుతుంది. ఇక్కడ తన మనసుతో తానే సంభాషిస్తున్న ఓ  మనిషి కవిలో కనిపిస్తున్నాడు. తన మనసుతో తానే సంభాషిస్తున్నాడు అంటే, ఆ మనిషి ఎంత ఒంటరో చూడండి. తన మనసును తనకు  మిగిలిని ఒకే ఒక తోడుగా భావించి తానూ తన మనసు కలిసి ఉన్నటు కొన్ని సందర్భాలలో విడిగా ఉన్నట్లు మరి కొన్ని సందర్భాలలో ఊహించుకుంటూ  నీ కోసం నా కోసం ఎవరూ రారు అంటూ ఆ మనసును సమాధానపరుస్తున్నాడు కవి.  అందుకే ఒంటరితనాన్ని స్వీకరించమని చెబుతున్నాడు. ఎవరూ లేని ప్రపంచంలో మనసే తోడు. కాని ఆ మనసు అతని మాట వినట్లేదు. ఏవో ఆశలతో రెపరెపలాడుతూ ఉంది. దానివల్ల దుఃఖం పెరిగిపోతుంది. అందుకని మనిషి తనలోనించి తాను విడిపోయి, తన మనసును తన స్నేహితుడిగా భావిస్తూ మన ఇరువురికీ ఒకరికొకరం తప్ప మరో తోడు లేదు అని చెప్పడం ఇక్కడ కవి ఉద్దేశం.

ఝూఠా భీ నాతా నహీ చాహో మె

హాయె, తూ హీ క్యో డూబా రహె ఆహో మె

కొయీ కిసీ సంగ్ మరే ఐసా నహీ హోనే వాలా

కోయీ నహీ జొ యూ హీ జహా మె బాంటే పీర్ పరాయీ

ఓ.. కిస్కా రస్తా దేఖే ఐ దిల్ ఐ సౌదాయీ

(అబద్ధపు అనుబంధం కూడా నా కోరికల్లో లేదు.  మరి నీవెందుకు  నిట్టూర్పులలో మునిగి ఉన్నావు? ఎవరో  ఎవరితోనో కలిసి  మరణించడం అన్నది జరగనే జరగదు. ఏదీ ఆశించకుండా ఇతరుల బాధలను పంచుకునేవారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు ఓ మనసా, ఓ పిచ్చివాడా)

ఇక్కడ సాహిర్ లోని పంతం గమనించండి. నిజమైన అనుబంధాలు ఇక్కడ దొరకవు. అబద్ధపు అనుబంధాలు అతనికి ఆనందాన్ని ఇవ్వవు. అబద్ధపు పునాదులపై నిలిచే తాత్కాలిక బంధాల పట్ల అతనికి కోరిక లేదు. అది ఉంటే ఉన్న దానితోనే సర్దుకుపోయి కొన్ని రోజులు మాయా ప్రపంచంలో బ్రతికేయవచ్చు. కాని అతనికి అబద్ధపు బంధాలపై కోరిక లేదు. అలాంటప్పుడు మనసు ఎందుకు నిట్టూర్పులతో నిండిపోతుంది?  నిజాయితీ గల అనుబంధాలు దొరకవు, దొరికే అబద్ధాల బ్రతుకులు మనకు వద్దు ఇక నిట్టూరుస్తూ బ్రతకడంలో ప్రయోజనం ఏంటీ. అసలు ఎవరన్నా మరొకరితో కలిసి మరణిస్తారా? ఎవరి చావన్నా వారే చావాలి. అంటే ఒంటరినతనం ఒక్కటె కదా నిజం.. (ఇదే భావం మన్ రీ అనే పాటలో ‘కోయీ న సంగ్ మరే’ అని మరో సందర్భంలో సాహిర్ రాస్తారు). అయినా మరొకరి భాధలను ఏమీ ఆశించకుండా పంచుకునేవారు ఈ ప్రపంచంలో ఊన్నారా? ఇక్కడంతా ఎవరి గోలలో వారు.  అలాంటి వారి కోసం ఎదురు చూడడమే వెర్రితనం.

తుఝే క్యా బీతీ హుయీ రాతోం సే

ముఝే క్యా ఖోయీ హుయీ బాతోం సే

సేజ్ నహీ, చితా సహీ జొ భీ మిలె సొనా హోగా.. ఓ

(గడిచిపోయిన రాత్రుల ఊసు నీ కెందుకు? పోగొట్టుకున్న జ్ఞాపకాలు నాకెందుకు? పానుపు బదులుగా చితే దొరికినా దానిపై నిదురించవలసిందే)

గతంలో కొన్ని మంచి అనుభూతులు అనుభవంలోకి వచ్చాయి. మనసు వాటిని వదిలి రానంటుంది. గడిచిన ఆ వెన్నెల రాత్రుల ఊసులు మనసును నేటికీ అంటిపెట్టుకుని ఉన్నాయి. అందుకే వాటితో నీకు పనేంటి అని మనసును పరిధి దాటవద్దంటున్నాడు కవి. పోగొట్టుకున్న ఎన్నో విలువైన విషయాలతో నాకు కూడా పని ఉండకూడదు. ఎందుకంటే ఇది జీవితం. పూలపానుపు లేకపోయినా చితే పానుపుగా దొరికినా దానిపై నిదురించాలి. దాన్ని స్వీకరించాలి అంటున్నాడు కవి. ఇది పూర్తిగా సాహిర్ జీవితాదర్శం. జీవితంలో భయంకరమైన ఒంటరితనమే ఉంటుంది. మనిషి తీవ్రమైన నిరాశల నడుమ ప్రయాణించవలసి వస్తుంది అని చెబుతూ కూడా, అయినా సరే మనిషి వాటిని స్వీకరించాలి. జీవితాన్ని జీవించాలి అంటాడు తప్ప, పరిస్థితులకు లోంగాలనో, మనిషిగా ఓడిపోవాలనో చెప్పడు.

ప్రఖ్యాత అంగ్ల రచయిత హెమింగ్వే ‘ది ఓల్డ్ మాన్ అండ్ ది సీ’ లో  అంటాడు “A man can be destroyed but not defeated” (మనిషన్న వాడు నాశనం అవుతాడేమో కాని ఓడిపోడు) సాహిర్ ఈ సూత్రాన్ని తన పద్ధతిలో ఎన్నో సార్లు ప్రస్తావిస్తారు. జీవితంలో భయంకర పరిస్థితులు ఎదురయినా ఆ చితి మంటల్లో కాలిపోవాలి తప్ప ఓడిపోకూడదు అన్న సూత్రాన్ని ఆయన నమ్మి జీవించారు, దాన్నే బోధించారు.

గయీ జొ డోరీ ఛూటీ హాథోం సె

ఓ.. లేనా క్యా టూటే హుయె సాథోం సె

ఖుషీ జహా మాంగీ తూనే, వహీ ముఝే రోనా హొగా

నా కోయీ తెరా నా కోయీ మేరా, ఫిర్ కిస్కీ యాద్ ఆయీ

(చేతులనుండి తెగిపోయిన దారంతోనూ, విరిగిపోయిన బంధాల తోనూ మనకేమిటీ సంబంధం అని? ఎక్కడ ఆనందాన్ని కోరుకుంటావో అక్కడే కన్నీరు చిందించాల్సి వస్తుంది. నీ వాళ్ళెవరూ లేరు, నావాళ్ళెవరూ లేరు. మరి ఎవరు జ్ఞాపకం వచ్చారు నీకు)

మన చేతి నుండి విడిపోయి వెళ్లిపోయిన దారం లాంటివి మన జీవితంలో తెగిపోయిన అనుబంధాలు. ఒక్కసారి మనలను వీడిపోతే వాటి గురించి ఆలోచించడం వ్యర్థం.  ఎక్కడ అనందాన్ని కోరుకుంటామో జీవితంలో అక్కడే నిరాశ ఎదురవుతుంది. అక్కడే కన్నీళ్ళూ చిందించవలసి వస్తుంది. జీవితం ఇలాంటి విరోధాభాసలతోనే నిండి ఉంది. కవి ఇక్కడ తన మనసుతో అంటున్నాడు నీకెవరూ లేరు, నాకు ఎవరూ లేరు. మరి ఎవరి జ్ఞాపకాలతో మనసు కొట్టుకుంటుంది? మనవాళ్ళనేవారు మనకెవరూ లేనప్పుడు ఎవరి కోసం ఈ ఎదురు చూపులు?

ఇది పూర్తిగా విషాద గీతం. నిరాశ భరితమైన పాట. కాని అదే నిజం అని జీవితం ఎన్నో నిరాశల సంగమం అని, అయినా మనిషి జీవించాలి అని దొరికిన కష్టాలను కూడా స్వీకరించి తన మనసును అధీనంలో ఉంచుకుని బ్రతకాలన్నది సాహిర్ భావన.

ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎన్నో గొప్ప సంఘటనలు, ఎందరో గొప్ప వ్యక్తులు చరిత్రలో కలిసిపోతూ ఉంటారు. అందరూ అన్నిటిని  మరచిపోయి జీవిస్తూనే ఉంటారు. ఎవరూ ఎవరి కోసమూ ఆగరు. ఎవరి కోసం ఏదీ ఉండిపోదు. ఇది గ్రహించి జీవించడమే మనిషి చేయవలసింది. ఈ నిజాన్ని ఎంతో గంభీరంగా చర్చించే ఈ పాట మనందరికీ ఏదో ఓ సందర్భంలో చేరువ అవకుండా ఉండదు. మనసుకు సర్ధి చెప్పుకోండి. అశాశ్వతమైన బంధాల విషాదం నుంచి బైటపడి జీవితాన్నిఅంగీకరించడం నేర్చుకోండి.

కిస్కా రస్తా దేఖే ఐ దిల్ ఐ సౌదాయీ

మీలోం హై ఖామోషీ, బర్సో హై తన్హాయీ

భూలీ దునియా కభీ కీ తుఝే భీ ముఝే భీ

ఫిర్ క్యో ఆంఖ్ భర్ ఆయీ

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version