Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-21 – పోంఛ్ కర్ అష్క్ అప్నీ ఆంఖో సె

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘నయా రాస్తా’ (Naya Raasta, 1970) చిత్రం లోని ‘పోంఛ్ కర్ అష్క్ అప్నీ ఆంఖో సె’. గానం మహమ్మద్ రఫీ. సంగీతం ఎన్. దత్తా.

~

జీవితం నిరంతర యుద్ధం. సమాజంలో ఒకరుగా మనం జీవించాలనుకుంటాం. కాని మన చుట్టు మన ప్రమేయం లేకుండా ప్రతికూల పరిస్థితులు తయారవుతూ ఉంటాయి. వీటికి ఈ వ్యవస్థ, మన కుటుంబం, మానవ స్వార్థం అన్ని కారకాలే. మనిషి నిరంతరం వీటితో పోరాడుతూనే ఉండాలి, ఇది చాలా వరకు ఒంటరి పోరాటమే. కొన్ని సార్లు అలసిపోతాం. మన అనే వారు లేరని అల్లాడిపోతాం. నీరసించిపోయి తల దించుకుని ఇక పోరాటాన్ని నిలిపివేద్దాం, ఎవరి కోసం ఈ ఆరాటం అన్న విరక్తిలోకి వెళ్లిపోతాం. అలాంటి అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అప్పుడు అనుభవించే ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది. మనలోని శక్తిని ఎవరో పీల్చిపడేసిన భావన కలుగుతూ ఉంటుంది. ఎవరో అదృష్టవంతులకు తప్ప ఆ సమయంలో సాంత్వన ఇచ్చే తోడు అందరికీ దొరకదు. అలాంటి ఒంటరి సమయాలలో అండగా నిలవగల ఓ సాహిర్ గీతం గురించి ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఈ పాట నాకు నిరంతరం తోడుగా నిలిచే ఓ నెచ్చెలి.

పోంఛ్ కర్ అష్క్ అప్నీ ఆంఖోం  సె

ముస్కురావో తో కోయీ బాత్ బనే

సర్ ఝుకానే సె కుఛ్ నహీ హోగా,

సర్ ఉఠావో తొ కోయీ బాత్ బనే

(కళ్ళల్లో చిప్పిల్లుతున్న కన్నీటిని తుడుచుకుని నవ్వగలిగితే అప్పుడు కదా ఏదన్నా సాధించగలిగేది? తలవంచటం వల్ల ఒరిగేదేమీ లేదు. తల ఎత్తితేనే కదా ఏదన్నాసాధ్యమయ్యేది?)

మనసులో చీకట్లు ముసిరినప్పుడు మనకు ధైర్యం చెప్పి మనలోని శక్తిని బైటకి తీయగలిగిన నేస్తం జీవితంలో ఓ వరం. సాహిర్ బలహీనపడుతున్న మనుషుల జీవన పోరాటంలో ఉత్సాహం నింపడానికి ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాటలు రాసారు. ఆయనలో నాకు గొప్ప మానసిక శాస్త్రవేత్త కనిపిస్తాడు. సాధారణంగా నాయిక బలహీనపడినప్పుడు ఇతర కవులు నీకు నేనున్నాను నా భుజాలను ఆసరాగా ఇస్తాను, నీకు ఎప్పటికీ తోడుంటాను, నన్ను అల్లుకుని జీవించు, నిన్ను కాపాడతాను లాంటి మాటలతో సాంత్వన చేకూరుస్తారు. కాని సాహిర్ ఎక్కడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఎవరి యుద్ధం వారు చేయవలసిందే. ఎంతటి ప్రేమికులయినా ఇద్దరు వేరు వేరు మనుషులు మాత్రమే. ఒకరి కొకరు అండగా నిలవగలరు కాని ఎవరి జీవితం వారిది.  ఎవరి యుద్ధం వారిది. జీవితాలను పంచుకుంటారు కాని వారి జీవితం, అనుభవాలు ఒకటి కావు. అందుకే జీవిత యుద్ధంలో అలసిన వారికి పోరాడమని ప్రోత్సాహాన్నిస్తూ దానికి వాళ్ళను సన్నద్ధం చేస్తాయి సాహిర్ పాటలు. అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు. ఆ యుద్ధానికి వారిని తయారు చేసే సరుకుగా మాత్రమే వాళ్లు ప్రవర్తిస్తారు తప్ప అవతలి వారి సమస్యలకు పూర్తి బాధ్యత తీసుకుంటాం అనే ప్రగల్బాలు పలకరు. ఇది సాధ్యం కాదు అన్నది సాహిర్ నమ్మిన సిద్ధాంతం. సాహిర్ అల్లుకుపోయే మనుషులను కాక ఎటువంటి సమయంలో కూడా నిటారుగా నిలబడే ధైర్యవంతులను తయారు చేయాగలగడాన్ని ప్రేమ అని నమ్మిన వ్యక్తి. ప్రేమ ఆధారపడడం కాదు ఆత్మవిశ్వాసంతో నిలబడడం నేర్పించాలి అన్న సిద్ధాంతాన్ని ఆయన పాటలలో గమనించవచ్చు.

‘ఆకలేస్తున్నవాడికి ఒక పూటకు అన్నం పెట్టి లాభం లేదు. అన్నం సంపాదించుకునే  మార్గం  చూపించు’ అన్నది సాహిర్ మార్గం. వాసన సినిమాలో ఇత్ని నాజుక్ న బనో అని నాయికకు బోధించే  మరో పాటలో..

“కోయి రుక్తా నహి ఠహరేహువె రాహీ కే లియే/ జోభి దేఖేగ వో కత్రాకె గుజర్ జాయేగా/ హమ్ అగర్ వక్త్ కె హమ్‍రాహ న చల్నే పాయే, వక్త్ హమ్ దోనోంకో ఠుక్‍రాకె గుజర్ జాయేగా..” అంటాడు సాహిర్. ఆగివున్న వాడికోసం ఎవ్వరూ ఆగరు. వాడిని వదిలి ముందుకు సాగిపోతారు. కదలుతున్న కాలం అడుగులో అడుగు కదిపి నడవలేక పోతే, కాలం మనల్ని వదిలి ముందుకు సాగిపోతుంది..

జీవిత యుద్ధంలో అలసిన ప్రేయసితో పై గీతంలో నాయకుడు అంటున్నాడు. నీ కళ్ళ నుండి కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకోగలిగినప్పుడు కదా ఏదన్నా నీకు సాధ్యం అయేది. ఏడ్చి సాధించేదేమీలేదన్నది అందరికీ తెలుసు. ఏడుపు వల్ల మది బరువు తగ్గొచ్చు, ఎదుటివారి సానుభూతి లభించవద్దు, కానీ, అందువల్ల సమస్య పరిష్కారం కాదు. అందుకే, ఆమె కన్నీటిని అతను తుడిచే ప్రయత్నం చేయట్లేదు. ఆమెను కళ్ళు తుడుచుకోమని చెబుతున్నాడు. ఆ కళ్ళు తాను తుడవట్లేదు. ఆమె నిటారుగా లేచి నిలబడడానికి ప్రోత్సాహం ఇస్తున్నాడు తప్ప ఆమె తనపై ఆధారపడేటట్లు అతను చేయట్లేదు. నీ కన్నీటిని నువ్వే తుడుచుకో ప్రపంచాన్ని ఎదుర్కో అని చెప్పే సాహిర్‌లో నాకో గొప్ప మానవ ప్రేమికుడు కనిపిస్తాడు. ‘ఉధ్ధరేత్ ఆత్మనాత్మానాం’ అన్న సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించి చూపే  గొప్ప తాత్త్వికుడు కనిపిస్తాడు.

తల దించుకుని బ్రతకడం ఏమిటీ? ఎలాంటి సందర్భంలోనైనా  తల ఎత్తుకుని నిటారుగా నిలబడప్పుడు కదా నీవల్ల మరేదన్నా జరగగలిగేదీ? ఎంత అద్భుతమైన మాటలు. చాలా సందర్భాలలో ఈ వాక్యాలు నాలో ఎంత స్ఫూర్తిని నింపాయో. కొన్ని సందర్భాలలో నా చెవుల్లో ఎవరో ఈ వాక్యాలను పాడుతున్నట్లే అనిపించేది. ఇది విన్న ప్రతిసారి కొత్త ఉత్సాహం కలుగుతుంది. ఆ తరువాత వచ్చే వాక్యాలు నా దృష్టిలో శిలాక్షరాలు.. ఎప్పటికీ నేను మర్చిపోని అతి గొప్ప జీవన సత్యాలు.

జిందగీ భీఖ్ మే నహీ మిల్తీ

జిందగీ బఢ్ కె ఛీనీ జాతీ హై

అప్నా హక్ సంగ్-ఎ-దిల్  జమానె సె

చీన్ పావో తో కోయీ బాత్ బనే

సర్ ఖుకానే సే కుఛ్ నహీ హోగా

సర్ ఉఠావో తొ కోయి బాత్ బనే

(జీవితం ఎవరో జాలి తలచి ఇచ్చిన భిక్ష కాదు. అడుగుముందుకేసి నీకు కావాల్సింది నువ్వు సాధించాలి. ఎవరి జాలి, దయ, ధర్మాలపై ఆధారపడి లాభంలేదు.  కఠినమైన ఈ ప్రపంచం నుండి నీ హక్కు లాక్కోగలిగినప్పుడే కదా ఏదన్నా జరిగేది. కళ్ళ నుండి కన్నీటిని తుడిచికోగలిగినప్పుడే కదా ఏదన్నా మార్పు నీ జీవితంలో రాగలిగేది)

సాహిర్ ఇదే అర్థాన్ని ఎన్నో పాటల్లో ఎన్నో సందర్భాలలో రాసారు. జీవితం ఎవరో మనకిచ్చే బిక్ష కాదు. మరొకరి అధీనంలో మన జీవితం ఉండకూడదు. మన హక్కులను మనం సాధించుకోవాలి. ఈ ప్రపంచం చాలా కఠినమైనది స్వార్థంతో నిండి ఉంది. మన జీవితం మనది కావాలంటే ఈ ప్రపంచం నుండి మన హక్కులను మనం పోరాడి లాక్కుని పొందగలగాలి. అంతే తప్ప ఎవరో దయతో అందించే భిక్ష మనకు అనవసరం. మన హక్కులను సాధించుకోవడానికి భయపడకూడదు. అవసరం అయినప్పుడు మన జీవితాన్ని ఇతరులు ఆక్రమించికుంటుంటే దాన్ని తిరిగి లాక్కోవడానికి సందేహించకూడదు. ప్రపంచాన్ని ఎదిరించి ఆత్మవిశ్వాసంతో బ్రకతాలంటే మన హక్కులను మనం సాధించుకోవాలి. అసలు మన అధికారాన్ని బిక్షలా పొందాలనుకోవడం మంచితనం కాదు చేతకానితనం. ధైర్యంతో మనవి మనం పొందడానికి ముందడుగు వేయడానికి సందేహించక్కర్లేదు.

ఎవరిమీదైనా  ఆధారపడి జీవించటం అంటే బానిసత్వం. వారు చెప్పినట్టు వినకపోతే ఆ ఆధారం పోతుంది. కాబట్టి ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించటమే మనిషికి గౌరవం, జీవితానికి అర్ధం కల్పిస్తుంది.   ఎవరినో  మెప్పించటంకోసమో, ఎవరికో భయపడో వారు చెప్పినట్టు చేయటం అంటే, మనం మనం కాకుండా పోవటమే. కాబట్టి, ఎవరో ఏదో అంటారని భయపడకుండా, ఎవరి మెప్పుకోసమో మన వ్యక్తిత్వాన్ని అణచివేసుకోకుండా తల ఎత్తుకుని తనకు నచ్చినట్టు బ్రతకటం. టాక్సీడ్రైవర్ అనే సినిమాలో  ఒక మామూలు హాస్య సన్నివేశంలో కూడా సాహిర్ ఈ తత్వాన్ని ప్రదర్శించాడు.

చాహే ఖుష్ హో చాహె ముఝ్‍కో గాలియాన్ హజార్ దేఅరె మస్త్ రామ్ బన్ కే జిందగీక దిన్ గుజార్ దే..

(నన్ను ఎవరికెంత తిట్టాలనిపిస్తే అంతగా తిట్టుకోండి. నేను మాత్రం హాయిగా నాకు ఇష్టం వచ్చినట్టు జీవితం గడుపుతాను.)

ఎవరికీ లొంగకుండా, ఎవరేమన్నా, ఎంతగా ఏడ్చినా లెక్కచేయకుండా తనకు ఇష్టం వచ్చినట్టు. ఏది ఆనందం కలిగిస్తే ఆ పని చేస్తూ, సంతోషంగా జీవించాలన్నది సాహిర్ తత్వం.

తెరె గిర్ నె మె భీ తెరి హార్ నహీ/ కె తు ఆద్మి హై అవతార్ నహీ (నువ్వు ఓడి పడిపోవటం నీ తప్పుకాదు, నువ్వు మనిషివి అవతారానివి కాదు) అన్న వాడే, జహ సచ్ న చలే వహ ఝూట్ సహి, జహ హక్ న మిలే వహ లూట్ సహీ (సత్యం చెల్లని చోట అసత్యం పని సాధించాలి. హక్కు లభించని చోట పోరాటం చేసి హక్కు సాధించాలి) అన్నాడు. అందుకే, అప్న హక్ సంగ్-ఎ-దిల్ జమానే సే ఛీన్ పావో తొ కోయి బాత్ బనే అని సాహిర్ అనటం స్వాభావికం, ప్రాకృతికం. అలా అనకపోతే పాట రాసింది సాహిర్ కాదని నిర్ధారణగా చెప్పవచ్చు.

చిత్రంలో నాయిక ఒక పేద దళిత మహిళ. కుల, లింగ ఆర్థికపరమైన వివక్షలను ఒకేసారి ఎదుర్కుంటూ ఉంటుంది. ఆమెకు ధైర్యాన్ని ఇస్తూ అంత బేలగా జీవించడం కాదు నీ హక్కులు నీవు తెలుసుకుని వాటిని నీకివ్వడానికి నిరాకరించే సమాజం నుండి బలవంతంగా లాక్కుని పొందడం అలవర్చుకో అని నాయకుడు ఆమెను చెప్తున్నాడు. పీడితుల పక్షాన ఓ బలమైన గొంతుకగా సాహిర్ అనుక్షణం తన పాత్ర పోషిస్తూనే కనిపిస్తారు. ఈ వాక్యలకు దోపిడిని, వివక్షను ఎదుర్కుంటున్న ప్రతి ఒక్కరికి మార్గనిర్దేశం చేయగల శక్తి ఉంది. తరువాత చరణం వింటే సాహిర్ లోని సామ్యవాదిపై అపారమైన గౌరవం కలుగుతుంది.

రంగ్ ఔర్ భేద్ జాత్ ఔర్ మజహబ్

జొ భీ హొ ఆద్మీ సె కమ్తర్ హై

ఇస్ హకీకత్ కొ తుం భీ మేరీ తరహ్

మాన్ జావో తో కోయే బాత్ బనే

పోంఛ్ కర్ అష్క్ అప్నీ ఆంఖో సె

ముస్కురావో తో కోయీ బాత్ బనే

(రంగు, జాతి, మతం అనే భేధాలు ఏవయినా మనిషి కన్నా ఎక్కువ కావు. ఈ నిజాన్ని నువ్వు కూడా నా లాగే ఒప్పుకుంటే కదా ఏదన్నా జరిగేది. కళ్ల నండి కారుతున్న ఆ కన్నీటిని నువ్వు తుడుచుకోగలిగినప్పుడు కదా ఏదన్న జరిగేది)

అందరూ సమానమే అని అగ్ర కులంలోనూ లేదా వివక్షను ఎదుర్కోవలసిన అవసరం లేని ఓ వర్గం లోనో ఓ ఆలోచన వస్తుంది. వాళ్ల సంఖ్య అతి తక్కువే, వాళ్ళు సమానత్వాన్ని నమ్మి సమ సమాజం కోసం పని చేయడానికి ముందుకు వస్తారు కాని దోపిడీని ఎదుర్కుంటున్న వాళ్లు ఇంత గట్టిగా సమానత్వాన్ని ఒప్పుకోకపోవడమే దళిత, స్త్రీ లేదా అణచబడ్డ జాతుల సమస్యలు శాశ్వతంగా దూరం కాకపోవడానికి కారణం. మనపైన ఒకరు సవారీ చేస్తున్నారంటే అది వారి తప్పు కాదు, వాళ్ళు సవారీ చేయటానికి వీలుగా వంగిన వారిది తప్పు. ఎవ్వరిముందూ తల వంచాల్సిన పనిలేదు. తల ఎత్తి జీవించాలి. సాహిర్ అది బోధించటమే కాదు. ఆచరించి, అలా జీవించి చూపాడు. రచయిత లేకపోతే, గడవకున్నా, రచయితకు విలువనివ్వని సినిమా ప్రపంచంలో, రచయితగా తల ఎత్తుకుని నిలబడి, రచయితకు గౌరవం సాధించాడు సాహిర్.

దళితవాదంలోనూ ఇటీవలి కాలంలో   ఆభిజాత్య పోకడలు కనిపిస్తున్నాయి. మీరు మమ్మల్ని అణిచేసారు ఇప్పుడు మేం అదే చేస్తాం అన్న ధోరణి కన్పిస్తుంది. స్త్రీలు కూడా పురుషులపై పోరులో, తమ ప్రత్యేకతని విడిచి, పురుషులలాగా ప్రవర్తిస్తూ,  పురుషుల అహంకారాన్ని స్వీకరించి తమదైన నైజాన్ని కోల్పోతున్నప్పుడు స్త్రీ వాదం కూడా ఎందుకూ పనికిరాదు. పురుషులతో సమానత్వం అంటే, పురుషులు చేయగలిగిన ప్రతిపనీ తాము చేయగలగటం కాదు, తమ ప్రత్యేకతను గుర్తించి ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో తను తనలాగే జీవించటం.  సమాజంలో అందరూ సమానమే అని ముందు బలంగా పీడితులకు నమ్మకం ఏర్పడాలి. ఎవరో ఒకరు ఎప్పుడూ ఆధిపత్యాన్ని నిర్వహిస్తూ ఉండవలసిందే అన్న నమ్మికతోనే ఈ వాదాలన్నీ పని చేయడం వల్ల సమాజంలో మనిషి జీవితం ఎప్పుడు ఆధిపత్యాల నడుమ నలిగిపోతూనే ఉంటుంది. సమస్యను చూసే పద్ధతిలో మార్పు రావాలి. దీన్ని సాహిర్ ఎంత సరళమైన భాషలో వ్యక్తీకరిస్తున్నాడో చూడండి. నేను ఎలా అందరూ సమానమని నమ్ముతానో ముందు నువ్వు దాన్ని అదే స్థాయిలో నమ్మగలగాలి. అప్పుడే నీ హక్కులను నువ్వు పొందగలుగుతావు.

అగ్రకులస్థులు కులాన్ని తగిలించుకున్నారని నేనూ తగిలించుకుంటాను. మగాడు తాగుతున్నాడని తిరుగుతున్నాడని నేనూ తాగుతా తిరుగుతా, ఇలాంటి వితండవాదాలతో జరిగేది ఏమిటి? మానసికంగా తమ ప్రత్యర్థులు తమ కన్నా బలవంతులని అంగీకరించడమే. వాళ్లలా మారుతున్నాం అంటే వాళ్ళ ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ మనమూ ఆధిపత్యం దిశగా ప్రయాణిస్తున్నాం. ఇది వ్యక్తులపై పోరు తప్ప వ్యవస్థ పై పోరు కాదు. సమస్యను అర్థం చేసుకుంటే రంగు జాతి మతం వీటన్నిటి కన్నా మనిషి గొప్ప అన్నది మనసుకు ఎక్కుంచుకుని ఆ నిజాన్ని ఒప్పుకుని సమానత్వం దిశగా ఎదగాలి. మనిషి కేంద్రంగా , మానవత్వం లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే తన హక్కులను సంపాదించుకోగల శక్తి పీడితులకు వస్తుంది. కాని అంతర్లీనంగా ఆధిపత్యాన్ని అంగీకరిస్తూ ఆధిపత్యమే తమ సమస్యలకు పరిష్కారం అని భావిస్తూ చేసే ఏ పోరాటం కూడా సఫలం కాదు. అది సమాజాన్ని ఇంకా అల్లకల్లోలానికి గురి చేస్తుంది. సాహిర్ గీతం ఈ వాస్తవం సులువుగా మనకు అర్థం అవడానికి సహాయం చేస్తుంది. ఆ తరువాతి వాక్యాలు చూడండీ ఎన్ని ఆలోచలను కలగజేతాయో..

నఫ్రతోం కె జహాన్  మే హమ్కో

ప్యార్ కీ బస్తియా బసానీ హై

దూర్ రహనా కోయీ కమాల్ నహీ

పాస్ ఆవో తొ కోయీ బాత్ బనే

సర్ ఝుకానే సే కుఛ్ నహీ హోగా

సర్ ఉఠావో కోయి బాత్ బనే..

పోంఛ్ కర్ అష్క్ అప్నీ ఆంఖో సె

ముస్కురావో తో కోయీ బాత్ బనే

(ద్వేషంతో నిండిన ఈ ప్రపంచంలో మనం ప్రేమను నిలపాల్సింది మనమే. దూరంగా ఉండటం  గొప్ప కాదు,  దగ్గరకు చేరినప్పుడు కదా ఏదన్నా జరిగేది)

ఇది సినిమా పాట. ఆపై రొమాంటిక్ పాట. ఇలాంటి సన్నివేశంలో ఇతర కవులు, నీ కంటినుంటి కారే నీరు నీరు  కాదు, నా పగిలిన హృదయపు ముక్కలు, నీ కంట నీరు నే చూడలేను అంటూ రొమాన్స్ రాస్తారు. కానీ, సాహిర్ పాట పల్లవిలోనే కన్నీరు కార్చి లాభం లేదు అంటూ ఆరంభించాడు. కాబట్టి, హఠాత్తుగా, నా దగ్గరకు రా, నీ కన్నీరు తుడుస్తాను అనలేడు. అది సాహిర్ రచనా పధ్ధతి కూడా కాదు. అందుకే, ద్వేషంతో నిండిన ఈ ప్రపంచంలో ప్రేమ నింపాల్సిన బాధ్యత మనదే, కాబట్టి నువ్వు దూరంగా వుండి లాభం లేదు, దగ్గరకు వస్తేనే ప్రేమ పంచే వీలుంటుంది అంటున్నాడు చమత్కారంగా. మొదటినుంచీ, ఆలోచనలతో వేడెక్కిన బుర్ర, పాస్ ఆవో తొ కోయి బాత్ బనే అనగానే చిరునవ్వుతో చమత్కారానికి సంతోషమయమవుతుంది.

ఈ వాక్యాలను పదే పదే నాలో నేను మననం చేసుకుంటూ సాహిర్‌ని ఎంతగా ప్రేమిస్తానో చెప్పలేను. ఆధిపత్యానికి ఆధిపత్యం జవాబు కాదు అన్న నిజాన్ని ఇంకా వివరిస్తూ సాహిర్ ఏం చెబుతున్నాడో చూడండి.. ఈ ప్రపంచం అంతా ద్వేషంతో నిండి ఉంది. ఆధిపత్య పోరు మిగిల్చేది అదే. మనమూ అదే చేయడం ఎంత వరకు న్యాయం. మనకో బాధ్యత ఉంది. ద్వేషంతో నిండి ఉన్న ఈ ప్రపంచంలో ప్రేమ బస్తీలను నిర్మించాలి. మరి అది ఎలా సాధ్యం అవుతుంది. ముందు నువ్వు సమానత్వాన్ని గౌరవించు, అర్థం చేసుకో. మనిషి కన్నా ఏవీ ముఖ్యం కావని తెలుసుకో, ఆధిపత్యాన్ని అడ్డుకో, ఆధిపత్యంతో కాదు నీ నమ్మకంతో. నిన్ను గాయాల పాలు చేస్తున్న సమాజం నుండి దూరం జరగడం కాదు. దాని దగ్గరకు చేరు.  సమానత్వం అన్న పేరుతో నువ్వూ ఓ అధికారిగా మారకు, నీ హక్కులు తెలుసుకో, వాటిని నమ్ము, వాటిని సంపాదించు కాని అధికారిగా మారి కాదు మనిషిగా మారి. మనిషిగా మరో మనిషి దరి చేరగలగినప్పుడు కదా జీవితానికి అర్థం, దీన్ని తెలుసుకో.

ఎంత గొప్ప వాక్యాలు ఇవి. ఇది ఒక ప్రేమికుడు ప్రేమికురాలిలో ధైర్యాన్ని నింపడానికి సినిమాలో సన్నివేశపరంగా వాడుకున్న గీతం కాని మనకు జీవించడం ఎలాగో, ఆధిపత్య పోరుని ఎలా ఎదుర్కోవాలో తెలుపుతూ మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గీతం కూడా. మనలోని కోపాన్ని, దుఖాన్ని దిశానిర్దేశనం  చేసుకోవడానికి అసలు మన పోరు ఎటు జరగాలో ఓ స్పష్టతతో చెప్పడానికి ఉపయోగపడే గీతం. అందుకే ఈ వాక్యాలంటే నాకు మరీ మరీ ఇష్టం –

దూర్ రహనా కోయీ కమాల్ నహీ

పాస్ ఆవో తొ కోయీ బాత్ బనే..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version