Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-26 – జిందగీ ఇత్తెఫాక్ హై

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’ (Aadmi Aur Insaan, 1970) చిత్రం లోని ‘జిందగీ ఇత్తెఫాక్ హై’. గానం ఆశా భోస్లే, మహేంద్ర కపూర్. సంగీతం రవి.

~

సాహిర్ క్లబ్ సన్నివేశాల కోసం రాసిన పాటలన్నీ కూడా ఆషామాషి పాటలు కావు. వాటిలో అతి గొప్ప తార్కికత ఉంటుంది. ‘బాజీ’ సినిమాలో ‘తద్బీర్ సే బిగడీ’ పాట నుండి గమనిస్తే ఆయన రాసిన క్లబ్ పాటలన్నీ కూడా సన్నివేశానికి అతికినట్టు సరిపోతూనే లోతైన అర్థాన్ని, జీవితపు సారాన్ని కలగలపి ప్రదర్శిస్తాయి. అందుకే ఆయన క్లబ్ పాటలకు వాంప్ పాత్రలకు, నర్తకీమణులకు రాసిన పాటల స్థాయి ఇతర కవులతో పోలిస్తే భిన్నంగా ఉండి గొప్ప జీవిత సత్యాలను చర్చకు పెడతాయి. ఆనాటి సినిమాలలో సాహిర్ రాసిన క్లబ్ పాటలు కేవలం మాస్‌ను అలరించడమే కాదు, మేధావుల చేత కూడా ప్రశంసింపబడ్డాయి. ‘ఆద్మీ ఔర్ ఇన్సాన్’ సినిమాలోని ‘జిందగీ ఇత్తఫాక్ హై’ అన్న పాటను ఇప్పుడు చర్చించుకుందాం.

ఈ సినిమాలో మొత్తం తొమ్మిది పాటలున్నాయి. ఈ ఒక్క పాట సోలోగానూ డ్యూయెట్ గానూ రెండు సార్లు సినిమాలో వస్తుంది. పాటలన్నీ కూడా వేటికవి గొప్పవే. కాని వాటన్నిటికి మించి క్లబ్ సాంగ్‌గా పార్టీ గీతంగా రాసిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంది. కారణం ఇందులో సాహిర్ ప్రదర్శించిన తాత్వికత. ఒకే పాటను డ్యూయెట్ గానూ సోలోగానూ ఉపయోగించుకున్న సందర్భాలు సిని ప్రపంచంలో అతి తక్కువ. సాహిర్ పాటతో అలాంటి ప్రయోగం ఈ సినిమాలో దర్శకులు చేస్తే ఆ రెండు వర్షన్లను కూడా సూపర్ హిట్ చేసారు సినీ శ్రోతలు.

‘జిందగీ’ అంటే జీవితం గురించి ఎన్నో సినీ పాటలు ఇప్పటిదాకా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి జీవితాన్ని రకరకాల పద్ధతుల్లో అర్థం చేసుకుని, పాటలలో ప్రస్తావిస్తారు సినీ కవులు. జీవితాన్ని ఓ సమస్యగా, యాత్రగా, నాటకంగా, ఆటగా ఇతర కవులు అర్థం చేసుకుంటే సాహిర్ జీవితం యాదృచ్ఛికం అంటూ ఓ నినాదమే చేశారు. ‘ఇత్తెఫాక్’ అనే పదానికి తెలుగులో సరైన అర్థం యాదృచ్ఛికం. ఉర్దూలో ఈ పదానికున్న కవిత్వ ధోరణి తెలుగు పదానికి రాదు. కాని యాదృచ్ఛికం తప్ప మరో పర్యాయ పదం నాకు ఈ సందర్భంలో దొరకలేదు. అన్ని సార్లు ‘యాదృచ్ఛికం’ అని ప్రయోగించడం ఈ పాట సందర్భంలో తెలుగు అనువాదంలో కవిత్వ పరంగా కృతిమంగా అనిపించినా, అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పదాన్నే మళ్ళీ మళ్ళీ అనువాదంలో ఉపయోగించవలసి వచ్చింది.

ఈ పాట సినిమాలో రెండు సందర్భాలలో వస్తుంది. మొదటిది సోలో గీతం. పార్టీలో ముంతాజ్ పాత్రపై ఆ పాటను చిత్రించారు. బిగుతైన బట్టలతో ముంతాజ్ నర్తించగా, మందు ఏరులై పారుతున్న ఓ పార్టీలో ఈ గీతం వస్తుంది. దీన్ని ఆశా భోస్లే సోలోగా గానం చేసారు. రెండవ సారి కూడా ఇది పార్టీ గీతంగానే మళ్ళీ వస్తుంది. అయితే దాన్ని డ్యూయెట్ గా ఆశా, మహేంద్రకపూర్‌లు కలిసి గానం చేసారు. ముందుగా వచ్చే సోలోను మొదట చర్చించుకుందాం. ఆ పాట ఇలా ఉంటుంది.

జిందగీ ఇత్తెఫాక్ హై..

జిందగీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ, ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(జీవితం యాదృచ్చికం, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికం)

ఇత్తెఫాక్‌కు ఉర్దూలో యాదృచ్ఛికం కాక ఇంకా అర్థాలు ఉన్నాయి. ఒప్పందం, సఖ్యత, స్నేహం, అని కూడా ఆ పదానికి అర్థాలున్నాయి. ఇక్కడ సాహిర్ జీవతం యాదృచ్ఛికం అన్న అర్థాన్ని ఇస్తూనే మరో పక్క దాన్ని ఓ ఒప్పందం గానూ ప్రస్తావించడం కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఆ పదాన్ని వాడి ఆయన శ్రోతల మొదళ్ళకు పని పెట్టారు. కాని ఏ అర్థాన్ని తీసుకుని ఈ పాటకు ఆపాదించుకున్నా అందులో మనుషులు జీవితంలో నిమిత్తమాత్రులని వారి చేతిలో ఏదీ ఉండదనే విషయం మాత్రం స్పష్టం అవుతుంది. ఆ నిజం మాత్రం ప్రతి అర్థంలోనూ ద్వనిస్తుంది. మనిషి అధీనంలో జీవితం ఉండదు. అన్నీ సంఘటనలు జరిగిపోతూ ఉంటాయి. అతనో పాత్ర మాత్రమే. దేని పై అతని అధికారం ఉండదు. గడిచిపోయిన నిన్న, నడుస్తున్న ఈ రోజు, రాబోయే మరో రోజు అన్నీ మనిషి జీవితంలో యాదృచ్ఛికాలే.

జామ్ పకడ్ బడాకె హాథ్, మాంగ్ దుయా ఘటె నా రాత్

జాన్ – ఎ – వఫా, తేరీ కసమ్, కహ్తె హై దిల్ కి బాత్ హమ్

గర్ కొయీ మెల్ హో సకె, ఆంఖోకా ఖేల్ హో సకే

అప్నె కో కుష్ నసీబ్ జాన్, వక్త్ కో మెహర్బాన్ మాన్

మిల్తె హై దిల్ కభీ కభీ, వర్నా హై అజ్నబీ సభీ

మెరె హందం మెరె మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ

ఆజ్ భీ ఇత్తెఫాక్ హై, జిందగీ ఇత్తెఫాక్ హై

(చేయి చాచి మధు పాత్ర అందుకో, ఈ రాత్రి గడిచిపోరాదని ప్రార్థన చేయ్, ఓ ప్రియతమా నీ పై ఒట్టేసి, మనసులోని మాట చెప్తున్నాను, ఎవరితోనన్నా స్నేహం కలిగితే, కనులు కలపగలిగితే, నిన్ను నీవు అదృష్టవంతుడనుకో, కాలం దయ నీపై ఉందని తెలుసుకో, ఇక్కడ మనసులు ఎప్పుడో గాని కలవవు, లేదంటే అందరూ ఎవరికి వారు ఇక్కడ పరాయి వాళ్లే, నా స్నేహితుడా, నా పై దయ చూపిన వాడా, ప్రతి ఆనందమూ యాదృచ్ఛికమే, నిన్నా యాదృచ్ఛికమే, నేడూ యాదృచ్ఛికమే, జీవితమే యాదృచ్ఛికం)

జీవితంలో దొరికిన ఆనందాలని ఆలోచించక అందుకోవాలని, లభించిన ఆనందకరమైన ఘడియలు గడిచిపోరాదని ప్రార్థంచమని ఆమె చెబుతుంది. పైగా ప్రియమైన ఆ స్నేహితుని పై ఒట్టేసి మరీ ఆమె అతనికి జీవితంలోని క్షణికత్వాన్ని తెలియ జేస్తుంది. ఎవరితో స్నేహం కలిగినా, ఎవరితోనన్నా కనులు కలిసి మనసు స్పందించినా అది అతని అదృష్టంగా భావించమని ఆమె కోరుతుంది. కాలం అతనిపై దయ తలచిందని, అలాంటి క్షణాలు అందరి జీవితంలో రావని, ఈ నిజం తెలుసుకుని ఆ క్షణాలను ఆస్వాదించమని ఆమె కోరుతుంది. ఈ ప్రపంచంలో అందరూ పరాయి వాళ్ళే, మనసులు అంత త్వరగా కలవు. అదే జరిగితే అదో గొప్ప వరమని, ఆ క్షణాలను పూర్తిగా సొంతం చేసుకుని జీవించమని, చెబుతూ అతన్ని స్నేహితుడిగానూ, తనపై దయ చూపిన వాడిగానూ ప్రస్తావిస్తూ, అందుకే ఈ నిజాన్ని అతనికి తెలియపరుస్తున్నానని, దొరికిన ఆ ఆనందపు క్షణాల విలువ తెలుసుకుని ప్రవర్తించమని, జీవితం యాదృచ్ఛికం అని ఇక్కడ అన్ని అనుకోకుండా జరిగే సంఘటనలని, వాటి మధ్య దొరికిన ఆనందాన్ని తక్కువ చేసుకోవద్దని, దాని విలువ మరచి పోగొట్టుకోవద్దని ఆమె చెప్తుంది.

హుస్న్ హై ఔర్ షబాబ్ హై, జిందగీ కామయాబ్ హై,

బజ్మ్ యూ హీ ఖిలీ రహే, అప్ని నజర్ మిలీ రహే

రంగ్ యూ హీ జమా రహే, వక్త్ యూ హీ థమా రహే

సాజ్ కీ లయ్ పె ఝూమ్ లే, జుల్ఫ్ కె ఖం కొ చూమ్ లే

మెరె కియే సే కుచ్ నహీ, తేరె కియె సె కుచ్ నహి

మేరే హమ్దమ్ మేరే మెహెర్బాన్

యె సభీ ఇత్తెఫాక్ హై…

యె సభీ ఇత్తెఫాక్ హై కల్ భీ ఇత్తెఫాక్ థి ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(అందం ఉంది, యవ్వనమూ ఉంది వీటితో జీవితం సుసంపన్నమైంది. ఈ విందు ఇలాగే సాగనీ. మన కళ్ళు ఇలా కలిసే ఉండనీ, ఈ రంగులు ఇలాగే వికసించి ఉండనీ, కాలం ఇలాగే ఆగిపోనీ, ఈ రాగాల లయలో నాట్యం చేయ్, కురుల మడతలను ముద్దాడుకో, నేను ఏదో చెయ్యడం వల్లో నువ్వు ఏదో చేస్తేనో ఏదీ జరగిపోదు, ఓ నా స్నేహితుడా, నా ప్రియతమా ఇవన్నీ యాదృచ్ఛికాలే, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే, జీవితమంతా యాదృచ్ఛికాల సంగమమే)

జీవితం అనుభవిచడానికే. ఈ అనుభవాలు మనం ఏదో కష్టపడితేనో, ప్రయత్నిస్తేనో మన దరి చేరవు. అవి అన్నీ యాదృచ్ఛికంగా ఎదురయ్యే అనుభవాలే. వాటిలో ఆనందం కలిగించే అనుభవాలుంటే వాటిని నిండుగా అనుభవించాలి. అందం యవ్వనం ఉన్నప్పుడే జీవితం సంపన్నంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు జీవితంలో అనుభవంలోకి వచ్చే విందులను సాగిపోనివ్వాలి. కలిసిన కళ్లను కలుపుని ఉంచుకోవాలి. జీవితంలో చొచ్చుకు వచ్చిన రంగులను ఆస్వాదించాలి. కాలాన్ని శక్తి ఉన్నంత మేరా జ్ఞాపకంగా మలచుకుని దాన్ని శాశ్వతం చేసుకోవాలి. జీవితంలో నడిచి వచ్చిన మధురమైన రాగలను ఆఘ్రానించాలి. అందిన అందమైన కురుల మడతలను ముద్దాడుకోవాలి. మనం కోరుకుని ప్రయతిస్తే ఇలాంటి అనుభవాలు దొరకవు. అవి ఎదురయినప్పుడు ఆలోచనలో పడిపోక వాటిని అందుకుని అనుభవించడమే జీవితం ఎందుకంటే జీవితం మొత్తం యాదృచ్ఛికాల సంగమమే.

ఈ పాటలో నేటిని ఆస్వాదిస్తూ దొరికిన ఆనందపు క్షణాలని అనుభవిస్తూ జీవించమనే సందేశం ఉంది. జీవితంలోని ఆనందాలు ప్రయతిస్తే దొరకవు. అప్రయత్నంగా దక్కిన వాటిని కాదని వాటి విలువ తెలియకుండా ప్రయత్నిస్తే అవి మళ్ళీ మన దరి చేరవు. అన్ని యాదృచ్ఛికాలే, ఎందులోనూ మన గొప్ప లేదు. అందుకే దొరికిన ఆనందాలను అనుభవించగల స్థితిలో మనం ఉండడమే జీవితాన్ని అందుకోవడం.

ఈ పాటలో పల్లవి చరణాలను గమనించండి. సాహిర్ పాట ఇదే పద్ధతిలో ఉండాలనే నియమాలన్నిటిని వదిలి ఎన్నో ప్రయోగాలు చేసారు. హం దోనో సినిమాకి “అభీ నా జావో ఛోడ్ కర్” అని ఆయన రాసిన పాట విన్నాం కదా. అందులోనూ చరణం పల్లవులంటూ మనకు ఇంతకు ముందు తెలిసిన వరస ఉండది. ఆయన పదాలతో అద్భుతమైన ప్రయోగాలు చేసారు. అలాగే ఈ పాటలోకూడా అన్నీ వాక్యాలే. పల్లవిలో ఉండేది ఒక్క రెండు వాక్యాలయితే చరణంలో వాక్యాలు వరుసగా వస్తూనే ఉంటాయి. అదే ఈ పాట అందం కూడా. ఈ శైలి మరే రచయిత సాహిర బాటలో మాత్రం ప్రయోగించలేదు. ఇది పూర్తిగా సాహిర్ వ్యక్తిగత శైలి. నేను రాసిందే చరణం, ఆపిందే పల్లవి అన్నట్లుగా ఆయన ఆ పాటలన్ను అన్ని నియమాలకు అతీతంగా రాసుకూంటూ వెళ్ళి వాటిని ప్రజల మధ్యకు చేర్చగలిగారు. కవిత్వ బలం ఉంటే దానికి నియమాలు అక్కర్లేదని చేసి చూపెట్టారు.

ఇది ఆశా సోలోగా పాడిన పాట సారం. ఈ పాట అశాంతం ఫాస్ట్ బీట్‌లో వస్తుంది. దానికి చివర్న ఆశా భోస్లే చేర్చిన రాగం అత్యద్భుతంగా ఉంటుంది. పాటకు ఎంతో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఇస్తుంది ఆశా గానం.

ఇదే పాట తరువాత డ్యూయెట్‌గా ఎలా రూపొందిందో చూద్దాం. ఇది కాస్త విషాదాన్ని జోడించి పాడిన గీతం. ఇందులో ఆశాతో గొంతు కలుపుతారు మహేంద్రకపూర్. ఈ డ్యూయెట్‌లో మనసు గాయపడిన నాయకుడికి ఆ నాట్యగత్తె సాంత్వాన చేకూరుస్తూ జీవితాన్ని అర్థం చేయిస్తుంది. పైన సోలోలో ఆనందంగా జీవితంలో ఓలలాడుతూ ఉండమనే సందేశం ఉంటే, ఇక్కడ ప్రతికూల పరిస్థితిలో కూడా జీవితంలో ఓటమిని ఒప్పుకోక ముందుకు సాగుతూ వెళ్లమనే సందేశం ఉంది.

జిందగీ ఇత్తెఫాక్ హై..

జిందగీ ఇత్తెఫాక్ హై, కల్ భీ ఇత్తెఫాక్ థీ ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై,

(జీవితం యాదృచ్ఛికం, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే)

అదే పల్లవితో పాటను ఆమె మొదలెడుతుంది. అయితే తరువాతి వాక్యంలో విషాదంగా కనిపిస్తున్న నాయకుడిని ఆమె ప్రశ్నిస్తుంది. అతను తాననుభవిస్తున్న బాధ గురించి చెప్తే దానికి ఆమె తరువాత సమాధానం ఇస్తుంది. ఇక్కడ కూడా చరణాలలో సాహిర్ చేసిన ప్రయోగాలను గమనించవచ్చు.

ముందుగా ఆమె అతన్ని ఇలా సంబోధిస్తుంది..

కోయి తో బాత్ కీజియె, యారో కా సాథ్ దీజియె

(ఎవతోనన్నా మాట్లాడు, స్నేహితులతో కలువు)

అతను మౌనంగా ఉన్నాడు, మునుపటి ఉత్సాహం అతనిలో లేదు. ఏదో దెబ్బ తిన్నట్టుగా దిగాలుగా ఉండడం చూసి అతన్నిఎవరితోనన్నా కలిసి మాట్లాడమని మౌనంగా ఉండవద్దని ఆమె అడుగుతుంది. ఇక్కడ ఆమె పాడేది ఒకే ఒక్క వాక్యం. దీని తరువాత అతను ఇలా బదులిస్తాడు..

కభీ గైరో పె భీ అప్నో కా గుమాన్ హోతా హై

కభీ అప్నె భీ నజర్ ఆతే హై బేగానె సె.. వాహ్ వాహ్

(కొన్ని సార్లు పరాయు వాళ్ళ దగ్గర దగ్గరతనం దొరుకుతుంది. మరొ కొన్ని సార్లు మనవాళ్ళే పరాయివాళ్లనిపిస్తారు)

ఆమె అతని పరిచయస్థురాలు మాత్రమే. కాని అతనిలోని విషాదాన్ని గమనించింది. అలా ఉండవద్దని అతన్ని కోరుతుంది. దానికి అతను కొన్ని సార్లు పరాయి వారివద్ద కోరుకున్న దగ్గరితనం దొరుకుతుంది. కొని సార్లు మన అనుకున్న వాళ్ళే పరాయి వాళ్లవుతారు అని సమాధానం ఇస్తాడు. అతను కోరుకున్న వారి వద్ద ఆశించిన ప్రేమ స్నేహం దొరకట్లేదన్న అతని బాధ ఆమెకు అర్థం అయినా అతని కవిత్వ ధోరణికి అతను చెప్పే జీవిత సత్యాన్ని ఆమోదిస్తూ ఆమె వాహ్ వాహ్ అని బదులిస్తుంది. ఆమె ఇచ్చిన ప్రోత్సాహంతో అతను ఇలా అంటాడు..

కభీ ఖ్వాబో మె చమక్తే హై మురాదొ కే మహల్

కభీ మహలో మె ఉభర్ ఆతే హై వీరానే సె .. హాయ్ హాయ్ హాయ్

(కొన్ని  సార్లు కలల్లో కోరికల భవనాలు మెరుస్తూ కనిపిస్తాయి. కొన్ని సార్లు ఆ భవనాలలో నిర్జన ప్రదేశాలు దర్శనమిస్తాయి)

మనం కనే అందమైన కలలు కాల్పనికమైనవి కాని మన కోరికలను అవి ప్రతిఫలిస్తాయి. ఆ కాల్పనిక కలలలో అందమైన భవనాలు మెరుస్తూ మైమరిపిస్తాయి. కాని వాస్తవంలో చాలా సార్లు ఈ అందమైన భవనాలలో రాజప్రసాదాలలో నిర్జన ఎడారులు దర్శనమిస్తాయి. కలలకు వాస్తవానికి అంత వ్యత్యాసం ఉంటుంది. అందమైన కలలు వాస్తవ రూపంలోకి వచ్చినప్పుడు, మనం కోరుకున్నవి జీవితంలో మనముందుకు వచ్చినప్పుడు చాలా సందర్భాలలో ఎంతో నిరాశకు గురి చేస్తాయి. ఆ నిరాశను తట్టుకోవడం చాలా కష్టం. అవి మన ఓటమిని, మన మూర్ఖత్వాన్ని, మన అమాయకత్వాన్ని చూపిస్తాయి. దాన్ని తట్టుకోవడం అంత సులువు కాదు. అతను తనలోని నిరాశను, తాను కన్న కలలకు, తనకు దక్కిన వాస్తవానికి మధ్య తేడాను ఆమెకు చెప్పినప్పుడు అతని కవిత్వ ధోరణికి ఆమె ఆనందిస్తుంది. అంతటి నిరాశను కవితాత్మకంగా వ్యక్తికరించిన అతని భాషా పటిమకు అచ్చెరువు చెంది ‘హాయ్ హాయ్’ అంటు అతని భాధను అర్థం చేసుకున్నానని ప్రకటిస్తుంది. కాని దానికి ఓ అందమైన లోతైన జీవిత సారాన్ని జోడించి తన జవాబును ఇలా ఇస్తుంది..

కోయి రుత్ భీ సజా నహీ, క్యా హొ కబ్ కుచ్ పతా నహి

గమ్ ఫజూల్ హై గం న కర్, ఆజ్ తో జష్న్ కమ్ న కర్

మేరె హమ్దం మేరే మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై

కల్ భీ ఇత్తెఫాక్ థీ, ఆజ్ భీ ఇత్తెఫాక్ హై

జిందగీ ఇత్తెఫాక్ హై

(ఏ రుతువు కూడా శిక్ష కాదు, ఎప్పుడు ఏమవుతుందో ఎవరికీ తెలియదు, దుఃఖం దేనికి పనికిరాదు అందుకే దుఃఖించకు, నీ వాళ్లతో సంబరాలను తగ్గించుకోకు. ఎందుకంటే ఓ నా స్నేహితుడా, ఓ నా ప్రియ నేస్తమా, ప్రతి ఆనందమూ యాదృచ్ఛికమే, నిన్నా యాదృచ్ఛికమే, నేడు యాదృచ్ఛికమే, జీవితమే యాదృచ్ఛికం)

జీవితంలో ఎన్నో రుతువులు వస్తాయి వెళ్తాయి. కొన్ని ఆనందాన్నిస్తే కొన్ని విషాదాలను మిగులుస్తాయి. అయినా ఏ రుతువూ మనకు శిక్ష కాదు. ఏప్పుడు ఏం జరుగుతుందో ఎవరమూ చెప్పలేమూ. ఏదీ అనుకుని రాదు. ఏం జరిగినా దుఃఖం వాటిని మార్చలేదు. అందుకే దుఃఖిస్తూ కూర్చోవడం అంటే జీవితాన్ని వ్యర్థం చేసుకోవడమే, దుఃఖం ఎవరికీ ఉపయోగ పడదు. దుఃఖం కలిగిందని, నీ వాళ్లతో మిగిలిన సంబరాలకు నిన్ను నువ్వు దూరం చేసుకోకు. ఎందుకంటే నీ జీవితంలో వచ్చిన ఈ దుఃఖం లాగే ఆనందమూ యాదృచ్ఛికమే, నీ గడిచిన నిన్న, నడుస్తున్న ఈ రోజు, రాబోయే తరువాతి రోజు అన్నీ యాదృచ్ఛికాలే. వాటిని స్వీకరించి ముందుకు వెళ్లడమే జీవితం.

ఇక్కడ కూడా చరణంలో జరిగిన ప్రయోగాలను గమనించండి. అతను తన స్థితిని అమెకు తెలియబరుస్తున్నాడు. ఆమె తన పంథాలో జవాబిస్తుంది. వాక్యాలలో ఎక్కడా పాటకుండవల్సిన నియమాలు కనిపించవు. పాటంతా కేవలం కవితాగానమే..

అతనికి జీవితంలో గడచిన దుఃఖాల ప్రభావంతో రాబోయే ఆనందాలను వదులుకోవద్దని చెబుతూ, అతన్ని ఆమె ఇలా అడుగుతుంది..

ఖోయె సె క్యూ హో ఇస్ కదర్, డూంఢతీ హై కిసే నజర్

(ఏదో పోగొట్టుకున్నట్లు ఇలా ఎందుకున్నావు? నీ చూపులు దేన్ని వెతుకుతున్నాయి)

జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు ఉన్న అతన్ని ఎందుకని అలా ఉన్నావు దేన్ని వెతుకుతున్నావు అని ఆమె ప్రశ్నిస్తుంది. దానికి అతను ఇలా జవాబు ఇస్తున్నాడు

ఆజ్ మాలూం హువా పెహ్లె యే మాలూం నా థా

చాహతే బడ్కే పషేమాన్ భి హో జాతీ హై.. అచ్ఛా

దిల్ కె దామన్ సె లిపటతి హుయీ రంగీన్ నజరే

దేఖతె దేఖతె అన్జాన్ భి హో జాతీ హై

దేఖతె దేఖతె అన్జాన్ భి హో జాతీ హై

(ఇవాళే ఇది తెలిసింది, ఇంతకు ముందు నాకు తెలియని ఓ విషయం, ఇష్టాలు పెరుగుతూ పోయి సిగ్గు పశ్చాత్తాపంలోకి మారిపోగలవని..) అలాగా..

(హృదయపు అంచులను హత్తుకునే ఆ రంగుల చూపులు చూస్తూ ఉండగానే అపరిచితమై పోతాయని)

అతను ఒకప్పుడు కొందరిపై ఇష్టాలను పెంచుకున్నాడు. ఆ ఇష్టాలను మనసులో పెరగనిచ్చాడు. కాని అవి పెరిగి పెరిగి సిగ్గు పశ్చాత్తాపాలుగా మారిపోయాయి. ఒకప్పటి తన ఇష్టానికి, ప్రేమకు ఇప్పుడు అతను సిగ్గుపడుతున్నాడు, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఇలాంటి స్థితి వస్తుందని, తన ప్రేమ ఇష్టాలే తరువాత తాను సిగ్గుపడే విషయాలుగా మారతాయనే సత్యం అతనికి ఇప్పుడే తెలిసింది. హృదయాన్ని తాకిన అందమైన చూపులు, ఆ అనుభవాలు అంతలోనే అపరిచితమైన పోతాయని అతను ఎప్పుడు అనుకోలేదు. అలాంటి స్థితి తన జీవితంలో వస్తుందనే ఆలోచనే అతనికి ఇప్పటిదాకా రాలేదు.

ఇక్కడ ఈ చరణంలో సాహిర్ ‘పషేమాన్’ అనే ఉర్దూ పదాన్ని వాడారు. ఆ పదానికి ఉన్న లోతు తెలుగులో తీసుకురావడాని సిగ్గు, పశ్చాత్తాపం అనే రెండు పదాలను వాడవలసి వచ్చింది. ఉర్దూలో కొన్ని పదాల లోతు ఒకే పదంతో ఇతర భాషలలో పట్టుకోవడం చాలా కష్టం.

తమ ప్రేమలు ఇష్టాలకు పశ్చాత్తాపపడే స్థితిని అనుభవించినవారికి ఈ వాక్యంలోని లోతు, ఆ నాయకుడి దుఃఖం అనుభవంలోకి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా చాలా ప్రియమైన చరణం ఇది.

దీనికి ఆమె ఇచ్చే జవాబు చూడండి..

యార్ జబ్ అజనబీ బనే, ప్యార్ జబ్ బేరుఖీ బనే

దిల్ పె సహ్ జా గిలా న కర్, సబ్సె హస్కర్ మిలా నజర్

మేరే హందం మేరె మెహర్బాన్

దోస్తీ ఇత్తెఫాఖ్ హై,..

దోస్తీ ఇత్తెఫాఖ్ హై,

కల్ భీ ఇత్తెఫాఖ్ థీ ఆజ్ భీ ఇత్తెఫాఖ్ హై

జిందగీ ఇత్తెఫాఖ్ హై

(స్నేహితులు అపరిచితులయి పోయి, ప్రేమ ఉదాసీనతలోకి మారిపోతే మనసుతో భరించు, ఫిర్యాదు చేయకు, అందరితో నవ్వుతూ చూపులు కలుపు, నా స్నేహితుడా, నా ప్రియతమా, ఎందుకంటే స్నేహం యాదృచ్ఛికమే, నీ నిన్న కూడా యాదృచ్ఛికం, నేడు కూడా యాదృచ్ఛికమే, అసలు జీవితమే యాదృచ్ఛికం)

బహుశా ఈ చరణం తరువాత ఇక చెప్పేది వినేది ఏమీ ఉండదన్నట్లుగా ఈ పాట ఈ చరణం తరువాత హఠాత్తుగా ఆగిపోతుంది. సంగీత దర్శకుడు రవి ఈ పాటకు అందించిన సాంగీతం ఈ చరణాల భావాన్ని హృదయానికి మోసుకు వచ్చే తీరు అనుభవించవలసిందే.

చాలా సార్లు మోసపోయిన వ్యక్తులు, ప్రేమను కోల్పోయిన వ్యక్తులు తమ గాథను వినిపించిన తరువాత విన్న వాళ్లు వాళ్లకు జరిగిన అన్యాయానికి సానుభూతి చూపించడం లేదా అవతలి వారిని నిందించడం చూస్తాం. వాళ్లకి ప్రేమ విలువ తెలియదు, నీ విలువ తెలియదు అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడతావు అనే అర్థంతో సాంత్వన వచనాలు పలుకుతాము. సాహిర్ కలం అలాంటి తప్పు చేయదు. ఇవన్నీ జీవితంలో భాగం అని చెప్తూనే జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూడమంటుంది. అందుకే పై చరణంలో అతని బాధను ఆమె అర్థం చేసుకుంటూనే ఇవన్నీ జరుగుతాయి, స్నేహితులు పరాయి వాళ్లవుతారు, ప్రేమ ఉదాసీనతగా మారుతుంది. కాని దాన్ని భరించు, ఫిర్యాదు చేయకు అందరితో నవ్వుతూ ఉండు ఎందుకంటే నీకు దొరికిన స్నేహం ప్రేమ కూదా యాదృచ్చికమైనవే. అవి అలా వచ్చాయి అలాగే వెళ్లిపోతాయి. అదే నిజం. ఈ జీవితమే యాదృచ్ఛికంగా దొరికినది. ఇక ఇందులో ఏది శాశ్వతం, ఏది నిజం? ఏది నీ సొంతం. అన్నీ వచ్చి వెళ్లిపోయే స్థితులే. నీకు దొరికిన ఆ నిన్నలోని ఆనందం యాదృచ్ఛికమే, నేటి విషాదం యాదృచ్ఛికమే, ఎందులోనూ నీ ప్రమేయం లేదు. అందుకే తామరాకు మీద నీటి బొట్టులా ఉండిపో.. అన్ని అనుభవాలు నీ నుండి, నీలో నుండి వీడిపోతూ ఉంటే గమనించు, అన్ని స్థితులలోనూ కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపో.

ఇది ఓ క్లబ్ డాన్సర్ పాడే పాట. ఓ పార్టీలో ఓ నాట్యగత్త ఇతరులను రంజింపచేయడానికి పాడిన పాట. సాహిర్ దీన్ని ఇంత లోతైన గీతంగా మార్చగలిగారంటే, పాట పట్ల ఆయనకున్న నిబద్ధత అర్థం అవుతుంది. స్త్రీని అది పురుషులను రంజింపచేసే వృత్తిలో ఉన్న స్త్రీలో ఇంత పరిపక్వతను లోతైన ఆలోచనను, జీవితాన్ని అర్థం చేసుకోగలిగిన తాత్వికతను నింపడం ఆయనకే చెల్లింది. క్లబ్ డాన్సర్లకు, నాట్యగత్తెలకు సినిమాలలో చాలా మంది కవులు రాసిన పాటలను గమనించండి. ఆ పాత్రలను ఎలాంటి సామాజిక, మానసిక స్థాయిలో వాళ్లు ఉంచేసారో అర్థం అవుతుంది.

కాని సాహిర్ ప్రత్యేకంగా ఇలాంటి స్త్రీల వైపు నిలబడి వారి గొంతుకతో గొప్ప జీవిత సత్యాలను చెప్పిస్తారు. చాలా సందర్భాలలో అందమైన నాయికల కంటే కూడా ఉదాత్తమమైన వ్యక్తిత్వాన్ని ఆయన తన పాటల ద్వారా ఆ స్త్రీలకు ఆపాదించారు. ఆయన చూపిన ఈ విశాలత్వం, ఈ దూరదృష్టి స్త్రీని కేవలం రంజింపచేసే వస్తువుగా చూడ నిరాకరించిన ఆయన అభ్యుదయం నాకు చాలా చాలా ఇష్టం. సాహిర్ రాసిన ఏ క్లబ్ గీతమైయినా అత్యంత గొప్ప తాత్వికతతో గుబాళిస్తుంది. జీవితంలో ఎవరు ఏ స్థితికి చేరారన్నది కూడా యాదృచ్ఛికమే. అందులో ఎవరి గొప్పా లేదు, ఎవరి స్వీయ నిర్ణయమూ లేదు. జీవితమే యాదృచ్ఛికం అయినప్పుడు సమాజంలో ఈ సామాజిక స్థాయి భేధాలు, గొప్ప బీద తారతమ్యాలు, వృత్తికి సంబంధించిన మర్యాదలు అన్నీ అర్థం లేనివి.

మానవ జీవితాన్ని చర్చించిన ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. కాని నాకు ఇది చాలా ఇష్టమైన గీతం. జీవితాన్ని ఇంత గొప్పగా చిత్రించిన సాహిర్ అంటే పట్టరాని అభిమానం. ‘జిందగీ ఇత్తెఫాక్ హై’ అనుకుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో. చాలా కోపాలు, ఫిర్యాదులు పటాపంచలైపోతాయి.

కోయి రుత్ భీ సజా నహీ, క్యా హొ కబ్ కుచ్ పతా నహి

గమ్ ఫజూల్ హై గం న కర్, ఆజ్ తో జష్న్ కమ్ న కర్

మేరె హమ్దం మేరే మెహర్బాన్

హర్ ఖుషీ ఇత్తెఫాక్ హై..

ఇంతకు మించిన జీవిత సత్యం మరొకటి ఉండదేమో..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version