‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-5 – తుమ్ నజానే కిస్ జహాన్ మే ఖోగయే

1
1

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘సజా’ (1951) చిత్రం కోసం లతా మంగేష్కర్ పాడిన పాట. సంగీతం ఎస్. డి. బర్మన్.

మనం కోరుకున్నది, కావాలనుకున్నది మనకు దక్కడం జీవితంలో చాలా అరుదు. కొన్నేళ్ళ జీవితంలో వెనుతిరిగి చూసుకుంటే మనం కోల్పోయినవే చాలా ఉంటాయి. దానికి ఏవైనా కారణాలు ఉండవచ్చు కాని మనిషి జీవన క్రమంలో పొందిన సుఖాలకన్నా కోల్పోయిన సుఖాలే ఎక్కువ. ఆ దుఃఖాన్ని దాటుకుని జీవితంలో ముందుకు సాగుతాం. కాని ఆ కోల్పోయిన విషాదం మన వెన్నంటే ఉంటుంది. దుఃఖం రూపం మారుతుంది కాని అది శాశ్వతంగా దూరమవ్వదు. ఇది పూర్తిగా నిజం. అందుకే మనిషి ఎదిగిన కొలది విషాదాన్ని దాటడం నేర్చుకుంటాడు కాని దాన్నిపూర్తిగా వదిలించుకోలేడు. మనిషి జీవితంలో వెన్నంటే ఎప్పటికీ ఉండేది ఈ విషాదమే. అందుకే విషాదంలో ఎంతో గాఢత ఉంటుంది. మానవ జీవన సారం విషాదాన్ని మనిషి ఎదుర్కున్న పద్దతిలోనే అవగతం అవుతుంది. సాహిర్ రాసిన విషాద గీతాలలో కనిపించే గాఢతలో ఓ గాంభీర్యం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. సినిమా సన్నివేశ పరంగా అది నాయిక తన ప్రియున్ని పోగొట్టుకుని ఒంటరయిన స్థితే కావచ్చు కాని ఇప్పుడు మనం చర్చించుకునే గీతాన్ని సినీ సందర్భం నుంచి విడదీసి చూస్తే మన లోపలి మనిషి ఏదో ఒక సందర్భంలో పలికించే విషాద గీతిక ఇదే అని అనిపించి తీరుతుంది. ఈ పాట ఎన్ని సార్లు విన్నా నా కళ్లు చెమరుస్తాయి. అది ‘తుమ్ నజానే కిస్ జహాన్  మే ఖోగయే’.

తుమ్ నజానే కిస్ జహా మే ఖోగయే

హం భరీ దునియామే తన్హా  హోగయే

తుమ్  నజానే కిస్ జహా మే ఖోగయే

(నువ్వు ఏ ప్రపంచంలోకి తప్పిపోయావో నాకు తెలియదు. నేను ఈ నిండైన లోకంలో ఒంటరినయ్యాను)

మనం ఒకరిని ఇష్టపడినప్పుడు వారెంత బాధపెట్టినా వారి పట్ల మనకు ఎన్ని ఫిర్యాదులున్నా పూర్తిగా వారిపై కోపం రాదు. మనం చేసే ఫిర్యాదులో కూడా ఆ వ్యక్తి పట్ల ప్రేమ పొంగుతూనే ఉంటుంది. అది నిండైన ప్రేమ. అంత ప్రేమించే వ్యక్తి పట్ల ఫిర్యాదు చేయడంలో బాధ ఉంటుంది. అది అర్ధం చేసుకోవాలంటే వినే వారిలోనూ ఆ గాఢత ఉండాలి. కనిపించకుండా పోయిన ప్రియుడి వలన ఆమె బాధపడుతుంది. కాని నువ్వు నన్ను వదిలేసి వెళ్లిపోయావు అనదు. ఏ ప్రపంచంలోనో తప్పిపోయావు అంటుంది. సాహిర్ ఎంత ఆచీ తూచి పదాలు వాడతాడో చూడండి. తుమ్ నజానే కిస్ జహా మే ఖో గయే… అతని ప్రపంచం వేరయి వెళ్ళిపోయాడు, కాని అతనిపై ఆమెకున్న అపారమైన ప్రేమ అతను తనను వదిలేసి వెళ్లిపోయాడననివ్వదు. అలా అని తనను, తన ప్రేమను ఆమె తక్కువ చేసుకోదు. నువు తప్పిపోయావు అంటూ తనను తల్లి స్థానంలో అతన్ని ఓ బాలుని స్థానంలో చూపిస్తుంది. అతని వియోగాన్ని దానిలోనుంచి విషాదాన్ని అనుభవిస్తున్న ఆమెలో ఎంత గొప్ప వ్యక్తిత్వం ఎంత అభిమానం? నన్ను వదిలేసి వెళ్లిపోయావు అనడం, నువెక్కడో తప్పిపోయావు అనడం రెంటి వెనుక సంఘటన ఒకటే కాని మొదటి సందర్భంలో ఆమె నిస్సహాయత మాత్రమే ఉంటే రెండో సందర్భంలో ఆమె విషాదాన్ని స్వీకరించే పద్ధతితో ఓ పరిపక్వత కనిపిస్తుంది. ఆమెను వదిలి వెళ్ళిన వ్యక్తి ఆమె ముందు ఆ కాసేపు చిన్నవాడయిపోతాడు. అలా అని ఆమె అతన్ని తక్కువ చేయదు. రెండో వాక్యంలో చూడండి ఏమంటుందో..

అతను వెళ్ళిపోవడం వలన ఆమె ఈ నిండైన లోకంలో ఒంటరి అయింది అట. అంటే ఆమె నివసించే ప్రపంచం నిండుగానే ఉంది అక్కడ అన్నీ ఉన్నాయి కాని అతను లేని లోటు వలన ఆమెకు అవన్నీ అనవసరమైనవిగా కనిపిస్తూ ఉండడం వలన ఆమె ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. అంతగా ఆమె అతన్ని ప్రేమించింది. అన్ని ఉన్న లోకంలోనూ ఆమె ఒంటరిదయింది. ఇక్కడ ఆమె ఎవరినీ తప్పు పట్టట్లేదు. అన్నీ ఉండి అతన్ని కోరుకోవడమే ప్రేమ కాని ఏమీ లేని సందర్భంలో అతన్ని కోరుకోవడం గొప్ప కాదు కదా. దాన్ని ఎంత స్పష్టంగా చెప్తున్నాడో సాహిర్. ఒక పక్క నువ్వు తప్పిపోయావు అంటూ తన అభిమానానికి భంగం రానివ్వట్లేదు, మరోసారి నువ్వు లేకపోవడంతో అన్నీ ఉన్న లోకంలోనూ నేను ఒంటరినే అని చెబుతూ అతనికి అదే స్థానాన్ని ఆమె ఇవ్వడం ఎంత ఉన్నతమయిన వ్యక్తిత్వం, ఎంత గొప్ప ఆరాధనా భావం? ఇది సాహిర్ పాటల్లో స్త్రీల సందర్భంలో మనకు కనిపించే అద్భుత వ్యక్తిత్వం. ఖో గయే, భరీ దునియా లాంటి చిన్న పదాల్లో ఆమె విషాదాన్ని, ఆమె ప్రేమను ఎంత ఉన్నతంగా చూపుతున్నాడో సాహిర్ గమనించండి. అందుకే అతని పాటలకు నేను ఎప్పటికీ ఫిదా..

మౌత్ భీ ఆతీ నహీ ఆస్ భి జాతీ నహీ

దిల్ కొ యె క్యా హో గయా కోయీ షై భాతీ నహీ.

లూట్ కర్ మేరా జహాన్  ఛుప్ గయే హో తుమ్ కహా

తుమ్ కహా, తుమ్ కహా తుమ్ కహా

తుమ్ నజానే కిస్ జహా మే ఖోగయే

(మరణమూ దరి చేరట్లేదు. ఆశ వీడిపోవట్లేదు మనసుకేమయిందో ఏదీ ఆనందానివ్వట్లేదు. నా ప్రపంచాన్ని దోచుకున్న నీవు ఎక్కడ దాక్కున్నావో.. ఎక్కడున్నావో, ఎక్కడున్నావో)

జీవితంలో ఏమీ లేని స్థితిలో ఆమె దరికి మరణమూ రావట్లేదు అట. మనందరి జీవితంలో ఇలాంటి స్థితి ఏదో ఓ సందర్భంలో వస్తుంది. బ్రతకడానికి కారణం ఉండదు. మనకై మనం మరణించలేం. మరణమూ దానికదే రాదు. అలా వస్తే బావుండునన్న కోరిక ఉంటుంది. ఈ బాధ నుండి విముక్తి దొరుకుతుంది కదా. కాని మరణం రావట్లేదు. మనసులో ఆశ దూరం అవట్లేదు. మిణుకు మిణుకుమని కొట్టుకునే ఆ జీవితేచ్ఛ ఆమెని మరణాన్ని చేరుకోనివ్వట్లేదు. మనసు ఎలాంటి స్థితికి చేరిందంటే ఏదీ ఆనందం ఇవ్వట్లేదు. ఆమె మొత్తం ప్రపంచాన్ని ఆమె జీవితాన్ని దోచుకున్న అతను ఎక్కడో దాక్కున్నాడు. ఆమె అతని కోసం తహతహలాడుతూ నువ్వెక్కడున్నావో అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నలో అతని క్షేమం కోసం ఆరాటమూ ఉంది. అదే విచిత్రం. ప్రేమ గొప్పతనం. అతను తిరిగి వస్తాడేమో అన్న ఆశవుంది. మరణం రావటంలేదు. ఆశ పోవటంలేదు. ఆశ ఉన్నంత కాలం మరణం రాదు. కానీ, ఆశ పోవటం లేదు. అందుకే, ఈ నా హృదయానికేమయింది, ఏదీ నచ్చటంలేదు…అంటోంది. తన ప్రపంచాన్ని దోచుకుని నువ్వెక్కడ దాక్కున్నావు  అనటం వెనుక ఈ వేదన వుంది.  అతను తప్ప ఏదీ నచ్చదు. అతను వస్తాడన్న ఆశ ఆమెను బ్రతికిస్తోంది. కానీ, అతను లేకపోతే ఆమెకు జీవితమేలేదు. జీవితంలో ఆనందం లేదు.

ఈ పాటకు ఎస్.డి. బర్మన్ అతి తక్కువ వాయుద్యాలతో ట్యూన్ కడితే లత అద్భుతంగా పాడింది. ముఖ్యంగా తుం కహా, తుం కహా, తుం కహా అని మూడు సార్లు అనే పద్దతిలో ఆమె కంఠంలో విషాద స్థాయి క్రమంగా పెరిగుతుంటే వినే శ్రోతల మనసు కలుక్కుమంటుంది. ఈ తుమ్ కహా? ఒకోసారి స్థాయి పెరగటం తీవ్రమవుతున్న ఆమె వేదనను సూచిస్తుంది. మూడోసారి తుం కహా అన్న తరువాత,  దీర్ఘం తీసి ఆఆఆ అని చిన్న చిన్న ముర్కీలతో ఏడుస్తున్న భావనను అత్యద్భుతంగా కలిగిస్తుంది లత..అత్యద్భుతమైన గాన సంవిధానం ఇది. పాట భావాన్ని ప్రస్ఫుటంచేస్తూ, వేదన తీవ్రతను ఇనుమడింపచేస్తూ, పదాల శక్తిని తీవ్రంగా ధ్వనింపచేస్తుంది లత..

ఏక్  జాన్ ఔర్ లాఖ్ గమ్ ఘుట్ కె రహ్ జాయే న దమ్

ఆవో తుం కో దేఖ్ లే డూబ్ తీ నజరోం సే హమ్

లూట్ కర్ మేరా జహాన్  ఛుప్ గయే హో తుమ్ కహా

తుమ్ కహా, తుమ్ కహా,  తుమ్ కహా

తుమ్ న జానే కిస్ జహా మే ఖోగయే

హమ్ భరీ దునియా మే తన్హా హో గయే

(ఒకటే ప్రాణం కాని లక్ష విషాదాలు, ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరవుతున్నాను. నిన్నొక సారి క్రుంగిపోతున్న ఆశల మధ్య చూడాలని ఉంది. నా ప్రపంచాన్ని దోచుకున్న నువ్వు ఎక్కడ దాక్కున్నావో.. ఎక్కడున్నావో..)

అన్ని వైపుల నుండి సమస్యల మధ్య చిక్కుకున్న ఆమె నిస్సహాయతతో నాది ఒకటే ప్రాణం కాని భరించవలసిన ఎన్నో విషాదాల మధ్య ఊపిరి ఆడక నలిగిపోతున్నాను.  క్రుంగిపోతున్నాను. సముద్రం లాంటి దుఖంలో మునిగిపోతున్నాను అని చెబుతుంది. ఆ పరిస్థితులలోనూ ఒక్కసారి అతన్ని ఆమె చూడాలని కోరుకుంటుంది. ఆ మునక అమెను ఎక్కడ చేరుస్తుందో తెలీదు అందుకే ఆ ఆఖరి నిముషంలో కూడా అతన్ని చూడాలనే కోరికను బయట పెట్టుకుంటుంది. ‘డూబ్తీ నజర్’ అత్యద్భుతమయిన దృశ్యాత్మకమయిన పద ప్రయొజనం. డూబ్నా అంటే మునిగిపోవటం.. డూబ్తీ నజర్ అంటే మునిగిపోతున్న దృష్టి అన్నట్టు అర్ధం చేసుకోకూడదు. మునిగిపోవటం మరణానికి చిహ్నం. ఇక్కడ ఆమె ‘ఘుట్ కె రహెజాయే న దమ్ ‘ అన్నది ముందు.  అంటే శ్వాస ఆగిపోతోందని అన్నది. ఇప్పుడు దృష్టి మునిగిపోతున్నదంటున్నది. ఆమే ఆశ అడుగంటుతున్నది. శ్వాస సరిగ్గా రావటంలేదు. ఆశ అడుగంటుతున్నది. ఆశ లేకపోతే ఈ ప్రపంచంలో ఏముంది? ఆమె ఎందుకోసం ఎదురుచూస్తుంది?  నిరాశ నిస్పృహలకు పరాకాష్ట ఈ భావం. కళ్ళల్లో ఆశ అడుగంటింది.డూబ్తీ నజర్ అర్ధం ఇది. ఆశ అడుగంటుతున్న దృష్టి ఆమెది. మనకళ్ళల్లో ఆశ జ్యోతి వంటిదన్న భావన  హిందీ సాహిత్యంలో ప్రచలితంలొ వుంది. ఆర్జూ లఖ్నవి అనే గేయ రచయిత  1939లో ‘దుష్మన్’ అనే  సినిమాలో మిట్ థి ఆస్ హై జ్యోత్ అఖియన్ కీ’ అన్నాడు. కళ్ళల్లో జ్యోతి లాంటి ఆశ అడుగంటుతోందని అర్ధం..ఇక్కడ సాహిర్ ఇదే భావనను డూబ్తీ నజర్ అన్న పదప్రయోగంతో అత్యద్భుతంగా కళ్ళకుకట్టించి మనసుకు చూపించాడు.

మనిషి తన జీవితంలోని సమస్యలతో చివరి దాకా పోరాడాలి. మధ్యలో ఎన్ని విషాదాలు ఎదురయినా ఆగిపోకూడదు. ఆమె అదే చేస్తుంది. అన్నిటిని మౌనంగా భరిస్తుంది. ఆమె శక్తి సరిపోకపోయినా తన ప్రయత్నం చేస్తూనే ఉంది. ఆ స్థితిలో కూడా అతన్ని ఒక్కసారి చూడాలన్ని కోరుకుంటుంది. ఆమెను అలా వదిలి తన ప్రపంచంలో తప్పిపోయిన అతను ఎక్కడున్నాడో అని ఆమె ఇప్పుడు బాధపడుతుంది. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, అని అతని క్షేమం కోసం తపిస్తుంది. అంతటి విషాదంలోనూ తుం కహా అనేటప్పుడు ఓ అభ్యర్ధన, అతని బాగు కోసం తపన, అతని క్షేమం కోసం ఆరాటం ఆమె గొంతులో పలుకుతున్నాయి.

ఒక్కోసారి ఈ పాట చరణం వింటున్నప్పుడు నన్ను నేను వెతుక్కుంటున్న ఫీలింగ్ కూడా నాకు కలుగుతూ ఉంటుంది. ఒకప్పటి నేను ఇప్పుడు లేను, ఆ స్పందనలు, ఆ కోరికలు ఇప్పుడు లేవు. కొంత భాగం జీవితంలో ఎక్కడో చేజారిపోయింది. పాత జ్ఞాపకాల మధ్య ఎన్నో సార్లు నన్ను నేను తలచుకుంటూ ఈ చరణం పాడుకోవడం నాకు అలవాటు. రొటీన్‌గా ఏ స్పందన లేకుండా జీవించేస్తున్న క్రమంలో ఆ పాత నేను ఎక్కడ తప్పిపోయానో అనుకుంటూ ఉంటాను. ఆ మూడ్‌లో ఈ పాట వింటూ ఉంటే, ఎవరినో కాదు నన్ను నేను వెతుక్కుంతూ ఆ పాత నేను ఎక్కడ తప్పిపోయానో, ఇప్పుడు ఎలాంటి అనుభూతులూ ఆ పాత ఆనందాన్ని ఇవ్వట్లేదు, ఒక్కసారి ఆ పాత నేనును చూడాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు నాతో నేను తుమ్ కహా తుమ్ కహా అని అనుకుంటూ ఉంటాను. నాతో నేను సంభాషించుకుంటున్నట్లు ఈ పాటను వింటుంటే ఆ విషాదం స్థాయి వేరు. కొన్ని వందల సార్లు ఆ పాత నేనుతో ఇప్పుడున్న నేను “తుమ్ నజానే కిస్ జహాన్ మే ఖోగయే, హమ్ భరీ దునియా మే తన్హా హోగయే” అని అనుకునే సందర్భాలు నా జీవితంలో మరీ  ఎక్కువవుతున్నాయి. అందుకే ఈ పాట నా మనసుకు ఎంతో దగ్గరయిన గీతం. ఆ కోల్పోయిన నన్ను నేను నిత్యం తలచుకుంటూ నా జీవన ప్రయాణంలో మౌనంగా విషాదంగా సాగిపోతున్న సమయంలో నా తోడు ఈ గీతమే..

“మౌత్ భీ ఆతీ నహీ.. ఆస్ భీ జాతీ నహీ… దిల్ కో యే క్యా హో గయా కోయీ షై భాతీ నహీ”.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here