Site icon Sanchika

‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-7 – ఫిర్ న కీజే మెరి గుస్తాఖ్ నిగాహీ కా గిలా

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

ఈ వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఫిర్ సుబహ్ హోగీ’ (Phir Subha Hogi 1958) చిత్రం కోసం ఆశా భోస్లే, ముఖేష్ పాడిన పాట. సంగీతం ఖయ్యామ్.

~

సాహిర్ ప్రేమ గీతాలలో మరో ఆణిముత్యం ఇది. సాహిర్ నాయికలు తమ మనసులోని కోరికను, ప్రేమను పురుషుని కంటే ముందుగా వ్యక్తీకరించడానికి సిగ్గుపడరు. వారిలో అసమాన్యమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఎంత సమర్పణ భావం ఉంటుందో అంతే స్పష్టత కూడా వీరిలో గమనిస్తాం. ఇప్పటి తరంలో స్త్రీ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ అని వాదిస్తాం కాని ముస్లిం కుటుంబంలో పెరిగిన సాహిర్ స్త్రీల మనోభావాలను వ్యక్తీకరించడంలో ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని స్త్రీల పరంగా చూపించేవారో గమనిస్తే ఆయనపై గౌరవం పెరుగుతుది. దానికి ఉదాహరణ ఈ గీతం.

ఫిర్ న  కీజే మెరి గుస్తాఖ్ నిగాహీ కా గిలా

 దేఖియె ఆప్ నె ఫిర్ ప్యార్ సే దెఖా ముఝ్కో

(నా అల్లరి చూపుల గురించి ఫిర్యాదు చేయవద్దు మరి, మళ్ళీ  మీరు నా వైపు  ప్రేమగా చూశారు)

ఇక్కడ ఉర్దూలో ప్రేమికులు ఒకరినొకరు ఆప్ అని సంబోధించడం జరుగుతుంది. పరస్పర మర్యాద సూచకం అది. ఇప్పుడు అది ఎవరికీ అర్థం కాదేమో కాని మనకు చాలా దగ్గరయిన వారిని ఇంకా, గౌరవించాలని, మర్యాదగా సంబోధించాలనే సంస్కృతి ఉర్దూ భాషలో కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ప్రేమికుడు కళ్ల నిండా ప్రేమను నింపుకుని తన ప్రియురాలి దగ్గరకు చేరి, ఇదుగో నేను మిమ్మల్నీ ఏదోలా చూస్తున్నానని నా పై ఫిర్యాదు చేయకండి. మీరు మరో సారి నన్ను ప్రేమగా చూస్తున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. మీ వైపు చూడకుండా ఉండలేకపోతున్నాను. నా చూపులో ఏదన్నా తేడా ఉంటే అది మీరు ప్రేమగా చూడడం వలనే అని గ్రహించండి అంటున్నాడు.

‘గుస్తాఖ్ నిగాహ్’ అన్నది గమ్మత్తయిన పదం.  presumptuous, audacious, insolent, saucy , impudent, uncivil, rude .. ఈ ఒక్క పదం ఇన్ని అర్ధాలిస్తుంది. అందుకే, నాయకుడు ‘గుస్తాఖీ మాఫ్’  అంటే,  క్షమించమన్న అర్ధం మాత్రం తీసుకోవాలని లేదు. ‘గుస్తాఖ్ నిగాహ్’  అంటే, అహంకారపూరితమైన దృష్టి కావచ్చు. ఎదుటివాడిని తక్కువచేస్తూన్న దృష్టి కావచ్చు, అవమానకరమైన దృష్టి కావచ్చు. కానీ, మనం చర్చిస్తున్నది రొమాంటిక్ గీతం. పైగా నువ్వు మళ్ళీ నా వైపు ప్రేమ దృక్కులు ప్రసరింపచేస్తున్నావు అంటున్నాడు. ప్రేయసి తనని ప్రేమగా చూస్తే నాయకుడు ఆమెను అవమానకరంగానో, అహంకార పూరితంగానో చూడడు. తానూ ప్రేమ చిలికే దృష్టితోనే చూస్తాడు. ఆ ప్రేమచూపు అల్లరి చూపుగా ఆమె అర్ధం చేసుకోవచ్చు. అందుకే మళ్ళీ నేనిలా చూశానని నా దృష్టిని గురించి ఫిర్యాదు చేయవద్దంటున్నాడు. నువ్వలా చూశావు కాబట్టి నేనిలా చూశాను. నా దృష్టి తప్పుఏమీ లేదు. తప్పు ఏదయినా వుంటే నీదే అంటున్నాడు. చక్కని చమత్కార పూరిత ప్రేమ సంభాషణపై తెర తీశాడు నాయకుడు. ఇలాంటి పాటలు రాయటంలో సాహిర్ దిట్ట.

దీనికి ఆమె ఇదుగో ఇలా బదులు ఇస్తుంది..

మై కహా తక్ న నిగాహో కో పలట్నే దేతీ

ఆప్కే దిల్ నే కయీ  బార్ పుకారా ముఝ్కో

(మీ హృదయం ఎన్నెన్నోమార్లు పిలుస్తూంటే మీ వైపు తిరగకుండా నా దృష్టిని నేనుమాత్రం ఎంతవరకూ  ఆపగలను?)

ఆమె తాను అతన్ని ప్రేమగా చూడటం లేదంటూ తప్పుకోదు. సిగ్గుతో ముడుచుకుపోదు. నేనెంత వరకు బెట్టుగా ఉండగలను? మీ మనసు నన్ను ఎన్నో సార్లు పిలుస్తుంటే అది విని మిమ్మల్ని ప్రేమగా చూడకుండా ఎలా ఉండగలను? నేను మీ మనసు పిలుపు విని తదనుగుణంగా స్పందిస్తున్నాను అంతే కదా.. అంటుంది ఆమె. తప్పు అమెని మాటి మాటికీ పిలుస్తున్న అతని హృద్యానిది తప్ప ఆమె దృష్టిది కాదు.

ఇస్ కదర్ ప్యార్ సె దేఖో న  హమారీ జానిబ్

దిల్ అగర్ ఔర్ మచల్ జాయె తొ ముష్కిల్ హోగి

(ఇలా నా వైపు ఇంత  ప్రేమగా చూడకు ప్రియతమా, మనసు ఇంకా ఉప్పొంగిపోతే కష్టమవుతుంది)

ఇప్పుడు అతను ఆమెను అలా చూడవద్దని వేడుకుంటున్నాడు. ఆమెను అతను ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆమె చూపులు అతన్ని నిలువనివ్వట్లేదు. తనను తాను సంబాళించుకోవడం అతనికి కష్టంగా ఉంది. అందుకే దయచేసి అలా చూడకు నేను నిభాయించుకోవడానికి చాలా కష్టపడుతున్నాను అని బ్రతిమాలుకుంటూ తన అసహాయతను వ్యక్తప్రరుచుకుంటున్నాడు.

తుమ్ జహా మేరి తరఫ్ దెఖ్ కె రుక్ జావోగే

వొహి మంజిల్ మెరి తక్దీర్ కీ మంజిల్ హోగి

(నువ్వు ఎక్కడ నా వైపు  చూసి ఆగిపోతావో, ఆ గమ్యం నా అదృష్టానికీ గమ్యంగా మారిపోతుంది)

ఎంత గమ్మత్తయిన జవాబిది. నువ్వు ఆగిపోయిన చోటే నా గమ్యం, అదే నా అదృష్టానికి చిహ్నం అంటుంది ఆమె. అంటే అక్కడే ఆగవద్దని ఇంకా ముందుకు రమ్మని, ప్రేమలో మరి కొన్ని అడుగులు వేయమని ఆమె అతన్ని ప్రోత్సహిస్తుంది. అతను ఎక్కడ ఆగిపోతే తన అదృష్టం అక్కడితో ఆగిపోతుందని ఆమె చెప్పడంలో అతన్ని ప్రేమలో ముందుకు రమ్మని పిలిచే అహ్వానంతో పాటు, నీవు వేసే ప్రతి అడుగు నా అదృష్టాన్ని నిర్ణయిస్తుంది అని ఆమె ఇక్కడ చెబుతుంది. తనను తాను గౌరవించుకుంటూ సమర్పించుకుంటూ అతని పట్ల ఉన్న తన నమ్మకాన్ని ఆమె ఎలా ప్రకటిస్తుందో గమనించండి.

చాలా సునితమైన భావన ఇది. యువతీ యువకుల నడుమ అప్రకటిత ప్రేమ భావన వుంటుంది. యువతి త్వరగా ప్రేమ భావనను వ్యక్త పరచదు. పురుషుడు ధైర్యం చేస్తాడు. పురుషుడు ముందడుగు వేయాలని స్త్రీ ఎదురుచూస్తుంది. ముందడుగు వేసెందుకు పురుషుడు ధైర్యం చేయక ఆక్కడే ఆగిపోతే ఆ ప్రేమ కథ అక్కడే ఆగిపోతుంది. అందుకే ఆమె నువ్వెక్కడ ఆగిపోతే అదే నా గమ్యం అని అడుగు ముందుకు వేయమని ప్రోత్సహిస్తోంది. లేకపోతే రాజిందర్ క్రిషన్  రాసిన పాట, హమ్సె ఆయా న గయా, తుంసె బులాయా న గయా, ఫాస్లా ప్యార్ మె  దోనోం సె  మిటాయా న గయా( నా కు చేతకాలేదు. నువ్వు పిలవలేదు. మన ప్రేమలో దూరాన్ని తొలగించటం మనిద్దరి వల్లా కాలేదు)  అని పాడుకుంటూ మిగిలిపోవాల్సివస్తుంది.

దెఖియె ఆప్ నె ఫిర్ ప్యార్ సే దెఖా ముఝ్కో

దానికి బదులుగా అతను మళ్ళీ అదిగో చూడండి మరో సారి నా వైపు ప్రేమగా చూసున్నారు అంటూ ఆమెకు బదులిస్తే ఆమె

ఆప్కే దిల్ నే కయీ  బార్ పుకారా ముఝ్కో

మీ మనసు మళ్ళీ నన్ను పిలిచింది చూడండి అని చమత్కరిస్తుంది…

ఒకరి పట్ల మరొకరికి ప్రేమతో పాటు ఎంత గౌరవం ఉందో ఈ ప్రశ్న జవాబుల పరంపర స్పష్టపరుస్తుంది. సాహిర్ మనుష్యులకు అన్ని సందర్భాలలోనూ సరైన గౌరవం ఉండాలని నినదించే ప్రజాకవి. ప్రేమ ఓ అందమైన భావన అది శరీరాలకు మాత్రమే సంబంధించినది కాదు. ఇద్దరు వ్యక్తులు ప్రేమలో ఉండాలంటే వారి మధ్య ఆకర్షణతో పాటు పరస్పర గౌరవం ఉండాలని అని నమ్మిన వ్యక్తి. అందుకే ఆయన ప్రేమగీతాలలో నాయికా నాయకులు ప్రేమతో పాటు ఈ గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కనిపిస్తారు.

ఎక్ యూ హీ సీ నజర్ దిల్ కొ జొ ఛూ లేతీ హై

కితనె అర్మాన్ జగాతీ హై తుమ్హె క్యా మాలూం

(నీ చూపులు నా మనసును తాకితే నాలో ఎన్ని కోరికలు మేల్కొంటాయో నీకు తెలుసా?)

ఆమె ప్రేమగా తనను చూసే విధానం తనను ఎంత ఇబ్బంది పెడుతుందో అతను చెబుతున్నాడు. తన మనసులోనూ ఆమెపై అంతులేని అనురాగం ఉంది. ఆమె మనసులో ఏం ఉందో అన్న అనుమానం కూడా అతనిలో ఉంది. కాని ఆమెకూ తనపై ప్రేమ ఉందని తెలిసిన తరువాత ఆమె చూపులు తనకు కలిగించే ఇబ్బందిని ఆమెతో చెబుతున్నాడు. ఈ ప్రేమను తాను అంగీకరిస్తున్నానని, దీన్ని బంధంగా మార్చుకోవాలనే కోరిక తనలో చెలరేగుతుందని అందుకే ఆమె ప్రేమగా తనను చూస్తున్న ప్రతీ సారి తనలో మేల్కొనే కోరికలతో తాను ఇబ్బంది పడుతున్నానని ఆమెతో అతను చెప్పుకోవడంలో ఆమె ప్రేమను అంగీకరిస్తూ తన దారి స్పష్టం చేయమన్న అభ్యర్థన కూడా ఉంది. తాను దూకుడుగా వ్యవహరిస్తే, తమ మధ్య ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. అది అతను భరించలేడు అందుకే ఆమెనే దారి చూపమని తన ఇబ్బందిని ఆమెకు చెప్పుకుంటున్నాడు. అదీగాక, సాహిర్ తన గీత రచనలో భౌతిక కోరికను వ్యక్తం చేయటంలో ఎప్పుడూ వెన్కంజ వేయలేదు.

ఏక్ ముద్దత్ సే తమన్నాథి తుమ్హే ఛూనేకీ ( అమానత్)

నిన్ను తాకాలని ఎప్పటినుంచో కోరిక వుంది

తేరే హోఠ్ మేరే హోఠ్ సిల్ గయేతో క్యా హువా?

దిల్ కి తర్హా జిస్మ్ భీ మిల్‍గయేతో క్యా హువా? (కభీ కభీ)

నీ పెదిమలు నా పెదిమలు కలుసుకుంటే తప్పేమిటి? హృదయంలాగే శరీరాలు కూడా కలసిపోతే తప్పేమిటి?

కాబట్టి నీ చూపులు నాపై ప్రసరిస్తే నేను అదుపుతప్పిపోతానేమో, అనటంలో నాయకుడు సిగ్గుపడటంలేదు. నాయిక మరోలా భావించటంలేదు. అలా భావిస్తే సాహిర్ వాళ్ళకు ప్రేమ గీతం రాయడు.

రూహ్ బేచైన్ హై కదమో సె లిపట్ నే కే లియె

తుమ్కొ హర్ సాంస్ బులాతీ హై తుమ్హె క్యా మాలూం

(నా ఆత్మ నీ పాదాలను చుట్టేయాలని తహ తహలాడుతుంది, నా ప్రతి శ్వాస నిన్నే పిలుస్తుందిని  నీకేం తెలుసు)

అతను ఆమె దగ్గరకు చేరకుండా  దూరంగా  ఉన్నాడు. అందుకు ఆమె అతనికి తన మనసును తెలుపుతూ మరో అడుగు ముందుకేయమని చెబుతూ నా ఆత్మ నీ పాదాలను చుట్టేయాలని తహ తహలాడుతుంది. నా ప్రతి శ్వాస నిన్నే పిలుస్తుంది . న్రిీకిదెం తెలుసు?  ఇంక ఆలస్యం ఎందుకు నా చెంతకు చేరడానికి అని జవాబిస్తుంది.

స్త్రీగా అతన్ని ప్రేమించినా, కోరుకున్నా పురుషుడు చొరవ చూపకపోతే స్త్రీ ప్రేమలో ముందడుగు వేయలేదు. ప్రేమలో బంధాన్ని ఏర్పరుచుకునే ప్రయత్నం ఇరు పక్షాల నుండి జరగాలి. పురుషుడు అడుగు ముందుకేయలేక పోతే దేవదాసు పార్వతిల కథ తయారవుతుంది. నిజ జీవితంలో ఓ బంధాన్ని ఏర్పరుచుకోవడానికి కొన్ని పరిధులు ఉండటం వాస్తవం. వాటిని దాటి రావడానికి పురుషుని సహాయం స్త్రీకి అవసరం. నా శరీరం కాదు ఆత్మ కూడా నిన్నే కోరుకుంటుంది. నా ప్రతి శ్వాస నిన్నే పిలుస్తుంది. నిన్ను అంతగా ప్రేమించే నన్ను చేరడంలో ఆలస్యం ఎందుకు అన్నది ఆమె ఇక్కడ ఇస్తున్న జవాబు.

హర్ నజర్ ఆప్ కి జజ్బాత్ కొ ఉక్సాతీ హై

మై అగర్ హాథ్ పకడ్ లూ తో ఖఫా మత్ హోనా

(మీ ప్రతి చూపు నాలోని భావోద్వేగాలను రెచ్చగొడుతుంది. నేను మీ చేయి పట్టుకుంటే మరి కోపగించకండి)

స్త్రీ చూపులతో పురుషునికి సంకేతాలనిస్తుంది. అతనిలోని కోరికలను రెచ్చగొడుతుంది. అతను ఆమెకు దగ్గరవ్వాలని కోరుకుంటాడు. ఆమెను శారీరికంగా చేరుకోవాలనే కోరిక అతనిలో కలగడానికి ఆమె అందించే సంకేతాలు కూడా కారణం. ఆమె పైన చూపిన చనువుతో ఆమెను చేరుకోవాలనే కోరిక తనలో ఉందని చెబుతూ అప్పటి దాకా అందని ఆమె చేతిని పట్టుకోవాలని ఉందనే తన కోరికను ఇక్కడ అతను బైటపెట్టుకుంటున్నాడు. నిజానికి ఎంతగా స్త్రీని తాకాలని వున్నా, పురుషుడు ఆ స్త్రీ తనను కాదని నమ్మకం కుదిరే వరకూ అమెని స్పృశించే ధైర్యం చేయడు. స్త్రీ సైతం ఇష్టమైన పురుషుడి స్పర్శకు మానసికంగా స్పందించేందుకు సిధ్ధంగా వున్నా, తొలి స్పర్శకు ఎలా స్పందిస్తుందో ఆమెకే తెలియదు. అతడి స్పర్శకు ఆమె వ్యతిరేకంగా స్పందించవచ్చు. అది పురుషుడు తనంటే అయిష్టంగా పొరబడితే వారి బంధం దెబ్బతింటుంది. అందుకే స్త్రీ అనుమతి లేకుండా ఆమెను తాకటానికి పురుషుడు ఎంతో సంకోచిస్తాడు. ఆమె వ్యతిరేకించదన్న విశ్వాసం వున్నా ఎంతో జంకుతాడు. ఇక్కడ నాయకుడు అదే సంశయిస్తూ, చేయి తాకితే కొపగించవుకదా? అని అడుగుతున్నాడు. అదీ, ఆమె నా ఆత్మ నీ పాదాలను తాకాలని తహ తహ లాడుటోంది, నా ప్రతి శ్వాస నిన్ని ఆహ్వానిస్టోందని నీకు తెలియదు అన్న తరువాత కూడా!!!

ప్రియురాలి చేతి స్పర్శకోసం ఇంతగా ప్రియుడు పాకులాడడం ఇప్పటి తరానికి చేతకానితనంగా అనిపించవచ్చు. కాని అందులోని అందం, ఆ ఎదురు చూపులోని నిండుతనం, ఒక అపురూపమైన వస్తువును చేరుకుంటున్నప్పుడు కలిగే ఆనందం, ఈ సంకోచంలోని సున్నితత్వం, ప్రేయసి ప్రియులకు స్పర్శ ద్వారా కలిగే అలౌకికానందం ద్వారా వారినడుమ ఏర్పడే విడదీయరాని బంధం గురించి, స్పర్శ ప్రాధాన్యం కోల్పోయిన యువతీ యువకులకు ఊహకు కూడా అందదు.    ప్రతి ఒక్క అడుగు వేసే మధ్య ప్రేమలో ఉండే ఆ ఎదురు చూపు ఆ బంధానికి ఓ గొప్ప పునాది. అది లేకనే ఇప్పుడు బంధాలన్నీ పేలవంగా తయారవుతున్నాయన్నది నిజం.

మేరి దునియా-ఎ-ముహబ్బత్ హై తుమ్హారే దమ్ సె

మేరి దునియా-ఎ-ముహబ్బత్ సె జుదా మత్ హోనా

(నా ప్రేమ ప్రపంచం నీతోనే నిర్మించబడింది. ఆ ప్రేమ ప్రపంచం నుండి నువ్వు వీడిపోవద్దు)

అతని కోరికకు బదులుగా ఆమె ఏం చెబుతుందో చూడండి. నాదైన ఈ ప్రేమ ప్రపంచం నువ్వు నిర్మించినదే. దీన్ని వదిలి నువ్వు వెళ్లవద్దు. ఒక బంధంలోకి వెళుతున్నప్పుడు పరస్పర స్పర్శను అనుభవించాలనే కోరిక కలిగినప్పుడు స్త్రీ చాలా జాగ్రత్త పడుతుంది. సమాజం ఆమె వ్యక్తిత్వాన్ని, శీలాన్ని ఆమె శారీరిక సంబంధాలతో ఎంచుతుంది. ఆ శరీరం ఆమెకు ఎంతో పవిత్రమైనది. ఇష్టపడి ఒకరిని కోరి అతనికి తనను సమర్పించుకుంటుందంటే అతను తన ప్రపంచం అని ఆమె నమ్ముతుంది. పురుషుడులో ప్రేమ భావనకి స్త్రీ ప్రేరణ. కాని స్త్రీకి పురుషుడే ఆఖరి మజిలి. అందుకే అతనికి తనను సమర్పించుకునేటప్పుడు ఎంతో ఆలోచిస్తుంది. నువ్వే నా ప్రేమైక ప్రపంచం, దీన్ని వీడి నువ్వు వెళ్లకు అని అందుకే ఆమె అతన్ని అడుగుతుంది. అతను తన జీవితంలో ఆఖరి మజిలి అని స్పష్టంగా చెబుతుంది. అది అతను అంగీకరిస్తేనే ఆమె అతనికి చేయి అందిస్తుంది.

దెఖియె ఆప్ నె ఫిర్ ప్యార్ సే దెఖా ముఝ్కో

ఆప్కే దిల్ నే కౖ బార్ పుకారా ముఝ్కో

(అదిగో మళ్ళీ ప్రేమగా చూసారు నన్ను.. మరేం చేయను మీ మనసు మళ్ళీ నన్ను పిలిచింది మరి)

ప్రేమలో పడిన ఓ జంట ఆ ప్రేమకు ఇచ్చే విలువ ఆ సందర్భంలో వారి మనసుల్లో కలిగే ఆలోచనలతో స్పష్టమవుతుంది. ఆమె తనవైపు చూస్తుంది, మళ్ళీ మళ్ళీ చూస్తుంది. మరి ఆమె మనసులో తన పట్ల ఉన్న భావన ఏంటీ అనే స్పష్టత కోరుకుంటున్నాడు అతను. చొరవ తీసుకుని ఆమె మనసు తెలుసుకుంటున్నాడు. ఆమె అతని మనసు తాను చదవగలుగుతున్నానని చెబుతుంది. అతనికి తనపై ఉన్నట్లే తనకూ అతనిపై ప్రేమ ఉందని ఒప్పుకుంటుంది. ఎంత తీవ్రంగా అతని సాంగత్యాన్ని కోరుకుంటుందో, తనను తాను సమర్పించుకోవాలనుకుంటుందో ఆమె చెబుతుంది. ఆ ప్రేమ ఉద్వేగంలో కొట్టుకుపోతూ అతను ఆమె స్పర్శను కోరుకుంటునననని బైటపెడితే, నా ప్రేమ ప్రపంచం నువ్వే, దాన్ని వదిలి వెళ్లకు అని అతను తన జీవితంలో శాశ్వతంగా ఉండేట్లయితే తాను మరో అడుగు ముందుకు వేయగలను అని ఆమె సూచిస్తుంది.

ఈ జంట ప్రదర్శించే ప్రేమలో ఎంత మర్యాద, ఎంత ఆలోచన, ఎంత సంస్కారం కనిపిస్తుందో అర్థం చేసుకుంటే ఈ పాట గొప్పదనం తెలుస్తుంది. సాహిర్ కవితకు బాణీ కట్టిన మరో సందర్భం ఇది. అంటే సంగీత దర్శకుని బాణీకి అనుగుణంగా రాసిన కవిత కాదు ఇది. అందుకే ఇది ఇతర ప్రేమ గీతాలకన్నా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా మొదటి రెండు పంక్తులు ప్యాసా సినిమాలో జానే క్యా తూ నే కహీ పాటకు సాకీగా వస్తాయి.

మనసుతో మెదడుతో ఆలోచిస్తే ఒక అద్భుతమైన ప్రేమ భావన ఉన్న గీతం ఇది. ప్రేమలో తొందరపాటు కాకుండా ఆలోచన ఉంటే ఆ బంధం ఎంత అందంగా ఉంటుందో స్పష్టపరిచే గీతంగా దీన్ని చూడవచ్చు.

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version