‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్’-8 – క్యా మిలియే ఐసె లోగో సే

0
2

[‘అందమైన గీతాల రచనకు మాహిర్ – సాహిర్!!!’ అనే శీర్షికలో ప్రముఖ గీత రచయిత సాహిర్ గారి పాటలని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

[dropcap]ఈ[/dropcap] వారం విశ్లేషిస్తున్న పాట చిత్రం ‘ఇజ్జత్’ (Izzat 1968) చిత్రం కోసం మహమ్మద్ రఫీ పాడిన పాట. లక్ష్మీకాంత్-ప్యారేలాల్.

~

ఈ ప్రపంచం ప్రశ్నించే వ్యక్తులను ఇష్టపడదు. ముఖ్యంగా ఎవరినీ లెక్కచేయకుండా, పట్టించుకోకుండా ఓ పక్కకు నెట్టేసి తమ ప్రపంచాన్ని సృష్టించుకుని ఒంటరిగా జీవించే వారంటే కొంత కసి కూడా సమాజానికి. కాని ప్రపంచంలో తరచి చూస్తే మంచి హృదయం ఉన్న వ్యక్తి సంతృప్తితో జీవించగలిగే సాంగత్యం ఎక్కడా కనిపించదు. అందుకే కొన్ని అనుభవాలు అయిన తరువాత మోసం, కపటం, అహంకారం నుండి తప్పించుకోవడానికి తమ చుట్టూ ఓ కంచె ఏర్పాటు చేస్తుకుంటారు చాలామంది. వారు తమ ప్రపంచంలోకి ఎవరినీ రానివ్వరు, ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. సాహిర్ ఇంచుమించు అదే విధంగా జీవించాడు. అతన్ని అహంకారి అని, గర్విష్టి అని ఎందరో అంటారు, కాని సాహిర్ వ్యక్తిత్వంలో ప్రపంచం పట్ల ఓ ఉదాసీనత కనిపిస్తుంది. మీలో ఏం ఉన్నదని నేను మిమ్మల్ని కలవాలి అనే ప్రశ్న అతని వ్యక్తిత్వంలో కలిసిపోయింది. ఇది సహించడం కొంచెం కష్టం. ఈ ధోరణిని అంగీకరించడం కూడా అంతే కష్టం. కాని జీవితంలో అనుభవాలు మనల్ని రాటుతేలుస్తూ ఉంటే అదే నిర్లక్ష్య భావం మనలోనూ చేరిపోతుంది. అప్పుడు సాహిర్ ఇంకా బాగా అర్థం అవుతాడు. పై పై మెరుగుల్ని వేలెత్తి చూపుతూ మీ ప్రపంచం ఇదే అయితే నాకీ ప్రపంచం వద్దు అని మొండిగా వాదించిన అతనిలో అప్పుడు ఓ మేధావి కనిపిస్తాడు. ప్రపంచం పట్ల సాహిర్ నిర్లక్ష్య ధోరణికి ఉదాహరణగా ఎన్నో పాటలు కవితలు కనిపిస్తాయి అందులో ఒకటి ఈ గీతం.

క్యా మిలియే ఐసే లోగో సే జిన్కీ ఫితరత్ ఛుపీ రహే

నకలీ చెహరా సామ్నే ఆయే అసలీ సూరత్ చుపీ రహే (2)

(అసలు వ్యక్తిత్వాన్ని ముసుగులో దాచి, నకిలీ వ్యక్తిత్వాన్ని ముఖంపై ప్రదర్శించి, నకిలీ మొహాన్ని చూపుతూ అసలు మొహాన్ని దాచుకున్నవాళ్లతో స్నేహం  ఎందుకు?  )

ఈ సమాజంలో మనుషులు తమ అసలు గుణాలను పైకి చూపరు. వారు ఇతరుల ముందు ప్రదర్శించేదంతా నటన. నిజాయితీగా బ్రతకాలనుకువేవారికి ఆ నటన చూసి విసుగనిపిస్తుంది. జీవితంలో కొన్ని అనుభవాల తరువాత, ఇక ఎందుకు భరించాలీ నటనను అని బాగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ కవి అసలు మొహాల్ని కప్పి పుచ్చుకుని నిరంతరం నకిలీ మొహాలను తగిలించుకుని తిరిగేవారిని నేనెందుకు కలవాలి అని ప్రశ్నిస్తున్నాడు.

ఖుద్ సే భీ జొ ఖుద్ కో చుపాయే క్యా ఉన్సె పెహచాన్ కరే

క్యా ఉన్కె దామన్ సే లిప్టే, క్యా ఉన్కా అర్మాన్ కరే

జిన్కీ ఆధీ నీయత్ ఉభరే, ఆధీ నీయత్ ఛుపీ రహే

నకిలీ చెహరా సామ్నే ఆయే అసలీ సూరత్ చుపీ రహే

(తమ నుండి తామే దాక్కునే వాళ్ళతో పరిచయం పెంచుకోవడం ఎందుకు? వారిని చేరి కౌగలించుకోవడం ఎందుకు? వారిని కోరుకోవడం ఎందుకు? సగం నైజం మాత్రమే లోకానికి చూపించి మరో సగం దాచుకునే వారు, తమ నకిలీ మొహాల్ని తగిలించుకుని అసలైన మొహాలను కప్పిపిచ్చుకునే వారిని కలవడం ఎందుకని?)

మన చుట్టూ, ఉన్న మనుషులలో చాలా మంది తమను తాము మోసం చేసుకుంటూ బ్రతుకుతున్నవారే, కాని అది ఒప్పుకోరు. ఒకలా జీవిస్తూ మరోలా ప్రదర్శనకు దిగుతూ ఉంటారు. వారి అసలు రంగుల్ని చూసి వారి నాటకీయతను భరించడం కష్టమవుతుంది. తమను తాము నిత్యం మోసం చేసుకునే వారి మధ్య ఇక కవికి బ్రతకాలనే కోరిక లేదు. వారివన్నీ సగం సగం రూపాలే. ఏదో మనసులో దాచుకుని మరేదో బైటకు చూపిస్తూ జీవించేస్తారు వారంతా. వారి పూర్తి నైజం ఎప్పుడూ బైటపడదు. వారు చూపించేది నిజమని నమ్మి మోసపోవడంలో అంతులేని బాధ ఉంటుంది. మనసున్న వారికి అది చాలా కష్టమైన స్థితి. అసలు అలాంటి వారిని కలవడం ఎందుకు? మనల్ని మనం కష్టపెట్టుకోవడం ఎందుకు?

దిల్ దారీ కా ఢోంగ్ రచాకర్ జాల్ బిచాయె బాతోం  కా

జీతేజీ కా రిష్తా కెహ్కర్ సుఖ్ డూండే కుచ్ రాతోం  కా

రూహ్ కీ హస్రత్ లబ్ పర్ ఆయె, జిస్మ్ కి హస్రత్ చుపీ రహే

నకిలీ చెహరా సామ్నె ఆయే అసలీ సూరత్ చుపీ రహే

(మనసు, దయ అంటూ మోసం చేస్తూ మాటల వల విసురుతారు. జీవితాంతం ఉండే బంధం ఇదంటూ కొన్ని రాత్రుల సుఖాన్ని మాత్రమే వెతుక్కుంటారు. ఆత్మ  కోరికను   పెదవులతో పలుకుతూ ,   శరీరాలకు పరిమితమైన తమ కోరికలు పైకి కనిపించకుండా కప్పేస్తారు. నకిలీ మొహాన్ని చూపిస్తూ అసలు మొహాల్ని దాచేస్తారు.)

నేటి తరం ప్రేమలను ప్రశ్నిస్తూ, తీపి కబుర్లు చెబుతూ ఇతరులను ప్రేమ మత్తులోకి లాగేసే వ్యక్తుల నిజ రూపాలను వర్ణిస్తున్నాడు కవి. ఇది జీవితాంతం ఉండే బంధం అని పైకి అంటూ కేవలం కొన్ని రాత్రుల సుఖాన్ని వెతుక్కుని వెళ్లిపోయే ప్రేమికులే వీరంతా. పైకి గొప్ప ఆత్మీయతను నటిస్తూ, ఆత్మల కలయిక మనది అని చెప్పుకుంటారు. వాళ్లలో ఉన్నది శరీరాలపై మోజు మాత్రమే. కాని ఈ నిజం బైటికి రానివ్వరు. అందమైన కబుర్లలో తమలోని జంతువును కప్పేయగల నేర్పరులు వారంతా. అసలు ఇవి ప్రేమలేనా? శరీర దాహం తీర్చుకోవడానికి ఒకరినొకరు మోసం చేసుకోవడానికి అందమైన భాషను ఉపయోగించుకునే వీళ్ళంతా నిజంగా ప్రేమకు అర్థం తెలిసిన వాళ్ళేనా? వాళ్లను కవలడం ఎందుకు? ఏం దొరికుతుంది వారి దగ్గర? మోసం, బాధ, తప్ప?

జిన్కె జుల్మ్ సే దుఖీ హై జనతా, హర్ బస్తీ హర్ గావ్ మె

దయా ధర్మ్ కి బాత్ కరే వొ బైఠ్ కె సజీ సభావో మే

దాన్ కా చర్చా ఘర్ ఘర్ పహుంచె లూట్ కి దౌలత్ చుపీ రహే

నకిలే చెహరా సామ్నే ఆయే అసలీ సూరత్ చుపీ రహే

(ఎవరి అన్యాయాల వలన బస్తీలలో, గ్రామాలలో జనం దుఃఖంతో ఉన్నారో, వారే పెద్ద సభలలో దయా ధర్మం అంటూ మాటలు వినిపిస్తారు. దానం గురించి ప్రతి ఇంట చర్చ జరుగుతూ ఉంటుంది, దోచుకున్న ధనం మాత్రం ఎక్కడో దాచబడుతుంది. నకిలీ మొహాలు ప్రదర్శిస్తూ అసలు మొహాలు దాచేస్తారు వీరంతా)

సాహిర్ రాజకీయ నాయకుల గురించి రాసిన వాక్యాలు ఇవి. ఒక పక్క ప్రజలకు అన్యాయం చేస్తూనే వారి ముందే నీతి సూత్రాలను ఉదహరించే నాయకులు మన చూట్టూ ఉన్నారు. దానాల గురించి మాట్లాడుతూ మరో పక్క గుట్టుగా దోచుకున్న ధనాన్ని దాచేస్తున్నారు. ఎంతటి దుర్మార్గం ఇది. ఈ మోసం గురించి ఎవరూ ప్రశ్నించరు. వారి రెండు ముఖాల వైఖరి మనకు అర్థం అయినా వారిని ప్రశ్నించే ధైర్యం ఉన్నవారు మన చుట్టూ ఎంతమందని? ఇలాంటి నాయకులను, ఇలాంటి మోసగాళ్ళను అసలు ఎందుకు కలవాలి? వారిని ఎందుకు భరించాలి అంటాడు సాహిర్.

ఈ ప్రశ్నించడంలో కవిలో కోపంతో పాటు ఓ బాధ్యత కూడా కనిపిస్తుంది. దుర్మార్గాన్ని సహించడం పెద్ద తప్పు. మన చుట్టూ దుర్మార్గం పెరిగి పోవడానికి కారణం దాన్నిప్రశ్నించే వ్యక్తుల కొరత. ప్రతి ఒక్కరిలోనూ మనకెందుకులే అన్న తత్వమే నిండిపోయింది కదా. సాహిర్ ఒంటరిగా జీవించడానికి సిద్దపడ్డాడు కాని రాజీ పడలేదు. ఈ హిపోక్రసీని నిత్యం ప్రశ్నించేవాడు. అందుకే ఆయన గీతాలలో సూటిగా ఈ మానవ నైజం మీద దాడి కనిపిస్తుంది.

దెఖే ఇన్ నకిలీ చెహరోం  కి కబ్ తక్ జై జై కార్ చలె

ఉజలే కపడోం  కి తహ మె కబ్ తక్ కాలా సంసార్ చలే

కబ్ తక్ లోగోం  కి నజరోం  సే ఛుపీ హకీకత్ ఛుపీ రహే

నకిలీ చెహరా సామ్నె ఆయే అసలీ  సూరత్ ఛుపీ రహే

(ఈ నకిలీ మొహాలకు ఎప్పటి దాకా జయ జయకారాలు లభిస్తాయో చూద్దాం. మెరుస్తున్న ఈ బట్టల వెనుక ఎప్పటి దాకా చీకటి సంసారాలు నడుస్తాయో అదీ చూద్దాం. ఎప్పటి దాకా జనం కళ్ళకు సత్యం కనిపించకుండా ఉండగలదో చూద్దాం. నకిలీ మొహాలు కనిపిస్తూ అసలు మొహాలు ఎంత వరకు దాక్కుంటాయో చూద్దాం మరి)

సాహిర్‌లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎంతగా ప్రపంచం పట్ల కోపం ఉంటుందో అంతే తీవ్రంగా ప్రజలపై నమ్మకం, భవిష్యత్తుపై ఆశ కూడా ఉంటాయి. అందుకే అతని ముక్కుసూటితనంలో నిరాశావాదం కనిపించదు. అవును ఈ మనుష్యులంతా మోసగాళ్లే. కానీ ఎన్నాళ్లు మోసం చేస్తారు? ప్రజల కళ్ళ నుండి ఎన్నాళ్ళు నిజాలని దాస్తారు? ప్రజలు ఆలోచిస్తారు. ఏదో ఒక రోజు మేలుకుంటారు. అది తప్పదు. అప్పటి దాకా సాహిర్ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రజలలో వివేకం మేలుకొన్న తరువాత వారికి ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేవి నిజాయితీతో వేసిన ఈ ప్రశ్నలే. సాహిర్‌కి భవిష్యత్తులో ప్రజలు దుర్మార్గంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తారని ఎంతో నమ్మకం. అందుకే అంత కోపాన్ని చూట్టూ ఉన్న వారిపై చూపిస్తూ కూడా మీరు తప్పించుకోలేరు, ఏదో ఒక రోజు నిజం తెలిసి ప్రజలు మీ అంతు చూస్తారు అంటాడు.

దొంగ ప్రేమలు, దొంగ నాయకులు, అబద్థాల పునాది పై నిర్మించబడిన బంధాలు అన్నీ ఏదో ఒకనాడు తేలిపోయేవే అన్న బలమైన నమ్మకం ఉన్న కవి సాహిర్. అందుకే మోసాలతో నిండిన బంధాల కన్నా, అటువంటి వ్యక్తుల సాంగత్యం కన్నా ఒంటరితనాన్నే ఇష్టపడ్డాడు. తప్పు అనిపించిన వాటిని ప్రశ్నించడానికి భయపడలేదు. వీరు లేకపోతే నేను ఒంటరిని అని అభద్రతా భావంతో ముడుచుకుపోలేదు. ప్రపంచంలో మోసం మాత్రమే ఉంటే అది నాకు అవసరం లేదు. నేను నేనుగా ఉంటాను.. ఈ మోసగాళ్లను ఎందుకు కలవాలి? దేనికి కలవాలి? ఎందుకోసం నా జీవితంలోకి ఆహ్వానించాలి? దేని కోసం పరిచయాలను పెంచుకోవాలి? ఈ మోసగాళ్లు నాకిచ్చేదేమిటి అంటాడు సాహిర్.

క్యా మిలియే ఐసే లోగోం  సే జిన్కీ ఫితరత్ చుపీ అహే

నకిలీ చెహరా సామ్నె ఆయే అసలే సూరత్ చుపీ రహే

(ఏం ఉందని కలవాలి ఇలాంటి మనుష్యులను, తమ అసలు నైజాన్ని కప్పిపుచ్చి జీవించే వాళ్ళను? నకిలీ మొహాన్నిచూపుతూ అసలు మొహాన్ని దాచుకున్నవాళ్లను?) ..

నిజమే కదా.. క్యా మిలియే ఐసే లగో సే..

Images Source: Internet

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here