దానం విలువ చాటిన పాట

1
1

[సంచిక పాఠకుల కోసం ‘దానం ధర్మమే వేదాల నీతిసారం’ అనే సినీ గీత విశ్లేషణా వ్యాసాన్ని అందిస్తున్నారు గోనుగుంట మురళీకృష్ణ.]

ఈ రోజుల్లో ఇద్దరు హీరోలు కలసి నటిస్తే మల్టీ స్టారర్ చిత్రం అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మల్టీ అంటే చాలా అని అర్థం. చాలామంది స్టార్స్ కలసి నటిస్తేనే అది మల్టీ స్టారర్ చిత్రం అవుతుంది. పాత సినిమాల్లో నూటికి ఎనభై చిత్రాలు మల్టీ స్టారర్ చిత్రాలే! అన్నిటికన్నా ఎక్కువమంది స్టార్స్ నటించిన చిత్రం ‘సతీ సుమతి’ (1967). ఇందులో సుమతిగా, అనసూయగా అంజలీదేవి ద్విపాత్రాభినయం చేయగా, బ్రహ్మ సరస్వతులుగా జగ్గయ్య, జమున; లక్ష్మీనారాయణులుగా అక్కినేని, కృష్ణకుమారి; శివపార్వతులుగా జెమినీ గణేషన్, సావిత్రి; సీతారాములుగా హరనాథ్, వాసంతి; మహారాజుగా యస్.వి.రంగారావు, సుమతి భర్త కౌశికుడుగా కాంతారావు, రాజనర్తకిగా యల్. విజయలక్ష్మి, వేశ్యగా కాంచన, ఇంకా హాస్యపాత్రల్లో రేలంగి, గిరిజ, సూర్యకాంతం నటించారు.

ఈ చిత్రంలో పాటలు అన్నీ మంచి సాహితీ విలువలు ఉన్నవే! వాటిలో ఒకటి సందేశాత్మక గీతం ఉన్నది. దీనిని సముద్రాల రాఘవాచార్య రచించగా, ఆదినారాయణరావు సంగీత నిర్వహణలో పి.సుశీల గానం చేశారు. అంజలీదేవి నటించింది.

కౌశికుడు, సుమతి భార్యాభర్తలు. కౌశికుడు వేశ్యా వ్యామోహంతో ఆస్తి అంతా పోగొట్టుకుంటాడు. ఇల్లు వాకిలి కూడా అప్పులవాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. కట్టుబట్టలతో వీధిన పడతారు. వ్యసన వ్యామోహం వల్ల కౌశికుడి ఆరోగ్యం కూడా చెడిపోయి, వ్యాధిగ్రస్థుడయి సంపాదించలేని స్థితిలో ఉంటే సుమతి ఉంఛవృత్తి (భిక్షాటన) చేసి భర్తను పోషిస్తూ ఉంటుంది. ఆ సందర్భంలోనిది ఈ పాట. సుమతి వీధులలో తిరుగుతూ ఇలా పాడుతూ ఉంటుంది.

“దానం ధర్మమే వేదాల నీతిసారం
నీ దానం, నీ ధర్మం నిరుపేదల జీవాధారం”

పురాణాలు అయినా, ఇతిహాసాలు అయినా, వేదాలు అయినా చెప్పేది ఒకటే! స్వసుఖాల మీద వ్యామోహం వదలుకుని దానధర్మాలు చేయమని, మోక్షం పొందమని! పూర్వం మహారాజులందరూ దానధర్మాలు చేసినవారే! అడిగిన వారికి లేదనకుండా దానాలు చేసేవారు. ప్రజాక్షేమం కోసమే ధనం వినియోగించేవారు తప్ప, స్వార్థం కోసం చిల్లిగవ్వ అయినా ఉంచుకునేవారు కాదు. చివరలో వానప్రస్థాశ్రమం స్వీకరించేటప్పుడు కూడా సంపద అంతా పేదలకు దానం చేసేసేవారు. వారి తర్వాత వచ్చిన వారసులు స్వశక్తితో సంపాదించుకోవాలి. అంతేగానీ ఈ రోజుల్లో లాగా కొడుకుల కోసం, మనవల కోసం కూడబెట్టి ఉంచేవారు కాదు.

రామరాజ్యంలో పండగలకు, పబ్బాలకు దానధర్మాలు చేద్దామంటే ఒక్క యాచకుడు కూడా దొరికేవాడు కాదట. ప్రజలందరూ ఎవరి వృత్తి వారు చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవించేవారు. అన్ని రకాల వృత్తుల లాగానే ఉంఛవృత్తి కూడా ఒకటి. యాచకులను తమకు పుణ్యం సంపాదించుకోవటానికి అవకాశం కల్పించిన వారిగా భావించి ఆదరించి, గౌరవించేవారు. ఇక్కడ సుమతి కాలంనాటికి యుగం మారిపోయింది కనుక మనుషులలో దయాగుణం కూడా క్షీణించింది. అందుకే ఆ విషయం గుర్తు చేస్తున్నది. దానాలు చేయండి. మీ దానగుణం వలనే నిరుపేదలు, కష్టపడే శక్తి లేనివారు జీవించగలుగుతారు అని చెబుతున్నది.

“జపమాచరించే జడదారి కన్నా దానాలు చేసే సంసారి మిన్న
నిరతాన్నదానమే మీ పెన్నిధానం; నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం”

మహాభారతంలో ‘ధర్మవ్యాధోపాఖ్యానం’ అనే కథ ఉంది. అందులో కౌశికుడు అనే ఋషి చెట్టు కింద కూర్చుని జపం చేసుకుంటుంటే పైనుంచీ ఒక కొంగ అతడిమీద రెట్ట వేస్తుంది. ధ్యానభంగం అయి తల పైకెత్తి కోపంగా చూస్తాడు. అతడి కంటి మంటలకు కొంగ భస్మమైపోతుంది. ఇక మనసు నిలవక భిక్షాటన కోసం ఊళ్లోకి వెళ్లి ఓ ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతాడు. ఇంటి ఇల్లాలు చాల ఆలస్యంగా భిక్ష తీసుకువస్తుంది “అలసివచ్చిన నా భర్తకు సేవలు చేస్తూ ఉండటం వలన ఆలస్యం అయింది. క్షమించండి” అంటుంది. “నా అంతటివాడిని ఇంతసేపు వేచి ఉండేటట్లు చేస్తావా!” అంటూ కోపంగా ఆమెవంక చూస్తాడు.

“మీ కోపానికి ఆహుతి అవటానికి నేనేమీ కొంగను కాను” అంటుంది. “ఈ విషయం నీకెలా తెలుసు?” అని ఆశ్చర్యపోతాడు. “నేను నా పాతివ్రత్య శక్తి వలన తెలుసుకున్నాను. నువ్వు వేదం నేర్చుకున్నావు గానీ, ధర్మసూక్షం తెలియదు. మిధిలానగరంలో ధర్మవ్యాధుడు అనే మహాత్ముడు ఉన్నాడు. అతడి దగ్గరకు వెళ్లిరా! సకలధర్మాలు చెబుతాడు” అంటుంది. కౌశికుడు అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి మిధిలకు వెళ్లి అతడిని కలుసుకుంటాడు. తీరా వెళ్లి చూస్తే ధర్మవ్యాధుడు మాంసం అమ్మి జీవించే వృత్తిలో ఉంటాడు.

కౌశికుడిని చూడగానే “మిమ్మల్ని పతివ్రత పంపించింది కదా! మీ రాకకు కారణం నాకు తెలుసు, రండి” అంటూ ఆదరంగా ఇంటికి తీసుకువెళ్ళి అతిథి సత్కారం చేస్తాడు. కౌశికుడి మనసులో భావం గ్రహించి “నేను జీవహింస చేయటం లేదు, మాంసం కొని అమ్ముతూ ఉంటాను. కానీ నేను మాంసం తినను” అని చెబుతాడు. అంతేకాదు, మనసులో క్షమ, దయ ఉండాలి, క్రోధాన్ని జయించాలి, దానాలు చేయాలి, త్యాగగుణం ఉండాలి, తల్లిదండ్రులను సేవించాలి అంటూ ఇంకా అనేక ధర్మాలు ఉపదేశిస్తాడు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత తను ఎంత క్రోధానికి లోనయ్యాడో, తల్లిదండ్రులను విడిచివచ్చి వారిని ఎంత బాధ పెట్టాడో తెలుసుకుని తిరిగి వారి దగ్గరకు వెళ్ళిపోతాడు కౌశికుడు.

కాబట్టి జపం చేసుకునే జడదారి కన్నా దానాలు చేస్తూ ధర్మంగా జీవించే సంసారే నయం అని చెబుతుంది ధర్మవ్యాధోపాఖ్యానం. సుమతి కూడా తన పాటలో ఇదే విషయాన్ని చెప్పింది.

“నిరతాన్నదానమే నీ పెన్నిధానం” అంటే నిరంతరం అన్నదానం చేయటమే నీకు పెద్దనిధి లాంటిది అని అంటున్నది. బలరాముడి కాలంలో ఒక ఘంట ఉండేది. వెయ్యి మంది అన్నార్తులు భోజనం చేయగానే ఒక్కసారి మ్రోగుతుంది. అలా ఆ ఘంట నిరంతరం మ్రోగుతూనే ఉంటుంది. అంటే ప్రతిరోజూ అంతమందికి అన్నదానం చేస్తూ ఉండేవాడు. దానికి “నిరతాన్నదాన ఘంటిక” అని పేరు. తర్వాత చరణంలో సుమతి ఇలా చెబుతున్నది.

“మహారాజులైనా మహి వీడు వేళ కొనిపోయినారా తమవెంట సిరుల
నెరదాత పేరే నిలిచేది ధరణి; నీదానం, నీ ధర్మం నిరుపేదల జీవాధారం”

భాగవతంలో వామనావతార ఘట్టంలో బలిచక్రవర్తిని వామనుడు మూడు అడుగుల నేలను దానం చేయమని అడుగుతాడు. దానం చేయబోతుంటే రాక్షసగురువు శుక్రాచార్యుడు వారించి, “ఇతడు బ్రాహ్మణుడు కాదు, పరమాత్ముడైన విష్ణువు. దేవతల కార్యం సాధించటం కోసం ఇలా వచ్చాడు. నిన్ను మోసగించి నీ సంపదనూ, రాజ్యాన్ని ఇంద్రుడికి ఇస్తాడు. ఈ దానాన్ని నువ్వు అంగీకరించవద్దు” అని చెబుతాడు. అందుకు బలి చక్రవర్తి ఇలా అంటాడు.

“కారే రాజులు? రాజ్యముల్ గలుగవే? గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూట గట్టుకుని పోవం జాలిరే? భూమి పై
బేరైనం గలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశః కాములై
యీరే కోర్కులు? వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా!”

అని చెబుతాడు. అంటే, “పూర్వం ఎందరో రాజులు ఉన్నారు. వారికి రాజ్యాలు ఉన్నాయి. వారు ఎంతో అహంకారంతో విర్రవీగారు. కానీ పోయేటప్పుడు వారేమైనా ఈ సంపదలను మూట గట్టుకుని పోయారా? ప్రపంచంలో వారి పేరు ఇప్పుడు ఎవరైనా తలచుకుంటున్నారా? శిబి చక్రవర్తి వంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగిన వారి కోరికలు తీర్చలేదా! అలాంటి వారిని ఇప్పటికీ ఎవరైనా మర్చిపోయారా? చెప్పండి ఆచార్యా!” అని అర్థం. విష్ణుమూర్తి అంతటి వాడి చెయ్యి కింద ఉండి నాచేయి పైన అవటం కంటేమించిన అదృష్టం ఏమున్నది? అనుకుంటూ మూడడుగుల నేల దానం ఇచ్చేస్తాడు బలి.

ఈ పాటలో సుమతి కూడా అదే విషయం చెబుతున్నది. మహారాజులైనా ఈ భూమిని వదలి వెళ్ళేటప్పుడు తమతో పాటు సిరిసంపదలను వెంటబెట్టుకుని పోయారా? అధికంగా దానం చేసే దాత పేరే ఈ భూమిపై శాశ్వితంగా నిలిచిపోతుంది అని చెబుతున్నది.

అల్పాక్షరాలతో అనల్పమైన భావాన్ని తెలియజేసే ఈ గీతాన్ని రచించినది సముద్రాల రాఘవాచార్య. చిత్రపరిశ్రమలో ఈయన్ని సముద్రాల సీనియర్ అని అంటూ ఉంటారు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్య. ఈయన్ని సముద్రాల జూనియర్ అని అంటూ ఉంటారు. తండ్రీ తనయులు ఇద్దరూ పండితులే! ముఖ్యంగా సముద్రాల సీనియర్ పురాణేతిహాసాలను ఔపోసన పట్టారు. పాండవ వనవాసం, నర్తనశాల, భూకైలాస్, సీతారామకళ్యాణం, వీరాభిమన్యు, శ్రీకృష్ణావతారం వంటి ఎన్నో చిత్రాలకు కథను సమకూర్చారు. గ్రంధాలలో పది పేజీల కథను చదవటం వేరు, సినిమాకి అవసరమైన వీర, శృంగార, హాస్య, కరుణ రసాలతో సన్నివేశాలు కల్పించి, సంభాషణలు కూర్చి మూడుగంటల కథను తయారు చేయటం వేరు. అందుకే సినీ పండితులు దీనిని ‘సినీ కథామథనం’ అని అంటారు. కథలతో పాటు ‘భూకైలాస్‌’లో ‘దేవ దేవ ధవళాచల మందిర..’, ‘నీల కంధరా దేవా..’ వంటి కొన్నివందల పాటలను రచించారు సముద్రాల సీనియర్.

Images Source: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here