Site icon Sanchika

ఆనందాశ్రమం

[dropcap]ఉ[/dropcap]దయం ఏడుగంటలయ్యింది. పనమ్మాయి కాఫీ ఇస్తూ రాత్రి ఫస్ట్ ఫ్లోర్ సుబ్బారాయుడు గారిని హాస్పిటల్ లో పెట్టారని చెప్పింది. నేను అడక్కుండానే “నిన్న సాయంత్రం మిర్చి బజ్జీలూ, పుణుకులూ తినడంవల్ల తేడా చేసిందంటండి. సాయంత్రం ఇంటికొచ్చేత్తారంట” అంటూ వివరణ ఇచ్చింది. సుబ్బారాయుడు గారి కొడుక్కి పూణే ఉద్యోగం. నెల క్రితమే ఈ విజయవాడ, కానూరులో ఫ్లాట్ కొని వాళ్ళని తీసుకొచ్చి పెట్టాడట. వాళ్ళది గుంటూరు దగ్గర ఒక పల్లెటూరట. కొద్దిగా పొలం ఉందట. హాస్పిటల్‌కీ అన్నిటికీ దగ్గరగా ఉంటుందని కొడుకు ఇక్కడ ఇల్లు కొన్నాడట. ఆ దంపతులిద్దరిదీ డెబ్భై ఏళ్ళు దాటిన వయసట.మంచివాళ్ళట. ఇలా చాలా వివరాలు చెప్పింది నా ఇంట్లో పని చేసే అమ్మాయి.

సుబ్బారాయుడు గారి భార్య హనుమాయమ్మ గారిది అందరినీ కలుపుకుపోయే తత్త్వం. నేనెప్పుడు కనబడినా “ఏం బాబూ బావున్నారా?” అని నోరారా నవ్వుతూ పలకరిస్తుంది. పరిచయం ప్రత్యేకించి చేసుకోలేదు.నేనూ జవాబుగా నవ్వుతాను. కూరలు తెచ్చుకుంటూ, సాయంత్రాలు భర్తతో వాకింగ్ వెళుతూ, వస్తూ చురుగ్గా, ఉత్సాహంగా ఉంటుందావిడ.

ఆ సాయంత్రం నేను వాళ్ళింటికి వెళ్లేసరికి చాలామంది ఉన్నారక్కడ. కుర్చీల్లో నలుగురూ, దివాన్ కాట్ మీద నలుగురూ కూర్చుని ఉన్నారు. సుబ్బారాయుడు గారు ఒక పడక్కుచ్చీలో కూర్చుని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. నాక్కూడా దివాన్ మీద కాస్త చోటిచ్చారు వాళ్ళు.

“ఎలా ఉందిప్పుడు? ”అడిగాను. పర్వాలేదన్నట్టు తలూపాడాయన.

“కడుపులో కొంచెం గడబిడయ్యిందండీ! ఎండాకాలం ఒకటి కదండీ అందుకే! డాక్టర్ మూడు రోజుల వరకూ మందులు వాడుతూ జాగ్రత్తగా ఉండమన్నాడండి! రాత్రి పదింటి వరకూ బానే ఉన్నారండీ! అర్ధరాత్రి ఎవర్ని లేపగలను చెప్పండి. మా అబ్బాయికి ఫోన్ చేసి చెబుదామంటే వాడు కంగారు పడతాడు. మాకూ ఈ చోటు కొత్త. అసలు ఆస్పటలు ఎక్కడుందో తెలీదు. పగలైతే ఆటోలు ఆ మూలమీద ఉంటాయి. అంత రాత్రి వేళ నేను బైటికి వద్దామంటే ఒక భయం. ఆఖరికి వీళ్ళ తలుపు కొట్టగానే పాపం ఈ అబ్బాయి ఎవరికో ఫోన్ చేసి టాక్సీ తెప్పించాడు, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు” అందామె ఒక ఇరవయ్యేళ్ళ కుర్రాడిని చూపిస్తూ.

“పెద్దవాళ్ళయ్యాకా పిల్లల దగ్గర లేకపోతే ఇవే బాధలు.ఈ రోజుల్లో పెద్దవాళ్ళను దగ్గర పెట్టుకుని చూసే పిల్లలెక్కడున్నారు లెండి! ఎవరి బ్రతుకులు వారివి” అందొక పెద్దామె.

“ముసలివాళ్లెవరికీ అక్కర్లేదు. దంపతులంతా వాళ్ళ పిల్లలతో ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు” అన్నారెవరో. సుబ్బారాయుడు గారు బిక్కమొహంతో అందరి వైపూ చూస్తున్నాడు.

“ఇవాళ చిన్నదయ్యింది. రేపు పెద్దదయినా అంతే కదా ఇలాగే కంగారు పడాలి ఆంటీ గారూ” అంది మా పక్క ఫ్లాట్ ఉమాదేవి. “ఒకరనేముంది లోకం అంతా అలాగే ఉంది. ఎవరికెవరూ లేరు. మనకి పిల్లల మీద బెంగ కానీ వాళ్ళకెందుకుంటుంది?” అన్నాడు మరొకాయన.

నాకు నోరు విప్పక తప్పలేదు “ఊరికే పెద్దవాళ్ళని భయపెట్టడం ఎందుకు? మనమంతా ఉన్నాం కదా అవసరమైనప్పుడు ఆదుకుందాం” అన్నాను. వాళ్లంతా అలాగేనండీ అంటూ తలలూపారు. నెమ్మదిగా ఒకొకళ్ళూ వస్తామండీ! అంటూ లేచారు. “ఈయనేనండీ. మా అక్క కొడుకులా ఉన్నారనీ, నవ్వుతూ మాట్లాడుతున్నారని చెప్పలేదా!” అందావిడ

“ఆ ! చెప్పావ్, చెప్పావ్! ఏం చేస్తారండీ మీరు?” సుబ్బారాయుడు గారు అడిగాడు నన్ను.

“నేను ప్రభుత్వోద్యోగిని. గత సంవత్సరమే రిటైర్ అయ్యాను. నా భార్య ఆరు నెలల క్రితం కాలం చేసింది. నేను మా అబ్బాయి దగ్గర బెంగుళూరులో ఉంటున్నాను. నా ఫ్లాట్‌లో ఉండేవాళ్ళు ఖాళీ చేస్తే ఎవరికైనా ఇద్దామని పది రోజుల క్రితమే నేనూ వచ్చాను” అన్నాను

నేను మరికొంత సేపుండి భయం లేదని చెప్పి అవసరమైతే ఫోన్ చెయ్యమని నా నంబర్ ఇచ్చాను. ఆవిడ వద్దన్నా వినకుండా ఓ కప్పు టీ చేసి ఇచ్చింది.

ఇంటికెళ్ళగానే రాకేష్ ఫోన్. “ఏంటి నాన్నా! నేను ఢిల్లీ సెమినార్‌కి వెళ్లొచ్చేసరికి చెప్పకుండా వెళ్ళిపోయావు? ” కోపం బాధ కలగలిసిన గొంతుతో అన్నాడు.

“కోడలికి చెప్పానే! నువ్వక్కడ మీటింగులో బిజీగా ఉండొచ్చని చెప్పలేదంతే.అర్జెంటుగా రమ్మని ఒక ఫోన్ వస్తే వచ్చాను. మళ్ళీ వచ్చేస్తానులే. నేనిప్పుడు బైట ఉన్నాను మళ్ళీ చేస్తాను” అంటూ ఫోన్ పెట్టేసాను. బైటికెళ్లి టిఫిన్ తినొచ్చి పేపర్ చదువుతూ కూర్చున్నాను. మనసు నిలపలేక బాల్కనీలోకి వెళ్లి నిలబడ్డాను.

మా అబ్బాయి రాకేష్ మొహం కళ్ళముందు కదలాడింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు రాకేష్. అమ్మాయి తమిళ్ అమ్మాయి. చెన్నైలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో వీడితో పనిచేస్తోంది. నేనూ నా భార్యా సంతోషంగానే అంగీకరించాం. ఒక్కగా నొక్క కొడుకు. వాడి ఆనందమే మా ఆనందం అనుకున్నాం. కోడలు మాతో బానే కలిసిపోయింది. ఇద్దరు పిల్లలు. ఏడూ, ఐదూ ఏళ్ల పిల్లలు. నేను రిటైర్ అయిన రెండునెలల తర్వాత నా అర్ధాంగి రాణి బంధువులతో పెళ్ళికి వెళుతూ కార్ యాక్సిడెంట్‌లో చనిపోవడంతో నేను మానసికంగా పూర్తిగా డీలా పడిపోయాను. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక రాకేష్ కుటుంబంతోనే చెన్నైలో ఓ ఆరు నెలలు ఉండిపోయాను.

ఇద్దరు పిల్లలతో ఉద్యోగం చేస్తూ నాకు కూడా చేసిపెట్టడం కోడలికి సులువైన విషయం కాదు. నాకర్థమయ్యింది. పిల్లల్ని బడికి, ట్యూషన్లకీ తీసుకువెళ్లడం, పార్కుకి తిప్పడం, కూరలు తేవడం ఇలా వీలయినంత వరకూ నా వంతు సాయం చేస్తున్నా కానీ నాకు అన్నీ అమర్చిపెట్టడం ఆమెకి కష్టంగా ఉందని నాకనిపించింది. ఒక రోజు మరీ మనసు బాగాలేదు. నన్ను ఆ పిల్ల తగినంతగా పట్టించుకోవడం లేదని తోచింది. అందుకే ఒకానొక క్షణంలో నిర్ణయం తీసుకుని వచ్చేసాను. కాస్త ఆవేశంగా వచ్చిన మాట నిజమే.

రిటైర్మెంట్ సొమ్ముతో రాణీ నేనూ వెతికి, వెతికి ఈ ఫ్లాట్ కొనుక్కున్నాము. నేను రాణీ పోయిన దుఃఖంలో ఉండగానే తన మిత్రుడొకరికి రాకేష్ ఈ ఫ్లాట్ ఫర్నిచర్‌తో సహా అద్దెకిచ్చేసాడు. ఇప్పుడా కుర్రాడు సడెన్‌గా ట్రాన్స్‌ఫర్ వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి ఖాళీ చేస్తూ చెన్నైఫోన్ చేసాడు. పక్కింట్లో తాళం ఇవ్వమని, ‘టు లెట్’ బోర్డు పెట్టమని చెప్పాను. ఇంతలో నా మనసు గాయపడడంతో ఇదీ ఒక అవకాశం అనుకుని బయలుదేరి వచ్చాను. అదృష్టవశాత్తూ పనమ్మాయి వంటకూడా చేసి పెడుతోంది. రాణి జ్ఞాపకాలు ఇంట్లో తోడుగా ఉంటున్నాయి నాకు.

మరో వారం గడిచింది. నేను రోజూ ఒకసారి సుబ్బారాయుడు గారిని చూసి వస్తున్నాను. ఎవరూ నా ఫ్లాట్‌ని అద్దెకివ్వమని అడగడానికి రాకపోవడం నాకు సంతోషాన్నిస్తోంది.

ఒక వారం తర్వాత ఒక రోజు ఉదయమే ఓ ఫోన్ వచ్చింది. తన పేరు గణేష్ అనీ, సుబ్బారాయుడు గారి కొడుకుననీ పరిచయం చేసుకున్నాడతను. తానూ తన భార్యా పూణేలో వేర్వేరు కంపెనీల్లో పని చేస్తున్నామనీ ఇద్దరివీ చెరొక రూట్ గనక ఇద్దరి ఆఫీసులకీ మధ్యలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉన్నామనీ అది పాతిక మైళ్ళనీ చెప్పాడు. నేను ముక్తసరిగా మాట్లాడడం విని “సార్ మీరు పెద్దవారై ఉంటారు. నన్ను క్షమిస్తే నా వ్యక్తిగత విషయాలు చెబుతానండీ” అన్నాడు.

“చెప్పు బాబూ!” అన్నాను కాస్త మెత్తబడి.

ఆ మాటకి ఆ కుర్రాడి గొంతు వస్తున్న ఏడుపునాపుకున్నట్టుగా వినిపించింది.

“పర్వాలేదు, నాకూ స్కూల్ కెళ్లే మనవలున్నారు. చెప్పు” అన్నాను.

“సార్ నా భార్య నా తల్లితండ్రుల్ని రెండు నెలలు చూసింది. పెద్దలు చేసిన సంబంధమే. తర్వాత నా వల్ల కాదంది. బతిమాలితే మరోనెల చూసింది. ఆమె ఇక నేను చెయ్యలేను అని గట్టిగా చెప్పింది.నేను బాగా ఆలోచించి అక్కడొక ఫ్లాట్ కొని వాళ్ళని పెట్టి వచ్చాను. ఈ విషయమై నా భార్యని నేను ఒప్పించలేను సార్. నన్నంతా చెడ్డ కొడుకు అంటారు సార్ నాకు తెలుసు. మా అమ్మా నాన్నా పెద్దవాళ్లయిపోయారు. నా దగ్గర ఉంచుకొని చూడాల్సిందే సార్.

అత్తామావలు నా భార్య పక్షమే మాట్లాడుతున్నారు సార్ ‘పెద్దవాళ్ళు దూరంగా ఉండి అప్పుడప్పుడూ వచ్చి పోవాలి తప్ప ఆ కాలంలా కొడుకు దగ్గర శాశ్వతంగా ఉండాలనుకుంటే ఎవరికీ కుదరదు.రేపు మేమైనా అంతే’ అని నాకు నచ్చచెబుతున్నారు సార్”

ఆ అబ్బాయి చెబుతుంటే మా వాడే గుర్తొచ్చాడు. నిజమే రోజులు మారాయి. డబ్బులిస్తాం కానీ సేవ చెయ్యలేం అంటున్నారు యువతరం. అనిపించింది.

“నేనొకసారి వీలు చూసుకుని వస్తాను సార్. మా అమ్మ చెప్పింది మీరు ఎంతో ఆదరంగా మాట్లాడతారట. అందుకే మీకు ఫోన్ చేశాను సార్. మరొక రకంగా అనుకోకండి. మీ టైం తీసుకున్నందుకు సారీ. దయచేసి, మా అమ్మానాన్నల్ని మీకు ఇబ్బంది లేకపోతే కాస్త పలకరిస్తూ ఉండండి సార్, అర్జెంటు అయితే ఫోన్ చెయ్యండి సార్, వెంటనే బయలుదేరి వస్తాను” అన్నాడు అభ్యర్ధనగా.

“అలాగే బాబూ” అన్నాను.

ఆ తరువాత నేను రోజూ సాయంత్రం ఒక అరగంట బాధ్యతగా ఆ దంపతుల దగ్గర కూర్చుని వస్తున్నాను. నెమ్మదిగా ఆ వృద్ధ దంపతుల మనోభావాల్ని తెలుసుకోగలిగాను. వాళ్ళిద్దరికీ కొడుకు కోడలు దగ్గరే శాశ్వతంగా ఉండాలని కోరిక. “మా వాడికి టాక్స్ కలిసొస్తుందని ఈ ఫ్లాట్ కొన్నాడు. మా ఊరిలో సామాను కొంత తెచ్చుకుని వండుకుంటున్నాం. ఏదో ఒకరోజు మమ్మల్ని వీలుచూసుకుని మా అబ్బాయి పిలిచేస్తాడు. ఈ ఫ్లాట్ అద్దెకిచ్చేస్తాం” అన్నాడొకరోజు సుబ్బారాయుడుగారు.

హనుమాయమ్మ గారు మాట్లాడుతూ “మూడు బెడ్ రూములున్న ఇంటి కోసం వెతుకుతున్నానని చెప్పాడు మా వాడు. ఎంతో ఆలస్యంగా ఎన్నోపూజలు చేసాక పెళ్లయిన పదిహేనేళ్ళకి పుట్టాడండి మాకు. పోయిన సంవత్సరమే ఉద్యోగం వచ్చింది. వెంటనే పెళ్లి చేసేసాం” అంది.

“పిల్లల దగ్గరుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుందయ్యా! ఉదయం సాయంత్రం వాణ్ణి చూసుకుంటుంటే కడుపు నిండుతుంది మాకు” అన్నాడాయన.

రెండురోజులాగాక అన్నాన్నేను “ఇక్కడ బానే ఉంది కదా మీ ఇద్దరికీ! పూణే వెళ్ళాలంటారా ?”ఆయన షాక్ తిన్నట్టుగా నా వైపు చూసి భార్య కేసి చూసాడు. ఆవిడ నా వైపు సాలోచనగా చూస్తూ ఉండిపోయింది.

నేను రాజకీయాలేవో మాట్లాడి వచ్చేసాను.

మరొక రోజు “మీరొక్కరూ వంటరిగా ఇక్కడ ఎందుకుంటారు? మీ అబ్బాయి దగ్గరికి బెంగుళూరు వెళ్ళొచ్చుకదా బాబూ!” అందావిడ.

“మా కోడలుద్యోగం చేస్తుంది. ఇద్దరు మనవలున్నారు. మా కోడలికి వాళ్ళకీ నాకూ చెయ్యడం కష్టం అందుకే ఇక్కడే ఉండి అప్పుడప్పుడూ వెళ్లి వద్దామనుకుంటున్నాను. మరీ చేతకానప్పుడు ఎలాగూ వాళ్ళమీద భారం వెయ్యక తప్పదు. ఇప్పటినుండీ ఆ పిల్లని ఇబ్బంది పెట్టడం ఎందుకని నా ఉద్దేశం” అన్నాను. ఇద్దరూ ఆశ్చర్యంగా నా వైపు చూసారు. నేను నెమ్మదిగా లేచి వచ్చేసాను.

ఇంకోరోజు అవకాశం చూసి అన్నాను. “ఇప్పుడు పూర్వకాలం లాగా పెద్ద పెద్ద ఇళ్ళూ లేవు, కోడళ్ళకి అత్తామావలకి వండిపెట్టే టైమూ లేదు. వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళాలి. ఇప్పుడు ఆడవాళ్లు కూడా జాబులు చెయ్యకపోతే కుదరని ఆర్థిక పరిస్థితులున్నాయి. ఉద్యోగాలకి వెళ్లకపోయినా చేసిపెట్టే ఓపిక కోడళ్ళకుండడం లేదు. ఏమంటారు?”

ఇద్దరూ మవునం వహించారు. ఓ పదిహేను రోజులు గడిచాయి. ఒకరోజు కూర్చున్నప్పుడు “అమ్మా! ఇవాళొక వంటమనిషి వచ్చి అడిగింది. నాకు ప్రస్తుతం పని చేస్తున్నమ్మాయి బానే చేస్తోంది. మీరు పెట్టుకుంటారా?” అనడిగాను.

“అహ, నేను అంత ఓపిక లేకుండా లేను బాబూ! మా ఇద్దరికీ నేను వండగలను. గిన్నెలకీ, బట్టలకీ ఒక పిల్ల ఉంది” అందామె.నేను నవ్వి ఊరుకున్నాను.

ఒక రోజు చాలాకాలంగా తెలిసిన ఒక పెద్దాయన వృద్ధాశ్రమానికి విరాళం కోసం వచ్చాడు. నేను కూడా చూస్తానంటూ ఆయన వెంట అక్కడికి వెళ్ళాను. చుట్టూ చేలూ, తోటలూ ఉన్న ప్రదేశంలో విజయవాడకి పది మైళ్ళ దూరంలో ఉందా ఆశ్రమం. దానిపేరు శాంతి ఆశ్రమం. అక్కడ వృద్ధులు ఓ పాతిక మంది మగవాళ్ళు ఓ ఇరవై మంది ఆడవాళ్లు ఉన్నారని చెప్పాడు. మేం వెళ్లేసరికి సాయంత్రం నాలుగయింది. హాల్లో ఓ పదిమంది ఆడవాళ్లు టీ వీ ముందు కూర్చుని గట్టిగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు.

అప్పుడొక బెల్ మోగింది. అంతా చిన్నగా నడుచుకుంటూ వెళ్లి టీ తెచ్చుకుని అక్కడ మొక్కల మధ్య ఉన్న సిమెంట్ గట్లపై కూచుని తాగుతున్నారు. కొందరు బిస్కట్లు ముంచుకుని తింటూ టీ తాగుతున్నారు. నేను ఆఫీస్ రూంకి ఆయనతో కలిసి వెళ్లి నా వంతు విరాళంగా ఓ అయిదువేలిచ్చి ఒక చిన్న అభ్యర్ధన అంటూ ఒక కోరిక కోరాను. ఆయన “అలాగే ! తప్పకుండా రండి” అంటూ ఆనందంగా ఒప్పుకున్నాడు.

మర్నాడే సుబ్బారాయుడు దంపతుల్ని ఒప్పించి ఒక పిక్నిక్ లాగ అక్కడ ఉందామని చెప్పి వాళ్ళను తీసుకుని ఒక ఆటోలో శాంతి ఆశ్రమానికి వెళ్ళాను. వాళ్లిద్దరూ ఒక రూంలోనూ, నేను కామన్ రూంలో నూ మా బ్యాగులు పెట్టుకున్నాం. రాత్రి పూట చెట్ల మధ్య నుంచి చల్లగా గాలి వీస్తోంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం వల్ల దోమల్లేవు. ఉదయం కాఫీ ఇచ్చి అరగంట తర్వాత ఇడ్లీ పెట్టారు. పదకొండు గంటలకి బిస్కట్ లిచ్చారు. వంటిగంటకి భోజనం పెట్టారు. బాగానే వుంది. నాలుగు గంటలకి టీ, రాత్రి ఏడు గంటలకి సాంబరాన్నం, పెరుగన్నం పెట్టారు. ఒక గంట తర్వాత చిన్నఅరటి పండిచ్చారు. సుబ్బారాయుడు దంపతులిద్దరూ అక్కడి సౌకర్యాలు చూసి ‘బానే ఉందిక్కడ’ అంటూ సరదా పడ్డారు. కొత్తగా వచ్చిన మాతో అక్కడుండే వాళ్లంతా పాత స్నేహితుల్లా కబుర్లు చెప్పారు. అక్కడి వాళ్లంతా ఒక కుటుంబంలా ఉన్నారు.

మూడు రోజులుండి వచ్చేసాం ముగ్గురం. వచ్చాక అక్కడున్న వసతుల గురించి లేని వసతుల గురించి మర్నాడు సాయంత్రం చర్చ చేసుకున్నాం. రూంలకి ఎటాచ్డ్ బాత్రూంలు లేవు. మనకి నచ్చిన కూరలు, టిఫిన్లూ ఉండవు. ఏదిస్తే అది తినాలి అనుకుని నవ్వుకున్నాం.

“పూర్వం రాజులు రాజ్యాన్ని పిల్లల కిచ్చేసి రాజ భోగాలన్నీ వదిలి అడవుల్లోకి పోయి తపస్సు చేసుకుంటూ పళ్ళు, ఫలాలూ తింటూ ప్రశాంతంగా ప్రాపంచిక విషయాలకీ, సుఖాలకీ దూరంగా ఉండేవారట. ఈ వృద్ధాశ్రమాలు అలాంటివే. ఓ నాలుగు రోజుల్లోఆ ప్రదేశమూ అలవాటవుతుంది. వయసులో ఉన్నప్పుడు ఎన్నో వసతులు అనుభవించాం. జీవితమే శాశ్వతం కాదు ఇక సౌఖ్యాలెలా శాశ్వతం అవుతాయి? అలాంటి మనస్థితి నలవరచుకుని సౌఖ్యాలు లేవని బాధ పడడం మానేస్తే సరి.” అన్నాడాయన నవ్వుతూ.

హనుమాయమ్మ గారు నా వైపు చూసి నవ్వుతూ “మారిన పరిస్థితులతో పాటు మనమూ మారాలి మరి. నిర్మమమకారంగా ఉండాలనీ, భవ బంధాలపై వ్యామోహం తగ్గించుకోవాలనీ నిత్యం పండితుల ప్రవచనాలు వింటే సరిపోదు ఆచరించాలి. పిల్లల మీద భారం వేసేసి వాళ్ళు మొయ్యలేక పొతే వారిపై కినుక వహించడం, కోపగించుకోవడం సరికాదు. ఓపికున్నంత కాలం వండుకుందాం. తగ్గితే ఒక వంట మనిషిని పెట్టుకుని వండించుకుందాం. అదీ వీలు కానప్పుడు శాంతి ఆశ్రమం ఎలాగూ ఉంది. ఏమంటారు బాబూ?” అందావిడ. నేనూ సమాధానంగా నవ్వి ఊరుకున్నాను.

వాళ్ళు నా బోధల మీద నిష్ఠూరంతో అలా అంటున్నారేమోనన్న అనుమానంతో వారిరువురి వైపు చూసాను. ఇద్దరూ టీచర్ మీద గౌరవంతో పాఠాలు అప్పచెప్పే పిల్లల్లా నా వైపు అమాయకంగా చూస్తున్నారు. అయినా నా అనుమానం కంటిలో నలుసులా మెర మెర లాడి ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు.

మర్నాడు వాళ్ళింటికి వెళ్ళగానే “నిన్న మా అబ్బాయి ఫోన్ చేశాడమ్మా! మమ్మల్ని రమ్మన్నాడు. ఇక్కడ బావుంది. తర్వాత చూద్దాంలే! అన్నాను. ఓ రెండు నెలలాగాక వెళ్లి ఓ నెల ఉండి వస్తాం” అందావిడ నవ్వుతూ. ‘అమ్మయ్య’ అనుకుని తేలిగ్గా నిట్టూర్చాను..

మర్నాడు సుబ్బారాయుడు గారబ్బాయి గణేష్ ఫోన్ చేసాడు. “చాలా థాంక్స్ సార్! మా వాళ్ళకి ధైర్యం కలిగించారు. వాళ్లిప్పుడు ఆనందంగా ఉన్నారక్కడ” అన్నాడు.

నేను వెంటనే “నీ బాధ్యతగా నిత్యం ఫోన్ చేస్తూ వారి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండబ్బాయ్! వారికి శక్తి లేనప్పుడు దగ్గరుంచుకుని చూసే విధంగా నువ్వు ఇప్పటి నుంచీ ప్రణాళిక వేసుకుని నీ భార్యకు కూడా వివరించి చెప్పు. అప్పుడా అమ్మాయి తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అంతే తప్ప ఇదే బావుందని వాళ్ళని వదిలెయ్యకూడదు మరి” అన్నాను.

నా మాటలకి గణేష్ నొచ్చుకుంటూ “తప్పకుండా అంకుల్. మీరు నాకు గురువులాంటివారు మీకు మాటిస్తున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. వీలయినంత త్వరలో వస్తాను. మిమ్మల్ని చూడాలనుంది” అన్నాడు గౌరవంగా. “అలాగే” అన్నాను ఆత్మీయంగా

మర్నాడే మా అబ్బాయి రాకేష్ ఫోన్ చేసాడు. “నాన్నా టికెట్ తీసాను. వచ్చేయ్యి. పిల్లలకి సెలవులు. అందరం కేరళ టూర్ వెళదాం” అన్నాడు. “సరే నాన్నా వస్తాను” అన్నాను.

మా అబ్బాయి దగ్గరికి బెంగుళూరు వెళ్లి తిరిగి పది రోజుల్లో తిరిగి వస్తానని సుబ్బారాయుడు దంపతులకి చెప్పాను.

“ఎదురు చూస్తూ ఉంటాం. త్వరగా వచ్చెయ్యి ఆనంద్. నువ్వు మాతో ఉంటే ఇదే ఆనందాశ్రమమయ్యా!” అంటూ సుబ్బారాయుడు గారు నా చెయ్యి పట్టుకున్నాడు. నాకు కళ్ళలో నీళ్లు తిరిగాయి.

“మీ వల్ల మేం చాలా తెలుసుకున్నాం. చిన్నవాడివైనా మాకు వృద్ధాప్యాన్ని నిభాయించడం నేర్పావు బాబూ” అందావిడ. అవునన్నట్టు సుబ్బారాయుడు గారు కూడా తలూపాడు.

‘నిజానికి ఇక్కడికి వచ్చేటప్పటికి లేని పరిణతి మీ వల్లే నాకొచ్చింది’ మనసులో అనుకుని నవ్వుకుంటూ నా ఫ్లాట్ కొచ్చి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టాను.

Exit mobile version