అనంత యాత్ర

1
3

[శ్రీ బండారు ప్రసాదమూర్తి రచించిన ‘అనంత యాత్ర’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]ప్పుడూ చేసే ప్రయాణమే
ఈసారి మాత్రం
ట్రైన్ లో కూర్చుంటే మరో గ్రహంలో కూర్చున్నట్టే ఉంది
అంతా మనుషుల్లాంటి మనుషులే
మాటా మనసూ కలుపుకోడానికి
ఓ చోట కలుసుకున్నట్టు
మనుషులకు అచ్చం మనుషులే పరిచయమైనట్టు అంతా ఒకటే హడావిడి

దేహాలను బెర్తుల మీద పడేసి
లగేజీ బెర్తుల కింద తోసేసి
పాదరక్షలు పక్కకు నెట్టేసి
కేవలం ఆత్మలు మాత్రం
కాలాలు కాలాలుగా కడుపు కట్టుకున్నట్టు కబుర్లలో పడ్డాయి
బాటలు బాటలుగా చీలిన జీవితాలు ఇక్కడ క్షణాల్లో తీగల్లా అల్లుకున్నాయి

ఎప్పుడూ ఇంత తేరిపార చూడలేదు
రాజ్యం ఊసు లేదు
రాజ్యాంగం ఉనికీ లేదు
కళ్ళల్లోంచి కులాలు రాలిపట్టం లేదు మాటల్లోంచి మతాలు ఊడిపట్టం లేదు
నిద్దురా మెలకువా మధ్య
విరబూసిన వెలుగులో
దేవుడి ధ్యాస దేవుడికే లేదు
అందరిలో ఒకటే జ్ఞానం
కొద్దిసేపే ప్రయాణం-

ఎవడు ఎక్కేవాడు.. ఎవడు దిగేవాడు..
నీ స్టేషనెక్కడే చిలకా..!
ఎవరో అంధ గాయకుడు తత్వం పాడుతున్నాడు
సర్దుకు కూర్చున్న మనుషుల మధ్య సామరస్యాన్ని ఇంధనంగా మార్చుకొని
రైలు సంబరంగా సాగుతోంది

ఎవరి లోపల ఏ పర్వతాలు మొలుస్తున్నాయో
బయటికి మాత్రం సముద్రాల్లా తలలూపుతున్నారు
కూడా తెచ్చుకున్న ఆహారంతో పాటు కష్టసుఖాలనూ పంచుకుంటున్నారు
ఎవరి పిల్లలు ఎవరో గాని
పెద్దల కన్నుల ఆక్వేరియాలలో
చేప పిల్లలైపోయారు

టీసీ వచ్చాడు
ద్వేషానికి రిజర్వేషన్ లేదన్నాడు
ప్రేమకు బెర్త్ కన్ఫర్మన్నాడు
భారతీయ రైల్ గాడీ లోపల
మానవీయ ఆత్మలా కనబడ్డాడు

అప్పుడే లోపలికి వచ్చిన వారు నవ్వుతూ హలో అన్నారు
అప్పుడే బయటకు వెళ్లేవారు
నవ్వుతూ బై బై చెప్పారు
కలిసి కూర్చున్న ఆ కాసేపు అంతా
గతానికీ భవిష్యత్తుకూ సంబంధం లేని
ఒక్క వర్తమానానికే
అన్ని వైపులా హత్తుకుపోయారు

చావు పుట్టుకల లెక్కలు లేవు
ఆత్మబంధువులం కావడానికి
అరగంట రైల్లో ప్రయాణిస్తే చాలు
నో అథారిటీ నో ఫార్మాలిటీ
వీలైతే కాస్త జరగడం..
కుదిరితే
ఒకరి భుజాల మీద ఒకరు ఒరగడం-

ఒక స్టేషన్ రమ్మని చేతులు చాపుతుంది మరో స్టేషన్ మళ్ళీ రమ్మని చేతులు ఊపుతుంది
కలిసినప్పుడు నవ్వులు
విడిచినప్పుడు కన్నీళ్లు
రెండు స్టేషన్ల మధ్య ఒక కలయిక..
ఒక వీడ్కోలు..
ఇంతే జీవితం అని
రైలుతో పాటు నేనూ కూత వేశాను

ఎన్నిసార్లు రైలెక్కితే ఏముంది
ఒక స్ఫురణ మాత్రం ఇప్పుడే తోచింది
కాలం పరిచిన పట్టాల మీద
ఒక దేహంతో మరోదేహాన్ని
ముడివేసి ముందుకు లాగడమే
రైలు ప్రయాణం అనిపించింది

ఆత్మలు దిగుతుంటాయి..
ఎక్కుతుంటాయి..
దేహాల్లో, క్షణక్షణానికీ వచ్చీపోయే కణాల్లో ఇచ్చుపుచ్చుకునే ఎరుకే
ఇంజన్..

అందుకే
జీవితంలో మన ప్రయాణం
దారి తప్పినప్పుడు
రైల్లో ప్రయాణం చేయమంటాను

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here