[dropcap]ప[/dropcap]చ్చకోకతో అలరారే నిత్య సౌభాగ్యవతి
తన గర్భాన చేరిన బీజానికి ప్రాణంపోసి
సేద్య సిరులకు జన్మనిచ్చి
జీవకోటికి తన ఒడిని పంచి
అక్కున చేర్చుకుని ఆకలి తీర్చే అన్నపూర్ణ
మట్టి తానై పరిమళాలు వెదజల్లే
సుమ రాసులకు పుట్టినిల్లై
తనువున పెరిగిన తరుల సంపదను
తరతరాలకూ పంచే త్యాగమయి
జలామృత ధారలు తన దేహంపై
తన్మయంతో చిందులు వేస్తుంటే
మురిసి తన గర్భాన దాచి
తన సంతానానికి పంచే మాతృదేవత
తరగని ఖనిజ సంపదను కలిగిన
సృష్టికే సుందర పేటిక
తలచినంతనే తెరిచి కోరినవి అందించే కల్పవల్లి
అశాశ్వతమైన దేహానికి
స్వార్ధ పంకిలం పూసుకున్న నరుడు
ధరణి తల్లి సహజ సౌందర్యాన్ని
కాంక్రీట్ కోటింగు వేసి వెలవెలబోయేలా చేస్తూ
మలిన దుర్గంధంతో నింపి
పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ
జీవన నాటకానికి తెరపడిన వేళ
తన ఒడిలోకే శాశ్వత నిద్రలోకి!