అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – క్యురసావో

1
1

[క్యురసావోలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు డాక్టర్ నర్మద రెడ్డి.]

[dropcap]మా[/dropcap] అమ్మాయి అర్పిత రెడ్డి మారథాన్ రన్నర్. ఇండియాలోనూ, వివిధ దేశాలలోనూ ఎన్నో మారథాన్ రన్‍లలో పాల్గొంది. ఐదు దేశాలలో మారథాన్ పోటీలలో పాల్గొంటే ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సర్టిఫికెట్ ఎంతో ప్రసిద్ధమైనది.

ఒకరోజు పొద్దున్నే ఫోన్ చేసి – తాను చికాగో మారథాన్ రన్‍లో 42.5 కిలోమీటర్లు పరిగెత్తడానికి సిద్ధమవుతున్నాని చెప్పి, మమ్మల్ని కూడా రమ్మనమని కోరింది. ఈ రన్ కోసం తను ఒక ఏడాది నుండి ట్రైనింగ్ తీసుకుంటోంది. ఆ ట్రైనింగ్‌లో భాగంగా అంతకుముందే జర్మనీ మారథాన్ రన్ చేసింది. మా అమ్మాయి కోరికను మన్నించి మేము కూడా తనతో పాటు వెళ్దామని అనుకున్నాం. అయితే ఈలోపల చకచకా కొన్ని దేశాలను కూడా చుట్టిరావచ్చని అనుకున్నాము.

ఆ ప్రయాణంలో భాగంగా Jamaica, Aruba, Curaçao, Haiti, Cayman Islands, Puerto Maya Cruise (Mexico) మొదలైన ప్రాంతాలు దర్శించాలని క్రూయిజ్ బుక్ చేసుకున్నాం. కరేబియన్ దీవుల పర్యటనలో భాగంగా మేము క్యురసావో (Curaçao) ద్వీపంలో ఆగాము.

ఈ పర్యటన కోసం రెండు క్రూయిజ్‍లు బుక్ చేశాము. ఒకటి తొమ్మిది రోజుల క్రూయిజ్, మరొకటి 7 రోజుల క్రూయిజ్. ఈ రెండు మాకు చాలా తక్కువ ధరలో వచ్చాయి. ఈ రెండు క్రూయిజ్‍లు మాకు ఒక్కొక్కరికి 50 వేలల్లో వచ్చేసాయి. Unbelievable Package ఇది. వెంటనే బుక్ చేయమని చెప్పాము. మా ఫ్రెండు క్రూయిజ్ ఆన్‌లైన్‌లో బుక్ చేశారు.

మేము మయామీకి టికెట్ బుక్ చేసుకున్నాం. మయామీలో మా ఫ్రెండు ఒక అమ్మాయి విజ్జి అని ఉంది. ఎయిర్ పోర్ట్‌కి వస్తానని చెప్పారు. సో మేము మయామీకి ప్రయాణమయ్యాం.

అక్కడి ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళగానే “మయామీ ఎందుకు వచ్చారు?” అని అడిగారు. రెండు క్రూయిజ్‍లలో వెళ్తున్నామని మేము చెప్పాము. ఆమె వెంటనే హార్ట్ ఎటాక్ వచ్చినట్టు చూసింది. “ఇక్కడ పెద్ద తుఫాను రాబోతోంది. గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత పెద్ద తుఫాను వస్తుంది. మీ క్రూయిజ్‍లు వెళ్లడం క్షేమకరం కాదు” అన్నారు. “ఎన్నెన్నో కోట్లు వెచ్చింది కృషి చేసిన వాళ్ళు మమ్మల్ని గాలికి వదిలేయరు కదా, వాళ్లంతట వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మేము చికాగో వెళ్లిపోతాము. లేదూ వాళ్ళ పడవలు వెళితే మేము ఖచ్చితంగా ఆరు నూరైనా వెళ్లాల్సిందే” అన్నాను నేను. ఆమె ఆశ్చర్యపోయారు. “ఏంటి మీకు ఇంత ధైర్యం? క్రూయిజ్ మునిగిపోతే ఏం చేస్తావ్?” అన్నారు. “అది నా డెస్టినీ అనుకుంటానండి, లెట్ మీ ట్రై” అని చెప్పాను. వెంటనే తను ఓకే అని ఒక స్టాంప్ వేసేసి ఇచ్చేసారు నాకు.

ఆ పత్రాలు తీసుకుని నేను మా బుజ్జి కోసం చాలా ఆత్రుతగా మొత్తం ఎయిర్‌పోర్ట్ అంత వెతికాను. ఇంతలో పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని “అక్కా వచ్చేసావా?” అంటూ చాలా చాలా ఆనందపడిపోయింది బుజ్జి. నిజంగా ఆప్యాయత అంటే తన దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు మాకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. రకరకాల వంటలు వండింది బుజ్జి. చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నారు, చాలా అందంగా ఉంది. తను ఆ రోజు మమ్మల్ని ‘హ్యాపీ న్యూ ప్లేస్’ అని ఒక చోటుకి తీసుకెళ్ళింది. అక్కడ పెద్ద సందడిగా అందరూ పాటలు పాడుతున్నారు, డాన్సులు చేస్తున్నారు. తినేవారు తింటున్నారు. అక్కడి కొన్ని ప్రదేశాలు చూస్తూ, నచ్చిన పదార్థాలు తింటూ, కబుర్లు చెప్పుకుంటూ ఆ ఏరియా అంతా ఫోటోలు తీసుకుని వచ్చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ – పక్కన ఒక పెద్ద ప్లేస్ ఉందని అక్కడికి తీసుకెళ్ళింది. అది హోం ఫర్ ఏజ్డ్. కొన్ని వందల అపార్ట్మెంట్స్ కట్టారు. ఆ ప్లేస్‍కి దగ్గర్లో మంచి పార్క్ కూడా ఉంది. ఆ పార్క్‌లో వాకింగ్ చేశాము. ఆ చుట్టుపక్కలంతా చూసుకుంటూ మేము మధ్యాహ్నం కల్లా ఇంటికి చేరాము. సాయంత్రం దగ్గరలోని క్లబ్ తీసుకెళ్లారు. ఆ క్లబ్బులో – త్రో బాల్, బాస్కెట్బాల్ చాల చాల గేమ్స్ ఉన్నాయి. వాళ్ళ బాబు స్కూల్ చూపించింది.

***

క్రూయిజ్ లోకి అడుగుపెట్టగానే అక్కడ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని మా రూమ్ లోకి మేము వెళ్లిపోయాము. మర్నాడు ఉదయం Curaçao లో దిగాం. ఇది ఒక ద్వీప దేశం. విలియంస్టాడ్ రాజధాని. ఈ దేశం పేరుని పలురకాలుగా పలుతారు. కురస అని, క్యురసావో అని, కురాకవో అని. దీన్ని టచ్ కరేబియన్ ఐలాండ్ అంటారు.

ఇక్కడ మేము టౌన్ సెంటర్‌కి వెళ్ళాము. ఆ టౌన్ సెంటర్ మొత్తం ఆర్కేడంత ఉంది. తర్వాత అక్కడి ఇళ్లను చూశాము. అవి విభిన్నమైన రంగులలో వింతగా ఉన్నాయి. ఒక్కో ఇల్లు చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యమేసింది. అన్ని ఒకటే టైప్‍లో ఉన్నాయి. బెడ్ రూమ్‍లో కంట్రోల్ ఉంటుంది. ఇళ్ళని ఇంత కలర్‍ఫుల్‌గా ఎందుకు కట్టుకుంటారని వాళ్ళని అడిగితే, ఇక్కడ జనాలందరూ చాలా డిప్రెషన్‍లో ఉంటుంటారు. ఆ డిప్రెషన్ నుండి బయటకు రావడానికి మన కళ్ళకి విభిన్నమైన రంగులు కనిపిస్తే మన మైండ్‌కి ఉత్సాహంగా, సంతోషంగా ఉంటుంది అని చెప్పారు. ఇది నాకొక కొత్త అనుభవం.

అక్కడ మనం మంచి రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటే కూడా ఎదుటివారి మీద మంచి అభిప్రాయం వస్తుందట. నిజమేనేమో. సైకలాజికల్ ఫీలింగ్. చక్కటి రెయిన్‌బో కలర్స్‌తో ఇళ్ళు కట్టుకున్నారు. కానీ రోడ్డు మాత్రం మామూలు తారు తోనే ఉంది. అయితే నేను ఊహించినట్టు అది రోడ్ కాదు, అదొక బ్రిడ్జ్. ఆ బ్రిడ్జి ఉయ్యాల లాగా ఊగుతుంది. అక్కడ అన్ని ఫొటోస్ తీసుకున్నాము. దాని పేరు Queen Emma Bridge. ఇది 17వ శతాబ్దం నాటిది. అలా ఊగుతున్న వంతెన మీద నడవడం చక్కని అనుభూతి కలిగించింది.

విలియంస్టాడ్

ఇక్కడి స్థానికులంతా ఒకప్పుడు బానిసలుగా ఈ దేశానికి వచ్చినవారే. బానిసత్వం రద్దయ్యాకా, పలు ప్రాంతాలలో నివాసం ఏర్పర్చుకున్నారు. ఆనాటి వాళ్ళ ఇళ్ళను Kunuku Houses అంటారు. అంత చిన్న చిన్న ఇళ్ళల్లో కుటుంబమంతా ఎలా గడిపేవారో అర్థం కాదు.

తరువాత Kas di pal’i maishi అనే మ్యూజియం చూశాం. స్థానికుల ఆచార వ్యవహారాలకి సంబంధించిన వస్తువులు ఉన్న ఈ మ్యూజియం Afro-Curaçaoan heritage లో భాగం. ఈ ద్వీపంలో చాలా పక్షులు ఉన్నాయి. బ్రౌన్ పెలికాన్స్ ఎక్కువగా కనబడతాయి.

ఇక్కడ ఒక రాజభవనం కూడా చూశాము. ఎన్నో ఏళ్ళ క్రితం ఈ ప్రాంతాన్ని పాలించిన కలోనియల్ కింగ్ రాజసౌధమంటారు. ఆ రాజసౌధం దగ్గర కూడా బెల్స్ ఉన్నాయి. తర్వాత ఆ కట్టడాలన్నీ చూసి ఫొటోస్ తీసుకున్నాము.

రాజభవనం

ఇక్కడ స్కూబా డైవింగ్ చేసి under water fishes చూడవచ్చు. అయితే నేను ఇంతకుముందు వేరొక చోట స్కూబా డైవింగ్ చేసి ఉండడంతో, ఇక్కడ చేయలేదు.

ఇక్కడ కొలంబస్ అడుగుపెట్టిన ప్రాంతం కూడా ఉంది. కానీ సమయాభావం వల్ల చూడలేకపోయాం. కొంత నిరాశకి గురయ్యాను.

దేశంలోనే అత్యంత ఎత్తైన చోటు The Christoffelberg అనే ప్రాంతానికి వెళ్ళాం.

నిజానికి మేం క్రూయిజ్ నుంచి బయటకు రాగానే ఒక గైడ్ కమ్ కార్ డ్రైవర్‍ని మాట్లాడుకున్నాం. కారు షేర్ చేసుకుంటే ధర తక్కువ పడుతుందని మేము సెవెన్ మెంబెర్స్ ఒక కార్ తీసుకున్నాము. 20 డాలర్స్.

ఒక అమ్మాయి చక్కగా డ్రైవింగ్ చేస్తూ,  పొద్దున్నుంచి రాత్రి వరకు మమ్మల్ని తిప్పి అన్నీ చూపించింది. ఆ అమ్మాయి గైడ్‍లా ఎంత బాగా చూపిస్తుందో ఎంత బాగా చెప్తుందో మా దగ్గర వాయిస్ కూడా ఉంది. చివరగా మమ్మల్ని కొన్ని పడవల దగ్గరికి తీసుకెళ్లింది. ఆ పడవల దగ్గరకి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.

ఈ చిన్న ట్రిప్‍ వల్ల – క్యురసావో ప్రజలు అత్యంత స్నేహశీలురని మేం గ్రహించాం. ఎన్నో అనుభూతులను ప్రోది చేసుకుని మా ప్రయాణం కొనసాగించాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here