అందాల దీవులలో ఆహ్లాద యాత్రలు – ఫిజీ

0
1

[ఫిజీలో జరిపిన తమ పర్యటన అనుభవాలు, అనుభూతులు వివరిస్తున్నారు నర్మద రెడ్డి.]

[dropcap]ద[/dropcap]క్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న 322 ద్వీపాల సమూహం ఫిజీ. ఆస్ట్రేలియా ఖండానికి చెందిన దేశం ఫిజీ. ఫిజీ రాజధాని సువా. వీరి ద్రవ్యం ఫిజీయన్ డాలర్స్. మన రూ.34తో సమానం (2019). వీరి అధికార భాష ఇంగ్లీష్. భారతీయులు ఎక్కువగా గల క్రిస్టియన్ దేశం ఫిజీ. హనీమూన్ డెస్టినేషన్‍గా, సాహసక్రీడలకు పేరొందిన ఫిజీలో పర్యాటకం ఆనందంగా ఉంటుంది. ఆస్ట్రేలియా ఆవల ఉండే ఫిజీలో భారతీయుల జనాభా దాదాపు 38 శాతం. ఆంగ్లేయుల కాలంలో చెరకు సాగు కోసం వెళ్లిన భారతీయ కూలీలు.. క్రమంగా పెరిగిపోయారు. భారతీయులు మాత్రమే కాదు.. మనం ఆరాధించే దైవాలూ అక్కడ కొలువైనారు. సుబ్రహ్మణ్యస్వామి, రాముడు, గంగ, నాగదేవత తదితర దేవుళ్లకు అక్కడ ఆలయాలు కట్టబడ్డాయి. వీటిలో ఫిజీలోని ప్రముఖ నగరం నాడిలో ఉన్న శివసుబ్రహ్మణ్యస్వామి ఆలయం కొండల నడుమ అందంగా ఉంటుంది. ఫిజీ వెళ్లే పర్యాటకులు వీటిని దర్శిస్తారు.

సువా, ఫిజీయన్ రాజధాని, ద్వీపం యొక్క ఆగ్నేయ తీరంలో ఉంది. అద్భుతమైన నౌకాశ్రయాన్ని కలిగి ఉంది. వాయువ్య తీరంలో ఉన్న లౌటోకా, చెరకు పండించే ప్రాంతానికి ఓడరేవు. పంచదార, పైనాపిల్స్, వరి మరియు పొగాకును నవువా, రేవా మరియు సిగటోకా (సింగటోకా) నదుల సారవంతమైన లోయలు మరియు డెల్టాలలో సాగు చేస్తారు. ద్వీపం యొక్క ఉత్తర- మధ్య భాగంలో వటుకౌలా వద్ద ఒక గోల్డ్ ఫీల్డ్ 1930లలో మొదట అభివృద్ధి చేయబడింది. పశ్చిమాన నాడి (నంది), దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలిగి ఉంది. సమీపంలోని వుండా పాయింట్ వద్ద చమురు – ఇంధన సంస్థాపన ఉంది. నౌసోరి వద్ద సువాకు ఈశాన్యంగా ఒక చిన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ద్వీపం యొక్క జనాభాలో ఎక్కువగా భారతీయులు, ఇతర జాతులు వారు, మెలనేసియన్లు ఉన్నారు పట్టణ ప్రాంతాల్లో.

ఫిజీయన్ పట్టణాల నుండి వచ్చిన కుండల కళ ఫిజీలో కనీసం 3500 నుండి 1000 BC వరకు ఆస్ట్రోనేషియన్ ప్రజలు స్థిరపడ్డారని చూపిస్తుంది, మెలనేసియన్లు సుమారు వెయ్యి సంవత్సరాల తరువాత అనుసరించారు, అయినప్పటికీ ఫిజీకి మానవ వలసల నిర్దిష్ట తేదీలు మరియు నమూనాల గురించి ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇతర పసిఫిక్ దీవులు, లాపిటా ప్రజలు లేదా పాలినేషియన్ల పూర్వీకులు ఈ ద్వీపాల్లో మొదట స్థిరపడ్డారని నమ్ముతారు, అయితే మెలనేసియన్లు వచ్చిన తర్వాత వారు ఏమయ్యారనే దాని గురించి పెద్దగా తెలియదు; పాత సంస్కృతి కొత్తదానిపై కొంత ప్రభావం చూపి ఉండవచ్చు మరియు కొంతమంది వలసదారులు సమోవా, టోంగా మరియు హవాయికి కూడా వెళ్లినట్లు పురావస్తు ఆధారాలు చూపిస్తున్నాయి. మోటురికి ద్వీపంలో కనీసం 600 BC నుండి మరియు బహుశా 900 BC నాటి వరకు మానవ నివాసం యొక్క పురావస్తు ఆధారాలు కూడా దొరుకుతున్నాయి.

***

ఇన్ని విశిష్టతలున్న ఫిజీకి బయలుదేరాలని అనుకున్నప్పుడు ఒక చక్కటి డీల్ దొరికింది మాకు. అది ఏందంటే హాంగ్‌కాంగ్ నుంచి ఫిజీకి చాలా తక్కువ ధరలో మాకు ఫ్లైట్ టికెట్స్ దొరికాయి. ఆ ఫ్లైట్ టికెట్స్ మాకు దొరకగానే సంతోషంగా ఫిజీ పర్యటనకి బయలుదేరాము. ఈ పర్యటనలో మేము RCI నుంచి ఒక వారానికి అక్కడ హోటల్ బుక్ చేసుకున్నాము. ఆ హోటల్లో రూమ్ మాకు ఒక చిన్న రిసార్ట్‌లో ఇచ్చారు. ఆ రిసార్ట్‌కి మేము వెళ్లడానికి మాత్రం చాలా చాలా దూరం అనిపించింది. మేము హాంగ్‌కాంగ్‌కు వెళ్లి, రాత్రంతా హాంగ్‍కాంగ్ ఎయిర్‍పోర్ట్‌లో పడుకున్నాం. మర్నాడు ఉదయం ఫ్లైట్‍లో హాంగ్‌కాంగ్ నుంచి సువా అనే ప్రదేశానికి ఈ అంటే ఫిజీ ఐలాండ్స్ ముఖ్య పట్టణమైన సువాకి మేము బయలుదేరాము. అయితే ఈ ముఖ్య పట్టణం సువాకీ, ఎయిర్‍పోర్టుకి మధ్య చాలా దూరం ఉంది. ఒక ఐదు గంటల ప్రయాణం. ఎక్కడైతే మేము రిసార్ట్ తీసుకున్నామో అది చాలా దూరంలో ఉంది. అయితే సువాకి మేము వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయితో “మాకు నిన్న రాత్రి నిద్ర లేదు, మొన్న రాత్రి నిద్ర లేదు. సో ఇమ్మీడియట్లిగా మేము పడుకోవాలి. మాకు త్వరగా రిసార్ట్ ఇవ్వండి” అన్నాము. అంతే, ఆ అమ్మాయి చాలా సహకరించి వెంటనే మాకు ఒక రిసార్ట్స్ ఇచ్చింది. ఒక హాల్ విత్ టు బెడ్ రూమ్స్ ఇచ్చింది. అందులో మేము అన్ని వండుకోవచ్చు, తినొచ్చు. అలాంటి రిసార్ట్ అన్నమాట. అక్కడికి వెళ్లిన తర్వాత అప్పటికప్పుడు నిద్రపోయి లేచిన తర్వాత నేను నా వంట వండుకున్నాను.

ఆ అమ్మాయి ఎంతో చక్కటి ప్లాన్ చేసింది. “రేపటికి మీకు నేను ఒక ప్యాకేజ్ టూర్ బుక్ చేస్తాను. మీరు వెళ్ళండి. అది చాలా తక్కువలోనే ఉంటుంది” అని చెప్పింది. “ఎందుకు?” అని అడిగితే, “మొత్తం బస్సులో చాలా మంది ఉంటారు కాబట్టి మీకు పర్ హెడ్ చాలా తక్కువకి టికెట్ దొరుకుతుంది, మీరు ఇందులో వెళ్ళండి” అని చెప్పింది. మేము అక్కడ బస్సు తీసుకొని వాళ్ళు చెప్పిన ప్రకారం బయలుదేరాం. అక్కడ ముందు ఒక పెద్ద హాల్లోకి తీసుకువెళ్లారు. ఆ హాల్ నుంచి వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్ళి స్థానిక ట్రైబల్స్ దాదాపు 2000 ఏళ్ళ క్రితం కట్టిన ఒక ట్రైబల్ గుడి చూపించారు.

ఆ గుడిని చూసి వచ్చిన తర్వాత పెద్ద డ్రమ్స్, తర్వాత చెక్కతో తయారు చేసిన కట్టెలాంటిది చూపించారు. ఆ కట్టెను చూస్తే ఏంటి అని అంటే దాని మీద వాళ్ళు అప్పట్లో వాయించేవాళ్ళంట. ఆ కట్టకి మధ్యలో మాత్రం కొద్దిగా ఇలా చక్కగా తొలచినట్లుగా ఒక దోనె లాగా అనిపిస్తుంది. నిజంగానే చక్కటి సంగీతం వినిపిస్తోంది దాంట్లో నుంచి. సో అక్కడ మేము కాసేపు ఆగి, ఆ సంగీతం విన్నాక, కాసేపు ఒక పెద్ద హాల్లో మాకు కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమన్నారు.

తరువాత – వెదురు దెబ్బలతోటి తయారు చేసిన ఒక పెద్ద పడవ ఉన్న చోటకి తీసుకువెళ్ళారు. సుమారు 50 వెదురు కట్టలని మధ్యలో తాళ్లతో కట్టి దాన్నొక తెప్పలాగా తయారు చేశారు. ఆ తెప్ప మీద మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని చాలా దూరం తీసుకెళ్ళారు. మేం విపరీతంగా భయపడ్డాం, ఆ తెప్ప ఎక్కడ పడిపోతుందో అని. అయితే నీరు మాత్రం చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అందులో వీళ్ళు ఆ కట్టెల తోటి తయారుచేసిన తెప్పలో మమ్మల్ని కూర్చోబెట్టి తీసుకువెళ్తున్నారు. అలా వెళుతూ ఉన్నప్పుడు మాకు రెండు వైపులా పెద్ద కొండలు, చెట్లు చేమలు కనపడ్దాయి. అక్కడ ‘అనకొండ’ అనే ఒక ఇంగ్లీష్ మూవీ తీశారట. ‘అనకొండ’ చాలా నచ్చింది, అది చాలా సక్సెస్‌ఫుల్‍గా కూడా నడిచింది.

తరువాత అక్కడ నుంచి మమ్మల్ని తీసుకెళ్లి ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర ఎత్తైన కొండమీద నుంచి వాటర్ పడుతోంది. ఆ పడుతున్న దాని దగ్గర వరకు మేము నడిచేసరికి మా ఒళ్ళంతా పూర్తిగా తడిసిపోయింది. ఆ నీళ్లలోంచి మమ్మల్ని ఆ వాటర్ ఫాల్స్ దగ్గరకి తీసుకెళ్లారు. అంతలో ఇద్దరు ఫారినర్స్ ఆ కొండపై నుంచి దూకారు నిజంగా. అయితే వాళ్ళు చచ్చిపోతారేమో అని అనిపించింది నాకు. అంత భయంకరమైన స్టేజ్‌లో కూడా వాళ్ళు అంత ధైర్య సాహసాల తోటి అక్కడి నుంచి దూకడం మాత్రం చాలా చాలా ఆశ్చర్యమేసింది మాకు.

ఆ నీళ్లలో చాలా సేపు మేము తడిచి ఆడుకున్నాం. తడికి కాళ్లు జారిపోతూ ఉన్నాయి. అంత పెద్ద కొండ మీద నుంచి దిగేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. అంతకు మునుపే ఎవరో ఒక ఆవిడ జారుతూ దీనిలో పడి కాలు విరగొట్టుకుందట. నేనైతే ఎంతో గట్టిగా మా వారి చేతులు పట్టుకొని కింద వరకు దిగి వచ్చాను. ఆ తెప్ప మీద వాళ్ళు మళ్ళీ మమ్మల్ని తీసుకెళ్ళి ఇంకో ఎత్తైన ఒక కొండమీద భోజనాలు ఏర్పాటు చేశారు. కొండ పైకి ఎక్కిన తర్వాత అక్కడ మాకు భోజనాలు అరేంజ్ చేస్తే అక్కడనే మేము బట్టలు మార్చుకున్నాము. వాళ్ళు పెట్టిన ఆహారం తిన్నాం.. అంటే అక్కడి పదార్థాలతో తయారు చేసింది పెట్టారు. ఆ వంట ఎలా తయారు చేశారో కూడా మాకు అన్ని చూపించారు.

అది ఏంటంటే అరటి ఆకుల లాంటి ఆకులు చుట్టి కట్టి ఆ కట్టిన పదార్థాలు అన్నిటిని భూమి అడుగున గుంత తవ్వి ఆ తవ్విన దాంట్లో ఇవన్నీ పెట్టేసి దానికి పైన మంట వేశారు. మంట ఎలా వేశారంటే మళ్ళీ ఆ మట్టినంత పూడ్చి ఆ మట్టి పైన బొగ్గులు కట్టెలు అన్ని వేసేసి మొత్తం అడుగు నుంచి అడుగున బొగ్గుల తోటి పైన కట్టెల తోటి పెట్టేసి మంట పెట్టారు. వాటిని చాలాసేపు అలాగే ఉంచేస్తారట. అందులో నుంచి పొగ వస్తూ ఉంటుంది. 5 – 6 గంటలు తర్వాత అది తీస్తే, వాళ్ళు పెట్టిన ప్రతి వంట అందులో తయారయ్యి చక్కగా మనకు ఒక ఫ్లేవర్ ఇస్తుంది.

ఫిష్, మటన్, చికెన్, ప్రాన్స్ అన్నిటిని కూడా వాళ్ళు చక్కగా వండి దానిమీద పెట్టి ఉంచారు. అయితే ఇక్కడ ఒక వింతైన అనుభవం అయింది. అదేంటంటే ఇక్కడ మన దగ్గర ఇలాగైతే ఆకులతోటి దొన్నెలు తర్వాత ఈ తర్వాత గంపలు ఏవైతే మనం తయారు చేస్తున్నామో అవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. పూర్వం మన ఇండియన్స్ చాలా మంది అక్కడ సెటిల్ అయినా వాళ్ళు ఉన్నారు. అదొక్కటి కాకుండా చాలా విచిత్రమైనది ఏందంటే ఇప్పుడు ఏదైతే భూమి అడుగున వాళ్ళు వంటలు వండారో – అప్పట్లో ఆ మనుషులని అలా చంపి ముక్కలుగా చేసి దాంట్లో ఆకులలో చుట్టి దాన్ని భూమి అడుగున పెట్టేసి ఉడికించేవారట! అయితే ఇది మేం సువా నుంచి మేము ఒక మ్యూజియంకి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది.

ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడు అక్కడ మనుషుల్ని చంపుతారని ఎలా తెలిసిందంటే ఆ మ్యూజియంలో ఒక షూ ఒకటి సగం కొరికి ఉన్నది అక్కడ పెట్టారు. అది ఎప్పుడో ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గురువు విదేశాల నుంచి వచ్చాడట. అతను మతం గురించి చెప్పడానికి ఒక ఉపదేశకుడుగా వచ్చాడు. ఈ అటవీక ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ ఆయనని చంపేసి ఆయనని అలాగే ఉడకపెట్టేసారట. ఆయన షూ సోల్ మాత్రం ఎంతసేపటికి అసలు ఉడకలేదట. ఒక ఆటవికుడు దాన్ని తీసి గట్టిగా కొరికాడట. ఆ కోరికనది దాన్ని అలాగే ఉంచి నేడు మనకు సువా మ్యూజియంలో చూపిస్తున్నారు. అప్పట్లో అట్లా మనుషుల్ని బాగా తినేవాళ్ళట. ఆ Shoe 👞 sole చెప్పు తోలు ఆకారంలో ఉన్న వస్తువు మనకు కనిపిస్తుంది. మనకు కనిపించే షూ సోల్ కచ్చితంగా మనిషిదే. పళ్లతో కొరికినట్లుగా తెలుస్తుంటుంది. ఆ కాలం ఒక వెయ్యి సంవత్సరాల క్రిందటిది అయ్యుండచ్చు. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇక్కడ మనుషులని తినే వాళ్ళు ఉన్నారని అక్కడ వాళ్ళు కొంతమంది చెప్పుకుంటున్నారు.

అయితే దీనికి సంబంధించి ఒక అమ్మాయి గురించి చెప్పాలి. ఒకరి ఇంటికి వెళ్ళాలని, ఆ సువా పట్టణానికి వెళ్దాం అని చెప్పి బస్టాండ్‌కి వెళ్ళాము. బస్టాండ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆవిడ కూర్చొని ఉంది. అప్పటికే సాయంత్రం 6:30 – 7.00 గంటలు అవుతుంది. చీకటి పడుతోంది. ఆమె చేతికి 10 వేళ్ళకి 10 ఉంగరాలు పెట్టుకుని ఉంది. “అమ్మా, నువ్వు ఇంత చీకటి వేళలో ఇంటి వరకు వెళ్లేసరికి ఎంత టైం పడుతుంది?” అని అడిగాను “10 గంటలు కావచ్చేమో” అని తను అంది. అప్పుడు నేను “నువ్వు 10 వేళ్ళకి ఇలా ఇంత పెద్ద పెద్ద ఉంగరాలు పెట్టుకున్నావుగా బంగారంతో చేసినవి, మరి ఎవరైనా దొంగ నీ వెంబడి పడితే ఏం చేస్తావు?” అన్నాను. అప్పుడు నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయని ఆన్సర్ ఆ అమ్మాయి చెప్పింది. ఆ ఆన్సర్ విని నిజంగా ఆశ్చర్యపోయాను. “ఎవరైనా దొంగ వచ్చి నన్ను ఆ ఉంగరాలు ఇవ్వమని అడిగితే, నేను వాడిని చంపేస్తాను” అంది. ‘అబ్బా ప్రతి ఒక్కరు అంత ధైర్యంతో ఉంటే బావుంటుంది’ అని నాకనిపించింది, అదే సమయంలో కాస్త కర్కశంగా కూడా అనిపించింది నాకు. అయితే ఆమెను చూస్తే లావుగా ఉన్నప్పటికీ, చాలా నిజంగా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది.

మేము ఆమెతో పాటు ఆ బస్సు ఎక్కి నగరానికి వెళ్లి అక్కడ కలవాల్సిన వారిని కలిసి, ఒక అర్ధగంట సేపు ఆ రోడ్ మీద తిరిగి అక్కడ ప్రదేశాల అందాలని చూసి, మరో గంట తర్వాత మా బసకి చేరాము.

తిరిగి వచ్చిన తర్వాత మాకు – వారి ఈ సాంప్రదాయ పద్ధతిలో ఉన్న వంటల గురించి, వారి దేశభాషల గురించి, వారి గురించి, హిస్టరీ కూడా చాలా చెప్పారు. అవన్నీ విని మేము తిరిగి మా గదికి వచ్చేసాం. మూడవ రోజు మేము ఆ దగ్గరలో ఉన్న సువా సిటీలోని మ్యూజియం చూశాము. తర్వాత అక్కడ ఉన్న ఒక పెద్ద బిల్డింగ్, పార్లమెంట్ బిల్డింగ్ ఇవన్నీ కూడా చూసేసి వెనక్కి వచ్చాం. అయితే నాకు ఒక చిన్న కోరిక కలిగింది. అదేంటంటే ఆ ద్వీపం చుట్టూ కారులో వెళ్లాలని! ఆ అమ్మాయి ఒక కారు మాట్లాడింది. అందులో మేము నలుగురం షేర్ చేసుకొని ఆ సువా ద్వీపం చుట్టూ తిరిగాం.

ఈ ద్వీపం చుట్టూ తిరుగుతున్నప్పుడు – రకరకాల వంటలు చూస్తూ, వాటిని రుచి చూశాము. ఒక విధమైన గడ్డలు ఉన్నాయి అక్కడ. ఆ గడ్డలని వాళ్ళు వండుకొని తింటారంట. స్టార్చ్ లాగా ఉంటుంది. ఆ గడ్డలు మనకు దొరకవు, అక్కడ స్పెషల్ అవి. మేము కూడా ఆ ఉడకపెట్టిన గడ్డలు తిన్నాం. చాలా రుచిగా ఉన్నాయి. అక్కడి నుంచి అలా వెళ్తూ వెళ్తూ వెళ్తూ వారి బస్సులు, వాళ్ళ వేష భాషలు ఇవన్నీ చూసుకుంటూ మొత్తం చుట్టేసేసరికి యురేకా అని అరిచింది అర్చన. ఎందుకంటే ఒక ద్వీపం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసింది తను. నాకు కూడా చాలా బాగా అనిపించింది. నాలుగో రోజున మేము అక్కడ దగ్గరలో ఉన్న ద్వీపాలకు వెళ్ళాం. 332 ద్వీపాలు అక్కడ ఉన్నాయి. అయితే ఈ 332 దీపాలలో మేము సుమారు 15 ద్వీపాల వరకు వెళ్ళాము. ఎలా అంటే అక్కడి నుంచి మనకు చిన్న చిన్న పడవలు క్రూయిజ్ ట్రిప్‍లా ఉన్నాయి.

ఒక 50 మంది పట్టే చిన్న చిన్న పడవలు ఉన్నాయి. మేము ఒక ద్వీపానికి వెళ్ళాము. ద్వీపానికి వెళ్లేటప్పుడు నాకు అక్కడ ఒక ఆవిడ వీల్ చైర్‌లో కనిపించింది. ఆ వీల్ చైర్‌లో ఉన్న ఆవిడకి రెండు కాళ్లు లేవు. కొడుకు కూతురు ఇద్దరు ఆ వీల్ చైర్‌ని తోస్తూ ఈ పడవలోకి ఎక్కించారు. నేను ఆవిడని అడిగాను. “మీరు రెండు కాళ్లు లేకున్నా ప్రపంచం చూడడానికి చాలా బాగా వచ్చారు” అని నేను అంటే, “అవును నాకు ప్రపంచ పర్యటన చేయాలని చాలా ఇష్టం. నాకు కాళ్ళు లేకపోయినా నా కొడుకు కూతురు ఉన్నారు. వీళ్ళని పట్టుకుని ప్రపంచమంతా తిరగాలనేది నా కోరిక” అని ఆమె చెప్పేసరికి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను.

కాళ్లు చేతులు అన్ని బాగుండి కూడా తిరగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఆవిడ కోరికను మాత్రం నిజంగా చాలా ఆశ్చర్యమేసింది. అక్కడ ఆమెతో మాట్లాడాకా, దగ్గరలోని మరో ద్వీపానికి వెళ్ళాం. ఆ ద్వీపంలో అటవీ జాతుల వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతీ పౌర్ణమికి పూజలు చేస్తారట. అక్కడే ఉన్న 80 ఏళ్ల ఆయన చిన్నతనంలో తాను మనుషులు తిన్నానని నాకు చెప్పాడు. అమ్మో, ఆయనను చూస్తే నిజంగానే భయం కలిగింది.

ఒక చోట మాకు ఒక సమాధి కనిపించింది. ఆ సమాధి గురించి చాలా విచిత్రంగా చెప్పారు. ఆ సమాధిలో ఉన్న వ్యక్తి బతికి ఉన్నప్పుడు 990 మందిని చంపి తిన్నాడట. ఒక్కొక్కరిని తిన్న తర్వాత అక్కడ ఒక్కో రాయిని పేర్చారట. అంటే ఆయన తాను ఎంతమందిని చంపాను అనే లెక్క కోసం రాళ్ళను పేర్చుకున్నాడట. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతన్ని చంపేశారు. తర్వాత కూడా ఆ 990 రాళ్లు అలాగే ఉన్నాయక్కడ. వాటిని చూసి చాలా ఆశ్చర్యమేసింది, ఒక మనిషి 990 మందిని తినడం అనేది చిత్రంగా తోచింది.

మేము ఈ ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఒక ఐదారు రకాల కందగడ్డ లాంటివి గడ్డలు కనబడ్డాయి. వాటిని ఒక పంచ లాంటి గుడ్డలో వేసి, పిండి ఆ ద్రవాన్ని మా అందరికీ చిన్న చిన్న దోనెలలో పోసి తాగమని ఇచ్చారు. చాలామంది ఆ ద్రవాన్ని తాగారు. వారిలో విదేశీయులు అధికం. మేము 50 మంది ఉన్నాం, మా 50 మందిలో సుమారు 30 మంది వరకు తాగినట్టున్నారు. నేను మాత్రం తాగలేదు. చూస్తూ కూర్చున్నాను. తర్వాత అక్కడ మాకు భోజనం ఏర్పాటు చేశారు. ఆ సాయంత్రం ఏర్పాటు చేసిన భోజనాలలో కూడా ఆల్మోస్ట్ ఈ భూమి అడుగున వండిన పదార్థాలే మాకు పెట్టారు. అక్కడ దాన్ని ఓ డెలికసి అని అంటారు. అంటే ఆ రుచికరమైన వంట ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఒక ఫిజీ లోనే దొరుకుతుందని చెప్తారు.

అక్కడ మేము రాత్రి 9 – 10 గంటల వరకు ఉన్నాం. తర్వాత రాత్రి పదింటికి మమ్మల్ని మళ్ళీ పడవ ఎక్కించారు. అటు ఇటూ చెట్లూ, చేమలు, పొలాలు కనబడ్డాయి. అది చాలా భయంకరమైన రాత్రి అనిపించింది నాకు. నేను భయపడ్డాను కూడా. చిమ్మ చీకటి, ఏమీ కనిపించట్లేదు. వీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారో అర్థం కావట్లేదు అని అనుకున్నాం కానీ చాలా సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత మేము మా రిసార్ట్‌కి వెళ్లి పడుకున్నాము.

ఐదో రోజున రిసార్ట్ వాళ్ళు ఒక స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేశారు. ఆ స్పెషల్ డిన్నర్‌లో వివిధ దేశాల నుంచి ఆ రిసార్ట్స్ కొచ్చిన వాళ్ళందరినీ ఒకరికొకరిని పరిచయం చేశారు. అందులో ఒక భాగంగా వాళ్ళ డాన్స్ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. ఆ డాన్స్ ఏర్పాటు చేసినప్పుడు మాత్రం ఆ మనుషులు అందరూ – మన సినిమాలలో చిన్నప్పుడు చూసిన చిన్న చిన్న మనుషుల్లా అనిపించారు. బాగా లావు ఉన్నారు వాళ్ళు. గడ్డితో కట్టిన స్కర్ట్స్ వేసుకొని ఆ రోజు రాత్రి వాళ్ళు డాన్స్ చేశారు. ఆ ఆటవిక బృందం వాళ్ళు చాలా చక్కగా నాట్యం చేశారు.

ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మేమందరం ఫొటోలు దిగాం. తర్వాత ప్రతి ఒక్క దేశం వాళ్ళని తమ జాతీయ గీతం పాడమని చెప్పారు. అప్పుడు నేను మన జాతీయ గీతం పాడి వినిపించాను. న్యూజిలాండ్ నుంచి వచ్చిన ఇద్దరు టూరిస్టులు వచ్చి నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. ఎందుకని అడిగితే, “మాకు జాతీయగీతం రాదు, మేము పుట్టి పెరిగింది ఇక్కడే కానీ వాళ్ళు జాతీయగీతం పాడమన్నప్పుడు ‘అయ్యో ఇండియన్ ఆరిజన్ వాళ్ళం అయ్యుండి మనం పాడలేకపోతున్నామ’ని బాధ కలిగింది” అని అన్నారు. నేను జాతీయగీతం పాడినందుకు వాళ్ళు నన్ను ఎంతో అభినందించారు. ఆ తర్వాత ఆ ఫారినర్స్ కూడా నన్ను అభినందించారు. ఎందుకని అంటే “ఎంతో దూరమైన ఇండియా నుంచి మీరు వచ్చి ఇక్కడ పాడటం అనేది మాకు చాలా సంతోషకరం” అన్నారు. “ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి దగ్గర దేశాలలో నుంచి వచ్చినవాళ్ళే, మీరు ఒక్కరే చాలా దూరం నుంచి వచ్చారు” అని చెప్పి మమ్మల్ని స్పెషల్ గెస్ట్ లాగా చూసుకున్నారు.

అక్కడ మాకు ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ముగ్గురు (తల్లి తండ్రి కూతురు) తెలుగువాళ్ళు పరిచయమయ్యారు. ఆస్ట్రేలియా నుంచి వాళ్ళు ఫిజీ ఐలాండ్స్ చూడ్డానికి వచ్చారట! నిజంగా చాలా చాలా సంతోషం అనిపించింది. మన తెలుగు వాళ్ళు అక్కడ కనిపించడం అనేది ఆనందం కలిగించింది. వాళ్లు ముగ్గురు, మేము ఒక హోటల్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళ రూం నెంబర్ కనుక్కొని వాళ్ళ రూమ్‌కి వెళ్ళాను. నేను అనుకోకుండా ఒక బుక్ పట్టుకెళ్ళాను. వాళ్లకి ఆ బుక్ ఇస్తే వాళ్ళు చాలా చాలా సంతోష పడిపోయారు. “మీరు ఇండియా నుంచి బుక్ తీసుకొచ్చి మాకు ఇవ్వటం అనేది గొప్ప విషయం” అన్నారు. అక్కడ వాళ్ళతోటి ఆ రోజు రాత్రి అంతా గడిపాం, వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేవి మాట్లాడుకున్నాం. వాళ్లకు కూడా దేశాటన అనేది చాలా ఇష్టమట, కొన్ని దేశాలు చూసామని చెప్పారు. వాళ్ళు ఇప్పటికీ నాకు ఫ్రెండ్సే. మరుసటి రోజు కూడా మేము వాళ్ళతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ కలిసి చేశాము. చేసిన తర్వాత అందరం విడిపోయాం అన్నమాట కానీ వాళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత కూడా నాకు ఎప్పుడూ ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. నా గురించి వాళ్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ మంత్ కూడా తను ఆస్ట్రేలియా నుంచి వచ్చినప్పుడు నన్ను కలిసి వెళ్లారు. అయితే వాళ్ళిద్దరూ ఒకసారి రాలేదు. వైఫ్ అండ్ హస్బెండ్ ఒకసారి వాళ్ళ వారు ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ప్లాటు గురించి అని చెప్పి మావారి దగ్గరికి వచ్చి సజెషన్ తీసుకొని ఆయన వెళ్లారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ కూడా చాలా చక్కగా మాతోటి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. ఈ మధ్యన ఒక బుక్ పబ్లిష్ చేసినప్పుడు కూడా అతను – “Wow amazing Narmada gaaru. Really your eyes and foot are so great now what you gain and achieved are with them only. Really i am proudly says you a great traveler 🙏🙏🙏🙏 you and your husband both are together achieved that’s wonderful. God will give you and your family more strength and health to achieve balance of 9% of world 🌎 also travel. Congratulations💐💐💐🙏🙏” అంటూ అభినందనలు తెలిపారు నాకు.

అలా మేము మా పర్యటన ముగించుకుని ఎన్నో అనుభూతులతో ఇండియాకి తిరిగి వచ్చేశాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here