అందాల రాక్షసి

0
1

[dropcap]కె[/dropcap]రటాలు ఉవ్వెత్తున ఎగసిపడే సముద్రంలా ఆనందంతో ఎగసి పడుతోంది రవి మనస్సు, తన చిరకాల వాంఛ నెరవేరబోతోనందుకు. తనని చూసి నవ్వే వాళ్ళ నోరు కట్టించేందుకు. చాలా కష్టాలే పడ్డాడు ఈ ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి! తను ఆ కడు పేదరికం నుంచి బయటపడటానికి. అన్నింటికి మించిన ఆనందం తనకు బాగా నచ్చిన డబ్బుల మామయ్య కూతురు.. ఐశ్వర్య, తనతో పెళ్ళికి ఒప్పుకోవడం. తన సౌందర్యరాశి తండ్రి, రాఘవ మామ దగ్గర్నుంచి పిలుపు రాగానే.. ఒక్కసారిగా ఎగిరి గంతేసినంత పనైంది రవికి. తక్షణమే రెక్కలు కట్టుకొని, పట్నం నుంచి ఎగురుతూ రావలనిపించింది. నిజానికి అతనికవి పెళ్లి చూపులేమీ కావు. చిన్ననాటి నుంచి ఐశ్వర్యను చూస్తూ ఆమె మీదున్న ప్రేమను తన మనసులో దాచుకున్నాడు. వాస్తవానికి తన కోసమే ఈ జాబ్‌ను సంపాదించాడు. కారణం.. తన స్టేటస్ కు తగ్గినట్లు లేకపోతే, రాఘవ మామ పిల్లనివ్వడు కాబట్టి. మామ దగ్గర్నుంచి కబురు రాగానే గాల్లో తేలిపోతూ ఊరికి రావడానికి సిద్ధమయ్యాడు రవి.

“వెళ్ళేదారిలో అమ్మమ్మను కలసి పో బిడ్డా” అంటూ వచ్చే ముందు అమ్మ చెప్పిన మాటలకు, రవికి ఒళ్ళు చిర్రెత్తు కొచ్చినట్టయింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోవడంతో అమ్మమ్మే అన్నీ తానై తన బాగోగులు చూసుకున్నా.. ఇప్పుడవేమీ గుర్తుకు రాలేదు రవికి. ముందు తన కాబోయే భార్యను మాత్రమే చూడాలని ఉన్న తనకు, ఇప్పుడు అమ్మతో గొడవపడి, మనసు పాడు చేసుకొనే దానికన్నా.. పోయేముందు ఓసారి ముసలిదాన్ని చూసి పోతే అయిపోతుందనుకొని, సరేనని చెప్పి బయలుదేరాడు.

మనవడొస్తున్నాడని తెలిసేసేసరికి కమలమ్మ అన్నీ వంటలు చేసి పెట్టింది. “ఎన్నడూ లేనిది, మనవడు వస్తుండని ఇయ్యల ఇంటికడా ఉంటున్నవా” అని పక్కింటోలు అడిగినప్పుడు గుండె నిండా ఉన్న ఆనందాన్ని కళ్ళల్లో చూపిస్తూ అవునని చెప్పింది. రవి ఇంటికి రాగానే, ఎదురుగా ఉరికింది. “కొడుకా నౌకరీ వచ్చిందట కదరా! ఇంకేంది మీ అమ్మ కష్టాలు తీరిపాయే! మీరు సల్లగుంటే నాకదే పదివేలు బిడ్డా. రా అయ్యా కాళ్ళు కడుక్కో. ఇంత బువ్వ తిందువు దా!” అన్నది మనవడిని దగ్గరకు అరుముకుంటూ.

“అరే అమ్మమ్మ, అమ్మ నీకు చెప్పలేదా..? నేను రామపురం పోవాలి. రాఘవ మామ పిలిచిండు. వాళ్ళ బిడ్డని చుస్కొనికి పోతున్న.” అన్నాడు రవి. “ఐనా అట్లెట్లా బిడ్డా..? మన ఇలాకా నుంచి, ఓ అయిదారుగురిని ఏంటేసుకొని పోయి, మా పిల్ల అనిపించుకుని రావాలే గానీ, ఒక్కనివే పోవుడెందిరా..?”

“హా..! రాఘవ మామ హోదా ఏంది. మనోళ్ల తాహత్ ఏంది. ఐనా ఎవరు రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చే..ఇంకా ఎవరి అవసరం ఉండదు లేవే. నేను త్వరగా పోవాలి. ఒకవేళ మళ్లీ పట్నం  తిరిగెళ్ళేటప్పుడు వీలుంటే ఇటునుంచి వస్తానులే. అక్కడ నాకోసం వాళ్ళందరూ ఎదురు చూస్తుంటారు. ఇగ ఉండు.” అని చెప్పి బండెక్కిండు రవి.

ఎన్నో ఏళ్లుగా తను కన్న కల నేడు నిజమవుతోన్నందుకు.. ఎంతో ఆనందపడుతూ, నిమిషం నిమిషానికి గడియారం చూసుకుంటూ బైక్ నడుపుతున్నాడు రవి. కాసేపట్లోనే అతని ఆశల మీద నీళ్ళు చల్లినట్టయింది. పెట్రోల్ అయిపోయి, బైక్ ఆగిపోయింది. ఐశ్వర్యను చూడబోతున్నానే సంతోషంలో బైక్‌లో పెట్రోల్ ఎంత ఉంది అనే విషయమే పట్టించుకోలేదు తను. రామపురానికి ఇంకా 9 కి.మీ లు వెళ్లాలి. దారిలో పెట్రోల్ బంక్ లేమీ ఉండవు. కనీసం ఆ మార్గంలో వేరే రవాణా సౌకర్యం కూడా లేదు. సరే, రాఘవ మామకు ఫోన్ చేసి చెబితే ఎవరినైనా పంపుతాడు కదా అనుకోని కాల్ చేయబోయి, ఒక్కసారిగా ఆగిపోయాడు. బైక్‌లో పెట్రోల్ కూడా వేయించుకోలేని స్థితి  చూసి మళ్ళీ చీప్‌గా చూస్తాడేమోనని నిలిచిపోయాడు. ఊర్లో ఉన్న స్నేహితులను అడగడానికి కూడా వీలు లేదు.. “ఏంట్రా ఎప్పుడోచ్చావో కూడా చెప్పకుండా.. పెళ్లి చూపులకి పోతున్నవా” అని అంటారేమోనని ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు.  ఆలస్యం అయ్యేలా అనిపించింది. లేట్ చేసినందుకు అమ్మమ్మ మీద కోపం వచ్చింది. తల్లి మీదున్న చిరాకు ఇంకాస్త ఎక్కువైంది. అసలు  అమ్మమ్మ దగ్గరికి వెళ్లే ప్రోగ్రాం పెట్టకపోతే.. నాకు పెట్రోల్ గురించి గుర్తుండేదేమోనని తల్లిని తిట్టుకున్నాడు. అసలేంది వీళ్ళు. నన్ను, నన్నులా బతకనివ్వడం లేదు. రాను రాను వీళ్ల నస ఎక్కువైపోతుంది. నాకు ఐశ్వర్య తో పెళ్లి, అయితే కానీ.. తరవాత వీళ్ళతో ఉండేదేవరు! అని అనుకుంటూ ఉండగానే అటువైపుగా  వస్తోన్న ఓ ముసలి వ్యక్తి.. “ఏమైంది బాబు  బండి ఆగిపోయిందా” అని అడిగాడు రవిని. దానికి బదులుగా రవి, అవునంటూ తల ఊపాడు.

“ఈ దారిలో ఏవలుండరు బాబు. నువ్వు పొద్దుగుకే దాకా సాయం కోసం సూసిన ఏమి లాభం ఉండదు. దా, నాతో నడుసుకుంటా”, అంటూ బయలు దేరారు ఇద్దరూ. “ఏం బాబు ఇంతకీ ఎటు పోతున్నావు’ అన్న ఆ ముసలి వ్యక్తి ప్రశ్నకు.. రవి జవాబిచ్చాడు. “అవునా! అయితే పెళ్లి సూపులకి ఇంట్ల పెద్దలతో కలసి పోవాలి కదాయ్యా. ఒక్కనివే పోతున్నవు మరి? నీకు అయినవారెవరు లేరా” అన్నాడు. ఆ ప్రశ్నను దాట వేసిన రవి.. “సరే తాత ఇంతకీ మీరేటు వెళ్తున్నారో చెప్పనేలేదు” అని అడిగాడు.

“నేనా! రామపురం పోతున్నా. నా మనవడు పట్నం నుంచి వస్తుండు. తోల్కారానికి పోతున్న” అన్నాడు. “ఏంటి నడుస్తూ వెళుతున్నారా” అన్నాడు రవి నవ్వుతూ. “అవును నా మనవడు పట్నంలో సదువుకుంటుండు. వాడు ఎన్నడూ ఊళ్ళకు తిరిగి వస్తున్నా.. నేనిట్లా రామపురం దాకా ఎదురెళ్లి తీసుకొస్తూ ఉంటా. అయినా సంక్రాంతికి వస్తానన్నోడు.. ఏమైందో ఏమో నిన్న రాతిరి ఫోన్ చేసి తెల్లారి ఊరికి వస్తున్న అని చెప్పిండు. నా ముసలి దానికి ఒక్కటే రంది.. తల్లి తండ్రి లేని పోరడు. ఏమైందో పిలగానికి. ముందు చెప్పకుండా ఇట్లా ఎందుకు వస్తుందో  అని పొద్దనుంచి మనసు మనసున పడుతలేదు. నేల మీద కాలు ఒక దగ్గర ఆగక ఇట్లా బయలు దేరినా ఇగ. వాడిని చూసేదక నాకు నిమ్మలం ఉండదు కొడకా” అంటూ కళ్ళ నిండా నిండిన కన్నీళ్లతో అన్నాడు.

“ఏమై ఉండదు లే తాత. నువ్వు నిమ్మలం ఉండు.” అని చెప్పి ముందుకు నడుస్తుండగానే.. ఆ ముసలి వ్యక్తి మనవడు, వారికి ఎదురుగా వచ్చాడు. తాతను గట్టిగా హాత్తుకున్నాడు. “తాత, నీకు రాత్రి చెప్పాను కదా. నేనే వస్తాను అని. చూడు ఇంత ఎండలో చెమటలతో ఎందుకొస్తున్నావు” అంటూ జేబులో నుంచి కర్చీఫ్ తీసి తాత ముఖాన్ని తుడిచాడు. “ఇకనుంచి మన కష్టాలు అన్ని తీరినట్టే తాత. నాకు ఎస్.ఐ ఉద్యోగం వచ్చింది” అని చెప్పగానే తాత ఆనందంతో మురిసి పోయాడు. “నీ కళ్ళలోని ఆనందాన్ని ఇలా నేరుగా చూడటానికే నీకు స్వయంగా చెప్పడానికి వచ్చిన. ఇక మీరు నాతోనే ఉండొచ్చు. వరంగల్ లో పోస్టింగ్. నేను వెళ్లి మనకు ఉండటానికి అక్కడ ఒక రూమ్ చూసి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. రేపు నువ్వూ, నాయనమ్మ ఇక నాతో వచ్చేయడమే” అన్నాడు. పక్కనే ఉన్న రవి, “కంగ్రాట్స్ బ్రో” అని చెప్పి తనను తాను పరిచయం చేసుకున్నాడు. “నాక్కూడా ఎస్.ఐ ఉద్యోగం వచ్చింది బ్రో. హైద్రాబాద్ లోనే పోస్టింగ్” అన్నాడు రవి. అలా ఒకరికొకరు అభినందనలు తెలుపుకొని వారి వారి మార్గాల్లో ప్రయాణమయ్యారు.

బండిని నెట్టుతూ తీసుకెళ్లడం మళ్ళీ మొదలెట్టాడు రవి. ఒక కి.మీ దూరం వెళ్ళగానే నీరసించి పోయాడు. ఒక చెట్టు కింద బైక్‌ను నిలిపి కాసేపు విశ్రాంతి కోసం ఆగిపోయాడు. ఆకలేస్తుంది. అమ్మమ్మ అన్నిసార్లు బ్రతిమిలాడిన, ఏమీ తినకుండా వచ్చడనేది అప్పుడు గుర్తొచ్చింది తనకు. మరోవైపు తనని బాధపెట్టి వచ్చినందుకు తనకు మరింత బాధేసింది. ఇందాక దారిలో కలిసిన తాత మనవళ్లు గుర్తొచ్చారు. ఆ వ్యక్తి జాబ్ రాగానే తన వాళ్ళకి చెప్పడానికి ఎంతో ఆనందంతో అలా వచ్చాడు. మరి నేనేంటి అమ్మమ్మతో కాసేపయిన గడపకుండా వచ్చేసాను. అమ్మ మీద ఎందుకు చిరాకు పడ్డాను. చిన్నప్పటి నుంచీ అమ్మమ్మ చేసిన త్యాగాలన్నీ ఎలా మరిచిపోయాను. అసలెందుకు అంత మూర్ఖంగా ప్రవర్తించాను అని తనను తాను అసహ్యించుకున్నాడు. ‘మొన్నటిదాకా నేను కూడా ఒక జాబ్ లేని నిరుపేదనే. ఆరోజు నన్ను ఈ రాఘవ మమాయ్య వాళ్ళు కనీసం లెక్క చేయలేదు. ఐశ్వర్య ఏనాడు నా వంక కన్నెత్తి చూసిందే లేదు’ అనుకున్నాడు రవి. వీళ్ళు తనను ఇష్టపడ్డారో లేక తన ఉద్యోగాన్నో అనేది అర్థం కాలేదు రవికి. ఏవేవో ఆలోచనలు తన మనసును చిన్నాభిన్నం చేసాయి. ఉద్యోగం వచ్చకా అమ్మతో ఓ గంట సేపు కూర్చొని మాట్లాడింది లేదు. ఊరికి వచ్చి, తనకేమీ లేనప్పుడు సాయపడ్డ స్నేహితుల దగ్గరికి కూడా పోలేదు.  చిన్ననాటి నుంచి నాన్న లేని లోటుని తీర్చిన అమ్మమ్మ దగ్గర కాసేపు ఉండలేదు. మరి తనకంటూ ఒక గుర్తింపు వచ్చాకా తనను లెక్క చేసే మనుషుల దగ్గరికి మాత్రం ఎందుకు వెళ్తున్నాననే ప్రశ్నలతో సందిగ్ధంలో పడిపోయాడు. ఇంతలో ఏదో హారన్ సౌండ్ వచ్చినట్టు అనిపించి వెనకకు తిరిగాడు. వెనకాల నుంచి ఓ బైక్. ఇందాక తనకు ఎదురైన వ్యక్తే.  బైక్ వచ్చి సరిగ్గా రవి ముందు ఆగింది. బైక్ పై నున్న ముసలి తాత మనవడు.. ముందు బ్యాగ్‌లో నుంచి పెట్రోల్‌తో నింపి ఉన్న బాటిల్ తీసి రవి కిచ్చాడు. అది చూసిన రవికి ప్రాణం లేచి వచ్చినట్టైంది.

“మీరు.. మీరూ నాకోసం తెచ్చారా ఇది? మళ్లీ నాకోసం తిరిగొచ్చారా..?” అన్నాడు రవి.

“హా అవును” అన్నాడు అవతలి వ్యక్తి (నవ్వుతూ).

“థాంక్స్ అండి. చాలా అలసిపోయాను. మీరు రాకపోతే ఇలా బండిని తోసుకుంటూ వెళ్లేసరికి ఏ టైం అయ్యేదో.”

“సొంతూరులో అయినవారెవరు లేని పిలగాడు పాపం, ఒక్కడే తనకు పెళ్లి సంబంధం మాట్లాడుకోవడానికి పోతున్నాడని తాత బాధపడుతూ ఇంటికి కూడా వెల్లలేదు. నేరుగా తెలిసిన వాళ్ళింటికి తీసుకెళ్లి ఇలా బైక్ అడిగి, పెట్రోల్  ఎరేంజ్ చేసి నన్ను పంపించాడు మీ దగ్గరికి” అని చెప్పాడు అతను. “మీరు నా పాలిట దేవుడిలా మారారు ఈరోజు” అన్నాడు రవి.

“అయ్యో దానుదేముంది. మనుషులకు, మనుషులు కాకపోతే ఎవరు సాయపడతారు చెప్పండి. సర్లెండి మీకు  ఇప్పటికే ఆలస్యమయింది. ఇక బయలుదేరండి” అన్నాడు అవతలి వ్యక్తి. అతనికి మరోమారు థాంక్స్ చెప్పి సరేనంటూ బయలుదేరాడు రవి.

‘ఎవరో మనకు సంబంధమే లేని మనుషులు. పాపం ఎంత మంచివారైతే అంతదూరం వెళ్లి మళ్లీ నాకోసం తిరిగొస్తారు. ఏమీ ఆశించకుండా ఇలా మనుషులను మనుషులలా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారా? అది కూడా కొంతమంది స్టేటస్ తగినట్లు లేకపోతే కనీసం మొహం కూడా చూడకుండా తిప్పేసుకొని పోయె రోజుల్లో.. నా నుంచి ఏ సాయం తిరిగి కోరకుండా.. మనకు సాయపడే వాళ్ళు ఉన్నారని ఇతనిని చూస్తేనే అర్థం అవుతోంది. ఇతనేంటి నా కుటుంబం అంతా అంతే కదా మొదటి నుంచి ఒకేలా ఉన్నారు. అందరికీ సాయపడుతూ వచ్చారు. రాఘవ మామ కుటుంబంలా అయితే అస్సలే లేము మేము’ అనుకున్నాడు రవి.

రాఘవ మామ ఇల్లు వచ్చేసింది. ఐశ్వర్య తనకోసం గేటు దగ్గరే నిల్చొని ఎదురుచూస్తోందేమోననుకున్న రవికి బైక్ ఆపగానే పరిగెత్తుకుంటూ దగ్గరికొచ్చిన అత్తను చూసి దిమ్మ తిరిగిపోయింది. ఎన్నడూ తనతో మాట కూడా మాట్లాడని ఆమె, అలా ఆనందంతో ఎదురుగా వచ్చి ఆహ్వానించడం అతనికి కొంత వింతగా అనిపించింది. చిన్ననాటి నుంచి ఎన్నోసార్లు ఐశ్వర్యను చూడటానికి ఈ బాట నుంచి వెళ్ళినా.. చుట్టం అని కూడా చూడకుండా మొహం పైనే టప్ మని డోర్ వేసేది ఆమె. కానీ ఇప్పుడు తన ప్రవర్తన అందుకు పూర్తి భిన్నంగా ఉండటం రవికి మింగున పడలేదు. గుమ్మంలో రాఘవ మామ ఎదురొచ్చి, “రా అల్లుడు ఇంట్లోకి” అంటూ కుర్చీ వేసి కూర్చోబెట్టడం మరింత కొత్తగా అనిపించింది తనకు. ఒకప్పుడు ఏదో ఫంక్షన్‌లో భోజనం వడ్డిస్తుంటే.. “ఇంకెవరు లేరా? వేరే వాళ్ళని పిలవండి” అని అన్న వ్యక్తే ఇప్పుడు తననిలా గౌరవించడం ఎక్కడో తేడా కొట్టింది తనకు. ఉదయం నుంచి ఐశ్వర్యను చూడాలన్న ఆసక్తి, కుతూహలం ఇప్పుడేందుకో గాని లేదు రవికి.

“ఏం బాబు అమ్మాయీ నువ్వూ  అలా మేడ మీదకెక్కి  కాస్త ప్రశాంతంగా మాట్లాడుకొండి” అని చెప్పి, “అమ్మాయ్…ఇలా రా” అని పిలవగానే ఐశ్వర్య, హాల్ లోకి వచ్చింది. దించిన తల ఎత్తకుండానే చకచకా నడుస్తూ తనను దాటి మేడ వైపునకు వెళ్ళింది. వెంటనే అత్త అందుకొని.. “ఏం అయ్యా వెళ్లవు. పైన చల్ల గాలి లో అలా కాసేపు గడిపి రండి నేను కాసిన్ని కాఫీ నీళ్ళు పంపిస్తా అప్పట్లోపు” అంది.

మేడపైన బావ మరదళ్లిద్దరు చెరో వైపు కూర్చున్నారు. చిన్నప్పటి నుంచి దేవతలా కనిపించిన తన అందాల రాశి ఇప్పుడు తన కళ్ళకు రాక్షసి లాగా కనిపిస్తోంది. రాఘవ మామ అద్దాల మేడ ఓ రాకాసి కొంపలా అనిపిస్తోంది. చల్లటి గాలి వీస్తోన్నా.. ఉక్కపోత పోస్తూ ఒళ్లంత చెమటలు పడుతున్నాయి రవికి. లోపల ఏదో వెలితి. తానై, తాను తనదేదో పోగొట్టుకుంటునట్టుగా.. అనిపిస్తోంది తనకు. ఏదో గాలి కూడా దూరని ఓ గుహలో చిక్కుకున్నట్టు అనిపిస్తోంది. చుట్టూ వాతావరణం రవిని ఊపిరి కూడా ఆడనంత ఇబ్బందిగా మార్చి వేస్తోంది. ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా దిగ్గున లేచి నిలుచున్నాడు. ఐశ్వర్య కళ్ళలోకి చూస్తూ..అసలది ప్రేమో, కాదోనని  తేల్చుకోవాలనుకున్నాడు. పొద్దున అమ్మమ్మ కళ్ళల్లో కనిపించిన స్వచ్ఛమైన ప్రేమ, ఐశ్వర్య కళ్ళల్లో కొంచం కూడా కనిపించలేదు. ఆమెదే కాదు, వాళ్ళ కుటుంబమంతా చూపేది నిజమైన ప్రేమ కాదని అనుకున్నాడు. వారు ప్రేమించేది తన ఉద్యోగాన్ని.. భవిష్యత్‌లో తాను సంపాదించబోయే డబ్బునని తెలుసుకున్నాడు. ఉద్యోగం రావటం ఆలస్యం అయిందనుకున్నాడు గాని, ఆ సంబంధం తనకు సెట్ అవ్వదని తెలుసుకోవడం ఆలస్యమైందని గ్రహించాడు. ఇంకేమాత్రం ఆలస్యం అవ్వకూడదని నిర్ణయించుకొని, జీవితంలో మొట్ట మొదటిసారి ఐశ్వర్యతో మాట్లాడాడు. “నేను మీరు చూపించే విలువైన ప్రేమకు అనర్హుడినని అనిపిస్తోంది. ఈరోజు నాకున్న ఈ జాబ్, రేపు ఉంటుందో లేదో. మీరు అనుకుంటున్నట్టు, రేపటి రోజు మిమ్మల్నీ నేను గొప్పగా చూసుకోగలనో లేదో. మీ తాహతుకు నేను సరితూగననిపిస్తోంది. డబ్బుతో నిలబడే బంధం మా కుటుంబానికి సెట్ అవ్వదు. ఆస్తి, ఐశ్వర్యాలకు కూడా లొంగని ప్రేమ మాకు సరిపోతుంది. మీ మనసును నొప్పిస్తే క్షమించండి” అని చెప్పి.. దబ దబా ఢాబా నుంచి కిందకు దిగుతూ వచ్చాడు. మెట్ల వద్దే నిల్చొని వింటోన్న అత్త, మామలతో “డబ్బు ముఖ్యమే అండి, కానీ బంధాలు, వాటి విలువలు అంతకంటే గొప్పవి. ప్రేమ అనేది కేవలం డబ్బు తో కొనలేమని గ్రహించాను. అటువంటి ప్రేమ ఉన్న దగ్గరకే వెళుతున్నాను” అంటూ, చీకటి పడేసరికి ఇంటికి చేరుకున్నాడు. డబ్బు పాపిష్టిదంటూ అమ్మమ్మ వద్ద మోకరిల్లి తనను క్షమించమని వేడుకున్నాడు రవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here