[అనూరాధ బండి గారు రచించిన ‘అందం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]గు[/dropcap]ర్రపుడెక్కల సౌందర్యం
కళ్ళను కట్టిపడేసి..
కాలువ పొడుగునా కళ్ళు
పచ్చటి ప్రయాణం చేస్తూ..
ఏ ఉనికినో చప్పరిస్తున్న అనుభూతిని
వర్ణించనూలేక వరించనూలేక
నీటవాలిన తూరుపు పిట్టను
ముద్దాడనూలేక బంధించనూలేక
అచేతననై ఉన్న స్థితిలోనే..
నీటి వలయాల్లో సుడులు తిరుగుతున్న
కాంతి తరంగాలు ఒకవైపూ..
ఇంకా కురుస్తూనే ఉన్న
ఊరించే పొగమంచు మరొకవైపూ..
ఏది వదలాలో, దేన్ని వెదకాలో
ఏమిటీ నోరూరు తపనా!
మరెవరైనా ఇంకో
రెండు కళ్ళిస్తే బావుండు;
నోటి ఊటల భాష్యం
భావుకత్వమై పరవళ్ళు పోతూ..
మనసు అనిశ్చల భావోద్వేగాల్లో తడుస్తూ..
ఒక ఆకుపచ్చటి లేత వణుకు
మరొక ఓపశక్యంగాని నిట్టూర్పు
కడకు చిన్నపాటి కదలిక
దృశ్యం మాయం