అందం

0
3

[dropcap]“ఒ[/dropcap]రేయ్ కృష్ణా, ఈ ట్రిప్ లోనైనా శ్యామల అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళరా. నిన్ను ఒకసారి పంపమని చాలా సార్లు అడిగింది. నువ్వు వాళ్ళ మీద కోపంతో ఉన్నావని నా దగ్గర బాధపడింది. ఒకసారి వెళ్ళు నాయనా. లేకపోతే ఆ దూరం అలాగే ఉండి పోతుంది.”

అమ్మ మాటల్లో ఆవేదన కనిపించింది.

రెండు క్షణాలు అమ్మ కేసి చూసాను. ఆరవ ఎక్కం పలక మీద రాసి మాస్టర్కి యిచ్చాకా ఆయన ఏం చెబుతాడా? అని ఆత్రుతగా చూస్తున్న విద్యార్థి మొహంలా ఉంది అమ్మ వదనం. నాకు చాలా బాధ కలిగింది.

ఈసారైనా అమ్మ మాట ఖచ్చితంగా వినాలని నిర్ణయించుకున్నాను.

“నాకు శ్యామల అత్తయ్య వాళ్ళ మీద కోపం లేదమ్మా. పూర్వం అమలాపురంలో నర్సాపురం బస్సు ఎక్కి డైరెక్ట్‌గా శివపురంలో దిగేవాళ్ళం. చించునాడ దగ్గర గోదావరి మీద వంతెన వచ్చాకా, అమలాపురం బస్సులు అన్నీ పాలకొల్లు మీద నుంచే వెళ్తున్నాయి. ఇప్పుడు శివపురం వెళ్ళాలంటే రావులపాలెం వెళ్లి ఇంకో బస్సు ఎక్కి వెళ్ళాలి. రెండు బస్సులు మారాలంటే నాకు బద్ధకం. అంతకంటే ఏం లేదు అమ్మా.”

అమ్మకి సంజాయిషీ ఇచ్చుకున్నాను.

అమ్మ మోహంలో ప్రసన్నత చోటు చేసుకుంది.

“ఈసారి ఇంకో రెండు రోజులు సెలవు పెట్టానుగా. రేపు వెళ్తాను. సరేనా.” అమ్మ చేతిలో చేయి వేసి చెప్పాను. అమ్మ మొహం కార్తీక పౌర్ణమి చంద్రుడిలా వెలిగి పోయింది.

మర్నాడు ఉదయం కాఫీ, టిఫిన్లు అయ్యాకా అమలాపురంలో బస్సు స్టాండ్‌కి వచ్చి రాజమండ్రి బస్సు ఎక్కి రావులపాలెంలో దిగాను. ఒక అరగంట గడిచాకా నర్సాపురం బస్సు వచ్చింది. జనం అంతా ఎక్కాకా ఆఖర్ని నేను ఎక్కాను. చివరి సీట్ ఖాళీగా వుంటే అక్కడ కూర్చున్నాను.

కాసేపటికి బస్సు బయల్దేరింది. నా మనసు గతంలోకి వెళ్ళింది.

***

మా నాన్న చెల్లెలు శ్యామల. శివపురంలో టీచర్‌గా పనిచేస్తున్న మోహన రావుతో అత్తయ్యకి పెళ్లి జరిగింది. నాకు కొంచెం ఊహ వచ్చాకా అమ్మ నన్ను శివపురం తీసుకువచ్చింది. ఎందుకో ఆ ఊరు నాకు బాగా నచ్చింది. ఊరుని అనుకునే ప్రవహిస్తున్న పెద్ద కాలువ, పెద్ద గాలి గోపురంతో ఉన్న నగరేశ్వర స్వామి గుడి, లింగాల వీధిలో ఉన్న జనార్దన స్వామి గుడి నన్ను బాగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటు శ్యామల అత్తయ్య కూతురు వసంత. కళ్ళు తిప్పుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడేది. తను నాకన్నా రెండేళ్ళు చిన్న. ఆమె స్నేహితులు, నాకు కూడా స్నేహితులే. అందరం కలిసి ఆడుకునే వాళ్ళం.

అందుకనే ఎప్పుడూ సెలవులు వచ్చినా శ్యామల అత్తయ్య ఇంటికి వెళ్తానని మారాం చేసే వాడిని. అమ్మనా మాట కాదనలేక పోయేది. బాబయ్యని తోడు ఇచ్చి నన్ను శివపురం పంపేది. బాబయ్య నన్ను శివపురంలో దిగబెట్టి తిరిగి అమలాపురం వచ్చేవాడు.

శివపురంలో దసరా ఉత్సవాలు బాగా చేసేవారు. నగరేశ్వర స్వామి గుడిలో నవరాత్రులు తొమ్మిది రోజులు చాలా భారీగా పూజలు చేసేవారు. చాలా విశాలమైన గుడి. పిల్లలు అందరం చేరి దాగుడు మూతలు ఆడుకునే వాళ్ళం. ఎనిమిది గంటలకు పూజలు అయ్యాకా ప్రసాదాలు పంచి పెట్టె వారు. ఒకరోజు పులిహార, మరోరోజు సెనగలు, ఇంకో రోజు సెనగ పప్పు పెట్టేవారు. దోసిలి నిండా పెట్టేవారు. చాలా రుచిగా ఉండేవి ప్రసాదాలు. నా చేతిలో ప్రసాదం ఇంటికి పట్టుకోచ్చేవాడిని. వసంత చేతిలోని ప్రసాదం మేమిద్దరం తినే వాళ్ళం.

ప్రసాదం శ్యామల అత్తయ్యకి ఇచ్చి, మంచి నీళ్ళు తాగి కంచి కామాక్షి గుడి దగ్గర హరికథో ,బుర్రకథో ఉంటే అది చూసి ఇంటికి వచ్చే వాళ్ళం నేనూ, వసంత. మేము వచ్చే వరకు అత్తయ్య మేలుకుని ఉండేది. దసరా రోజున గడ్డితో ఏనుగు బొమ్మలు చేసి, వాటికి రంగు రంగుల కాగితాలు అంటించి చాలా అందంగా తీర్చి దిద్దేవారు. ఆ ఏనుగు మీద అంబారి కట్టి దాని మీద రాముల వారి ఫోటో పెట్టేవారు. కొన్ని చిన్న ఏనుగులు ఉంటే, కొన్ని చాలా పెద్దవి ఉండేవి. పెద్ద ఏనుగు బొమ్మని కర్రలపై ఉంచి, ఎనిమిది మంది భుజాలపై మోసేవారు. ప్రతి వీధిలోని వారు ఒకో ఏనుగు బొమ్మ చేసేవారు. అన్ని వీధులకు చెందినా ఏనుగు బొమ్మలు ఊరేగింపుగా జనార్దన స్వామి గుడి ముందున్న జమ్మి చెట్టు దగ్గరకు వచ్చి ఆగేవి. ఊరేగింపు నిర్వాహకుల పేర్లు చెప్పి పంతులు గారు జమ్మి చెట్టుకి పూజ చేసేవారు. ఆ తర్వాత మెయిన్ బజార్ మీదుగా ఊరేగింపు సాగేది. మిలిటరీ బ్యాండ్, సన్నాయి మేళం, భజన కోలాటాలు ఊరేగింపులో ఉండేవి. ఇవి కాక ప్రతివీధిలో డాన్సులు, మూజికల్ పార్టీలు ఉండేవి. ఈ దసరా సంబరాలు చూడటానికి శివపురం చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా జనం వచ్చేవారు. మావయ్య నన్ను, వసంతని తీసుకుని ఇవన్నీ చూపించేవారు.

హై స్కూల్ చదువు అయ్యాకా శ్యామల అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడం తగ్గింది. డిగ్రీ అయ్యాకా శివపురం వెళ్ళినపుడు వసంతని చూసి చాలా ఆశ్చర్య పోయాను. మనిషి చాలా పొడుగు అయ్యింది. మేనిచాయ బంగారు రంగులో ఉండి చాలా అందంగా ఉంది. అప్పుడు తను డిగ్రీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది.

“ఎలా ఉన్నావు బావా?” ఆత్మీయంగా పలకరించింది వసంత.

“బాగానే ఉన్నాను. పి.జి. చేయడానికి వైజాగ్ వెళ్దామనుకుంటున్నాను.”

“వెరీ గుడ్ బావా. బాగా చదువు. ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు అమలాపురం లోనే చదివావు. కానీ వైజాగ్ వెళ్తే కొత్త స్నేహాలు, స్వేచ్ఛాయుత వాతావరణం ఎదురు అవుతాయి. ముందు చదువుకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ తర్వాతే మిగతా విషయాలు. ఇవన్నీ నీకు తెలియవని కాదు. ఎందుకో చెప్పాలనిపించింది. అయినా మా బావ ఎప్పుడూ బుద్ధిమంతుడే. ఆ నమ్మకం నాకు ఉంది.” నవ్వుతూ అంది వసంత.

నేను ఆశ్చర్యపోయాను. ఎంత పరిపక్వతతో మాట్లాడుతోంది? ఎంత ముందు చూపుతో మార్గ దర్సనం చేస్తోంది? అందుకే అంటారేమో, మగవారి కంటే ఆడవారి ఆలోచనలు దూర దృష్టి కలిగి ఉంటాయని. ఆమె ఆలోచనలు, ఆమెకు నా మీద ఉన్న నమ్మకానికి నాకు చాలా ఆనందం కలిగింది.

వసంత చేయి పట్టుకుని “మెనీ మెనీ థాంక్స్ వసంతా” అన్నాను. అనుకోని సంఘటనకు కొద్దిగా సిగ్గు పడింది. చిన్నగా నవ్వి సున్నితంగా తన చేతిని విడిపించుకుంది.

అంతే. ఆ తర్వాత పి.జి. డిస్టింక్షన్‌లో పాస్ అయ్యాకా శివపురం వెళ్లాను అత్తయ్యకి ఈ విషయం చెపుదామని. ముఖ్యంగా వసంతతో మనసు విప్పి మాట్లాడాలని. అత్తయ్య, నేను మంచి మార్కులతో పాస్ అయ్యానని చాలా సంతోషించింది. వసంత ఏది అని అడిగితే డాబా మీద ఉందని చెప్పింది. గబా గబా మెట్లెక్కి డాబా మీదకు వెళ్లాను. అప్పుడే సూర్యాస్తమయం అవుతోంది. సూర్య కిరణాలు వసంత మొహం మీద పడి ఆమె అందాన్ని మరింతగా ఇనుమడింప చేస్తున్నాయి.

“వసంతా” అని పిలిచాను. “రా బావా” అని ఆనందంగా ఆహ్వానించింది. నేను పి.జి. పాస్ అయిన సంగతి చెప్పాను. “కంగ్రాట్స్ బావా” అని మనస్ఫూర్తిగా అభినందించింది. తను డిగ్రీ పాస్ అయ్యానని, పి.జి. చేయడానికి ఏలూరు వెళ్తానని చెప్పింది. ఆమెకి కూడా నేను అభినందనలు చెప్పాను. పావు గంట సేపు చదువు గురించే మాట్లాడుకున్నాం.

“వసంతా, చాలా రోజులనుంచి నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను.” ఊపిరి తీసుకోవడానికి ఒక క్షణం ఆగాను. ఏమిటి? అన్నట్టు నా మొహం కేసి చూసింది వసంత.

“నేను నిన్ను ప్రేమిస్తున్నాను వసంతా. జాబు రాగానే పెళ్లి చేసుకుందాము. లేదా నీ పి.జి. అయ్యే వరకు ఆగమన్నా ఆగుతాను. ఏమంటావు?”

నా మాటలకు ఆమె పెద్దగా ఆశ్చర్యపోలేదు. దీర్ఘంగా నిట్టూర్చింది.

“బావా, నాకు పెళ్లి గురించి కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా పెద్ద ఉద్యోగం చేసే వాడిని, చాలా అందమైన వాడిని చేసుకోవాలని అనుకుంటున్నాను. మీది వ్యవసాయ కుటుంబం. నువ్వు ఒక్కడివే ఉద్యోగం చేస్తావు. మీ కుటుంబ వాతావరణంలో నేను ఇమడలేను.” ఒక క్షణం ఆగి నా చేయి తన చేతిలోకి తీసుకుంది. “చూడు బావా, నీకు, నాకు ఎంత తేడాయో?”

బంగారు రంగులో ఉన్న ఆమె చేయి పక్కన, చామన చాయలో ఉన్న నా చేయి వెలవెలబోతోంది. నేను సిగ్గుపడి నా చేయి వెనక్కి తీసుకున్నాను. సంజె చీకట్లు అలముకున్నాయి. నా మనసు నిండా దిగులు మేఘాలు ముసురుకున్నాయి. నేను చేష్టలుడిగి ఆమె వైపే చూస్తున్నాను. రెండు నిముషాలు గడిచాకా “సారీ బావా” అని వసంత మెట్లు దిగి కిందకు వెళ్ళిపోయింది. కొద్ది సేపటికి నేను కూడా కిందకు దిగి “వస్తాను అత్తయ్యా” అని చెప్పి భోజనం కూడా చేయకుండా ఇంటికి వచ్చేసాను.

ఆ తర్వాత రెండేళ్లకు వసంతకు ఒక సాఫ్ట్‌వేరు ఇంజనీర్‌తో పెళ్లి అవడం, చెన్నై వెళ్ళిపోవడం జరిగింది. నేను పెళ్ళికి వెళ్ళలేదు. అమ్మా, నాన్న వెళ్ళేరు. ఇన్ని ఏళ్ల తర్వాత ఇప్పుడు అమ్మకోసం శివపురం వస్తున్నాను.

***

కండక్టర్ ‘శివపురం… శివపురం బస్సు స్టాండ్’ అని పిలవడంతో వాస్తవం లోకి వచ్చి బస్సు దిగి, ఆటో ఎక్కి శ్యామల అత్తయ్య ఇంటికి వచ్చాను. డాబా మీద రెండు గదుల పోర్షన్ వచ్చింది. అంతకంటే ఇంటిలో మార్పు ఏమీ లేదు. అత్తయ్య చాలా ఆదరంగా మాట్లాడింది. ఆమె మొహం సంతోషంతో వెలిగి పోయింది నా రాకతో.

“రా కృష్ణా, అందరూ కులాసానా? మీ ఆవిడ , పిల్లలు ఎలా వున్నారు?” ఆప్యాయంగా అడిగింది అత్తయ్య.

అందరం బాగానే ఉన్నామని చెప్పి, అమ్మ ఇచ్చిన మినప సున్ని, పూతరేకులు ఉన్న స్టీల్ కాన్ అత్తయ్యకి ఇచ్చాను. మేము మాట్లాడుతూ ఉండగానే మావయ్య బయట నుండి వచ్చారు. “కృష్ణా, బాగున్నావా?” అని ఆత్మీయంగా పలకరించారు. నేను నవ్వుతూ “బాగానే ఉన్నాను మావయ్యా, మీరు ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు?” అని అడిగాను.

“పక్కనే, మార్టేరు హై స్కూల్‌కి హెడ్ మాస్టర్‌గా చేస్తున్నాను. నువ్వు ఎక్కడ..?” అడిగాడు మావయ్య.

“విశాఖపట్నంలో బ్యాంకు ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను.”

ఒక అరగంట సేపు నేనూ మావయ్య కబుర్లు చెప్పుకున్నాం. అత్తయ్య వచ్చి భోజనానికి రండని పిలిచింది.

మావయ్యకి, నాకూ వడ్డించింది డైనింగ్ టేబుల్ మీద. నాకిష్టమైన మామిడికాయ పప్పు, బెండకాయ వేపుడు, ఆనప, ములక్కాడ, చిలగడ దుంపల ముక్కల పులుసు, వడియాలు అప్పడాలు, కొబ్బరి పచ్చడి, పాయసం. అవన్నీ చూడగానే నాకు పాత రోజులు గుర్తుకొచ్చాయి. పులుసులో ముక్కల కోసం నేనూ, వసంత దెబ్బలాడుకునే వాళ్ళం. అత్తయ్య నాకు ఎక్కువ ముక్కలు వేసేది. ఉక్రోషంతో వసంత నా కంచంలోని ముక్కలు తీసేసుకునేది. అత్తయ్య వసంతని సున్నితంగా కోప్పడేది. అది గుర్తుకొచ్చి నవ్వుకున్నాను. నా నవ్వు అంతరార్థం అత్తయ్య గ్రహించింది.

“కృష్ణా, వసంత గుర్తుకొచ్చిందా?” నవ్వుతూ అడిగింది అత్తయ్య.

“అవును అత్తయ్యా. ఇప్పుడు తను ఎక్కడ ఉంటోంది? చెన్నై లోనేనా?”

“లేదు. బెంగుళూరులో ఉంటున్నారు. వసంతకి ఇద్దరు పిల్లలు”

నేను అడగక పోయినా అత్తయ్యే చెప్పింది వసంత గురించి. నేను ఒక్క క్షణం మౌనంగా ఉండి పోయాను. మావయ్య బ్యాంకుల గురించి ఏదో అడిగితే ఆ విషయాలలోకి వెళ్ళిపోయాం. భోజనం అయ్యాకా ఒక గంటసేపు ఉండి బయల్దేరాను. అత్తయ్య గేటు వరకువచ్చింది.

అకస్మాత్తుగా నా చేయి పట్టుకుని ‘ఈ అత్తయ్యని మర్చిపోకు కృష్ణా’ అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఆమెని అలా చూడగానే నాకూ చాలా బాధ కలిగింది. ‘అదేం లేదు అత్తయ్యా. వీలు కుదరక రావటంలేదు. ఈసారి అమలాపురం వచ్చినపుడల్లా నీ దగ్గరకూ వస్తాను’ వాగ్దానం చేసాను.

బస్సు స్టాండ్‌కి వచ్చి రావులపాలెం బస్సు ఎక్కి కూర్చున్నాను. మళ్ళీ నన్ను, నా ఆలోచనలు చుట్టుముట్టాయి.

పి.జి. అయ్యాకా బ్యాంకు పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించి, కాకినాడ బ్రాంచ్‌లో చేరాను. నాతోనే మరో ఇద్దరు కూడా అదే బ్రాంచ్‌లో చేరారు. నేను, రాజేష్, అనూరాధ ముగ్గురం కొత్తవాళ్ళం. మేనేజర్, అకౌంటెంట్ చెప్పే సూచనలు పాటిస్తూ పనిలో మెళకువలు నేర్చుకునే వాళ్ళం. రాజేష్ చాలా జోవియల్‌గా ఉండే వాడు. అనూరాధ అందరితో కలిసిపోయేది. నేను, నా పని అవగానే సాయంత్రం తిన్నగా రూంకి వచ్చేవాడిని. పుస్తకం చదువుకోవడం లేదా సంగీతం వినడం చేసేవాడిని. అనూరాధ అందంగా ఉంటుంది. రాజేష్ తరచూ ఆమెతో జోకులు వేస్తూ నవ్విస్తూ ఉండేవాడు.

ఒకరోజు లంచ్ సమయంలో అనూరాధ అడిగింది “మీరు ఎక్కడ ఉంటున్నారు సర్” అని.

“రామారావు పేటలో. మీకు అక్కడ చుట్టాలు ఎవరైనా ఉన్నారా?” నవ్వుతూ అడిగాను. “లేదు సర్, మా ఫ్రెండ్ మీనాక్షి అక్కడ ఉంది. ఆదివారం తనని కలవాలి. వీలైతే మిమ్మల్నీ కలుద్దామని.” అంది అనూరాధ. అలాగే అన్నాను. అనూరాధ రోజూ పిఠాపురం నుంచి వస్తుంది.

ఆదివారం సాయంత్రం ఒక పెద్దాయన నా రూముకి వచ్చారు. “నేను అనూరాధ తండ్రిని. మీకు ఇంకా వివాహం కాలేదని మీ మేనేజర్ గారు చెప్పారు. మా అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడుతోంది. మీ పెద్దవారి అడ్రస్ ఇస్తే వారితో మాట్లాడతాను.”

ఆయన మాటలకు నేను ఆశ్చర్యపోయాను. తర్వాత తేరుకుని “నేను మీ అమ్మాయితో ఒకసారి మాట్లాడతాను. అప్పుడు నా నిర్ణయం చెబుతాను” అన్నాను నేను. ఆయన సరేనని వెళ్ళిపోయారు. మర్నాడు లంచ్ అవర్లో అనూరాధతో సాయంత్రం భాను గుడి వద్ద కలుద్దామని చెప్పాను. అలాగే అంది తను. సాయంత్రం ఇద్దరం గుడి దగ్గర కలుసు కున్నాం. నా మనసులో మాట చెప్పాను . “రాధ గారూ, నేను మీ అందానికి తగను. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మున్ముందు మిమ్మల్ని బాధించవచ్చు. బాగా ఆలోచించండి.”

ఆమె నా మాటలకు చిన్నగా నవ్వింది. “చూడండి కృష్ణ గారు. ఏడాది నుండి మిమ్మల్ని నేను గమనిస్తున్నాను. అనవసర విషయాలు మాట్లాడరు. డ్యూటీ మైండ్‌గా ఉంటారు. అదుకే మీరు నాకు నచ్చారు. బాహ్య అందం తాత్కాలికం. హృదయ సౌందర్యమే గొప్పది. ఏమంటారు?” అంది అనూరాధ. ఆమె మాటలకు నేను సంతృప్తి పడ్డాను. ఎందుకంటే వసంత విషయం నాకు అనుభవమేగా. నా అంగీకారం తెలపడం, రెండు నెలలలో మా పెళ్లి అన్నీ వేగంగా జరిగిపోయాయి. ఇద్దరం ఇప్పుడు విశాఖపట్నం లోనే వేర్వేరు బ్రాంచి లలో పనిచేస్తున్నాము. మా పిల్లలు ఇద్దరూ హై స్కూల్ చదువుకి వచ్చారు. మా సంసార నౌక ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతోంది.

బస్సు రావులపాలెం వచ్చింది. మరలా బస్సు మారి అమలాపురం వచ్చాను. అక్కడి విశేషాలు అన్నీ అమ్మకి చెప్పాను. అమ్మ చాలా సంతోషించింది. మర్నాడే బయల్దేరి విశాఖపట్నం వచ్చాను.

***

కాలచక్రంలో రెండేళ్ళు గిర్రున తిరిగాయి.

గత ఏడాది అమలాపురం వచ్చినప్పుడు అమ్మ కోరిక మీద అందరం కలిసి టాక్సీ చేసుకుని శివపురం వెళ్ళాము. శ్యామల అత్తయ్య, నా భార్య అనూరాధని, పిల్లల్ని చూసి చాలా సంతోషించింది. మావయ్య మా అందరితో సెల్ఫీ తీసుకున్నాడు చిన్న పిల్లాడిలా. చాలా కాలానికి నేను అత్తయ్య, మావయ్యలతో హృదయపూర్వకంగా మాట్లాడాను.

ఒక ఆదివారం ఉదయం టిఫిన్ తిని, తీరుబడిగా పేపర్ చదువుతున్నాను. సెల్ ఫోన్ మోగింది. చూసాను. కొత్త నెంబర్. ఆన్ చేసి ‘హలో’ అన్నాను. అవతలనుంచి స్త్రీ గొంతు “గోపాలకృష్ణ ఏనా” అన్నారు. నన్ను ఏకవచనంలో పిలిచేవారు ఎవరా అని ఆలోచిస్తూ “అవునండి. గోపాలకృష్ణనే. మీరు ఎవరు?” ప్రశ్నించాను. నా ప్రశ్నకు జవాబుగా పెద్ద నవ్వు వినిపించింది. నేను బిత్తరపోయాను. నవ్వు ఆగింది. “నేను బావా, వసంతని” అంది వసంత.

నేనూ చిన్నగా నవ్వి “బాగున్నావా వసంతా?” అన్నాను. “ఆ, బాగానే ఉన్నాను. మొన్న మా ఊరు వచ్చావని అమ్మ చెప్పింది. సంతోషం. నా మీద కోపం పోయిందిగా.”

నిర్మలంగా ఉంది వసంత గొంతు. “ఆ, అదేం లేదు వసంతా.” అన్నాను మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ. “అమ్మ దగ్గరినుంచి నీ నెంబర్ తీసుకున్నాను.” అని రెండు నిమషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసింది వసంత. నేను వసంత నెంబర్ ఫీడ్ చేసుకున్నాను ఫోన్లో.

ఒక నెల రోజులు గడిచాకా వసంత నెంబర్ నుండి వాయిస్ మెసేజ్ వచ్చింది. అదీ ఆదివారం రోజునే.

ఫోన్ ఆన్ చేసాను.

“ప్రియమైన కృష్ణ బావకు. శుభోదయం. మన చిన్నతనంలో మా ఊళ్ళో నువ్వే ముందుగా లేచి ‘శుభోదయం వసంతా’ అని నన్ను నిద్ర లేపెవాడివి. గుర్తుందా. అట్లతద్ది రోజున మా స్నేహితురాళ్ళతో కలిసి నువ్వూ వచ్చి, లింగాల వీధిలో రావి చెట్టుకి కట్టిన ఉయ్యాలలో నన్ను కూర్చో బెట్టి గట్టిగా వూపేవాడివి. నేను భయపడితే, ఎప్పుడూ ధైర్యంగా వుండాలని నాకు చెప్పేవాడివి. అవన్నీ బంగారు రోజులు బావా. నువ్వంటే అప్పుడు నాకు ఇష్టంగానే ఉండేది. కానీ పెద్దదాన్ని అయ్యాకా, జీవితం అంటే ఇంకా బాగుండాలి, గొప్పగా ఉండాలని కలలు కన్నాను. అలాగే నా అందం గురించి నా స్నేహితులు పొగుడుతుంటే కొద్దిగా గర్వం కలిగేది. ‘వసంతని పెళ్లి చేసుకునేవాడు గొప్ప అదృష్టవంతుడు, అందగాడు అయి వుండాలి’ అని తరచూ అనడం, కాలేజీలో అబ్బాయిలు నా పరిచయం కోసం నా చుట్టూ తిరగడం.. నాలో అహంకారానికి బీజం వేసింది. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నిన్ను కించపరిచాను. ఒక విధంగా అవమానించాను. ఆనాటి నా ప్రవర్తనకి క్షమించమని ఇప్పుడు నిన్ను కోరుతున్నాను.

నేను అనుకున్నట్టుగానే, నా పెళ్లి అందగాడు, పెద్ద ఉద్యోగస్తుడు అయిన శ్రీకాంత్‌తో జరిగింది. ఆయన నన్ను చాలా బాగా చూసుకునేవారు. ముత్యాల లాంటి ఇద్దరు పిల్లలు. కానీ కాలం ఒకేలా ఉండదు కదా. బెంగుళూరు వచ్చాకా చక్కర వ్యాధి వచ్చింది, దానికి తోడు రక్తపోటు. తిండి తగ్గింది, వళ్ళూ తగ్గింది. పిల్లల పెంపకం. వాళ్లకు కావాల్సినవి చూడడంలో నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తగ్గింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఒకనాడు అందాలరాశి, అభినవ ఊర్వశి అని నన్ను పొగిడిన నా భర్త, సెలవలు వస్తే, నన్నూ పిల్లల్ని తీసుకుని ఊటీ, కోడైకెనాల్  మైసూరు అన్నీ చూపించారు. ఇప్పుడు ఎక్కడికీ వెళ్ళడం లేదు. ఎందుకంటే నేను ఆయన పక్కన ఉంటే, ఆయనకు నామోషీగా ఉందిట. ఎంత విచిత్రం. నా అందం ఆవిరై పోగానే, నన్ను ఇంత దూరం పెడతారని నేను ఊహించలేదు. బహుశా ఇంకో అందాన్ని వెతుక్కుంటున్నారేమో.

అద్దంలో చూసుకుంటే ‘నేను నేనేనా’ అనిపిస్తోంది. అంతగా మారిపోయింది నా రూపు. నా అందం చూసుకుని నిన్ను అవమానించి నందుకు నాకు తగిన శాస్తి జరిగిందని నాకు అర్థమయ్యింది. ఇవన్నీ చెప్పి నీ నుంచి జాలి పొందాలని కాదు బావా. బాహ్య సౌందర్యం కన్నా అంతస్సౌందర్యమే గొప్ప అని, నాకు జ్ఞానోదయం అయిందని చెప్పడమే నా ఉద్దేశం.

బావా, నేను నిన్ను కాదన్నా నీకు బంగారం లాంటి భార్య, రత్నాల లాంటి పిల్లలు లభించారు. మీరు అందరూ సుఖంగా ఉండాలని కోరుతున్నాను. సెలవ్ బావా”

వసంత మాటలు పూర్తి కాగానే నా మనసు అంతా అదోలా అయిపోయింది. ఇదేమిటి?, వసంత జీవితం ఇలా అయిపోయింది? అని బాధ కలిగింది. అమాయకురాలు వసంతకు ఆరోగ్యాన్నిచ్చి కాపాడు స్వామీ అని దేవుడ్ని వేడుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here