[డా. మైలవరపు లలితకుమారి రచించిన ‘అందమైన అడుగులు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]కో[/dropcap]టి కోరికలతో కొండంత ఆశతో ఒకటయ్యారు
అంతులేని ప్రేమలను పంచుకొని
ఆ ప్రేమలకు ప్రతిరూపాలైన
బిడ్డలను కంటిపాపల వలె సాకారు
వారు చేసిన తప్పులకు కాపుదారులైనారు
ఒప్పులకు ఆకాశమంత ఎత్తు ఎదిగినారు
కష్టసుఖాలు తాము భరించి
ప్రేమలను పంచి పెంచారు
రెక్కలొచ్చి ఎదిగిన పిల్లలు
బాధ్యత తెలుసుకుని
కన్నవారి కలలకు
ఆశలకు పాదులు కావాలి
కన్నవారిని చిన్నబోనీయకూడదు
ప్రేమతో పిలిచే పిల్లల పిలుపులే
వారికి అనంతమైన పెన్నిధి
గోరుముద్దలు తినిపించి పెంచిన తల్లిని
వేలుపట్టి లోకాన్నిచూపి గెలిపించిన నాన్నను
కడగండ్లపాలు కానీయకుండా
కడతేరే వరకు కాచి చూడటం బాధ్యత
నేటి పిల్లలూ రేపటి కొడుకులే
ఒకరికి పెట్టిందే తమకు దక్కుతుందన్నది
ఒకనాటి గొప్ప సామెత
నేటి చర్యలే రేపటి ఆనందాలకు పునాది
తల్లిదండ్రులను పిల్లల్లా చూసుకోవాలి
ఆనందాలను వారికి పంచాలి
వారి అనుభూతులను అందుకోవాలి
కన్నవారి ప్రేమతో ఎదిగిన మనసులు
బాధ్యతలనెరిగి మసులుకొని
వారి కలలను సాకారం చేసే దిశగా వేసే
ప్రతి అందమైన అడుగు
వృద్ధాశ్రమాలను విచ్ఛిన్నం చేస్తూ
భావితరాలకు స్ఫూర్తిదాయకం కాగలగాలి కావాలి.