అందమైన చేతులు

1
2

[dropcap]కి[/dropcap]ష్టప్ప, నాగమ్మల కుమారుడు రామప్ప. వారు పేదలైనా నిజాయితీ పరులు. తమగుడిసె చుట్టూ వున్న స్థలంలో కాయకూరల మొక్కలూ, పూలమొక్కలూ వేసుకుని పక్కనే వున్న బాహుదానదిలో నీరు కావళ్లతో మోసుకొచ్చి పోసి తమ మొక్కలను జాగ్రత్తగా పెంచుకునేవారు.కిష్టప్ప కూరలు ఒకగంపలో పెట్టుకుని పక్కనే వున్న నగరంలో అమ్ముకు వచ్చేవాడు.

నాగమ్మ కూడా పూలన్నీకోసి, మాలలుకట్టి, కొన్ని విడిపూలూ భర్తతోపాటే నగరం వెళ్ళి దేవాలయం వద్ద అమ్ముకు వచ్చేది. ఇద్దరూ కష్టపడి సంపాదించేవారు. ఎక్కువ ధర చెప్పక తమకు గిట్టుబాటైన ధరకే అమ్మేవారు. వారి నిజాయితీకి మెచ్చుకుని అంతా వారివద్దే కొనేవారు.

నాగమ్మ ఉదయాన్నే కుమారుడు రామప్పకు ఇంతన్నం వండి డబ్బాలో కట్టి ఇచ్చి, వారూ కట్టుకుని వెళ్లేవారు. రామప్ప ఆ గ్రామంలో వున్న పాఠశాలలో మూడో తరగతి చదివేవాడు. తాను ముందుగా ఇంటికి వస్తే బయట కూర్చుని పాఠశాలలో చెప్పిన పాఠాలన్నీ చదువుకునేవాడు. పంతుళ్ళిచ్చిన ఇంటిపని చేసుకునేవాడు. వాడి కంఠం చాలా బాగుంటుంది. పాఠశాలలో చెప్పిన పద్యాలన్నీ వల్లెవేసుకునేవాడు. ఇరుగుపొరుగువారు “పెద్దగా చదువు రామప్పా! చాలా బాగా చదువుతున్నావ్” అని అడిగి చదివించుకునేవారు. ఇలా వాడు అందరికీ పద్యాలు చదివి వినిపించి సంతోషపెట్టేవాడు.

అమ్మా నాయనా వచ్చాక అంతా స్నానాలు చేసి ఉన్నది వండుకు తిని దేవుని స్మరించుకుంటూ నిద్రించేవారు. రాత్రులు నిద్రపట్టేవరకూ కిష్టప్ప, నాగమ్మ కుమారునికి మంచిమాటలు చెప్పేవారు.

“నాయనా! ఎవ్వరివద్దా ఉచితంగా ఏమీ తీసుకోకు, ఎవ్వరినీ బాధించకు. ఎవ్వరి వస్తువులూ తీసుకోకు, నీకంటే చిన్నపిల్లలకు కానీ, ముసలి వారికి కానీ ఏదైనా అవసరమైతే సహాయం చేయి. అందరితో ప్రేమగా, మెల్లిగా మాట్లాడు. ఎవ్వరితో విరోధమ పెట్టుకోకు, అందరితో స్నేహంగా వుండు. భగవంతుడు మనకు అన్ని అవయవాలూ ఇచ్చినందుకు ఆయనపట్ల భక్తితో వుండాలి. ఎవరైనా దివ్యాంగులు [అంగవికలురు ] కనిపిస్తే వారికి అవసరమైన సాయం చేయి. ఆకలికి వుండలేనివారికి నీ డబ్బాలో వున్న అన్నం కొంచెం పెట్టు. దాహమైన వారికి నీ సీసాలో నీరు కొంచెం ఇవ్వు. నాయనా! మనం న్యాయమార్గంలోనే జీవించాలి. ధర్మం గానే సంపాదించాలి. అదే మనలను కాపాడుతుంది” అని రోజూ నిద్రించేవరకూ మంచి మాటలు చెప్పేవారు.

అలా రామప్ప మనస్సులో ఆ మంచి బోధలన్నీ నిల్చిపోయాయి. వాడు రోజూ దార్లో పోతూ ఎవరికైనా ఏదైనా సాయం అవసరమైతే చేసేవాడు. ఎనిమిదేళ్ల రామప్ప అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. పాఠశాలలో కూడా పంతులుగారు వచ్చే సరికి దేశమాత ఫోటోకు తన ఇంట్లో పూలు అమ్మ నడిగితెచ్చి పెట్టేవాడు.

దార్లో నడిచి వచ్చేప్పుడు ఎవరు కనిపించినా అవసరమైతే సాయం చేసేవాడు. వాడి మంచితనం అందరికీ నచ్చింది. స్కూల్లో పిల్లలంతా వాడితో స్నేహంగా వుండేవారు.

సంవత్సరాంతపు పరీక్షలు దగ్గరపడుతుండగా తమ ఇంటికి దూరంగా వున్న ఊరి పెద్దరైతు కొడుకు కిరణ్‌కు జ్వరం వచ్చింది. వాడు పాఠశాలకు రాలేకపోయాడు. ఐతే రామప్ప రోజూ పాఠశాల కాగానే వారింటికి వెళ్ళి పంతులు గారు చెప్పిన పాఠాలన్నీ చదివి వినిపించి అర్థం కూడా చెప్పే వాడు. కిరణ్ నోట్సులన్నీ వ్రాసి ఇచ్చేవాడు. పదిరోజులకు కిరణ్ జ్వరం తగ్గి పాఠశాలకు రాసాగాడు.

కిరణ్ అమ్మా నాయనా రామప్పచేసిన సాయానికి కొంత డబ్బు ఇవ్వబోగా “అయ్యా! నా స్నేహితుడు కదాని వచ్చి పాఠాలు చదివాను, దానివల్ల నాకే మేలైంది. మరలా చదవక్కర లేకుండా వచ్చాయి. స్నేహితునికి సాయంచేసి సేవను అమ్ముకోనా బాబుగారూ!” అని తిరస్కరించాడు. వాని మంచితనానికి పెద్దలకే ఆశ్చర్యం కలిగింది.

పంతులుగారు అందరికీ రకరకాల పోటీలు పెట్టారు. పద్యపఠనం, చిత్ర లేఖనం, వ్యాసరచన, కుందుళ్ళూ దూకుళ్ళూ ఇలా అనేక ఆటల్లో రామప్పదే మొదటి స్థానం. పంతులుగారు ఒక చిత్రమైనపోటీ పెట్టారు. శనివారం రోజు పంతులుగారు ఇలా చెప్పారు “పిల్లలూ! సోమవారం మీకో పోటీ వుంది. ఎవరి చేతులైతే అందంగా వుంటాయో వారికి మంచి బహుమతి. నాలుగో తరగతి అచ్చు పుస్తకాలతో పాటుగా, కావల్సిన నోటు బుక్కులన్నీ బహుమతి. సెలవుల్లో అన్నీ బాగా చదువుకోవచ్చు” అని చెప్పారు. పిల్లలంతా ఉత్సాహంగా ఇళ్ళకెళ్లారు.

మరునాడు ఎవరేం చేశారో తెలీదుకానీ సోమవారం రానేవచ్చింది. అంతా ముందుగా వచ్చి తమ స్థానాల్లో కూర్చున్నారు. పంతులుగారు వచ్చారు. ప్రార్థన ఐంది. అందరినీ తమ చేతులు చూపమని కోరారు పంతులుగారు. ముందు సీట్లో కూర్చునే రామప్ప మాత్రం తరగతి గదిలోకి రాకపోడం చిత్రం అనిపించింది పంతులుగారికి. తలెత్తి చూశారు. దేశమాత ఫోటోకు పూలులేవు. అంటే రామప్ప బళ్ళోకి ఇంకా రాలేదన్న మాట.

పిల్లలంతా పోటీ ధ్యాసలో వుండి రామప్ప విషయమే మరచారు. పంతులుగారు అందరి చేతులూ చూశారు. అమ్మాయిలంతా గోరింటాకు పెట్టుకుని, చేతులకు రంగురంగుల గాజులేసుకుని వాటిని గలగల లాడిస్తూ చూపారు. అబ్బాయిలంతా గోళ్ళు బాగా కత్తిరించుకుని, శుభ్రమైన చేతులతోనూ, కొందరు చేతికి వారి నాన్నగారివో ఎవరివో చేతి గడియారాలు పెట్టుకుని, కొందరు చేతులకు ఉరుగులు తొడుక్కునీ, మరి కొందరు చేతులకు అంజనేయ స్వామివో, సత్యనారాయణ స్వామివో, వెంకటేశ్వర స్వామివో దారాలు కట్టుకుని వచ్చి పంతులు గారికి తమ చేతులు చూపారు.

అందరి చేతులూ చూశాక పంతులుగారు “పిల్లలూ! రామప్ప ఏడీ! రాలేదేం?” అని అడిగారు. పిల్లలంతా తమకు తెలీదని చెప్పారు.

ఇంతలో రామప్ప ఉరుకులూ పరుగులతో, ఆలస్యమైందని ఒగరుస్తూ వచ్చాడు. పంతులు గారికి నమస్కరించి “పంతులుగారూ!నమస్కారమండీ! లోనికి రావచ్చా!”అని అడిగాడు.

పంతులుగారు వాడిని ఎగాదిగా చూసి “రామప్పా! ఏంటా దుస్తులు? ఆ కాళ్ళూ చేతులూ ఇలా బురదతో వున్నాయేంటీ! ఇలాగేనా స్కూల్లోకి వచ్చేది? రోజూ శుభ్రంగా ముందుగా వచ్చేవాడివి. పైగా ఇంతాలస్యమైందేంటీ?” అని అడిగారు.

“పంతులుగారూ!నిన్నటి రోజున వర్షం వచ్చింది కదండీ! నేను రోజూ లాగానే ముందుగా బయల్దేరానండీ! ఒక తాతగారు రోడ్డు దాటుతూ బురదలో జారిపడ్డారండీ! నేను చూస్తూ రాలేక వెళ్ళి లేపి, ఆయన కుంటుతూ నడుస్తుండగా ఆయన చేతిలో సంచీ మోసుకుని వారి ఇంటి వరకూ దింపేసి వచ్చానండీ! అందుకే నా దుస్తులకు, చేతులకూ, కాళ్ళూకూ కూడా బురద ఐంది. ఆయన్ని లేపీ పట్టుకుని నడవటాన బురదలో పడ్ద ఆయన బట్టల మురికి నాకూ అంటిదండీ! మీరు అనుమతిస్తే వెళ్ళి నూతివద్ద కడుక్కుని వస్తానండీ!” అన్నాడు వినయంగా.

పంతులుగారు “సరే! వెళ్ళి కడుక్కురా!” అని చెప్పగానే రామప్ప వెళ్ళి కాళ్ళూ చేతులూ కడుక్కుని శుభ్రంగా వచ్చాడు. వాని బట్టలు బురద తుడుచుకోటాన కాస్తంత తడయ్యాయి. వాని జేబులోని పూలు తీసి దేశమాత ఫోటోకు పెట్టి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు.

పంతులుగారు “పిల్లలూ! మనకు భగవంతుడు అవయవాలన్నీ ఇచ్చాడు కదా!మనం వాటిని సరిగా ఎలా వాడుకోవాలి? అంటే చేతులతో ఏం చేయాలి? కాళ్లతో ఏం చేయాలి ?” అని అడిగారు.

పిల్లలంతా తలా ఒక సమాధానం చెప్పారు.

 పంతులుగారు “పిల్లలూ! చేతులతో అవసరమైనవారికి సహాయం చేయాలి. దాన్నే సేవ అంటారు. కాళ్ళతో దేవాలయానికి వెళ్ళాలి. అవసరమైనవారికి సేవ చేయను నడవాలి. కళ్లతో సినిమాలు, టి.వీలూ చూట్టం కాదు చేయాల్సింది. కళ్ళున్నందుకు భగవంతుని చూడటం, ఆయన సృష్టిలోని అందమైన పూలనూ, తోటలనూ, పక్షులనూ చూసి వాటి గురించీ ఆలోచించి, వాటిని ప్రేమించడం చేయాలి. ఇలాగే మన అవయవాలన్నింటినీ మంచికి ఉపయోగించాలి. ముక్కును గాలిపీల్చుకోడం, భగవంతుడు సృష్టించిన పూల సువాసనలను పీల్చుకుని సంతోషించడం కోసం కానీ అమ్మ చేసిన వడలో, సాంబారో లేక దోశో వాసన చూడను కాదు” అంటూ పంతులు గారు అనేక విషయాలు చెప్పారు.

“పిల్లలూ! ఈ రోజు అందమైన చేతులతో రమ్మనగానే మీరంతా చేతులను అలంకరించుకుని వచ్చారు. చేతులతో చేయాల్సిన పని ఐన సేవను మాత్రం చేసింది ఒకేఒక్కడు, అతడే మన రామప్ప. మరి ఎవరికి మనం మొదటి బహుమతి ఇవ్వాలి?” అని అడిగారు.

పిల్లలంతా ఒకే స్వరంతో “రామప్పకే రామప్పకే” అని అరిచారు.

ఆ రోజు సాయంకాలం అసెంబ్లీలో పెద్దపంతులుగారు రామప్పకు నాల్గవ తరగతి పుస్తకాలూ, నోటుబుక్కులూ ఇచ్చారు.

ఇదర్రా! పిల్లలూ! ఇతరులకు సేవచేసినవే అందమైన చేతులవుతాయి. దానివల వచ్చే లాభంతెల్సిందిగా.

మరి మీరూ మీకుతగిన సేవచేస్తారుగా!.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here