Site icon Sanchika

అందమైన మనసు-11

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[భూతవైద్యుడి చేత తనని కొట్టించింది నివేదే అంటాడు డాక్టర్ వినీల్. నివేదని పెళ్ళి చేసుకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తాడు. ఏ.ఎస్.పి. సూర్యదేవ్ – తాను నివేదని ప్రేమిస్తున్నానని, తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు నివేదకి ఫోన్‍లో చెప్తాడు. బొంబాయి నుంచి వచ్చిన హరనాధరావుకు ఇంట్లో జరిగినదంతా వివరిస్తుంది సత్యవతి. కొడుకు నివేదను పెళ్ళి చేసుకోనంటున్నాడని, ఓ డాక్టర్‌ని మాత్రమే చేసుకుంటానని పట్టుపడుతున్నడనీ, అయితే తెలిసిన వాళ్ళ డాక్టరు సంబంధాలు తప్పిపోతున్నాయని చెబుతుంది. హరనాధరావు మాత్రం వినీల్‌కి నివేదతోనే పెళ్ళి జరిపిస్తానంటాడు. ఈ విషయమై నివేదతో మాటా మాటా పెరుగుతుంది. వారు అనుభవిస్తున్న ఆస్తి తమదేనన్న నిజం తనకు తెలుసంటుంది నివేద. అక్కడ్నించి బయల్దేరి తల్లిదండ్రుల వద్దకి వస్తుంది. – ఇక చదవండి.]

[dropcap]“అ[/dropcap]మ్మా నువ్విలా కూర్చో. నేను ఎందుకొచ్చానో చెబుతాను” అంటూ చైత్రన్ పక్కన కూర్చుని వున్న బ్రహ్మయ్య పక్కకు తీసికెళ్ళి నాగేశ్వరిని కూర్చోబెట్టింది. నివేద కూడా కూర్చుంది.

ఏం చెబుతుందా అని ముగ్గురు నివేదను చూస్తున్నారు.

“మామయ్యను తిట్టాను” అంది నివేద.

అదిరిపడింది నాగేశ్వరి. “ఏం మాట్లాడుతున్నావే! మామయ్యను తిట్టటమేంటి? ఆయనెలా కనిపిస్తున్నాడే నీకు? నువ్వేమైనా చిన్నపిల్లవా ఇంకా?” అంది భయంగా చూసి.

“నీ భయం చూస్తుంటే ఇప్పుడే గుండాగేలా వుంది నీకు. అదేదో జోగ్గా అంటోంది. దాని మాటలేం పట్టించుకోకమ్మా” అన్నాడు చైత్రన్.

“జోకా! జోగ్గా కూడా తిడతారా? అసలాయనా మనకెంత అన్యాయం చేసాడో మీకు తెలుసా? తెలిస్తే మీరు తిట్టరు. చంపేస్తారు” అంది.

“దీనికేదో పిచ్చి పట్టింది” అన్నాడు చైత్రన్.

బ్రహ్మయ్య కూతురు వైపు ఎగాదిగా చూసాడు.

“పిచ్చి నాక్కాదు. నేను చెప్పేది వింటే మీకు పడుతుంది పిచ్చి”

“ఏం చెబుతావో చెప్పవే..? వూరికే నాన్చకు” అన్నాడు చైత్రన్.

“తాతయ్య అమ్మకి ఆస్తులేమీ ఇవ్వలేదని అమ్మ మనకు చెబుతుండేది నీకు గుర్తుందా అన్నయ్యా?”

“ఉంది. అయితే ఏంటి?”

“అది నిజం కాదు. తాతయ్య చనిపోతూ పొలం అమ్మకు ఇమ్మని చెప్పాడట. అది అమ్మకు ఇవ్వకుండా మామయ్య అమ్ముకుని హాస్పిటల్ కట్టించుకున్నాడు. మనల్ని పేదోళ్లను చేసాడు. అదంతా ఆయన్నే పట్టుకుని అడిగాను. కోపంతో నన్ను కొట్టబోయాడు. అత్తయ్య నన్ను పక్కకి తీసికెళ్ళింది. ఇక అక్కడ వుండకుండా వచ్చేసాను” అంది.

నమ్మలేనట్లు చూసారు.

“నన్ను వినీల్ బావకు ఇచ్చి పెళ్లి చేస్తారట. మీతో మాట్లాడతారట” అంది.

అది వినగానే ఆ ముగ్గురి ముఖాలు వెలిగాయి.

“కానీ నేను చేసుకోననని చెప్పేసాను” అంటూ లేచి లోపలకి వెళ్ళింది.

చైత్రన్ కోపంగా లేచి ఆమె వెనకాలే వెళ్ళాడు.

“వినీల్‌ని చేసుకోనని చెప్పావా? అలా ఎందుకు చెప్పావు? తమాషాగా వుందా?”

“వాళ్ళు మంచివాళ్ళు కాదు. మనల్ని మోసం చేసారు”

“అలా నువ్వు అనగానే అయిపోతుందా? మామయ్యే లేకుంటే నీకీ పొజిషన్ వచ్చేదా? వినీల్ చేస్తున్న హెల్ప్ వల్లనేగా నేను సిటీలో వుంటున్నాను. ఇదంతా వదిలేసి పిట్టకథలు చెబుతావెందుకు?” అన్నాడు గట్టిగా.

“పిట్టకథలు కాదు అన్నయ్యా నేను చెప్పేది నిజం. కావాలంటే నిన్ను అరుంధతి ఆంటీ దగ్గరకి తీసికెళ్ళి చెప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది నీకు మామయ్య మనకెంత అన్యాయం చేసాడో”

“అవసరం లేదు. మామయ్య మనకు అన్యాయం చేసేవాడే అయితే నిన్ను వినీల్‌కి చేసుకుంటానని చెప్పడు. వాళ్ళు కావాలంటే నీకన్నా గొప్ప గొప్ప అమ్మాయిలే వస్తారు” అన్నాడు చైత్రన్.

“అన్నయ్య చెప్పేది నిజమే వేదా! వాళ్ళు కోరుకుంటే రానిది ఏదీ లేదు. అయినా నీ బాధ తాతయ్య నాకిచ్చిన పొలం అమ్మి హాస్పిటల్ కట్టించాడనేగా! ఇప్పుడు వినీల్‌కి నిన్ను చేసుకుంటే ఆ ఆస్తి అంతా మనదే కదా! కాస్త ఆలస్యంగా నైనా మనకు న్యాయమే జరుగుతుంది. నువ్వు వినీల్‌ని చేసుకోనని అనొద్దు” అంది నాగేశ్వరి.

బెదిరిపోయింది నివేద.

“ఇదేంటి నాన్నా అమ్మ ఇలా అంటోంది. నేను బావను పెళ్లి చేసుకోవటం ఏంటి? ఎప్పుడైనా అనుకున్నామా బావతో నాకు పెళ్లి చేస్తారని?” అంది.

బ్రహ్మయ్య మాట్లాడలేదు.

“అప్పుడు నీకంత అదృష్టం లేదు. అందుకే అనుకోలేదు. అంత పెద్ద హాస్పిటల్లో వినీల్‌ని డాక్టర్‌గా చూసినప్పటి నుండి వినీల్‌కి నిన్నిచ్చి చెయ్యాలన్నది నా కల. నాన్నా వెంటనే నువ్వు మామయ్యతో మాట్లాడు. వినీల్‌కి నివేదను ఇస్తామని” అన్నాడు చైత్రన్.

“నువ్వలా అనకు అన్నయ్యా! నాకు బావను చేసుకోవటం ఇష్టం లేదు. చేసుకోను” అంది నివేద.

“ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. అంతా నీ ఇష్టమేనా? నోరు మూసుకుని మేము చెప్పినట్లు విను” అన్నాడు చైత్రన్.

“నేను వినను. ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక్కడుంటే మీరంతా కలిసి నన్ను ఆ సైకోకి ఇచ్చి పెళ్లి చేస్తారు” అంటూ బయటకు వెళ్ళబోయింది నివేద.

చైత్రన్ పట్టుకున్నాడు.

“ఎక్కడికి వెళ్తావే. కదిలితే కాళ్ళు విరగ్గొడతా. పదమ్మా దీన్ని లోపల పెట్టేసి తాళం వేద్దాం. బయటకి వెళ్ళిందంటే పట్టుకోలేం” అన్నాడు చైత్రన్.

నాగేశ్వరి మాట్లాడే లోపలే తలుపు వేసి తాళం వేసాడు.

నివేద కిటికీ లోంచి బయటకు చూస్తూ “నాన్నా తలుపు తియ్యండి” అంది.

“జంతువును బంధించినట్లు దాన్ని లోపల పెట్టావెందుకురా? తాళం తియ్యి” అన్నాడు బ్రహ్మయ్య.

“నేను తియ్యను నాన్నా! దాని పెళ్లి వినీల్‌తో అయ్యే వరకు అది లోపలే వుంటుంది. దాని పెళ్లి చేసాకనే నేను సిటీకి వెళతాను. అంతవరకు వెళ్ళను. మూడు పూటల దానికి తిండి కూడా కిటికీలోంచే పెడతాను” అంటూ తాళాన్ని జేబులో వేసుకుని బయటకు వెళ్ళాడు.

చైత్రన్ అన్నట్లే తాళం తియ్యలేదు. బ్రహ్మయ్య చెప్పినా, నాగేశ్వరి చెప్పినా వినలేదు. కిటికీలోంచే తిండి పెడుతున్నాడు.

బస్‌లో సూర్యదేవ్‌తో మాట్లాడుతున్నప్పుడే నివేద సెల్‌కి ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జర్ బయటే వుంది. అడిగితే ఇవ్వట్లేదు చైత్రన్. సూర్యదేవ్‌కి ఫోన్ చెయ్యాలంటే వీలుకాలేదు నివేదకు.

***

మల్లికార్జున్ వస్తే ఏమి అడగాలనుకుందో గుర్తు చేసుకుంటూ గేటు దగ్గరే నిలబడింది అలేఖ్య. హాల్లో ఫోన్ రింగ్ అవుతుంటే మల్లికార్జునేమో నని పరిగెత్తుకుంటూ లోపలకి వెళ్ళింది.

మల్లికార్జున్ కాదు. ఏ.ఎస్.పి సూర్యదేవ్.

వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి “హలో సార్ నమస్తే!” అంది.

“ఎలా వున్నావ్ అలేఖ్యా? ఆర్ యూ ఓకే” అన్నాడు.

“ఓకే సర్ బాగున్నాను” అంది.

“మీ ఫ్రెండ్ నివేద ఎలా వుంది?” అన్నాడు.

అతనిప్పుడు కాల్ చేసింది నివేద గురించి తెలుసుకోవాలనే. ఆమె వాళ్ళ ఊరు వెళుతూ బస్ దిగే వరకు మాట్లాడింది. రాత్రికి ఫోన్ చేస్తానంది. చెయ్యలేదు. అతను ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇప్పటికి రెండు రోజులైంది. ఫోన్ లేదు. మాటలు లేవు. ఏం జరిగి వుంటుంది? అసలు నివేద ఇంటికి వెళ్లిందో లేదో అన్న అనుమానం వచ్చింది. అందుకే అలేఖ్యకు ఫోన్ చేసాడు.

“నివేద నాకు ఫోన్ చెయ్యక రెండు రోజులు పైనే అయింది సర్! ఎలా వుందో ఏమో! నేను ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వచ్చింది. దాని ఫోన్లో ఛార్జింగ్ లేదేమో” అంది.

“అవునా! సరే ఈరోజు ఫోన్ చేస్తుందేమో వెయిట్ చేద్దాం” అంటూ ఫోన్ పెట్టేసాడు సూర్యదేవ్.

అలేఖ్య కేం అర్థం కాలేదు. ఏదో అనుమానం వచ్చింది.

‘అంటీకి ఫోన్ చేద్దాం’ అని మనసులో అనుకుంటూ నాగేశ్వరికి ఫోన్ చేసింది.

ఆమె లిఫ్ట్ చేసి “హలో” అంది.

“ఆంటీ నేను అలేఖ్యను మాట్లాడుతున్నాను. రెండు రోజుల నుండి నివేద ఫోన్ కలవట్లేదు. ఊరేమైనా వచ్చిందా?” అడిగింది అలేఖ్య.

“వచ్చింది అలేఖ్యా!” అంది నాగేశ్వరి.

“నేను నివేదతో మాట్లాడాలి. ఒకసారి నాకు కాల్ చెయ్యమంటారా? అర్జెంట్ ఆంటీ” అంది.

“లేదు అలేఖ్యా! ఇప్పుడది ఫోన్లో మాట్లాడేలా లేదు” అంటూ నివేదను వాళ్ళ అన్నయ్య హౌస్ అరెస్ట్ చేసినట్లు చెప్పింది.

“ఓ మై గాడ్! అలా ఎందుకు చేశారు ఆంటీ? అదెంత బాధపడుతుంది. అయినా గదిలో పెట్టి బంధించటమేంటి? దాన్ని మీరు అర్థం చేసుకోరా” అంది.

“ఏం చెయ్యను అలేఖ్యా! ఇదంతా చైత్రనే చేస్తున్నాడు. మా మాట వినట్లేదు. వినీల్‌కి దాన్నిచ్చి పెళ్లి చెయ్యాలని వున్నాడు. ఇప్పుడు నేను నీతో మాట్లాడానని తెలిస్తే వూరుకోడు” అంటూ భయంగా ఫోన్ కట్ చేసింది నాగేశ్వరి.

అలేఖ్య వెంటనే సూర్యదేవ్‌కి ఫోన్ చేసింది. నివేద ఇప్పుడు ఎలాంటి సిట్యుయేషన్‌లో వుందో చెప్పింది.

***

అప్పుడే స్నానం చేసి, జడవేసుకుని, ఒక బుక్ పట్టుకుని కిటికీలో కూర్చుని చదువుకుంటోంది నివేద. గేటు తీసిన చప్పుడు విని తలెత్తి బయటకు చూసింది. ఏ.ఎస్.పి సూర్యదేవ్ వస్తున్నాడు. అతని వెంట ఇద్దరు గన్‌మెన్లు వున్నారు. నేరుగా లోపలకి వచ్చాడు

సూర్యదేవ్, అతని గన్‌మెన్లు మఫ్టీలో వున్నారు. వాళ్ళను చూసి నివేద షాక్ తిన్నది.

నివేద వున్న గదికి తాళం వేసి వుండటం చూసి అవాక్కయ్యాడు సూర్యదేవ్. అతని మనసు బాధ పడింది. చాలా కోపంగా వుంది.

చుట్టూ చూసాడు.

సూర్యదేవ్‌ని చూడగానే “ఎవరు మీరు?” అంటూ బ్రహ్మయ్య వచ్చాడు, ఆయన వెంట నాగేశ్వరి, చైత్రన్ వచ్చారు.

“ఆ అమ్మాయిని గదిలో పెట్టి తాళం వేశారేంటి?” అడిగాడు సూర్యదేవ్ వాళ్ళ వైపు చూసి.

“అది మా ఇష్టం. నువ్వెవరు అడగటానికి? అసలు మీరంతా ఎవరు?” అన్నాడు చైత్రన్.

“మేం ఎవరో తరువాత చెబుతాం” అంటూ బ్రహ్మయ్య, నాగేశ్వరిల వైపు చూసాడు.

“మీరేనా నివేద తల్లిదండ్రులు? మీరసలు నిజంగా నివేదకు తల్లిదండ్రులేనా? చదువుకుని జాబ్ చేస్తూ ఇండిపెండెంట్‌గా వుండే ఒక అమ్మాయిని మీరిలా బంధించటమేంటి?” అన్నాడు కోపంగా.

“అసలు నువ్వెవరు? ఎక్కువగా మాట్లాడుతున్నావ్! ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నివేదా వీడు నీ ఫ్రెండా? నువ్వు ఇలాంటి వాళ్ళను కూడా మెయింటెయిన్ చేస్తున్నావా?” అన్నాడు చైత్రన్.

కోపంతో సూర్యదేవ్ కళ్ళు ఎర్రబడ్డాయి.

చైత్రన్ చెంప పగలగొట్టాడు.

అది చూసి నివేద నివ్వెరపోయింది.

బ్రహ్మయ్య, నాగేశ్వరి విలవిల్లాడారు.

“ఎవరండీ మీరు? మా అబ్బాయి మీద చెయ్యి చేసుకుంటున్నారు?” అన్నాడు బ్రహ్మయ్య.

“వాళ్ళు పోలీసువాళ్ళు నాన్నా!” అంది నివేద.

అక్కడేం జరుగుతుందో అర్థం కాలేదు నాగేశ్వరికి.

“ఎవరో నలుగుర్ని తీసుకొచ్చి ఇది వేషాలు వేస్తోంది నాన్నా! నేను కూడా నా ఫ్రెండ్స్‌కి ఫోన్ చేస్తాను. వస్తారు. అప్పుడు ఎవరు ఎవరన్నది తెలుస్తుంది” అన్నాడు చెంపను అలాగే పట్టుకుని చైత్రన్.

కిటికీ అవతల నిలబడి వున్న నివేద చైత్రన్‌ని సూర్యదేవ్‌ని కళ్ళార్పకుండా చూస్తోంది.

“అసలీ గొడవలన్నీ దేనికి నివేదా! నిన్ను మేం ఏం చేశామని? అన్నయ్య చెప్పినట్లు వినీల్‌ని చేసుకుంటే నీకు మంచిదేగా! వినీల్‌ది ఎంత పెద్ద హాస్పిటల్. అతనెంత పెద్ద డాక్టర్. వద్దంటావెందుకు? అంత ఆస్తి వున్నవాళ్ళతో మనకు సంబంధం కుదరటమే ఎక్కువ. వాళ్ళేదో నిన్ను చేసుకుంటామంటున్నారు కానీ లేకుంటే వినీల్ లాంటి భర్త నీకు దొరుకుతాడా? మేం తేగలమా? అసలేం చూసుకునే నీకీ పొగరు?” అంది నాగేశ్వరి.

“అమ్మా నీకేం తెలియదు. నువ్వు వాళ్ళ వెనుక వుండే ఆస్తినే చూస్తున్నావ్! నాక్కావలసింది ఆస్తి కాదు. నన్ను చేసుకోబోయే మనిషి పూర్తిగా నా మనిషై వుండాలి. పెళ్లి ఒకరితో, ప్రేమ ఒకరితో ఈ నాన్సెన్స్ నాకొద్దు. ఇంతసేపు ఎందుకులే అని మీకో నిజాన్ని చెప్పకుండా దాచాను. అది తెలిస్తే నువ్వు నన్ను బావను చేసుకోమని అసలే చెప్పవు” అంది.

“ఇదేదో మళ్ళీ పిట్టకథ చెబుతోంది. దీని వేషాలు ఇది” అంటూ గొణుగుతూ నిలబడ్డాడు చైత్రన్.

“ఏంటో చెప్పు తల్లీ! అది విన్నాక నువ్వు బావను చేసుకోవాలా వద్దా అన్నది మేము నిర్ణయిస్తాం. నువ్వు ఇబ్బంది పడే చోట నిన్నెందుకు ఇస్తాం” అన్నాడు కూతురికి దగ్గరగా వెళ్లి అనునయంగా బ్రహ్మయ్య.

“బావ ఒకరిని ప్రేమిస్తున్నాడు నాన్నా!” అంది మెల్లగా.

“అది నీకెలా తెలుసు?” వెంటనే అడిగాడు చైత్రన్.

“నాకు తెలుసు. బావ ఫోన్‌లో చూసాను”

“బావ ఫోన్ నీకెలా వచ్చింది? నువ్వెలా చూసావ్? పూలు పెడుతున్నావా?” అన్నాడు చైత్రన్.

“పూలు కాదు. బావ ఫోన్ అత్తయ్య దగ్గర వుంటే దాన్ని బావకి ఇచ్చి రమ్మని నన్ను పంపింది. అప్పుడు దాన్ని ఓపెన్ చేసి చూసాను” అంది నివేద.

నాగేశ్వరి నమ్మలేదు.

“బావ నీమీద నిందలు వేసాడని బావ మీద నువ్వు కూడా ఇలా నిందలు వెయ్యాలని చూస్తున్నావా? ఇదేనా నీ సంస్కారం? ఇప్పుడు అతనికి నీకు తేడా ఏముంది? నువ్వు మా దగ్గర నేర్చుకున్నది ఇదేనా?” అంది.

“నిజంగానే చెబుతున్నానమ్మా! నేను చూసాను” అంది నివేద.

“ఏం చూసావే. వేషాలెక్కువయ్యాయి నీకు” అంటూ గద్దించాడు చైత్రన్.

“ఆ అమ్మాయి పేరు కూడా తెలుసు నాకు” అంది ఏమాత్రం బెదరకుండా.

“పేరు తెలుసా? తెలిస్తే చెప్పు?” అన్నాడు.

“ఇప్పుడా పేరు దేనికిలే. బావ మనసులో నేను లేను అన్నది చెప్పాగా చాలదా?” అంది.

“చాలదు. అయినా నువ్వు చెప్పేది డాక్టర్ సహస్ర గురించేనా?” అన్నాడు చైత్రన్.

“హా.. అవును. నీకెలా తెలుసు?” అంది నివేద ఆశ్చర్యపోతూ.

“అవన్నీ నీకన్నా ముందే తెలుసు నాకు. ఆ అమ్మాయి ఇక వినీల్ లైఫ్ లోకి రాదు. నీకా భయమేమి అక్కర్లేదు. ఆల్రెడీ నేను అదంతా సెట్ చేసి పెట్టాను” అన్నాడు.

“సెట్ చేసిపెట్టావా? ఏం చేశావన్నయ్యా?” అంటూ ఇంకా ఎక్కువ ఆశ్చర్యపోయింది నివేద.

అంతా విన్న సూర్యదేవ్‌కి చాలా వరకు క్లారిటీ వచ్చింది. వెంటనే గన్ బయటకు తీసాడు. చైత్రన్ నుదుటి మీద పెట్టాడు.

సూటిగా చూస్తూ “చెప్పు డాక్టర్ సహస్రను ఏం చేసావ్?” అన్నాడు సూర్యదేవ్.

గన్ చూడగానే నివేద భయపడింది.

ఇతనొచ్చింది నా కోసం కాదా? అయితే డాక్టర్ సహస్ర కోసం వచ్చాడా? సహస్ర ఇతనికెలా తెలుసు? అని అనుకుంటూ కళ్ళు తిరిగినట్లై దబ్బున పడిపోయింది.

శబ్దం రాగానే అటు చూసాడు సూర్యదేవ్. అక్కడ నివేద లేదు. కింద పడిపోయిందనుకున్నాడు.

కోపంతో సూర్యదేవ్ దవడ ఎముక బిగుసుకుంది.

“పద డోర్ ఓపెన్ చెయ్యి” అంటూ గన్ పట్టుకునే అతని చేత నివేద వున్న గది తాళం తీయించాడు..

(సశేషం)

Exit mobile version