Site icon Sanchika

అందమైన మనసు-15

[సహస్ర, వినీల్ మధ్య కలిగిన అపోహలు తొలగిపోతాయి. వినీల్ అక్కడే ఉండిపోతాడు. సూర్యదేవ్, నివేదతమ ఊరికి తిరిగి వచ్చేస్తారు. తన మావయ్య చేసిన మోసం గురించి సూర్యదేవ్‌కి చెబుతుంది నివేద. మావయ్య ఇంట్లో ఉండనని, హాస్టల్‌లో చేరుతుంది. ప్రియాంక ఫోన్ చేసి చైత్రన్‌ని సిటీకి రమ్మంటుంది. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చని అంటుంది. తల్లిదండ్రులకి చెప్పి బయల్దేరుతాడు చైత్రన్. అరుణాచల్ నుంచి వినీల్ ఫోన్ చేసి, తానిక ఊరు రానని, ఆ హాస్పిటల్‍తో తనకి సంబంధం లేదని చెప్పడం అతని తల్లిదండ్రులని బాధిస్తుంది. ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు. – ఇక చదవండి.]

[dropcap]చై[/dropcap]త్రన్ సిటీకి వెళ్ళాక ఖాళీగా లేడు. ‘నేను ఎంబీఏ కదా! నాకు ఎవరైనా ఇస్తారు జాబ్’ అన్న కాన్ఫిడెన్స్‌తో పెద్ద పెద్ద కంపెనీలకు వెళ్లి ట్రై చేసాడు. ఒక్క చదువే కాదు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా జాబ్‌కి అవసరం అన్నది చైత్రన్‌కి అర్థమైంది. ఇక తనకి జాబ్ రాదని గట్టిగా అనుకున్నాడు. ఇంటికి వెళ్లాలని హాస్టల్లో బ్యాగ్ సర్దుకుంటూ ప్రియాంకకు ఫోన్ చేసాడు.

ప్రియాంక తన వదిన చేస్తున్న ఫ్యాషన్ డిజైనింగ్‌లో హెల్ప్ చేస్తూ బిజీగా వుంది.

“ప్రియా! నీ ఫోన్ మోగుతుంది చూడు. చైత్రన్ అయివుంటాడు. వెళ్లి చూడు” అంటూ ప్రియాంకను ఫోన్ దగ్గరకు పంపింది ప్రియాంక వాళ్ళ వదిన.

ప్రియాంక ఫోన్ లిఫ్ట్ చేసి “హలో..” అంది.

“నేను ఊరు వెళుతున్నా ప్రియా!” అన్నాడు చైత్రన్.

అతను ఊరు వెళ్ళటం ప్రియాంకకు ఇష్టం లేదు.

“అక్కడకు వెళ్లినా నువ్వేం చెయ్యలేవు చైతూ! ఇక్కడే ఏదో ఒక పని చేసుకోవచ్చు కదా!”

“ఇక్కడేమున్నాయ్?”

“మనం చెయ్యాలంటే ఎన్ని లేవు. ఇప్పుడు ఖాళీగా ఉండకుండా మా వదిన చేస్తున్న డ్రెస్‌కి డిజైన్ చేస్తున్నా. చేసినందుకు మనీ ఇస్తుంది. నేను అంత చదివా, ఇంత చదివా అని పని చెయ్యకపోతే డబ్బులెలా వస్తాయి. మనం ఏదీ ఫ్రీగా చెయ్యంగా. అసలు నువ్వు ఇన్నిరోజులు ఏదో ఒక పని చేసుకుంటూ జాబ్ సెర్చింగ్ చెయ్యాలిసింది. అనవసరంగా ఇంటి దగ్గర నుండి డబ్బు తెప్పించుకున్నావ్! అదే అలవాటైంది. ఇప్పుడు చూడు హాస్టల్లో ఉండలేక ఇంటికెళుతున్నావ్. అసలు ఆంటీ నీ గురించి ఎంత బాధ పడుతున్నారో తెలుసా?” అంది.

“అమ్మకి నువ్వు ఫోన్ చేసావా?”

“లేదు. మన గురించి నువ్వు చెప్పినప్పటి నుండి ఆంటీనే చేస్తున్నారు. ఆమె మనసంతా నువ్వే వున్నావు చైతూ! ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు అక్కడకి వెళ్లి ఆమె కళ్ళ ముందు ఖాళీగా వుంటే బాధపడుతుంది. అందుకే ఏదైనా హోటల్లో చేరు. ఆ పని నువ్వు చెయ్యగలుగుతావు. అక్కడైతే ఫుడ్‌తో పాటు మనీ కూడా వస్తుంది” అంది.

ప్రియాంక మాటలు చైత్రన్‌కి నచ్చలేదు.

అసలు ప్రియాంకను సహస్ర వుండే హాస్పిటల్‌కి తీసికెళ్ళి తప్పు చేసాడేమో! లేకుంటే వినీల్ సహస్రను ప్రేమించాడని తెలిసేది కాదు. తెలిసినా మౌనంగా ఉంటే సరిపోయేది. అలా ఉండకుండా నివేదను వినీల్‌కి ఇవ్వాలనుకున్నాడు, వాళ్ళ ఆస్తి పట్ల ఆశపడ్డాడు. అందుకే ఇప్పుడు తన నోటికాడిది పోయింది. లేకుంటే వినీల్ ఇప్పుడు కూడా తనకు డబ్బు పంపేవాడు. అయినా నివేద తన మాట విని వినీల్‌ని పెళ్లి చేసుకుంటే ఏంపోయింది? ఇదంతా జరిగేదా?

“నువ్వు ఫోన్ పెట్టెయ్యి ప్రియా! నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను” అంటూ ఫోన్ కట్ చేసి నివేదకు ఫోన్ చేసాడు చైత్రన్.

చైత్రన్ ఫోన్ చూడగానే సంతోషంగా లిఫ్ట్ చేసి “హలో అన్నయ్యా! నీకు జాబ్ వచ్చిందా? అందుకే ఫోన్ చేసావా?” అంది నివేద.

“జాబ్ రాలేదు. నీ మీద కోపం వచ్చి ఫోన్ చేశాను”

“కోపం వచ్చిందా? నేనేం చేశాను అన్నయ్యా?”

“వినీల్‌ని నువ్వు పెళ్లి చేసుకుంటే నాకీ గతి పట్టేదా? నీ వల్లనే ఇప్పుడు వినీల్ నాకు డబ్బులు పంపట్లేదు. నేనెలా ఉండాలి ఇక్కడ? నువ్వేమైనా పంపుతావా? వుద్యోగం చేస్తున్నావుగా. వినీల్ దేనికి, నువ్వే పంపు” అన్నాడు.

“నేను పంపాలా? అడగటానికి నీకు లేకపోయినా పంపటానికి నాకుంది” అంది నివేద కోపాన్ని అణచుకుంటూ.

“ఏముందే నీకు? నీ జీతం మొత్తం ఒక్కదానివే తింటావా? ఏం నాకు పంపితే. ఈరోజే పంపు” అన్నాడు మొండిగా.

“నేను పంపను. నేను పని చేస్తుంటే నువ్వు ఖాళీగా తిరుగుతావా? ఏం నువ్వు పని చేసుకోలేవా? నీకున్న కాళ్ళు, చేతులు ఏమయ్యాయి? మొన్నటిదాకా నాన్న మీద ఆధారపడ్డావ్. వినీల్ మీద ఆధారపడ్డావ్. ఇప్పుడు నన్ను పంపమంటున్నావ్. నీమీద నువ్వు ఆధారపడలేవా? అసలు నీలాంటి అన్నయ్య నాకున్నాడని చెప్పుకోటానికే ఇబ్బందిగా వుంది”

“ఇబ్బంది కాదు నేను ఖాళీగా వున్నానని కుళ్ళు నీకు. ఆ కుళ్ళు వల్లే అంత గొప్ప డాక్టర్‌తో పెళ్లి కాకుండా హాస్టల్లో పడివున్నావ్. దేనికైనా రాసి పెట్టాలి. నీ రాతే అంత. లేకుంటే మామయ్య వాళ్లది ఎంత పెద్ద హాస్పిటల్. మహారాణిలా వుండేదానివి”

“ఇక నువ్వు ఇంతేనా అన్నయ్యా? నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు అత్తయ్య, మామయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? కానీ నువ్వు చేసిన పని వల్లనే బావ అరుణాచల్‌లో ఉండిపోయాడన్న విషయం వాళ్లకు తెలియదు. లేకుంటే మామయ్య నిన్ను చంపేసేవాడు. వాళ్లకు నువ్వే వాళ్ళ కొడుకును దూరం చేసావు. కన్నవాళ్లకు పిల్లలు దూరంగా ఉంటే ఎంత బాధ ఉంటుందో తెలుసా నీకు? బావ మీద మామయ్య ఎన్ని ఆశలు పెట్టుకుని ఆ హాస్పిటల్ కట్టించాడు. ఎన్ని కలలు కని డాక్టర్‌ని చేసాడు. అసలు నువ్వు చెయ్యాల్సిన పనేనా అది? తిడితే బాగుండదు కానీ నీలాంటి వాడిని ఎన్ని తిట్లు తిట్టినా తక్కువే. అయినా ఎన్ని తిట్టి ఏంలాభం తప్పు తెలుసుకునే సంస్కారం లేనప్పుడు”

“సంస్కారం మాట పక్కన పెట్టు. నువ్వు చెప్పేదంతా నిజమా నివేదా? వినీల్ నిజంగానే అరుణాచల్ వెళ్లిపోయాడా? ఇక రాడా? ఎంత మంచి మాట చెప్పావ్! ఇప్పుడు నాకు గాల్లో తేలినట్లుంది” అన్నాడు చైత్రన్.

చైత్రన్ అంత ఆనందంగా ఎందుకున్నాడో నివేదకు అర్థం కాలేదు.

“గాల్లో ఎందుకు తేలటం? అదేదో బంపర్ ఆఫర్ దొరికినట్లు ఎందుకంత పొంగిపోతున్నావ్”

“చెప్పినా నీకర్థం కాదులే. రేపే మామయ్య దగ్గరకు వెళతాను. అత్తయ్యను, మామయ్యను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. హాస్పిటల్ పనులన్నీ ఇక నావే. చూస్తూ వుండు మామయ్యకు కొడుకు లేని లోటు ఎలా తీరుస్తానో” అన్నాడు

“అదేదో మన అమ్మా, నాన్నకు తీర్చినట్లు ఏం మాట్లాడావ్ అన్నయ్యా లోటు గురించి”

“మన అమ్మా, నాన్నల దగ్గర ఏముందే తీర్చటానికి? సెంటు భూమి కూడా లేదు”

“భూమి లేకపోయినా ఒకరిని యాచించకుండా బ్రతుకుతున్నారుగా అన్నయ్యా! వాళ్ళు ఎవరి దగ్గరికో వెళ్లట్లేదు. ఎవరి పనులో చెయ్యట్లేదు. వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు వున్నారు. వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటున్నారు. గౌరవంగా, తృప్తిగా, నిజాయితీగా బ్రతకాలంటే వంద ఎకరాల భూమి ఉండక్కర్లేదని నేను మన అమ్మా, నాన్నలను చూసి తెలుసుకున్నాను. నీకు వుద్యోగం రాకపోవటం తప్పు కాదు. అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన నువ్వు ఎలా ఉండాలో తెలుసుకోలేకపోవటం తప్పు” అని ఫోన్ కట్ చేసింది నివేద.

ఆలోచనలో పడ్డాడు చైత్రన్.

ప్రియాంక తన పట్ల చూపే ప్రేమ గుర్తొచ్చి నిజంగానే ఏడ్చాడు.

వినీల్ సహస్ర ప్రేమ కోసమే కదా అంత పెద్ద హాస్పిటల్ వదిలి ఎక్కడో అరుణాచల్ వెళ్ళాడు. తను కూడ తన ప్రియాంక ప్రేమ కోసం ఏమైనా చెయ్యాలి. ఒళ్ళు వంచి కష్టపడందే ఏదీ రాదు. ప్రియాంకది కూడా కష్టపడే తత్వమే. ఏపని చేయటానికైనా సిద్ధంగా వుంది. అడవిలోకి తీసికెళ్ళినా వస్తానంటుంది. ఇక నైనా ప్రియాంకతో అబద్దాలు చెప్పకుండా, ఆధారపడకుండా బ్రతకాలి. అని మనసులో అనుకుంటూ అప్పటికప్పుడే చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాడు.

***

కాలం వేగంగా కదులుతోంది…

వినీల్ సహస్రను పెళ్లి చేసుకుని అరుణాచల్ లోనే వున్నాడు.

సత్యవతి కొడుకును తలచుకుని రోజూ బాధ పడుతూనే వుంది. హరనాధరావు హాస్పిటల్‌ని లీజుకి ఇచ్చాడు. కొద్దిరోజులు గడిచాక హరనాధరావుకు హాస్పిటల్ వల్ల ఏవో ఊహించని గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవల్ని తట్టుకోలేకపోతున్నాడు.

వినీల్‌కి చెప్పాడు ఫోన్‌లో. “నాకు సంబంధం లేదు నాన్నా! నువ్వు ఎలా చెయ్యాలనుకుంటే అలా చెయ్యి. నేనైతే ఏం చెయ్యలేను. నా పనులు నాకున్నాయి. వాటిని వదిలి నేనక్కడకి రాలేను. నువ్వన్నట్లు నేనూ, సహస్ర అక్కడకి వచ్చి ప్రాక్టీస్ పెట్టటమనేది జరగని పని. ఇక్కడ ఉంటేనే నాకు గౌరవం, తృప్తి. ఇక నువ్వు ఆ హాస్పిటల్ గురించి నాకు చెప్పకు. చెప్పినా వేస్ట్” అన్నాడు వినీల్.

అవాక్కయి ఫోన్ పెట్టేసాడు హరనాధరావు.

“ఏంటండీ అలా వున్నారు?” అంటూ వచ్చింది సత్యవతి.

“ఏముంది సత్యా! నేను ఏది చేసినా వినీల్ కోసమేగా చేసాను. కష్టపడి హాస్పిటల్ కట్టించాను. అందులో ఎప్పటికీ వాడే వుంటాడనుకున్నాను. లేడు. ఇప్పుడా హాస్పిటల్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. మనుషులే కాదు ఆస్తులు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తాయా?

మనుషులైతేనే కదా మోసం చేస్తారు. ముంచుతారు. తొక్కుతారు. వెన్నుపోటు పొడుస్తారు. వెటకారం చేస్తారు. అవమానపరుస్తారు. గాయపరుస్తారు. కానీ నోరులేని ఆస్తుల వల్ల కూడా ఇన్ని ఇబ్బందులు ఉంటాయా?” అన్నాడు.

“ఎందుకుండవు. అదేమైనా మీరు మీ కష్టార్జితంతో కట్టించిన హాస్పిటలా, ఇబ్బందులు లేకుండా వుండటానికి? తోడపుట్టిన సొంత చెల్లెల్ని దగా చేసి కట్టించారు. కొడుకును లేని కష్టాల్లో పడేలా చేసారు. ఇంకా మీకా ఆస్తి పిచ్చి తగ్గలేదు. నేను కట్టించా, నేను కట్టించా అంటూ దాని చుట్టే తిరుగుతున్నారు. ఏలేవాడు లేనప్పుడు రాజ్యమైనా, ఇల్లైనా, హాస్పిటలైనా అలాగే ఉంటుంది. మనశ్శాంతి ఎలా వస్తుంది? నాగేశ్వరి ఉసురు వూరికేపోతుందా? తగలదా? ఆడవాళ్ళను దోచుకున్న వాళ్ళు బాగుపడ్డట్లు ఎక్కడైనా చదివారా? విన్నారా? చూసారా?” అంది సత్యవతి.

తల తిరిగిపోయింది హరనాధరావుకి.

“అప్పుడే ఏమైంది? ఇంకా ఎన్ని చూడాలో… ఇప్పుడు కొడుకు ఒక్కడే దూరమయ్యాడు. నేరాలు, ఘోరాలు చేసి సంపాయించిన ఆస్తులు చివరికి ఇలాగే వుంటాయి. నోరున్న మనుషుల్లాగా వేధిస్తాయి, సాధిస్తాయి” అంది.

“నువ్వు చెప్పేది వింటుంటే నిజమే అనిపిసుంది సత్యా! మనది కాని దాన్ని మనది చేసుకోటానికి ఎంతో కష్టపడతాం. కానీ ఈలోపలే కాలం చాలా మాయలు చేస్తుంది. మన ఆశతో మనల్నే పొడుస్తుంది. ఇప్పటికి పొడిపించుకున్నది చాలు. ఈరోజే బ్రోకర్‌తో మాట్లాడతాను. మా నాన్న మా చెల్లికి ఎంత పొలం ఇమ్మన్నాడో అంత పొలం కొని నాగేశ్వరికి ఇస్తాను” అన్నాడు.

“ముందా పని చెయ్యండి. మన ఇంటికి పట్టిన దోషాలన్నీ పోతాయి” అంది సత్యవతి.

బ్రోకర్‌తో మాట్లాడాలని ఫోన్ అందుకున్నాడు హరనాధరావు.

హరనాధరావు ఫోన్ చూడగానే ఆ బ్రోకర్ చాలా ఉత్సాహంగా మాట్లాడాడు.

“మీరు అమ్మిన పొలాన్ని వాళ్ళు అమ్మకానికి పెట్టారు సార్! కానీ రేటు మాత్రం చాలా ఎక్కువ చెబుతున్నారు”

“ఎంతైనా పర్వాలేదు. ఆ పొలం నాకు కావాలి.”

“సరే సార్! నిన్ననే ఎవరో కొనాలని చూసి వెళ్లారు.”

“వాళ్లకన్నా ఎక్కువ కమీషన్ ఇస్తాను. ఆ పొలం నాకే అయ్యేలా చూడు. నేను ఇప్పుడే వస్తున్నా. అది నేను అమ్మిన పొలమే కాబట్టి డాక్యుమెంట్స్ కరెక్టుగానే ఉంటాయి. నేను ఇప్పుడే వస్తున్నా. డబ్బు కట్టి ఈరోజే మా చెల్లెలు నాగేశ్వరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను” అంటూ అప్పుడే కారులో వెళ్ళిపోయాడు హరనాధరావు.

***

నాగేశ్వరి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించిన పొలం పేపర్స్ తెచ్చి సత్యవతికి చూపించాడు హరనాధరావు.

“ఈ పేపర్స్ తీసికెళ్ళి నాగేశ్వరికి ఇచ్చి వద్దాం సత్యా! ఇప్పటి నుండి ఆ పొలం వాళ్లు సొంతం చేసుకుని పండించుకుంటారు. ఇక వాళ్ళకి వేరే వాళ్ళ పొలం కౌలుకి తీసుకోవలసిన అవసరం వుండదు” అన్నాడు హరనాధరావు.

“అలాగే. కానీ నాగేశ్వరి దగ్గరకి కాదు. ముందు మనం నివేద దగ్గరకి వెళదాం. నివేదను తీసుకుని వాళ్ళ ఊరు వెళదాం. మీరు చేసిన ఈ పని నివేదకు తెలియాలి. వాళ్ళ విషయంలో మీరు ఎంత బాధపడుతున్నారో తెలియాలి” అంది సత్యవతి.

“అలాగే సత్యా! నేను ఆ రోజు ఆవేశంతో నివేదపై చేయి ఎత్తాను. ఆ తరువాత చాలా బాధపడ్డాను. అదంతా నివేదకు చెప్పాలి. మనతో నివేదను తీసుకొద్దాం. హాస్టల్లో వుండకుండా ఇక మనతోనే వుంచుకుందాం. ఏమంటావ్?” అన్నాడు.

“వస్తుందా?”

“ఎందుకు రాదు. నేను పిలిస్తే వస్తుంది సత్యా! ఆ ఒక్క తప్పు తప్ప నేనేం చేశాను? ఇప్పుడా తప్పును సవరించుకున్నాను. వస్తుంది” అన్నాడు.

“సరే! మన ప్రయత్నం మనం చేద్దాం” అంది సత్యవతి.

ఇద్దరు కారులో కూర్చుని మధురిమా హాస్టల్‌కి వెళ్లి నివేదను కలిశారు. నివేదతో మాట్లాడారు.

“సారీ మామయ్యా! నేను మీతో అలా మాట్లాడవలసింది కాదు” అంది నివేద.

“ఒక్కోసారి అలా మాట్లాడటం అవసరం నివేదా! కానీ నేను నీ మీదకు చెయ్యి లేపటం తప్పు. పెద్దవాడిని కాబట్టి క్షమించమని అడగను”

“అయ్యో! మామయ్యా అలా అనకండి. మీరు నన్ను మీ బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకున్నారు. ఆ మాత్రం మీరు నా మీద కోప్పడటంలో ఏమాత్రం తప్పు లేదు. కోపతాపాలు సహజం”.

“నువ్వు అలా అనగానే నేను సంతోషపడను. నువ్వు ఎప్పట్లాగే మన ఇంటికి వచ్చి మాతో వుండాలి అప్పుడే నాకు సంతోషం” అన్నాడు.

సత్యవతి కూడా “కాదనకు నివేదా! నువ్వు లేకుంటే అసలు ఆ ఇల్లు ఇల్లులా లేదు” అంటూ నివేద చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుంది

“అలాగే మామయ్యా! వస్తాను. మీతోనే వుంటాను” అంది నివేద.

“సరే నీ లగేజి తీసుకుని నువ్వూ, మీ అత్తయ్య వెళ్లి కారులో కూర్చోండి. నేను ఈ లోపల హాస్టల్ మేడంతో మాట్లాడి వస్తాను” అంటూ హరనాధరావు వెళ్ళాడు.

హరనాధరావు హాస్టల్ మేడంతో మాట్లాడి కారు దగ్గరకు వచ్చాడు. ఆయన కూర్చోగానే కారు కదిలింది.

కారులో వెళుతూ నివేద ఏ.ఎస్.పి ఆఫీస్ వైపు చూసింది. అక్కడ ఏ.ఎస్.పి. గారి వెహికిల్ లేదు.

‘ఏ.ఎస్.పి. గారు బయటకు వెళ్లి వుంటారు’ అని మనసులో అనుకుంది నివేద.

కారులో ఒక గంట ప్రయాణం చెయ్యగానే నివేద వాళ్ళ ఇల్లు వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరు.

కారును పొలం వైపు పోనిచ్చారు.

అక్కడ పొలంలో బ్రహ్మయ్య, నాగేశ్వరి పని చేస్తూ కనిపించారు.

చైత్రన్ మట్టి లోడు వున్న ట్రాక్టర్‌ని నడుపుతున్నాడు. అతని పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని వున్నారు.

చైత్రన్‌ని చూడగానే “చైత్రన్ కదూ! ఆశ్చర్యంగా వుందే. పొలమంటేనే పరిగెత్తేవాడు, పొలం పనులు చేస్తున్నాడా?” అన్నాడు నివేద వైపు చూసి.

“చేస్తున్నాడు మామయ్యా! ఇక సిటీకి వెళ్ళడట. వాళ్ళ ఫ్రెండ్స్‌ని కూడా తనతో కలుపుకున్నాడు. ముగ్గురు కలిసి కొత్తరకం వ్యవసాయ పద్ధతులతో ముందుగా మామిడితోట వేశారు. టమోటాలు, క్యాబేజి, ముల్లంగి, క్యారెట్ లాంటి కూరగాయలు కూడా పండించాలని ట్రాక్టర్‌తో మట్టి తోలుతున్నాడు. పనివాళ్ళ మీద ఎక్కువగా ఆధారపడకుండా పనులన్నీ ఆ ముగ్గురే చేస్తున్నారు” అంది నివేద.

“నాగేశ్వరి అదృష్టవంతురాలు. కన్నకొడుకు కళ్ళముందే వున్నాడు. అందుకే అంటారు భాగ్యాన్ని పంచుకోలేమని. ఎవరి భాగ్యం వాళ్లదే. చైత్రన్‌ని చూస్తుంటే సంతోషంగా ఉందండీ!” అంది సత్యవతి.

కారు చూడగానే చైత్రన్ ట్రాక్టర్ లోంచి దిగాడు.

ఫ్రెండ్స్‌తో “మా మామయ్య వస్తున్నాడు. రండి ఆయన దగ్గరకి వెళదాం” అంటూ పొలం మధ్యలోంచి ఫ్రెండ్స్‌ని తీసుకుని కారు దగ్గరకు వెళ్ళాడు.

బ్రహ్మయ్య, నాగేశ్వరి “అన్నయ్య వచ్చాడు” అంటూ వాళ్ళు కూడా కారు దగ్గరకి వెళ్లారు.

అందర్ని చూసి “ఇలా రండి. ఇక్కడ కూర్చుందాం” అంటూ వాళ్ళను చెట్టు నీడకు తీసికెళ్ళాడు హరనాధరావు. పలకరింపులు, పరిచయాలు అయ్యాక అందరు ఆ చెట్టు నీడలో కూర్చున్నారు.

“నివేద చెప్పింది చైత్రన్ మీ ముగ్గురు కలిసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారని. చాలా మంచి ఆలోచన. ఆలోచన రావటం కన్నా మీ ముగ్గురిలో పొలం పనులు చెయ్యగలిగే శక్తి వుంది. శక్తి ఉండటం వేరు దాన్ని గుర్తించి మీకోసం మీరు ఉపయోగించుకోవటం వేరు. మీరిప్పుడు కరెక్ట్ వేలో వున్నారు. అందుకు అభినందిస్తున్నా” అన్నాడు హరనాథరావు.

హరనాధరావు మాటలు అంత ఎండలో కూడా ఆ ముగ్గురికి హాయిగా వున్నాయి.

“అందరూ వినండి! ఇవి మా నాన్నగారు మా చెల్లెలు నాగేశ్వరికి ఇచ్చిన పొలం తాలూకు రిజిస్ట్రేషన్ పత్రాలు. వీటిని మీ అందరి సమక్షంలో నాగేశ్వరికి ఇస్తున్నా. ఈ పొలం మీద హక్కు ఎవరికైనా ఆమె తదనంతరమే వుంటుంది. అలా అని రాయించి తెచ్చాను” అన్నాడు.

పులకించిపోయింది నాగేశ్వరి. ఆ పేపర్లని అలాగే పట్టుకుని ‘ఇదంతా నా కొడుకు అదృష్టం’ అనుకుంది మనసులో. బ్రహ్మయ్య, నివేద, చైత్రన్ నవ్వుతూ నాగేశ్వరిని చూసారు.

హరనాథరావు చైత్రన్ వైపు చూసి “చైత్రన్! మీ తాతయ్య పొలాన్ని మీ ముగ్గురు మీకు నచ్చిన పద్ధతిలో సాగుచేసుకోండి. మీ చదువుకీ మీరు చేస్తున్న పనికి సంబంధం లేదని అనుకోవొద్దు. చాలా మంది వాళ్ళ చదువులతో సంబంధం లేని పనులే చేస్తున్నారు” అన్నాడు.

చైత్రన్ ఫ్రెండ్స్ సంతోషపడ్డారు.

ఆయన అలా మాట్లాడుతుండగానే చైత్రన్ ఫ్రెండ్ ట్రాక్టర్‌లో టౌన్‌కి వెళ్లి భోజనం తెచ్చాడు. ఆ చెట్టు నీడలోనే అందరికి అరిటాకులు వేసి అన్నం వడ్డించాడు. తింటున్నంత సేపు హరనాధరావు సంతోషంగా మాట్లాడుతూనే వున్నాడు. తిన్నాక భోజనం బాగుందని మెచ్చుకున్నారు.

“ఇక మేం బయలుదేరుతాం బావగారు! నివేదకు పెళ్లి చేసి పంపేవరకు మా ఇంట్లోనే ఉంటుంది” అన్నాడు హరనాధరావు.

నాగేశ్వరి, బ్రహ్మయ్య ఎప్పటిలాగే మౌనంగా చూసారు.

నివేదతో కలిసి వాళ్ళు కారులో కూర్చున్నాక కారు కదిలింది.

(సశేషం)

Exit mobile version