[సిటీకి వచ్చిన చైత్రన్‌కి ఉద్యోగం దొరకదు. డబ్బు సర్దుబాటు కాక తిరిగి ఊరెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇక్కడే ఉండి ఏదైనా పని వెతుక్కోమని ప్రియాంక చెబితే వినడు. తన ఈ స్థితికి కారణం నివేదనే అని భావించి తనని డబ్బులివ్వమంటాడు. నివేద చెప్పిన మాటలతో చైత్రన్‌లో ఆలోచన కలుగుతుంది. ఒక గట్టి నిర్ణయంతో ఊరెళ్ళిపోతాడు. అరుణాచల్‌లో వినీల్, సహస్ర పెళ్ళి చేసుకుంటారు. ఊర్లో లీజుకి ఇచ్చిన తమ హాస్పిటల్ గొడవలతో తనకు సంబంధం లేదని అంటాడు వినీల్. హరనాధరావు బాధపడితే, సత్యవతి అతన్ని ఓదారుస్తూ, మంచి మాటలు చెప్పి అతని మనసు మారుస్తుంది. ఒకప్పుడు తాను కాజేసిన పొలాన్ని మళ్ళీ కొని చెల్లి పేరు మీద రిజిస్టర్ చేయిస్తాడు హరనాధరావు. నివేదకి ఫోన్ చేసి, తనని మన్నించమని కోరి మళ్ళీ తమ ఇంటికి రప్పించుకుంటారు హారనాధరావు, సత్యవతి. చెల్లెలి పొలం పత్రాలు ఇవ్వడానికి ఊరు వెళ్ళి, అక్కడ చైత్రన్ పొలంలో కష్టపడడం చూసి మెచ్చుకుని, పత్రాలు చెల్లెలు నాగేశ్వరికి ఇచ్చేస్తాడు హరనాధరావు. అందరూ సంతోషిస్తారు. – ఇక చదవండి.]
[dropcap]గ[/dropcap]దిలో ఫోన్ రింగ్ అవుతుంటే కింద వున్న నివేద పైకి పరిగెత్తింది. సూర్యదేవ్ ఫోన్ చేస్తున్నాడు. లిఫ్ట్ చేసి “హలో” అంది నివేద.
“ఎక్కడున్నావ్ వేదా? ఫోన్ లేదు. మెసేజ్ లేదు. హాస్టల్‌కి ఫోన్ చేస్తే ఎవరో బంధువులొస్తే వెకేట్ చేసి వెళ్లిందన్నారు. అసలే నీ ఫోన్‌కి ఛార్జింగ్ పెట్టవు. దాన్ని అలాగే వదిలేస్తావ్. నీ గురించి ఆలోచించేవాళ్ళు వున్నారని కూడా ఆలోచించవు. అసలేంటి ఇదంతా? ఎక్కడున్నావ్?” అన్నాడు.
అంత పెద్ద ఏ.ఎస్.పి. గారు తన పట్ల అంత ఆత్రుత చూపించటం, తనకేదో అయినట్లు కంగారు పడటం బాగుంది. జీవితాంతం ఇలా తనకోసం ఒకరు వుంటే ఆ ఒక్కరు సూర్యదేవ్ అయితే ఎంత బాగుండు. అతను ఒక డ్యూటీలా కాకుండా తనంటే ప్రాణం పెడుతున్నాడని అర్థమవుతున్నా కావాలనే దూరంగా వుంటోంది. దగ్గర కావాలని వున్నా మనసును విప్పి మాట్లాడలేకపోతోంది. ఇలా ఎన్నాళ్ళు?
“ఏంటి మాట్లాడవు?”
“నన్ను జీవితాంతం ఇలాగే చూసుకుంటారా?” అంది నివేద.
“ఈమాట ఎప్పుడు అడుగుతావా అని చూస్తున్నా. నమ్మకం లేదా?”
“నమ్మకం లేక కాదు”
“మరి ఇంకేంటి నీ భయం? అవునూ! ఆరోజు మీ అన్నయ్య ముఖం మీద గన్ను పెట్టగానే కింద పడిపోయావెందుకు? గన్నంటే అంత భయమా?”
“గన్నన్నా భయమే. మీరన్నా భయమే. ఏదో అలా నటిస్తున్నా అంతే భయం లేనట్లు”
“అవునా! మరి నేనలా చెయ్యకపోతే మీ అన్నయ్య నిన్నా గదిలోంచి వదిలేవాడా? నిజం చెప్పేవాడా?”
“చెప్పడు. కానీ ఇప్పుడు అన్నయ్య ఎలా వున్నాడో, ఎక్కడ వున్నాడో తెలిస్తే నమ్మలేరు. వుండండి ఇప్పుడే మీ వాట్సాప్‌కి అన్నయ్య ఏం చేస్తున్నాడో నేను తీసిన పిక్‌లు పంపిస్తాను” అంటూ చైత్రన్ వేసిన మామిడితోట, కూరగాయలు పండించటానికి ట్రాక్టర్‌తో అతనే స్వయంగా మట్టి తోలటం, అతని ఫ్రెండ్స్ కూడా అతనితో వుండటం లాంటి ఫొటోలు పంపింది.
సూర్యదేవ్ ఆమెతో మాట్లాడుతూనే వాట్సాప్ ఓపెన్ చేసి ఫొటోలు చూసాడు.
“వెరీ నైస్” అన్నాడు.
“అంతేకాదు. అమ్మకి తాతయ్య ఇచ్చిన పొలాన్ని అమ్మ పేరుతో రాసిచ్చారు మామయ్య… అత్తయ్య, మామయ్య హాస్టల్‌కి వచ్చి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. నా పెళ్లి అయ్యేవరకు నేను ఇక్కడే వీళ్ళ దగ్గరే వుండాలట” అంది నివేద.
“బాగుంది. ఇప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకోవాలంటే మీ మామయ్యతో మాట్లాడాలా? మీ నాన్నగారితోనా?” అన్నాడు.
పెళ్లి అనగానే నివేద మనసు మౌన మృదంగమే అయింది.
“ముందు మా నాన్నగారితో మాట్లాడండి. తరువాత ఆయనే మా మామయ్యతో, బంధువులతో మాట్లాడుకుంటారు” అంది నివేద.
“సరే వేదా!” అంటూ చాలా సేపు మాట్లాడుకున్నారు. సూర్యదేవ్ మాట్లాడుతుంటే నివేద వింటూ కూర్చుంది.
***
సూర్యదేవ్‌తో నివేద పెళ్లి జరిగిన కొద్దిరోజులకే చైత్రన్ ప్రియాంకను పెళ్లి చేసుకున్నాడు. చైత్రన్ పొలం వెళితే ప్రియాంక ఇంటి పనులు చూసుకుంటుంది. బ్రహ్మయ్య, నాగేశ్వరి ప్రశాంతంగా కాలం గడుపుతున్నారు.
సూర్యదేవ్, నివేద ఒక పదిరోజులు బయటకు వెళ్లి వాళ్లకు నచ్చిన ప్రదేశాలు చూసి వచ్చారు.
అలేఖ్య మల్లికార్జున్‌ని తీసుకుని ఏ.ఎస్.పి. ఆఫీస్‌కి వచ్చింది. వాళ్ళను చూడగానే అభిమానంగా కూర్చోమన్నాడు సూర్యదేవ్.
ఇద్దరు కూర్చున్నారు.
కూర్చోగానే “మల్లికార్జున్ నా మాట వినట్లేదు సర్! నన్ను సరిగా చూసుకోవటం లేదు” అంది అలేఖ్య.
సూర్యదేవ్ కావాలనే టైం కోసం చేతి వైపు చూసుకుని “నాకు కాఫీ టైం అయింది. మనం పైకెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం” అన్నాడు.
వాళ్ళను పైకి తీసికెళ్ళి “వేదా! ఎవరొచ్చారో చూడు” అంటూ నివేదను పిలిచాడు సూర్యదేవ్.
నివేద అలేఖ్యను చూడగానే “వావ్” అంటూ అలేఖ్యకు దగ్గరగా వెళ్లి వాటేసుకుంది.
సూర్యదేవ్ నవ్వి “మీ ఇద్దరిని ఇలా చూద్దామనే పైకి తీసుకొచ్చాను” అన్నాడు.
“కూర్చోవే” అంటూ తన పక్కన కూర్చోబెట్టుకుంది నివేద.
సూర్యదేవ్, మల్లికార్జున్ ఎదురెదురుగా కూర్చున్నారు.
హోమ్ మెయిడ్ కాఫీ తెచ్చి నలుగురికి ఇచ్చింది.
కాఫీ తాగుతూ మల్లికార్జున్‌తో మాట్లాడాడు సూర్యదేవ్.
మల్లికార్జున్ సూర్యదేవ్‌తో మాట్లాడుతున్న విధానం చూసి ఆశ్చర్యపోయింది అలేఖ్య.
“చూసారా! మీతో ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నాతో ఒక్క మాట కూడా మాట్లాడడు. నోట్లో చాక్లెట్ ఉన్నట్లు నోరు విప్పడు. నాతో కూడ ఇలా మాట్లాడొచ్చుగా. మాట్లాడితే ఇక్కడకి తీసుకొస్తానా?” అంది.
సూర్యదేవ్ నవ్వుతూ నివేద వైపు చూసాడు.
నివేద సైగ చేసింది ‘నేను మాట్లాడతాను’ అన్నట్లుగా.
సూర్యదేవ్ ‘అలాగే’ అన్నట్లు చూసాడు.
“మల్లికార్జున్ నీతో మాట్లాడటం లేదన్నదే కదా నీ కంప్లైంట్ ఇప్పుడు అలేఖ్యా?” అంది నివేద.
“అవును అది తప్ప ఇప్పుడైతే ఇంకేం లేదు. ఉంటే మీకు తప్ప ఎవరికి చెబుతాను?” అంది అలేఖ్య.
“సరే! మరి నువ్వు మాట్లాడుతున్నావా మల్లికార్జున్‌తో. ఆఫీస్‌కి వెళ్లేముందు కానీ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక కానీ..” అంది నివేద.
అలేఖ్యకు వుడికిపోయింది.
“ఎలా మాట్లాడతాను, ఆయనేమైనా నా మనసులో ఉన్నట్లు నాతో వుంటున్నాడా?” అంది.
“నీ మనసులో ఉన్నట్లు అంటే?”
“నాకు ఏదేదో వుంటుందిలే అదంతా పైకి చెబుతామా?”
“పైకి చెప్పకపోతే పాలాక్షుడు కూడా తెలుసుకోలేడు. మల్లికార్జున్ ఎలా తెలుసుకుంటాడు?”
“పాలాక్షుడు ఎవరే. కొత్త కొత్త పేర్లు చెబుతుంటావ్. ముందు మల్లికార్జున్ ఎలా మారాలో చెప్పు?”
“మల్లికార్జున్ మారాల్సిందేమీ లేదు. నువ్వు మారాలి. నీకు బద్ధకం బాగుంది. అది పోవాలి”
“నాకెక్కడుందే బద్ధకం? నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు. సర్! నివేదకేం తెలియదు. ఏదేదో అనేస్తుంది. మీరు కౌన్సిలింగ్ ఇస్తే ఆయన బాగుంటారు నాతో” అంటూ సూర్యదేవ్ వైపు చూసింది.
“కౌన్సిలింగ్ మల్లికార్జున్‌కి కాదు నీకివ్వాలి” అంది నివేద నవ్వి.
“నాకెందుకే కౌన్సిలింగ్. అసలేంటే నీ బాధ? నన్ను మాట్లాడనియ్యవా?” అంది అలేఖ్య
“ఇక్కడెందుకే మాట్లాడటం. అదేదో ఇంట్లో మల్లికార్జున్‌తో మాట్లాడు. అక్కడ మాట్లాడాలంటే బద్ధకం. మనసులో ఏముందో చెప్పాలంటే బద్ధకం. అన్నీ మల్లికార్జునే తెలుసుకోవాలి. నీ అంత కొశ్చన్ మార్క్‌తో చెయ్యాలంటే ఎవరికైనా ఇలాగే వుంటుంది. పోనీ మాట్లాడలేకపోతే మెసేజ్ అయినా పెట్టొచ్చుగా. అది కూడా బద్ధకమే. నీకు బద్ధకం వుందీ అంటే ఒప్పుకోవు. ఎలా చెప్పు?” అంది నివేద.
అలేఖ్య ఆలోచిస్తోంది నివేద చెప్పింది నిజమేనా? అని..
సూర్యదేవ్ ఫోన్ రింగ్ అయింది. డాక్టర్ వినీల్ చేసాడు.
వినీల్ చెప్పేది విని “వావ్ కంగ్రాట్స్ వినీల్! ఒక్క నిమిషం ఫోన్ నివేదకు ఇస్తాను” అంటూ “నివేదా! మీ బావకి బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిందట” అన్నాడు.
ఫోన్ తీసుకుని “కంగ్రాట్స్ బావా!” అంది నివేద. ఫోన్ సూర్యదేవ్‌కి ఇచ్చింది. కొద్దిసేపు మాట్లాడి పెట్టేసాడు సూర్యదేవ్.
“బావకి బెస్ట్ డాక్టర్ అవార్డు వచ్చిందట అలేఖ్యా!” అంది గొప్పగా నివేద.
“నేను చెప్పలేదా మీ బావ సర్జన్. ఎప్పుడైనా ఆయనతో పెట్టుకోవద్దు అని..” అంది అలేఖ్య.
“ఏడిసావ్ లే! ఆయనే పెద్ద గొప్పనా? మా ఆయనకు కూడా ‘ఉత్తమ సేవా పతకం’ వస్తుంది చూడు” అంది మరింత గొప్పగా.
మల్లికార్జున్, అలేఖ్య సూర్యదేవ్ వైపు గౌరవంగా చూసారు.
సూర్యదేవ్ నవ్వాడు. మృదు గంభీరంగా వుందా నవ్వు. అతనలా నవ్వటం చాలా తక్కువ. నివేద మనసును సూటిగా తాకిందా నవ్వు.
ఇన్ని రోజులు నివేదలో అందమైన మనసు మాత్రమే వుందనుకున్నాడు సూర్యదేవ్. ఇప్పుడు ఆత్మవిశ్వాసాన్ని చూస్తున్నాడు.
“అలేఖ్యా! ఇంత ఆత్మవిశ్వాసం, అందమైన మనసు గల నివేద నా భార్య కావటం నా అదృష్టం. నువ్వు మల్లికార్జున్ మీద కంప్లైంట్ ఇవ్వటానికి నా ఆఫీస్‌కి రాకపోయివుంటే నివేదతో నా పరిచయం జరిగేది కాదు. చాలా థ్యాంక్స్” అన్నాడు.
“ఇట్స్ ఓకే ఏ.ఎస్.పి గారు! చూడు నివేదా! మనం ఫ్రెండ్స్ కాబట్టి ఇక ముందు ఎప్పుడొచ్చినా ఇలా ఇంటికే వస్తాం. ఆఫీస్ లోకి రాము. ఆ అవసరం రానివ్వను. నువ్వన్నట్లు నోటితో మాట్లాడలేకపోయినా మల్లికార్జున్‌కి నా మనసులో మాటను మెసేజ్ పెడతాను” అంటూ లేచింది అలేఖ్య. మల్లికార్జున్ కూడా లేచాడు.
“అలాగే” అంది నివేద నవ్వి.
వాళ్లిద్దరు వెళ్లిపోతుంటే అభిమానంగా వాళ్ళనే చూస్తూ నిలబడ్డారు సూర్యదేవ్, నివేద.
(సమాప్తం)