అందమైన మనసు – 4

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]నా[/dropcap]లుగు రోజుల నుండి నివేద ఫోన్‌కి ఛార్జింగ్ లేదు. హాస్పిటల్లో ఆ సంఘటన జరిగాక ఆ హడావుడిలో వుండి అసలామె ఫోన్ గురించే పట్టించుకోలేదు. కాలేజీ నుండి రాగానే మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టింది. మొబైల్ ఆన్ చెయ్యగానే సూర్యదేవ్ నంబర్ నుండి వచ్చిన మిస్డ్ కాల్స్ కనిపించాయి.

“ఓ మైగాడ్.. డిన్నర్ అయ్యాక గదిలోకి వెళ్లి సూర్యదేవ్‌కి ఫోన్ చెయ్యాలి” అని మనసులో అనుకుంది నివేద.

డిన్నర్ చెయ్యగానే నివేద గుర్తొచ్చింది సూర్యదేవ్‌కి. ఈ రోజైనా ఆమె ఫోన్ కలుస్తుందేమో చూద్దాం అనుకుంటూ ఫోన్ పట్టుకుని పైకి వెళ్ళాడు.

గోడ అవతల లేడీస్ హాస్టల్ బాల్కనీలో అమ్మాయిలంతా అప్పుడే డిన్నర్ చేసి గదుల్లోకి వెళుతూ కనిపించారు. ఆ బాల్కనీలో జీరో లైట్ వున్నందువల్ల అమ్మాయిలు స్పష్టంగా బయటకు కనిపించరు. అది ఆ హాస్టల్ మేనేజ్మెంట్ తీసుకున్న జాగ్రత్త కావొచ్చు. సూర్యదేవ్ అక్కడ నుండి వెళ్లి ముందు భాగంలో నిలబడి నివేదకు ఫోన్ చేసాడు.

నివేద ఫోన్ లిఫ్ట్ చేసి “డిన్నర్ అయ్యాక నేనే కాల్ చేద్దామనుకున్నాను” అంది.

“డిన్నర్ అయిందా?”

“అయింది”

“మరి కాల్ చేయలేదేం?”

“జస్ట్ చెయ్యబోతున్నా. మీరే చేసారు”

“గుడ్. ఒకసారి పైకి వస్తావా? నేను పైనే వున్నా”

నివేద ఒక్క ఉదుటన లేచి పరిగెత్తుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది.

“నేను మీ పైన వున్నాననుకున్నావు కదూ! చాలా వేగంగా వచ్చావ్ పైకి. ఒక్కోసారి అంతే మైండ్ తప్పు చెబుతుంది. కన్ఫ్యూజ్ అవుతాం. నువ్వే కాదులే ఎవరైనా” అన్నాడు.

నివేద సిగ్గుపడి తలమీద కొట్టుకోలేదు కానీ నవ్వుకుంది తనలో తనే.

“ఇక్కడ వెన్నెల బాగుంది. అక్కడ కూడా వుందా?”

“ఉంది”

“ఉందని నాకు తెలియదా. అక్కడ కూడా వెన్నెల బాగుంది అనాలి. ఇక్కడ మా గోడ అవతల బిల్డింగ్ బాల్కనీలో చాలా మంది అమ్మాయిలు కనిపిస్తున్నారు. కానీ నేను అటువైపు చూడను. ముందు వైపు బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను నిన్ను మాత్రమే చూడాలని”

“నన్ను మాత్రమే చూడాలనా!! అక్కడ నేనెలా కనిపిస్తాను? మీరు ఏ.ఎస్.పి అయినంత మాత్రాన మీరు ఏది చెబితే అది నేను నమ్మాలా?”

“నేనొక ఏ.ఎస్.పి. నువ్వొక లెక్చరర్. ఇవి ఎందుకొస్తాయి మధ్యలో… వాటిని గుర్తుచేసుకోకుండా వుండలేవా?”

“ఎలా వుంటాను? ఏంటో మీరు. నాకేమో వున్నది వున్నట్లుగా మాట్లాడితేనే సరిగా అర్థం కాదు. లేనిది వున్నట్లుగా మాట్లాడితే అసలేం అర్థమవుతుంది?”

“అందుకే నువ్వు చూట్టానికి పాలలో ముంచిన పచ్చ చామంతిలా వుంటావని నేను చెప్పినా నమ్మవేమో!! అదెలానో చూపించమంటావ్. నేనెక్కడ చూపించను. అందుకే నువ్వు నాకు వెన్నెల్లో కనిపిస్తావు. పువ్వుల్లో కనిపిస్తావు అని చెప్పాలని వున్నా చెప్పకుండా ఆగిపోతున్నా”

“ఆగడమే మంచిది. నేను వుంటే కాలేజీలో వుంటాను. లేదంటే ఇంట్లో వుంటాను” అని అనాలని వున్నా అనలేదు. అంటే ఇంకేం అంటాడో అని..

“మా పక్కన వుండే లేడీస్ హాస్టల్ మేడం తెలుగు నావెల్స్ బాగా రాస్తారు వేదా! నేను వాటిని తెప్పించుకుని చదివాను. ఆమె రాసిన ఒక నవలలో లెక్చరర్‌గా వర్క్ చేసే అద్వైత అనే అమ్మాయి తన ప్రేమతో ఒక టెర్రరిస్ట్‌ని మంచివాడిగా మార్చేసి దేశాన్ని కాపాడుతుంది. నాకు నిన్ను చూసాక ఆ నవలలోని అద్వైతలా అనిపించావు” అన్నాడు.

“బాబోయ్ నేనిప్పుడు ఉగ్రవాదులను మార్చాలా ఏం? చూస్తుంటే నాకేదో పెద్ద బాధ్యతే అప్పజెప్పేలా వున్నారు” అంది నివేద నవ్వి.

అతను కూడా నవ్వాడు.

“ఏమో ఎవరు చూసారు. జీవితం అంటేనే ఒక యుద్ధం కదా! అందులో ఎదురయ్యే ప్రతి సమస్యా ఒక ఉగ్రవాదినే. ఎదుర్కోక తప్పదు. అవునూ! మీ ఊరెప్పుడు వెళ్ళావు? అక్కడ సిగ్నల్స్ లేవా? నేను ఎప్పుడు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఊరి నుండి ఎప్పుడొచ్చావ్?”

“నేను ఊరు వెళ్ళలేదు. ఏదో అప్పుడప్పుడు తప్ప అక్కడ సిగ్నల్స్ బాగానే వుంటాయి. నా మొబైల్‌కి ఛార్జింగ్ పెట్టలేదు”

“మొబైల్ కి ఛార్జింగ్ ఎందుకు పెట్టలేదు?”

“ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్. అందులో పడి మరచిపోయాను”

“అలాగా! నేనలా అనుకోలేదు. ఊరు వెళుతూ నాకు చెప్పకుండా వెళ్లిందేమిటి అనుకున్నాను. అంటే ప్రతిదీ నాకు చెప్పాలనికాదు. అలా అనిపించింది” అన్నాడు.

సూర్యదేవ్ అలా అనటం నివేదకు బాగుంది. మనకన్నా మన గురించి ఆలోచించేవాళ్ళు వుండటం, మనకు ప్రాధాన్యత ఇవ్వటం మామూలు విషయం కాదు. మనం వాళ్ళ గుండెను అంతో, ఇంతో ఎంతో కొంత ఆక్రమించుకుంటేనే అది సాధ్యం.

“మాట్లాడు వేదా!” అన్నాడు.

నివేద ఉలిక్కిపడి “ఉ.. ” అంది.

“ఉ.. కాదు మాట్లాడు. నువ్వలా మాట్లాడకుండా మౌనంగా వుంటే నేనలా ఆలోచించకూడదేమోననిపిస్తుంది నాకు. నీపట్ల నాకామాత్రం చనువు, అభిమానం వుండొచ్చా? పర్వాలేదా? నీకేం ఇబ్బంది లేదుగా” అన్నాడు.

అదే మాట ఇంకెవరన్నా ఊరుకునేది కాదు నివేద.

అయినా అతను అడిగినదానికి ‘లేదు’ అని సమాధానం ఇస్తే తనంతటి తనే అతనికి చనువు, హక్కు ఇచ్చినట్లవుతుంది. ‘ఉంది’ అంటే అతన్ని తనంతటి తనే దూరం చేసుకున్నట్లవుతుంది. అందుకే ఆలోచిస్తోంది.

ఆమె మౌనంగా వుండటంతో సూర్యదేవ్ కూడా తొందరపడ్డానేమో అనుకున్నాడు.

“ఏంటండీ వేద గారు నేను తప్పుగా ఏమైనా అడిగానా?” అన్నాడు.

“ఇప్పుడు అండీలు, గారెలు వాడి నన్ను దూరం పెట్టడం ఎందుకులెండి! మీరేం తప్పుగా మాట్లాడలేదు. ఇక్కడేవో బుక్స్ కిందపడితే సర్దుతూ వెంటనే రెస్పాండ్ కాలేదు” అంటూ అబద్దం చెప్పింది.

వెంటనే కాకపోయినా ఆలస్యంగానైనా అతనికి రావలసిన, కావలసిన సమాధానం ఆమె నుండి వచ్చింది.

“నువ్వొకసారి అలేఖ్యతో మా ఆఫీస్‌కి రాగలవా వేదా! ఓ.. అలేఖ్యతో రావాలంటే మల్లికార్జున్ తనని ఏదో ఒకటి చెయ్యాలి కదా! లేకుంటే వీలు కాదేమో! పోనీ నేను మీ కాలేజీ దగ్గరకి రానా?” అన్నాడు.

“మీరొస్తారా? ఇంకేమైనా వుందా?” అంటూ వణికిపోయింది నివేద.

“నువ్వలా వణికిపోతావని తెలిస్తే అడిగేవాడిని కాదు” అన్నాడు సూర్యదేవ్.

అతను ఇంకా ఏదో అనబోతుంటే కిందనుండి వాళ్ళమ్మగారు పిలిచారు. “నాన్నా సూర్యదేవ్! నిన్ను మీ నాన్నగారు పిలుస్తున్నారు “ అని…

“నేను తరువాత కాల్ చేస్తాను వేదా!” అంటూ కాల్ కట్ చేసాడు సూర్యదేవ్.

***

వినీల్ ఎక్కడ వున్నా, ఏం చేస్తున్నా అతనికి సహస్ర బాగా గుర్తొస్తోంది. అలా గుర్తు రావడం వల్లనే ఆ రోజు అతను చేస్తున్న ఆపరేషన్ ఫెయిల్ అయింది. దానివల్ల ఒకరి ప్రాణాలు పోయాయి. జైలుకి పోయాడు. పరువు పోయింది. ఇప్పుడు హాస్పిటల్‌కి కూడా పోలేకపోతున్నాడు. ఇదంతా సహస్ర వల్లనే జరిగింది. ఇంకెప్పుడూ అలా జరగకూడదు. అలా జరగకూడదు అంటే సహస్రను పూర్తిగా మరచిపోవాలి. సహస్రను పూర్తిగా మరచిపోయాకనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. కానీ సహస్రను మరచిపోవాలంటే ఏం చేయాలి? సహస్రను మరచిపోవచ్చు అంటే ఏమైనా చేస్తాడు. ఏం చెయ్యటానికైనా సిద్ధంగా వున్నాడు. కానీ ఏంచెయ్యాలన్నదే అతని ఆలోచన.

***

అందరూ భోంచేసి పడుకున్నాక మెల్లగా హరనాధరావుతో చెప్పింది తన ఆలోచన ఏమిటో సత్యవతి. అయన వినగానే ఆశ్చర్య పోలేదు. ఆలోచించాడు.

“ఏమంటారు? ఇది మీకు బాగా నచ్చితేనే చేద్దాం. లేకుంటే దీన్ని ఇంతటితో వదిలేద్దాం” అంది ఆమె తెలివిగా.

“ఎందుకు వదలాలి సత్యా! నువ్వేమైనా తప్పుగా ఆలోచిస్తే కదా! నీ ఆలోచన బాగుంది. వినీల్‌తో మాట్లాడదాం “ అన్నాడు హరనాధరావు.

“వినీల్ ఒప్పుకుంటాడా నివేదను పెళ్లి చేసుకోటానికి?” అంది సందేహంగా.

“ఒప్పుకుంటాడు. లేదంటే ఒప్పిద్దాం. నివేద మనకు కోడలు కావటం అన్ని విధాలా బాగుంటుంది. ఎందుకంటే నివేద మంచి సమర్థురాలు. సమయస్ఫూర్తి వున్న అమ్మాయి. పైగా మన కళ్ళ ముందు పెరిగింది. వినీల్ ఎలా వున్నా, ఏ మూడ్‌లో వున్నా వాడిని మార్చుకోగలదు. అంతటి శక్తి వుంది నివేదకు. ఈ పెళ్లి జరిగితే మన ఇల్లే కాదు హాస్పిటల్ కూడా బాగుంటుంది” అన్నాడు

“సరే పదండి వెళ్లి అబ్బాయితో మాట్లాడదాం” అంటూ లేవబోయింది.

“ఆగు సత్యా వెళదాం. ఎలా మాట్లాడితే బాగుంటుందో నన్ను కొంచెం ఆలోచించుకోనివ్వు” అన్నాడు.

ఆమె “అలాగే” అంటూ కూర్చుంది.

ఆయన కొద్దిసేపు అలోచించి “నివేద కాలేజీ నుండి రాకముందే వినీల్‌తో మాట్లాడదాం సత్యా! వినీల్ అభిప్రాయం తెలుసుకున్నాకే నివేదతో మాట్లాడదాం. సరేనా! రా వెళదాం” అంటూ సత్యవతిని తీసుకుని వినీల్ దగ్గరకి వెళ్ళాడు.

వినీల్ బాల్కనీలో కూర్చుని కళ్ళు మూసుకుని వున్నాడు.

“నాన్నా వినీల్” అంటూ ప్రేమగా పిలిచాడు హరనాధరావు.

వినీల్ కళ్ళు విప్పి చూసి “రండి నాన్నగారు కూర్చోండి” అన్నాడు.

హరనాధరావు తోపాటు సత్యవతి కూడా వినీల్ కి ఎదురుగా కూర్చుంది.

“నేనూ, అమ్మా నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాము వినీల్”

“మాట్లాడండి నాన్నగారు”

“నువ్వు జరిగింది మరచిపోకుండా దాన్నే ఆలోచిస్తున్నావ్ వినీల్! మానసికంగా బాగా నలిగిపోతున్నావ్. జరిగింది పూర్తిగా మరచిపోతేనే నువ్వు మానసికంగా, శారీరకంగా శక్తివంతుడవు అవుతావు. లేకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే వుంటావు. మనోవేదన మంచిది కాదు నాన్నా! దాన్నుండి వీలైనంత త్వరగా బయట పడాలి. లేకుంటే పూర్వ వైభవం పోయి పాతాళాన్ని చూస్తాము” అన్నాడు.

“మీరంటున్నది నిజమే నాన్నగారు! నేనిప్పుడు నిజంగానే పాతాళంలో వున్నాను. నాకు అక్కడ వుండాలని లేదు. వీలైనంత త్వరగా పైకి రావాలని వుంది” అన్నాడు వినీల్.

“అందుకే కొద్దిరోజులు మన హాస్పిటల్‌ని మీ ఫ్రెండ్ డాక్టర్ రఘును చూసుకోమని చెబుదాం. నువ్వు ఈ ఊరు వదిలి నీకు నచ్చిన ప్రదేశాలు చూసిరా. అప్పుడు నువ్వు ఈ చేదు జ్ఞాపకాల్లోంచి తప్పకుండా బయట పడతావు” అన్నాడు హరనాథరావు.

వెంటనే సత్యవతి కల్పించుకుంది.

“ఇలాంటి స్థితిలో వాడు ఒక్కడే బయటకెళ్ళటం నాకు ఇష్టం లేదు” అంది.

“ఒక్కడే వెళ్ళడు సత్యా! తోడుగా నివేద కూడా వెళుతుంది “ అన్నాడు హరనాథరావు.

“నివేదనా!” అడిగాడు అర్థం కాక వినీల్.

“అవును వినీల్. నివేద వస్తుంది నీకు తోడుగా. కొద్దిరోజులు కాదు జీవితాంతం. అలా వుండాలనే నేనూ, అమ్మా నీకూ నివేదకు పెళ్లి చెయ్యాలనుకున్నాం. నివేద నీ పక్కన వుంటే అప్పుడు నిన్ను ఏ జ్ఞాపకాలు వెంటాడవు. అన్నీ మరచిపోతావు. ఎప్పటిలా వుంటావు” అన్నాడు హరనాధరావు.

ఆలోచించాడు వినీల్. సహస్ర ఎక్కడుందో తెలియదు. ఒకరు అరుణాచల్ వెళ్లిందంటే ఇంకొకరు స్టేట్స్ వెళ్ళిందంటున్నారు. అసలు వుందో లేదో అని కూడా అంటున్నారు. అలాంటి మిస్టరీని ప్రేమించి జీవితాన్ని ఇంకా ఎందుకు నవ్వుల పాలు చేసుకోవాలి? సహస్ర ఒక్కతే అమ్మాయా? నివేద కాదా? మనకంటూ ఒక మనిషి కావాలనుకున్నప్పుడు ఎవరైతేనేం?

“ఏంటి నాన్నా వినీల్ ఆలోచిస్తున్నావ్? నా మాటలు నీకు నచ్చలేదా?”

“అదేం లేదు నాన్నగారు!” అన్నాడు వినీల్.

‘హమ్మయ్యా’ అని మనసులో అనుకుని “సరే! వినీల్! నీతో అన్ని విషయాలు తరువాత మాట్లాడతాను” అంటూ హరనాధరావు లేచి కిందకి వెళ్ళాడు. ఆయనతోపాటు సత్యవతి కూడా వెళ్ళింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here