అందమైన మనసు-6

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]ని[/dropcap]వేద ఎప్పుడూ లేచినట్లే తెల్లవారక ముందే నిద్ర లేచింది.

బ్రష్ చేసుకుని, స్నానం చేసింది.

కానీ ఎప్పట్లాగే వంట గదిలోకి వెళ్ళలేదు. వినీల్‌కి కాఫీ ఇవ్వలేదు. తను కూడా తాగలేదు.

పనిమనిషి తన పని తను చేసుకుంటోంది. హరనాధరావు, సత్యవతి గదిలోంచి ఇంకా బయటకు రాలేదు.

నివేద కాలేజీ టైం అయ్యేంత వరకు ఆలోచిస్తూ తన గదిలోనే కూర్చుంది. తరువాత లేచి గబగబా కాలేజీ బ్యాగ్‌లో తన డ్రెస్‌లు, బుక్స్ పెట్టుకుంది. ఎవరికీ చెప్పకుండా కాలేజీకి వెళ్ళింది.

కాలేజీ అయ్యాక తన ఫ్రెండ్ వాళ్ళ హాస్టల్లో వుండాలని వెళ్ళింది. అక్కడ వేకెన్సీ లేదన్నారు. నేరుగా ‘మధురిమా హాస్టల్’కి వెళ్లి జాయిన్ అయింది. ప్రెషప్ అయి డిన్నర్ హాల్లోకి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్సవరూ లేరు. ఒంటరిగానే కూర్చుని కడుపు నిండా తిన్నది. గదిలోకి వెళ్లి పడుకుంది. నిద్ర రాలేదు.

పక్క బెడ్ మీద ‘మౌనరాగం’ నవల కనిపించగానే చదువుతూ కూర్చుంది.

నవల చదవటం పూర్తికాగానే అటు తిరిగింది. పక్క బెడ్ అమ్మాయి లేచి నివేదనే చూస్తోంది.

“కొత్త ప్లేస్ కదా నిద్రపట్టలేదు. మీ బెడ్ మీద ఈ బుక్ వుంటే తీసుకుని చదివాను. నేను నవల చదవటం ఇదే ఫస్ట్ టైం… ” అంది నివేద.

“అవునా! ఆ నవల మన హాస్టల్ మేడం రాసారు. ఇంకా చాలా రాసారు. ‘మౌనరాగం’ నాకు బాగా నచ్చిన నవల” అంది ఆ అమ్మాయి.

లేచి కూర్చుంది నివేద.

“నిజమే ఈ బుక్ చదివాక ఎలా వుండాలో, ఎలా వుండకూడదో తెలిసింది. ఎత్తులు, జిత్తులు, పైఎత్తులు తెలిసాయి. మోసపోకుండా వుండాలంటే ఎలా వుండాలో తెలిసింది. సమస్యలు వచ్చినప్పుడు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసింది. పట్టుదల, క్రమశిక్షణ, సర్దుబాటు, ఓర్పు, నేర్పు, కట్టుబాట్లతో పాటు ఆత్మస్థయిర్యానికి, ఆత్మగౌరవానికి వున్న విలువ తెలిసింది. లక్ష్యాలను ఏర్పరచుకోవడం, గమ్యాలను చేరుకోవటం అంటే ఏమిటో దానికోసం ఎంత కష్టపడాలో తెలిసింది.

ఇంకా ప్రేమ, దయ, గెలవటం, ఓడిపోవటం లాంటివి ఎంత ఆనందాన్ని, బాధని ఇస్తాయో తెలిసింది. ముఖ్యంగా నచ్చని అలవాట్లను ఎంత వేగంగా మార్చుకోవచ్చో తెలిసింది. ఇన్ని తెలియాలీ అంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడితేనో, మెసేజ్‌లు పంపితేనో రాదు. ఇలాంటి పుస్తకాలు చదివితేనే సాధ్యం. సమయం, సందర్భం కుదిరితే ఇలాంటి పుస్తకాలు తప్పకుండా చదవాలి” అంటూ ఆ పుస్తకాన్ని ఆ అమ్మాయికి ఇచ్చి ‘థ్యాంక్స్’ చెప్పి పడుకుంది నివేద.

***

నివేద కాలేజీ నుండి ఇంటికి రానప్పటి నుండి సత్యవతి కంగారు పడుతోంది.

“నిన్నటి నుండి నివేద కనిపించటం లేదు. ఎటు వెళ్లినా చెప్పకుండా వెళ్ళదు. నాకు భయంగా ఉందండీ” అంది సత్యవతి.

“వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. నువ్వు భయపడి నన్ను భయపెట్టకు” అన్నాడు హరనాధరావు.

“అంత కచ్చితంగా ఎలా చెబుతున్నారు?”

“నివేద ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. వాళ్ళ ఊరిలో సిగ్నల్స్ వుండవు, అందుకే వాళ్ళ ఊరు వెళ్ళిందనుకుంటున్నా.”

“అదైనా మనతో చెప్పి వెళ్లాలిగా. చెప్పకుండా ఎందుకెళ్లాలి?”

“వాళ్ళ అమ్మను, నాన్నను చూడాలనిపించిందేమో. వెళ్లి వుంటుంది. వస్తుందిలే. నివేద చిన్న పిల్ల కాదు. అయినా అప్పుడప్పుడు ఇలా చెప్పకుండా కూడా వెళుతుందిగా.”

“వెళుతుంది. కానీ వెళుతున్నానని ఫోన్ చేస్తుంది. ఇప్పుడు పోన్లేదు, ఏం లేదు.”

“నిన్ననేగా వెళ్ళింది. రేపు వస్తుందిలే సత్యా! వూరికే కంగారు పడకు. నేను ముంబై వెళుతున్నా. వెళ్ళాక ఫోన్ చేస్తా” అంటూ ఆయన వెళ్లిపోయారు.

వినీల్ పైనుండి కిందకి రాలేదు. నివేద గురించి అడగలేదు.

***

నివేద కాలేజీ అయ్యాక హాస్టల్‌కి వెళ్లకుండా అలేఖ్య దగ్గరకి వెళ్ళింది.

నివేదను చూడగానే “నిన్నటి నుండి నీ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో వుంది. ఏమయ్యావే? మల్లికార్జున్ ఇంట్లోంచి వెళ్ళిపోయి రెండు రోజులైంది తెలుసా!” అంది ఆత్రంగా.

‘దీని గోల దీనిది’ అని మనసులో అనుకుంటూ “అవునా…!” అంది నిస్తేజంగా సోఫాలో కూలబడి నివేద.

“ఏంటే అలా వున్నావ్?” అంది అలేఖ్య.

“ఏం లేదు.”

“నీ ఫోన్ ఏది?”

“హాస్టల్లో బ్యాగ్‌లో పడేసి వచ్చాను. ఇప్పుడా ఫోన్‌తో ఏం పని? నేనే వచ్చానుగా ఏం మాట్లాడతావో మాట్లాడు” అంది నివేద.

“హాస్టల్ ఏంటి? బ్యాగేంటి?”

“నేను ఇంట్లోంచి బయటకు వచ్చాను. హాస్టల్లో జాయిన్ అయ్యాను.”

“హాస్టల్లో జాయిన్ అయ్యావా? ఏంటే ఈ పని?”

“ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది. ఆలస్యం చేశాను.”

“ఏదో జరిగింది. లేకుంటే నువ్వు హాస్టల్లో చేరటమేంటి? నిన్ను మీ అత్తయ్యా, మామయ్య ఎంత బాగా చూస్తారు. నీక్కూడా వాళ్లంటే ఎంత ప్రేమ.”

“నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో తెలియదు కదా!”

“ఏంటా మార్పులు? చెప్పు వేదా? నువ్విలా హాస్టల్లో వుండటం నాకు బాధగా వుంది.”

“బాధ ఎందుకు? నాకు చాలా రిలీఫ్‌గా వుంది. ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఎందుకున్నానా అనిపిస్తోంది. అంత గాయపడింది నా మనసు. నేను పేదపిల్లనట. ఇంకా ఆ ఇంట్లోనే వుంటున్నానట” అంది ఉక్రోషంగా.

“ఎవరన్నారు?”

“మొన్నొక బంధువు వచ్చింది. ఆవిడ అన్నారు.”

“చచ ఈ బంధువులు ఇంతే వేదా! ఇలాగే మాట్లాడతారు. అవతలి వాళ్ళ బాధతో వాళ్లకు అవసరం లేదు. వాళ్ల మాటల్ని అసలు పట్టించుకోవద్దు” అంది అలేఖ్య.

“పట్టించుకోక అక్కడే వుండాలా? కేవలం చదువు మీద నాకున్న ప్రేమతో వున్నాను కానీ లేకుంటే ఎందుకుంటాను? ఒకరి ఇంట్లో ఉంటే ఎప్పటికైనా ఇలాగే వుంటుంది.”

“ఆవిడేదో అన్నదని నువ్వు మీ మామయ్యను, అత్తయ్యను దూరం పెట్టి చూడకు వేదా! ఎప్పటికైనా వాళ్ళు నీవాళ్ళు” అంది.

“అవును. నా వాళ్లే. వినీల్ బావకి నన్నిచ్చి పెళ్లి చేస్తారట. అత్తయ్య అంటుంటే విన్నాను. నేనేమైనా బొమ్మనానే! నాకు మనసు వుండదా! బావను నేనెలా పెళ్లి చేసుకుంటాను. ఇదేమైనా బాగుందా? వినటానికే విసుగ్గా వుంది. అందుకే వచ్చేసాను.”

“చెప్పే వచ్చావా?”

“చెబితే రానిస్తారా?”

“మరి నీకోసం వెతుకుతారేమో! ఎప్పటికైనా తెలియదా నువ్వు ఇక్కడున్నట్లు?”

“ఇప్పుడైతే తెలియదుగా “

“కానీ నువ్వు జాగ్రత్తగా వుండాలి వేదా! మీ మామయ్య గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. మా అరుంధతి పెద్దమ్మ చెప్పేది వింటే మీ మామయ్య ఎలాంటి వాడో తెలుస్తుంది”

“నువ్వు చెప్పేది నాకేం అర్థం కాలేదు అలేఖ్యా!”

“నేనొకరోజు నిన్ను మా పెద్దమ్మ దగ్గరకి తీసికెళ్తాను. అన్ని విషయాలు ఆమె చెబుతుంది నీకు. సరేనా?”

“సరే! మీ పెద్దమ్మ ఎక్కడుంటారు?”

“మీ కాలేజీ వెనకాల నల్లటి కొండలకి దగ్గరలో కొన్ని ఇళ్ళు వున్నాయి. నీకు ఐడియా వుందా?”

“వుంది..”

“అక్కడో పెద్ద గ్రీన్ హౌస్ వుంటుంది. దాని ఎదురు ఇల్లే పెద్దమ్మ వాళ్ళది. సరే! ఈ రోజు నువ్వు ఇక్కడే పడుకో మల్లికార్జున్ కూడా లేడుగా. రేపు వెళ్లొచ్చు హాస్టల్‌కి”

“అలాగే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. ఈ రాత్రికి నేను ఇక్కడే వుంటున్నట్లు హాస్టల్ మేడంకి ఫోన్ చేసి చెబుతాను” అంటూ అలేఖ్య ఫోన్ తీసుకుని ఈ రోజు హాస్టల్‌కి రానని మేడంకి ఫోన్ చేసి చెప్పింది నివేద.

ఆ రాత్రంతా ఇద్దరు మాట్లాడుకుంటూ పడుకున్నారు.

***

తెల్లవారింది…

నివేద ప్రెషప్ అయి అలేఖ్య పెట్టిన టిఫిన్ తిని, టీ తాగి “ఇక నేను వెళతాను అలేఖ్యా!” అంది.

“నేను కూడా మీ హాస్టల్‌కి వస్తాను” అంది అలేఖ్య.

“నీకేమైనా మతిపోయిందా! మల్లికార్జున్ వస్తాడు. ఇంట్లోనే వుండు” అంది నివేద.

“ఎందుకే అంత భయపడతావ్? నేనేమైనా హాస్టల్లో వుండటానికి వస్తున్నానా? ఇంట్లో బోర్ కొడుతోంది. హాస్టల్ మేడం రాసిన నవలలు తెచ్చుకుందామని. అంతే!”

“నీది స్మార్ట్ ఫోన్ కాబట్టి ఆ నవలలు నువ్వు నీ మొబైల్లో కూడా చదువుకోవచ్చు. మేడం నవలలు ఆన్లైన్లో దొరుకుతాయి”

“మొబైల్లో చదవటం ఇప్పుడు నా వల్ల అయ్యేపని కాదు. నాకు బుక్కే కావాలి. పద వెళదాం”

“మరి నువ్వు హాస్టల్లో నా గురించి ఎవరికీ చెప్పకుండా వుంటావా?”

“చెప్పను. హాస్టల్లోనే కాదు ఎక్కడా చెప్పను. నేను నీగురించి చెప్పాలీ అంటే అది నీకు బాగా హెల్ప్ అవుతుందనిపిస్తేనే చెబుతాను. లేకుంటే చెప్పను. నేను నీ ఫ్రెండ్‌ని కదే. ఆ మాత్రం తెలియదా నాకు” “సరే! డోర్ లాక్ చెయ్యి వెళదాం” అంటూ ఇద్దరు హాస్టల్‌కి వెళ్లారు.

వాళ్ళు హాస్టల్లోకి వెళ్లాలని మెట్లెక్కుతుంటే కిటికీ అవతల కాఫీ తాగుతున్న సూర్యదేవ్ చూసాడు. నివేదను చూసి ముందు నమ్మలేదు కానీ పక్కన అలేఖ్య కనిపించగానే నమ్మాడు. అతను చూసింది వాళ్లకు కనిపించదు. ఫ్రెండ్స్ కోసం వెళుతున్నారేమో అనుకున్నాడు.

సరిగ్గా అప్పుడే సూర్యదేవ్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ హాస్టల్ మేడం నుండి వచ్చింది.

లిఫ్ట్ చేసి “మేడం నమస్తే చెప్పండి. ఎలా వున్నారు? హాస్టల్ ఎలా నడుస్తోంది?” అడిగాడు సూర్యదేవ్.

“నమస్తే ఏ.ఎస్.పి గారు! మీరు మా పక్కన ఉన్నందువల్ల మా హాస్టల్ ఎప్పుడూ బాగానే ఉంటుంది. మీరు మాకు ఇస్తున్న సెక్యూరిటీ అలాంటిది. నిన్నటి నుండి ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది సర్!”

“ఏంటా ప్రాబ్లం చెప్పండి?” అన్నాడు వెంటనే సూర్యదేవ్. అతనికి ఆ మేడం పట్ల ప్రత్యేకమైన అభిమానం, గౌరవం వున్నాయి.

“మనకి ఎదురుగా ఎవరో కాలేజీ వాళ్ళు వాళ్లకు తెలిసిన అబ్బాయితో బాయిస్ హాస్టల్ పెట్టించారట. అందులో వుండే వాళ్లంతా ఎంబీఏ ఫస్టియర్ స్టూడెంట్స్ అని విన్నాను. వాళ్లలో ఒక అబ్బాయి ఎక్కువగా మన హాస్టల్ వైపు చూస్తూ అమ్మాయిలకు ఇబ్బంది కలిగిస్తున్నాడు. మీక్కూడా కనిపిస్తాడు రెడ్ షర్ట్ అబ్బాయి. ఒకసారి ఆ అబ్బాయిని పిలిపించి కొంచెం వార్నింగ్ ఇవ్వండి సర్!” అంది మేడం.

“అలాగే మేడం. మీ అమ్మాయిలను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి”

“తప్పకుండా చెబుతాను. థ్యాంక్యూ సర్” అంది.

సూర్యదేవ్ ఫోన్ పెట్టేసాడు.

ఒక గంట గడిచాక సూర్యదేవ్ రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డాడు. అతని ప్యాంట్ జేబులో గన్ వుంది. అతనికి ఎదురుగా కాలేజీ ఇంచార్జ్ వున్నాడు. ఇంకా ఆ కాలేజీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు స్టాఫ్ కూడా వున్నారు. సూర్యదేవ్ వాళ్లతో మాట్లాడుతున్నాడు.

అటు వైపు బిల్డింగ్‌పై కొంతమంది అమ్మాయిలు, ఇటు వైపు బిల్డింగ్‌పై కొంతమంది అబ్బాయిలు నిలబడి ఏం జరుగుతోంది అని రోడ్డు వైపు చూస్తున్నారు.

“బాయిస్ హాస్టల్ ఎవరిది?” అని ఇంచార్జ్‌ని అడిగాడు సూర్యదేవ్.

“మాదే సర్!” వినయంగా చెప్పాడు ఇంచార్జ్.

“అమ్మాయిల హాస్టల్ ముందు మీరిలా అబ్బాయిల హాస్టల్ పెట్టొచ్చా?”

“మధ్యలో రోడ్డు వుందిగా సర్! అందుకే పెట్టాం”

“రోడ్డు ఉన్నాసరే మీరా హాస్టల్ తీసెయ్యాలి”

“ఎందుకు సర్! మా వల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చిందా? ఎవరైనా కంప్లైంట్ చేసారా?”

“లేదు. ఇమీడియట్‌గా హాస్టల్ తీసెయ్యాలి”

“లేదు సర్! రీజన్ లేకుండా హాస్టల్ తియ్యడమంటే కొంచెం కష్టం సర్!” అంటూ ఆ ఇంచార్జ్ హాస్టల్ తియ్యటానికి ఒప్పుకోలేదు.

సూర్యదేవ్ సీరియస్ అయ్యాడు. గట్టిగా మాట్లాడాడు.

“మీ డైరెక్టర్ వెంటనే నా ముందు ఉండాలి” అన్నాడు.

సూర్యదేవ్ అలా మాట్లాడగానే వణికిపోయాడు ఇంచార్జ్.

డైరెక్టర్ వచ్చాడు. సూర్యదేవ్‌ని రిక్వెస్ట్ చేసుకున్నాడు.

“నేను అమ్మాయిలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడటం లేదు. మా ఆఫీస్‌కి ఎదురుగా అబ్బాయిల హాస్టల్ వుండటం మాక్కూడా సేఫ్ కాదు. ఆ అబ్బాయిల్లో ఎవడు స్టూడెంట్‌నో ఎవడు నక్సలైట్ నో చెప్పలేం. దానికి మీరు బాధ్యత వహిస్తానంటే నా అభ్యంతరమేం లేదు” అన్నాడు సూర్యదేవ్.

సూర్యదేవ్ ఆ మాట అనగానే డైరెక్టర్ ఆలోచించాడు. సూర్యదేవ్‌తో పెట్టుకుంటే ఇబ్బంది రావొచ్చనుకున్నాడు.

వెంటనే హాస్టల్ తీసెయ్యటానికి ఒప్పుకున్నాడు.

సూర్యదేవ్ ఆఫీస్ లోకి వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే ఎక్కడివాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.

ఇదంతా హాస్టల్ మేడంతో పాటు కొంతమంది అమ్మాయిలు బాల్కనీలో నిలబడి చూసారు. వాళ్లలో నివేద, అలేఖ్య వున్నారు.

మేడం అప్పుడే అమ్మాయిలతో ఏ.ఎస్.పి గారి గురించి గొప్పగా మాట్లాడింది. చాలా కృతజ్ఞత చూపించింది.

అలేఖ్య నివేదను గదిలోకి లాక్కెళ్లి గుండెల మీద చేయిపెట్టుకుని “బాబోయ్! ఇంతవరకు మనం చూసింది ఆ ఏ.ఎస్.పి గారినేనా? ఏంటే అంత గంభీరంగా, అంత కోపంగా మాట్లాడాడు. ఆ ఇంచార్జ్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్లి డైరెక్టర్‌ని తీసుకొచ్చాడు. చూసావుగా ఎలా చేసాడో వాళ్ళని. అప్పటికప్పుడే హాస్టల్ తీసేసేలా చేసాడు. నువ్వన్నట్లు పోలీసులంటే మాటలు కాదు వేదా! నేను కాస్త భయంగానే వుంటాను. ఇంతక ముందులా వుండను” అంది.

నివేద ఇంకా మన లోకం లోకి రాలేదు. ఆమెకు సూర్యదేవ్ వాళ్లతో మాట్లాడటం, వాదించటం కళ్ళలో మెదులుతోంది.

మొన్న రాత్రే కదా ఇదే ఏ.ఎస్.పి గారు తనకి ఫోన్ చేసారు. ‘నీ వాయిస్ ఏంటి వేదా అంత డల్‌గా వుంది. ఏమైనా ప్రాబ్లమా? నువ్వింకా డిన్నర్ చెయ్యలేదా? మరి బయటకు రాగలవా? నువ్వుండే ఏరియా చెబితే నేనొస్తాను. నాతో కలిసి డిన్నర్ చేద్దువు’ అన్నాడు. ఆ మాటల్లో ఎంత లాలన వుంది. ఎంత ప్రేమ వుంది. ఆ క్షణంలో ఆ మాటలు తన మనసును ఎంత సుతారంగా నిమిరాయి. ఎంత వద్దనుకున్నా అలాంటి ప్రేమ కావాలని, అలాంటి లాలింపు కావాలని ఏ అమ్మాయికైనా వుంటుంది. తనక్కూడా ఆ క్షణంలో అతనితో కలిసి బయటకు వెళ్లాలని బలంగానే అనిపించింది. వెళతానేమోనన్న భయంతోనే ఫోన్ కట్ చేసింది. మొన్ననే కాదు అంతకు ముందు కూడా ఫోన్ చేసేవాడు. తనతో మాట్లాడుతున్నంతసేపు అతని గొంతు అమృతం నింపుకున్నట్లే అనిపించేది. తను కూడా ఇంట్లో వ్యక్తితో మాట్లాడినట్లే మాట్లాడేది. కానీ తను ఇన్నిరోజులు అంత చనువుగా, భయం లేకుండా మాట్లాడింది అంత పెద్ద స్ట్రిక్ట్ ఆఫీసర్ తోనా?

“బాబోయ్! మైండ్ బ్లోయింగ్ కదా!” అని పైకే అంది నివేద.

“మైండ్ బ్లోయింగా? నాక్కూడా అలాగే వుంది. పద వెళదాం. ఈ బుక్ ఒక్కటి చాల్లే. ఇది చదివాక వస్తాను” అంటూ అక్కడ వున్న ‘నీకు నేనున్నా’ నవలను తీసుకుని గబగబా క్రిందను దిగింది అలేఖ్య.

అలేఖ్య ఇంటికి వెళితే నివేద కాలేజీకి వెళ్ళింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here