అందమైన మనసు-8

0
2

[box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి రచించిన ‘అందమైన మనసు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. [/box]

[dropcap]అ[/dropcap]లేఖ్య నివేదకు ఫోన్ చేసి “వేదా! ఎలా వున్నావే? నిన్న నిన్ను చూడగానే ఇంట్లో వాళ్ళు గొడవ చేసారా? రాత్రంతా నిద్రపట్టలేదు నువ్వు ఎలా వున్నావో అని” అంది టెన్షన్ పడుతూ.

“మనసు బాగలేక మధురిమా హాస్టల్‌కి వెళ్లి వున్నాను. కావాలంటే మేడంకి ఫోన్ చేసి కనుక్కోండి అని అనగానే అత్తయ్య కూల్ అయ్యారు. గొడవేం జరగలేదు” అంటూ అక్కడ అమ్మా, నాన్నా వుండటంతో ఫోన్ పట్టుకుని గదిలోంచి బయటకు వచ్చింది నివేద.

“పోన్లే వేదా! నువ్వు చాలా పెద్ద ప్రాబ్లం లోంచి బయట పడ్డావు. నాకు మీ మమ్మీ ఫోన్ చేసి మీ అత్తయ్య నీ గురించి పేపర్లో, టీవీలో ఇస్తారనగానే భయపడిపోయాను. వెంటనే ఏ.ఎస్.పి. గారికి ఫోన్ చేశాను. అయినా మీ బావ ఏంటే నువ్వు ఎవరితోనో లేచిపోయావని వాళ్ళ అమ్మతో అన్నాడట. ఒక డాక్టర్ అయివుండి అలా ఎలా అన్నాడే? వూహించటానికే అసహ్యంగా వుంది” అంది.

“నాకు అంతకన్నా ఎక్కువే వుంది అలేఖ్యా! ఒకప్పుడు మా మామయ్య మా ఆస్తుల్ని తీసుకుని మమ్మల్ని అనాథల్ని చేసాడు. వాళ్ళ దయ వల్లనే నా చదువు సాగినట్లు ప్రపంచానికి తెలిసేలా చేసాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు అన్న మాట వల్ల అందరి దృష్టిలో నేను క్యారెక్టర్ లేనిదాన్ని అయ్యాను. మా అత్తయ్య నేను ఎవరితోనో లేచిపోయానని మా అమ్మకు చెప్పినట్లే ఇంకెంత మందికి చెప్పి వుంటుందో నేను వూహించగలను. ఇది వాళ్లకు వూరికే పోదు. చూస్తూ వుండు. తప్పకుండా అనుభవిస్తారు. నాకసలు ఈ ఇంట్లో వుండాలని లేకపోయినా వుండాలనుకున్నాను. ఆ వినీల్ గాడికి పిచ్చి పట్టేలా చెయ్యాలి” అంది కోపాన్ని నొక్కి పడుతూ.

“వద్దు వేదా! అసలే ఆ వినీల్ పెద్ద సర్జన్. అతనితో పెట్టుకోకు. మీకు చేసిన అన్యాయం వల్లనే అతను జైలుకి వెళ్లాడని మా అరుంధతి పెద్దమ్మ ఆ రోజే చెప్పింది. అప్పటినుండి హాస్పిటల్‌కి వెళ్లి ఎప్పటిలా కూర్చోలేకనే ఇంట్లో వున్నాడు. ఇంకా ఎందుకు? ఆ శిక్ష చాల్లే” అంది అలేఖ్య.

“అది చాలదు వాడికి. ఇంకా కావాలి. అత్తయ్య వస్తున్నారు. నేను తరువాత కాల్ చేస్తాను” అంటూ కాల్ కట్ చేసి గదిలోకి వెళ్లి కూర్చుంది నివేద.

“వేదా! మీ బావకి ఫ్రూట్ జ్యూస్ కావాలట, పనమ్మాయి మార్కెట్‌కి వెళ్ళింది. తీసికెళ్ళి ఇవ్వు” అంది సత్యవతి.

కూర్చున్న చోటు నుండి ఒక ఇంచి కూడా కదల్లేదు నివేద.

నేనెందుకివ్వాలి ఫ్రూట్ జ్యూస్ అని మనసులో అనుకుంటూ “ఎవరితోనో లేచిపోయి వచ్చాను కదా! నా చేత్తో ఫ్రూట్ జ్యూస్ ఇస్తే తాగుతాడా అత్తయ్యా? అందులోను మంచిపేరున్న డాక్టర్ కదా! ఒకసారి అడిగి చూడండి. పర్వాలేదంటే ఇస్తాను” అంది నివేద అక్కసుగా.

“వాడికి అలాంటివేమీ వుండవులే వేదా! వెళ్లి ఇవ్వు” అంది నవ్వి సత్యవతి.

“ఏమో అత్తయ్యా నాకు భయంగా వుంది. వెళ్ళాక నిన్ను తీసికెళ్ళిన అతను నీకు ఏమేమి కొనిచ్చాడు? అని అడిగితే ఏం చెప్పాలి నేను?” అంది నివేద.

“అసలు నువ్వు ఎవరితోనూ వెళ్ళలేదు కదా అలా ఎందుకు అడుగుతాడు?” అంది సత్యవతి.

“మీకు తెలుసు నేను ఎవరితోనూ వెళ్లలేదని. బావకి తెలియదుగా” అంది. బావ అనే పదాన్ని ఉచ్చరించాలంటేనే కంపరంగా వుంది నివేదకు.

“నేను వాడికి చెప్పానులే నువ్వు హాస్టల్లో వుండి వచ్చావని. వాడి మనసులో ఇప్పుడదేమీ లేదు”

‘ఓ.. నమ్మించావా అప్పుడే. ఎంతయినా నువ్వు చాలా తెలివైన దానివి అత్తయ్యా! లేకుంటే అలాంటి కొడుకును అంత ప్రయాజకుడిని ఎలా చేస్తావు’ అని గొణుక్కుంటూ అక్కడే కూర్చుంది.

ఈలోపల పనిమనిషి వచ్చింది. వినీల్‌కి జ్యూస్ తీసికెళ్ళి ఇచ్చింది.

సత్యవతి అక్కడ నుండి పక్కకి వెళ్ళింది.

“ఎందుకే అత్తయ్యతో అలా మాట్లాడావు? ఆవిడేం చేసింది నిన్ను? ఇంత జరిగినా ఒక్క మాట అనలేదు. అనాలనుకుంటే ఎన్ని అనేవాళ్ళు. ఎంత బెదిరించేవాళ్ళు. అంత మంచి మనిషితో అలా మాట్లాడొచ్చా?” అంది అక్కడే వున్న నాగేశ్వరి.

నివేద ఏదో మాట్లాడబోయింది.

“నువ్వింకేం మాట్లాడకు. వాళ్ళతో మాట్లాడేవాళ్ళమా మనం? వాళ్ళేలేకుంటే నువ్విలా జాబ్ చేసుకుంటూ ఇంత తెలివైన దానివి అయ్యేదానివా? మన ఊళ్ళోనే మేము చేసిన పెళ్లి చేసుకుని మనకు దూరంగానే, పక్కగానో మాలాగే పత్తేరుకుంటూ వుండేదానివి. అది మరచిపోతే ఎలా?” అన్నాడు బ్రహ్మయ్య.

“ఇదొక్కటి తప్ప మీకేం తెలియదు నాన్నా! తెలిస్తే ఇలా మాట్లాడరు”

“తెలిసినంత వరకు చాల్లే. నాకేం తెలియదట. అవసరం తీరాక మాట్లాడే మాటలు ఇలాగే వుంటాయి. నువ్విలా మాట్లాడుతున్నావని అన్నయ్యకు తెలిస్తే చంపేస్తాడు. కుదురుగా వుండు. రెక్కలు మొలిచాయని ఎగరకు. మేమిక వెళతాం. జాగ్రత్త నువ్వు” అన్నాడు బ్రహ్మయ్య.

వాళ్ళవైపు కన్నెత్తి చూడకుండా ‘చచ వీళ్లకసలేం తెలియదు’ అని మనసులో అనుకుంటూ “అలాగే నాన్నా! నేను జాగ్రత్తగానే వుంటాను” అంది నివేద.

వాళ్ళు సత్యవతితో, వినీల్‌తో చెప్పి ఊరు వెళ్లారు.

***

“అమ్మా! అత్తయ్యా, మామయ్యా ఊరు వెళ్లారు కదా! నా పెళ్లి గురించి వాళ్లతో మాట్లాడావా?” అన్నాడు వినీల్. అతనికి తన మనసులో వుండే సహస్ర అనే వైరస్‌ని తొందరగా చంపెయ్యాలని వుంది.

“మాట్లాడలేదు వినీల్! నీకు నివేదను చేసుకుంటామని మాత్రం చెప్పాను. అది ఎప్పుడు అన్నది చెప్పలేదు. ఈరోజు నివేదతో నువ్వొకసారి మాట్లాడు” అంది.

“ఎందుకమ్మా నన్ను చేసుకోనని అన్నదా?”

“ఛఛ అలా ఎందుకు అంటుంది వినీల్! నీలాంటి భర్త దొరుకుతాడా నివేదకు. అలాంటిదేం లేదు. మాట్లాడితే బాగుంటుందని”

“అలాగే అమ్మా! ఇప్పుడే మాట్లాడతాను. నివేద ఎక్కడుంది?” అన్నాడు.

“తన గదిలో వున్నట్లుంది. నేను పంపిస్తాను. మాట్లాడు” అంటూ నివేద దగ్గరకి వెళ్ళింది సత్యవతి.

“వేదా! ఒకసారి బయటకు రా!” అంటూ పిలిచింది సత్యవతి.

“ఏంటి అత్తయ్యా?” అంటూ చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి వచ్చింది నివేద.

“నీతో వినీల్ మాట్లాడతాడట. పైకెళ్ళు” అంది.

“ఏమ్మాట్లాడతాడు అత్తయ్యా? నన్ను లేపుకెళ్లిన అబ్బాయిది ఏ ఊరు? అని అడుగుతాడేమో! భయంగా వుంది” అంది నివేద.

“లేదు లేదు అదేం కాదు. వెళితే నీకే తెలుస్తుంది, అప్పుడు నీకు ఇలాంటి అనుమానాలేమి రావు” అంటూ నివేదను పైకి పంపింది సత్యవతి.

నివేద వెళ్లేసరికి గదిలో అటు తిరిగి నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు వినీల్.

అలికిడి విని ఇటు తిరిగాడు.

నివేదను చూసి “కూర్చో” అన్నాడు.

“కూర్చోబెట్టే మాట్లాడాలా? నిలబడితే మాట్లాడలేవా?” అంది నివేద.

“అలా అని కాదు. ఇది కొంచెం అలోచించి, ప్రశాంతంగా మాట్లాడే విషయం. నువ్వు కూడా అలాగే వినాలి. కూర్చో” అన్నాడు,

మనసులో తిట్టుకుంటూ కూర్చుంది నివేద.

“నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను” అన్నాడు. మనసులో ఉన్న సహస్రను బయటకు నెట్టెయ్యాలని అనలేక.

“ఎందుకు?” అంది.

“అదేం ప్రశ్న?” అన్నాడు.

“అసలే నేనొక ప్రశ్నను. ఇంకా జవాబే దొరకలేదు మీకు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుని ఆడిద్దామనా? ఇప్పటికే నన్ను చదివించామని ఒక పక్క అంటున్నారు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే ‘లేచిపోయిన నిన్ను మా ఇంటికి కోడల్ని చేసుకుని ఉద్ధరించాం’ అని నేను నోరెత్తినప్పుడల్లా నా నోట్లో గడ్డి పెడతారేమో! అందుకే అడిగాను ఎందుకు అని..” అంది.

“ఒక్కోసారి ఏదేదో అనుకుంటాం. అదిప్పుడు అవసరమా? అప్పటి పరిస్థితులు అలాంటివి. అయినా ఇప్పుడు మన పెళ్లి ముఖ్యమా? నువ్వు లేచిపోవటం ముఖ్యమా?”

“ఒకేసారి రెండు ప్రశ్నలా? నా దగ్గర ఒక్కదానికే సమాధానం లేదు. క్లారిటీ లేదు”

“క్లారిటీ ఎప్పుడొస్తుంది?”

“మొన్న నేను ఒకతనితో వెళ్ళాను కదా! అతన్ని అడిగితే నాకొక క్లారిటీ వస్తుంది. అడిగి చెబుతాను”

“అదేంటీ నువ్వు నిజంగానే అతనితో వెళ్ళావా? నేను నమ్మను. అమ్మ వెళ్లలేదన్నది. ఎందుకిదంతా! అసలేం జరుగుతోంది?” అన్నాడు కోపంగా. సహస్ర తనకి టచ్‌లో లేకుండా వెళ్లినప్పటి నుండి అమ్మాయిలను నమ్మలేక పోతున్నాడు.

“అత్తయ్యను ఏమీ అనొద్దు. నేనంటే అత్తయ్యకు ఇష్టం. చదివించింది కదా! అందుకే నా తప్పుల్ని కడుపులో పెట్టుకుంటుంది. నీకు నన్ను చేసుకోవటం ఇష్టం లేకుంటే లేదని చెప్పు. అంతేకాని మళ్లీ అత్తయ్య దగ్గర నేను లేచిపోయిన విషయం తేవద్దు. ఎందుకంటే నాక్కూడా కొన్ని థాట్స్ వుంటాయి. కొన్ని అవసరాలు వుంటాయి” అంది.

మతిపోతోంది వినీల్‌కి. ఇన్ని రోజులు నేను చూసిన ఆ నివేద యేనా ఈ నివేద అనుకున్నాడు.

“నువ్వు ఏమైనా అనుకో, నా గురించి కూపీ లాగొద్దు. కావాలంటే నన్ను చేసుకో. లేదంటే వేరేవాళ్లను చేసుకో. నన్ను చేసుకుంటే మాత్రం అప్పుడప్పుడు నేను బయటకు వెళ్లినా ఒప్పుకోవాలి, నాక్కూడా అతనితో కొన్ని కమిట్మెంట్స్ వుంటాయి”

“అతనెవరు?”

“ఎన్ని సార్లు చెప్పాలి. మొన్ననేగా వెళ్ళొచ్చాను. పేరు కూడా చెప్పాలా?”

“నేనెలా కనిపిస్తున్నాను నీకు? నేనొక డాక్టర్‌ని”

“డాక్టర్ కాబట్టే ఇంకో డాక్టర్‌ని చేసుకోండి. లేచిపోయిన దాన్ని పట్టుకుని మీ కంట్రోల్‌లో ఎలా పెట్టుకుంటారు?”

“బాబోయ్ నాకొద్దు నీతో పెళ్లి. కొద్ది సేపు మాట్లాడితేనే పిచ్చి పట్టేలా వుంది. ఇప్పుడే అమ్మకి చెబుతాను”

“ఏమని చెబుతావు?”

“ఏదో ఒకటి చెబుతాను. నువ్వు నాముందు నుండి వెళ్లిపో” అన్నాడు కోపంగా.

నివేద వెంటనే లేచి తన గదిలోకి వెళ్లి డోర్ పెట్టుకుంది.

నివేద గదిలోకి వెళ్ళగానే “వేదా! ఒకసారి తలుపు తియ్యి” అంటూ వచ్చింది సత్యవతి.

వెంటనే లేచి తలుపు తీసింది నివేద.

సత్యవతి లోపలకి వచ్చి కూర్చుంది. నివేదను తన పక్కన కూర్చోబెట్టుకుంది.

“వినీల్ ఏమంటున్నాడు వేదా? నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడా?” అడిగింది ఆతృతగా.

“బావకి డాక్టర్‌ని పెళ్లి చేసుకోవాలని వుందట అత్తయ్యా! మీకేమో నన్ను చెయ్యాలని వుందట. అందుకే మీరు నన్ను అడిగితే నాకు బావంటే ఇష్టం లేదని చెప్పమన్నాడు. ఇదంతా మళ్లీ బావనేమీ అడక్కండి. అయినా ఎందుకు అత్తయ్యా! మీ ఫ్రెండ్స్ దగ్గర ఎంత మంది అమ్మాయిలు లేరు. మీరు అడగాలే కానీ బావను చేసుకోటానికి మంచి డాక్టర్లే వస్తారు. నేనెందుకు?” అంది.

“మరి నీకు బావను చేసుకోవటం ఇష్టమేనా? అదికూడా అడగాలిగా. ముసుగెందుకు?”

“అయ్యో అత్తయ్యా! నా విషయం ఇప్పుడు ఎందుకు? మీరేమడిగినా నేను కాదంటానా? ముందు బావకో డాక్టర్‌ని చూడండి! దేన్నీ తెగేదాకా లాగొద్దు” అంది మెల్లగా నచ్చచెబుతూ

“అలాగే వేదా! వినీల్ కోరికను నేనెందుకు కాదనాలి. ఇప్పుడే నా ఫ్రెండ్స్‌కి కాల్ చేసి మాట్లాడతాను. వాళ్లలో వినీల్‌కి ఎవరు నచ్చితే వాళ్ళను చేస్తాను. మామయ్యకు కూడా కాల్ చేసి ఇదంతా చెబుతాను” అంటూ లేచి తన గదిలోకి వెళ్ళింది సత్యవతి.

గదిలోకి వెళ్ళగానే తన స్నేహితురాళ్ల ఫోన్ నెంబర్లు వెతికి వాళ్లకు ఫోన్లు చేసింది. కొంతమంది ఆమె ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు. కొంత మంది కట్ చేసారు. కొంతమంది లిఫ్ట్ చేసి “మీ అబ్బాయికి మా అమ్మాయిని అడగొద్దు. మేము మా అమ్మాయికి వేరే సంబంధాలు చూస్తున్నాం” అన్నారు.

సత్యవతికి ఆశ్చర్యంగా వుంది. అసలు తాను అడిగితేనే చాలు అనుకునేవాళ్లు ఇప్పుడు ఇలా అంటున్నారేమిటి అని ఆలోచనలో పడింది. సునీతకు చెయ్యాలి అనుకుంటూ సునీతకు ఫోన్ చేసింది సత్యవతి.

సునీత లిఫ్ట్ చేసి ఎప్పటిలాగే మాట్లాడింది.

సత్యవతి ఇక విషయం లోకి వద్దామని “వదినా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు మీ అమ్మాయిని వినీల్‌కి చేసుకోమని అడిగావు కదా! నువ్వు వెళ్ళాక బాగా ఆలోచించాను. నువ్వన్నట్లు మా వినీల్‌కి డాక్టర్‌ని ఇచ్చి చేస్తేనే బాగుంటుందనిపించింది. వినీల్ కూడా డాక్టర్‌నే చేసుకుంటానంటున్నాడు. అందుకే వినీల్‌కి మీ అమ్మాయిని చేసుకుంటాను వదినా” అంది.

“కానీ అప్పుడు నాకు మీ వినీల్ ఒక రోగిని చంపి జైలుకి వెళ్ళొచ్చాడని తెలియదు వదినా! నాకెవరూ చెప్పలేదు. తరువాత తెలిసింది జూనియర్ డాక్టర్‌ని మీ వినీల్ ప్రేమించాడట. ఆ అమ్మాయి ఇప్పుడు ఏమైందో తెలియక ఆ బాధతో తన డ్యూటీని సరిగా చెయ్యట్లేదట. హాస్పిటల్‌కి కూడా వెళ్లట్లేదట. ఇది మీకు తెలుసో లేదో మన ఫ్రెండ్సందరికి తెలుసు. తెలిసాక ఎవరిస్తారు అమ్మాయిని. అయినా ఇప్పుడు పెళ్లి కన్నా ముందు వినీల్‌ని మంచి సైకియాట్రిస్టుకి చూపించు వదినా! కాస్త సెట్ అయ్యాక పెళ్లి చెయ్యొచ్చు. ఇలాంటప్పుడు పెళ్లి చేసి ఒక అమ్మాయిని ఎందుకు బాధ పెట్టాలి?” అంది సునీత.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here