Site icon Sanchika

అండమాన్ అనుభూతులు-1

[box type=’note’ fontsize=’16’] “అండమాన్‌లో అంతా సముద్రమే. ఎటు చూసినా బంగాళాఖాతం. అందులో అనేక ద్వీపాలు. ప్రతి చోటా అందమైన బీచ్‌లు. ప్రతి ప్రయాణం అద్భుతమైన అనుభవం” అంటున్నారు ఎన్.వి. హనుమంతరావు తమ అండమాన్ పర్యటనానుభూతులని వివరిస్తూ. [/box]

మన దేశంలో ఒక ప్రదేశం

[dropcap]నా[/dropcap]కు ఇంతవరకు పాస్‌పోర్ట్ లేదు. విదేశాలకు వెళ్ళాలని కోరికా లేదు. ఎందుకంటే మనదేశాన్ని అందునా స్వంత రాష్ట్రాన్ని పూర్తిగా చూడలేదు. కాని దైవం ఇంకోలా తలిచాడు. ఎప్పుడూ ఊహించని ప్రాంతంలో పడేసాడు. అదే అండమాన్ నికోబార్ దీవుల రాజధాని- పోర్ట్ బ్లయర్. ఈ దీవుల గురించి చదవటం, వినటం తప్ప ఇదే మొదటి సారి చూడటం. భారతదేశంలో విదేశంలా వుంది. కాని ప్రజలు మాత్రం పక్కా స్వదేశీయులు. అందునా దక్షిణ భారతీయులు ఎక్కువగా వున్న ప్రాంతం.

నిజంగా ఇది ఒక అందమైన ప్రదేశం. నగరంలో ఏ అంచున చూసినా చుట్టూరా సముద్రం. కొండ ప్రాంతం. ఎత్తుపల్లాల్లు ఎక్కువ. ఎత్తైన చెట్లు, పచ్చని ప్రాంతం. నగరంలో నుండి రెండు కి.మీ. దాటితే ఆహ్లాదకరమైన వాతావరణం. ఉదయం నాలుగు గంటలకే తెల్లవారుతోంది. సాయంత్రం ఐదున్నరకు చీకటిపడుతోంది. గాలిలో తేమ ఎక్కువగా వుంటోంది. నాలుగు గంటలనుండి వాతావరణం చల్లబడుతోంది. హిందీ అధికార భాషగా వున్నా తమిళం మాట్లాడే ప్రజలు ఎక్కువగా వున్నారు. బెంగాలీ, తమిళ్, తెలుగు, మళయాళీలు ఎక్కువగా వున్నారుట. ఇక్కడ అన్ని వస్తువులు దొరుకుతున్నాయి కాక పోతే కాస్త ఖరీదు ఎక్కువ. కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి మద్యం మాత్రం బాగా తక్కువ ధరకు అందుబాటులో వుంది.

శ్రీరామ నవమి రోజు తెలుగువారి ఆధ్వర్యంలోని శ్రీ కోదండ రామాలయంలో రాములవారి దర్శనం చేసుకున్నాను. క్రతువు కొంచెం గందరగోళంగా వున్నా వారి ఉత్సాహాన్ని మెచ్చుకోవాలి. ఆరు జంటలు కూర్చుని కళ్యాణం చేసారు. చివర్లో ఈ ఆరు జంటలు కూడా ఒకరికొకరు తలంబ్రాలు పోసుకున్నారు. ఇది మాత్రం వింతగా అనిపించింది. ప్రసాదాలు మాత్రం రుచిగా వున్నయి.

మిత్రులతో కలసి ’చిడియా టాపు’ అనే ప్రాంతానికి వెళ్ళాను… ఎయిర్‌పోర్ట్ దాటగానే దారి చాలా బాగుంటుంది. పోర్ట్ బ్లయర్ నగరానికి 30 కి.మీ. దూరంలో వున్న అక్కడి బీచ్ పేరు ‘ముండా పహాడ్’. బీచ్ దగ్గర దాదాపు 10-15 కి.మీ. రిజర్వ్ ఫారెస్ట్ వుంది. సన్నని దారి, ఇరుపక్కల ఎత్తైన చెట్లు, ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ఆహ్లాదంగా వుంటుంది. కొద్దిగా వర్షం పడితే నీళ్ళు రోడ్డు వరకు వస్తాయిట. ప్రస్తుతం అంత లేవు. ఈ బీచ్ చివర ఒక కొండ వుంది. చెట్ల తుప్పల్లో కాలిబాటగుండా పైకి వెళ్ళటానికి ముప్పావు గంట పట్టింది. దిగి రావటానికి అరగంట మాత్రం సరిపోయింది. ఆ తరువాత రెండు రోజులు కాళ్ళ నొప్పులు వదల్లేదు. అది వేరే సంగతి. ఆ బీచ్‌లో చివరి పాయింట్ ఈ కొండ. రెండు భాగాలుగా వుంది. ఈ రెంటికీ మధ్య సన్నని దారి వుంది. నాకు మాత్రం భయంవేసి ఆ రెండో పాయింట్‌కు వెళ్ళలేదు. దాన్ని ఇక్కడి వాళ్ళు ఏమని పిలుస్తారో తెలుసా? ‘సూసైడ్ పాయింట్’. అయినా చావటానికి అంత దూరం వెళ్ళాలా? ఈ పేరు ఎలా వచ్చిందో మా మిత్రులు కూడా చెప్పలేక పోయారు. ఇక్కడినుండి సూర్యుడు అస్తమించటం అందంగా కనపడుతుంది. కొండ గోల లేక పోతే ఈ బీచ్‌లో కుటుంబంతో సరదాగా ఓ గంట గడపొచ్చు అనిపించింది.

ఫెర్రీ మీద మొదటి ప్రయాణం:

ప్రతి మనిషికి జీవితంలో అమిత ఆనందం కలిగించే విషయాలు మూడు వుంటాయి. అవి 1)పురుషుడు/స్త్రీ సమక్షం (companionship), 2) పుస్తకం 3) ప్రకృతి. సమయం, సందర్భం బట్టి, మన అలోచనా విధానం అనుసరించి ప్రాధాన్యతలు మారవచ్చు. కానీ దాదాపుగా ఈ మూడు అగ్రస్థానంలో వుంటాయి. నేను ఢిల్లీలో పని చేసేటప్పుడు రాజకీయరంగాన్ని(తెలుగు) దగ్గరగా చూసే అవకాశం కలిగింది. అలాగే మద్రాసులో వున్నప్ఫుడు తెలుగు సినీరంగాన్ని కొద్దిగా పరిశీలించే అవకాశం కలిగింది. ప్రకృతి గురించి అది అందించే ఆనందం గురించి ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టలేదు. అంత ఉత్సాహం కూడా వుండేది కాదు. ఎందుకంటే నాకది మూడవ ప్రయారిటీ కాబట్టి. కానీ ఇక్కడ అండమాన్‌లో వున్నది అంతా ప్రాకృతిక ఆనందం. ప్రకృతి సౌందర్యం అనేక రకాలుగా అందుబాటులో వుంటుంది. కొండలు, కోనలు, గుట్టలు, చెట్లు, అడవులు, నదులు, సరస్సులు, సముద్రం మొదలైనవి. అండమాన్‌లో అంతా సముద్రమే. ఎటు చూసినా బంగాళాఖాతం. అందులో అనేక ద్వీపాలు. పోర్ట్ బ్లయర్ నగరాన్ని కూడా సమద్రం అంచున అందంగా తీర్చిదిద్దారు. ప్రతి చోటా అందమైన బీచ్‌లు. ప్రతి ప్రయాణం అద్భుతమైన అనుభవం.

పోర్ట్ బ్లయర్‌లో ఒక చోటనుండి మరొక చోటికి వెళ్ళటానికి రోడ్డు మార్గమే కాక జెట్టీలు కూడా ఉపయోగిస్తారు. సముద్ర తీర ప్రాంత నగరాలలో ఇది సహజం. ఈ జెట్టీల మీద కార్లు, బైక్‌లు కూడా చేరవేస్తారు. నగరంలో “ఛాతం” అనే చిన్న ద్వీపం నుండి బాంబు ఫ్లాట్ (bamboo flat) అనే ప్రాంతానికి ఇటీవల సరదాగా ఒక మిత్రుడితో కలసి ప్రయాణం చేసాను. ఇది పోర్ట్ ప్రాంతం. ఓడలు రావటానికి, నిలవటానికి ఇది ఒక పాయింట్. ఆసియాలోనే అతి పెద్దది, పురాతనమైన ‘సా మిల్’ ఇక్కడ వున్నది. ఒక చిన్న వంతెన ద్వారా ఇది పోర్ట్ బ్లయర్‌కు కలపబడింది. ప్రత్యేకంగా గమనిస్తే తప్ప ఇది కూడా పోర్ట్ బ్లయర్‌లో భాగం అనిపిస్తుంది. ఇక్కడినుండి పదిహేను నిమిషాలు ప్రయాణిస్తే బాంబు ఫ్లాట్ చేరుకోవచ్చు. అదే రోడ్డు మార్గంలో చుట్టూ తిరిగి రావటానికి దాదాపు అరవై కి.మీ. ప్రయాణం చేయాలిట. ప్రతి పావుగంటకు జెట్టీ బయలుదేరుతుంది. దాదాపు సాయంత్రం ఐదు గంటలకు అక్కడకు చేరుకున్నాము.

ఆ ప్రాంతం అంతా ఒక చిన్న గ్రామంలా వుంది. ఒక పక్క కొండ, అందులో కొబ్బరి చెట్లు. ఆ కొండ మీద చిన్న చిన్న ఇళ్ళు. రోడ్డు మీద మాత్రం అన్ని రకాల షాపులు వున్నాయి. పోర్ట్/జెట్టీల మీద పనిచేసే ఉద్యోగుల కుటుంబాలు ఎక్కువగా వుంటాయట. రోడ్దు మీద నడుస్తుంటే తెలుగులో మాట్లాడుకుంటున్న పిల్లలు కూడా కనిపించారు. అలా దాదాపు అరగంటపాటు ఆ రోడ్డు మీద నడిచి ఒక పావుగంట సముద్రపు ఒడ్డున నేను మిత్రుడు నాగరాజన్ చల్లగాలిని ఆస్వాదించాము. ఒక ఆదివారం సాయంత్రం చిన్న ప్రయాణం చక్కని అనుభూతిని అందించింది. చిక్కని శక్తిని కూడా ఇచ్చింది.

అది జైలు కాదు ఒక ‘చరిత్ర’:

అక్కడ చాలా చోట్ల “ప్లీజ్ మైండ్ యువర్ హెడ్” అని రాసి వుంటుంది. అంటే జాగ్రత్తగా తల వంచుకుని వెళ్ళండి అని అర్థం. దాదాపు 100-150 సంవత్సరాల క్రితం భారత స్వాతంత్ర్య సమరయోధులు ఒక జైలులో తలవంచుకుని దుర్భర జీవితం గడిపితే, ఈ రోజు మనమందరం గర్వంగా తల ఎత్తుకుని తిరుగుతున్నాము. అదే అండమాన్‌లోని సెల్యులర్ జైలు. భారతీయులను ఖైదీలుగా ముఖ్యంగా రాజకీయ నాయకులను కష్టాలపాలు చేయటానికి బ్రిటీషువాళ్ళు మూడు కోట్ల ఇటుకలతో మూడు సంవత్సరాలపాటు కట్టిన ఈ సెల్యులర్ జైలు ఒక స్మారక చిహ్నంగా ఆనాటి చరిత్రను మన కళ్ళ ముందు వుంచుతోంది.

నేను, మా సహోద్యోగి నాగరాజన్ కుటుంబాలతో సహా సెల్యులర్ జైలును సందర్శించాము. ఈ రోజు ఈ కట్టడం చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది కానీ ఒక్కో సెల్ (గది) ఒక్కో విషాద గాథను వివరిస్తోంది. అనాటి ఖైదీలు నూనె తీయటం, వాళ్ళను ఇనప చువ్వలతో రకరకాలుగా బంధించటం, హింసించటం నమూనాలుగా తయారు చేసి మన కళ్ళముందుంచారు. వాటిని చూస్తూ గత చరిత్రను తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది. ఖైదీలను ఉరితీసే ముందు వాళ్ళని condemned cells అని నాలుగు సెల్స్ ఏర్పాటు చేసి అందులో వుంచుతారు. ఆ తరువాత వాళ్ళని ఉరి తీసే గదిని కూడా సజీవంగా వుంచారు.

జైలు పరిసరాలను చాలా ఆహ్లాదంగా వుంచటానికి ప్రయత్నించినా మూలాల్లోకి వెళితే ఒక్కో ఇటుక వెనుక వున్న కథ కన్నీళ్ళు తెప్పిస్తాయి. ప్రస్తుతం జైలులో రెండు బ్లాకులు మాత్రం మిగిలాయి. చాలా భాగంలో జి.బి.పంత్ ఆసుపత్రి ఏర్పాటు చేసారు. జైలు లోపల ఒక ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసారు. సెల్యులర్ జైలు గురించిన అనేక విశేషాలు ఈ ఫోటోల ద్వారా తెలుసుకోవచ్చు.

అండమాన్‌లో సెల్యూలర్ జైలు అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది స్వాతంత్ర్య సమర యోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్. జైలులోని రెండవ అంతస్తు ఒక మూల గదిలో ఆయన దాదాపు పది సంవత్సరాలు గడిపారు. అక్కడి పరిస్థితులు ఎంత కఠినంగా వుండేవంటే ఆయన సోదరునికి కూడా సావర్కర్ అక్కడే వున్న విషయం రెండు సంవత్సరాల దాకా తెలియలేదట. ప్రస్తుతం ఆయన నివసించిన గదిని సావర్కర్ ఫోటో ఏర్పాటు చేసి ప్రత్యేక స్మారక చిహ్నంగా మార్చివేసారు. సందర్శకులు చాలామంది ఈ సెల్ చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. బహుశ మే 28 ఆయన జయంతి కాబట్టి కేంద్ర ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రతి రోజూ సెల్యులర్ జైలు ఐదు గంటలకు మూసివేస్తారు. మళ్ళీ ఆరుగంటలనుండి రెండు విడతలుగా ‘లైట్ అండ్ సౌండ్ షో’ వుంటుంది. ఈ మధ్యలో క్యూ లో నుంచుని టికెట్లు కొనుక్కోవాలి. మొత్తానికి ఒక గంట పాటు హిందీ షో చూసాము. ఈ కార్యక్రమం అంతా ఆనాటి ఖైదీల జీవిత చరిత్ర గురించి మాత్రమే వుంది. వింత ఏమిటంటే ఈ షో లో వీర సావర్కర్ గురించి చిన్నపాటి ప్రస్తావన మాత్రమే వుంది. ఎక్కువగా ఆడియో మీద దృష్ట్టి పెట్టారు కానీ విజువల్ పెద్ద గొప్పగా లేదు. ఓం పురి వాయిస్ వుంది కాబట్టి కొంచెం ఆసక్తికరంగా వుంది. మిగిలిన గొంతులు గుర్తు పట్టలేకపోయాను. ఇంకా బాగా చేసి వుండాలని నేను మా సహోద్యోగి (video editor) అభిప్రాయపడ్డాము. సెల్యులర్ జైలు ఎదురుగా ఒక చిన్న పార్కులో ఆనాటి స్వాతంత్ర్య వీరుల విగ్రహాలు ఏర్పాటు చేసారు. మాకు దొరికిన gap లో పిల్లలతో అక్కడ గడిపాను. మెత్తానికి పోర్ట్ బ్లయర్‌లో ఒక ప్రధానమైన ఆకర్షణ సెల్యులార్ జైలు. తప్పక చూడాల్సిన ప్రదేశం.

(ఇంకా ఉంది)

Exit mobile version