అండమాన్ అనుభూతులు-3

0
1
Jpeg

[box type=’note’ fontsize=’16’] “మాకు ఏమీ అర్ధం కాకపోయినా అందులో ఆ ఊరి పేరులో point అనేది వినపడింది. మొత్తానికి ఆ ……point వెళ్ళటానికి ఫెర్రీ ఎక్కాము. కాని ఇది ఎక్కడికి పోతుంది? అక్కడ ఏం వుంది? ఎవరిని అడగాలి. ఒక సందిగ్ధం” అంటూ అండమాన్ దీవులలో పేరు తెలియని ప్రదేశానికి చేసిన ప్రయాణం గురించి చెబుతున్నారు ఎన్.వి. హనుమంతరావు. [/box]

జంట ద్వీపాలలో విహారం-1:

[dropcap]అం[/dropcap]డమాన్ రాగానే చాలామంది నోటవిన్న పదం ‘కోరల్స్’. ఈ కోరల్స్ సముద్రపు అడుగున పెరిగే జీవజాలం. కొన్ని వందల వేల సంవత్సరాలపాటు నీటి అడుగున పెరిగి గడ్డకట్టుకుని అనేక ఆకృతులలో దొరుకుతాయి. పోర్ట్ బ్లయర్‌లో షాపుల్లో, మ్యూజియంలలో చూడటం జరిగింది కానీ సముద్రపు లోతుల్లో చూసే అవకాశం ఇప్పుడే కలిగింది. మేము చూడబోయేది ‘నార్త్ బే’, రెండోది ‘రాస్ ఐలేండ్’. ఇంతకు ముందు వీటితో పాటు ‘వైపర్ ఐలేండ్’ కూడా వుండేదిట. ఇప్పుడు ఎందుకు తీసేసారో తెలీదు. ఒక సెలవు రోజు మా శ్రీమతి, సుపుత్రుడుతో బయలుదేరాను. రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుండి ఉదయం పది గంటలకు పెద్ద బోటులో ప్రయాణం. దాదాపు యాభై మంది వరకు వున్నారు. విభిన్న భాషలు మాట్లేడేవాళ్ళున్నారు కానీ సగానికి పైగా తమిళమే. సగం ప్రయాణం కాగానే ఆ బీచ్‌లో ప్రధాన ఆకర్షణ అయిన ‘స్కూబా డైవింగ్’ , ‘సీ వాకింగ్ ’, ‘స్నోర్ కెల్లింగ్’ గురించి వివరించి టికెట్స్ అమ్మటం ప్రారంభించారు. మేము స్నోర్ కెల్లింగ్ చేయటానికి రెండు టికెట్స్ తిసుకున్నాము. ఒక్కోటి ఐదువందలు. మిగిలిన వాటి టికెట్స్ ఒక్కోటి మూడువేలు. స్నోర్ కెల్లింగ్ అంటే పూర్తిగా తెలియకపోయినా టికెట్స్ తీసుకోవటానికి కారణం మిగిలిన రెండింటి ధరలు ఎక్కువగా వుండటం. మన దేశంలో కరెన్సీ నోట్లపై చారిత్రక ప్రదేశాలు ముద్రితమవుతున్నాయి. అలాగే ఇరవై రూపాయల నోటు మీద అండమాన్ లోని నార్త్ బే బీచ్ లోని లైట్ హౌస్ వుంటుది. రెండు కొబ్బరి చెట్ల మధ్యనుండి ఈ ద్వీపం కనపడుతుంది. ఈ విషయం తెలియగానే అందరం ఇరవై రూపాయల నోటు తీసి చూసుకుని ఆనందపడ్డాము. ఈ ఫోటో మౌంట్ హారియట్ నుండి తీసారుట. వీలయితే ఒకసారి ఆ మౌంట్ హారియట్ చూడాలనుకున్నాము. మొత్తానికి ఒక అరగంట ఆహ్లదకరమైన ప్రయాణం తరువాత ‘నార్త్ బే’ బీచ్ చేరుకున్నాము. నిజానికి ఇది ద్వీపం కాదు. ఒక ద్వీపానికి అంచున వున్న చిన్న బీచ్. ఈ జంట ద్వీపాల్లో ప్రవేశం ఉచితం కాదు.

నార్త్ బే బీచ్ లోపలికి వెళ్ళటానికి మనిషికి పది రూపాయలు. అంతా హడావుడిగా వుంది. ముఖ్యంగా యువతరం కోలాహలం ఎక్కువగా వుంది. మా దగ్గర టిక్కెట్స్ చూసి ఇద్దరు గైడ్లు మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్లటానికి సిద్ధపడ్డారు. కానీ మా దగ్గర extra బట్టలు లేవు. అక్కడ ఇలాంటి వాటికోసం బట్టలు అద్దెకివ్వటానికి షాపులు కూడా వున్నాయి. నేను మా అబ్బాయి చెరో ముప్పయి రూపాయలిచ్చి swimming dress తీసుకున్నాము. ఒక కళ్ళ జోడు పెట్టుకుని, గుండ్రటి ట్యూబ్ నడుము దగ్గర వేసుకుని గైడు సహాయంతో (మనకు ఈత రాకపోయినా పరవాలేదు) ఒడ్డునుండి దాదాపు వంద గజాలు సముద్రంలోపలికి వెళ్ళిన తరువాత ఆ కళ్ళజోడు సహాయంతో నీళ్ళ లోపల అందమైన మరో ప్రపంచం చూసే అవకాశం కలిగింది.

రకరకాల చేపలు, రకరకాల ఆకృతులలో కోరల్స్ చూసే అవకాశం కలిగింది. మా అబ్బాయి మొదట సముద్రం లోపలికి రావటానికి భయపడ్డాడు. (వాడికింకా నీళ్ళ ఫోభియా పోలేదు). ఆ తరువాత పగడాలు, అందమైన రంగురంగుల చేపలు చూసి ఆనందపడ్డాడు. మా ఆవిడ మాత్రం ఒడ్డున కూర్చుని కెమారాతో కొన్ని ఫోటోలు తిసింది. అలా ఓ అరగంట సముద్రవిహారం పూర్తి చేసి ఒడ్డుకు చేరాము. అక్కడ చూడటానికి ఇంకేమీ లేదు. మళ్ళీ బట్టలు మార్చుకుని Shopping చేయటం మొదలుపెట్టాము. అన్నీ కలిపి ఒక పది దుకాణాల వరకు వున్నాయి. అండమాన్ style ఉట్టిపడేలా ఒక టోపీ కొని మేమందరం ఫోటోలు తీసుకున్నాము. ఒక చిన్న కొట్టుదగ్గర టీ తాగాము.

 మళ్ళీ ‘ఇందుగలడందు లేడు తెలుగువాడు అండమాన్‌లో’ అన్నట్టు ఈ షాపువాడు రాజోలు నుండి వచ్చి ఇక్కడ settle అయ్యాడు. ఇక్కడ రెండు మూడు చిన్న సైజు హోటల్స్ కూడా వున్నయి. మాకు ముందుగా చెప్పటం వలన లంచ్ కూడా ఇక్కడే చేసాము. ఒక చిన్న హోటల్ లో vegetable fried rice తిన్నాము. ఇది తయారు చేసిన వ్యక్తి గూడా ఆంధ్రుడే. ఈ చిన్న ద్వీపానికి ఇంతవరకూ జనం రావటమే కానీ తిరుగుప్రయాణం ప్రారంభం కాలేదు. సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రజల కోలాహలం గమనిస్తూ చాలా సమయం గడిపాము. అలా మధ్యాహ్నం రెండుగంటలకు అందరినీ ఎక్కించుకుని మా బోటు Ross Island వైపు కదిలింది.

జంట ద్వీపాలలో విహారం-2:

సమయం మధ్యాహ్నం రెండుగంటలు. ఆకాశం మబ్బులు కమ్మింది. మా ఫెర్రీ మెల్లగా కదులుతోంది. జనం అందరూ కుదురుగా కూర్చున్నారు. మళ్ళీ గైడు వచ్చి రాస్ ఐలాండ్ గురించి చెప్పటం మొదలెట్టాడు. మొత్తం తమిళంలో మాట్లాడుతున్నాడు. తమిళం రాని వాళ్ళు అభ్యంతరం చెప్పారు(నాకూ రాదనుకోండి). అప్పుడు హిందీ కోసం కిందకు వెళ్ళమన్నాడు. నేను మా అబ్బాయి కిందకు వెళ్ళి కూర్చున్నాము. అండమాన్ గురించి కొంచెంసేపు చెప్పి అప్పుడు వాళ్ళ వ్యాపార రహస్యాన్ని బయటకు తీసారు. అండమాన్ నికోబార్ దీవుల గురించి తీసిన మూడు DVDలు వంద రూపాయలకు (ఒక్కోటి యాభై రూపాయాలు) అమ్మటం మొదలుపెట్టాడు. చాలామంది కొనుకున్నారు. నేను ఎలాగు ఇంకా రెండు సంవత్సరాలు వుండాలి కాబట్టి వాటిమీద ఉత్సాహం చూపలేదు. అలా రాస్ ఐలాండ్ చేరుకున్నాము. మాకు కేవలం అరగంట మాత్రమే సమయం ఇచ్చారు.

దిగగానే జపనీస్ బంకర్ దర్శనమిచ్చింది. లోపలికి వెళ్ళటానికి 30 రూపాయలు టిక్కెట్ తిసుకోవటానికి లైనులో నిలపడగానే భారీగా వాన మొదలయింది. కొచెం ఉధృతం తగ్గగానే లోపలికి అడుగుపెట్టాము. బ్రిటీషువారికి అధికారం చెలాయించటం తెలుసు. దాన్ని అనుభవించటం తెలుసు. ఆ అధికారంతో ఆనందించటం ఆనందించటం తెలుసు. అందుకే మనదేశంలో ఇంకా వారి ఆనవాళ్ళు భద్రంగా వున్నాయి. అలా ఆనాటి బ్రిటీషు రాజరిక వ్యవస్థకు ప్రతీక ఈ రాస్ ఐలాండ్. అండమాన్ దీవులను పరిపాలించటానికి వారు నిర్మించుకున్న విహార స్థలం ఈ ద్వీపం. 1941 వరకు ఆంగ్లేయుల పరిపాలనా రాజధానిగా వుండేదిట. ఆ తరువాత మూడేళ్ళపాటు జపనీయుల ఆధీనంలో మళ్ళీ మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవరకు బ్రిటీషు వారికింద వున్నది. వారి రాచరిక వ్యవస్థకు చిహ్నంగా ఈ రాస్ ఐలాండ్ ఇప్పటికీ అండమాన్ వచ్చే యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. లోపల చిన్న సైజు మ్యూజియం ఆరుబయలు ప్రదేశంలో వుంది. కొన్ని పాతరికార్డులు, ఫోటోలు చూడటానికి బాగానే వున్నాయి. అక్కడనుండి ఎడమవైపు పైకి రోడ్డు వెళుతోంది. దానిమీద ప్రయాణం మొదలుపెట్టాము. రోడ్డుకిరువైపులా శిధిలావస్థలో అనేక భవనాలు దర్శనమిచ్చాయి. బాల్ రూమ్ దగ్గరకు రాగానే మళ్ళీ వర్షం మొదలయింది. అలా వాన తగ్గినప్పుడల్లా ముందుకు నడుస్తూ ఆ భవనాలు చూస్తున్నాము. కమీషనర్ ఇల్లు, హాస్పటల్, ఒక చర్చి, బేకరీ ఇలా ఇంకా ఎన్నో వున్నాయి. సమయం లేకపోవటం వలన, వాన వల్లా మొత్తం చూడలేక పోయాము. ఈ లోపల దూరంనుండి మా బోటువాడు కేకలు వేయటం మొదలెట్టాడు. రాస్ ఐలాండ్‌లో అందరినీ అమితంగా ఆకర్షించే అంశం గుంపులు గుంపులుగా తిరిగే జింకలు. మనం వాటిని ఏమీ చేయకపోతే అవి మనతోపాటే తిరుగుతాయి. అన్ని జింకలను ఒకేసారి ఒకేచోట చూస్తే కళ్ళు తిప్పుకోలేము. ప్రస్తుతం అక్కడ సాయంత్రాలు అండమాన్ చరిత్ర తెలియజేసే Multimedia show కూడా వుంది. దానికి విడిగా ముందుగా టిక్కెట్ తీసుకోవాలి. వానవల్ల, సమయం సరిపోక ఈ ద్వీపాన్ని పూర్తిగా చూడలేకపోయాము. మళ్ళీ వీలయితే మరోసారి రావాలి. Multimedia show కూడా చూడాలి. మొత్తానికి ఆ రోజు సరదాగా, సంతోషంగా గడిపి సాయంత్రానికి ఇంటికి చేరాము.

పేరు తెలీనీ ప్రదేశం:

మళ్ళీ ఆదివారం వచ్చింది. రోజు ఒకే రకమైన పని. బోరింగ్‌గా వుంది. ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ ఎక్కడికి వెళ్ళాలి? చూడని ప్రదేశం చూడాలి. ఎవరు తీసుకెళతారు. మళ్ళీ మిత్రుడు నాగరాజన్ కలిసాడు. అతనితో ప్రస్తావించాను. అతను కూడా నాలానే ఆలోచిస్తున్నాడు. ఛాతమ్ వెడదామా అన్నాడు. చూసిన ప్రదేశమే కదా అన్నాను. చాలాసేపు తర్జన పడిన తరువాత చివరకు కారులో ఛాతమ్ వెళ్ళాము. ఇంతకుముందు మేము చూసిన bamboo flat కాకుండా మరొక పెద్ద ఫెర్రీ ఎక్కడికో (?) వెళ్ళటానికి రెడీగా వుంది. కౌంటర్‌లో ఆ ఫెర్రీ ఎక్కడికి వెడుతుంది అని అడిగాము. వెనకటికి ఎవడో మా ఊరికి టిక్కెట్ ఇమ్మని అడిగినట్లు అడిగాము. ఆ క్లర్క్ మావేపు ఎగాదిగా చూసి ఏదో పేరు చెప్పాడు. అతని భాష, యాస బెంగాలీలాగా వుంది. మాకు ఏమీ అర్ధం కాకపోయినా అందులో ఆ ఊరి పేరులో point అనేది వినపడింది. మొత్తానికి ఆ ……point వెళ్ళటానికి ఫెర్రీ ఎక్కాము. కాని ఇది ఎక్కడికి పోతుంది? అక్కడ ఏం వుంది? ఎవరిని అడగాలి. ఒక సందిగ్ధం. వాతావరణం ఆహ్లాదకరంగా వుందికదా అని ఫెర్రీ పైకి వెళ్ళాము. అక్కడ డ్రైవర్(?) క్యాబిన్ పక్కన రెండు fixed బల్లలు వున్నాయి. ఐదు నిమిషాల తర్వాత ఓ వ్యక్తి కూర్చోమని సీటు ఆఫర్ చేసాడు. దొరికాడు కదా అని అతన్ని మాటల్లో పెట్టాము. అతను పొలీసు శాఖలో పనిచేస్తున్నాడు. నికోబార్ బదిలీ అయింది. వెళ్ళాలి అన్నాడు. కాసేపు 7th pay commission జీతాల గురించి ముచ్చటించుకున్నాము. బాగా స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నాడు. అప్పుడు అడిగాను మళ్ళీ ఈ బోటు ఎక్కడికి వెళుతుంది? అతను బోలెడంత ఆశ్చర్యపోయాడు. తెలీకుండా ఎక్కారా అన్నాడు. అప్పుడు మళ్ళీ వివరంగా మా గురించి చెప్పుకున్నాము. మమ్మల్ని సానుభూతితో అర్ధం చేసుకున్నాడు. ఆ ద్వీపం పేరు చెప్పాడు. షరా మామూలు. Point అన్నది అర్ధం అయింది కానీ ఆ ముందు పదం అర్ధం కాలేదు. చివరకు పదినిమిషాల తర్వాత ఆ ఊరు చేరుకున్నాము.

బయటకు రాగానే ముందు మేము చేసిన మొదటి పని అక్కడ board చూడటం. అప్పుడు తెలిసింది ఆ ఊరు పేరు ‘డూండస్ పాయింట్’ (DUNDAS POINT). ఆ పోలీసు కూడా మాతో బయటకు వచ్చి ఆ ఊరిగురించి వివరాలు చెప్పి తన స్కూటర్ మీద వెళ్ళి పోయాడు. కాసేపు ప్రశాంతంగా చుట్టూ పరికించాము. డూండస్ పాయింట్ చుట్టు పక్కల నాలుగైదు గ్రామాలు వున్నాయట. ఆ గ్రామ ప్రజలు ఇక్కడనుండే రాకపోకలు సాగిస్తారు. వాళ్ళని తీసుకెళ్ళటానికి అక్కడ కొన్ని జీపులు కూడా వున్నాయి. మనిషికి పది రూపాయలు తీసుకుంటారు. మన share auto లాగా అన్నమాట. మేము ఏం చేయాలో నిర్ణయించుకునే లోపల ఆ జీపులు మాయమయ్యాయి. ఒక సన్నని రోడ్డు ఊళ్ళోకి వెడుతోంది. నేను, నాగరాజు మెల్లగా ఆ రోడ్డు మీద ప్రయాణం మొదలుపెట్టాము. అది కూడా చిన్న సైజు అడవిలాగా వుంది. వంపులు తిరుగుతూ ఎత్తుపల్లాల రోడ్డు. రెండువైపులా అక్కడక్కడా చిన్న చిన్న ఇళ్ళు. ఆ ఇళ్ళకవతలి వైపు సముద్రం. చల్లని సాయంత్రం. మనోహరమైన దృశ్యాలు. ప్రకృతి సృష్టించిన అందాలు చూస్తూ పరవశించిపోతూ దాదాపు కిలోమీటరు నడిచాము. మెల్లగా ఇళ్ళు మాయమవుతున్నయి. వెలుతురు కూడా తగ్గుతోంది. పోలీసు చెప్పిన విషయం గురుతుకొచ్చి తిరుగుముఖం పట్టాము. దారిలో పోలీసు ఠాణా, ఓ కిరాణా షాపు కనిపించాయి. రోడ్డుపక్కగా శివాలయం కనపడింది. లోపలికి వెళ్ళి పరమ శివుడి దర్శనం చేసుకున్నాము. అక్కడి పూజారి గోరఖ్‌పూర్ నుండి వచ్చి ప్రస్తుతం ఆ గుడిపక్కనే నివాసం వుంటున్నాడట. ఆ ఆలయం పెద్దది కాదు మరీ చిన్నది కాదు. ఆ ఊరి జనాభాకు సరిపోయేలా వుంది. ప్రశాంతమైన వాతావరణంలొ మళ్ళీ జెట్టీ దగ్గరకు చేరుకుని పేరు తెలీనీ ప్రదేశానికి చేసిన ప్రయాణ అనుభవాలు సరదాగా మననం చేసుకుంటూ ఇంటికి చేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here