Site icon Sanchika

అండమాన్ అనుభూతులు-4

[box type=’note’ fontsize=’16’] “పాములు, పుట్రా వుంటాయా అని అడిగాను. అడవన్నాక వుండవా, అయినా అది మీ అదృష్టం అన్నారు” అంటూ అండమాన్ దీవులలో ఒక అడవిలో చేసిన సాహసం గురించి చెబుతున్నారు ఎన్.వి. హనుమంతరావు. [/box]

ఒక కొండ, ఒక అడవి, చిన్న సాహసం -1:

[dropcap]అం[/dropcap]డమాన్ చరిత్ర అంతా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులు చేసిన పోరాటమే. భారతీయ చరిత్రలో ఇలాంటి పేర్లు మార్చాలన్న ఆలోచన మన చరిత్రకారులకు వచ్చినట్లు కనపడటం లేదు. లేదా మరి ఏదైనా కారణం వుండాలి. ఇక్కడ చాలా ప్రదేశాలకు వాళ్ళ పేర్లే వున్నాయి. ఆ విధంగా కూడా పోరాటం- ముఖ్యంగా మనల్ని ఖైదీలుగా వాళ్ళు పెట్టిన హింస గురించి కథలు కథలుగా రాయబడింది. ఈ విధంగా చరిత్ర రాసే ఉత్సాహంలో అన్ని ప్రదేశాలకు వాళ్ళ పేర్లు యథాతధంగా వాడేసారు. స్వాతంత్ర్యానంతరం వాళ్ళని గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళని గుర్తు చేసుకుంటే వాళ్ళ అకృత్యాలు గుర్తుకు రావా? ఏమో? రాస్ ఐలాండ్, స్మిత్ ఐలాండ్, వైపర్, నీల్, హేవలాక్, మౌంట్ హారియట్…. ఇలా చెప్పుకుంటే చాలా వున్నాయి. ఇంతకీ గత ఆదివారం మేము సందర్శించిన ప్రాంతం పేరు మౌంట్ హారియట్. హారియట్ అనే మహానుభావుడు గతంలో ఇక్కడ డిప్యూటి కమీషనర్‌గా పనిచేసాడట. ఆయన వేసవి విడిదిగా ఒక కొండమీద చిన్న ఆఫీసు కట్టుకున్నాడు. అదే నేడు మరొక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం “మౌంట్ హారియట్” అయింది. మిత్రులతో కలసి నా కారులో చాతమ్ వెళ్ళాము. కారుతో సహా ఫెర్రీ ఎక్కి అవతలి ఒడ్డున bamboo flat కు చేరుకున్నాము. ఇంతకుముందు చాలాసార్లు వచ్చిన ప్రాంతంకాబట్టి పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇక్కడనుండి కొండపైకి దాదాపు ఎనిమిది కి.మీ. వుంటుంది. ఈ ఊరులో తెలుగు మాట్లాడే ప్రజలు బాగానే వున్నారు. ఒక తెలుగు స్కూల్ కూడా దారిలో కనపడింది. బాగా చిన్న గ్రామాలు ఒకటి రెండు కనపడ్డాయి. సముద్రం పక్కనుండి ఒక ఐదు కి.మీ. ప్రయాణించిన తరువాత ఘాట్ రోడ్డు మొదలవుతుంది. ఈ జంక్షన్ దగ్గర నార్త్ బే కు దారి అంటూ సిగ్నల్ కూడా వున్నది. ఇక్కడ నుండి కచ్చా రోడ్డుమీదగా ఆరు కి.మీ. వెళితే నార్త్ బే బీచ్‌కు చేరుకోవచ్చుట. వంపులు తిరుగుతూ దట్టమైన చెట్ల మధ్య ఘాట్ రోడ్డుమీద ప్రయాణం అహ్లాదకరంగా సాగుతోంది. మధ్యాహ్నం అవటంవలన కొంచెం ఆకలి మొదలయింది. కారు పక్కకు ఆపటానికి జాగా లేదు. అలా రెండు కి.మీ. పైకి వెళ్ళిన తరువాత ఒక పక్కకు ఆపగలిగాము. కాస్త munching తో relax అయ్యాము. మళ్ళీ ప్రయాణం మొదలయింది. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మిత్రుడు అనిల్ కారు ఆపమన్నారు. కుడివేపు రోడ్డు పక్కగా కొన్ని కొబ్బరి చెట్లు, వాటి మధ్యనుండి దూరంగా నార్త్ బే బీచ్ లోని లైట్ హౌస్ కనపడుతోంది. ఇరవై రూపాయల నోటుమీద వున్న దృశ్యం ఇదే అన్నారు అనిల్. వెంటనే నాకు నార్త్ బే ప్రయాణం, ఫెర్రీలో గైడ్ చెప్పిన విషయం గుర్తుకొచ్చింది. ఉత్సాహంగా అక్కడనుండి ఫోటోలు తీసుకున్నాము. కానీ అండమాన్‌లో ఇదే దృశ్యం రెండుమూడు చోట్లనుండి కనపడుతుందిట. అసలయినది ఏది అని తర్కించుకుంటూ ముందుకు బయలుదేరాము. మరి కొంత దూరం వెళ్ళగానె అటవీ శాఖ చెక్ పోస్ట్, అక్కడ డబ్బుకట్టి పర్మిషన్ తీసుకుని ముందుకు కదిలాము. మౌంట్ హారియట్ మీద చిన్న తోట ఏర్పాటు చేసారు. చాలా అందంగా వున్నది. చెట్లమీద రంగురంగుల సీతాకోక చిలుకలను చూడచ్చు. నికోబారీ పద్దతిలో కొన్ని కాటేజీలు ఏర్పాటు చేసారు. అటవీశాఖ కార్యాలయం ఉంది, గార్డులు వున్నారు. చిన్న క్యాంటీను వుంది. అక్కడ కూర్చుని భోజనం పూర్తిచేసాము. అండమాన్ ద్వీప సమూహంలో మౌంట్ హారియట్ మూడవ ఎత్తైన పర్వత ప్రాంతం. ఇక్కడనుండి నార్త్ బే బీచ్, రాస్ ఐలాండ్, మరికొంఛెం దూరంగా హేవలాక్ ద్వీపం కనపడుతుంటాయి. వాతావరణం చల్లగా వుంది. అంతకుముందు మూడు రోజులు వానకురిసింది. ఆ రోజు మా కోసమే అన్నట్లు వాన లేదు. సరదాగా మధ్యాహ్నం రెండున్నర వరకు గడిపాము.

ఒక కొండ, ఒక అడవి, చిన్న సాహసం-2:

భోజనాలు అయ్యాక సరదాగా ఆ తోట అంతా తిరిగాము. చిన్న పిల్లలలాగా కొంచెం సేపు ఊయల ఊగి ఫోటోలు తిసుకున్నాము. అక్కడ నుండి దూరంగా కనపడుతున్న ఇతర ద్వీపాలను, ఒక పక్కగా వున్న అడవి ప్రాంతం చూసి ఆనందించాము. ఒక పక్కగా కిందవేపుకు దారి వుంది. అక్కడ ఒక చెట్టుకు ’కాలా పత్తర్ 2.5 కి.మీ.’ అన్న బోర్డు వేలాడుతోంది. కిందకు వెళితే అడవి దారిగుండా 2.5 కి.మీ. తరువాత ఈ నల్లని రాళ్లు వస్తాయట. అది ఏమిటో చూద్దామని అందరం ఉత్సాహపడ్డాము. అటవీ శాఖ గార్టులతో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించాము. వర్షాల వలన దారి సరిగ్గా వుండకపోవచ్చు. ప్రయాణం ఓ గంటన్నర పడుతుంది. పాములు, పుట్రా వుంటాయా అని అడిగాను. అడవన్నాక వుండవా, అయినా అది మీ అదృష్టం అన్నారు. మాతో నాగరాజన్ వుండగా భయమేమిటని జోక్ చేసాము. మొత్తానికి అడవిలో చిన్న సాహసం చేయటానికి నిశ్చయించుకున్నాము. సమయం రెండున్నర అయింది. చివరకు నేను, నాగరాజన్, రాజేందర్ బయలుదేరాము. మా ముగ్గురికి ట్రెక్కింగ్ ఇదే మొదటి సారి. గార్డులు చెప్పినదాని ప్రకారం తిరిగి రావటానికి మూడుగంటలు పడుతుంది. కాని వాతావరణం బాగోలేదు. త్వరగా రావాలని ప్లాన్ చేసాము. ముగ్గురం ఉత్సాహంగా ప్రయాణం మొదలుపెట్టాము. దారి కొంచెం పల్లంగా, ఇరుకుగానే వుంది. దారికిరువైపులా గుబురుగా చెట్లు. కొంచెం ముందుకెళ్ళగానే మళ్ళీ ఎత్తుపల్లాలు. అడ్డంగా పడిపోయిన చెట్లు, కొమ్మలు. కొన్ని చోట్ల దారి వెడల్పు ఒక అడుగు మాత్రమే వుంది. మరికొంత దూరం వెళ్ళగానే దట్టమైన చెట్లు, చిమ్మ చీకటి. అందరం మొబైల్‌లో ఫ్లాష్ లైటు ఉపయోగించాము. అయినా మా ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. చిన్న పిల్లలలాగ కబుర్లు చెప్పుకుంటూ ముందుకు పరుగెడుతున్నాము. దాదాపు అరగంట గడిచింది. సగం ప్రయాణం పూర్తి అయిందని ఒక చెట్టుకున్న బోర్డు ద్వారా తెలిసింది. ఆయాసం వస్తే అలుపు తీర్చుకుంటూ దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతూ ముందుకు కదులుతున్నాము. మధ్యలో కొన్ని నల్లని రాళ్ళు కనపడ్డాయి. గమ్యం చేరామనుకుని పొరపడ్డాము. ఏఏ సినిమాలలో (తెలుగు, తమిళం, హీందీ) ఇలాంటి సీన్లు వున్నాయో నెమరువేసుకుంటు అడుగులు వేస్తున్నాము. నేల మీద చిన్నా చితకా పురుగులు కనిపించినా భయపడకుండా నడుస్తున్నాము. మేం గమనించిందేమిటంటే మిగిలిన ఇద్దరు మిత్రులు చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. ఇంతలో మా వెనక వున్న నాగరాజు పాము అంటూ అరిచాడు. నేను, రాజేందర్ వెనక్కు తిరిగాము. ఒక పచ్చని రంగులోవున్న పాము లోయలోకి జారిపోయిందిట. మాకు మాత్రం కనపడలేదు. ధైర్యం తెచ్చుకుని ముగ్గురం ముందుకు కదిలాము. అక్కడక్కడ బురద కూడా వుంది. జాగ్రత్తగా చూసుకుంటూ, గెంతుతూ, దూకుతూ ముందుకు నడుస్తున్నాము. దారిలో చిన్న చిన్న ప్రాణులు కాళ్ళమీద పాకుతుంటె వాటిని తీసి అవతల పారేస్తూ పరుగెడుతున్నాము. నేను మాత్రం మంచి దిట్టమైన బూట్లు వేసుకోవటం వలన ధైర్యంగా నడుస్తున్నాను. ఇంతలో దూరంగా “కాలా పత్తర్” కనపడింది. కుడివైపు ఒక పక్కగా పెద్ద పెద్ద నల్లని రాళ్ళు. కూర్చోవటానికి కర్రలతో చేసిన బెంచీలు. ఎడమపక్కగా ఒక చిన్న గుడిసె. అందులో విశ్రమించి చుట్టూ పరిశీలించాలి అనుకునే తరుణంలో మా మిత్రులిద్దరూ పెద్దగా అర్తనాదాలు చేస్తున్నాను. కాళ్ళమీద చిన్న రక్తం మరకలు. ఏవో క్రిములు పాకుతున్న ఫీలింగ్. గబగబా ఆ గుడిసెలొకి పరుగెత్తాము. జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరి కాళ్ళ మీద బుల్లి బుల్లి జలగలు (letch) పాకుతున్నాయి. వాటిని జాగ్రత్తగా తొలగించి నీటితో కడిగాము. అయినా అవి పైకి పాకుతున్న ఫీలింగ్. అందరికి భయం పట్టుకుంది. అత్యంత వేగంగా తిరుగుముఖం పట్టాము. దారిలో వారిద్దరికీ జలగల బాధ ఎక్కువయింది. నేను మాత్రం నాకు ఏమీ కాలేదన్న ధైర్యంతో గుండె చిక్కబట్టుకుని నడుస్తున్నాను. దారిలో ఎలాంటి పరిశోధనలు లేకుండా ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ మొత్తానికి పైకి చేరుకున్నాము. వెంటనే వాళ్ళిద్దరూ అక్కడున్నా rest room లోకి దూరిపోయారు. సన్నగా తుంపర మొదలయింది. నేను ఒక చిన్న గుడిసెలొకి దూరి బెంచీ మీద కూలపడిపోయాను. అక్కడ అప్పటికే మూడు యువ జంటలు వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. చిన్నగా మాటలు కలిసాయి. వాళ్ళు కూడా కాలా పత్తర్ వెడదామనుకుని వాన వల్ల ఆగిపోయారుట. అప్పుడు మా అనుభవాలు, జలగల గోల గురించి చెప్పాను. కొద్దిగా వాన తగ్గటం వలన వాళ్ళు వెళ్ళిపోయారు. నేను మిత్రుల కోసం ఎదురుచూస్తున్నాను. ఇంతలో సాక్స్ దగ్గర ఏదో దురద అనిపించింది. గబగబా తీసి చూద్దునుగదా అక్కడ చిన్న రక్తం మరక ఓ బుల్లి జలగ కనిపించాయి. కంగారుగా దాన్ని తీసి అవతల పారేసరికి మా ఇద్దరు మిత్రులు నన్ను కలిసారు. మొత్తానికి నేను కూడా జలగ బాధితుడు కావటం అందరికి సంతోషం అనిపించింది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కిందకు దిగాము. సన్నని తుంపర, ఎత్తైన కొండ కావటంవలన మమ్మల్ని తాకుతూ కదులుతున్న మేఘాలు అందమైన ప్రకృతిలో లీనమవుతూ కారు దగ్గరకు చేరుకున్నాము. అడవిలో అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ ఎలా వచ్చామో అలా తిరిగి ఏడు గంటలకల్లా ఇళ్ళకు చేరుకున్నాము.

***

చరిత్రలో ఓ ఘట్టం:

డిసెంబరు 30 – అండమాన్ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించదగ్గ రోజు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ రోజు అండమాన్‌లో త్రివర్ణ పతాకం ఎగురవేసిన రోజు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అండమాన్ నికోబార్ ద్వీపాలు బ్రిటీష్ వారి నుండి జపనీయుల (1942-45) ఆధిపత్యంలోకి వచ్చాయి. నేతాజీకి చెందిన అజాద్ హింద్ ఫౌజ్‌కు అండమాన్‌ను అధికారికంగా ఒప్పచెప్పారు. ముఖ్య అధికారాలు మాత్రం జపనీయులు తమ దగ్గరే వుంచుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ ప్రాంతానికి Head of the State అయ్యారు. ఆయన 1943 డిసెంబరు 30 వ తేదీన పోర్ట్ బ్లయర్‌లో ప్రస్తుతం నేతాజీ స్టేడియం వున్న ప్రాంతంలో మువ్వన్నెల జండాను ఎగురవేసారు. అంతేకాక అండమాన్ నికోబార్ ద్వీపాలకు “షాహిద్ స్వరాజ్ ద్వీప్ సమూహ్” అని నామకరణం చేసారు. ఆ తరువాత ఆయన ఆనాటి బ్రిటీషు అధికారిక నివాసమైన “Ross Island” లో కూడ త్రివర్ణ పతాకం ఎగురవేసారు. ఆ విధంగా అండమాన్ నికోబార్ ద్వీపాలు మన దేశంలో బ్రిటీష్ వారినుండి విముక్తి పొందిన మొట్టమొదటి ప్రాంతంగా చరిత్రలో నిలిచింది. కానీ దురదృష్టం ఏమిటంటే ఈ సంఘటనకు భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో పెద్దగా ప్రాముఖ్యతనిచ్చినట్టు కనబడదు. కారణం కూడా తెలీదు. కానీ ఇక్కడి ప్రజలు మాత్రం ఈ రోజును ఘనంగా ఒక ఉత్సవంలా జరుపుకుంటారు. ఇప్పుడు కూడా గతవారం రోజులుగా పోర్ట్ బ్లయర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ అంశం మీద స్కూలు విద్యార్ధులకు క్విజ్, చిత్రలేఖనం, సంగీత పోటీలు నిర్వహించారు. అనేక చోట్ల సెమినార్లు జరిగాయి. నగరాన్ని అందంగా అలంకరించారు. దీవుల్లో ప్రధానంగా మనకు కనపడేది ఓడలు, పడవలు మొదలయినవి. వీటిని కూడా ప్రకాశవంతంగా అలంకరించారు. వీధి నాటక ప్రదర్శనలు జరిగాయి. అధికారికంగా లెఫ్టినెంట్ గవర్నరు జండా ఎగురవేసి సభ నిర్వహించారు. స్వాతంత్ర్య సమరవీరులను సత్కరించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1943 డిసెంబరు 29 న ఇక్కడ అడుగుపెట్టారు. అజాద్ హింద్ ఫౌజ్ కమాండర్ అయిన శ్రీ పరశురామ్ అయనకు స్వాగతం పలికారుట. ఆయన భార్య, అజాద్ హింద్ ఫౌజ్ సభ్యురాలయిన శ్రీమతి కిరణ్ కుమారిని ఈరోజు వేదిక మీద సత్కరించారు. ఈ దృశ్యాన్ని చూసి చుర్రుమనిపిస్తున్న ఎండలో కూడా నా శరీరం పులకించింది. ఆనాడు నేను లేకపోయినా ఈనాడు ఆనాటి వ్యక్తులను చూడటంవలన కలిగిన ఆనందం ఇది. ఈ ఉత్సవాన్ని కాసేపు పక్కన పెడితే సంఘటన మాత్రం నాణానికి ఒక వేపు మాత్రమే. ప్రతి వ్యక్తి చరిత్రను తనకు అనుగుణంగా, తన భావజాలానికి అనుగుణంగా లేదా తనకు తెలిసిన విధంగా రాసుకుంటాడు. ఈ సంఘటన మీద ఒక చిన్న promo చేద్దామని పదిరోజుల క్రితం విషయ సేకరణ మొదలు పెట్టాను. Japanese have given powers to INA symbolically only. The total power is rested with Japan. బ్రిటీష్ వారి ఆధీనంలొ వున్నప్పుడు అండమాన్ ప్రజలు ఎన్ని అకృత్యాలు, హింస, అత్యాచారాలను ఎదుర్కొన్నారో జపనీయుల ఆధీనంలో కూడా అవే సమస్యలు ఎదుర్కొన్నారట. పేరుకు మాత్రం స్వతంత్రం, పాలన మాత్రం వారిదే. ప్రజల స్థితిగతుల్లో మాత్రం మార్పు లేదు. 1945లో మళ్ళీ అండమాన్ బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. ఇక్కడి ప్రజల జీవితాలు మాత్రం షరా మామూలే. But an Event is an Event in the History.

(ఇంకా ఉంది)

Exit mobile version