[box type=’note’ fontsize=’16’] అక్కడ అడుగుపెడితే ‘హెవెన్ లో లాక్’ అయినట్లే అని భావించే హేవలాక్ ద్వీపం గురించి వివరిస్తున్నారు ఎన్.వి. హనుమంతరావు. [/box]
“హెవెన్ లాక్” లో విహారం-1:
[dropcap]అం[/dropcap]డమాన్ ద్వీపసమూహంలో అడుగుపెట్టిన ప్రతివారు తప్పనిసరిగా చూడాల్సిన, చూడదగ్గ ప్రదేశం “హేవలాక్” ద్వీపం. ఇక్కడకు వచ్చిన కొత్తలో దీని గురించి తెలుసుకుందామని మా ఆఫీసులో ఓ మిత్రుడిని కదిలించాను. ఇది హేవలాక్ కాదు అక్కడ అడుగుపెడితే “హెవెన్ లో లాక్” అయినట్లే అని చమత్కరించాడు. తప్పకుండా చూడమని ప్రోత్సహించాడు. అంత అందమైన ప్రదేశానికి ఒంటరిగా ఎందుకు వెళ్ళటమని వేసవి వరకు ఆగాను. హేవలాక్ లోని “రాధానగర్ బీచ్” ప్రపంచ ప్రసిద్ధి చెందినది. ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రికలో ఆసియా ఖండంలోని టాప్ 10 బీచ్‌ల గురించి ఓ పెద్ద వ్యాసం చదివాను. ఆ పదిలో ఈ “రాధానగర్ బీచ్“ వుండటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ నేను ఇక్కడకు వస్తానని ఆ రోజు కూడా అనుకోలేదు. అంతా విధి లిఖితం. సరే మే నెలలో నా మేనకోడలు గాయత్రితో పాటు మా కుటుంబం దిగింది. ఇక సందడే సందడి. ఇక ప్రయాణ ఏర్పాట్లు మొదలు పెట్టాము.
ఒక రోజు అక్కడ బస చేయాటానికి నిర్ణయించుకుని “ఎల్ డెరాడో (El deraado)” అనే హోటల్లో ముందుగానే రూమ్ బుక్ చేసుకున్నాను. ఒక శనివారం ఉదయం తొమ్మిది గంటలకల్లా హేవలాక్లో దిగాము. ముందుగానే ఆ ప్రాంతం గురించి తెలుసుకోవటం, కొంత చదవటం వలన పెద్దగా కంగారు పడలేదు. ఆ ప్రాంతం అంతా యాత్రికులతో సందడిగా, కోలాహలంగా వుంది.
“హెవెన్ లాక్” లో విహారం-2:
ఎలిఫెంటా బీచ్ వెళ్ళటానికి రెండు మార్గాలున్నాయి. ఒకటి రోడ్డు మార్గం. అది బాగా చుట్టు తిరిగి వెళ్ళాలిట. అందరూ జల మార్గాన్ని ఎన్నుకుంటారు. ఇది దాదాపు ముప్పావు గంట ప్రయాణం. జెట్టీ పక్కనే చిన్న మర పడవలుంటాయి. మనిషికి 750 రూపాయలు. అప్పటికే బాగా ఆలస్యం అవటం వలన బోటు నిండే సూచనలు కనపడలేదు. కౌంటరులో ఓ అబ్బాయి చార్టెడ్ బోటు తీసుకోమని సలహా ఇచ్చాడు. నలుగురికి కలిపి మూడు వేల రూపాయలు. ఇక చేసేదేమీలేక అలాగే బయలుదేరాము. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా వుంది. అలా కబుర్లు చెప్పుకుంటూ బీచ్‌కు చేరాము. ఆ పడవ నడిపే అబ్బాయి గైడ్‌గా వున్నాడు.
అండమాన్‌లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరూ ఊహించలేరు. ఓ పావుగంట సరదాగా సాగిన తరువాత వాన జల్లులు పలకరించాయి. మా దగ్గర గొడుగులు కూడా లేవు. పడవ ప్రయాణం కూడా సాఫీగా సాగటం లేదు. మా గైడు ధైర్యం చెబుతూనే వున్నాడు. వాన పెద్దది అయితే ఎలారా దేవుడా అనుకున్నాను. దేవుడు నా మొర ఆలకించాడు. హఠాత్తుగా వచ్చిన వర్షం అంతే హఠాత్తుగా ఆగిపోయింది. ఇవన్నీ అలవాటయిన పడవ నడిపే అబ్బాయి నవ్వుకున్నాడు. ఎలాగయితే నేమి ఒడ్డుకు చేరగానే మా కోసం తన్మయ్ ప్రత్యక్షమయ్యాడు. మరో పావుగంటకల్లా మమల్ని హోటల్ దగ్గర దించి రాధా నగర్ వెళ్ళటానికి మూడు గంటల కల్లా రెడీగా వుండమన్నాడు. హోటల్లో భోజనం ముందే ఆర్డర్ ఇవ్వటం వలన మా ఐటమ్స్ అన్నీ రెడీగా వున్నాయి. గబ గబా తినటం ముగించి మనదేశంలోని అద్బుతమయిన బీచ్ చూడబోతున్నామన్న ఉత్సాహంతో మళ్ళీ రోడ్డు మీదకొచ్చి తన్మయ్ కోసం ఎదురుచూస్తున్నాము.
“హెవెన్ లాక్” లో విహారం-3:
ఆసియాలో అందమైన బీచ్ వేపుగా ఆటోలో మా ప్రయాణం సాగింది. అందమైన రోడ్డూ ఆహ్లదకరమైన వాతావరణంలో రెండు కి.మీ. వెళ్ళగానే ఓ రకమైన పరిమళంతో కూడిన సముద్రపు గాలుల సువాసనలు మా ముక్కులను తాకాయి. ఇంతలో ఆటో కుడివైపు తిరిగి ఓ గతుకుల రోడ్డులో దిగి మమ్మల్ని కూడా ఈ లోకంలోకి తెచ్చింది. అప్పుడు తన్మయ్ చెప్పాడు ఈ ప్రాంతాన్ని “కాలా పత్తర్” అంటారు, ఇక్కడ కూడా ఓ బీచ్ వుంది. రేపు మా ఆఖరి షెడ్యుల్ అదే. మరో ఐదు నిమిషాల్లో రాధానగర్ బీచ్ చేరుకున్నాము. అక్కడ వందల సంఖ్యలో వాహనాలు అంతకు మించి జనం. అంతా కోలాహలంగా వుంది. రోడ్డుకు పక్కగా అన్నీ దుకాణాలు. తన్మయ్ మాకోసం అక్కడే వుంటానన్నాడు. ఐదుగంటల కల్లా బీచ్ ఖాళీ చేయిస్తారు ఈ లోపలే బయటకు రమ్మన్నాడు. సరే అని మేమంతా ఓ పెద్ద ఆర్చ్‌లో నుండి బీచ్ దగ్గరకు వెళ్ళాము.
ఎదురుగా ఓ అద్భుత సౌందర్యం. కనుచూపు మేర ఎటు చూసినా సముద్రం. దాదాపు ఆరు అడుగుల ఎత్తులో ఎగసిపడుతున్న అలలు. అ అలల్లో తేలియాడుతున్న ఆబాలగోపాలం. ఎందుకు ఈ బీచ్ మాత్రమే ప్రపంచ ప్రసిద్దిగాంచినది. అది మాటలకందని మధుర భావన. ఆ సౌందర్యాన్ని కనులారా వీక్షించి ఆనందించటమే మనం చేయవలసిన పని. నేనూ అదే చేశాను. తెల్లని ఇసుక. అర్ధ చంద్రాకారంలో ఇరువైపులా ఓ కిలోమీటరు పొడుగు వుండచ్చు. పక్కగా పొడవాటి చెట్లు. మధ్యలో అనంతమైన సముద్రపు హోరు.
అందరం సముద్రంలో దిగాము. ఆరడుగుల అలల చేతిలో బాగా దెబ్బలు తిన్నాము. వాటితో పొరాడాము. ఓ అరగంట తరువాత ఓడిపోయి అలసిపోయి, డస్సిపోయి అనిర్వచనీయమైన ఆనందంతో బయటపడ్డాము. ఆ సంధ్యా సమయంలో సూర్యాస్తమయం దృశ్యం ఒక గొప్ప అనుభూతి. రెండు దశాబ్దాల క్రితం కన్యాకుమారిలో చూసిన సూర్యాస్తమయం గుర్తుకొచ్చింది. కాని ఇది అంతకంటే అందమైన అనుభవం. కుటుంబం అంతా బాగా enjoy చేసారు. మళ్ళీ ఆటోలో హోటల్ రూమ్‌కు చేరుకున్నాము. ముందుగా చెప్పక పోవటం వలన మాకు భోజనం దొరకలేదు. అందరం స్నానాలు చేసి మళ్ళీ రోడ్డు మీద పడ్డాము. రాత్రి వేళ చల్లని గాలిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ ఊళ్ళోకి ప్రవేశించగానే “ఆహార్” శాఖాహార భోజనశాల కనపడింది. మంచి రుచికరమైన భోజనంతో అ రాత్రి సుఖంగానే గడిచింది. మరుసటి రోజు అందరం ఐదు గంటలకే నిద్ర లేచి అరగంటలో బ్రష్ చేసుకుని టీ తాగటానికి రెస్టారెంట్‌కు పరుగుతీసాము.
అండమాన్‌లో సమృద్ధిగా దొరికేది కొబ్బరి. ఇక్కడి కొబ్బరి నీళ్ళ రుచే వేరు అని అందరూ అంటారు. అందుకే అందరికి వీటి రుచి చూపించాను.
ఆ చిన్న ప్రదేశంలో సరదాగా గడిపిన తరువాత మమ్మల్ని దాదాపు ఎనిమిది గంటలకు మళ్ళీ జెట్టీ దగ్గర దింపాడు. ఈ రెండు రోజులు అతని సహాయాన్ని మరచిపోలేము. మా దగ్గర ఒక్క రూపాయికి కూడ ఎక్కువ మాట్లాడుకున్న దానికంటే ఎక్కువ తీసుకోలేదు. స్నేహ పూర్వకంగా వీడ్కోలు తీసుకున్నాడు. అక్కడే వున్న హోటలులో టిఫిన్ తిని సముద్ర ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ పదకొండు గంటలకు ఇంటికి చేరుకున్నాము.
(ఇంకా ఉంది)