అండమాన్ యుద్ధ క్షేత్రంలో…!

1
2

[box type=’note’ fontsize=’16’] మినీ ఇండియాని తలపించే అండమాన్‍ దీవుల ప్రకృతి రమణీయత గురించి, అక్కడి సైల్యులర్ జైలు గురించి తమ యాత్రానుభవాల ద్వారా వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]చు[/dropcap]ట్టూ సముద్రపు కెరటాల హోయలు. మధ్య మధ్యలో పచ్చని ప్రకృతి అందాల నడుమ కనిపించే ఇసుకతిన్నెల మెరుపులు. జనసంచారం తక్కువగా కనిపించే ఎన్నో ఆకర్షణీయమైన ప్రదేశాలు. చారిత్రక నేపథ్యం ఉన్న కట్టడాలు. ఉప్పునీటి అడుగున కనిపించే ఎన్నో జీవరాసులు. ఇవన్నీ చూడాలంటే అండమాన్ దీవులకు వెళ్లాల్సిందే!

నిజానికి అండమాన్ దీవులకు చాలా కాలం క్రితం ఒకసారి వెళ్లివచ్చాము కానీ అండమాన్ అనగానే గుర్తొచ్చేది ఎప్పుడో చిన్నప్పుడు సూల్లో విన్న జ్ఞాపకం. సోషల్ స్టడీస్ పాఠ్యపుస్తకాల్లో అవి కూడా మన దేశంలోని భాగాలే అని చదివిన జ్ఞాపకం. తరగతులు మారుతున్న కొద్ది, అవగాహన పెరుగుతున్న కొద్ది అక్కడో జైలు ఉంటుంది, అందులో ఈ దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని నిర్భందించేవారని విన్న జ్ఞాపకం. అది అత్యంత క్రూరమైన జైలు అనీ అందులోంచి తప్పించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మృత్యువుని కొనితెచ్చుకున్నట్లే అని చదివిన జ్ఞాపకం. అంతే కాదు నిన్న మొన్నటి వార్తలో కూడా ఆ ద్వీపాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఆదిమ తెగల వాళ్లుంటారని, అక్కడికి ఎవరినీ వెళ్లనివ్వరని ఎవరైనా వెళ్లినా తిరిగిరాని లోకాలను వెళ్లినట్టేనని పత్రికల్లో చదివిన జ్ఞాపకం. ఇన్ని వైరుధ్యాలు, ఇన్ని జ్ఞాపకాలు, ఇన్ని అనుభవాలు అన్నీ ఒక్క అండమాన్ నికోబార్ ద్వీపాల గురించే.

అయితే అండమాన్ అంటే ఇంతేనా అంటే కాదనే చెప్పాలి. వీటితో పాటూ అద్భుతమైన ప్రకృతి, అంతులేని సాగర సౌందర్యం, వీటి మధ్యలో కొలువైన ద్వీపాలు ఇవన్నీ స్వర్గాన్ని తలపిస్తుంటాయి.

అయితే ఈ మా ప్రయాణంలో మా ముఖ్య ఉద్దేశం ఇక్కడి ద్వీప సౌందర్యాన్ని వీక్షించడానికి మాత్రమే కాదు, అక్కడి చారిత్రక కట్టడమైన సెల్యూలర్ జైలును సందర్శించడం. ఇవాళ ఇది ఒక టూరిస్టు ప్లేస్‌గా మారి ఉండవచ్చుకానీ, ఇదే ఒకప్పుడు ‘యుద్ధక్షేత్రం’. మన దేశం కోసం బ్రిటిష్ కబందహస్తాల నుండి విముక్తి చేసి, స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి కారణమైన వందలాది మంది స్వాతంత్ర సమరయోధులు బందీలుగా గడిపిన ప్రదేశం కూడా ఇదే. అందుకే ఆ యుద్ధ క్షేత్రాన్ని సందర్శించి గత స్మృతులను జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్ర సాగింది.

బంగాళాఖాతం సముద్ర జలాల మీద తేలుతున్నట్టుండే రెండు ద్వీప సముదాయాలే ‘అండమాన్ నికోబార్’. 8,073 కి.మీ విస్తరించిన ఈ భూభాగాల్లో అండమాన్‌కు ‘పోర్ట్ బ్లెయిర్’, నికోబార్‌కు ‘కార్ నికోబార్’ రాజధానులు. అండమాన్ అనే పేరు మలయా పదం ‘హనుమాన్’ నుంచి వచ్చింది. నికోబార్ అంటే ‘నగ్న ప్రజల నివాసం’ అని అర్థం. శతాబ్దాల క్రితం వరకూ ‘జార్వా’ అనే ఆదివాసీలకు మాత్రమే ఆవాసాలైన ఈ దీవులు కొంతమంది చక్రవర్తుల చొరవతో ప్రపంచం కంట్లో పడ్డాయి. చోళులు, మరాఠాలు, ఆంగ్లేయులు ఈ దీవుల్ని తమ ప్రయాణ, పరిపాలనా అవసరాలకు ఉపయోగించుకున్నారు. భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటీషర్లు సామన్య ప్రజానీకానికి దూరంగా ఉంచటం కోసం ఖైదీలను ఉంచే ‘పీనల్ కాలనీ’గా ఈ దీవుల్ని ఉపయోగించుకున్నారు. ఇలా పరదేశీ పరపాలనలో భయం గొలిపే ప్రదేశంగా గుర్తింపు పొందిన అండమాన్ నికోబార్ దీవులు ప్రస్తుతం ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలుగా పేరు తెచ్చుకున్నాయి. అయితే భాష, సంస్కృతి, పర్యాటకంపరంగా విలక్షణమైన రూపాన్ని సంతరించుకున్నప్పటికీ బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఇప్పటికీ ఈ దీవుల్లో దాదాపు 500 మంది జార్వా ఆదివాసీలు నివసిస్తున్నారట.

ప్రయాణం ఎలా…?

ఈ అండమాన్ దీవులకు వీసాతో పనిలేకుండానే చేరుకోవచ్చు. ఇక్కడి చేరుకోవాలంటే రెండు మార్గాలున్నాయి. విమానం ద్వారానైతే చెన్నై, కోల్కతా, విశాఖపట్నం, ఢిల్లీ, భువనేశ్వర్, హైదరాబాద్ నుంచి ఈ దీవులకు నేరుగా చేరుకోవచ్చు. ఇందుకోసం స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ లైన్స్, గో ఎయిర్ రెగ్యులర్ ఫ్లయిట్స్ నడుపుతున్నాయి. ఓడ ద్వారా వెళ్లాలనుకుంటే చెన్నై, కోల్కతా, విశాఖపట్నం నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకోవచ్చు. విశాఖపట్నం నుంచి 5 రకాల ఓడలు నెలలో కొన్ని రోజుల్లో సర్వీసులను నడుపుతుంటాయట. ఓడ ప్రయాణం రెండు నుంచి రెండున్నర రోజులపాటు సాగుతుందట. దీనికి ఖచ్చితమైన సమయం లేకపోవడానికి కారణం వాతావరణమే. వెళ్లిన ఓడ అక్కడి పోర్ట్ బ్లెయిర్‌కు చేరుకుని అక్కడే రెండు నుంచి నాలుగు రోజులపాటు ఉంటుందట, తిరిగి రావాలనుకున్న వాళ్లు వాటిలోనే తిరిగిరావచ్చు. అయితే ఈ ఓడ ప్రయాణం వాతావరణ అనుకూలించకపోవడంతో అర్థాంతరంగా రద్దయ్యే అవకాశాలు కూడా ఉంటాయని తెలియడంతో మేము విమానం ద్వారా వెళ్లడానికే సిద్ధపడ్డాం. మేము హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి నేరుగా అక్కడికి చేరుకున్నాం. అక్కడ ఒక హోటల్లో విడిచి చేసిన తర్వాత అండమాన్ అక్కడినుంచి జెట్టీలు, స్టీమర్ల ద్వారా దీవుల్లోని పర్యాటక ప్రదేశాలన్నీ తిరిగి రావాలని ప్లాన్ వేసుకున్నాం.

     

అయితే వీటిల్లో అండమాన్ దీవుల్లోకి మాత్రమే పర్యాటకుల్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతిస్తారు. నికోబార్ దీవులలోనికి ప్రవేశం లేదు. వెళ్లాలంటే మాత్రం ప్రత్యేకంగా పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

పోర్ట్ బ్లెయిర్:

మేము పోర్ట్ బ్లెయిర్ లోని ‘వీర సావర్కార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లో ఫ్లయిట్ దిగగానే దగ్గర్లోని ఒక హోటల్లో దిగాము. ఈ పోర్ట్ బ్లెయిర్ అనేది కేంద్ర పాలిత ప్రాంతమైన అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలకు రాజధాని. ఇది దక్షిణ అండమాన్ ద్వీపంలో ఉంది. పోర్ట్ బ్లెయిర్‌లో సంవత్సరం పొడవునా ఉష్ణోగ్రతలు సాధారంగా ఉంటూ దేశ విదేశీయులను అకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచే మా ప్రయాణం ప్రారంభమైంది.

పోర్ట్ బ్లెయిర్‌ అనేది చిన్న నగరం. సుమారు లక్షలోపు జనాభా ఉంటుంది. కానీ అహ్లాదకరమైన నగరం. ఈ నగరంలోనే కొన్ని చూడదగ్గ ప్రదేశాలు, ప్రఖ్యాత చారిత్రక సెల్యులర్ జైలు ఉండటంతో మొదటి రోజు మా ప్రయాణం వీటిని చూడటానికి కేటాయించాము.

పకడ్బంది నిర్మాణం…!

సెల్యులార్ జైల్ నిర్మాణం 1856లో ప్రారంభమై 1906లో పూర్తయ్యింది. బర్మా నుండి తెప్పించిన ముదురు ఎరుపు, ఊదా రంగు ఇటుకలని ఉపయోగించి చేసిన ఈ భవన నిర్మాణం భీతి గొలుపుతుంది. ఒక చక్రం ఆకారంలో వుండే ఈ భవనంలో ఏడు విభాగాలుగా భవనాలని నిర్మించారు. ఈ భవనాలకి మధ్య భాగంలో ఒక టవర్‌ని ఏర్పాటు చేశారు. 18 శతాబ్దానికి చెందిన తత్వవేత్త జెర్మి బెంథెమ్ ‘పనార్టీకాన్’ నిర్మాణ శైలి ఆధారంగా నిర్మించిన ఈ సెల్యులార్ జైలులో టవర్ వద్ద నుండి ఖైదీలను గమనిస్తుంటారు. కాపలాకు నిరంతరం ఒక గార్డు పనిచేస్తుంటాడు. ఈ టవర్ మధ్యలో ఒక పెద్ద గంట అమర్చబడి వుంటుంది. ఏడు విభాగాలున్న ఈ జైలులో ఒక్కో విభాగంలో మూడంతస్తులుంటాయి. ఎలాంటి పడక సదుపాయం లేకుండా వుండే గదులు కొన్నైతే, కొద్దిపాటి సదుపాయలతో వుండే గదులు మరికొన్ని. ఏడు విభాగాల్లో మొత్తం 696 గదులని నిర్మించారు. 4.5 నుండి 2.7 మీటర్లు పరిమాణంలో ఉండే ప్రతి జైలు గదిలో 3 మీటర్లు (9.8 అడుగులు) ఎత్తులో ఉన్న వెంటిలేటర్లని అమర్చారు. ఈ గదుల్లో ప్రవేశించడం కూడా చాలా కష్టంగా వుంటుంది. ఒక్కో గదిలో ఒక్క ఖైదీని మాత్రమే వుంచేవారు. ఏ ఖైదీ మరో ఖైదీతో మాట్లాడే వీలు లేకుండా వుండేలా జైలు గదులని నిర్మించారు. ప్రతి జైలు గది ప్రవేశ ద్వారం ఊచలు మరో ఖైదీకి కనిపించవంటే ఎంత జాగ్రత్త తీసుకున్నారో అర్థమవుతుంది. ఏ ఒక్కరూ మరొకరికి కనిపించకుండా వుండే ఈ నిర్మాణం ఖైదీలను తీవ్ర ఒంటరితనానికి గురిచేసేది. ఇలా ఇక్కడ చోటుచేసుకున్న ప్రతి నిర్మాణం గగుర్పాటుకు గురిచేస్తుంది. సెల్యులర్ జైలు నిర్మాణం ఖైదీల మధ్య సంభాషణ అసాధ్యం. నిర్బంధ ఖైదీలని పూర్తిగా ఒంటరితనంలోకి నెట్టివేసేందుకే నిర్మించారని చూస్తేనే అర్థమైపోతుంది. ఏడు విభాగాలుగా వున్న ఒక్కో బ్లాక్ సెంట్రల్ టవర్‌కి అనుసంధానంగా వుండేలా ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. జైలు అధికారులు మాత్రమే ఉపయోగించే ఈ బ్రిడ్జి ప్రవేశం రాత్రి సమయంలో మూసివేసి రాకపోకలని పూర్తిగా నివారించే ఏర్పాట్లు చేసేవారట. ఏ ఒక్కరి మధ్యా స్నేహ సంబంధాలు మెరుగవకుండా వుండేందుకు ఇలాంటి మార్పులని చేసేవారని తెలిసింది.

జైలు కథ…

అప్పట్లో అండమాన్ అంటేనే గుబులు పుట్టేదట. ప్రధాన భూభాగానికి సుదూరంగా మహా సముద్రం మధ్యనుండే చిన్న చిన్న ద్వీపాలుగా, అరణ్య వాతావరణం ఉండటం దీనికి కారణం. అయితే ఈ కారణాలే అండమాన్ దీవుల్ని కారాగార కేంద్రాలుగా మార్చడానికి ఉపయోగపడ్డాయట. మిగతా ప్రపంచంతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉండటం, ఒక్కసారి అక్కడకు ఖైదీగా వెళితే నరకకూపంలోకి అడుగుపెట్టినట్టే. అక్కడ జరిగే అకృత్యాలు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండేది కాదు. తెగించి ఎవరన్నా ఖైదీలు సముద్రంలోకి దూకి ఈదే సాహసం చేసినా తర్వాతి దీవి ఒడ్డుకు చేరేసరికి ప్రాణాలు విడిచేవారు. ఎవరన్నా ఒడ్డు చేరినా అక్కడి విష సర్పాలు, కీటకాలు, మృగాల బారిన పడేవారు. వైరల్ రోగాలు రోజుల్లో ప్రాణాల్ని తీసేసేవి. నాగరికతకు సంబంధించి ఏ ఆనవాలూ కనిపించని ఆ దీవులు ఖైదీలకు తప్పించుకునే అవకాశమివ్వవు. అయినా కొందరు దేశభక్తులు ప్రాణాల్ని లెక్కచేయకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేయడంతో బ్రిటిష్ ప్రభుత్వం అంతకు ముందు ఎక్కడా చూడని ఓ పాశవిక జైలు నిర్మాణానికి సిద్దపడింది. చీకటిలోనే ఖైదీ జీవితం ముగిసిపోయేలా రూపకల్పన చేశారు.

అప్పటికే దేశ వ్యాప్తంగా ‘డూ ఆర్ డై’ అనే నినాదంతో దేశ వ్యాప్తంగా అందరూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తుంటే ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న భారతీయుల్ని క్రూరంగా అణిచివేస్తే తప్ప వీళ్లను అణచలేము అని భావించి దాని కోసం సూదూరమైన ప్రాంతాలను వెతకడం మొదలెట్టారట. దీనికోసం భారత్‌కి సుదూరంగా వుండే అండమాన్ ఈ ఖైదీలను వుంచేందుకు అనువైన ప్రదేశంగా నిర్ణయించారు. దీని కోసం అండమాన్ దీవుల్లో సెల్యులర్ జైల్‌ను 1856-1906 మధ్య నిర్మించారు. అయితే నిర్మాణం అయితే చేశారు కానీ చాలా కాలం వరకూ దీన్ని ఉపయోగించకుండానే ఉంచారు. డేవిడ్ బ్యాం, మేజర్ జేమ్స్ ప్యాటిసన్ వాల్కర్ నేతృత్వంలో తొలిసారిగా ఆగ్రాలోని 200 మంది ఖైదీలని, ఆ తర్వాత కరాచీ ప్రాంతానికి చెందిన 733 మంది ఖైదీలని. మొఘల్ రాజకుటుంబాలకి చెందిన వారితోపాటు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేసిన వారిని ఇక్కడకు తరలించారు. అలా దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు చేసిన, విప్లవాలను ప్రారంభించిన ఖైదీలను అందరిని ఇక్కడికే తరలించడం మొదలెట్టారు. అయితే ఈ ఖైదీల్లో కూడా హింసాయుత పద్ధతుల్లో ఉద్యమాలు నిర్మించిన వాళ్లను మాత్రమే ఇక్కడకు తరలించారు.

ప్రముఖుల శిక్షా స్థలి…

1910లో 698 విభాగాలతో ఈ నిర్మాణాన్ని పూర్తిచేసిన అధికారులు, దేశం నలుమూలల నుండి స్వాతంత్ర్య సమరయోధుల్ని అక్కడికి తరలించారు. అలాంటి వాళ్లలో ప్రముఖుడు వీర్ సావర్కార్. ఆయన జ్ఞాపకార్థమే అక్కడి విమానాశ్రయానికి అతని పేరును పెట్టారు. వీర సావర్కార్ ఈ జైలులోనే కారాగార శిక్షను అనుభవిస్తే, బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఉద్యమకారులు సుధాంసుదాసు గుప్త, బటుకేశ్వర్ దత్, చిట్టగాంగ్ విప్లవవీరులు గణేష్ ఘోష్, అనంత సింగ్, సుభోద్ రారు వంటి ఎంతో మంది స్వాతంత్రోద్యమ సమయంలో ఇక్కడే ఖైదులుగా మరణించారు. ఈ జైల్లో పెట్టే శిక్షలు బయంకరంగా ఉండటంతో చాలామంది శిక్షలను తట్టుకోలేక ప్రాణాలు విడిచిన చరిత్ర కూడా ఈ జైలుకు ఉంది. జైలు చుట్టూ సముద్రం చుట్టుముట్టి ఉండటంతో ఖైదీలు ఎవరూ తప్పించుకోవటానికి సాహసించరని, ఒకవేళ తప్పించుకున్న సముద్రంలోని షార్క్ చేపలకు, తిమింగలాలకు బలి అవుతారని. పోనీ దీవుల ఒడ్డుకు చేరుకున్న అక్కడ తిండి దొరక్క బక్కచిక్కి ఆకలితో చస్తారని ఒక ముందుచూపుతో ఇక్కడే ఈ జైలును నిర్మించినట్లు చెబుతారు. అందుకే బ్రిటీష్ వారు అక్కడ పెట్టిన ఆకృత్యాలను భరిస్తూ బతకడమో లేక వాళ్లకు లొంగిపోవడమో చేశారు తప్ప ఎదురుతిరిగిన దాఖలాలు లేవట.

అయితే వీర సావర్కార్ గురించి ఒక విషయం మాత్రం తరచూ వివాదాస్పదమవుతుంటుంది. ఆయన ఈ జైల్లో పెట్టే చిత్ర హింసలు భరించలేకే బ్రిటిష్ వారికి విశ్వాసపాత్రుడిగా ఉంటానని క్షమాబిక్ష పత్రం రాసిచ్చాడని చెబుతారు. అది ఎంత వరకు నిజమే తెలియదు.

ఆ జైలు అవరణంలోనే ‘మ్యూజియం’ను ఏర్పాటు చేశారని తెలియడంతో దాన్ని చూసేందుకు వెళ్లాము. దాన్ని చూస్తుంటే మన ప్రమేయం లేకుండానే గత జ్ఞాపకాలు అన్నీ చుట్టుముడతాయి. ఆ మ్యూజియంలో ఎటు చూసినా స్వాతంత్ర్య సంగ్రామపు జ్ఞాపకాలు, డాక్యుమెంట్లు, వార్త పత్రికలు, ఫోటోలు – సెల్యులర్ జైలు ఏడు వింగుల మోడళ్లు అన్నీ గత జ్ఞాపకాలను పొరలు పొరలుగా విప్పి, విడమరిచి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. వీటన్నింటిని చూసినప్పుడు ఒకింత ఆందోళనకు లోనయ్యాను. ఈ జైల్లో ఎంతో మంది సమరయోధులు అనుభవించిన శిక్షల ఫలితమే కదా ఇవాళ మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నది అనిపించింది.

స్వాతంత్ర్యం అంటేనే బానిసత్వం నుండి మనిషి స్వేచ్ఛాజీవి కావడం. భారతీయులు అలా స్వేచ్ఛాజీవుల్లా మారాలని ఎంతోమంది పోరాటాలు ఉద్యమాలు త్యాగాలు చేశారు. అలా పోరాటం చేసి వాళ్లలో అండమాన్ వీరులది ఒక ప్రత్యేక అధ్యాయమే అని చెప్పాలి. ఆ సెల్యులార్ జైల్‌ది ఓ భయంగొలిపే చరిత్ర. అక్కడ అమరులైనవారు, తిరిగి దేశ సంస్కరణకు కదిలినవారి త్యాగాల్ని గౌరవించుకుంటూ ఇప్పటికీ అండమాన్ జైల్ను సందర్శిస్తూ దాన్నో అమర కేంద్రంగా భావించేవాళ్లు చాలామందే. అలాంటి వాళ్లలో మేము ఒకరమేమో..!

అంతు లేని పని – భరించలేని శిక్షలు…!

ఖైదీల దినచర్య ప్రతి రోజు ఆరు గంటలకే మొదలయ్యేదట. ఏడు గంటల వరకూ అన్ని పనులు పూర్తిచేసుకొని జైలు ఆవరణలో వున్న ఖాళీ ప్రదేశానికి చేరుకుంటే అక్కడ గుట్టలు గుట్టలుగా వుంచిన కొబ్బరి పీచుని తాళ్లలా పేనే పనిని కొత్తగా వచ్చే ఖైదీలందరి చేతా చేయించేవారు. గంటల తరబడి తాళ్లు పేనడంతో ఖైదీల చేతులు ఉబ్బుకొచ్చినా, అవి పూర్తిగా మానకుండానే మరుసటి రోజు మళ్ళీ తాళ్ళని పేనడం కఠినమైన శిక్షల్లో భాగంగా వుండేదట.

జైలు ఆవరణలోని ఒక్కో విభాగం వద్ద ఒక వర్క్ షెడ్‌ను ఏర్పాటు చేసి అక్కడ అమర్చబడిన గానుగ పరికరాల్ని ఖైదీలే తిప్పాలని, ఓ ఎద్దు చేసే పనిని ఓ ఖైదీ వద్ద ఆశించేవారట. గింజల నుంచి నూనెని తీసేందుకే ఖైదీలు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేది. రోజుకు ముప్పై పౌండ్ల కొబ్బరినూనె, 10 పౌండ్ల ఆవనూనెను తయారుచేయని ఖైదీలని జైలు అధికారులు కఠినంగా శిక్షించేవారు. సెల్యులర్ జైల్లో వుండే కొందరు ఖైదీలు ఒంటరితనంతోపాటు జైలు అధికారుల శిక్షలను భరించలేక ఒక దశలో ఇక్కడి నుండి బయటపడే ఆలోచనలు చేశారని అక్కడి రికార్డులు చెబుతున్నాయి.

ఒక సందర్భంలో దాదాపు 238 మంది ఖైదీలు ఇక్కడి నుండీ పారిపోయేందుకు ప్రయత్నించారట. జైలు నుండి కొద్ది దూరం బయటికొస్తే చాలు నాలుగు పక్కలా సముద్రమే తప్పా మరే ఇతర రవాణా మాధ్యమాలు కనిపించవు. అలాంటి చోట ఈదుకొనైనా సరే జైలు నుండి బయట పడేందుకు ప్రయత్నించారంటే ఇక్కడ వారు అనుభవించిన శిక్షల తీవ్రత ఎంత అనే విషయం అర్థమవుతుంది. అయితే ఒక నెలలోపే అంటే ఏప్రిల్ నెలలో జైలు నుండి పారిపోయేందుకు ప్రయత్నించిన ఖైదీలందరినీ పట్టుకోవడం జరిగింది. వీరిలో ఒకరు ఆత్మహత్య చేసుకుంటే, మిగిలిన వారిలో దాదాపు 87 మందిని అప్పటి జైలు సూపరింటెండెంట్ అదేశానుసారం ఉరి తీశారు.

1933 నాటికి సెల్యులార్ జైల్లో పెద్దఎత్తున హంగర్ స్ట్రయిక్లు మొదలయ్యయి. నిరశనల్లో పాల్గొన్న వారిలో 33 మంది జైలు అధికారుల చేత తీవ్రంగా శిక్షించబడ్డారు. వీరిలో ముగ్గురు ఖైదీలు మరణించడంతో ఖైదీల నిరసన మరింత తీవ్రమైంది. ప్రముఖ ఉద్యమకారుల జోక్యంతో రాజకీయ కారణాలతో ఖైదీలుగా వున్న వారిని సెల్యులార్ జైల్ నుండి మరొక భవనంలోకి మార్చినా చాలామంది దేశభక్తులు ఆ చీకటి గదుల్లోనే జైలు సిబ్బంది దారుణాలకు బలైపోయారు.

పరిరక్షణ కోసం పూర్వ ఖైదీలు అందోళన…

దేశ స్వాతంత్ర్యం అనంతరం అండమాన్ సెల్యులర్ జైలు ఒక చారిత్రక మ్యూజియంగా చరిత్రలో చిరస్మరణీయంగా వుండిపోతుందనుకున్నారు అక్కడ శిక్షను అనుభవించిన వాళ్లు. కానీ ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల వల్ల జైలులో పెనుమార్పులు చోటుచేసుకున్నాయి. సెల్యులర్ జైలులో ఖైదీలుగా వున్న విప్లవకారుల్లో కొందరు ఒక బృందంగా ఏర్పడి 1969లో ఈ జైలుని సందర్శించారు. అయితే అక్కడ వారికి కొన్ని ఆశ్చర్యకరమైన దృశాలు కనిపించాయి. సెల్యులర్ జైలులో అతి ప్రధానమైన ఒక భాగం పూర్తిగా అక్కడ లేకుండా పోయింది. కొన్ని నిర్మాణాలు ధ్వంసం చేయబడి వున్నాయి. ఆ దృశ్యాలకి చలించిన ఆ బృందం ఆందోళన చేసింది. వాటి ద్వారా జైలులోని మిగిలిన భాగాలు పరిరక్షించబడ్డాయి. ఖైదీలుగా వున్న వారి ఫోటోలు గేటు వద్ద వేలాడదీయడంతో పాటు ఖైదీల పేర్లను మధ్య వున్న గోపురం (సెంట్రల్ టవర్) మీద చెక్కారు. తర్వాతి కాలంలో అక్కడే జిల్లా జైలు ఆఫీసులు, ఆస్పత్రిని నిర్మించారు.

రెండో ప్రపంచ యుద్ధంలో ఓసారి అండమాన్ జపనీయుల చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ బ్రిటీష్ సేనలు చేజిక్కుంచుకున్నాయి. ఈ యుద్ద సంక్షోభ తాకిడి ఖైదీలపై తీవ్రంగా పడింది. భారత్‌కు స్వాతంత్రం లభించిన అనంతరం ఈ జైల్లోని రెండు విభాగాలు పూర్తిగా కూల్చివేయబడ్డాయి. సెల్యులర్ జైల్ ఆవరణలో 1963లో ఒక వైద్యశాలని నిర్మించారు. 500 పడకలు కలిగిన ఈ ఆస్పత్రిలో ఇప్పుడు దాదాపు 40కి పైగా వైద్యులు సేవలందిస్తున్నారు. మిగిలిన మూడు విభాగాలతోపాటు సెంట్రల్ టవర్‌ని 1969లో జాతీయ మెమోరియల్‍గా తీర్చిదిద్దారు. 2006లో ఈ అండమాన్ జైలు సెంటినరీని పూర్తిచేసుకోవడంతో ఇక్కడ సమరయోధులు స్మృత్యర్థం స్మారక కార్యక్రమాలు కూడా నిర్వహించారట.

ఆ మ్యూజియం చెప్పే సంగతులు మదినిండా నింపుకొని బరువెక్కిన హృదయంలో బయటికి వస్తే, ఆ జైలు బయట అమరులు స్మృత్యర్థం ఏర్పాటుచేయబడ్డ ‘అమరజ్యోతి’ నిత్యం వెలుగుతూ దారి చూపిస్తున్నట్లే అనిపించింది. దానికి దగ్గర్లోనే ఏర్పాటు చేసిన జాతీయ జెండా స్వేచ్ఛా వాయువులకు ప్రతీకగా గర్వంగా ఎగురుతూ దేశ భక్తిని మరీ మరీ గుర్తుచేసినట్లు అనిపించింది.

అందాల మాటున అరుదైన ఆదివాసులు…

అండమాన్ అంటేనే ఒక రకంగా ఆదివాసుల పుట్టినిల్లు అనే చెప్పవచ్చు. ప్రపంచంలో అరుదైన ఆదివాసి సమూహాలు ఇక్కడ నివసిస్తున్నాయని వీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. వాళ్లు నివసించే ప్రదేశాలకు ఎవరినీ వెళ్లనివ్వకుండా.. వాళ్లతో ఎవరూ కలవకుండా.. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది.

అయితే ఒకప్పుడు ఈ ఆంక్షలు లేకపోవడంతో ఆ ఆదివాసులతో మిగతా మనుషులు కలవడం, వాళ్లకు ఇక్కడి ఆహారాన్ని, ఇతర పదార్థాలను ఇవ్వడంతో రోగనిరోధక శక్తి క్షీణించి వందల్లో చనిపోవడంతో ఇటువంటి ఏర్పాట్లు చేశారని తెలిసింది. ఇప్పుడు అక్కడ నివసించే ఆదివాసులను చూడాలంటే అక్కడ ఉండే మ్యూజియం తప్ప ఇంకే మార్గం లేదు.

ఎలాగు వాళ్లను చూసే అవకాశం లేదు కాబట్టి కనీసం ఆ మ్యూజియం సందర్శించి వాళ్లు ఎలా ఉంటారో చూద్దామన్న కుతూహలంతో ఒక ఆటో మాట్లాడుకొని అక్కడి వెళ్లాము.

అది మూడు అంతస్తుల నిర్మాణంతో ఉన్న ఆంత్రోపాలాజికల్ మ్యూజియం. ఒక అంతస్తుల్లో ట్రైబల్ సంస్కృతి మీద పరిశోధన చేసిన వాళ్ళ పుస్తకాలు పెట్టారు.  రెండవ అంతస్తులో అండమానీస్ ఉపయోగించిన వస్తువులు వుంచారు. వీరే మొట్టమొదటి ఆదిమజాతివారని ఇక్కడి వారు చెప్తున్నారు. కట్టతో చేసిన వస్తువులు, వారు ఉపయోగించిన గిన్నెలు అక్కడ భద్రపరిచారు. వీరి ఫోటోస్ చూస్తే వీరు ఒకలాంటి ఎర్రమట్టిని వారి వంటినిండా పూసుకొని నడుముకి మాత్రము ఒక బెల్ట్ లాంటిది కట్టుకునేవారని అర్థమైంది. అది కూడా అక్కడే దొరికే ఆకులు, పూవులు, సముద్రంలో దొరికే ఆల్చిప్పలు, గవ్వలు, ఇవన్నిటిని కలిపి ఒక బెల్ట్ లాగ తయారు చేసుకొని కట్టుకున్నారని చూస్తేనే అర్థమైంది.

శరీరం నిండా తెల్లని, ఎర్రని మట్టితో పెయింటింగ్ లాగ, ఒకరకమైన డిజైన్స్‌తో అలంకరించుకుని, చిన్ని గవ్వలతో మెడకి దండలాగ వేసుకొని తలకు మాత్రం చిన్ని పక్షుల ఈకలను టోపీలాగ ఉపయోగిస్తున్నారు.

అన్నిటికన్న భయంకరమైన ఆదిమజాతికి చెందినవారి వెనకభాగం మాత్రం చిన్ని చిన్ని రాళ్ళని పేర్చితే ఎలావుంటుందో అలాంటి మూడు వరుసలలో చిన్ని రాళ్ళని పేర్చినట్లు శరీరమంతా ఉఉబికి వుంది. ఈ ఫోటోలను Volkerkunde మరియు Leipzig నుండి ఈ ఫొటోని collect చేశారట. దాన్ని 19వ శతాబ్దంలో తీసినట్లు చెప్పారు.

మరి కొన్ని ఫొటోలో ‘సెంటినల్ ట్రైబ్’ ఉన్నారు. వీళ్లు మానవ సంచారంలేని అడవిలో మాత్రమే జీవిస్తున్నారుని తెలిసింది. వీరి దగ్గరికి ఎవరూ వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. వీళ్లను ఎవరైనా కలవడానికి వెళ్లినా తిరిగి ప్రాణాలతో తిరిగిరారని అక్కడి వారు చెబుతారు.

ఈ ఆంక్షలను దిక్కరించే చెప్పాపెట్టకుండా వాళ్లను కలవడానికి వెళ్లిన జాన్ అనే అమెరికన్ పౌరుడు చనిపోయాడని మనం వార్తలో చదివాం. బోటు నడిపే వ్యక్తి ఆ ప్రాంతానికి రానని చెప్పినా ఇతనే స్వయంగా బోటు నడుపుకుంటూ వెళ్ళాడని ఫలితం వాళ్ల చేతిలో మృత్యువాత పడిన విషయం అందరికి తెలిసిందే.

ఈ ఆదిమ జాతికి చెందిన జనాభా 60-70కి మించి ఉండరని ప్రభుత్వం అంచనా. అటువంటి వాళ్ల పరిరక్షణ కోసం ఎన్నో కఠిన నియమాలు ఏర్పాటు చేసినా దాన్ని ధిక్కరిస్తు వెళ్లిన వారు తిరిగిరాని లోకాలకు వెళుతున్నారు.

మినీ ఇండియాను తలపిస్తుంది:

అండమాన్ చూడటానికి దూరంగా ఉంటుంది కానీ ఇండియాలో నివసించే అన్ని భాషల వాళ్లు అక్కడ మనకు కనిపిస్తారు. ఎటు చూసినా ప్రకృతి అందాలు ఊరిస్తూ ఉంటాయి కాబట్టి దేశ విదేశాల నుండి ఇక్కడికి నిత్యం యాత్రికులు వస్తునే ఉంటారు.

స్థానిక భాషలే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ, తెలుగు తదితల భాషలు మాట్లాడేవాళ్లు ఇక్కడ చాలా మంది కనిపిస్తారు కాబట్టి దీన్ని మినీ ఇండియా అనడంలో ఆశ్చర్యమేమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here