Site icon Sanchika

అందంతో చెలగాటం-3

[ఇన్సూరెన్స్ నేపథ్యంగా శ్యామ్‌కుమార్ చాగల్ గారు అందిస్తున్న పెద్ద క్రైమ్ కథ. ఇది మూడవ భాగం.]

[dropcap]మం[/dropcap]చం మీద పడుకుని ప్రత్యూష అందం, ఆమె మనసు గురించి ఆలోచించసాగాడు మనోజ్. ఆ అందం వెనకాల ఇంతటి విషమా అనుకున్నాడు. అతనికి ప్రత్యూష అందం, ఆమె పట్ల ఆకర్షణ మొత్తంగా మటుమాయం అయిపొయింది. కళ్ళలో ఆ క్షణంలో కనిపించిన రాక్షసత్వం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరుసటి ఉదయం లేచి కూర్చున్నాడు. రాత్రి జరిగిందంతా కల లాగ అనిపించింది.

ఆఫీస్ గదిలో కెళ్ళేటప్పటికీ రావు గారు సూట్ వేసుకుని టీ త్రాగుతూ కనిపించాడు.

మనోజ్‌ను చూడగానే “పద” అని లేచి నడిచాడు. నీరసంగా, బలహీనంగా కనిపించాడు.

కారులో కూర్చోగానే, “గాంధీ బజార్‌లో అడ్వొకేట్ ఇంటికి తీసుకెళ్ళు మనోజ్” అన్నాడు.

***

మనోజ్‌ను బయట కూర్చోబెట్టి లోపల అడ్వొకేట్ ఇచ్చిన కాగితాల మీద సంతకాలు పెట్టాడు రావ్.

అడ్వకేట్‌తో మాట్లాడుతూ కూర్చున్నాడు రావ్. దాదాపు ఒక గంట గడిచింది.

బయటకు వచ్చి మనోజ్‌ను చూసి నవ్వాడు రావు. అతని మొహంలో కళ లేదు.

కార్ బయటకు రాగానే “బార్ కెళదాం మనోజ్.” అన్నాడు.

“సార్ మీరు బాగా నీరసంగా వున్నారు. ఆరోగ్యం బాగా లేదు. ఇది సమయం కాదు. ఈ రోజు కు మానెయ్యండి. అసలు తాగటం మానెయ్యండి సార్” అభ్యర్థించాడు ప్రేమగా.

”నేను చేసిన పెద్ద పొరపాటుకి భగవంతుడు శిక్ష వేసాడు మనోజ్. నా వయసుకు తగని అమ్మాయిని చేసుకున్నాను. బీదరికంలో మగ్గుతున్న అమ్మాయికి సహాయం చేస్తున్నానని అనుకున్నాను. ఏదీ లేక పోయినా ఈ వయసులో నాకు చేయూతగా ఉంటుందని అనుకున్నా. కానీ నా కోట్ల ఆస్తి నాకు, అవేవీ ఇవ్వలేక పోయింది. చిటికెడు ప్రేమ ఆదరణ లేక క్రుంగిపోయాను. కనీస మానవత్వ విలువలు కూడా లేని ఆడది నాకు దొరికింది” అని చెప్పటం ఆపాడు రావ్. అతని మాట ఆగిపోయి, కళ్ళలో నీరు ధారగా కారిపోసాగాయి.

“సార్.. కాస్త ధైర్యం తెచ్చుకోండి. మీ అమ్మాయి వచ్చేస్తోంది కదా. మరవకండి. మీకు సంతోషంగా ఉంటుంది” అన్నాడు.

రావ్‌ని బంగాళా ముందు దింపి, కార్ షెడ్‌లో పెట్టి తన అవుట్‌హౌస్ వేపు అడుగులు వేసాడు మనోజ్.

రాత్రి చాలా సేపు ఆలోచిస్తూ ఆలస్యంగా నిద్ర పోయాడు. అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టినట్లుగా శబ్దం అయ్యి లేచి కూర్చున్నాడు మనోజ్.

చెవులు రిక్కించి విన్నాడు, మళ్ళీ చిన్నగా తలుపు తట్టారెవరో.

లేచి కళ్ళు నులుముకుంటూ వెళ్లి తలుపు తీసాడు.

వేగంగా లోనికి తోసుకుంటూ అడుగు పెట్టి, తలుపు మూసి మనోజ్ మీద చేతులు వేసి పట్టుకుని వాలిపోయింది ప్రత్యూష.

బిత్తరపోయాడు మనోజ్. ప్రత్యూష జడలోని మల్లెలు కొన్ని రాలి కింద పడ్డాయి. ఆవిడ శరీరం నుండీ వస్తున్న సెంటు గది నిండా కమ్ముకు పోయింది.

రెండు చేతులు విడిపించుకున్నాడు. దూరంగా జరిగి “ప్రత్యూష గారు ఏంటిది” అన్నాడు.

“దయ చేసి నాకు సహాయం చేయండి. ఎలాగైనా రావు పీడను వదిలిస్తే మనం ఇద్దరం హాయిగా జీవితం గడపొచ్చు. నాకు తెలుసు మీకు నాపైన ఇష్టం ఉందని” అంది మనోజ్ మీద పడిపోతూ.

మరింత దూరంగా జరిగి “మీరు పొరబడ్డారు ప్రత్యూష. రావ్ గారు మంచి వ్యక్తి. మీరు అన్నీ తెలిసే వారిని పెళ్లి చేసుకున్నారు. ఆయన తాగి తాగి ఆరోగ్యం చెడిపోతూ వుంది. కాస్త ప్రేమిస్తే ఆయన దారికొచ్చి మీరు సుఖపడతారు. ఆయన ఎన్ని రోజులుంటారు చెప్పండి, ఆ తర్వాత ఆస్తి అంతా మీదే కదా” అన్నాడు మనోజ్.

“పోనీ నాకు చెందే ఆస్తిలో సగం మీకిస్తాను.. ఎలాగైనా అతన్ని.. మనిద్దరం కలసి ఏమైనా చేస్తే ఎవరికీ అనుమానం రాదు” అంది.

పూనకం వచ్చినట్లుగా మాట్లాడుతున్న ప్రత్యూషను చూసి. తల దిమ్మెక్కి పోయింది మనోజ్‌కు.

“ప్రత్యూష గారు, మీరు వెంటనే మీ ఇంట్లోకి వెళ్ళండి. ఒక్క క్షణం కూడా ఇక్కడ వుండొద్దింక” గట్టిగా అరిచాడు మనోజ్.

అతని స్వరంలో వున్న కాఠిన్యాన్ని ఒక్క నిముషం చూసి బట్టలు సరి చేసుకుని, వెంటనే గిరుక్కున వెనుదిరిగి బయటకు వెళ్ళిపోయింది.

తలుపు మూసి తన గది లోకి వెళ్లి రెండు కణతలు నొక్కుకుంటూ పడుకున్నాడు మనోజ్.

అవుట్‍హౌస్ బయట పక్కన చీకట్లో నిలబడి అన్నీ విన్న రావు కాసేపు ఆలోచించి తన బంగాళా వేపు నడిచాడు.

మరుసటి రోజు కార్ నడుపుకుంటూ రావ్ ఒక్కడే బయటకు వెళ్ళటం చూసి విస్తుపోయాడు మనోజ్.

ఆ రోజు రాత్రి అవుట్‌హౌస్ బాల్కనీలో పడక కుర్చీ మీద పడుకుని రావ్ గురించి, అతని ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించసాగాడు. రావ్ గారున్నంత వరకే తాను ఈ ఉద్యోగం చేయగలడని విషయం అర్థం అయ్యింది. ఆకాశంలో వెన్నెలను చూస్తూ, పక్కన రేడియోలో వస్తున్న వివిధ భారతి పాటలు వింటూ ఉంటే నిద్ర తెలీకుండా ముంచుకొచ్చి కళ్ళు మూసుకున్నాడు మనోజ్.

దూరంగా ఎక్కడో కుక్క మొరుగుతున్న చప్పుడుకి మెలకువ వచ్చి కళ్ళు తెరచి చుట్టూ చూసాడు. బంగాళా ముందు, అంతటా చల్లని వెన్నెల పరుచుకుని వుంది. కళ్ళు చిట్లించి బయట చీకట్లోకి చూసాడు. అప్పుడే చంద్రుణ్ణి మబ్బులు కమ్మేయటంతో చీకటి అలుముకుంది అంతటా.

చుట్టూ పరికించి చూసాడు. కీచురాళ్ళ శబ్దం తప్ప అంతటా నిశ్శబ్దంగా వుంది. మంచి నిద్రలో వున్న తనకు ఎందుకు మెలకువ వచ్చిందో అర్థం కాలేదు. ఏదో జరుగుతోందని కీడు శంకించాడు. కుక్క అరుపులు ఆగిపోయాయి. అంతటా నిశ్శబ్దం అలముకుంది.

కదలకుండా అలాగే చీకటిలో కూర్చొని బంగళా గడ్డి మైదానాన్ని, చుట్టూ వున్న క్రోటన్స్ మొక్కలను చూడసాగాడు. ఎవరూ కనపడలేదు.

పడక కుర్చీలోనుండి లేచి గదిలోకి వెళదామని అనుకునే లోగా దూరంగా వుండే చెట్ల చాటునుండి ఒక వ్యక్తి మెల్లిగా బంగాళా వేపు కదిలాడు. అది చూసి వెంటనే అప్రమత్తమయ్యాడు మనోజ్. మెల్లిగా లేచి లోనికి వెళ్లి క్రికెట్ బ్యాట్ తీసుకుని బయటకు వెళ్లి చీకట్లో నిలబడి, బంగాళా వేపు వెళ్తున్న వ్యక్తిని అనుసరించాడు.

ఆ వ్యక్తి ఇంతకు ముందులాగే పక్క వేపు కిటికీ దగ్గరకు వెళ్లి అందులోకి ఎక్కి లోనికి దూకాడు. కాసేపటికి మనోజ్ మెల్లిగా నడుస్తూ వచ్చి ఆ కిటికీ పక్కన నిలబడ్డాడు.

లోనుండీ మాటలు వినపడసాగాయి.

“ఇంక నా వల్ల కాదు.. నువ్ చెప్పినట్లే చేసాను. కానీ అతను పడటం లేదు. పైగా రావ్ ఈ రోజు అడ్వకేట్ దగ్గరకు వెళ్లాడని తెలిసింది.” అంది ప్రత్యూష.

“వెళ్లనీ మనకేంటి ఇబ్బంది?” అడిగాడు ఆ వ్యక్తి.

“ఏమో అనుమానంగా వుంది. పైగా జీవిత బీమా ఆఫీసుకు వెళ్ళాడట. యాభై కోట్ల పాలసీ చేసాడట ఇంతకు మునుపే ఎప్పుడో.” అంది కంగారుగా.

“అయితే మరీ మంచిది. అన్నింటికీ కంగారెందుకు నీకు?” ప్రశ్నించాడు ఆ వ్యక్తి.

“ఈ మనోజ్ మరీ కొరుకుడు పడటం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఆయన బాగా తాగేస్తున్నాడు. నాకీ ఒంటరితనం ఇక్కడ నాకు ఊపిరి పట్టేసినట్లుంది” అంది విసుగ్గా.

“జాగ్రత్త” అన్నాడా వ్యక్తి.

అంతటితో మాటలు ఆగి పోయాయి. కొద్దీ సేపు అలాగే నిలబడి, ఇక అనవసరం అని అక్కడనుండి జాగ్రత్తగా చీకటిలో నడుస్తూ తన అవు‍ట్‌హౌస్ వేపు వెళ్ళిపోయాడు మనోజ్.

బంగళా పైన చీకటి కిటికీలో నుండీ చూస్తున్న రావ్ వెను తిరిగి పడకుండా నిలదొక్కుకుంటూ నడుస్తూ మంచం వేపు వెళ్ళాడు.

***

మరుసటి రోజు సాయంకాలం ఆఫీస్ లో పనిచేసుకుంటున్న మనోజ్‌ని కాసేపు పరికించి చూసాడు రావ్. అకౌంట్ బుక్స్, బిల్స్ చూస్తున్న మనోజ్ అది గమనించలేదు.

“మనోజ్ నువ్వొచ్చిన మూడు నెలలనుండీ ఒక్క రోజు కూడా సెలవడకుండా పనిచేసావు. ఈ రోజు ఇంటికెళ్లి రేపు రా.” అని నవ్వాడు రావు.

“సరేనండి.. మీకేదైన అవసరం ఉంటే ఫోన్ చేయండి వస్తాను” అని చెప్పి నమస్కారం చేసి మెట్లు దిగి కారులో కూర్చొని స్టార్ చేసాడు మనోజ్.

కార్లో వెళ్లిపోతున్న మనోజ్‌ను ప్రేమగా, అభిమానంతో చూస్తూ నిలబడ్డాడు రావు.

ఆ రోజు రాత్రి తొమ్మిది కావస్తోంది. ప్రత్యూషను గట్టిగా పిలిచాడు రావ్.

ప్రత్యూష అడుగు పెట్టేసరికి టేబుల్ ముందు సగం ఖాళీ అయిన విస్కీ బాటిల్ కనిపించింది.

“రా రా ప్రత్యూష.. నీతో కొద్దీ సేపు మాట్లాడతాను.” అన్నాడు. అతనిలో నిరాశను గమనించింది ప్రత్యూష.

“చెప్పండి” అంది అలాగే నిలబడి..

“నేను నిన్ను పెళ్లి చేసుకుని అన్యాయం చేసాను. కానీ ఒంటరి నా జీవితానికి కొద్దిగా ప్రేమ చూపిస్తే నేనెంతో హాయిగా బ్రతికేవాడిని. అంతే కాదు ఈ ఆస్తిలో నీకు వాటా ఎలాగూ ఉండేది. చిన్న హోటల్‌లో పని చేస్తూ, రేకుల షెడ్డులో జీవనం గడుపుతున్న నిన్ను చూసి, నీ అందాన్ని చూసి పెళ్లి చేసుకుని, సమాజంలో నీకు డబ్బు, మంచి హోదా కల్పించాను. కానీ రాను రాను నన్ను చూసే నీ చూపుల్లో నా పట్ల నీకున్న అసహ్యం నాకు కనపడింది. అందుకే నేను నీకు దూరంగా వున్నాను. కనీసం ఈ వయసులో నాకు కాస్త ఆప్యాయత దొరుకుతుందని ఆశించాను. నీ కోరికలకు నేనెప్పుడూ అడ్డు పడలేదు. ఎందుకూ కొరగాని పాత పనివాడు విక్టర్ నీకు నచ్చాడు.” అని ఆగాడు.

“మీరు ఏవేవో ఊహించుకుంటున్నారు” అంది నిబ్బరంగా.

“నాకన్నీ తెలుసు. నన్ను మాట్లాడనివ్వు ఈ రోజు.. నేనెప్పుడో యాభై కోట్లకు పాలసీ చేసాను. నామినీ కూతురి పేరు పెట్టినా సరే అవి భార్యగా నీకే చెందుతాయి అని తెలిసింది. అందుకని నేను చనిపోయినా నీకు డబ్బులు రానివ్వను. కానీ, నేను ఆత్మహత్య చేసుకుంటే అది నీకు పనికి రాదు. అప్పుడు డబ్బులివ్వరు ఇన్సురెన్సు కంపెనీ వాళ్ళు. నన్ను చంపటానికి కూడా ప్రణాళిక వేశావు. నా ఆస్తిలో నీకు చిల్లి గవ్వ దొరకదు. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదుగో సైనైడ్ బాటిల్.. గుడ్ బయ్” అని వెంటనే చేతిలో వుండే బాటిల్ ఎత్తి నోట్లో పోసుకున్నాడు రావ్.

వెంటనే ముందుకొచ్చి ఆపటానికి ప్రయత్నించింది ప్రత్యూష. కానీ అప్పటికే సైనైడ్ గొంతులో దిగి, కనుగుడ్లు పైకెత్తి ముందుకు పడిపోయాడు రావ్.

“ఏమండీ.. ఏమండీ” అని రావ్‌ను ఊపుతూ అరవ సాగింది ప్రత్యూష.

మరింతగా ముందుకు పడిపోయాడు రావ్. అతనిలో ఏ మాత్రం చలనం లేదు.

కంగారుగా ఏడుస్తూ ఫోన్ తీసుకుని డయల్ చేసింది. అవతలి నుండీ “హలో చెప్పు” అని గరగర గొంతు వినిపించింది

“విక్టర్ త్వరగా రా.. రావ్ ఆత్మహత్య చేసుకున్నాడు” అంది.

“గుడ్ న్యూస్.. పోనీలే మనం ఏమీ చేయకుండా అతనే చచ్చాడు. మనమిక ఫ్రీ బర్డ్స్” అన్నాడు వుత్సాహంగా.

“కాదు మనం నిండా మునిగిపోయాం ముందు రా చెప్తాను” అంది. ఆమె ఒంటి నిండా చెమటలు కారిపోతున్నాయి.

కళ్ళు కాస్త తెరుచుకుని టేబుల్ మీదకు ఒరిగి పోయి వుంది రావ్ శవం. ప్రత్యూష అలాగే సోఫాలో రావ్‌ని చూస్తూ కూర్చుంది. అతడి శవాన్ని చూస్తుంటే కాసేపు కోపం, కాసేపు అసహ్యం వేసింది ప్రత్యూషకు.

మోటార్ సైకిల్ బంగాళా ముందు ఆపి లోనికి పరుగెత్తాడు విక్టర్.

విక్టర్ రాగానే అతడిని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది ప్రత్యూష.

సోఫాలో కూర్చోపెట్టి కళ్ళు తుడిచి “ఏం జరిగింది అసలు చెప్పు” అన్నాడు విక్టర్, రావ్ శవం వంక చూస్తూ.

ఎత్తుగా బలంగా వున్నాడు విక్టర్. నల్లని టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ వేసుకుని ఒత్తయిన మీసాలతో దృడంగా కనిపిస్తున్నాడు.

ఏడుపు ఆపుకుని చెప్పటం మొదలెట్టింది ప్రత్యూష. జరిగిందంతా విని నిట్టూర్చాడు విక్టర్.

“సరేలే ఏం చేద్దాం.. మనకెంత రాసి పెట్టి ఉంటే అంత, ఉన్నంతలో హాయిగా ఉందాం. మనం ఎటైనా వెళ్ళిపోయి ఇద్దరం ఏదైనా పని చేసుకుని బ్రతకొచ్చు” అని దీర్ఘంగా ఊపిరి పీల్చాడు

“అలా కాదు.. కనీసం ఇన్సూరెన్స్ డబ్బులు యాభై కోట్లు వచ్చే ప్లాన్ ఏదైనా ఉన్నదా ఆలోచించు” అంది.

“సూసైడ్ చేసుకుంటే రావు అన్నాడు కదా” అని తల కిందకు వేసి ఆలోచించాడు విక్టర్. అతని ఒళ్ళంతా వేడెక్కింది.

కొద్దిసేపటి తర్వాత అడిగాడు “ఎంత సేపైంది తాను సైనైడ్ తీసుకుని” అని అడిగి రుమాలుతో నుదుటన చెమటలు తుడుచుకున్నాడు.

“మొత్తంగా ఇరవై నిముషాలే” అంది గోడ గడియారానికేసి చూసి.

”ఇంట్లో పెద్ద ఫ్రిజ్ ఉందా” అన్నాడు చుట్టూ చూసి. ఉద్వేగంతో అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి.

“కింద వంట గదిలో ఒకటి.. ఇంకొకటి ఇదుగో పక్క గదిలో వుంది” అంది.

“ముందు మనం ఈ శవాన్ని అందులో పెట్టేస్తే.. చెడిపోదు. దీన్ని ఆత్మహత్య అని కాకుండా ప్రమాదవశాత్తు జరిగిన మరణంలా చూపించాలి. ఫ్రీజర్‌లో ఉంచితే, రిగర్ మార్టిస్ ఆగిపోయి మరణం సంభవించిన సమయం కనుక్కోలేరు. శవాన్ని బయటకు తీసిన సమయానికి మళ్ళీ ఆ శరీరంలో మార్పులు మొదలయ్యి అప్పుడే చనిపోయిన సూచనలు కనపడతాయని అంటారు. అందుకే మంచు పర్వతాలలో చనిపోయిన వారి శరీరాలు చెడిపోకుండా ఉంటాయి. సరే.. రేపు ఆలోచిద్దాం ఎలా చేయాలో. ఇంతకూ పని వాళ్ళు ఎవరూ కనపడ లేదు. ఎక్కడికి వెళ్లారు” అన్నాడు.

“అందరికీ రేపు రమ్మని, సాయంకాలం పంపించేశాడు రావ్” అంది భయంగా

“సరే శవాన్ని ఫ్రిజ్‌లో పెడదాం ముందుగా” అని షర్ట్ సర్దుకున్నాడు.

“వద్దులే విక్టర్ ఏదైనా పొరబాటు జరిగి మనకు జైలు, ఉరి శిక్ష లాంటివి పడితే?” అంది భయంగా కళ్ళు పెద్దవి చేసి.

ముందుకు కదిలి టేబుల్ పైన వుండే వైన్ గ్లాస్ కింద వున్న ఉత్తరం తీసి చదివాడు విక్టర్.

“ఇదుగో మీ ఆయన రాసిన ఉత్తరం” అని దాన్ని ప్రత్యూష చేతికిచ్చాడు.

“ముందు శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టేయ్యి విక్టర్. నేను తనను చూడలేను “అంది.

ఇద్దరూ కల్సి రావు శరీరాన్ని మోసుకుంటూ వెళ్లి ఫ్రిజ్ పక్కన పడుకోబెట్టి, ఫ్రిజ్‌లో వుండే విదేశీ మద్యం సీసాలను తీసి ఫ్రిజ్ పైన పెట్టారు.

ఫ్రిజ్ చాలా పెద్దగా ఉండటంతో అందులో రావు శవాన్ని తేలికగా కూర్చోపెట్టారు.

ఫ్రిజ్ తాళం వేసి తాళం చెవిని ప్రత్యూష కిచ్చి “జాగ్రత్త” అన్నాడు.

రావు కూర్చున్న టేబిల్ మీద వున్న వస్తువులన్నీ తీసేసి ఖాళీ చేసింది ప్రత్యూష.

ఇద్దరూ కల్సి అన్ని అల్మిరాలు, టేబుల్ సొరుగులు వెదికారు. ఎక్కడా డబ్బులు దొరకలేదు.

“ఈ రోజు పని వాళ్ళందరూ వెళ్లిపోయారు. రేపేమని చెప్పాలి” అంది మంచం మీద పడుకుని.

“బయటకు ఎక్కడికో తొందరగా లేచి వెళ్లారని చెప్పు” అన్నాడు వెనక్కి వాలుతూ.

“నాకు భయంగా వుంది విక్టర్” అంది ప్రత్యూష.

“నీకెప్పటినుండో చెప్తున్నా.. మనకెందుకీ డబ్బు ఆశ.. వచ్చేయి ఎటైనా వెళ్లి బ్రతుకుదాం అని, విన్నావు కాదు” అన్నాడు విసుగ్గా.

“అవుననుకో, కానీ జీవితంలో డబ్బులు లేకుంటే ఎంత దుర్భరంగా ఉంటుందో నే అనుభవించాను. బీదరికం భయానకంగా ఉంటుంది.. నీకు తెలీదు” అంది నిస్పృహ ధ్వనిస్తూ.

“నాకో ఆలోచన వచ్చింది.. రేపు లేదా రెండు మూడు రోజుల్లో శవాన్ని కారులో కూర్చోపెట్టి మన ఊరు శివారులో వుండే కొండ మీద నుండీ కారు తోసేస్తే అది ప్రమాదం లాగ కనపడి, ఇన్సూరెన్స్ డబ్బులు రెండు రెట్లు వస్తాయి” అన్నాడు.

“అలాగయితే, అదేదో రాత్రి సమయం లోనే చెయ్యాలి.” అంది.

“అవును అదే కరెక్ట్” అన్నాడు సాలోచనగా కళ్ళు మూసుకుని.

“జాగ్రత్త విక్టర్, నేను జీవితంలో ఎవరినీ ప్రేమించలేదు. బీదరికంలో కూడా ఎవరికీ లొంగలేదు. నీతోనే నా ఆనందం, జీవితం” అంది అతని గుండెల మీద తల పెట్టి.

“రేపు పనివాళ్లను జాగ్రత్తగా, అనుమానం రాకుండా చూసుకో” అన్నాడు విక్టర్. అతడి మనసంతా చిరాకుగా వుంది.

“వచ్చిన డబ్బులతో దూరంగా వెళ్లి పోయి ఒక ఇల్లు కట్టుకుని, మనం హోటల్ నడుకుంటూ బ్రతుకుదాం” అంది ప్రత్యూష.

“రేపు ఉదయం ఆ మేనేజర్‌కు ఏం చెప్పాలో చూసుకో” అన్నాడు విక్టర్..

భయంగా చూసింది ప్రత్యూష “నిజమే అతనికి కోట్ల డబ్బు ఆశ చూపాను కానీ లొంగలేదు. నువ్ చెప్పినట్లుగా నా అందాన్ని కూడా ఆశ చూపాను. చాలా అమాయకుడిలా వున్నాడు. పడలేదు” అంది.

“సరే చాలా పొద్దుపోయింది పడుకో.. నేను తెల్లవారే లోగా వెళ్ళిపోతాను. జాగ్రత్త” అన్నాడు. కానీ ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు.

(సశేషం)

Exit mobile version